
విజయసారధి జీడిగుంట నాకు తెలియడం జీడిగుంట రామచంద్రమూర్తిగారి కుమారుడిగా. కాని ఆయన నా ఫేస్ బుక్ మిత్రులుగా మారేక ఆయన గురించి తెలిసిన విషయాలు నన్ను విస్మయానికి లోను చేసాయి. తెలుగు సాహిత్యానికి సాధారణపాఠకుడిగా మొదలుపెట్టి నెమ్మదిగా తెలుగు ప్రాచీన సాహిత్యంపట్ల సమ్మోహితుడై కావ్య, ఇతిహాస, అలంకారశాస్త్రాలపరిశోధలోనే తన విరామసమయం మొత్తం గడుపుతున్నారని తెలిసినప్పుడు ఆయన నా కళ్ళముందు ఎంతో ఎత్తుగా కనిపించారు. తన యూట్యూబ్ ఛానల్లో ‘రోజుకో తెలుగు పద్యం’ అనే శీర్షికతో తెలుగు సాహిత్య చరిత్ర పై 75 పైగా వీడియోలు చేసారనీ.. బీ+ యూట్యూబ్ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి ‘పద్యలహరి’ అనే కార్యక్రమం, టోరి లైవ్ లో ప్రతి ఆదివారం ‘సిరివెన్నెల గీతా భాష్యం’ అనే శీర్షిక తో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి పాటల పై రేడియో టాక్ షో నిర్వహించారనీ తెలిసినప్పుడు, తెలుగుతల్లి ముద్దుబిడ్డలంటే ఇటువంటివాళ్ళు కదా అనిపించింది. ఇప్పుడు ఆయన ఈ పుస్తకం ‘ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీవిఘ్నేశ్వర స్తుతి పద్యాలు’ తీసుకొస్తున్నారంటే నా మది మరింత పులకించింది.
ముచ్చటగా మూడు కారణాలవల్ల.
మొదటిది: చిన్నప్పుడు తెలియలేదుగాని, పెద్దయ్యేకొద్దీ, ప్రపంచ కవిత్వాలు పరిచయమవుతున్నకొద్దీ, వివిధ భాషల్లోని క్లాసికల్ ఛందస్సుల గురించి తెలుస్తున్నకొద్దీ తెలుగు పద్యం ఎంత విశిష్టమైందో నెమ్మదిగా బోధపడుతోంది. తెలుగు పద్యంలో ఉన్నంత ఛందోవైవిధ్యం మరే భాషలోనూ ఉన్నట్టుగా నాకు తోచడం లేదు. తెలుగు ఛందస్సు ఏకకాలంలో ప్రౌఢం, లలితం కూడా. తెలుగు భాష శాసనభాషగా మారుతున్న ప్రాజ్ఞన్నయయుగంలోనే తెలుగు హృదయాన్ని కవిత్వం ద్వారా వ్యక్తంచేయడానికి సంస్కృతజన్య వృత్తాలతోపాటు, మాత్రాబద్ధమైన దేశిఛందస్సులూ, వచనమూ కూడా అవసరమని భాషావేత్తలు గుర్తుపట్టారు. తక్కిన భాషాఛందస్సుల్లో ఇంత అవకాశం లేదు. అక్కడ పద్యఛందస్సులు వేరే, గీత ఛందస్సులు వేరే, పూర్తి వచనం వేరే. కాబట్టి యుగయుగాలుగా తెలుగువాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తుల్లో అన్నిటికన్నా ముందు పద్యాన్ని లెక్కగడతాను నేను. అమరావతి శిల్పాలూ, అజంతా చిత్రాలూ, త్యాగయ్య సంగీతమూ, కూచిపూడి నాట్యమూ ఆ తర్వాతనే.
అటువంటి పద్యాన్ని తెలిసో, తెలియకో మన ముందు తరం కవులూ, రచయితలూ చాలా నిర్లక్ష్యం చేసారు. ప్రాచీన కావ్యాల్ని చదవక్కర్లేదనే భ్రాంతి కలిగించారు. మరి ఈ లోటు పూరించేదెవ్వరు? తెలుగు ఉపాధ్యాయులా? ఉపన్యాసకులా? అవధానులా? ప్రచచనకర్తలా? వీళ్లందరి వైపూ చూస్తున్న నన్ను నేను ఊహించని విధంగా విజయసారధి ఆశ్చర్యపరిచారు. పద్యాన్ని ప్రేమిస్తే చాలు, నువ్వు ఆ పద్యానికి వాహికగా మారిపోగలవని ఋజువు చేసారు. పాఠశాలలోనో, కళాశాలలోనో పద్యవిద్య నేర్చుకోకపోయినా, నువ్వు పద్యాన్ని ప్రేమిస్తే చాలు, పద్యం నీ హృదయంలో వచ్చి నిలుస్తుందని నమ్మటానికి విజయసారధిని మించిన సాక్ష్యం మరొకటి అక్కర్లేదు.
ఇక రెండో కారణం. పదిపదిహేనేళ్ళ కిందట నేను మొదటిసారి Project Madurai వారి వెబ్ సైట్ చూసినప్పుడు నాకు సంతోషమూ, దుఃఖమూ రెండూ ఒక్కసారే కలిగాయి. సంతోషమెందుకంటే, వాళ్ళు దాదాపుగా ప్రాచీన తమిళ సాహిత్యమంతటినీ డిజిటైజ్ చేసిపెట్టేసారు. అంతే కాదు, అందులోంచి రోజూ ఒక సంగం కవితనో, ఒక ఆళ్వారు పాశురాన్నో, ఒక నాయన్మారు పదికాన్నో వాట్సప్ లో పంపించుకునే అవకాశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక దుఃఖం ఎందుకంటే తెలుగులో అటువంటి అవకాశం ఉందా? కవిత్రయభారతం పిడిఎఫ్ లు అందుబాటులోకి రావడం కాదు. మన కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు మొత్తం డిజిటైజ్ కావాలి. ఈ ఇంటర్నెట్ యుగంలో మన ప్రాచీన సాహిత్యాన్ని యూనీకోడ్ లో డిజిటైజ్ చేసుకుంటే తప్ప రియల్ టైములో ఆ పద్యాల్ని ఎక్కడినుంచి ఎక్కడికేనా పంచుకునే అవకాశం దొరకదు. ఇప్పుడు సిలికాన్ వాలీలో నాలుగోవంతుకన్నా ఎక్కువమంది తెలుగువాళ్ళే అని విన్నాను. మరి ఈ ప్రయత్నంలో మనం అందరికన్నా ముందుండవద్దా? బహుశా విజయసారధి ఈ ప్రయత్నానికి ఆద్యుడనుకుంటున్నాను. ఎందుకంటే, రోజూ పొద్దున్నే తన మిత్రులకి ప్రబంధాలనుంచి ఒక్కో పద్యం చొప్పున పరిచయం చెయ్యడం మొదలు పెట్టగానే ఎంత అద్భుతమైన ప్రతిస్పందన వచ్చిందో మనం ప్రతిరోజూ చూసాం.
ఇక మూడో కారణం, ఆ పరిచయవ్యాసాల్ని ఫేస్ బుక్ లోనే ఉణ్ణిపోనివ్వకుండా ఇలా పుస్తక రూపంలో తేవడం. ఫేస్ బుక్ లో సభ్యులు కాని పద్యప్రేమికులు చాలామంది ఉన్నారు. వారికి ఈ పుస్తకం చేరితే వారికి కొత్త ఉత్సాహం దొరుకుతుంది.
ఈ మూడు కారణాలకీ, విజయసారధిగారినీ, తురగా కృష్ణమోహన్ గారినీ, ఈ పద్యాలకు బొమ్మలు అందించిన చిత్రకారులందరినీ తెలుగువారందరి తరఫునా మనసారా అభినందిస్తున్నాను. ‘విఘ్నరాజమదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి కావించు గాత’ అని ఆశీర్వదిస్తున్నాను.
28-10-2023
Bhadrudu Garu, I am really Honored to have been decorated like this in your కుటీరం. Currently I am totally at loss of words to express my happiness and gratitude for this Kind Gesture of Yours.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
విశ్వనాథ వారు అనేవారట, నా ‘వేయిపడగలు’ కన్నా రామాయణ కల్పవృక్ష కావ్యము పైన నాకు మిక్కిలి మక్కువ అని. మా నాయన గారు ఆయన మిత్రుడు, ఆరాధకుడు, స్వయంగా కవి కాబట్టి ఆయనకు కల్పవృక్ష కావ్యమంతా కంఠోపాఠం. ఆయన ఎక్కడికి వెళ్లినా చేతిసంచిలో కల్పవృక్ష
కావ్యములోని ఒక కాండము, ఒక పట్టుబట్ట ఉండేవి. ఆయన తన 60 వ ఏట చనిపోయినప్పుడు (విజయవాడలో ఉన్న నా వద్దకు వచ్చినప్పుడు) కల్పవృక్షములోని అరణ్య కాండ ఆయన సంచిలో చూసేను. విశ్వనాథ వారి గురించి కొన్ని పద్యాలు వ్రాస్తూ, “వేయిపడగల భక్తి వలన నాకు సుబ్రహ్మణ్యుడు–నా పేరులో ఆ నామం కూడా ఉంది–కలిగె; కల్పవృక్ష సేవ వల్ల కల్పకమె స్నుష యగుచు కదలివచ్చె” అని వ్రాసేరు, నా వివాహ సందర్భంలో. విశ్వనాథ వారు కూడా తమ పంచరత్నాలతో దీవించేరు. ఆయన వ్రాతప్రతిని నాకు బహుకరించారు మా నాన్న. ఆ మరుసటి సంవత్సరమే వారు “ప్రద్యుమ్నోదయము” అను ప్రబంధ కావ్యాన్ని వ్రాసి మా నాన్నకు అంకితమిచ్చారు.
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు!
పద్యం గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు. మీకూ,జీడిగుంటవారికి అభినందనలు.
ధన్యవాదాలు సార్
దాహం తీర్చ వచ్చిన వానల ఉంది మళ్ళీ మిమ్మల్ని బ్లాగ్ లో చదవడం
ధన్యవాదాలు సార్