
మీ హృదయం, నా హృదయం కూడా నిరంతరం జ్వలిస్తూనే ఉంటాయిగాని, వాటి మీద రోజువారీ జీవితం తాలూకు నివురు పేరుకుంటూ ఉంటుంది. నిర్మలమైన అద్దాల్లాంటి మన హృదయాల్ని దైనందిన జీవితపు దుమ్ము మసకపరుస్తూ ఉంటుంది. ఆ మసకలు విడిపోవడానికీ, ఆ నివురు తొలగిపోడానికీ పూర్వం మన పెద్దలు సద్గ్రంథ పఠనం చెయ్యమని చెప్పారు, సజ్జనుల్తో సాంగత్యం చెయ్యమని చెప్పారు. మన కంటికి కనిపించే ప్రపంచమే సమస్తం కాదనీ, దీన్ని దాటిన ఒక సర్వాస్తిత్వం, శాశ్వత అస్తిత్వం ఉన్నాయని పదే పదే గుర్తుచేసుకుంటూ ఉండమని చెప్పారు. సద్గ్రంథాలు అంటే ఆధ్యాత్మిక గ్రంథాలే కానక్కరలేదు, సజ్జనులంటే మఠాల్లోనూ, మందిరాల్లోనూ ఉండేవాళ్ళే కానక్కరలేదు. చక్కటి కవితల పుస్తకం, ఒక రాగాలాపన, ఒక నీటిరంగుల చిత్రం, నిండుగా విరబూసిన రాధామనోహరం తీగ, పిల్లలు కిలకిల్లాడుతుండే బడి- ఇవేవైనా కూడా భగవంతుణ్ణి మనకి గుర్తుచేసేవే. అటువంటి స్మరణకూ, స్ఫురణకూ ఎవరు నోచుకుంటారో వాళ్ళే నా దృష్టిలో నిజమైన భాగ్యశాలురు.
ఇదుగో, వారణాసి నాగలక్ష్మి గారు రాసిన కవితల సంపుటి ‘కలవరాలూ, కలరవాలూ’ చూడండి. ఇందులో అలాంటి స్మరణలున్నాయి, స్ఫురణలున్నాయి. ఈ కవితలు చదువుతున్నంతసేపూ నా హృదయం మెత్తబడుతూ ఉంది. నా మనసులో ఒకవైపు అలజడి కలుగుతూ ఉంది, మరొక వైపు నెమ్మది కుదురుకుంటూ ఉంది.
ఎందుకని? ఎందుకని ఈమె ఈ కవిత్వం రాయకుండా ఉండలేకపోయారు? విద్యాధికురాలు, రచయిత్రి, చిత్రకారిణి, వక్త, జీవితం తనకి ఇచ్చిన సకలశక్తుల్నీ సృజనాత్మకంగా వినియోగిస్తూ వస్తున్నారు కాబట్టి కవిత్వం కూడా రాయకుండా ఉండలేకపోయారు అనుకోవాలా?
కాదు. అదే కారణమయ్యుంటే, ఈ కవితల దగ్గర నేనుగాని, మీరు గాని ఆగవలసిన పనిలేదు. కానీ ఈ కవితల వెనక ఒక సంచలిత హృదయస్పందన వినిపిస్తూ ఉంది. ఆ స్పందన ఏమి చెప్తున్నదో ఆకళింపు చేసుకోడానికి నేను ప్రయత్నిస్తూ వచ్చాను. నెమ్మదిమీదట నాకేమి బోధపడిందంటే, తక్కిన ప్రక్రియలన్నీ రచయిత రాసేటప్పుడు పాఠకుడు ఎంతో కొంత మేరకు అతడి మనసులో ఉంటాడు. కాని కవిత్వం ప్రధానంగా ఎవరికి వారు తమకోసం తాము రాసుకునేది. కవిత్వం రాయడమంటే, భగవంతుడు నీ ఇంట్లో అడుగుపెట్టడం కోసం ఇల్లు ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు తీర్చి, గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం.
నీకు జీవితం అన్నీ ఇచ్చిందనుకో. సౌకర్యవంతంగా రోజులు గడుస్తున్నాయి. నువ్వు కోరుకోవలసింది ఈ జీవితంలో మరేమీ లేదు. అయినా కూడా నీకొక పసిపాప వదనం, ఒక యువతి హృదయం, ఒక నిరుపేద కుటుంబం గుర్తొస్తున్నాయనుకో, నీ మనసు చెప్పలేనంత దిగులుకి లోనవుతున్నదనుకో, అప్పుడు, నేను చెప్పగలను, భగవంతుడు చాలా అరుదుగా ఆగే గృహాల్లో నీ ఇల్లు కూడా ఒకటని. భగవంతుడు ప్రతి ఒక్కరి తలుపూ తడతాడుగాని, మనం చాలామందిమి, ఆ చప్పుడు గాలి చేసే చప్పుడని మన నిద్రలో కూరుకుపోతాం. కాని నీషే అనుకున్నట్టుగా my happiness has wounded me, let all sufferers be my physicians అని ఎవరనుకుంటారో, వాళ్ళు దేవుడు తమ తలుపు తట్టడం విన్నారని చెప్పగలను.
ఈ సంపుటిలో అరవై కవితలున్నాయి. కొన్ని చిక్కగా ఉన్నాయి, కొన్ని చక్కగా ఉన్నాయి. కాని కవితలన్నిటిలోనూ ఒక నిరీక్షణ ఉంది. ‘నడిరాతిరి మేలుకున్నవాడి’ లాగా ఈ కవయిత్రి కూడా ఎదురుచూస్తూనే ఉంది. ఆ ఎదురుచూపు తన సంతోషం కోసం కాదు. తన చుట్టూ ఉన్న మనుషులు, పల్లె, నగరం, ప్రకృతి, పర్యావరణం ప్రతి ఒక్కటీ కలకల్లాడుతూ ఉండే రోజు కోసం. అలా ఎదురుచూడకపోయినా తన జీవితంలో ఆమెకేమీ లోటు లేకపోవచ్చు. కాని అలా ఎదురుచూడకుండా ఉండలేకపోవడమే ఆమెని కవయిత్రిని చేసింది.
కవిత అంటే మాటల కూర్పు కాదు, అలంకారాల పట్టిక కాదు, సిద్ధాంత ప్రకటన కాదు. కవిత అన్నిటికన్నా ముందు మనసులో మాట. ఆ మాట ఎంత సూటిగా, ఎంత తేటగా ఉండే, వినేవాళ్ళ హృదయాలు అంతమెత్తనవుతాయి.
ఉదాహరణకి ‘మా అమ్మ’ అని రాసిన ఈ రెండు వాక్యాలు చూడండి:
ప్రేమ విత్తులు చల్లుతూ వెళ్ళింది-హృదయక్షేత్రాల్లో
నా దారంతా తరుఛాయలూ, ప్రాణవాయువులే!!
ఆ తల్లి బిడ్డ కాబట్టి ఈమె కవితల్లో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. ఈ పుటల్లో ప్రయాణిస్తున్నంతసేపూ మనం కూడా కొంతసేపేనా మనలోని మానవత్వానికి దగరగా జరుగుతాం. ఇటువంటి స్ఫూర్తి కలిగించడానికి ఈమె తన కవిత్వంలో ఎటువంటి అర్థాలంకారాల వైపూ, శబ్దాలంకారాల వైపూ చూడలేదు. ఈమె చేసిందల్లా తన మనసులో మాట మనతో పంచుకోవడం. మనుషులు ఇప్పుడున్నట్లుగా ఇంత దయనీయంగా, ఇంత దుర్మార్గంగా బతక్కుండా మనుషుల్లాగా బతికితే బాగుణ్ణని కోరుకోవడం. ఆ కోరిక ఎంత నిర్మలమైందంటే ఈ కవితలు చదివిన చాలా సేపటిదాకా ఆ శుభ్రత మన మనసుల్ని అంటిపెట్టుకునే ఉంటుంది.
ఏళ్ళమీదట, ఎన్నో భాషలకూ, ఎన్నో యుగాలకూ చెందిన ఎన్నో కవిత్వాలు చదివినమీదట నాకు అర్థమయింది ఇదే. హృదయనైర్మల్యంలోంచి పలికే మాట, ఒక శుభాకాంక్ష- దానికదే ఒక కవిత. అటువంటి నిర్మలహృదయంలో పడి ముత్యంగా బయటకి రావాలనే ప్రతి ఒక్క వాక్యం కలలుగంటుంది. జీవితం బీభత్సంగా ఉందని రాసిన కవులు కూడా అలా బీభత్సంగా ఉండకూడదని వాళ్ళ హృదయాల్లో ఎక్కడో బలంగా కోరుకుంటారు కనుకనే ఆ కవితలు కూడా మనల్ని చలింపచేస్తాయి.
ఈ ప్రపంచంలో ఇంకా అమ్మకం సరుకుగా మారనిదంటూ ఉంటే అది కవిత్వం మాత్రమే. చదువుతారా, చదవరా, పుస్తకాలు కొంటారా, కొనరా లాంటి లెక్కల్తో పనిలేకుండా ఉన్నది ప్రస్తుతం కవిత్వం మాత్రమే. తన మనసులో మాట తాను ఎలాంటి మసకలూ లేకుండా చెప్పుకోగలిగేనా లేదా అన్నదానిమీదనే ఎప్పుడూ కవి దృష్టి ఉండాలి తప్ప, తన మాటలు ఎంతమంది ఆలకిస్తున్నారన్నదాని మీద కాదు. కవిత్వం పలకడం కూడా భగవన్నామ సంకీర్తన లాంటిది. కొన్నిసార్లు అది నగరసంకీర్తనగా మారి నలుగురూ నీతో కలిసి నువ్వు రాసిన పాటలు పాడుకుంటూ ముందుకు నడవవచ్చు. కొన్నిసార్లు నువ్వొక్కరివే నీ మనసులోనే నీ పాటలు పాడుకుంటూ సాగవచ్చు. ఎంతమంది కలిసి నడుస్తున్నారన్నది కాదు, ఎంత తేటగా నీ హృదయాన్ని మాటల్లోకి ప్రవహింపచేసావన్నది ముఖ్యం, ఏ కవికైనా, ఎప్పుడైనా.
ఎప్పటికప్పుడు నివురు పేరుకుపోతున్న మన రోజువారీ జీవితంలో అటువంటి కవిత్వం మన చేతుల్లోకి వచ్చినప్పుడు, కవయిత్రి అన్నట్లుగానే-
పువ్వో, పుస్తకమో, వ్యక్తిత్వమో
అరుదుగా అలా ఎదురైనప్పుడు
లోకం అందంగా కనిపిస్తుంది
జీవితం అర్థవంతమనిపిస్తుంది!
7-12-2023
ఆ కవిత్వాన్ని చదవలేదు ఇంకా, కానీ మీ మాటలకే నా మనసు కూడా మెత్తబడిపోయింది.
ధన్యవాదాలు మానసా!
మనసులో మాట అద్భుతంగా ఉంది
ధన్యవాదాలు గోపాల్!
చదవాలి అనిపించేలా
మీ మాట బాగుంది సర్
ధన్యవాదాలు మేడం!
కవిత్వం రాయడమంటే, భగవంతుడు నీ ఇంట్లో అడుగుపెట్టడం కోసం ఇల్లు ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు తీర్చి, గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం. ఇది చదువుతున్నప్పుడు కళ్ళు చమర్చిన సంగతి నాలోని నాకు తెలిసిపోయింది.
మీ మాటలు పదాలకూర్పు కవిత్వాన్ని కలవరించేట్టు చేస్తాయి. నాకు తెలిసిన వ్యక్తి వారణాసి నాగలక్షి గారు. ఆమె కవిత్వాన్ని తమరు పరిచయం చేయడం చాలా బాగుంది. అటువంటి అదృష్టం నాకెప్పటికో?
ధన్యవాదాలు మేడం
సర్, మీ చల్లని మాటలకి అనేక ధన్యవాదాలు 🌷
మీ కుటీరంలో నా కవితలకి కూడా చోటిచ్చారు! 🙏
ధన్యవాదాలు మేడం!
కవిత్వాన్ని గురించి మాట్లాడాలంటే కవిత్వమంత మనసు ఉండాలి కదా? 😊😊
ధన్యవాదాలు మేడం
“కవిత్వం పలకడం కూడా భగవన్నామ సంకీర్తన లాంటిది. కొన్నిసార్లు అది నగరసంకీర్తనగా మారి నలుగురూ నీతో కలిసి నువ్వు రాసిన పాటలు పాడుకుంటూ ముందుకు నడవవచ్చు. కొన్నిసార్లు నువ్వొక్కరివే నీ మనసులోనే నీ పాటలు పాడుకుంటూ సాగవచ్చు.”
కవిత్వానికి ఇంత కన్నా అద్భుత వివరణ ఇంకేముంటుంది
ధన్యవాదాలు సార్
అందమైన అంతరంగ చిత్రపటం
ధన్యవాదాలు సార్
ఈ ప్రపంచంలో ఇంకా అమ్మకం సరుకుగా మారనిదంటూ ఉంటే అది కవిత్వం మాత్రమే. చదువుతారా, చదవరా, పుస్తకాలు కొంటారా, కొనరా లాంటి లెక్కల్తో పనిలేకుండా ఉన్నది ప్రస్తుతం కవిత్వం మాత్రమే. తన మనసులో మాట తాను ఎలాంటి మసకలూ లేకుండా చెప్పుకోగలిగేనా లేదా అన్నదానిమీదనే ఎప్పుడూ కవి దృష్టి ఉండాలి తప్ప, తన మాటలు ఎంతమంది ఆలకిస్తున్నారన్నదాని మీద కాదు. కవిత్వం పలకడం కూడా భగవన్నామ సంకీర్తన లాంటిది. కొన్నిసార్లు అది నగరసంకీర్తనగా మారి నలుగురూ నీతో కలిసి నువ్వు రాసిన పాటలు పాడుకుంటూ ముందుకు నడవవచ్చు. కొన్నిసార్లు నువ్వొక్కరివే నీ మనసులోనే నీ పాటలు పాడుకుంటూ సాగవచ్చు. ఎంతమంది కలిసి నడుస్తున్నారన్నది కాదు, ఎంత తేటగా నీ హృదయాన్ని మాటల్లోకి ప్రవహింపచేసావన్నది ముఖ్యం, ఏ కవికైనా, ఎప్పుడైనా.
ఈ వాక్యాలకు కవులందరూ గుడి కట్టాలి సర్
మీరెప్పుడూ ఇంతే పలవరించే వాక్యాలే రాస్తారు
మెత్తబడే పదాలే వాడుతారు
ధన్యవాదాలు సుధా!