
బుచ్చిబాబు ఒకచోట రాస్తాడు, చిన్నబస్తీ పెద్దపట్టణంగా మారిందనడానికి గుర్తు అక్కడ సెకండ్ హాండ్ పుస్తకాల షాపు రావడమేమని. నేను ఈ మాటనే కొద్దిగా పొడిగించి ఇలా చెప్తాను: ఒక రచయిత పుస్తకాలు సెకండ్ హాండ్ షాపుల్లో ప్రత్యక్షమవడం మొదలయ్యాయంటే అతడు పెద్ద రచయితగా మారినట్టే అని. ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని మరికొంత మార్చి ఇలా చెప్పొచ్చు: ఏ రచయిత పుస్తకాల్ని లైబ్రరీల్లోంచి బయటికి లాగి స్కాన్ చేసి పిడిఎఫ్ లుగా వాట్సప్ లో పంచిపెట్టడం మొదలుపెడతారో అప్పుడు ఆ రచయితకి పూర్తిగా అమరత్వం సిద్ధించినట్టే అని.
మొన్నా మధ్య నా ‘సత్యాన్వేషణ’ పుస్తకం పిడిఎఫ్ గా నాకు వాట్సప్ లో వచ్చినప్పుడు నాకన్నా కూడా పబ్లిషరు ఎక్కువ ఆనందిస్తాడనిపించింది. ఎందుకంటే ‘ఆ పుస్తకం సరిగ్గా రాలేదు, ఇంక ప్రచురించకండి’ అని ఆయనతో నేను చెప్పినప్పుడల్లా ‘అదెలాగ? మీ పుస్తకాల్లో మూడు నాలుగు సార్లు పునర్ముద్రణ పొందిన పుస్తకం అది, దాన్నెలా పక్కన పెడతాను’ అంటాడాయన. ఇక ఇప్పుడు ఏం చేసీ ఆ పుస్తకాన్ని రద్దు చేయడం అసాధ్యం. నియంతలు కూడా దాన్ని నిషేధించలేరు. సైబర్ ప్రపంచంలో దానికి అమరత్వం సిద్ధించింది.
పాతికేళ్ళ కిందట ఒకరోజు ఒక హోటల్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎమెస్కో విజయకుమార్ ‘ఇప్పుడు పాఠకులు ఫిక్షన్ వైపు కాదు, నాన్-ఫిక్షన్ వైపు చూస్తున్నారు. కొత్తగా అక్షరాస్యులవుతున్నవాళ్ళూ, విద్యావంతులవుతున్నవాళ్ళూ ప్రపంచం గురించి నేరుగా, ప్రత్యక్షంగా, సమగ్రంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళకోసం ఎటువంటి రచనలు చెయ్యగలరో చెప్పండి’ అనడిగాడు. అది గ్లోబలైజేషన్ పుంజుకుంటున్న కాలం. సమాచార విప్లవం మొదలయిన కాలం. ‘మనుషులకి మనం ఇప్పుడు కొత్తగా సమాచారం అందించవలసిన పనిలేదు, వాళ్ళు సేకరించుకుంటున్న సమాచారంతో తమకై తాము ఒక దృక్పథం ఏర్పరచుకోడానికి మనం సహకరించగలిగితే చాలు. అందుకు తత్త్వశాస్త్ర రచనల్ని, మూల రచనల్ని తెలుగులోకి తీసుకొస్తే బాగుటుంది’ అన్నాను. ఆ క్రమంలో పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుంచి కొన్ని రచనల్ని ‘సత్యాన్వేషణ’ పేరిట, భారతీయ దర్శనాల నుండి కొన్ని రచనల్ని ‘ఆత్మాన్వేషణ’ పేరిట తెలుగులోకి తేవాలని అనుకున్నాం. అలా వెలువడిన ప్రయత్నమే ఈ ‘సత్యాన్వేషణ’.
అప్పట్లో హైదరాబాదు యూనివెర్సిటీలో ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంటుగా పనిచేస్తున్న డా. రఘురామరాజు ఈ పుస్తకం మీద వార్త లో (ఆదివారం, 1-6-2003) ఒక సమీక్ష రాసారు. నేడు డా.రాజు ప్రపంచవ్యాప్తంగా గౌరవానికి నోచుకున్న తత్త్వశాస్త్ర ఆచార్యుడు. వివేచనాశీలి. అటువంటి వ్యక్తి ఎంతో సహృదయంతో రాసిన ఆ సమీక్ష నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చింది.
ఇప్పుడు ఆ పుస్తకం, ఆ సమీక్షా రెండూ ఇక్కడ మీకోసం:
సత్యాన్వేషణ నుంచి సత్యధిక్కారం వరకూ. ..
వాడ్రేవు చినవీరభద్రుడి ‘సత్యాన్వేషణ: పాశ్చాత్య తత్త్వశాస్త్ర పరిచయం, ఎంపిక చేసిన కొన్ని రచనలు’ పాశ్చాత్య తత్త్వశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన రచనల అనువాద సంకలనం. సోక్రటీసు పూర్వం తత్త్వవేత్తలు జీనోఫేన్సు, హెరాక్లిటస్, పార్మెనిడిస్, ఎంపిడొకిల్సుతో మొదలుపెట్టి సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్, అరిస్టాటిల్ తర్వాత మధ్యయుగాల్లోని ఆగస్టెయిన్, ఆక్వినాస్, ఆధునికయుగంలో హేతువాదులైన దెకార్టే, స్పినోజా, లీబ్నిజ్, అనుభవవాదంలో లాక్, బెర్కిలీ, హ్యూమ్, వికాసయుగంలో గొథే, కాంట్, కాంట్ అనంతరం హెగెల్, మార్క్స్, ఎంగెల్స్, షోపెన్ హోవర్, కీర్క్ గార్డ్, నీషే, మిల్, బెర్గ్ సన్, మాక్, ఆచరణవాదులైన పియర్స్, జేమ్స్, డ్యూయీ, వ్యావహారిక భాషా తత్త్వవేత్తలైన రస్సెల్, మూర్, విట్ గెన్ స్టెయిన్, మార్క్సిస్టులైన లెనిన్, లూకాక్స్, గ్రాంస్కీ, అల్తస్సర్, అస్తిత్వవాదులైన హసెరల్, హిడెగ్గర్, జాస్పర్స్, సార్త్రే, మార్లొపొంటి, వివిధ వైజ్ఞానిక పద్ధతులను ప్రతిపాదించిన హైజెన్ బర్గ్, కారల్ పోపర్, థామస్ కున్, నిర్మాణవాదులైన ససూర్, స్ట్రాస్, వినిర్మాణవాదులైన ఫొకాల్ట్, లొటార్డ్, డెల్యూజ్, డెరిడా, స్త్రీవాదులైన సైమన్ డి బోవా, జూలియా క్రిస్తేవా, లూసీ ఇరిగరే, పాం హిగం, సుసాన్ బోర్డో, సైమన్ క్రిష్లే ల రచనలలోని కొన్ని ముఖ్యమైన భాగాల అనువాదాలు ఈ సంకలనంలో పొందుపరిచారు. ప్రతి వాదానికి ముందు క్లుప్త పరిచయం, తత్త్వవేత్తల ఫొటోలు సమకూర్చారు.
ఈలాంటి అనువాద సంకలనం తెలుగులో రావడం చాలా అవసరం. ఇప్పటివరకు తెలుగులో పాశ్చాత్య తత్త్వవేత్తల గురించి పరిచయాలు-గోపీచంద్, నండూరి రామమోహన రావు లాంటి వారు చేసిన రచనలు మాత్రమే వచ్చాయి. కానీ మూలరచనలకు అనువాదాలు తెలుగులో తక్కువే. కానీ అలాంటి అనువాదాల అవసరం తెలుగులో చాలా ఉంది. కారణం అక్కడి రచనల గురించి తెలుసుకోవాలనే ఆసక్తికాదు, లేక అక్కడి రచనల్ని ఇక్కడి తాత్త్విక రచనలతో పోల్చడానికీ, వాటి ఉన్నతిని గుర్తించడానికీ, లేదా తిరస్కరించడానికీ మాత్రమే కాదు, వాటన్నిటికన్న ముఖ్యమైన అవసరం ఆధునిక తెలుగు సాహిత్యంపై పాశ్చాత్య సాహిత్యప్రభావం గణనీయంగా ఉంది. ఆధునిక పాశ్చాత్య సాహిత్యంపై అక్కడి తత్త్వశాస్త్ర రచన ప్రభావం ఎక్కువ మోతాదుల్లో ఉంది. అలా ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన ఆధునిక పాశ్చాత్య సాహిత్యంపై ప్రభావం గలది పాశ్చాత్య తత్త్వశాస్త్రం, అలా అది అక్కడి సాహిత్యం వెంక నిలబడి కనబడకుండా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. ఇలా దాగి ఉన్న రచనల్లో కొన్ని భాగాలను, అంశాలను మనకు నేరుగా తెలుగులో అనువదించి అందించే ప్రయత్నం సత్యాన్వేషణ చేస్తుంది. దీనివల్ల పాశ్చాత్య తత్త్వశాస్త్ర రచనల గురించి తెలుసుకోవడమే కాక, ఆధునిక తెలుగు సాహిత్యంలోని గురజాడలోని సామాజికత, చలంలోని రెబెలియన్, శ్రీశ్రీ, బైరాగి, నారాయణబాబుల్లోని అధివాస్తవికత, బుచ్చిబాబు, చండీదాస్ లోని అస్తిత్వవాదం, మనస్తత్వ విశ్లేషణావాద ప్రభావం నుంచి ప్రస్తుతం మనముందున్న స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ, ప్రాంతీయ, పోస్ట్ మోడరన్ సాహిత్యాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకంలోని పరిచయాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
సంస్కృతం, పాళీ, ఇతర భారతీయ భాషల్లోని తత్త్వశాస్త్ర రచనలు ఇంగ్లిషు, ఇతర ఐరోపా భాషల్లోకి అనువాదమయ్యాయి. అలాగే ఇతర భాషల్లోని తత్త్వశాస్త్ర రచనలను తెలుగులోకి అనువదించవలసిన అవసరం ఉంది. దీని ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడమేకాక, తెలుగుభాషలో (సంస్కృత, పాళీ, ఇతరభాషల్లో) ఉన్న పదజాలం విస్తృతి, పరిమితి మనకు తెలిసే అవకాశం ఉంది. తత్త్వశాస్త్ర రచనల అనువాదానికి, అనువాద భాషకు మధ్య ఉన్న సమస్యను గురించి వీరభద్రుడు ఇలా అంటారు:
‘పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుంచి ఏ ఒక్క రచననైనా తెలుగులోకి అనువదించడం అంత సులువైన పని కాదు. ఉదాహరణకి ‘ఎగ్జిస్టెన్స్’, ,బీయింగ్’, ‘బికమింగ్’ లాంటి పదాలకు తెలుగు ఏమిటి? అంత మౌలిక పదాలకే తెలుగు దొరకనప్పుడు ‘సింక్రానిక్’, ‘డయాక్రానిక్’, ‘జెండర్’ లాంటి పదాలకు అసలు దొరకదు. ‘నామినలిజం’, ‘ఆంటాలజీ’, ‘ఫెనామినాలజీ’, ‘కమాడిఫికేషన్’ లాంటి పదాలకు సంస్కృత సమానార్థకాలకన్నా ఇంగ్లీషే ఎక్కువ సుబోధకంగా ఉంటుంది. ఏ భాష అయినా విస్తరించాలంటే ఆ భాషా సమాజం అభివృద్ధి చెందితేనే సాధ్యపడుతుంది.’ (పే.9)
ఇలా భాష విస్తరణ ఆలోచనని ఇలాంటి అనువాదాలు మనలో కలుగచేస్తాయి.కొన్ని పదాలకు సరైన పదాలు దొరకకపోతే వాటిని రాతలో తెలుగులోకి దించుకోవడం, ఉదాహరణకి రైలు, బాంకు లేక కొత్త పదాలు నిర్మించుకోవడం, వాడుకలోలేని పదాలను మరలా వాడుకలోకి ప్రవేశపెట్టడం తద్వారా తెలుగు భషాపదాల విస్తృతిని పెంచే అవకాశముంది. ఇలాంటి ప్రయత్నాలు ఇంగ్లిషు భాషలో విస్తారంగా కనబడతాయి. రెవెన్యూకి సంబంధించిన చాలా పదాలు రశీదు లాంటివి పర్షియన్, ఆరబిక్ లకు సంబంధించినవి. వీటిని మనం చాలా భారతీయ భాషల్లోనూ చూస్తాం. భాషలో భావానికి సరైన పదం లేకపోతే దాన్ని నిర్మించుకోవాలి. లేక అరువు తెచ్చుకోవాలి. కొన్ని పదాలకు భావాలు, వస్తువులు, వ్యక్తులు నమూనాగా లేకపోతే వాటిని భావించాలి, తయారుచేసుకోవాలి. మార్చుకోవాలి. ‘మూగెండ’ కు ఇంగ్లిషు పదమేది? ఇలాంటి ప్రయత్నాల ద్వారా, ప్రశ్నలద్వారా ఇటు భాష, అటు భావాల పరిథుల్ని విస్తృతి చేసుకోవాలి. ఇలాంటి ప్రయత్నాలను సత్యాన్వేషణ చేస్తుంది.
ఇంత సుదీర్ఘమైన కాలంలోని రచనలను, వాటిల్లోని భావాలను ఒక సంచికలో పొందుపరచడం చాలా కష్టమయిన పని. ఇలాంటి సంకలనాల్లో ఎందరో కొందరు రచయితలు తప్పనిసరిగా వదిలివేయబడతారు. అటువంటప్పుడు సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న: ఆ తత్త్వవేత్తల్ని ఎందుకు చేర్చలేదు? లేక చేర్చిన రచయితల విషయంలో వారి మరో రచనను ఎందుకు ఎన్నుకోలేదు? ఉదాహరణకు వైట్ హెడ్ లాంటి వాళ్ళను ఇందులో చేర్చలేదు. పై ప్రశ్న సంకలనంలోని కొన్ని అవసరమైన పరిమితుల్ని సరిగా ఎత్తి చూపినా ఆ ప్రశ్నలోని గొప్ప లోపమేమిటంటే వాటిని గురించి ఎత్తిచూపుతూ అది ఉన్నవాటిని నిష్కారణంగా తృణీకరించే ప్రమాదముంది. పాఠకులు ఉన్నవాటి గురించి చదివి, అర్థం చేసుకుని, ఆలోచించి ఆ తర్వాత ఇంకా కావాలని అడగాలి. కాని ఆదిలోనే లేనిదాని గురించి మారాం చేయడం మంచిది కాదు. పైగా లేనివాటిని చేర్చినట్టయితే సంకలనం సంపూర్ణం అవుతుందనే భావం వచ్చే ప్రమాదమూ ఉంది. చదవాలనుకున్నవారికి ఈ సంకలనంలో చాలా రచనలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక సంకలనంలోని అనువాద నాణ్యత గురించి. దాదాపు అన్ని అనువాదాలు బాగానే ఉన్నాయి. తెలుగు భాష పరిమితుల్ని అధిగమిస్తూ చేసిన ప్రయత్నాలు శ్లాఘించదగ్గవి. నా దృష్టిలో కొన్ని చెడ్డ అనువాదాలుంటాయి. కొన్ని మంచి అనువాదాలు మూలాన్ని ప్రతిబింబింపచేస్తాయి. మరికొన్ని అనువాదాలు మూలరచనను మళ్ళీ శ్రద్ధగా చదివేట్టు చేస్తాయి. కొన్ని రచనలు అనువాదంలో ఎక్కువ ప్రభావాన్ని చూపవచ్చు. ఉదాహరణకు ఎడ్గార్ ఎలెన్ పో కవితలు ఇంగ్లిషులో కన్నా ఫ్రెంచిలోకి అనువదించినప్పుడు అక్కడి సింబలిస్టులు బోదిలేర్, మలార్మే, రింబోలపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. ఈ ఫ్రెంచి సింబలిస్టులు తిరిగి టి.ఎస్.ఇలియట్ ని ప్రభావితం చేస్తే అప్పుడు ఇంగ్లిషు పాఠకులు పో ని మళ్ళీ శ్రద్ధగా చదివి అతని గొప్ప దనాన్ని గుర్తించారు. ఈ సమకలనంలోని అనువాదాలు చాలా శ్రద్ధగా, సమగ్రంగా చేసినవే. ఇమాన్యువల్ కాంట్ రచనకు వీరభద్రుడి అనువాదం నన్ను మళ్ళీ కాంట్ రచనను ఇంగ్లిషులో చదివించింది. ఇంకా ఈ సంకలనంలో చివర ఇతర పుస్తకాల పేర్లు, పారిభాషిక పదసూచికలు, వెబ్ సైట్ల వివరాలు ఇవ్వారు. అవి పాఠకులకు చాలా ఉపయోగపడతాయి.
ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలి. పూర్తి రచనను అనువదించిన రచనలు రావాలి. ఇక్కడ గమనించవలసిన విషయం: ఈ పుస్తకంలో సత్యాన్వేషకులే కాక సత్యధిక్కారులైన నీషే, డెరిడాల రచనలు కూడా ఉన్నాయి. ధిక్కారం కూడా ఒక రకమైన అన్వేషణనేమో!
Featured image: Socrates drinking the hemlock by Antonio Zucchi, 1767, via the National Trust Collection
16-5-2024
ఒక రచయితగా ఒక ప్రచురణకర్త ప్రచురించిన పుస్తకం అది మీదే కావచ్చు ఇలా పిడిఫ్ రూపంలో బహిరంగంగా పంచుకోవడం సబబేనా?
🙏 మీ రుణం ఈ జన్మలో తిరుచ్చుకోలేము.. భావితరాలకు మీ సాహిత్యని అందించే ప్రయత్నం చేయడం తప్ప..
ధన్యవాదాలు సార్
thank you sir