పోస్టు చేసిన ఉత్తరాలు-7

28-10-2023, తెల్లవారుజాము మూడున్నర

ప్రియమైన

నిన్న పొద్దున్న ఉత్తరం రాసానేగాని, అది నీ హృదయాన్ని మరీ బరువెక్కిస్తుందని అనుకుంటూనే ఉన్నాను. అసలే సున్నితమైన మనస్సు నీది. జీవితంలో ప్రతి ఒక్క సంతోషం ఎదటా ప్రథమాశ్చర్యంలో ఉన్నదానివి. ప్రతి ఉదయం ముందూ చేతులు జోడించి నిలబడటం కన్నా ముందు ఒక పక్షిలాగా కలకూజితంతో స్వాగతం పలకాలనుకునే చిన్నపిల్ల ఇంకా నీలోంచి అదృశ్యం కానిదానివి.

నిన్న సాయంకాలం టెర్రేస్ మీద మొక్కలకు నీళ్ళుపెడుతూ ఉన్నాను. నగరకాశం మీద నిశ్శబ్దంగా చతుర్దశి చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. పారిజాతపు గుబుర్లలో మొగ్గలు రేకలు విప్పుకోడానికి ఎదురుచూస్తున్నాయి. ‘పక్షులు పాడుతున్నాయి, గాలి వీస్తున్నది, చంద్రుడు ఉదయించాడు’ ఇటువంటి మాటలు వార్తలవుతాయి తప్ప కవిత్వమెలా అవుతాయి అని ఒక సంస్కృత లాక్షణికుడు ఎప్పుడో శతాబ్దాల కింద రాసేడని శేషేంద్ర ఎక్కడో రాసింది గుర్తొచ్చి నాలో నాకే నవ్వొచ్చింది.

ఆ అలంకారికుడికి తెలియకపోవచ్చుగాని, మొత్తం ప్రాచీన చీనాకవిత్వమంతా ఉన్నది ఈ వార్తలే. ఎందుకని వాళ్ళు తమ కవిత్వాన్ని ఈ వార్తల్తో నింపేసారు? నేననుకుంటాను, ప్రపంచంలో ఏ భాషలోనూ, ఏ దేశంలోనూ కవులు చూడనన్ని యుద్ధాలు, క్షామాలు, దుఃఖాలు ప్రాచీన చీనాకవులు చూసారు. జీవితం వాళ్లకి గడిచినంత అనిశ్చితంగా మరే దేశంలోనూ మరే జాతికవులకీ గడిచిఉండదు. రేపు సూర్యోదయాన్ని చూడగలమో లేదో, మళ్లా తన స్వగ్రామంలో తన ఇంటిదగ్గర భార్యాబిడ్డల్తో కూచుని చంద్రోదయాన్ని చూడగలడో లేదో తెలియదు, అలా గడిపేరు కాబట్టే, వాళ్లకి ప్రభాతం ఒక వార్త, వెన్నెల ఒక వార్త, వెదురుపొద చిగురిస్తే వార్త, యుద్ధం లేకుండా రోజు గడిస్తే అదే పెద్ద వార్త.

ఏళ్ల తరబడి నాలో నేను సంఘర్షించుకున్నాక, అప్పుడు గ్రహించాను, నా కాలంలో యుద్ధాలగురించి రాయడానికీ, అంతర్యుద్ధాల గురించి కలలుగనడానికీ చాలామందే కవులున్నారు. తెల్లవారితే చాలు, మన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ యుద్ధవార్తలకీ, ద్వేషవార్తలకీ కొదవలేదు. కానీ, ప్రేమ వార్తలు? అవెక్కడ? సంతోషసువార్తలెక్కడ? అందుకనే నాలోనేను వాదించుకుంటో నలభయ్యేళ్ళకు పైగా గడిపేసాక, అప్పుడు తీసుకొచ్చిన కవితాసంపుటానికి ‘కోకిల ప్రవేశించే కాలం’ అని పేరుపెట్టాను.

ఎమిలీ డికిన్ సన్ కవిత్వం నాకెందుకంత ఇష్టమంటే, ఆమె మృత్యువుని అంత దగ్గరగా చూస్తో కూడా పూలనీ, తేనెటీగల్నీ ప్రేమించింది. వాటితో గుసగుసలాడింది. ఆ వార్తల్నే తన కవిత్వంగా మలుచుకుంది. ఆమెనే అన్నట్టుగా-

కోమలంగా, గంభీరంగా
ప్రకృతి నా చెవిలో చెప్పిన మాట-

ఆమె హిగిన్ సన్ కి మొదటి ఉత్తరం రాసాక, ఆయన ఆమె వివరాలు మరింతగా తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆమె రెండో ఉత్తరంలో తన గురించి చిత్రంగా పరిచయం చేసుకుంది. అందులో ఇలా అంటున్నది-

You ask my Companions Hills-Sir-and the Sundown-and a Dog-large ans myself, that my father bought me-They are better than Beings-because they know-but do not tell-and the noise in the Pool, at Noon- excels my piano.

ఈ వాక్యాలు చదివి హిగిన్ సన్ నివ్వెరపోయాడంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తన సమకాలిక అమెరికాలో సంఘసంస్కరణలో, బానిసల విముక్తిలో, అంతర్యుద్ధంలో పీకలదాకా కూరుకుపోయిన ఆ మేధావికి, ఆ పాత్రికేయుడికి, ఆ రచయితకి అంతకుముందూ, ఆ తర్వాతా కూడా అటువంటి మనిషీ, కవయిత్రీ కనిపించి ఉండరు.

కొండలూ, సూర్యాస్తమయాలూ తన సహచరులని చెప్పుకున్నామె. మధాహ్నాలవేళ తన కొలను మీద గాలిచేసే సవ్వడి తన పియానో సంగీతాన్ని మించిపోతున్నదని చెప్పుకునే కవయిత్రి బహుశా ఒక పెద్దనకీ, ఒక కృష్ణశాస్త్రికీ మరింత బాగా అర్థమవుతుందేమో. గుర్తుందా ‘ ఆ ఆలాపంబె అవేళ పల్కెడు ప్రభాతాయాత వాతహతా ల్లోలత్తంత్రుల..’ కవి అంటే ఎవరంటే, అదిగో ఆ వార్తల్ని పట్టుకునేవాడు. వాటిని ఇదుగో, ఇలా మనదాకా తీసుకొచ్చేవాడు.

జార్జి హెర్బర్ట్ అనే ఇంగ్లిషు కవి తనని భగవంతుడి లేఖకుడిగా చెప్పుకున్నాడట. ఎమిలీ లాంటి కవులు ప్రకృతి సామ్రాజ్యవిలేకరులు. ఆమె రాసిన ఈ కవిత చూడు:

వసంతంలో కనవచ్చే వెలుగులాంటిది
ఏడాదిపొడుగునా
మరెప్పుడూ కనిపించదు
ఫాల్గుణమాసం వచ్చిందో లేదో

దూరంగా ఏకాంతపర్వతపంక్తిమీద
ఒక వెలుగు వ్యాపిస్తుంది
అది తర్కానికి చిక్కదు
మనసుకు మాత్రమే తెలుస్తుంది.

ముందు పచ్చికబయల్లో కనిపిస్తుంది
ఇంతలో దూరంగా చెట్లమీద వాలుతుంది
సుదూరమైన కొండవాలులోంచి
అది నాతో మాటాడుతున్నట్టే ఉంటుంది.

ఇక అప్పుడు దిగంతాలు సాగినప్పుడు
అపరాహ్ణాలు గడిచిపోతున్నప్పుడు
చిరుసవ్వడికూడా చేయకుండా
అది తరలిపోతుంది, మనం మిగిలిపోతాం.

అప్పుడు మన సారాంశమేదో
మనం కోల్పోయినట్టనిపిస్తుంది.
మన ప్రార్థనాస్థలం కాస్తా
సంతగా మారిపోయినట్టనిపిస్తుంది.

ప్రింటింగ్ ప్రెస్ లు రాకముందు బహుశా కవులే ప్రతి ఒక్క వార్తా మోసుకు వచ్చే అవసరం ఉండేదేమో. కానీ ఇప్పుడు ఆ వార్తలు రాయడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు కవులు మోసుకురావలసిన మొదటి వార్తలు- ‘ఈ సాయంకాలం నగరాకాశం మీద శరచ్చంద్రుడు ఉదయిస్తున్నాడు’, ‘ఈ రోజు పొద్దున్నే మా ఇంటి ఎదట వేపచెట్టుమీద అయిదు రామచిలకలు వాలి కొన్ని క్షణాలు మౌనంగా కూచున్నాయి’-లాంటివి. ఈ వార్తలు తీసుకురావాలంటే, ముందు ఇటువంటి లోకం నీకు బాగా తెలిసుండాలి. అదొక్కటే నీ జీవితంగా మారిపోయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎమిలీ లాగా ఇటువంటి కవిత రాయగలుగుతావు.

ఒక తేనెటీగ మర్మరధ్వని
నా మీద మత్తుమందు చల్లుతుంది
ఎందుకని ఎవరన్నా అడిగితే
చెప్పడంకన్న మూగబోవడం
మేలనిపిస్తుంది.

కొండమీద ఎర్రరంగు
నా మనసుని దోచుకుంటుంది
ఎందుకని ఎవరన్నా గొణిగితే
చూసుకో, దేవుడున్నాడిక్కడ
అని చెప్తానంతే.

తూర్పు తెల్లవారగానే
నా గుండె వేగంగా కొట్టుకుంటుంది
అదెట్లా అని అడిగావనుకో
నన్ను చిత్రించిన చిత్రకారుడు
మటుకే చెప్పగలడంటాను.

నిజమే, ఈ వార్తలు ప్రపంచానికి అక్కర్లేదు. కానీ ప్రపంచం పసిది, దానికేం తెలుస్తుంది? చూడు, ఆకాశమూ, సూర్యరశ్మీ తనకు అవసరంలేదన్నట్టే ఉంటుంది పొద్దున్న లేచి దాని నడవడి. కాని అవి లేకపోతే ప్రపంచం క్షణం కూడా మనజాలదని మనకు తెలుసు. అందుకనే నిజమైన కవి తనని తాను ముందు భగవంతుడి వార్తాహరుడిగా నియమించుకుంటాడు.

హాలాండ్ దంపతులకి రాసిన ఒక ఉత్తరంలో ఎమిలీ ఇలా అంటున్నది:

My business is to love. I found a bird this morning-down-down- on a little bush at the foot of the garden, and wherefore sing, I said, since nobody hears?

‘ఎందుకు పాడుతున్నావమ్మా, నీ పాటనెవరూ పట్టించుకోడం లేదు కదా’ అని అడిగిందట ఆ పిట్టని. అప్పుడేం జరిగిందో ఇలా రాస్తోంది:

One sob in the throat, one flutter of bosom-‘My business is to sing’-and away she rose! How do I know but cherubim, once themselves, as patient, listened, and applauded her unnoticed hymn?

ఆమె అలా అడగ్గానే ఆ పక్షి గొంతు గద్గదమైందట, ఆ చిన్ని గుండె వణికిందట. ‘పాడుకుంటూ ఉండటమే నా పని’ అంటో ఆ పిట్ట ఎగిరిపోయిందట. ‘నాకెలా తెలుస్తుంది? ఏ దేవదూతలో ఆ మంత్రగానం విని తలపంకించారని?’ అని అంటున్నది ఎమిలీ. అసలు ఆ దేవదూతలు కూడా ఒకప్పుడు పక్షులే అని కూడా అంటున్నది కవయిత్రి.

నేననుకుంటాను ఎమిలీ లాంటి కవులు ఒకప్పుడు పక్షులూ, దేవతలూ కూడా. వాళ్లకి భగవంతుడి భాషతెలుసు. దాన్ని మన భాషలో పంచుకోడానికి కొన్నాళ్లు మనమధ్య ఉండి వెళ్తారు.

కానీ చిత్రమేమిటంటే, ఎమిలీ తన పాట దేవదూతలు వినాలని కోరుకోలేదు. ఆమె రాసిన కవితలన్నీ ఈ ప్రపంచానికి రాసిన ఉత్తరాలే కదా. చివరి రోజుల్లో రెండే రెండు పంక్తుల చిన్న కవిత ఒకటి రాసింది. చూడు:

A letter is a joy of Earth-
It is denied the Gods.

ఏమి వాక్యం ఇది! ఒక ఉత్తరం రాయడమంటే, పుడమి పులకించడమట. ఆ అమృతంలో దేవతలకి వాటాలేదట. ఆమె దృష్టిలో ఉత్తరాలూ, కవితలూ రెండూ ఒకటే కాబట్టి, ఆమె కవిత్వమంతా ఈ పృథ్విసంతోషంకోసమే. అంటే మనల్ని మురిపించడానికే, మనల్ని బతికించడానికే. తల్లి తినిపించే గోరుముద్దలన్నీ తన పసిబిడ్డకోసమే అన్నట్టుగా.

తెల్లవారింది. మొదటి నమాజు ఆకాశాన్ని మేల్కొల్పింది. మేడ మీదకి వెళ్ళాలి. పారిజాతాలు పూర్తిగా విప్పారి ఉంటాయి. వాటి మీద రాత్రంతా వెన్నెల రాసిన ప్రేమాక్షరాల్ని, మంచు చెరిపేయకముందే, చదువుకోవాలి.

ప్రియా, It is strange that the most intangible thing is the most adhesive అని రాసింది ఎమిలీ ఒక ఉత్తరంలో. బహుశా అటువంటి అగోచరబంధాలన్నిటిలోనూ ప్రేమకన్నా బలంగా మనల్ని చుట్టబెట్టుకునేది మరేదీ లేదనుకుంటాను. Love makes us ‘heavenly’ without our trying in the least అని కూడా రాసిందామె.

నువ్వూ నేనూ కూడా ఈ స్వర్గస్పర్శని రోజంతా అనుభూతి చెందాలని కోరుకుంటూ- నీ-

28-10-2023

17 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-7”

  1. “వాటి మీద రాత్రంతా వెన్నెల రాసిన ప్రేమాక్షరాల్ని, మంచు చెరిపేయకముందే, చదువుకోవాలి.“

    “ My business is to sing’-and away she rose!”

    Your business is our fortune, sir!!
    🙏🏽

  2. ప్రేమగానాలు, అమృతంపు సోనలు,
    పరిమళ తెమ్మెరలు, పారిజాత కుసుమాలు మీ ఆత్మీయ ఉత్తరాలు… మీకు నమస్సులు..🙏🙏🙏

  3. మీ తరగని ఖజానాలోంచి రోజూ మాకిన్నిన్ని వజ్ర వైడూర్యాలు పంచుతూనే ఉన్నారు. ఒక రోజు హాయిగా మొదలవడం మీ ఆణిముత్యాలు అవధరించే మరి. అన్నట్టు హిందీ సాహిత్యంలో కవి అజ్ఞేయ్ కూడా ‘హరీ ఘాస్ పర్ క్షణ్ భర్’ అనే కవితలో ఇలా అంటాడు.
    आओ बैठें
    इसी ढाल की हरी घास पर।
    రా, ఇలా కూర్చుందాం
    ఇక్కడ ఈ వాలులో ఈ పచ్చగడ్డి మీద.

    माली-चौकीदारों का यह समय नहीं है,
    और घास तो अधुनातन मानव-मन की भावना की तरह
    सदा बिछी है-हरी, न्यौती, कोई आ कर रौंदे।
    యజమాని-సేవకులనే అంతరానికి వేళ కాదిది,
    ఈ గడ్డి ఆధునిక మానవుని అంతరంగంలా
    ఎప్పుడూ పరిచే ఉంటుంది- పచ్చగా, ఆహ్వానిస్తూ, ఎవరైనా వచ్చి నలిపి పొండంటూ.
    …..
    ……
    చినవీరభద్రుడు గారికి
    ప్రణామాలు.

  4. ఆహా…ఉత్తరం మొత్తం తేనెవాక…ఎంత మధురంగా ఉందీ!! మీ ఉత్తరాలతో రోజంతా మాట్లాడుతున్నట్టు ఉంది గత వారం రోజులుగా. నిన్న సాయంత్రం నేనూ డాబా మీద తిరుగుతూ, చంద్రుణ్ణి చూస్తూ, అచ్చు మీరు రాసినట్టే, ఆ సాయంకాలం గాలినీ, ఆ కెంపు మెరుపుల్ని, ఇంకాస్త దగ్గరగా వచ్చి చందమామ దోసిళ్ళతో చల్లుతున్నట్టు ఉన్న వెన్నెలని చూసినప్పుడు, ఈ పున్నమి చందమామ రేపటి ఉత్తరంలోకి వస్తాడా అని ఊహగా అనుకున్నాను. వచ్చేశాడు. ❤️❤️❤️

    హాయిగా ఆవరించిన వెన్నెల మైకమో, అరచేతుల్లోకి తీసుకున్న పారిజాత పరిమళమో… ఇన్నాళ్ళూ ఈ ఉత్తరాల్లో కి రాని “నీ” అన్న సంతకాన్ని కూడా ఈ రోజు కలిపేలా చేసిందే!! ☺️☺️

    కబీర్ ఎప్పుడో చెప్పాడు, తలుచుకోవడం ముఖ్యం అని. ఆ తలపులలో ఇలా నెమ్మదిగా వికసించే ప్రేమని కళ్ళారా చూడటం కూడా వెన్నెట్లో చేతులు చాపినట్టే, పక్షి పాటకు చెవులప్పగించినట్టే, నిండా విరిసిన పూల చెట్టు ముందు దోసిలి ఒగ్గినట్టే, అపురూపంగా ఉంది.

    ❤️❤️❤️

  5. నేను మరలా మరలా ఈ ఉత్తరాలను చదువుకుంటాను సార్. మంచి ఉత్తరాలను గొప్పగా పరిచయం చేస్తున్న
    మీకు నా నమోవాకాలు.

  6. మన జీవితాలని వెలిగించే ఈ ప్రకృతిలోని
    ప్రతి కదలిక,పరిణామం ఎంత అద్భుతమైనవిగా ఆరాధించవలసినవో ఎంత సుకుమారంగా చెప్పారు సర్!!!
    కవి భగవంతుడి వార్తాహరుడు…ఈ మాట
    ఎంత మనోహరంగానో అనిపిస్తోంది.
    ఎంతటి మహద్భాగ్యం!

  7. “ఒక తేనెటీగ మర్మరధ్వని
    నా మీద మత్తుమందు చల్లుతుంది
    ఎందుకని ఎవరన్నా అడిగితే
    చెప్పడంకన్న మూగబోవడం
    మేలనిపిస్తుంది.”

  8. ఇహాన్ని ఇంతగా ప్రేమించి మనల్ని ప్రేమించమని చెప్పే సందేశం ఎంత గొప్పది🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading