పునర్యానం-1

నిర్వికల్ప సంగీతం కవిత్వం సంపుటి వెలువరించిన తర్వాత నాకొక కావ్యం రాయాలనిపించింది. వచనకవిత్వంలో దీర్ఘకావ్యాలు అప్పటికి రాసినవాళ్ళు లేకపోలేదు. కాని నా ఊహ వేరే విధంగా ఉండింది. అదొక ఇతిహాసాన్ని తలపించేదిగా ఉండాలనే ఆకాంక్ష చాలా బలంగా ఉండేది.

ఒక జాతిజీవితాన్ని కావ్యంగా మలిస్తేనే ఇతిహాసమవుతుంది. లేదా జాతులు రూపొందేటప్పుడు అందులో చేరిన వివిధ సమూహాల్ని కలిపి ఉంచే కథలు ఇతిహాసాలుగా మారాయనేనా చెప్పొచ్చు. కాని నాకు నా జీవితం తప్ప మరేమీ తెలియదు. అందుకని నా ప్రయాణాన్నే ఒక కావ్యంగా రాయాలనుకున్నాను. కాని వచనకావ్యం అంటే ఎలా ఉండాలి? ద్విపద కావ్యంలాగా ఒకే ఒక్క దీర్ఘ కవితగా ఉండాలా? లేదా ప్రాచీన చంపూకావ్యాల్లాగా కొంత గద్యం, కొంత పద్యం కలిసి ఉండాలా? చాలా ఏళ్ళు నాకు ఆ కావ్యరూపం ఎలా ఉండాలో స్పష్టత రాకపోవడంతో అప్పుడప్పుడూ ఏవో కవితలు రాస్తూ ఉండటం తప్ప దాదాపుగా పద్ధెనిమిదేళ్ళపాటు (1986-2004) ఏమీ రాయకుండా గడిపేసాను. ఆ మధ్యలో అప్పుడూ అప్పుడూ రాస్తూ వచ్చిన కవితల్ని ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ (1995) సంపుటిగా వెలువరించానుగాని నా దృష్టి నేను రాయాలనుకున్న ఆ దీర్ఘకావ్యం మీదనే ఉండింది.

2003 లో అనుకుంటాను, ఒకసారి ఎమెస్కో విజయకుమార్ మా ఆఫీసుకి వచ్చినప్పుడు మాటల్లో ఆ నా తలపు గురించి కూడా చెప్పాను. ఆయన వెంటనే, అది ఎన్నిపేజీలైనా సరే, ఎమెస్కో ఆ పుస్తకం ప్రచురిస్తుంది, మీరు వెంటనే మొదలుపెట్టండి అన్నాడు. వెంటనే కొన్ని కవితలు రాసి ఆయనకు పంపాను. ఆయన వాటిని మనసారా మెచ్చుకున్నాడు. నెలరోజుల్లో ఆ కావ్యం పూర్తయిపోయింది.

ఆ పుస్తకాన్ని తెలుగు రసజ్ఞలోకం బాగానే స్వాగతించింది. దాదాపుగా అన్ని పత్రికల్లోనూ సమీక్షలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవిత్వానికిచ్చే పురస్కారం కూడా ఇచ్చింది. ఆ ఏడు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన చేరా గారు ఆ పుస్తకం మీద చాలా చక్కని అభిప్రాయం రాసి పంపారని చెన్నయ్యగారు అన్నారు.

‘నిర్వికల్ప సంగీతం’, ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ నుంచి కొన్ని కవితల్ని అనువదించినట్టే, పునర్యానం నుంచి కూడా కొన్ని కవితల్ని వరసగా అనువదించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


అమ్మ వళ్లో నేను కళ్లు తెరిచేటప్పటికి అడవి నిండా పాలపూల సుగంధం
పూసిన కొండమామిడి కొమ్మలమీద అడవికోయి­లలు పాటలు పాడేవి,
భూమి కోసం ఆకాశం నుంచి నిత్యం శుభవార్తలు వర్షించేవి
ఆదివాసి యు­వతుల ఆటల్తో ఊరు గలగల్లాడేది

అమ్మ నాకొక్కటే అన్నం ముద్ద పెట్టినప్పుడల్లా ఆకలి రుచి తెలిసేది,
పొదుగుల్లో పొంగుతున్న క్షీరధారలు తాము తాగి లేగలు నాకు కొంతమిగిల్చేవి
నేను ఆడుకోవడం కోసం సూర్యుడు దారిపొడుగునా వెలుతురు పరిచేవాడు,
వెన్నెలపందిరి మీద సన్నజాజులు పూచినట్టు తారకలుదయించేవి

నా కోసం ప్రతి అరుగు మీదా ఆ ఊరు ఆహ్వాన పత్రిక రాసి ఉంచేది,
నా కోసం శుభాకాంక్షల్తో ప్రతి ఇంటి కిటికీ తెరిచి ఉండేది
వాకిట్లో రాధామనోహరాలు నా కోసం మరికొన్ని మకరందాల్ని మనసున నింపుకునేవి

ఎడ్లమెడల్లో గంటల సవ్వడి నేను వినాలని రాత్రులు బళ్లు నడక తగ్గించేవి,
అడవి ఎప్పటికప్పుడు నా కోసం కొత్త వస్త్రాల్ని ధరించేది.
నా కళ్ల ముందు రంగులు పోస్తూ పూలు పూసేవి
ఊరంతా నా కోసం పిల్లల బొమ్మల కొలువు,
ఏ దేశాల్నుంచో ప్రతి పండక్కీ గంగిరెద్దులొచ్చేవి
జక్కుల వాళ్లు నాట్యం చేసేవారు,
ఊరి వెలుపల జాగరాలమ్మ సంధ్యా దీపం వెలిగించుకుని నను రమ్మనేది

అడవి, ఏరు, పొలం, పాట, వెన్నెల వూటల సాక్షిగా
మేం పీటని పల్లకి చేసి బొమ్మలకి పెళ్లి చేసాం
ఉత్తుత్తి వంటలతో బాల్యకాల సఖి ఎవరో
నాకు అన్నం వండి చెలిమిని వడ్డించేది.

నన్నెవరు ప్రేమించినా ఆ ఊరికి తీసుకుపోదామనిపిస్తుంది
నా చెలిమినెవరు కోరినా ఆ లోకానికెగరాలనిపిస్తుంది

(పునర్యానం:1-1-1)

A blooming forest welcomed me upon my birth

A blooming forest welcomed me upon my birth.
Cuckoos sang in celebration.
A thousand good wishes rained down on the mountain village
As tribal girls danced.

I learned to taste life as my mother fed me.
For my portion of milk, the calves shared theirs.
In golden light, the Sun let me roam and play
Evenings brought the stars out like jasmine buds.

Every home extended an invitation to me
From every window, there was a warm welcome
In the evenings, the village goddess beckoned me with the temple lamp
In Madhumalati’s flowers, more honey dripped.
Bullocks’ bells tinkled
As if the carts on the road slowed down for me.

Every day, the woods were a riot of colors, and
The blooms were at their peak.
In those days, the entire village was a doll show
Dance troupes and decorated oxen arrived from distant lands
Making life a festival.

It was like a dolls’ wedding every day
With the forest, the hill spring, the sun, and moonlight as guests
And our childhood friends served a mock feast.

Anytime I meet someone who cares, I would like to take them there.
With whoever sought my hand, I would fly to that heaven.

29-7-2023

16 Replies to “పునర్యానం-1”

 1. ఉత్తుత్తి వంటలతో బాల్యకాల సఖి ఎవరో
  నాకు అన్నం వండి చెలిమిని వడ్డించేది…
  ఎంత అందమైన భావ వ్యక్తీకరణ… మీ ఊహలు చదివినవారు ఎక్కడెక్కడో విహరిస్తారు .

 2. అపురూపమైన కావ్యం. స్వాతి నాకు కానుక చేసిన పుస్తకం. నేను నాలాగే ఇంకొకరు చదవాలని ఇచ్చి మళ్ళీ సాధించుకోలేకపోయాను 😞 కానీ, కోకిల ప్రవేశించిన కాలం, నీటి రంగుల చిత్రం చదివిన ప్రతిసారీ, పునర్యానం రాసిన కవి ఇంత అలతి పదాల కవిత్వంలోకి , అంత ఉధృతి లో నుండి ఇంత నెమ్మదితనంలోకి ఎలా మళ్ళారోనని ఆశ్చరపోతూనే ఉంటాను. మీరు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడితే వినాలని ఉంది.

  పునార్యానానికి పునః స్వాగతం.❤️

 3. Both original and translation can be related any world citizen with roots in village life…In your work shall the village find Permanence sir. My regards to you…

 4. మీ పదచిత్రాల లోకాల్లో విహరింపజేశారు!!
  ఎంత బాగుందో చెప్పడం తెలియడం లేదు.
  So I will simply say many thanks for the opportunity to read your works, sir!! 🙏🏽

 5. మీ కవితలు ఇక్కడ చదివే భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషం,ధన్యవాదములు సర్.
  నాలాంటి రచయిత్రి పాఠాలు నేర్చుకోవచ్చు.

 6. అందమైన బాల్యాన్ని అంతే అందంగా అక్షరాక్షులతో చూపించారు.అనువాదం జలవర్ణచిత్రం.

 7. నేను కొన్ని పేజీలు కంఠస్తం చేసాను సర్

Leave a Reply

%d bloggers like this: