ఒక చక్కెర బిడారు

మొన్న బెంగుళూరు వెళ్ళినప్పుడు బుక్ వార్మ్ లో కొన్న పుస్తకాల్లో The Pocket Rumi (శంభల, 2018) కూడా ఒకటి. గత ఇరవయ్యేళ్ళుగా ఇంగ్లిషులో వచ్చిన ప్రతి ఒక్క రూమీ అనువాదం నాదగ్గర ఉంది. ఇది 2001 లో కబీర్ హెల్మింస్కి చేసిన అనువాదం, సంకలనం. ఇన్నాళ్ళు ఇది నా కంట పడకుండా ఎలా ఉందో అర్థం కాలేదు. కబీర్ హెల్మింస్కి సంకలనం చేసిన The Rumi Collection (శంభల, 2000) రూమీ పట్ల నాకు తృష్ణ కలిగించిన మొదటి పుస్తకం. ఆ సంకలనం గురించి అప్పట్లోనే ఒక వ్యాసం కూడా రాసాను. ఆ తర్వాత ఎన్ని పుస్తకాలు. ముఖ్యంగా ఎ.జె.ఆర్బెర్రీ, కోలమన్ బార్క్స్, ఆండ్రూ హార్వే, రాబర్ట్ బ్లై-ఒకరా, ఇద్దరా! రూమీ అనువాదకులు రూమీ సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరింపచేస్తూనే ఉన్నారు.

ఈ అనువాదకులు రూమీలో మరేదన్నా కలిపి ఒక మత్తుమందు తయారు చేస్తున్నారా అని అనుమానమొచ్చి నికల్సన్ నీ, కోలమన్ బార్క్స్ నీ దగ్గరపెట్టుకుని కొన్ని పేజీలకు పేజీలు పోల్చి చూసుకున్నానొకసారి. ఉహుఁ. రూమీ ఒక చక్కెర బిడారు.

ఇప్పుడు మళ్ళా ఈ పుస్తకం తిరగేస్తున్నా కూడా మళ్ళా అదే మాదకత్వం. భగవత్సమ్మోహకత్వం.

We are drinking the water of Khidr
from the river of the speech of the saints

అంటున్నాడు రూమీ మత్నవీలో. ఖిదర్ అంటే దేవదూత. సాధుసత్పురుషులకు పెద్దదిక్కు. భగవంతుణ్ణి కనుక్కోగల విద్యనేర్పే సద్గురువు.  సాధువచనమనే నదీజలాలనుండి ఆ దేవదూత అందించే జీవజలాల్ని గ్రోలుతున్నామని చెప్తున్నాడు రూమీ. రూమీలో ఈ రెండూ జలాలూ ఉన్నాయి. ఆయన కవిత్వం సాధుసత్పురుషుల వచనప్రవాహంలోంచి ఏరితెచ్చుకున్న అనుగ్రహ జలం. అందుకనే ఆ జలాన్ని మనమీద ఈ అనువాదకులు ఇంత చిలకరించినా కూడా మనకొక పుణ్యాహవాచనం పూర్తయినట్టే ఉంటుంది.

ఈ పుస్తకంలో మూడు భాగాలున్నాయి. మొదటి భాగం రుబాయీలనుండి ఏరితెచ్చిన కొన్ని అనువాదాలు. రెండవభాగం రూమీ గజళ్ళనుండి ఎంపికచేసిన కొన్ని కవితలు. కానీ పుస్తకం మొత్తంలో మూడింట రెండువంతులు మస్నవీ నుంచి చేసిన అనువాదాలు. అవన్నీ దాదాపుగా కబీర్ హెల్మింస్కి చేసినవే. మస్నవీ ఒక సముద్రం అనుకుంటే, అందులోంచి ఏరి తెచ్చిన ప్రతి ఒక్క కవితా ఒక ముత్యం లాగా ఉంది. ప్రతి పుటలోనూ నిన్ను ఆపేసే వాక్యం- ప్రతి ఒక్క వాక్యాన్నీ మీతో పంచుకోవాలనిపిస్తున్నది. అన్నీ ఎత్తి రాయలేనుగానీ, కొన్ని చూడండి:

ప్రేమోద్యానవనంలో ఎల్లల్లేని పచ్చదనం
బాధానందాలు తప్ప తక్కినపండ్లన్నీ దొరికేచోటు
ప్రేమ ఆనందవిచారాలకి అతీతమైంది
వసంతంతోనూ, హేమంతంతోనూ పనిలేని పచ్చదనమది.

ప్రేమ అంటే సంతోషాలు పూచే తావు అనో, ఆనందామృతఫలాలు దక్కే చోటు అనో చెప్పవచ్చు. కానీ అలా చెప్పినవాడింకా మానవలోకపు పొలిమేర దాటనివాడే. బాధానందాలు తప్ప తక్కిన పండ్లన్నీ దొరికే తోటగా ప్రేమని గుర్తుపట్టగలిగేవాణ్ణి మాత్రమే మనం రూమీ అని గుర్తుపట్టగలుగుతాం.

ఈ వాక్యం చూడండి:

తెలిసినవాళ్ళంతా ఈ మాటే చెప్పారు:
ఒకడు భగవంతుణ్ణి తెలుసుకున్నాడంటే అర్థం
దేవుడు మనమీద ప్రేమ చూపించడానికొక దారిదొరికిందని..

నేను ఈ వాక్యాన్ని సరిగ్గా అనువదించలేకపోయాను. దీని అర్థమేమిటంటే, ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి భగవంతుడు ఎరుకపడ్డా కూడా అతని ద్వారా భగవంతుడు తక్కినవారందరికీ దయగనూ, కరుణగానూ అనుభవానికొస్తాడని.

ఈ మూడు వాక్యాలు చూడండి:

నేణు జ్వలిస్తున్నాను
మీరూ జ్వలించాలనుకుంటే నిప్పుచాలకపోతే
రండి, నాతో కలిసి జ్వలించండి.

ఇది అన్ని అవస్థలకూ సరిపడా వాక్యం. టాగోర్ ఒకచోట అంటాడు: హృదయం గడ్డకట్టిపోయినప్పుడు, నీ కరుణావర్షంతో నన్ను తడిపెయ్యి అని. ఇది అటువంటి మాటే, వర్షానికి బదులు అగ్ని అంతే. కాని మనం గడ్డకట్టిపోయినప్పుడో లేదా రగలవలసినట్టుగా రగిలిపోలేకపోతున్నప్పుడో, ఒక టాగోర్ నీ, ఒక రూమీని ఆశ్రయిస్తే చాలన్నది, నాకే ఎన్నో సార్లు అనుభవానికొచ్చిన వాస్తవం.

కొన్ని వాక్యాలు చదువుతుండగానే మనం చేష్టలుడిగిపోతాం. అవి బుద్ధితోనో, చివరికి మనసుతోనో కూడా చెప్పగలిగే మాటలు కాదు. యథార్థమైన భగవత్ప్రేమోన్మత్తతలోంచి మాత్రమే అటువంటి మాటలు పుడతాయి. ఈ వాక్యం చూడండి:

He that is drowned in God wishes to be more drowned.

ఆళ్వారులకి ఈ సంగతి బాగా తెలుసు. అసలు ఆళ్వారు అంటేనే అర్థం మునిగిపోయినవాడు అని కదా. నమ్మాళ్వారు కవిత్వం చదువుతూ ఉంటే, అప్పటికే మునిగిపోయినవాడు, మరింత మునిగిపోతున్న ప్రేమానుభవం ఎలా ఉంటుందో మనకి తెలుస్తూంటుంది.

ఈ పద్యం చూడండి. The Soul Garden అట.

Just as the heart becomes carefree
in a place of green, growing plants
goodwill and kindness are born
when our souls enter happiness

ఒక మనిషి తన ఆత్మసన్నిధిలో ఉన్నాడనడానికి గుర్తు మనం అతడి సన్నిధికి వెళ్లగానే మనలో ఒక ప్రశాంతి, ఎంతో కొంత ప్రపంచోపశమనం అనుభవానికొస్తాయని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ చిన్న కవితలో నాకు చాలా సంతోషం కలిగించింది ఆ పోలిక.  మొక్కలూ, చెట్లూ పెరిగే చోట మనకి కలిగే సంతోషంలాగా మన ఆత్మలు వికసిస్తున్నప్పుడు దయ, మంచితనం వెల్లివిరుస్తాయనడం. అంటే ఒక మనిషి దయ చూపించగలుగుతున్నాడు అంటే అతడిలో ఆత్మ వికసిస్తోందన్నమాట. అతడి ఆత్మ ఉద్యానం పచ్చగా ఉందన్నమాట.

కొన్ని మాటలు రూమీ మాత్రమే చెప్పగలిగిన మాటలు. మనని చాలా ఇష్టపడేవాళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకో విందు ఏర్పాటుచేసారనుకోండి. అప్పుడు మన మీద వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం వాళ్ళు పెట్టినవన్నీ తినాలనుకుంటారు, ఇంకా అడిగి మరీ తినాలనుకుంటారు, వాళ్ళు ఏడాదికి సరిపడా దాచుకున్నవన్నీ మనం ఆ ఒక్కరాత్రి ఆరగిస్తే చాలనుకుంటారు. తన కవిత్వపు బల్లమీద భగవత్ప్రేమను వడ్డించేటప్పుడు రూమీ చూపించే ఆత్రుత ఇటువంటిదే. ఈ వాక్యం చూడండి:

So, quickly, increase your need, needy one,
that the sea of abundance
may surge up in loving kindness

అంటే నువ్వు ఎంత అధికంగా తపిస్తే, ఆ దయాసముద్రం అంతగా పొంగిపొర్లుతుందట. ఎంత మంచివాళ్లయినా, మన మిత్రులు, బహుశా మనమీద ఒక రాత్రివిందులో మాత్రమే చూపించగల ప్రేమ భగవంతుడి విషయంలో జీవితకాల ప్రేమ, మరణాంతరం కూడా మనకు హామీగా నిలబడగల ప్రేమ. ఈ మాటలే మరో చోట ఇలా అంటున్నాడు:

Don’t seek water, increase your thirst,
so water may gush forth from above and below

మనం నీళ్ళ కోసం దప్పిపడ్డప్పుడు నీళ్ళు కూడా మనకోసం వెతుక్కుంటాయని రూమీ చెప్పిన మాట గతంలో మీతో పంచుకున్నాను. కానీ ఈ వాక్యం అంతకన్నా నాలుగడుగులు ఎక్కువ నడిచిన వాక్యం. ఇదేమంటే, నువ్వు దప్పిపడ్డప్పుడు, నీళ్ళకోసం వెతుక్కోవద్దంట, నువ్వు చెయ్యవలసిందల్లా, మరింత దప్పిపడటమేనట. అప్పుడు, ఆకాశగంగా, పాతాళగంగా కూడా నువ్వున్నచోటికి పొంగిపొర్లుతాయట. ఈ మాటలు ఏదో అదాటుగా అన్నమాటలు కావు. ఆయన కవిత్వంలో పదే పదే వినబడే హామీలివి. ఈ వాక్యాలు చూడండి:

దాహార్తుడు అరుస్తున్నాడు
నీళ్ళెక్కడ?
జలాలు పిలుస్తున్నాయి
దాహార్తుడెక్కడ?
నీళ్ళని అయస్కాంతంగా మారుస్తున్నది
మన దప్పికనే.

ప్రతి భక్తికవి భగవత్ప్రేమకు సాక్షినే. కాని ఆ ప్రేమను తన సొంత ఆస్తి పంచినట్టు వెదజల్లడంలో మాత్రం రూమీని మించినవాళ్లు లేరు. పంచేకొద్దీ ఆ ఆస్తి తరిగిపోదనే ఆ నమ్మకం మామూలు నమ్మకం కాదు. ఒకచోట అంటాడు కదా:

Trust in God is the best livelihood.

జీవనోపాధి గురించిన ఈ నిజమైన ప్రేమవిద్య మరెక్కడా దొరికేది కాదు. మరి రూమీకి ఎలా దొరికిందంటే, ఆయనే ఒకచోట చెప్పుకున్నట్టుగా, ఆయన జీవితమంతా వెతుక్కున్నది ఆ ఒక్కదానిగురించే. అందుకని

By speech and by silence and by fragrance
catch the scent of the king everywhere.

ఆ రాజాధిరాజపాదధూళిని ప్రతి అణువులోనూ పట్టుకోగలిగాడు కాబట్టే ఆయన ప్రతి ఒక్క మాటా అంత పరిమళభరితమయ్యింది.

31-5-2023

8 Replies to “ఒక చక్కెర బిడారు”

 1. ప్రత్యామ్నాయము లేనిది ప్రపంచంలో ప్రేమ ఒక్కటే
  దాన్ని రూమీ గట్టిగా పట్టుకున్నాడు.

 2. అంటే నువ్వు ఎంత అధికంగా తపిస్తే, ఆ దయాసముద్రం అంతగా పొంగిపొర్లుతుందట. ఎంత మంచివాళ్లయినా, మన మిత్రులు, బహుశా మనమీద ఒక రాత్రివిందులో మాత్రమే చూపించగల ప్రేమ భగవంతుడి విషయంలో జీవితకాల ప్రేమ, మరణాంతరం కూడా మనకు హామీగా నిలబడగల ప్రేమ.
  100% సత్యం. చక్కని అనువాదం.

 3. రూమీ అంతటి మహానుభావుడు కూడా లోతైన భావాలని కూడా ఎంతో సరళంగా చెప్పిన తీరు ఆశ్చర్యానందాలని కలిగిస్తోంది.
  మీరు మరింత వివరంగా చెప్పిన తీరు పాఠకుల్ని ఆ ప్రేమ ఉద్యానవనాలలోకి నడిపించుకువెళ్ళినట్టుగా వుంది సర్.
  మీలాగే రూమీ కూడా చాలా దయార్ద్రహృదయులు అనిపిస్తోంది.

Leave a Reply

%d bloggers like this: