ప్రసంగకళని దాటిన మధురనిశ్శబ్దం

కవిత్వం కేవలం భాష కాదు. అభిప్రాయ ప్రకటన కాదు. అనుభూతి ప్రకటన కాదు. అసలు ఏ విధంగానూ ఏదో ఒకటి ప్రకటించడం కానేకాదు. అదొక జీవన వైఖరి. వ్యక్తిత్వ సంస్కారం. జీవితం ముందు, జీవితం మధ్య, జీవితాన్ని దాటి కలిగే ఒక మెలకువ.

కవిత్వం రాయాలకునేవాళ్ళందరూ దాటవలసిన పెద్ద అడ్డంకి వక్తృత్వం. సాధారణంగా మనకి కవిత్వం పలుకుతోందని భావిస్తూ మనం చెప్పడానికి ప్రయత్నించేది వక్తృత్వమే. కవిత్వానికీ, వక్తృత్వానికీ మధ్యనుండే తేడా గురించి చెప్తూ జాన్ స్టువర్ట్ మిల్ గొప్ప మాట ఒకటి చెప్పాడు. ఎవరో ఒక శ్రోతని ఉద్దేశించి చెప్పేది వక్తృత్వమనీ, తనలో తాను, తన కోసం తాను, చెప్పుకునేది కవిత్వమనీ అన్నాడాయన. Oratory is heard, but poetry is overheard అన్నాడాయన. కవి తనలో తాను మథన పడేదాన్ని, తనతో తాను మాట్లాడుకునేదాన్ని, మనం చెయ్యగలిగేదల్లా, పొంచి వినడమే అని దాని అర్థం.

ఒకప్పుడు ప్రాచీన గ్రీసులో సోఫిస్టులనేవాళ్ళుండేవాళ్ళు. వాళ్ళు సంపన్న కుటుంబాల యువకులకి ఎలా మాట్లాడాలో నేర్పేవాళ్ళు. ఆ విద్యని రెటారిక్ అన్నారు. అంటే ప్రసంగ కళ అన్నమాట. వాక్చాతుర్యమన్నమాట. ఇప్పటి వ్యక్తిత్వవికాసవాదుల్లాగా, వాళ్ళు ఆ కులీన యువకులకి, మనుషులుగా మారడమెలా అన్నదానికన్నా, మనుషులుగా కనిపించడం ఎలా అన్నది ఎక్కువ నేర్పేవారు. వాక్చాతుర్యంలో ఉన్నదల్లా వాగాడంబరం మటుకేననీ, నిజంగా కావలసింది సత్యాన్ని ప్రేమించగలిగే గుణమనీ సోక్రటీస్ వాదించాడు. సత్యం పట్ల ఉండవలసిన ప్రేమని ఆయన phylos for sophie అన్నాడు. ( ఆ రెండుమాటలూ కలిపి ఏర్పడ్డ కొత్త పదాన్నే మనమిప్పుడు philosophy అంటున్నాం.)

ప్రాచీన కాలంలో ఏథెన్స్ లో జిమ్నాషియాల్లోనే కాదు, మధ్యయుగాల్లో కరికులంలో కూడా రెటారిక్ ఒక ముఖ్యాంశం. ఒక వాక్యాన్ని ఎలా నిర్మించాలి, ఒక వ్యాసాన్ని, లేదా పద్యాన్ని ఎట్లా కంపోజ్ చెయ్యాలి, ఒక పూర్వకవితాభాగాన్ని ఎలా వ్యాఖ్యానించాలి అనే అంశాలు పాఠ్యప్రణాళికలో తప్పనిసరి అంశాలుగా ఉండేవి. మన దేశంలో కూడా కావ్యపాఠం చెప్పేప్పుడు ధాతుపాఠమూ, అన్వయక్రమమూ, ప్రతిపదార్థమూ, అలంకార విశేషాలూ చెప్పే ఒక ప్రక్రియ ఉన్నట్టుగానే. కాని, అవన్నీ కవిత్వ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి సహకరించే సాధనాలే తప్ప కవిత్వం పలకడానికి పనికొచ్చే ఉపాయాలు కావు.

సరే, నువ్వు నీ అనుభూతినో, నీ అభిప్రాయాల్నో ప్రకటించావు. బాగానే చెప్పావు. అయితే ఏమిటి? నాకు వినిపించావు. బావుందన్నాను. మరొకరికి వినిపించావు. బావుందన్నారు. కాని, నువ్వు నా ఎదట లేనప్పుడు కూడా నీ వాక్యాలు నాకు గుర్తొస్తాయా? నా నిద్రలోనో, మెలకువలోనో అవి నన్ను వెన్నాడతాయా? నిన్ను దాటి నీ వాక్యాలు ఈ లోకంలోకి, జనహృదయాల్లోకి ప్రయాణిస్తున్నాయా?

అలా ప్రయాణించేవాటినే మనం కవిత్వం అంటాం. అలా ప్రయాణించేటట్టు వాటికి ఒనగూడవలసిన సామర్థ్యమే కావ్యకళ.

కావ్యకళనీ, ప్రసంగకళనీ వేరు చేసేదేది? డబ్ల్యు. బి.యేట్సు చెప్పిన మాట ఒకటి సుప్రసిద్ధం. Out of the argument with others we make rhetoric, out of the argument with ourselves we make poetry. ‘లోకంతో తగవుపడ్డప్పుడు మనం చేసేది ప్రసంగం, మనతో మనం తగవు పడ్డప్పుడు పుట్టుకొచ్చేది కవిత్వం’ అని దానికి అర్థం చెప్పుకోవచ్చు.

ప్రసంగకళని దాటిన ఒక మధురనిశ్శబ్దాన్ని యేట్సు అనుభవంలోకి తెచ్చుకోగలిగాడు, ఎంతో కొంత మాటల్లో పెట్టగలిగాడు కూడా. తన జీవితకాలం పాటు ఆ అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు కూడా. ఇతరులని ఒప్పించడం మీద కన్నా తనని తాను ఒప్పించుకోడం మీదనే దృష్టి పెట్టాడు కాబట్టే, Wild Swans at Coole (1916-17) వంటి కవిత రాయగలిగాడు.

~

కూలే దగ్గర తోటలో అడవి బాతులు

చెట్లనిండా హేమంత శోభ
పచ్చికబయళ్ళమీద శరత్కాంతి.
ఆశ్వయుజ సాంధ్యవేళ
నిశ్చలతటాకంలో గగనప్రతిబింబం.
పొంగిపొర్లుతున్న నీటి అంచున రాళ్ళమధ్య
అడవి బాతులు, యాభై తొమ్మిది.

మొదటిసారి వీటిని లెక్కబెట్టి
ఇప్పటికి పందొమ్మిది శరత్తులు.
మళ్ళా వీటిని లెక్కించేలోపే
రెక్కలు టపటపలాడిస్తో
ఒక్కుమ్మడిగా పైకి లేచి
నింగిని చుట్టు చుట్టాయి.

ఆ భాసమాన విహంగాలను
మళ్ళా పరికిస్తున్నప్పుడు నాలో ఏదో బెంగ.
మొదటిసారి ఇట్లాంటి ఒక సాంధ్యవేళ
ఆ పక్షులు ఇదే ఒడ్డున నా శిరసుపైన
సులలిత విహారం చేసిన క్షణం గుర్తొచ్చింది,
ఇప్పుడంతా మారిపోయింది.

వాటికి మటుకు అలసట లేదు. ఆ శీతలజలాల్లో
ఒకదాన్నొకటి పెనవైచుకుంటున్నాయి
లేదా పైకెగురుతున్నాయి, వాటి
హృదయాలకు ముదిమి లేదు.
ఏదో ఒకటి వెతుక్కుంటూనో, ఊరికినే మైమరస్తూనో
తిరుగాడుతున్నాయి, నడయాడుతున్నాయి.

మోహసౌందర్యంతో, మహామధురిమతో
ఈ నిశ్చలజలాలమీద ఇప్పుడిక్కడ తేలియాడుతున్నవి
రేపు మరొకనాడు, నేను పరికించేనాటికి,
మరే చోట గూడుకట్టనున్నాయో
మరే సరస్తీరాన వాలనున్నాయో
మరే మానవనేత్రాల్ని మత్తెక్కించనున్నాయో.

~

ఇది నిస్సందేహంగా కవిత్వం. ఇక్కడ కవి సౌందర్యం మటుకే కాదు, విషాదం కూడా తన అనుభవంలోకి రావడం గుర్తుపట్టాడు. అత్యంత వ్యక్తిగతమైన ఆ క్షణంలో అతడు తనలోకి చూపు సారించుకున్న ఆ క్షణంలో పలికిన ఈ కవితని ప్రపంచం ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన కవితగా ఇంకెంతమాత్రం భావించడంలేదు. ఆ క్షణాల్లో ఐర్లాండు చరిత్ర మొత్తం ప్రతిబింబిస్తోందని చెప్పడానికి వ్యాఖ్యాతలు పోటీపడుతున్నారు. ఈ కవితను యేట్సు ఇలా రాయకుండా ఐర్లాండు మీద మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావాన్ని వివరించే ఒక దీర్ఘకావ్యంగా రాసిఉంటే, ఈ కవిత నిజంగా ఇంత ప్రభావశీలంగా ఉండి ఉండేదా అన్నది అనుమానమే.

కాని ప్రతి కవీ మొదటి దశలో తన వాక్చాతుర్యాన్ని చూపించడానికే కవిత్వం రాయడం మొదలుపెడతాడు. తన అనుభూతినో,తన అభిప్రాయాల్నో చెప్పడం అతడికి ప్రాణాధికమైన అవసరం కాబట్టి. ప్రతి కవితా అన్నిటికన్నా ముందు అస్తిత్వ ప్రకటన కావలసిన అవసరముంది కాబట్టి.

ఆ స్థితిని దాటి తనను తాను ఒప్పించుకోడం మొదలుపెట్టాక రాసేదే అసలైన కవిత్వమని యేట్సు అంటున్నాడు. కాని కావ్యవాక్కు మొదటిదశ వక్తృత్వం కాగా, దాని కవిత్వ దశ దాని రెండవ దశ మాత్రమేననీ, కవిత్వం కావ్యకళని కూడా దాటవలసిన ఒక దశ ఉందనీ నాకు నెమ్మది మీద అర్థమయింది.

కవిత్వం మొదటిదశలో ప్రసంగం, రెండవ దశలో పద్యం. కాని మూడవ దశలో ప్రార్థనగా మారాలి. ప్రసంగదశలో కవి ఉన్నాడు, ప్రపంచముంది. రెండవ దశలో కవి ఉన్నాడు, ప్రపంచం లేదు, కాని కవి అంతరంగముంది. మూడవ దశలో కవి కూడా అదృశ్యమై కేవలం అంతరంగమొకటే మిగలవలసి ఉంటుంది. అప్పుడు, అటువంటి దశలో, పలికిన మాటలు మంత్రాలవుతాయి.

అటువంటి మనఃస్థితిలో రాసిన కవితలు, ఇదిగో, డెరెక్ వాల్కాట్ రాసిన ఈ కవితలాగా ఉంటాయి.

~

ప్రేమానంతర ప్రేమ

ఒక రోజొస్తుంది
ఉప్పొంగే హృదయంతో అప్పుడు
నీ గుమ్మం దగ్గర నువ్వే అడుగుపెడతావు
నిన్ను నువ్వే స్వాగతిస్తావు
అద్దం ఎదట మీరిద్దరూ ఒకరినొకరు
చిరునవ్వుతో పలకరించుకుంటారు.

అప్పుడు అతడితో, కూచో, కలిసి ఆరగిద్దామంటావు.
ఆ అపరిచిత అంతరాత్మను
మళ్ళా ప్రేమించడం మొదలుపెడతావు
పంచు రొట్టెని, పంచు మధువుని,
నీ జీవితకాలం పొడుగునా నిన్నెంతో
ఇష్టపడ్డ ఆ అపరిచితుడికి,
మరొకరెవరోలే అనుకుంటో నువ్వు నిర్లక్ష్యం చేసిన అతడికి,
నిన్ను నిలువెల్లా చదివేసిన అతడికి,
ఆ నీ హృదయానికి,
అర్పించు నీ హృదయాన్నే.

పుస్తకాల అల్మైరాలోంచి ప్రేమలేఖలు బయటికి తియ్యి
పాత ఫొటోలు, ఒంటరిగా ఉన్నప్పుడు రాసుకున్న రాతలు
అన్నీ బయటికి తియ్యి
ఆ అద్దంలోంచి నీ ప్రతిబింబం పొర లాగేసి
ప్రశాంతంగా కూచో, జీవితపు విందారగించు.

27-3-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading