ఎందుకంటే మనకి లభిస్తున్న సమాచారం ముందు జ్ఞానంగా మారవలసి ఉంటుంది. ఆ జ్ఞానం వివేకంగా పరిణతి చెందవలసి ఉంటుంది. సమాచారం నేరుగా జ్ఞానంగా మారకపోగా ముందు అది అరకొర సమాచారంగానూ, అపోహల్నీ, దురభిప్రాయాలు కలిగించేదిగానూ మారే ప్రమాదమే ఎక్కువ. సరిగ్గా అటువంటి సమయంలోనే మనకొక సోక్రటీస్ అవసరమవుతాడు.
సోక్రటిక్ తరహా బోధన
అన్నిటికన్నా ముఖ్యం సోక్రటిక్ తరహా బోధన, అభ్యసనం పుస్తక విద్య కాదు. పుస్తకాల్లో ఉన్నవాటిని పునశ్చరణ చేయడం అక్కడ ప్రధానం కాదు. అది ఎవరికి వారు తమ స్వీయ జీవితానుభవాల ఆధారంగా పరస్పరం మాట్లాడుకుని, తమ అభిప్రాయాలు పంచుకోడం ద్వారా ఒకరినొకరు విద్యావంతుల్ని చేసుకునే నిరంతర ప్రక్రియ.
ఇంతకీ విద్య మంచిదేనా?
మనిషి పుట్టుకతోటే విద్యావంతుడు. కాని ఆ విద్య అతడి మనసులో మరుగునపడిపోయి ఉంటుంది. గురువు చెయ్యవలసిన పని ఆ స్మృతిని మేల్కొల్పడం. గురువూ, శిష్యుడూ నిరంతరం వివేకరక్తులుగా సంభాషిస్తూ, సంభాషిస్తూ ఉండగా, ఒకనాటికి, ఒక హఠాత్ క్షణాన, ఆ స్మృతి నిప్పురవ్వలాగా విద్యార్థిలో మేల్కొంటుంది.