ప్రసంగకళని దాటిన మధురనిశ్శబ్దం

కవిత్వం మొదటిదశలో ప్రసంగం, రెండవ దశలో పద్యం. కాని మూడవ దశలో ప్రార్థనగా మారాలి. ప్రసంగదశలో కవి ఉన్నాడు, ప్రపంచముంది. రెండవ దశలో కవి ఉన్నాడు, ప్రపంచం లేదు, కాని కవి అంతరంగముంది. మూడవ దశలో కవి కూడా అదృశ్యమై కేవలం అంతరంగమొకటే మిగలవలసి ఉంటుంది. అప్పుడు, అటువంటి దశలో, పలికిన మాటలు మంత్రాలవుతాయి.

డెరెక్ వాల్కాట్

కవి, నాటక కర్త, చిత్రకారుడు, డెరెక్ వాల్కాట్ (1930-2017) మొన్న మరణించాడు. కరీబియన్ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తీసుకువచ్చిన సమకాలిక కవి. సుమారు నాలుగుకోట్ల జనాభా ఉన్న 25 కరీబియన్ దీవులనుంచి సాహిత్యంలో నోబేల్ పురస్కారం పొందినవాళ్ళల్లో సెంట్ జాన్ పెర్స్ వి.ఎస్.నయిపాల్ తర్వాత వాల్కాట్ మూడవవాడు.