అస్పష్టసుస్వరవేదన

c13

మొన్న రాత్రి గంగారెడ్డి ఒక సెకండ్ హాండ్ పుస్తకాల షాపు నుంచి ఫోన్ చేసాడు. Literature of Western World మీదగ్గరుందా అని. అంతటితో ఆగకుండా రెండున్నరవేల పేజిల ఆ ఉద్గ్రంథాన్ని తీసుకొచ్చేసాడు. అది మాక్మిలన్ వాళ్ళ ప్రచురణ. రెండవ సంపుటం. నియోక్లాసిసిజం నుంచి మోడర్న్ పీరియడ్ దాకా కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు ఉన్నాయి.

ఆ పుస్తకాన్ని కొద్దిసేపట్లానే తడుముతూ ఉండిపోయేను. ఆ రాత్రి చీకట్లో పడి అతడట్లా ఆ పుస్తకాన్ని తెచ్చినందుకు ప్రతిఫలం ఏమివ్వగలనని ఆలోచించాను. పుస్తకం మరోసారి తిరగేసాను. అందులో ఆధునిక ఫ్రెంచి కవులు ఎనిమిది మంది కవిత్వం కూడా ఉంది. పాల్ వెర్లేన్ (1844-1896) కవితలేమున్నాయా అని చూసాను. మొదటి కవితనే అతడి సుప్రసిద్ధమైన కవిత My Familiar Dream ఉంది. సమ్మోహనకరమైన ఇంప్రెషనిష్టు పెయింటింగ్సులాంటి ఈ ఫ్రెంచి సింబలిష్టు కవితలొక్కటే ఉన్నా కూడా ఈ పుస్తకం నాకెంతో విలువైంది అన్నాను.

ఆ కవిత వినిపించాను. అది వింటూనే అతడు నిలువెల్లా కదిలిపోయాడు. మరొక కవిత, మరొకటి అంటూనే ఉన్నాడు.

గంగారెడ్డి, ఆ పుస్తకం నాకు కానుక చేసినందుకు ఇదిగో వెర్లేన్ కవితలు మూడింటిని నీకోసం తెలుగులో కానుక చేస్తున్నాను:

తరచూ వచ్చే కల

నాకు తరచూ చిత్రమైన తీవ్రమైన ఓ కల
వస్తూంటుంది, నేనెన్నడూ చూసిఉండని ఒకామె
కలలో ప్రేమిస్తూ కనిపిస్తుంది, నేనూ ఆమెని
ప్రేమిస్తుంటాను, ప్రతిసారీ కొత్తగా కనిపిస్తుంది.

రూపమదే. నా హృదయాన్ని వేధిస్తున్న
రహస్యం ఆమెకితప్పమరెవరికీ తెలీదనిపిస్తుంది.
మంచులాంటి అశ్రువులతో సేదతీరుస్తుంది,నా
నుదుటి స్వేదం తుడిచి నన్నుచల్లబరుస్తుంది.

ఆమె కేశపాశమా? ఎరుపు, రాగి, గోధుమ?
వర్ణమేదో తెలియదు, ఆమె పేరు కూడా. కాని
మనం ప్రేమించి, జీవితం దూరంగా తీసుకువెళ్ళి
పోయినవాళ్ళ పేరులాగా మధురం, మనోహరం.

చూపులంటావా? శిల్పంలాగా చూస్తుంది.
ఇక మాటలు, సంగీతం-సుదూరం, సున్నితం,
మనమింకెంతమాత్రం వినలేని ప్రియకంఠాల్లానే.

కురుస్తున్న అశ్రువులు

‘నగరం మీద మెత్తని వాన ‘
-రేంబో

నగరంలో వానలాగా, నా హృదయం
కూడా అశ్రువులు కురుస్తున్నది, ఇదేమిటి
ఇప్పుడీ సోమరివేదన? ఈ జలదరింపు
గుచ్చుకుంటూ గుండెను గాయపరుస్తున్నది?

పైకప్పుమీద, నేలమీద టపటపమంటూ
వాన చేస్తున్నసవ్వడి, ఓహో, వేదనలో
కుములుతున్న గుండెకి వాన చేసే
చప్పుడు మధురమనిపిస్తున్నది!

బెంగపడ్డ గుండెలో కన్నీళ్ళెందుకు
కురుస్తున్నవో ఎవరికి తెలుసు?
ప్రేమ ద్రోహం కాదుకదా
ఈ శోకమెందుకో ఎవరికి తెలుసు?

ప్రేమలేదు, ద్వేషం లేదు, అయినా
ఈ హృదయమెందుకు నలుగుతున్నదో
తెలియకపోవడమొక్కటే
దుర్భరమైన దుఃఖమనిపిస్తున్నది.

మెత్తని చేయి చుంబించగానే ఆ పియానో-

‘మీటకుండానే మోగుతున్న సంతోష సంగీతసుస్వరం’
-పెట్రస్ బోరెల్

మెత్తని చేయి చుంబించగానే ఆ పియానో
గులాబి-బూడిదరంగు సాంధ్యకాంతిలో
అస్పష్టంగా తళుకులీనుతున్నది.
నిశ్శబ్దపు రెక్కలమీద సమ్మోహనశీల
పురాతన పవనమొకటి
సుగంధభరితమైన ఆమె మందిరంలో
ఒకింత బెదిరినట్టు తచ్చాడుతున్నది.

చెప్పవూ, ఈ జోలపాటతో నా దుర్బలదేహాన్నిట్లా
ఎందుకని లయాత్మకంగా జోకొడుతున్నావు?
నన్నెందుకిట్లా అల్లరిపెడుతున్నావు?
ఆ చిన్నతోటలోకి సగం తెరిచిన కిటికీ దగ్గర
అదృశ్యమైపోతున్న ఓ అస్పష్టసుస్వరవేదనా
నువ్వేమి కోరుకుంటున్నావు?

7-1-2015

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading