చంద్రశేఖరరావు

304

డా.చంద్రశేఖరరావుని నేను మొదటిసారి చూసింది 1995 లో. అప్పుడు నేను పాడేరులో పనిచేస్తున్నాను. ఎలమంచిలిలో ఒక సాహిత్యాభిమాని ప్రతి ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారాలు ఆ ఏడాది చంద్రశేఖరరావు ‘జీవని’ కథాసంపుటి (1994) కి ఇచ్చాడు. పద్మ రాసిన కథలకు కూడా ఇచ్చినట్టు గుర్తు. ఆ సభలో పాల్గోడానికి, అక్కా, పద్మా, చంద్రశేఖరరావు వస్తే, నేను కూడా వెళ్ళాను. అప్పటికే నేను జీవని కథలు అక్కదగ్గర చదివాను. అవి చాలా ఆరోగ్యవంతమైన కథలు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఒక వైద్యుడు రాసిన కథలు.

మా మొదటిపరిచయంలోనే చంద్రశేఖరరావు నేను చాలా ఏళ్ళుగా తెలిసిఉన్నట్టే మాట్లాడేడు.’మీ గృహోన్ముఖంగా’ కథ చదివాకనే నాకు కథలు రాయాలనిపించింది’ అన్నాడు. ఆ రాత్రంతా మేం ఎలమంచిలిలోనో లేదా కాకినాడ ప్రయాణంలోనో ఎక్కడ గడిపేమో గుర్తులేదుగానీ, ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎంతో సౌజన్యం, మృదుత్వం కూడుకున్న మనిషి, అతడు మాట్లాడుతుంటే, మల్లెతీగమీంచి పువ్వులేరుతున్నంత కుశలంగానూ, సున్నితంగానూ ఉండింది. ఒక కవినో, రచయితనో చూస్తుంటే, ఇప్పుడే దేవలోకంలోంచి దిగారా అన్నట్టు ఉంటుంది అన్నారొక సాహిత్యాభిమాని ఒకప్పుడు. ఆ రోజు చంద్రశేఖరరావు ని చూస్తే నాకట్లానే అనిపించింది.

ఆ తర్వాత మళ్ళా, హైదరాబాదులో అక్క కథల సంపుటి ‘ఉత్సవసౌరభం’ ఆవిష్కరణ సభ, బహుశా, 1997 అయి ఉండాలి. కృష్ణారావుగారింట్లో ఆవిష్కరణ. ఆ మీటింగుకి వచ్చిన చంద్రశేఖరరావు, ఆ రాత్రి మా ఇంటికి వచ్చాడు. మాతో పాటే కలిసి భోంచేసాడు. అదొక పండగలాంటి సాయంకాలం. మరుపురానిది.

నేను శ్రీశైలం వెళ్ళాక, ఒక రోజు ఎక్కడ కలిసాడో గుర్తులేదు, తన ‘లెనిన్ ప్లేస్’ (1998) కథాసంపుటి ఇచ్చి సమీక్ష రాయమని అడిగాడు. రాసాను. వాసుదేవరావుగారు సుప్రభాతంలో ప్రచురించారు (1999). కాని ఆ కథలు, అంతకుముందు చదివిన ‘జీవని’ కథలకన్నా భిన్నంగా కనిపించాయి. అతడు ఏ దారిలో నడుస్తాడని నేనూహించానో , ఆ దారికన్నా వేరైన మరొకదారిలో అతడు నడుస్తున్నాడనిపించింది. కాని లెనిన్ ప్లేస్ హ్యూమన్ ప్లేస్ అయి ఉండవచ్చనుకున్నాను. అందుకని నా సమీక్షకి ‘హ్యూమన్ ప్లేస్ వైపు’ అని పేరుపెట్టాను. కాని, ఇలా రాయకుండా ఉండలేకపోయాను:

“..ఈ ‘జెల్లి ‘ స్థితికవతల ఒక పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన దేశకాలాలున్నాయని కథకుడు ఉండబట్టలేకచెప్తున్నప్పుడల్లా ఈ స్పష్టత బలంగా బయటపడుతూనే ఉంది.’ఎక్కడికి పోతావీ రాత్రి ‘ లో శంకరం బయటపెట్టినట్లుగా ‘నాకో శుద్ధమైన, సాంప్రదాయబద్ధమైన ఆరోగ్యకరమైన ప్రపంచం కావాలి! నాకో అమ్మ కావాలి! నాకో గృహం కావాలి! ఒకరికొకరు బందీలై ఉండే పురాతన సమాజం కావాలి .”

“కత్తులు, గొడ్డళ్ళతో నరకబడ్డ శరీరాల్ని చూపిస్తున్నప్పటికీ, అతడు కలలుగంటే, ‘పూలతోటలు, తెల్లని కొంగలు, సన్నని వానతుంపరలు, గుట్టలుగుట్టలుగా పరిచిన చామంతి పూలు, పాలు ప్రవహించే పిల్లకాలువలు, ధాన్యపు కల్లాలు పరిచిన ఆకాశం ‘కనిపించడంలోనే ఈ విశేషం ఉంది. అంతేకాదు, తనని వెన్నంటి ఉండేవేవో రచయితకి తెలుసు. ‘పాలపీకా, ఉగ్గిన్నెడు ఆముదం, ఉడకబెట్టిన కారెట్ ముక్కలు, చుక్కలమందు, ఒంటిపై సుగంధాలు విరజిమ్మే టాల్కం పౌడరు, లైఫ్ బాయ్ నురుగు, చలువచేసిన నిక్కరు వాసన, అన్నం బాక్స్ సర్దిన సంచి అందించే అమ్మ చేతులు, ఆ చేతులకు పూసిన పరిమళాలు.”

“తన చుట్టూ చెలరేగుతున్న మంటలూ, ఆ మంటల్లో మానవుడూ చంద్రశేఖర్ ని విచలితుణ్ణి చేస్తున్నారు. జీవితజ్వరం పట్టుకుంది ఆయన్ని. కాని ఆయన హృదయంలోని వెన్నలాంటి జీవశక్తికి ఆ మంటల వేడి సోకనివ్వకుండా కాపాడి పెట్టుకుని అక్కడక్కడా అప్పుడప్పుడూ తెరిచిచూపిస్తున్నాడు..”

నేను శ్రీశైలంలో ఉండగానే ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను. లతా పాటల కేసేట్ల సెట్టు ఒకటి, ఎందుకివాలనిపించిందో తెలీదుగానీ, ఇచ్చాను. ఒకసారి విశాఖపట్టణం వెళ్ళినప్పుడు త్రిపుర ‘కాఫ్కా కవితలు’ అనే తన కవితాసంపుటి ఇస్తూ, అది చంద్రశేఖర రావే పట్టుబట్టి ప్రచురింపచేసాడని చెప్పారు.

ఆ తర్వాత, ఆతడూ,నేనూ కలుసుకున్నవి, బహుశా క్షణాలే కావచ్చు, అవి కూడా రాను రాను మరింత అరుదుగా, వేళ్ళమిద కూడా లెక్కపెట్టడానికి చాలనంతగా అయిపోతూ వచ్చాయి. ఆ తర్వాత ఆయన రాసిన కథలు నాలుగైదు చదివానేమో. అవి నాకు పరిచయమైన చంద్రశేఖరరావు రాసినవికావు. మరొకదారి, మరొక వేదన. కాని ఆశ్చర్యంగా, అవే చంద్రశేఖరరావు మార్కు కథలు గా మారిపోయేయి. ఆయన రాసిన నవలలేవీ నేను చదవలేదు. ‘ఆకుపచ్చని దేశం’ అనే నవల్లో ‘వెలిగండ్ల రిజర్వాయర్ కింద ముంపుకు గురైన చెంచు గ్రామాల గురించి రాసాను, ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు మీగురించి తలుచుకున్నారు’ అన్నాడొకసారి నాతో. కాని, ఆ నవల కూడా చదవాలనిపించలేదు.

ఎప్పుడో అనుకోకుండా ట్యూన్ చేస్తూ ఉంటే, ఏదో పేరు తెలియని రేడియో స్టేషన్ నుంచి చక్కటి పాటలు వినిపించి, ఆ తర్వాత మళ్ళా ఎప్పుడు ట్యూన్ చేసినా ఆ స్టేషన్ ఎక్కడుందో దొరకనివాడిలాగా ఉంది, చంద్రశేఖర రావుతో నా పరిచయం. మధ్యలో హఠాత్తుగా ఏ గాలివాటునో ఒకటీ అరా సిగ్నల్సు తగిలేవిగానీ, ఊహించని పాటలతో నన్ను మైమరిపించిన ఆ రాత్రి నాకు మళ్ళా తారసపడలేదు.

నిన్న అక్కచెప్తోంది, అతడు తన నవలలన్నీ ఒక సంపుటిగా తేవాలనుకున్నాడనీ , దానికి నాతో ముందుమాట రాయించుకోవాలని అనుకున్నాడనీ.

ఏమో, బహుశా, నేనే నా ఆంటెన్నాను సరిచేసుకుని ఉండవలసిందేమో, మరింత శ్రద్ధగానూ, మరింత సున్నితంగానూ ట్యూన్ చేసుకుని ఉండవలసిందేమో. మనుషులు ఎంత విలువైనవాళ్ళో మరణం ద్వారా తప్ప మనకి తెలిసే మరో మార్గం లేదా!

10-7-2017

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading