అల్పక్షణిక కుసుమ కళిక

 

t1

పేరిసెట్టి శ్రీనివాసరావు గారు ‘అక్షర’ అనే సాహిత్య సంస్థకి వ్యవస్థాక కార్యదర్శి. తమ సంస్థ ‘అమర్ అక్షర’ అనే ఒక త్రైమాసిక సాహిత్యపత్రికను హిందీలో తీసుకువస్తున్నదనీ, ఈ సారి విశిష్ట సంచిక ఆవిష్కరణ నన్ను చెయ్యమనీ అడిగారు. ఆ ఆవిష్కరణ రాజమండ్రిలో ఉంటుందనీ, ఆ రోజు బైరాగి 91 వ పుట్టినరోజు పండగ కూడా చేద్దామనీ అన్నారు.

బైరాగి 90 వ జయంతి ఉత్సవం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు విశాఖపట్నంలో నిర్వహించి అప్పుడే ఏడాది గడిచిపోయిందా అనిపించింది. మళ్ళా ఈ సారి కూడా బైరాగి పుట్టినరోజునాడు మాట్లాడే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషమనిపించింది.

ఎందుకు బైరాగి నా హృదయానికి ఇంత చేరువగా ఉన్నాడు? కొందరు కవులో, మిత్రులో, సన్నిహితులో ఒకప్పుడు మనకి చేరువగా ఉన్నవాళ్ళు కాలం గడిచేకొద్దీ అదే ప్రభావశీలత్వాన్ని నిలుపుకోవడం కష్టం. ఆ తొలిరోజుల మహిమ వన్నె తగ్గుతుంది. వాళ్ళక్కడే ఉండిపోయినట్టూ, మనం చాలా దూరమే ప్రయాణించినట్టూ అనిపిస్తుంది. కాని, కొందరి విషయంలో కొన్ని ప్రభావాలు కాలాతీతం. శ్రీశ్రీకి గురజాడలాగా. ఒకసారి గురజాడ మీద రాయడానికి ఉపక్రమిస్తూ, మళ్ళా కొత్తగా గురజాడ మీద ఏమి రాయగలననుకున్నానుగాని, రాయడానికి కూచోగానే ఎన్నో కొత్త విషయాలు స్ఫురిస్తున్నాయని శ్రీశ్రీ రాసాడు. మొన్న రాజమండ్రిలో ఆనం రోటరీ హాల్లో, ‘అమర్ అక్షర’ పత్రిక ఆవిష్కరించేక, బైరాగి గురించి మాట్లాడటానికి లేచి నిలబడగానే, నాకు కలిగిన స్పందన కూడా అదే.

బైరాగి కవిత్వం గురించి ఎప్పుడూ చెప్పే మాటలే మళ్ళా మరొకసారి చెప్పాక, ఇప్పుడు, నా జీవితంలోని ఈ ఘడియలో ఆయన కవిత్వం నాకేమి చెప్తోందో నాకై నేను చెప్పుకోవడం మొదలుపెట్టాను. బిగ్గరగా, వాళ్ళందరి ముందూ, నాతో నేను మాట్లాడుకున్నాను. శ్రోతలు కొత్తవాళ్ళు, బైరాగి గురించి నేనెప్పుడూ చెప్పే మాటలు వాళ్ళకి కొత్తగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయని నాకు తెలుసు. కాని, నా పూర్వప్రసంగాల్ని మరోమారు పునశ్చరణ చెయ్యడానికి నేనక్కడికి పోలేదనిపించింది.

ఒకప్పుడు నా జీవితంలోనో లేదా రెండవ ప్రపంచ యుద్ధం అయ్యాక, తెలుగు సాహిత్యంలోనో బైరాగి కవిత్వం ఒక చారిత్రిక పాత్ర పోషించిందని చెప్పినందువల్ల ప్రయోజనమేమిటి?

అసలు గొప్ప సాహిత్యానికి రెండు దశలుంటాయి. మొదటిది,అదొక నిర్దిష్ట చారిత్రిక సందర్భంలో నిర్దిష్ట దేశకాలాల మధ్య ప్రభవిస్తుంది. కాని, ఆ తర్వాత, ఆ దశ గడిచిపోయేక, దేశంలోనూ, కాలంలోనూ ఘనతరమైన మార్పులు సంభవించేక, ఆ సాహిత్యానికి మరొక దశ మొదలవుతుంది. అందులో కాలాతీతమైందేదో ముందుకు రావడం మొదలవుతుంది. ప్రతి దేశానికీ, ప్రతి కాలానికీ వర్తించే సార్వకాలిక, సార్వజనీన సందేశాన్ని ఆ సాహిత్యంలో వెతకడం మొదలుపెడతాం. అయితే, ఆ సందేశమే ఆ సాహిత్యం తాలూకు సారాంశంగా నిలిచిపోతుందని చెప్పడానికి లేదు. ప్రతి యుగంలోనూ, ఆ సాహిత్యాన్ని మరొకసారి కొత్తగా, ఎప్పటి అవసరరాలకు తగ్గట్టు అప్పుడు మళ్ళా వ్యాఖ్యానించడం జరుగుతూనే ఉంటుంది. రామాయణమూ, షేక్స్పియరూ, ఇలియటూ కాలం గడిచే కొద్దీ మళ్ళా మళ్ళా కొత్తగా ప్రభవిస్తూనే ఉంటారు.

నేను నా ఆధునిక కవిత్రయంగా ప్రస్తావించే గురజాడ, శ్రీ శ్రీ, బైరాగి కూడా అంతే. వాళ్ళ వాళ్ళ కాలాల్లో, వాళ్ళ సాహిత్యం చారిత్రికంగా నిర్వహించిన పాత్ర చాలా గొప్పది, శక్తిమంతమైంది. కానీ, ఆ చారిత్రిక సందర్భం నుంచి బయటకు వచ్చి, నేనున్న కాలానికీ, నా జీవితానికీ కూడా దారిచూపగల సందేశం ఆ సాహిత్యాల్లో ఉంది. గురజాడ సాహిత్యం చెప్తున్నదేమిటో, చలంగారు మూడు మాటల్లో చెప్పారు. ‘ఆశయంగా చూపించగింది మానవుడి మీద ప్రేమ’ అని. ఇరవయ్యవ శతాబ్దమంతా ప్రేమ రహితమైన రాత్రి లాగా ఉందనీ, బహుశా అది చరమరాత్రి కాబోతున్నదా అనీ శ్రీ శ్రీ వేదనపడ్డాడు. నిజమైన ప్రేమ కోసం వెతుక్కుని, అది పెట్టుబడిదారీ సమాజంలో దొరకడం కష్టమని చెప్పడమే శ్రీ శ్రీ జీవితకాలం పాటు చేసిన పని.

ఇక ఇంతకీ ప్రేమ అంటే ఏమిటని ప్రశ్నించడం బైరాగి కవిత్వం.

తన కాలందాకా, సాహిత్యం, తత్త్వశాస్త్రం, సామాజిక స్పృహ, మానవుడి మీద ప్రేమకీ, జీవితానికి ఏదో ఒక అర్థం ఉన్నాయని చెప్పుకోవడానికీ మధ్య అభేదం చూసాయి.ఇంకా చెప్పాలంటే, మానవుణ్ణి ప్రేమించాలంటే, ఆ ప్రేమకి కూడా ఒక అర్థం చెప్పుకోవాలనుకున్నాయి. కాని బైరాగి దృష్టిలో, అర్థం చెప్పుకోవడం కన్నా కూడా ముందు మనిషి పట్ల మనిషికి కలగవలసిన, కలిగే ఆత్మీయత చాలా ముఖ్యం. యూరోప్ లో అస్తిత్వవాదులు (తెలుగు ‘అస్తిత్వవాదం’ కాదు) దీన్నే existence precedes essence అన్నారు. బైరాగి ఆలోచనకి కూడా అదే పాదు. కాని, ఆయన కవిత్వం అక్కడితో ఆగిపోలేదనే ఆ రోజు నా చెవిలో ఎవరో పదే పదే చెప్తున్నారు.

అస్తిత్వవాదులు సారాంశాన్ని పక్కకు నెట్టారు కాని, ‘బాధ్యత’ ని ముందుకు తీసుకొచ్చారు. బాధ్యత అనే భావన కూడా మళ్ళా ఏదో ఒక రూపంలో జీవితానికి అర్థం చెప్పుకోవడమే అవుతుంది. కాని, బైరాగి బాధ్యత బదులు ప్రేమ గురించి మాట్లాడేడు. నువ్వూ, నీ తోటి మానవుడూ భగవంతుడి బిడ్డలు కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనడం పూర్వయుగాలు చెప్పిన మాట. నీ తోటిమనిషికి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్యాయం జరుగుతోంది కాబట్టి నువ్వతణ్ణి ప్రేమించాలనడం ఆధునిక యుగాలు చెప్తున్న మాట. నువ్వు నీకేది మంచిదో దాన్నే ఆచరిస్తావు కాబట్టి, అందులో అప్రయత్నంగానే నీ తోటిమనిషి మేలు కోరుకుంటావనేది అస్తిత్వవాదులు చెప్పినమాట.

బైరాగి కూడా ఈ మాటలన్నీ మాట్లాడతాడు, కాని ఇక్కడితోటే ఆగిపోలేదు. ఒక అర్థం వెతుక్కుని ప్రేమించడంలో అర్థం లేదని ఆయన గ్రహించాడు.

‘ప్రేమను ప్రేమించలేవు, అది వంచన’

కానీ,

‘ఏదీ ప్రేమార్హం కాదు’

కాని

‘నరుడు ప్రేమతోటి స్పందించని శూన్యంలో బ్రతకలేడు.’

‘మరి భీకర శోకగ్రస్త లోకంలో ,
శూన్యంలో, దైన్యంలో
ప్రేమ ఎలా బతుకుతుంది?’

ఇదే బైరాగి జీవితకాలం పాటు వేసుకున్న ప్రశ్న. ఆయన కవిత్వమంతా ఈ ‘నిత్య నిరుత్తరపు ప్రశ్న’ కు ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా సమాధానం చెప్పుకోవడానికి చేసే ప్రయత్నమే.

మతాలు బోధించే ప్రేమకి ప్రవక్తల ప్రేమ ఉదాహరణ. కాని

‘బుద్ధుడు, క్రీస్తు వారు వేరు
గాలిలాగు, వెలుగు లాగు, జాలిలాగు వారి ప్రేమ!
వారల అడుగుజాడలు వెలిగిన చోట
అవిరళ వర పరిమళాల దివ్యసీమ
కాని ఇచట సీమిత హృదయనికుంజాల విరళచ్ఛాయ
ప్రేమ ఒక అల్పక్షణిక కుసుమ కళిక
గాలివోలె, జాలివోలె, సువర్ణ కిరణాల వోలె
సహజసులభం కాదు ప్రేమ.’

కాని ప్రేమిస్తాం మనం.

జీవితానికి ఏదో ఒక అర్థం చెప్పుకోవాలనుకునే కోరికకి ప్రధాన కారణం మృత్యువు. మనం నశించిపోతామనేది మనం భరించలేని విషయం. కాబట్టి అంగీకరించలేనిది కూడా. అందుకని ఈ జీవితానికొక అర్థం చెప్పుకోకుండా ఉండలేం. మన సంతానం, మన మతాలూ, మన సిద్ధాంతాలూ అన్నీ మృత్యుభీతిలోంచే పుట్టుకొచ్చాయి. కాని, మృత్యువు పట్ల బైరాగికి ఇటువంటి భీతి లేదు.

‘ఏమంటే ఏదీ చావదు ఇచట, ద్రవ్యంలోంచి రూపంలోకి
రూపంలోంచి భావంలోకి
ఓజంలోంచి తేజంలోకి, తేజంలోంచి ఓజంలోకి,
మరణం మౌనంలోంచి జీవనవిరామం లోకి
రూపం మారుతున్నది ఒకే శక్తి..’

ఆయనకి మృత్యుభీతిలేదుగాని, జీవితభీతి ఉన్నది.

‘మృత్యువుని చూసి కాదు, జీవితాన్ని చూసి జంకుతున్నాను’

ఎందుకంటే, మృత్యువు సహజంగా సంభవిస్తే, అది ప్రకృతి, దానిలో విషాదం లేదు. కాని, జీవితానికొక అర్థం చెప్పుకునే క్రమంలో సంభవించే మృత్యువు (మరణమూ, ఆత్మహననమూ కూడా) అసహజమే కాదు, భయకారకాలు కూడా.

మృత్యువు వల్ల, మృత్యువు ఎదట, మనం ప్రేమించుకుంటే, ఆ ప్రేమకి అర్థం లేదు. మనం మరణిస్తాం, అది నిశ్చయం, మనం మరణించాక, ఏదైనా మిగలవచ్చు, మిగలకపోవచ్చు, అయినా కూడా ప్రేమించగలవా? ప్రేమించడానికొక అర్థముండి కాదు, అసలు ఏ అర్థం తోనూ నిమిత్తం లేకుండా ప్రేమించగలవా?

కాని మనం ప్రేమించకుండా ఉండలేం.

‘నరునికి మూలమంత్రం ప్రేమ.’

కాని-

‘అస్థికాండ చ్ఛిద్రాల్లోన
రుధిరమురళీ నాళాల్లోన దాగిన గానం కొరకు
ప్రాణం లోని ప్రాణం కొరకు
వెదుకవలదా? అసలది ఏదైనా కలదా?
అది ఏదీ లేదనుకో-
.. అన్నీ వమ్మే కాదా?
అన్నీ వమ్మే, కడకది పిడికెడు దుమ్మే కాదా!’

అయితే అలాగని ఆయన జీవితానికొక అర్థం చెప్పడానికి పూనుకోలేదు, ఎందుకంటే అటువంటి అర్థం అంతిమంగా అనర్థమే కనుక. అటువంటి అర్థం లేదనిపించినప్పుడు, మనమొక ప్రేమరహిత చరమరాత్రిలో కూరుకుపోతామనే ఇరవయ్యవ శతాబ్ది మహారచయితలంతా చెప్తూ వచ్చారు. కాని, బైరాగి ఏమంటాడంటే-

‘ఇది తలచిన నా ఎముకలు నీ కౌగిలిలో కూడా
కడపటి చలిలో గడగడ వణుకుతాయి.’

సహజమే, కాని, అక్కడితో ఆగడు-

‘తల్లి కడుపులో దాగే పిల్లనిలా, నా చేతులు
నిన్నింకా దగ్గరగా వెతుకుతాయి.’

ఇదొక మహావాక్యం. మనం ఎందుకు ప్రేమిస్తామంటే, జీవితానికి అర్థం స్ఫురించినందువల్ల కాదు, అర్థం లేదేమోననే మృత్యుభీతివల్ల కూడా కాదు, మనం ప్రేమిస్తాం, బతుకులాగా, చావులాగా, ప్రేమ కూడా ప్రాణసహజం, ప్రాణిసహజం. ఏదో ఒక అర్థముండి కాదు, ఒక ప్రయోజనముండి కాదు, లేదా ఒక తల్లి శిశువుని ప్రేమించినట్టు మమకారం వల్ల కాదు, ఒక పురుషుడు స్త్రీని ప్రేమించినట్టు, మోహం వల్ల కాదు.

ప్రేమించకుండా ఉండలేం కాబట్టి ప్రేమిస్తాం, బాధ్యత వల్ల కాదు, పార్టీ తీర్మానం చేసినందువల్ల కాదు, అనిర్వచనీయ నైతికతవల్ల కాదు, మనం ప్రేమించకుండా ఉండలేం కాబట్టి ప్రేమిస్తాం.

ఒక గర్భస్థ శిశువు తల్లిని అనుభూతి చెందినట్టు, లాజర్ మరణించాడని తెలియగానే యేసుకి కన్నీళ్ళు స్రవించినట్టు, మనం ప్రేమిస్తాం. అది మన మానుషత్వం, మన మానవత్వం.

7-9-2016

arrow

Painting: Tagore

Leave a Reply

%d bloggers like this: