కళాప్రారంభవేళ

మానవదేహాలు, ముఖాలు, కళ్ళు మటుకే కాదు, వీథుల్లో, రెస్టరెంట్లలో, రైళ్ళల్లో, ఆఫీసుల్లో, నిర్మాణస్థలాల్లో ప్రతి ఒక్కచోటా పోగుపడే మనుషులే అతడి కావ్యవస్తువు. ఆ మనుషులు ఏకకాలంలో నిర్దిష్టవ్యక్తులుగానూ, స్థలాతీత, కాలాతీత వ్యక్తులుగానూ కూడా కనిపిస్తున్నారు.

మాధ్యమాలు

నా నీటిరంగుల చిత్రలేఖనం మీద పూజ్యులు గణేశ్వరరావుగారు నిన్న రాసిన మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. నా ఇరవయ్యేళ్ళ వయసులో నా కథలు చదివి కాళీపట్నం రామారావుగారు రాసిన ఉత్తరం నాకెంత స్ఫూర్తి కలిగించిందో, ఇప్పుడు ఈ మాటలు నాకంత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నా సాధన కొనసాగించడానికి మళ్ళా కొత్తగా ఒక ప్రోద్బలం దొరికింది.

రెజిన్ మాధ్యమం

మిత్రురాలు స్వర్ణలత తన సోదరి ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేస్తోందనీ, ఆ ప్రారంభోత్సవంలో నన్ను కూడా ఉండమనీ అడిగితే వెళ్ళాను. నిన్న మధ్యాహ్నం ఐకాన్ ఆర్ట్ గాలరీలో ఆ ప్రదర్శనని నా మిత్రుడూ, సహాధ్యాయీ, ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వంలో డైరక్టరు జనరల్ ఆఫ్ పోలీసు గా ఉన్న మహేందర్ రెడ్డి ప్రారంభించారు. నా అత్మీయమిత్రుడూ, కవీ, గాయకుడూ సుద్దాల అశోక తేజ, కవి, చరిత్రపరిశోధకుడూ సిరామోజు హరగోపాల్ కూడా ఆ వేడుకలో పాలు పంచుకున్నారు.