
శివసాన్నిధ్య సుఖం
2
ధూళి దర్శనం
మేం సుండిపెంటకి చేరేటప్పటికి మధ్యాహ్నం మూడున్నర అయింది. మా కోసం మా మిత్రబృందం రాజు, రెడ్డి, షణ్ముగం, శ్రీనివాస్, దానం ఇరిగేషన్ గెస్ట్ హవుస్ దగ్గర వేచిఉన్నారు. ఇంత ఎండవేళ ప్రయాణం నాకు కొత్తగాదుగాని సుచి మొహంలో అలసట తెలుస్తూనే ఉంది. కాని వేడి మిళితమైవున్నప్పటికీ గాలులు తాకుతూండటంతో ఉక్కగాని, చెమటగాని లేవు.
మా భోజనాలు, భోజనవిరామం అంతా అయిన తర్వాత అయిదు కావొస్తూండగా “ఇప్పుడు మనం ముందు శిఖరేశ్వరం వెళ్లాం” అన్నారు మిత్రులు. శ్రీశైలానికి తూర్పునుంచీ, దక్షిణం నుంచీ వచ్చే యాత్రీకులందరికీ మొదట దర్శనమిచ్చేది శిఖరేశ్వరమే. సాయంకాలపు ఎండ తీక్షణత తగ్గి గాలుల్లో సంధ్యామాధుర్యం అలమికుంటూండగా ఏడెనిమిది కిలోమీటర్ల ఘాట్ మలుపుల్లోంచి శిఖరం చేరుకున్నాం.
“సముద్రమట్టానికి దాదాపు రెండువేల అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరం నల్లమల అడవులంతటికీ కేంద్రబిందువు. యాత్రీకులు ఈ కనుమల్లోంచి, లోయల్లోంచి, కొండవాలుని పట్టుకుని వందలాది మైళ్లు నడిచి ఇక్కడకు చేరగానే ఈ శిఖరస్థానం మీంచి దూరంగా లోయలో శ్రీశైల దేవాలయగోపురాలు కనబడగానే ఎటువంటి సాఫల్యానుభూతికి లోనై ఉంటారో ఊహించు. జీవితకాలపు అన్వేషణ నెరవేరినట్టుంటుంది కదూ. అందుకే శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదనిపించింది మన పూర్వీకులకి. ..
సుచి నా మాటలు వినడం లేదు. ఆమె లేడిపిల్లలా అటూఇటూ చెంగున గెంతుతోంది.
ఎటుచూసినా కనుచూపు మేర వరకూ పత్రహరిత మహార్థవంలా ఉన్న దూరదిగంత పరివ్యాప్తమైన ఆ అడవులు, ఆ నీలిపర్వతశ్రేణి, ఆ మధ్యగా నదీపరీవాహరేఖ, గుండెలనిండా ఆస్వాదించుకున్న మధురానుభూతిలాంటి జలాశయం, ఆకాశపత్రం మీంచి జారుతున్న మంచుబిందువులాంటి సంధ్యాసూర్యబింబం- ఇటువంటి మహిమాన్వితమైన సుందరదృశ్యం చూసి పరవశించనివారు ఎవరుంటారు?
“ఆదిశంకరులు ఇటువంటి సంధ్యాసమయంలోనే శ్రీశైలదర్శనం పొంది ఉంటారు. ఆయన పొందిన పారవశ్యం శివానందలహరిగా మారింది. సుచీ, ఈ శ్లోకం విను:
సంధ్యారంభ విజృంభిత శ్రుతి శిరః స్థానాంతరాధిష్ఠితమ్
సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితమ్
భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతమ్
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్
నేను శ్లోకం పూర్తి చేస్తుండగానే ‘సంధ్యారంభవిజృంభితం’ అన్న మాట ఎంతబాగుంది, నిజంగానే ఈ సంధ్యారంభవేళ నాలో ఏదో చెలరేగుతునృట్టే వుంది” అంది సుచరిత. ఆమె నల్లనికన్నుల్లో వింతవెలుగు. ఆమె ముంగురులపైన సంధ్యాసూర్యకిరణాలు పొడుగ్గా వాలి తామ్ర శోభతో మెరుస్తున్నాయి.
ఆకాశపు అంచు మీంచి అవనతమవుతున్న కొద్దీ సూర్యబింబం క్షణక్షణం వింతశోభతో రంగులుమారుతోంది. “అల్పమైన దానిలో సుఖం లేదు, భూమి అంతా ఆవరించిఉన్నదేదో అదే సుఖమయం” అని ఉపనిషత్ చెప్పిందానికి బుజువుగా నలుదిక్కులా పర్వతాల వరస, ఆ పైన ఆవరించి, దూరంగా జరుగుతున్న సాయంసంధ్యారశ్మి, ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న ఫాల్గుణపూర్ణిమ మహాశివస్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
“మామయ్యా, నువ్వు ఉమామహేశ్వరం నుండి అడవిని చూపించినప్పుడు కిటికీ తెరచి చూసినట్లుంది. ఆ తర్వాత వెళ్లామే ఫరహాబాదు, అక్కణ్ఞంచి చూస్తుంటే తలుపుల తెరలు ఓరగా తొలిగించి చూసినట్లుంది. కాని ఇప్పుడిక్కణ్ణుంచి చూస్తుంటే నాలుగువైపులా తలుపులన్నీ బార్లా తెరిచి కళ్లారా చూసినట్లుంది. ఇటువంటి సంధ్యాదృశ్యాన్ని ఒకసారి చూడటానికి నోచుకోక పోయినా, ఈ అనుభవానికైనా మళ్లా మళ్లా పుట్టకతప్పదు సుమా” అని సుచి అంటుంటే ఆ మాటలు సర్వేశ్వరసాన్నిధ్యమంటే తెలిసిన భక్తుల మాటల్లా అనిపించాయి.
శిఖరం దగ్గర మైక్రొవేవ్ రిపీటర్‌స్టేషన్ పక్కన ఒక్క ఆకు కూడా లేని తెల్లనికాండం వున్న చెట్టుని చూపించి అదేమిటని అడిగింది. “దాన్ని తపసి చెట్టంటారు. కోవెల చెట్టనికూడా అంటారు. దాన్నుంచి వచ్చే జిగురు గిరిజన కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. ఏటా దాదాపు అరవై లక్షల రూపాయల విలువైన జిగురు చెంచువాళ్లు సేకరిస్తారు. అత్యంత పురాతనమైన ఆ తెగకి ఇప్పటికీ ఇదే ప్రధాన జీవనాధారం’ అన్నాను.
సుచి ఆ చెట్టుని తాకి చూసింది. ‘ ఓ, వండర్ ఫుల్. ఈ చెట్టు పక్కన ఈ రిపీటర్ స్టేషన్. పాతకొత్తలమేలుకలయిగ్గా లేదూ” అంది. ఆమెకి ఏది అనుభవమవ్వాలని నేను ఈ యాత్రని సంకల్పించానో ఆ అనుభూతి ఆమెకి ఇంత త్వరగానే అందడం నన్ను చకితుణ్ణి చేసింది.
శిఖరేశ్వరం నుండి సంధ్యాహారతి అందుకోవాలని మిత్రబృందం మమ్మల్ని శ్రీశైల దేవాలయానికి పరుగులు పెట్టించారు. కారు అంగళ్ల మధ్య మలుపు తిరిగేటప్పటికే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లో మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి. మేం ఆతృతతో పరుగు పరుగున శివాలయంలో అడుగు పెడుతుంటే ‘మనం స్నానం కూడా చేయకుండా ఇలా గుళ్లో ఎలా అడుగుపెడతాం” అనడిగింది సుచి.
“ఇదే, ఈ స్వామి విశిష్టత. నువ్వు సరాసరి దుమ్ము కొట్టుకున్న నీ పాదాల్లోనే, నీ మార్గాయాసంతోనే నేరుగా ఆయన్ని పలకరించవచ్చు. దీన్నే ధూళిదర్శనమంటారు. తన దర్శనం కోసం ఎన్నో మైళ్లు అడవుల్లో, కొండల్లో పడివచ్చిందే నిజమైన శ్రద్ధ. ఇక ప్రత్యేకనియమ బంధాలెందుకులే అనుకునే స్వామి ఈయన” అన్నాను.
‘దెన్ హి ఈజ్ ట్రూలీ ఏ పీపుల్స్ గాడ్” అంది సుచి.
సాయంసంధ్యావేళ మంగళవాద్యాల నడుమ ఆ గర్భాలయంలో ఒకటి, అయిదు, తొమ్మిది, పదకొండు, ఇరవై ఏడు ఒత్తులతో ఒకదాని వెనక ఒకటి హారతిస్తూండగా అది చూడటమే నిజమైన కన్నుల పండగ. హారతి ఐన వెంటనే శివలింగాన్ని నుదుటితో తాకి నమస్కరించి, ఆ పైన అమ్మవారి గుడిలో హారతి అందుకున్నాం.
హారతి ముగిసిన వెంటనే అమ్మవారి కొలువు ప్రారంభమైంది. అక్కడకు వచ్చిన భక్తులందరినీ సాదరంగా కూర్చోమన్నారు అర్చకులు. అప్పుడు వారు మొదట నాలుగువేదాలనుంచీ సూక్తాలు వినిపించారు. ఆ తర్వాత క్రమంగా ఉపనిషత్తులు, పాణిని, కావ్యాలు, అలంకారశాస్రాల నుండి కొన్ని శ్లోకాలు వినిపించారు. ప్రతి ఉచ్చాటన ముగిసిన వెనకా పరాకులు చెప్పారు. చివరగా పంచాంగం తీసుకుని తిథివారనక్షత్రాలు చెప్పారు.
అప్పుడు అపూర్వగాత్రమాధుర్యం తొణికిసలాడుతున్న భక్తురాలొకామె ‘భ్రమరాంబికాష్టకమ్’ గానం చేసింది. అర్చకులు మరొక్కసారి హారతిచ్చి మంత్రపుష్పం వినిపించారు. దర్శనాలు మొదలయ్యాయి.
శిఖరేశ్వరంలో సంధ్యారంభవేళ ప్రారంభమైన సూక్ష్మలోక జాగృతి అమ్మవారి దర్శనంతో పరిపూర్ణంగా వికసించి పాపహరం చేసి మమ్మల్ని పరిశుభ్రపరిచినట్టనిపించింది. అప్పుడు గుడి ప్రాంగణంలో నడుస్తూ దేవాలయ చరిత్ర చెప్పడం మొదలుపెట్టాను.
“అనాదినుండీ ఈ శ్రీపర్వత-శ్రీశైల సముదాయ పర్వతశ్రేణి తూర్పు పశ్చిమాలకు, ఉత్తరదక్షిణాలకు నడుమ సంస్కృతి సేతువుగా ఉంటూవచ్చింది. ఇప్పుడు నాగార్జునకొండగా పిలవబడుతున్న శ్రీపర్వతం ఇక్ష్వాకులనుండి విష్ణుకుండినులదాకా సాంస్కృతిక కేంద్రం. అప్పుడు కూడా శ్రీశైలం ఆరాధనా కేంద్రంగా ఉండిఉండవచ్చు. ఏమంటే పాతరాతియుగపు మానవసామాజిక అవశేషాలెన్నో ఈ చుట్టుపక్కల బయటపడ్డాయి”
“అసలు శ్రీశైలక్షేత్రమంతా నీటిబుగ్గలమయం. ఇక్కడ ఆది ప్రతిష్ఠ అమ్మవారిదో, స్వామివారిదో చెప్పలేం. అసలు అమ్మవారు ఆదిమానపుడి అమ్మతల్లి రూపమే అయిఉండవచ్చు. లేదా స్వామివారు ఆదిమద్రావిడ రూపమైన పశుపతి కావచ్చు. కాని శివశక్తి సన్మిలనకేంద్రంగా ఇది క్రీస్తుశకం ఆరేడు శతాబ్దాలనాటికే ప్రాచుర్యంలోకి వచ్చింది”
“శ్రీపర్వతం కేంద్రంగా సంస్కృతి ఉత్తరానికీ, తూర్పుకీ వ్యాపిస్తే, శ్రీశైలసందేశం దక్షిణానికీ, పశ్చిమానికీ ప్రసరించింది. మొదట చోళ-చాళుక్యుల మధ్య శ్రీశైలం కోసం మొదలైన పోరు ఆ తరువాత వెలనాటి దుర్జయులు, కాకతీయులు, రెడ్డిరాజులు మొదలైన రాజవంశాల ఆదరణలో బలపడి విజయనగరరాజుల కాలంలో గొప్ప వైభవాన్ని చవి చూసింది”
“శ్రీకృష్ణదేవరాయల ప్రత్యేక ఆదరణకి ఎంతనోచుకుందంటే ఆలయప్రాంగణంలో ఆయన తననీ, తన దేవేరుల్నీ చిత్రీకరించుకున్నాడు. శివభక్తుల పాదస్పర్శకి ఆ చిత్తరువు నోచుకున్నంతకాలం తనకి శివసాయుజ్యమనే ఆయన కోరుకున్నాడు!”
అక్కణ్ణుంచి ముందుకు తీసుకువచ్చి దేవాలయముఖమండపాన్నీ, మధ్యలో శనగల బసవన్ననీ చూపించి, ఆ ముందుగల వీరశిరోమంటపం ఎదటకి రాగానే నా ఒళ్లు జలదరించింది.
“దీన్ని వీరశిరోమంటపం అంటారు. శివభక్తులు తమ శ్రద్ధాతిశయంలో తమ కళ్లనీ, చేతుల్బ్నీ శరీరాంగాల్నీ, చివరికి తమ శిరసుల్నీ శివుడి కొరకు అర్చించిన మంటపం. దీన్ని పధ్నాలుగో శతాబ్దిలో అనవేమారెడ్డి కట్టించాడు. దీని గురించి చెప్పేటప్పుడు పాల్కురికి సోమన ఎటువంటి వీరావేశంతో చలించిపోతాడనుకున్నావు!”
“పరుల కీర్తించు పాపంబు నాలుకల
హరుని కీర్తించుట న్యాయమన్నట్లు
నాలుకల్ గ్రోసి పినాకిచే గ్రొత్త
నాలుకల్ వడసి వర్ణన సేయువారు…
తలలేని శివుడని తలగాని బ్రదుకు
తలలేదనెడు మాడ్కి తలలిచ్చువారు..
ఆలయం నుండి బయటకు వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. తిరిగి గెస్ట్ హవుస్‌కి వెళ్లబోతూండగా “ఇక్కడికి వచ్చే యాత్రీకులందరికీ వసతి సౌకర్యాలు ఎలాగ?” అని అడిగింది సుచి.
అప్పుడు దేవస్థానం వారూ, వివిధ కులాలవారూ నిర్వహిస్తున్న కాటేజీల గురించీ, సత్రాల గురించీ వివరించేను. ఏదయినా ఒక సత్రం ఎలా ఉంటుందో చూపించమంటే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న కరివేన సత్రానికి తీసుకువెళ్లాను.
సత్రంలోని వేదపాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు అప్పుడే తమ సాయంకాల అధ్యయనం ముగించారు. వారితో పాటు రాత్రి భోజనం చెయ్యవలసిందిగా మేనేజరుగారి అభ్యర్థన. మేం వచ్చేటప్పుడు సత్రంవారు ప్రచురించిన విజ్ఞానసర్వస్వం నాలుగు సంపుటాల సెట్ వారు మాకు బహూకరించారు.
బయట కాముని పున్నమి. లోకపాపాన్ని ప్రక్షాళనం చేస్తున్నట్టుగా వెన్నెల. దేవస్థానమంతటా శివరాత్రి ఉత్సవం ముగిసిన ఆనవాళ్లు. ఉగాది కోసం ఎదురుకోళ్లు. కర్ణాటకనుండి భక్తులసందడి అప్పుడే మొదలయ్యింది. అక్కడొక పూసలమ్మేవాడితో సుచి మాటల్లో పడింది.
తిరుపతికి చెందిన ఆ పూసలాయన పండగకోసం ఇక్కడికి వచ్చాడట. అతని ఎదుట పరచిఉన్న రుద్రాక్షల గురించి ప్రశ్నించబోతే తన సంచిలో గుడ్డలమడతల్లో పద్మభూషణ్ డా.ఆర్.కె. శర్మ రాసిన ‘ద ఐ ఆఫ్ రుద్రాక్ష’ అనే పుస్తకాన్ని చూపించాడు! రోడ్డుమీద పూసలమ్ముకునేవాడి భాండాగారంలో ఇంత విజ్ఞానం దాగిఉంటుందని ఊహించగలమా?
ఆ రాత్రి రిజర్వాయర్‌లో వెన్నెల్లో బోటింగ్ ఏర్పాట్లు చేయడానికి మిత్రబృందం గట్టి ప్రయత్నమే చేసారు. కాని భద్రతాకారణాలవల్ల వీలుపడలేదు. ఎన్నో రాత్రులు చిన్నపడవల పైన ఆ నిశ్చలజలాశయంలో గడిపిన ప్రశాంతక్షణాలు నన్ను మళ్లీ ఆ అనుభవం కోసం ఎంతో ప్రలోభపరిచాయి.
లోకమంతా కామదేవుని దహనోత్సవం జరుగుతోంది. ఈశ్వరుణ్ణి ‘కామదహన కరుణాకర లింగం’ అన్నాడు కవి. కామదహనం నిజంగా ఎంత దయాభరితం. కాని సుందరానుభవాల గురించీ, మధురసాన్నిధ్యాలగురించీ, మనోసాంగత్యాల గురించీ నా ప్రలోభం ఎంతకూ అంతరించదేమి? శివమయమైన ఈ సన్నిధిలో సుందరానుభవం గురించిన నా తపనని శివసాన్నిధ్యసుఖంగానే అర్థం చేసుకోవాలా?
‘అస్మదాది కవుల పాఠకుల వాక్పావనకరము, భవత్పణికరము, దుర్భర కర్మహరము, శుభసముత్కరము, విశ్రుత సౌఖ్యకరము’ అని శ్రీపర్వతాన్ని కీర్తించిన కవి కూడా నా వంటి భావుకుడే కదా, మరీ రసలుబ్ధతనుంచి ఆయనెట్లా తప్పించుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం చిక్కేవరకూ నేను శ్రీశైలానికి తిరిగితిరిగి రాకతప్పదేమో.
The Bliss of Shiva’s Presence
2
With the Dust Still on the Feet
It was half-past three in the afternoon when we arrived at Sundipenta. Our friends Raju, Reddy, Shanmugam, Srinivas, and Danam were waiting for us near the Irrigation Guest House. Travelling under a harsh afternoon sun was nothing new to me, but the weariness showed plainly on Suchi’s face. However, though the air carried the daytime warmth, gentle mountain breezes kept away any feeling of stifling humidity or sweat.
After finishing our late lunch and resting a while, as the clock approached five, our friends proposed: “Let us first head to Shikhareswaram.” For pilgrims arriving at Srisailam from the east and the south, Shikhareswaram is the very first sacred sight. As the sun’s sharpness softened and twilight’s sweet calm settled into the air, we negotiated seven to eight kilometers of winding ghat roads and reached the peak.
“Rising almost two thousand five hundred feet above sea level, this summit is the very nerve center of the entire Nallamala range,” I explained. “Imagine the profound sense of fulfillment pilgrims must have felt after walking hundreds of miles through these mountain passes, gorges, and slopes on foot, when, standing atop this peak, they caught their first glimpse of the temple spires of Srisailam far down in the valley! It must have felt like the crowning reward of a lifetime’s quest. That is why our ancestors believed that a mere glimpse of Srisailam’s peak liberates one from the cycle of rebirth.”
Suchi was not listening to my words. She was leaping joyfully here and there like a young doe.
And who would not be spellbound by such an awe-inspiring scene? Everywhere the eye could see, extending to the distant horizon, lay an emerald ocean of endless forests, rolling blue mountain ridges, the winding silver ribbon of the river, the reservoir resting like a sweet, deeply savored memory, and the setting sun sliding down the parchment of the sky like a glowing drop of dew.
“It must have been at such a twilight hour that Adi Shankara first beheld Srisailam,” I remarked. “The ecstasy he experienced transformed into his immortal poem, Shivanandalahari. Suchi, listen to this verse:
Sandhyārambha vijṛmbhitam śruti-śiraḥ-sthānāntarādhiṣṭhitam
Saprema bhramarābhirāmam asakṛt sad-vāsanā-śobhitam
Bhogīndrābharaṇam samasta-sumanaḥ-pūjyam guṇāviṣkṛtam
Seve śrī-giri-mallikārjuna-mahā-lingam śivālingitam
Even as I finished reciting the verse, Sucharitha murmured, “How exquisite is that phrase, Sandhyarambha vijrimbhitam—awakened at the onset of twilight! Truly, as twilight descends, something within me seems to stir and blossom.” A curious light danced in her dark eyes. The long, leaning rays of the evening sun rested upon her hair, shimmering with a warm copper glow.
As the sun sank along the edge of the sky, its disc changed colors every second with magical radiance. As if bearing witness to the Upanishadic truth—“There is no enduring joy in the small and finite; that which is boundless and encompasses the whole earth alone is true joy”—the mountain ranges on all four sides, the shifting twilight glow receding into the distance, and the rising full moon of Phalguna unveiled the cosmic form of Shiva.
“Uncle, when you showed me the forest from Uma Maheshwaram, it felt like looking out of a window. When we reached Farhabad, it was like peeking through parted curtains. But looking out from here, it feels as if every door on all four sides has been flung wide open to the world. Even if one were not destined to see such a sunset again, one would willingly be reborn just for this single experience,” Suchi said. Her words sounded like the utterance of a devoted seeker who truly understood the divine presence.
Pointing toward a leafless, stark-white tree beside the microwave repeater station at the summit, she asked what it was.
“That is called the Tapasi tree, also known as the Kovela tree (Sterculia urens),” I replied. “The Girijan Cooperative Corporation procures the natural gum tapped from it. Every year, the Chenchu tribals harvest gum worth nearly sixty lakh rupees. For this ancient indigenous tribe, it remains a primary source of livelihood to this day.”
Suchi gently touched the tree. “Oh, wonderful! This ancient tree standing right beside a microwave repeater station… isn’t it a striking blend of the old and the new?” she remarked. I was astonished by how quickly she had grasped the very essence of the experience I had envisioned when planning this journey.
Anxious that we should not miss the evening harati (lamp-offering), our friends hurried us from Shikhareswaram toward the Srisailam temple. By the time our car negotiated the market streets, auspicious temple music was already echoing through the public address system. As we hurried eagerly into the Shiva temple, Suchi hesitated and asked, “How can we enter the temple just like this, without even taking a bath?”
“That is the supreme grace of this deity,” I said. “You can approach Him directly with dust on your feet and the weariness of the road still upon you. This is known as Dhuli Darshanam—an audience granted straight from the road, with the dust of travel still upon your feet. The genuine devotion lies in the fact that one has traversed miles through rugged forests and hills to reach Him. He is a Lord who asks: Why bind genuine love with ritualistic constraints?”
“Then He is truly a people’s God,” Suchi remarked.
Inside the sanctum sanctorum, amidst the reverberation of auspicious instruments, priests waved brass lamps sequentially—with one, five, nine, eleven, and twenty-seven wicks. It was a visual feast of divine light. Immediately after the offering, we touched our foreheads to the Shiva Lingam in reverence, and then proceeded to the shrine of Goddess Bhramaramba to receive her harati.
As soon as the harati concluded, the Goddess’s ceremonial assembly (Koluvu) commenced. The priests warmly requested all the assembled devotees to be seated. They first chanted hymns from all four Vedas, followed by verses from the Upanishads, Panini’s grammar, classical poetry, and treatises on poetics (Alankara Shastra). After each recitation, they pronounced ceremonial accolades (Parakulu). Finally, taking up the traditional almanac (Panchangam), they read aloud the sacred lunar day, the weekday, and the ruling star of the day.
Then, a devotee with an extraordinarily melodious voice sang the Bhramarambikashtakam. The priests offered a final harati and chanted the Mantra Pushpam. With that, the general darshan began.
The subtle spiritual awakening that had begun at twilight on Shikhareswaram seemed to blossom fully with the darshan of the Goddess, washing away all worldly stains and purifying our inner being. Walking through the temple corridors, I began narrating the history of the shrine:
“Since time immemorial, this mountain system of Sriparvata-Srisailam has served as a cultural bridge connecting east and west, north and south. Sriparvata, now known as Nagarjunakonda, was a flourishing cultural hub from the times of the Ikshvakus to the Vishnukundins. Even back then, Srisailam must have been a center of worship, for numerous relics of Paleolithic human settlements have been unearthed all around this region.”
“In fact, the entire Srisailam plateau is dotted with natural springs. We cannot definitively say whether the original consecration belonged to the Mother Goddess or to the Lord. The Goddess might well have been the primordial Earth Mother of ancient man, or the Lord might have been Pashupati, the proto-Dravidian archetype. Nevertheless, as a sacred confluence of Shiva and Shakti, this shrine had attained widespread renown by the sixth and seventh centuries CE.”
“While the culture centered around Sriparvata radiated north and east, the spiritual message of Srisailam traveled south and west. The historic rivalry for Srisailam that began between the Cholas and Chalukyas later evolved into royal patronage under the Velanati Durjayas, Kakatiyas, and Reddy kings, eventually reaching its golden zenith under the Vijayanagara emperors.”
“Sri Krishnadevaraya held this temple in such special reverence that he had stone reliefs of himself and his queens sculpted right into the courtyard pavement—believing that as long as his likeness was graced by the footsteps of walking Shiva devotees, his union with Shiva (Sayujya) was assured!”
Leading her forward, I showed her the temple’s Mukhamandapam, the central shrine of Sanagala Basavanna (the colossal Nandi), and as we stepped before the Veera Shiromandapam, a sudden chill of awe ran down my spine.
“This is known as the Veera Shiromandapam,” I whispered. “In the peak of their intense devotion, Shaiva devotees offered their eyes, limbs, and even their severed heads to Shiva here in supreme sacrifice. Built in the fourteenth century by King Anavema Reddy, it inspired poet Palkuriki Somanatha to write with breathtaking, heroic fervor:
Thinking it a sin to praise the Supreme
with a tongue that had praised mortals,
They slit their own tongues, receiving new ones
from the Wielder of the Bow to sing His praise…
Deeming a headless Shiva a life without meaning,
They offered their very heads in devotion. ..
By the time we stepped out of the temple, deep night had fallen. As we walked back toward the guest house, Suchi asked, “How are accommodation facilities arranged for all the pilgrims who arrive here?”
I explained the various cottages and community rest houses (satrams) maintained by the temple administration and different community trusts. When she asked to see what a traditional satram looked like, I took her to the historic Karivena satram, which had recently celebrated its centenary.
Students from the Veda Pathashala housed within the satram had just concluded their evening studies. The manager warmly invited us to dine with them. Before we departed, the authorities presented us with a four-volume encyclopedia set published by their trust.
Outside, the full moon of Kamuni Punnami (Holi) bathed the earth in radiant light, as if washing away the sins of the world. All over the temple town, remnants of the Mahashivaratri celebrations lingered, while preparations for welcoming Ugadi were quietly beginning. Devotees arriving from Karnataka were already enlivening the streets. There, Suchi struck up a conversation with a street vendor selling bead necklaces.
Hailing from Tirupati, the vendor had travelled here for the festival. When I began asking him about the various rudrakshas spread before him, he reached into his bag, unfolded a cloth bundle, and pulled out a scholarly book: The Eye of Rudraksha by Padma Bhushan Dr. R.K. Sharma! Who could have imagined such deep knowledge tucked away in the humble wares of a roadside vendor?
That night, our friends tried hard to arrange a moonlit boat ride on the reservoir, but security restrictions prevented it. The memories of countless nights I had spent drifting peacefully on small boats across those still waters tempted me deeply to relive the experience.
Across the land, the ritual bonfire of Kamadeva (Kama Dahana) was underway. A poet once praised the Supreme Lord as Kāma-dahana-karuṇākara-lingam—the Lingam that burned desire out of boundless compassion. How profoundly compassionate that destruction of lust truly is! Yet, why does my own longing for beautiful experiences, sweet company, and soulful camaraderie never seem to fade? Must my yearning for the aesthetic sublime, in this all-pervading presence of Shiva, be understood as nothing other than the true bliss of Shiva’s presence (Shiva Sannidhya Sukham)?
The ancient poet who extolled Sriparvata as “the purifier of the speech of poets and readers like us, the dispeller of worldly sorrows, the destroyer of burdensome karma, the fountainhead of all auspiciousness, and the giver of celebrated joy” was himself a visionary dreamer like me. How, then, did he ever escape this captivating thirst for beauty (rasa-lubdhata)? Until I find an answer to these questions, perhaps I am destined to return to Srisailam again and again.
26-8-2026


Sriparvata as “the purifier of the speech of poets and readers like us, the dispeller of worldly sorrows, the destroyer of burdensome karma, the fountainhead of all auspiciousness, and the giver of celebrated joy”
శిఖరదర్శనం, ధూళి దర్శనం ….
ఆ శివసాన్నిధ్యసుఖం …
హృదయపూర్వక ధన్యవాదాలు సోమ శేఖర్!
“మామయ్యా, నువ్వు ఉమామహేశ్వరం నుండి అడవిని చూపించినప్పుడు కిటికీ తెరచి చూసినట్లుంది. ఆ తర్వాత వెళ్లామే ఫరహాబాదు, అక్కణ్ణుంచి చూస్తుంటే తలుపుల తెరలు ఓరగా తొలిగించి చూసినట్లుంది. కాని ఇప్పుడిక్కణ్ణుంచి చూస్తుంటే నాలుగువైపులా తలుపులన్నీ బార్లా తెరిచి కళ్లారా చూసినట్లుంది. ఇటువంటి సంధ్యాదృశ్యాన్ని ఒకసారి చూడటానికి నోచుకోకపోయినా, ఈ అనుభవానికైనా మళ్లా మళ్లా పుట్టకతప్పదు సుమా.”
ఆహా! How beautifully her view and perspective broadened!!
దూరప్రాంతాల నుంచి అడవులు, కొండలు దాటి, ప్రయాణపు అలసటతో, పాదాలకు అంటుకున్న ధూళితోనే స్వామిని దర్శించుకోవడం!
“ధూళిదర్శనం “ అన్న భావన ఎంత బాగుంది! 🙏🏽