
3
ఏ మార్పూ లేదు
నేను నా అనుభవం మీద ఆధారపడి పాఠశాలకి ఏం చెయ్యవచ్చో చిన్న నోట్ రాసి తీసుకొచ్చి సమగ్రగిరిజనాభివృద్ధి కార్యాలయంలో ఇచ్చాను. అక్కడ కూచున్న జిల్లా గిరిజన సంక్షేమాధికారి దానిలో ఏమి రాసి ఉందో కూడా చూడకుండానే ‘మీరు నిజంగా ఆ ఊరు వెళ్లారా? లేకపోతే ఈ నోట్ ఇక్కడెక్కడన్నా కూచుని రాసేసారా?’ అని అడిగేడు. నా మనసు చివుక్కుమంది.
‘నేను ఏ దారిన వెళ్లానో గుర్తులు చెప్పమంటారా?’ అని అనడమైతే అన్నాను గాని, నా మనసు చాలా నొచ్చుకుంది. తోటి అధికారి పట్లనే అతడు అంత అపనమ్మకాన్ని కనపరిచినప్పుడు తన వ్యవస్ధలో పనిచేసే ఉపాధ్యాయుల పట్లా, వార్డెన్లపట్లా, మేట్రన్ల పట్లా ఎటువంటి నమ్మకాన్ని చూపగలుగుతాడు అనుకున్నాను.
కాని ఆ తరువాత ప్రాజెక్టు అధికారిని కలవగానే నా అలసట మొత్తం మాయమయ్యింది. ఆయన నేను కొండ మీద ఉన్న రోజుల్లో కొత్తగా జాయినయ్యాడు. ఆయన పేరు ఎల్.వి.సుబ్రహ్మణ్యం. ఇండియన్ అడ్మినిస్టేటివ్ అధికారి. నేనాయన్ను కలిసి నా అనుభవాలు చెప్పగానే చాలా చురుగ్గా ప్రతిస్పందించాడు. పాఠశాలల అభివృద్ధికి ఏమి చెయ్యవచ్చునని అడిగాడు.
నేనాయనకు నా నోట్ చూపించాను. ఆయన ఆ నోట్‌ని అందుకని దాన్ని చదవడానికన్నా ముందు ‘దీన్ని ఎక్కడ టైపు చేయించారు’ అని అడిగాడు. నేను దాన్ని ప్రైవేట్ టైపు ఇన్‌స్టిట్యూట్‌లో టైపు చేయించానని చెప్పాను. వెంటనే తన పి.ఏని పిలిచి ‘ఈ కుర్రవాడు ఈ నోట్ తన స్వంతఖర్చుతో టైపు చేయించాడు. ఆఫీసులో చెప్పి వెంటనే అతనికి ఆ ఖర్చు చెల్లింపు చేయించండి’ అన్నాడు.
ఆ స్వాంతనకు నా హృదయం ద్రవించింది. తరువాత ఆయన ఆ నోట్ చదివి ‘దీనిలో చాలా ముఖ్యమైన సూచనలున్నాయి. వీటి మీద తగిన చర్య తీసుకో గలరు’ అని తన కింద అధికారులకు రాసాడు. నా టైపింగు ఖర్చుల్ని చెల్లించడం మర్చిపోయినట్టే ఆ కార్యాలయం ఆ సూచనల మీద చర్య తీసుకోవడాన్ని కూడా సులభంగా మర్చిపోయింది.
ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక అధికారి ఒక పాఠశాలని సందర్శించి అక్కడ పరిస్ధితులు బాగాలేవనీ, వాటిని సరిదిద్దమనీ ఆ ఉపాధ్యాయులకు చెప్పడం సహజం. కాని అదే అధికారి తన కార్యాలయానికి వచ్చేటప్పటికి, తను నిర్వహించి ఉండవలసిన బాధ్యతల విషయం వచ్చేటప్పటికి అంతకన్నా బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తాడు. కేవలం బాధ్యతారాహిత్యమే కాక, ఆ కార్యాలయాల్లో నెలకొని ఉన్న అపనమ్మకం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. బాధించింది.
నేను నా ఎనిమిది నెలల శిక్షణలో భాగంగా దాదాపు రెండువందలకు పైగా ప్రభుత్వ కార్యాలయాల్ని సందర్శించి ఉంటాను. వాటిలో మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఆ కార్యాలయాలన్నీ వాటి వాటి పనితీరులో, ప్రజల సమస్యల పట్ల స్పందించే తీరులో ఒక్కలా ఉన్నాయని చెప్పలేను. కాని అన్నిటిలోనూ ఉమ్మడిగా కనవచ్చిన సామాన్య లక్షణమయితే ఒకటి కనబడింది. అదేమంటే ఏ ఒక్క కార్యాలయంలో కూడా అది గుమాస్తా కానివ్వండి, అధికారి కానివ్వండి, తనని చూడవచ్చినవారిని మర్యాదకైనా కూచోమని అనకపోవడం. ఆ అమర్యాదలో అన్ని కార్యాలయాలు ఒక్క లానే పనిచేస్తుండటం నన్ను నివ్వెరపరిచింది.
పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఏ స్ధాయి అధికారి గాని ఒక్క విషయంలో మాత్రం అందరూ ఒక్కలానే ప్రవర్తించడం కూడా చూసాను. అది వాళ్లు పాఠశాలలో ప్రవేశించగానే ఎకాఎకి ఉపాధ్యాయుడి కుర్చీని ఆక్రమించి కూర్చోవడం. ఆ పాఠశాలలో మరొక కుర్చీగాని లేనట్లయితే ఆ అధికారి వెళ్లేటంతవరకు ఆ ఉపాధ్యాయుడు నిల్చునే ఉండవలసి ఉంటుంది.
గోర్కీతో చెకోవ్ వాపోయినట్లుగా ఉపాధ్యాయుణ్ణి అవమానించే ప్రవర్తనలో మాత్రం అందరూ ఒక్క తరహాగానే ప్రవర్తించడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను.
ఇక పాఠశాలల సంగతి. నా శిక్షణాకాలమంతటా నేను వీలయినన్ని పాఠశాలలన్ని సందర్శించాను. వాటిలో స్ధానిక సంస్ధలు నిర్వహించే ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నతపాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లు, ఎయిడెడ్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాల కూడా ఉన్నాయి. కాని ఒక్క పాఠశాలలో కూడా నేను ఉత్సాహాన్ని కనుగొనలేకపోయాను.
వాటిలో రోడ్డుకి లోపల లోతట్టు గిరిజనప్రాంతాల్లో పనిచేసే పాఠశాలలు అసలు పనిచేసేవి కావని చెప్పవచ్చు. ఆ పనిచెయ్యకపోవడంలో కూడా ఆ పాఠశాలలకి గాని, ఆ ఉపాధ్యాయులకు గాని, ఆ యాజమాన్యాలకు గాని ఎటువంటి సంకోచం లేకపోవడం నన్ను మరీ ఆశ్చర్యపరిచింది. ఆ లోపలి గిరిజన గ్రామాల్లో ఒక పాఠశాల ఉంటున్నట్లుగాని, విద్యావంతుడైన మానవుడు సంచరిస్తున్నట్లు గాని ఏ ఆనవాలు ఉండేది కాదు. పనిచెయ్యని పాఠశాలల వల్ల ఆ గిరిజన ప్రాంతం ఏ విధంగానూ చైతన్యానికి నోచుకోకుండా యుగాల వెనకనున్నట్లు కనిపించేది.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటనని చెప్పాలని ఉంది. నేను నా శిక్షణలో రెండువారాల మండల రెవెన్యూ కార్యాలయంలోనూ, రెండు వారాలు మండల అభివృద్ధి కార్యాలయంలోనూ శిక్షణ పొందవలసి ఉంది. విజయనగరం జిల్లాలో పాచిపెంట మారుమూల మండలం. దాన్ని ప్రభుత్వం ఆదర్శమండలంగా అభివృద్ధి చెయ్యాలనుకుంది. అప్పట్లో రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల్ని మండలస్ధాయిలో విలీనం చెయ్యాలనే ఆలోచన ఉండేది. దాన్ని అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చెయ్యాలనుకున్నారు. అందువల్ల మండల స్ధాయి శిక్షణకు నన్ను ఆ మండలానికి పంపించారు.
ఏ విధంగా చూసినా అది పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిన మండలం. నా శిక్షణకాలం నెలరోజుల్లోనూ ఒక్క ఉన్నతాధికారి కూడా ఆ మండలాన్ని సందర్శించడం నేను చూడలేదు. చివరకి రాజకీయనాయకులు కూడా అటువచ్చేవారు కాదు. నేనక్కడొక పాత గెస్ట్‌హవుజ్‌లో ఉండేవాణ్ణి. నాకు శిక్షణ ఇవ్వడానికి కూడా మండల స్ధాయి అధికారులెవరికీ అంత ఆసక్తి ఉండేది కాదు.
దాంతో నేను ఎక్కువగా గ్రామస్ధాయి అధికారుల్ని పట్టుకుని వారితో కలిసి వివిధ గిరిజన గ్రామాలకి వెళ్లి వస్తూండేవాణ్ణి. అలా ఒకరోజు ఒక మారుమూల గ్రామంలో పనిచేస్తున్న అంగన్ వాడి కార్యకర్త ఒకామె నన్ను తనంత తానే తన గ్రామానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె పనిచేస్తున్న గ్రామం పేరు మోదుగ. అది కొండ మీద ఉన్న గ్రామం. కాలినడకన కనీసం మూడు గంటల ప్రయాణం.
ఆమె నన్ను ఆహ్వానించిన మర్నాడు పొద్దున్నే ఆ గ్రామానికి పోవాలని నిర్ణయించుకున్నాం. ఆ రోజు పొద్దున్నే నేను ప్రయాణానికి సిద్ధమవుతుండగా, నడి వయస్కుడొకాయన నా దగ్గరికి వచ్చాడు. అతనికి యాభై ఏళ్ల లోపే వయసు ఉంటుంది. తనని ఉపాధ్యాయుడిగా పరిచయం చేసుకున్నాడు. కొద్దిసేపటిదాకా ఆయనెందుకు వచ్చాడో నాకు అర్ధం కాలేదు.
నెమ్మదిగా అసలు విషయం చెప్పాడు. అతడు మేం వెళ్లబోతున్న మోదుగ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. నివాసం పాచిపెంటలోనే. కాని మోదుగ కొండమీద గ్రామమనీ, తనకి మోకాళ్ల నొప్పులు కావడం చేత ఎప్పుడూ స్కూలుకి వెళ్లనని నిజాయితీగా చెప్పేసాడు. ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా తనని పై అధికారులు అక్కణ్ణుంచి బదిలీ చెయ్యడం లేదని కూడా అన్నాడు. తనకొక పనిష్మెంటు వేసినట్టుగా ఆ గ్రామానికి పోస్టు చేసారని కూడా అన్నాడు.
అతని మాటలు విన్నాక నాకు ఆ గ్రామానికి వెళ్లి ఏం చూడాలో అర్ధం కాలేదు. అయినా ఒక కొండమీద గ్రామాన్ని సందర్శించినట్టవుతుందని బయలు దేరాను. తీరా నేను బయలుదేరే సమయానికి ఆ ఉపాధ్యాయుడేమనుకున్నాడో తాను కూడా బయలుదేరాడు. మోదుగ కొండ ఎక్కడం నిజంగానే మాటలు కాదు. ఆ ఉపాధ్యాయుడికి తన మోకాళ్ల నొప్పులతో అది ఎంత పనిష్మెంటుగా ఉండిందీ నేను కళ్లారా చూసాను.
మోదుగని చూసినప్పుడు నా మనసు రెండు రకాల విరుద్ధభావాలతో నిండిపోయింది. అదొక అందమైన గ్రామం. ఆ కొండచరియల మీద మేఘాలు తారట్లాడుతున్నాయి. కొండవాలుల్లో ఊటనీళ్లు పట్టుకుని గిరిజనరైతులు వరి పండిస్తున్నారు. ఊరి మధ్య చింతచెట్ల నీడలో పిల్లలు ఆటలాడుకుంటున్నారు.
వారిలో బీదరికం కన్నా నిస్సహాయత ఎక్కువ కనబడింది. వారికి చేయూత నివ్వడానికి ఏ ప్రభుత్వమూ అక్కడ లేదు. అక్కడకు రాదు. నన్నక్కడికి ఆహ్వానించిన ఆ అంగన్‌వాడి కార్యకర్తా కూడా అక్కడ నివాసమయితే ఉండటం లేదు.
పాచిపెంటలో పి.వి.ఎస్.పాత్రో అని ఒక రచయిత ఉండేవారు. ఆయన గొప్ప సహృదయులు. నేను మోదుగ వెళ్లి వచ్చిన రెండుమూడు రోజుల తర్వాత వారిని కలిసినప్పుడు మోదుగ వెళ్లివచ్చినట్టు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ‘ఓ, మీరు మోదుగ వెళ్లి వచ్చారా, అయితే శిఖరాగ్రానికి వెళ్లి వచ్చినట్టే’ అన్నారాయన.
తనుకూడా ఒకప్పుడు మోదుగ వెళ్ళాననీ, తన మోదుగ యాత్ర మీద 1954లో చిత్రగుప్త పత్రికకోసం వ్యాసం రాసానని చెప్పి, ఆ రచనని వెతికి ఇచ్చారు. అప్పటికి ముఫ్పై ఏళ్ళ కిందటి ఆ రచనని కుతూహలంగా అప్పటికప్పుడే చదివాను. ఆశ్చర్యకరమైన విషాదమేమిటంటే, అప్పటికీ, ఆ తరువాత ముఫ్పైఏళ్లకీ కూడా మోదుగ పరిస్ధితిలో ఏ మార్పూ లేదు. ఒకవేళ నేను కూడా నా మోదుగయాత్ర గురించి రాయవలసి వస్తే నా రచన కూడా దాదాపుగా అలానే ఉంటుందనిపించింది.
3
Nothing Had Changed
Drawing upon my firsthand experience, I drafted a concise note outlining what could be done for the school and submitted it to the Integrated Tribal Development Agency (ITDA) office. The District Tribal Welfare Officer stationed there, without so much as glancing at the contents of the document, looked up and asked, “Did you actually visit that village, or did you just sit somewhere nearby and cook up this note?” My heart sank. “Shall I describe the landmarks along the path I took?” I retorted, but inwardly, I was deeply wounded. I couldn’t help but reflect: if he harbored such blatant distrust toward a fellow officer, what little faith could he possibly extend to the teachers, wardens, and matrons working on the ground within his system?
However, the moment I met the Project Officer later on, all my lingering exhaustion vanished. He had assumed charge during the days I was up on the ridges. His name was L.V. Subrahmanyam, an officer of the Indian Administrative Service. When I met him and recounted my experiences, he responded with immense enthusiasm and immediately asked what concrete steps could be taken to improve the schools. I presented my note to him. He took it, but before reading a single line, he asked, “Where did you get this typed?”
I replied that I had gotten it done at a private commercial typing institute. He immediately summoned his Personal Assistant and instructed, “This young man has had this note typed at his own expense. Inform the office to reimburse him immediately.” My heart melted at that sudden, comforting touch of empathy. He then read through the note and endorsed it to his subordinates, writing: “This contains very vital suggestions. Please take appropriate action on them.” Yet, just as the office completely forgot to reimburse my typing expenses, it just as easily forgot to ever act upon those recommendations.
I mention this because it is all too common for an officer to visit a school, notice that conditions are dismal, and casually instruct the teachers to set things right. But when that very same officer returns to the comfort of his own desk, he behaves with an even greater lack of accountability regarding the duties he himself is meant to perform. Beyond this sheer negligence, it was the deep-seated environment of systemic distrust pervading those offices that both astonished and pained me.
As part of my eight-month training, I must have visited more than two hundred government offices, spanning mandal setups, district collectorates, and state headquarters. I cannot claim that these offices functioned uniformly, or that they responded to the grievances of the public with the same degree of empathy. Yet, there was one striking, universal trait common to every single one of them: not a soul in any office—whether a minor clerk or a high-ranking official—ever had the basic courtesy to ask a visitor to take a seat. It completely bewildered me how every single institution functioned with the exact same institutionalized discourtesy.
I also noticed that when visiting schools, officials of every single rank behaved in the exact same manner in one particular regard: the very moment they stepped inside, they would immediately commandeer the teacher’s solitary chair. If the classroom possessed no other seating, the teacher was forced to remain standing like a culprit until the officer finally chose to leave. I found it impossible to stomach how uniformly these officials acted when it came to humiliating a teacher, behaving precisely as Chekhov had so bitterly lamented to Gorky.
Then there was the state of the schools themselves. Throughout my training, I made it a point to visit as many schools as I possibly could. My visits spanned primary and upper primary schools run by local bodies, government high schools, Ashram schools, English-medium convents, government-aided institutions, residential schools, and even a Navodaya school. Yet, I failed to glimpse a single spark of enthusiasm or genuine life in any one of them.
Among these, the schools situated in the deep, interior tribal tracts far away from the main roads were, for all practical purposes, completely non-functional. What shocked me even more was the utter lack of shame or hesitation regarding this failure—neither the local staff, the teachers, nor the higher management seemed to care. In those remote interior pockets, there was absolutely no sign that a school existed or that an educated human being had ever set foot there. Deprived of any spark of awakening due to these defunct schools, these tribal areas appeared trapped epochs behind the rest of the world.
In this context, I must recount a rather fascinating incident. As part of my field training, I was scheduled to spend two weeks at a Mandal Revenue Office and another two weeks at a Mandal Development Office. Pachipenta, located in the Vizianagaram district, was an incredibly remote mandal, which the government paradoxically intended to develop into a “model mandal.” At the time, there was a bureaucratic proposal to experimentally merge the Revenue and Panchayat Raj departments at the grassroots block level, and Pachipenta was chosen for this pilot project. That was how I found myself dispatched there for my mandal-level training.
By any metric, it was a region abandoned to total neglect. During the entire month I spent there, I did not see a single high-ranking official visit the block; even politicians gave the place a wide berth. I lodged in a dilapidated old government guesthouse. The local mandal-level officers possessed absolutely no interest or inclination to train me. Left to my own devices, I spent my time tagging along with village-level workers, visiting various tribal hamlets with them. It was during one of these outings that an Anganwadi worker stationed in a remote corner spontaneously invited me to visit her village. The place she worked in was called Moduga—a village perched high up on the ridges, requiring at least a grueling three-hour trek on foot.
We resolved to head to the village the very morning after she invited me. Early that day, just as I was preparing for the trek, a middle-aged man approached me. He appeared to be in his late forties. Introducing himself as a teacher, he left me thoroughly puzzled for a few moments as to the purpose of his visit.
Slowly, he revealed the truth. He was the designated teacher for the Mandal Primary School in Moduga, the very village I was about to visit. Though his posting was on the hill, he resided down in Pachipenta. With startling honesty, he admitted that he never actually went up to the school because Moduga sat high up on the ridges and he suffered from chronic knee pain. He lamented that despite submitting numerous petitions, his superiors refused to transfer him, adding that he had been exiled to that village as if it were a punitive measure.
Hearing his confession, I was at a loss as to what I would even find to inspect up there. Nonetheless, driven by the simple desire to see a village perched upon the heights, I set out. Just as I was leaving, the teacher, moved by some sudden impulse, decided to join me. Climbing the steep incline of Moduga was truly no small feat. I witnessed firsthand just how agonizing a punishment that trek was for the teacher, given his ailing knees.
When Moduga finally came into view, my mind was torn between two starkly contradictory impressions. It was a breathtakingly beautiful village. Heavy clouds drifted lazily across the slopes, and along the terraced hillsides, tribal farmers were cultivating rice, drawing from natural mountain springs. In the center of the hamlet, beneath the wide canopy of ancient tamarind trees, children were lost in their games.
Yet, looking closely at them, what struck me more than their poverty was their absolute helplessness. No government infrastructure existed up there to offer them a helping hand, nor did any official ever venture to those heights. Even the Anganwadi worker who had so eagerly invited me did not actually reside in the village.
There was a writer living in Pachipenta named P.V.S. Patro, a man of immense warmth and intellect. When I met him two or three days after my return from the hills and mentioned my trip, he was struck with disbelief. “Oh, you managed to visit Moduga?” he remarked. “Then you have truly journeyed to the absolute summit.” He confided that he too had trekked to Moduga once, long ago, and had written an essay about his journey for the Chitragupta magazine back in 1954. He hunted down the old text and handed it to me. I read that piece—written more than thirty years prior—right then and there with intense curiosity. The shocking tragedy of it was that absolutely nothing had changed in Moduga between his visit and mine, three decades later. It hit me then that if I were to sit down and pen an account of my own journey to Moduga, my words would mirror his almost exactly.
15-7-2026


One striking, universal trait common to every single one of them: not a soul in any office—whether a minor clerk or a high-ranking official—ever had the basic courtesy to ask a visitor to take a seat.
An institutionalized discourtesy
ధన్యవాదాలు సోమశేఖర్!
ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు, మీరూ మా పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) లో పనిచేయడం మా ప్రాంత ఆదివాసులందరి అదృష్టం.
మేము చింతపల్లి గురుకుల కళాశాల లో చదువుతున్నపుడు సెలవుల్లో ఇంటికి వెళ్లడానికి ప్రయాణఖర్చులు ఇచ్చేవారు. ఎల్. వి సుబ్రహ్మణ్యం గారిని కలిసి మా కాలేజ్ విషయాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన మీటింగ్ కి వచ్చినప్పుడు కూడా ప్రయాణఖర్చులు ఇచ్చేవారు. మాకు చదువు గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పి, మమ్మల్ని ఉత్తేజపరిచేవారు.
ఫస్టియర్ అయిన తర్వాత వేసవి. సెలవుల్లో పార్వతీపురం లోనే మాకు వసతి ఏర్పాటు చేసి, ఇంటర్మీడియట్ సెకండియర్ సబ్జెక్టులు మాకు అక్కడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ల చేత చెప్పించారు.
అవును. అటువంటి అధికారులు చాలా అరుదు.