
5
మూడు దశలు
బాగా పనిచేసే ఒక పాఠశాలని అంచనా వెయ్యడంలో మూడు స్ధాయిలున్నాయని అనుకుంటాను. మొదటి దశలో దాన్ని సక్రమ పాఠశాలగా గుర్తించడం. ఇంగ్లీషులో దీన్ని ‘స్కూల్ ఎఫెక్టివ్‌నెస్’ అంటారు. రెండవ దశలో దాన్ని ఉత్తమ పాఠశాలగా గుర్తించడానికి వీలవుతుందో లేదో చూడటం. చివరి దశ, అత్యున్నత దశ. ఆ దశలో ఒక పాఠశాల ఆదర్శపాఠశాలగా పరిణతి చెందిందో లేదో చూడాలి. నేను చదువుకున్న ఆరేళ్లలో తాడికొండపాఠశాల ఈ మూడు దశల్లోనూ ప్రయాణించిందనే చెప్పాలి.
ఒక పాఠశాలని మనం క్రియాశీల పాఠశాల (ఎఫెక్టివ్ స్కూల్) అని దేన్ని బట్టి గుర్తిస్తాం? అది తన ఆశయాల్ని సాధించుకునే క్రమంలో ఏ మేరకు సఫలం చెందిందీ అన్నదాన్ని బట్టి మనం దాని ఎఫెక్టివ్‌నెస్‌ని అంచనా కట్టవచ్చు.
ఈ అంశం మీద చాలా పరిశోధనలు జరిగాయి.‘టువర్డ్స్ ద ఎఫెక్టివ్ స్కూల్ : ద ప్రాబ్లమ్స్ అండ్ ద సొల్యూషన్స్’ (1987) అనే తమ రచనలో కెన్‌రీడ్, డేవిడ్ హాప్కిన్స్, పీటర్ హాలీ అనే విద్యావేత్తలు స్కూల్ ఎఫెక్టివ్‌నెస్‌ని నిర్ణయించడానికి పదకొండు రకాల కారకాల్ని పేర్కొన్నారు.
అవి : పాఠశాల నాయకత్వం, పాఠశాల నిర్వహణ, పాఠశాల విలువలు, క్రమశిక్షణ, ఉపాధ్యాయులు, వారి బోధన, కరికులం, విద్యార్ధుల అభ్యసనం, పఠనం, పిల్లలకందే సంరక్షణ, పాఠశాల భవనాలు, సౌకర్యాలు, పాఠశాల సైజు. ఈ అంశాలన్నిటినీ ఒకే ఒక మాటలోకి కుదించి చెప్పాలంటే పాఠశాలలో బోధన – అభ్యసన సమయాన్ని ఎంత సక్రమంగా ఉపయోగించుకున్నారన్నదానిమీదే ఆ పాఠశాల సాఫల్యం ఆధారపడి ఉంటుందనవచ్చు.
అలా చూసినప్పుడు, బోధనాభ్యసన సమయాన్ని సద్వినియోగపర్చుకోవడంలో గురుకుల పాఠశాలలొక అత్యంత శక్తివంతమైన నమూనాని సాధించుకోగలిగాయి. దాన్ని మూడు స్థాయిల్లో మనం చూడవచ్చు. అది పాఠశాల వార్షికకాలాన్ని ఎలా సద్వినియోగ పర్చుకున్నదన్న దానిమీద, తిరిగి ఆ విద్యాసంవత్సరాన్ని యూనిట్లుగా విడగొట్టినట్టయితే ప్రతి యూనిట్‌నీ ఏ విధంగా వినియోగించుకున్నదానిమీదా, ఇంకా ముఖ్యంగా పాఠశాల పనిదినాల్నీ, సెలవుదినాల్నీ, పనిగంటల్నీ తిరిగి పాఠ్య బోధనాసమయాన్నీ ఏ విధంగా ఉపయోగించుకున్నది అన్నదాని మీదా చూడాలి.
మామూలు స్ధానిక సంస్ధల పాఠశాలలకీ, ప్రభుత్వ పాఠశాలలకీ, గురుకుల పాఠశాలలకీ మధ్య నుండే ముఖ్యమైన తేడా వార్షిక కాలెండర్‌తో మొదలయ్యేది. అది వార్షిక కాలెండర్ ద్వారా తన కరికులం లక్ష్యాల్ని స్పష్టంగా నిర్వచించుకునేది. (ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఇటువంటి వార్షిక కాలెండర్‌ను కేవలం మొక్కుబడిగా తయారు చేస్తున్నాయి).
అందులో పాఠ్యబోధనకీ, సహపాఠ్యకార్యక్రమాలకీ, అదనపు పాఠ్యకార్యక్రమాలకీ తగిన చోటు స్పష్టంగా చూపించబడేది. ఒకసారి కాలెండర్‌ను రూపొందించుకున్నాక దాన్నుంచి ఎడంగా జరగడం ఊహకందని విషయం. అందులో సెలవు దినాలతో సహా ప్రతి ఒక్క రోజుకీ స్పష్టమైన పని లక్ష్యాలుండేవి.
వార్షిక కాలెండర్ ప్రకారం ఉపాధ్యాయులు తమ నెలవారీ, యూనిట్ వారీ ప్రణాళికలు రూపొందించుకునేవారు. ఏ రోజు ఏ పాఠం చెప్పాలో ప్రతి ఉపాధ్యాయుడికీ స్పష్టంగా తెలిసి ఉండేది. అలాగని వివిధ ఉపాధ్యాయుల మధ్య పాఠ్యబోధనలో సమతూకం చెదరకుండా పాఠశాల యాజమాన్యం జాగ్రత్త పడేది.
ఇక విడివిడి పాఠాల బోధనకి వచ్చేటప్పటికి ప్రతి పీరియడ్ నిర్వహణ ఉపాధ్యాయ శిక్షణకు టెక్ట్స్ బుక్‌లాంటిదని చెప్పవచ్చు. నలభై అయిదు నిమిషాల పాటు సాగే ప్రతి పీరియడ్ ఆ సబ్జెక్టుని బోధించే ఉపాధ్యాయుల వైయక్తిక సామర్ధ్య భేదాలతో నిమిత్తం లేకుండా దాదాపుగా కొన్ని సామాన్య లక్షణాల్ని కనపరచేవి. వాటిని ఇలా వివరించవచ్చు.
మొదటిది, ఏ ఉపాధ్యాయుడూ తరగతి గదిలో పాఠం టెక్ట్స్ బుక్ చూసి చెప్పేవాడు కాడు. కేవలం భాషాబోధన వేళ మాత్రమే వాచకాన్ని చూడవలసిన అవసరం ఉండేది. అప్పుడు కూడా అది దాదాపుగా కనీసస్ధాయిలో మాత్రమే ఉండేది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాన్ని బోధించాక, పిల్లవాడికి టెక్ట్స్ బుక్ కేవలం హోంవర్క్‌గా మాత్రమే పనికొచ్చేది.
దాదాపుగా, ప్రతి తరగతిలోనూ, ప్రతి సబ్జెక్టులోనూ, ప్రతి పాఠంలోనూ నాకు తరచు కలిగిన అనుభవం ఏమిటంటే రాత్రిపూట టెక్ట్స్ బుక్ తెరవగానే అందులో ఉన్న పాఠం ఉపాధ్యాయుడు బోధించిన దానికన్నా క్లుప్తంగా, స్ధూలంగా ఉన్నట్టనిపించేది. అసంతృప్తి కలిగేది.
నేడు మన పాఠశాలల్లో టెక్ట్స్ బుక్‌లోని విషయాన్నే అధికంగా భావించి దాన్ని కుదించి గైడుగా రూపొందిస్తున్న పరిస్ధితితో ఈ భావనని పోల్చి చూడండి. తను బోధిస్తున్న వాచకం కన్నా దాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు మరింత ఉన్నతంగా కనబడినంతకాలమే ఆ ఉపాధ్యాయుడిని పిల్లలు గౌరవిస్తారు. అతని పాఠాల కోసం ఎదురుచూస్తారు.
రెండవది : ప్రతి ఉపాధ్యాయుడూ పాఠాన్ని ఎత్తుకునే ముందు తను ముందు రోజు ఎక్కడ వదలిపెట్టాడో దాన్ని విద్యార్ధుల ద్వారా రాబట్టేవాడు. ఆ మొదటి ప్రశ్నల్నే తన మోటివేషన్‌గా వాడుకుని నెమ్మదిగా కొత్త పాఠంలోకి ప్రవేశిస్తూ నేర్పుగా తన విద్యార్ధుల్ని కూడా వెంటబెట్టుకుపోయేవాడు.
ఈ తొలి సమయాన్ని వినియోగించుకోవడంలో ప్రతి ఉపాధ్యాయుడికీ తనదైన పద్ధతి తనకుండేది. ఉదాహరణకి మా సోషల్‌స్టడీస్ ఉపాధ్యాయుడు వెంకట రత్నంగగారిదొక ప్రత్యేక పద్ధతి. పాఠ్యబోధనలో అంత కళాత్మక కౌశల్యాన్ని నేను మరెక్కడా ఈనాటిదాకా చూడలేకపోయాను.
ఆయన మాకు అయిదవ తరగతిలోనే ‘జీరో అవర్ ’ కాన్సెప్ట్‌ని పరిచయం చేసారు. శాసనసభ సమావేశమయ్యే రోజుల్లో ప్రతిరోజూ తన కార్యకలాపాన్ని ప్రారంభించే ముందు ఒక గంట ప్రశ్నోత్తరాలకు కేటాయించినట్టుగా తను కూడా ప్రతిరోజూ తన పీరియడ్‌లో మొదటి అయిదునిమిషాల్ని కేటాయించినట్టుగా ప్రశ్నోత్తరాలకి కేటాయించేవారు. అప్పుడు ఏ విద్యార్ధి అయినా తనకు తోచిన ఏ ప్రశ్ననయినా ఆయన్ని అడగవచ్చు. అది సాంఘిక శాస్త్ర సంబంధమే కానక్కర్లేదు. ఆ ప్రశ్నకి జవాబిస్తూన్నట్టే ఇస్తూ ఆ రోజు తను బోధించవలసిన పాఠంలోకి ఆయన మమ్మల్ని నేర్పుగా తీసుకుపోయేవారు. క్లాస్ ముగిసినట్టు బెల్ మోగినప్పుడు గానీ మేమెక్కడ ఉన్నామో మాకు తెలిసేది కాదు.
మూడవది : పాఠం ముగిసినతర్వాత మరొక అయిదు నిమిషాలు పిల్లల ప్రశ్నల కోసం ప్రతి ఉపాధ్యాయుడూ కేటాయించుకునేవాడు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందేహం తప్పనిసరిగా లేవనెత్తవలసిన సందర్భం అది.
అందులో కూడా ఎప్పుడూ అడుగుతూ ఉండే పిల్లలకే అవకాశం ఉండకూడదని కొన్నిసార్లు ఉపాధ్యాయుడు పేరు పెట్టి మరీ ఎవరో ఒక పిల్లవాణ్ణి లేపి మరీ ప్రశ్న అడిగించేవాడు. తన పిల్లల వైయుక్తిక సామర్ధ్యాల భేదాల గురించి ఉపాధ్యాయుడికి స్పష్టమైన పరిజ్ఞానం ఉంటే తప్ప సాధ్యంకాని పని అది.
నాలుగవది : ప్రతి ఉపాధ్యాయుడూ పిల్లలకు కష్టంగా అనిపించినదాన్ని తిరిగి తిరిగి చెప్పటానికి సదా సంసిద్ధుడిగా ఉండేవాడు. ఈ విషయంలో మా లెక్కల మాష్టారు జి.కృష్ణమూర్తి (జి.కె) గారి గురించి చెప్పుకోవాలి. జామెట్రీలో కొన్ని థీరాల్ని కనీసం ఆయన పదిసార్లయినా నల్లబల్ల మీద రాసి తుడిపి మళ్లా రాసి తుడపడం నాకు గుర్తుంది. ఇందుకు, నేడు అమెరికాలో ఉన్నతస్ధాయి ఇంజనీర్లుగా జీవిస్తున్న ఎందరో తాడికొండ విద్యార్థులు ఆయనకు తమ జీవితకాలం ఋణపడి ఉంటారు.
అయిదవది : అన్నిటికన్నా ముఖ్యమైంది. ప్రతి ఉపాధ్యాయుడూ వీలయినప్పుడల్లా తన పాఠాల్ని నాలుగు గోడల పరిథి నుంచి బయటపడెయ్యడానికే ప్రయత్నించేవాడు. ఇందుకు అనేక ప్రయోగాలు జరిగేవి. ఇంగ్లీషు ఉపాధ్యాయుడు మధ్యాహ్నం వేళ రేడియో పాఠాల్ని తన టైం టేబిల్‌లో భాగం చేసుకోవడం ఒకటయితే, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లల్ని వీలయినన్ని సార్లు బయటి పరిసరాలకు తీసుకురావడానికి ప్రయత్నించడం మరొక ప్రయోగం.
నాకు బాగా గుర్తున్నది మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సి.సత్యనారాయణగారు (సి.ఎస్.ఎన్) మమ్మల్ని మొదటిసారి స్ధానిక పోష్టాఫీసుకు తీసుకు వెళ్లిన సంఘటన. ఆ రోజు ఆయన తను టెలిఫోన్ బూత్‌లో నుంచొని మమ్మల్ని మరొక చోట టెలిఫోన్ అందుకుని తనతో మాట్లాడించుకున్న సంఘటనని నేను ఎన్నటికీ మరవలేను.
నా జీవితంలో నేను దాదాపు అయిదేళ్ల పాటు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగం చేసిన సందర్భం ఉంది. కాని నేను ఆరవతరగతి చదువుతున్నప్పుడు, ఆ ఉదయం పోస్టాఫీసులో నా చేతుల్తో టెలిఫోన్ రిసీవర్ అందుకుని మౌత్‌పీస్‌లో మా మాస్టారితో ‘హలో’ అన్నప్పుడు నా ఒంట్లో ప్రసరించిన విద్యుత్ తరంగం వంటిది మరలా నా జీవితంలో ఏ టెలిఫోన్ కాల్ అందుకున్నప్పుడు కూడా అను భవించలేదు.
ఇక అకడమిక్ సంస్ధగా తాడికొండ పాఠశాల సాఫల్యానికి ప్రధానకారణం ఆ పాఠశాల పాటిస్తూ వచ్చిన నిరంతర సమగ్రమూల్యాంకనమే అంటే ఆశ్చర్యం లేదు. ఉపాధ్యాయ శిక్షణా సర్టిఫికెట్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడూ ఈ ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ అనే మాటని ఎన్నోసార్లు విని ఉంటాడు. కాని దాన్ని వాస్తవం చేయగలిగిన ఉపాధ్యాయులు చాలా అరుదు.
ఎందుకంటే, అటువంటి మూల్యాంకనం ఒక్క ఉపాధ్యాయుడి వల్ల సాధ్యపడేది కాదు. దానికి మొత్తం సంస్ధాగత ప్రయత్నం, ఉన్నతస్ధాయి పరిణతి కావాలి. అందులో అనేక సూక్ష్మ అంశాల పట్ల జాగరూకత ఉండాలి. ఉపాధ్యాయ సిబ్బంది అందరి మధ్యా సహకారం ఉండాలి. సరయిన నాయకత్వం, దిశానిర్దేశం ఉండాలి. ఇవన్నీ కొరవడతాయి కాబట్టే అత్యధిక పాఠశాలలకు నిరంతర సమగ్ర మూల్యాంకనం ఒక వాస్తవంగా పరిణమించదు.
తాడికొండలో మూల్యాంకనం సాధారణంగా ఈ విధంగా ఉండేది. ప్రతి పాఠం ముగిసినప్పుడూ, ప్రతి పీరియడ్ చివరలోనూ ప్రశ్నల కోసం అయిదు నిమిషాల కాలం కేటాయించబడేదని ఇందాకనే చెప్పాను.
ప్రతి వారం ముగియగానే, ఆ వారంలో జరిగిన పాఠాల మీద స్లిప్‌టెస్ట్ ఉండేది. అది దాదాపు పదిమార్కుల అబ్జెక్టివ్ పరీక్ష. అది పూర్తి కాగానే తక్షణం పిల్లలే ఒకరి పేరు మరొకరు దిద్దేవారు. మార్కుల్ని ప్రకటించేవారు. ఆ మార్కులు ఆ వారంపాటు నడిచిన పాఠ్యబోధనల పిల్లవాడి భాగస్వామ్యం ఏ మేరకుందో సూచనని అందించేది.
నెల తిరగ్గానే మంత్లీ పరీక్ష ఉండేది. బయట ప్రభుత్వ, స్ధానిక సంస్ధల పాఠశాలల్లో వీటిని యూనిట్ టెస్టుల పేరిట ఏడాదికి నాలుగు మాత్రమే నిర్వహిస్తారు. కాని గురుకుల పాఠశాలల్లో ఇవి దాదాపుగా ఆరుదాకా ఉండేవి. అందులో అబ్జెక్టివ్ విభాగంలో వచ్చే ప్రశ్నలు దాదాపుగా స్లిప్ టెస్ట్‌ల్లో అడిగిన ప్రశ్నలే అయి ఉండేవి. సబ్జెక్టివ్ విభాగంలో అడిగిన ప్రశ్నలు పిల్లవాడు పరీక్షకు ఏ మాత్రం తర్ఫీదు అయ్యేవాడన్న దాన్ని పరీక్షకు పెట్టేవి.
పరీక్షలు ముగిసిన రెండు లేదా మూడు దినాల్లోగా జవాబుపత్రాల్ని దిద్ది ఉపాధ్యాయులు ప్రతి పిల్లవాడూ ఎక్కడ తప్పు చేసాడో తరగతి గదిలో అందరి ముందూ వివరించేవారు. ఆ తర్వాత ఆ ప్రశ్న పత్రానికే జవాబులు చూసిరాయమని పిల్లలకు అసైన్‌మెంట్ ఇచ్చేవాడు. అన్ని సబ్బెక్టులూ దిద్దిన తరువాత క్లాస్ టీచర్ పిల్లల రాంక్ లిస్ట్ తయారు చేసేవాడు. అందులో మొదటి పది రాంకులు ఎర్ర సిరాలో రాసి మొత్తం రాంకు లిస్ట్ గోడకి తగిలించేవాడు.
మళ్లా నెల పరీక్షలు జరిగేదాకా ఆ లిస్ట్ అట్లా గోడ మీద బొమ్మలాగా వెనకబడ్డ విద్యార్ధుల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేది. ఆయా సబ్జెక్టుల్లో వెనకబాటు విద్యార్ధుల్ని గుర్తించడంలో ఆగేది కాదు. వారికి ఆ నెలపొడుగుతా ప్రత్యేక శిక్షణ నడిచేది. క్రిటికల్ అధ్యాయాల్ని, క్రిటికల్ ప్రశ్నల్ని ఎంపిక చేసి వారికి డ్రిల్లింగ్ జరిగేది.
సాధారణంగా మనం టెర్మినల్స్ అని పిలిచే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఆన్యువల్ పరీక్షల్లో తిరిగి తిరిగి నెలవారీ పరీక్షల్లో ప్రశ్నలే ఎదురయ్యేవి. దానివల్ల ఏం జరిగేదంటే, తరగతిలో ఒక సబ్జెక్టులో మొదటి అధ్యాయంలో ఒక ప్రశ్న ఉందనుకోండి. దాన్ని ఆ పిల్లవాడు మొదటిసారి స్లిప్‌టెస్ట్ లో, రెండవసారి మంత్లీలో, మూడవసారి క్వార్టర్లీలో, నాలుగవసారి హాఫ్ యియర్లీలో అయిదవసారి ప్రీ-ఫైనల్లో ఎదుర్కొనవలసి వచ్చేది. ఇక ఆరవసారి చివరగా ఫైనల్ పరీక్షకు వెళ్లేటప్పటికి, ప్రశ్నపత్రంలో అదే ప్రశ్న ఎదురయితే దానికి జవాబు రాయడం అతనికి నల్లేరు మీద బండి నడకగా ఉండేది.
మొత్తం నిరంతర సమగ్ర మూల్యాంకనం రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా సాగేది ఒకటి, ఎడుకేషనల్ సైకాలజీలో ప్రతి ఒక్కరికీ చిరపరిచితమైన ‘రీ ఇన్‌ఫోర్స్ మెంట్’ సూత్రం దాని ప్రకారం పునఃపునః అభ్యసనం ద్వారా, కేంద్రీకృత అభ్యసనం ద్వారా పిల్లవాడి నైపుణ్యాన్ని పెంచవచ్చనేది.
రెండవ సూత్రం , ‘టఫ్ ఇంటర్నెల్స్’, అంటే ఏ ఉపాధ్యాయుడు గాని, ఏ పాఠశాలగాని తన పిల్లవాడి మూల్యాంకనం విషయంలో మెతగ్గా ఉండకూడదనేది. అది పరుగుపందెంలో హార్డిల్స్ ప్రాక్టీసులాగా ఉండాలనేది. తను ఏడాది పొడుగునా కష్టసాధ్యమైన ఇంటర్నెల్స్ని దాటి వచ్చి ఉంటాడు కాబట్టి విద్యార్ధికి ఎక్స్‌టర్నల్ ప్రశ్న పత్రాన్ని చూసేటప్పటికి ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. అతడు దాన్ని సునాయాసంగా అన్సరు చెయ్యగలననుకుంటాడు.
అయితే, తరగతి గదిలో రాంక్ లిస్ట్ వేలాడతీయడం, కొందర్ని తెలివైన వారుగా, మరికొందరిని వెనకబాటు విద్యార్ధులుగా కృత్రిమంగా విభజించడం, టఫ్ ఇంటర్నెల్స్ పేరిట పిల్లవాడి మీద అతడి సామర్ధ్యానికి మించిన అంచనాలతో ఒత్తిడి తేవడం ఏ మేరకు సమంజసమనే విమర్శకు అవకాశం లేకపోలేదు.
కాబట్టే ఒక పాఠశాల ఎఫెక్టివ్ అన్నంత మాత్రాన అది ఉత్తమ పాఠశాల కావాలని లేదు. ఒక పాఠశాలని ఉత్తమ పాఠశాలగా రూపొందించే సూత్రాలు వేరే ఉన్నాయి. తాడికొండ పాఠశాలకి కె.ఎం.సుగుణగారు ప్రిన్సిపాలుగా రాకపోయుంటే అది ఎఫెక్టివ్ పాఠశాలగానే మిగిలిపోయుండేది గాని ఉత్తమ పాఠశాలగా ఎదిగి ఉండేది కాదు.
6
నిశ్శబ్ద విప్లవం
క్రియాశీల (ఎఫెక్టివ్) పాఠశాలకీ, ఉత్తమ పాఠశాలకీ మధ్య భేదం చాలా సున్నితం. అందుకనే సాధారణ వ్యవహారంలో మనం ఎఫెక్టివ్ పాఠశాలల్నే ఉత్తమ పాఠశాలలుగా పొరపడుతుంటాం.
యథార్ధానికి వాటి మధ్య తేడాని వాటి లెర్నింగ్ అవుట్‌కమ్‌లలో చూడవలసి ఉంటుంది. రెండూ కూడా నైపుణ్యాల పెంపుదల మీదనే దృష్టి పెడతాయి. కాని మొదటి రకం పాఠశాలల లెర్నింగ్ అవుట్‌కమ్ యాంత్రిక నైపుణ్యాలు మాత్రమే. ఇక్కడ యాంత్రిక నైపుణ్యాలంటే కేవలం కనీస సాధారణ నైపుణ్యాలనే కాదు. వాటిలో అత్యున్నత నైపుణ్యాలు కూడా వస్తాయి.
ఆ నైపుణ్యాలు సుశిక్షితమైన అభ్యసన ప్రక్రియ వల్ల మాత్రమే సాధ్యపడతాయి. ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రానికి, ముఖ్యంగా అభ్యసనానికి సంబంధించిన మనో వైజ్ఞానిక ఆద్యుడైన థార్న్‌డైక్, అతని దారిలో ప్రయాణించిన వాట్సన్, స్కిన్నర్‌ల పరిశోధనలు ఇటువంటి నైపుణ్యాలకు సంబంధించినవే. వారి ప్రకారం శిశువుకొక విలువల నేపథ్యం ఉండవలసిన అవసరం లేదు. అటువంటి నేపథ్యం ఉన్నా కూడా దానితో సంబంధం లేకుండా మనం అతని లెర్నింగ్ అవుట్‌కమ్‌ని ప్రభావితం చెయ్యవచ్చు.
దానికి కావలసినందల్లా అతనికి మనం ఏ నైపుణ్యాల్ని ఇవ్వదలచుకున్నామన్నదే. ఆ నైపుణ్యం ఒక వాస్తవ పరిస్ధితి లేదా ఒక ఉదాహరణ ఆధారంగా మరొక సందర్భంలో కూడా అటువంటి ప్రతిస్పందననే కనపరుస్తుంది.
అంటే ఆపిల్‌ను చూసినప్పుడే అది ఆపిల్ అని గుర్తించడమే కాక, ఎ-పి-పి-ఎల్-ఇ అనే అయిదు అక్షరాల పదాన్ని చూసినప్పుడు కూడా దాన్ని ఆపిల్‌గా గుర్తించడమన్నమాట. ఇంత సాధారణ, కనీస నైపుణ్యాల్ని మనం మరింత మరింత శిక్షణ ప్రకారం సంక్లిష్ట, ఉన్నతస్ధాయి నైపుణ్యాలుగా మార్చగలుగుతాం. అప్పుడు అభ్యాసి తన సాధారణ వైయక్తిక అనుభవ పరిథిని కొద్దిగా దాటి కొత్త ప్రమేయాల్ని కూడా అన్వేషించగలుగుతాడు.
ఆ సామర్థాన్ని స్కిన్నర్ భాషలో ‘ప్రొగ్రెసివ్ అప్రాక్సిమేషన్స్’ అనవలసి ఉంటుంది. దాన్ని మరింత పొడిగిస్తే నేటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా విస్తరిస్తుంది. అంటే ఇక్కడ నైపుణ్యాలు దాదాపుగా శిక్షణ వల్ల ఒనగూడే నైపుణ్యాలు. కొంతదూరం పోయిన తర్వాత ఆ నైపుణ్యాలు మరింత ఉన్నతస్ధాయి నైపుణ్యాలకు దారితీస్తాయి. నేటి ప్రొఫెషనల్ విద్య, సాంకేతిక జ్ఞానాలు అత్యధికభాగం ఈ విధంగా ఒనగూడేవే. కాబట్టే ఆయా కోర్సులకు తమ పిల్లల్ని సంసిద్ధుల్ని చేసే పాఠశాలలుగా ఎఫెక్టివ్ పాఠశాలలుగా ఉంటే చాలని అత్యధిక సంఖ్యాకులైన తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఉత్తమ పాఠశాలల సంగతి అలాకాదు. అవి కూడా నైపుణ్యాల్నే ప్రోత్సహించినప్పటికీ, ఆ నైపుణ్యాలు కేవల యాంత్రిక నైపుణ్యాలు కాదు. అవి సృజనాత్మక నైపుణ్యాలు. అవి పిల్లల్ని పశువుల్లాగా శిక్షణద్వారా విద్యావంతుల్ని చెయ్యాలని చూసే నైపుణ్యాలు కాదు. అవి పిల్లలు తమకై తాము ప్రశ్నల్ని వేసుకుని వాటికి సమాధానాలు వారే తమంత తాముగా అన్వేషించాలని కోరుకుంటాయి.
ఒకప్పుడు గ్రీసులో, ఆ తరువాత యూరోప్‌లో, వికాసయుగం ప్రారంభంలో, ఇటువంటి విద్య కోసమే అన్వేషణ సాగింది. ముఖ్యంగా రూసో తన ‘ఎమిలి’ లో ప్రతిపాదించింది ఇటువంటి విద్యనే. ఆయన ప్రకారం శిశువులో నిద్రాణంగా ఉన్న ప్రాకృతిక సహజ సామర్థ్యాలు తమకై తాము మేల్కొని ఉండేదాకా ఉపాధ్యాయుడు అత్యంత సహనంతో వేచి ఉండాలి. అప్పుడు పిల్లవాడిలో సంభవించే వికాసమే నిజమైన విద్య. ఉదాహరణకి సూర్యోదయ దృశ్యాన్ని పిల్లవాడికెలా పరిచయం చేయాలో రూసో తన ఎమిలిలో ఎలా వివరించాడో చూడండి.
‘ఏదైనా సుందర సాయంసంధ్యావేళ మీకు అనువనిపించిన చోటకి మీ పిల్లవాణ్ణి కూడా తీసుకుని కొద్దిసేపు సాయంకాలపు నడకకి బయలుదేరండి. ఆ సాయంకాల దిగంతం మీద సూర్యాస్తమయ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. సూర్య బింబం దిగంతంలోకి కుంకుతున్న ఆ చోటునే కన్నార్పకుండా చూడండి. అక్కడి ప్రతి అంశాన్నీ నిశితంగా గమనించండి.
మళ్లా మరునాటి ఉదయం సూర్యోదయవేళకు కొద్దిగా ముందుగా ఆ స్ధలానికే తిరిగి వెళ్లి చూడండి. అక్కడ అప్పుడప్పుడే కాంతిశరాలు సంధిస్తున్నట్టుంటుంది. నెమ్మదిగా ఆ ప్రకాశం వన్నె తిరుగుతుంది. పూర్వదిశ రక్తవర్ణశోభితమవుతుంది. ఆ ప్రకాశ సందర్భంలో మీరు రాబోయే దినాన్ని గుర్తించగలుగుతారు. అప్పుడు గడిచే ప్రతి క్షణం మీకు రాబోయే దినస్వరూపాన్నే ఎరుక పరుస్తూ ఉంటుంది.
మీరు ఎదురుచూసే ఆ ముహూర్తం చివరకు రానే వస్తుంది. ధగధగలాడే మహాభాసమానబింబం విద్యుల్లతలా మీ ముందొక్కసారిగా ఉదయిస్తుంది. తక్షణమే దాని కాంతి పుంజం అవిరళాకాశమంతటా వ్యాపిస్తుంది.
అంతదాకా ముసురుకున్న నీడల మేలిముసుగు జారిపోయి తొలగిపోతుంది. మీరు చూస్తున్న ఆ చోటు, మీరు నివసిస్తున్న ప్రపంచం మీకు మరింత స్పష్టంగా గోచరించి, మరింత సుందరతరంగా కనిపిస్తుంది. అక్కడే ప్రతి చెట్టూ చేమా గడిచిన ముందు రాత్రి మరింత ప్రాణం పోసుకుని, ఎల్లెడలా ఆవరించిన మంచు బిందువు లతో సూర్యకాంతి ప్రతిఫలనాలతో నవోదయకాంతికిర్మీరంతో మీ ముందు మరింత ఆకర్షవంతంగా నిలబడతాయి.
జీవితపితామహుడి కచేరీలో ప్రతి పక్షీ తన రుతాన్ని సహసంగీతంగా అందించేవేళ, ఏ పక్షి కలస్వనం కూడా నిశ్శబ్ధంగా ఉండటానికి ఇచ్చగించని వేళ, ప్రశాంత ప్రత్యూషంలో ప్రకృతి వాటి గానంతో ఇంకా మత్తెక్కి ఉన్న ఆ వేళ – దినంలోని మరే ఘడియా కూడా అంత మధురంగా ఉందనిపించదు. అదంతా మన అంతరాంతల్లోని ఏ ఆత్మికస్థలాన్నో మృదువుగా సమ్మోహన్వంతో, నవనవత్వంతో స్పృశిస్తూన్నట్టుంటుంది. ఆ మహామనోహర శుభవేళకు ఎవరూ అంధులుగా ఉండజాలరు. అటువంటి మహాసుందరానుభవం పట్ల ఎవరూ ఉదాసీనంగా ఉండజాలరు.
అటువంటి సౌందర్యానుభవానికి వివశుడై, ఉపాధ్యాయుడు తన శిశువును కూడా అటువంటి సౌందర్యానికి జాగృతుణ్ణి చెయ్యాలనే తొందరలో తన అనుభూతి అతనికి కూడా కలగాలని తొందరపెడతాడు. ఎంత మూర్ఖత్వం !
ప్రకృతి సౌందర్యలీలకు రంగవేదిక మానవాంతరంగమే కదా. దాన్ని చూడాలంటే అనుభూతి నేత్రం కావాలి. పిల్లవాడు బాహ్యవస్తువుల్ని చూడనయితే చూడగలడు కానీ వాటి మధ్య సంబంధాన్ని గ్రహించగలిగే స్ధితికి అంత తొందరగా రాడు. వివిధ బాహ్య అస్తిత్వాల మధ్యనొక సమన్వయాన్ని చూడగల స్ధితికి అతడింకా చేరలేదు..’
‘కాబట్టి పిల్లవాడు అర్థం చేసుకోలేని విషయాల గురించి మీరు అతనితో మాట్లాడకండి. అతని ముందు మీ వివరణల్నీ, మీ వక్తృత్వాన్నీ, మీ అలంకార పదజాలాన్నీ, మీ కవిత్వాన్నీ కుమ్మరించకండి. వాసనలూ, అభిరుచులూ ఇంకా పిల్లవాడికి దూర విషయాలే. కాబట్టి వీలైనంత స్పష్టంగా, నిర్మమత్వంగా, నిర్మలంగా అతనితో మాట్లాడానికి ప్రయత్నించండి’.
‘ఈ సూత్రాలకు అనుగుణంగా అతడు తన ఆత్మని తర్ఫీదు చేసుకుని, తన వనరుల కోసం తనలోకే చూపు సారించుకుని, తను నిజంగా నిస్సహాయుణ్ణని భావించినప్పుడు మాత్రమే ఎదటివారి సహాయాన్ని కోరుకుని, ఆ క్రమంలో తనకి తటస్ధించిన ప్రతి కొత్త వస్తువునూ మరేమీ మాట్లాడకుండా సుదీర్ఘకాలం పాటు పరిశీలించడానికి అలవాటుపడతాడు. అప్పుడు అతడు ఆలోచనకు లోనయినట్టు గుర్తించండి.
ప్రశ్నించే శక్తి అతనికింకా అందుబాటుకానట్టే, వివిధ వస్తువుల్ని తగిన రీతిలో తగిన సమయంలో అతనికి అందించడంతో అప్పటికి తృప్తిపడండి. అతనిలో కుతూహలం అంకురించి అది పైకి వ్యక్తమవుతున్నదని గుర్తించాక, అప్పుడు కూడా యాధాలాపంగా ఏదో చిన్న ప్రశ్న అడిగి ఊరుకోండి. దానికొక సమాధానాన్ని అతనికై అతడే అన్వేషించుకునే అవకాశం వదిలిపెట్టండి’.
‘ఈ సూర్యోదయ సందర్భంలో, సూర్యోదయాన్ని అతనితో పాటు తొలినుంచి తుదిదాకా చూసిన తర్వాత, అతడు ఆ సూర్యోదయ పర్వతశ్రేణినీ, ఆ పక్కనుండే వివిధ వస్తువుల్నీ తనకై తాను గమనించడాని గుర్తించాక, అతనంతట అతనే తనకి తోచినట్టు ఏదో ఒకటి మాట్లాడనివ్వండి. మీరు మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టుగా కొద్ది సేపు మౌనంగా ఉండి ‘ఈ సూర్యుడు నిన్న అటు అస్తమించాడు. ఇవ్వేళ ఇటు ఉదయించినట్టున్నాడు. ఇదెలా సాధ్యమయిందంటావు’ అని ప్రశ్నించండి. అంతే. అంతకు మించి మరేమీ మాట్లాడకండి.
అతడేమన్నా ప్రశ్నించాడనుకో. జవాబివ్వడానికి ప్రయత్నించకండి. మరేదో విషయం గురించి మాట్లాడండి. అతన్ని అతనికి వదిలిపెట్టండి. నిశ్చయంగా చెప్తున్నాను చూడు. మీరడిగినదాని గురించి తనంతతానే ఆలోచించడానికి పూనుకోకుండా అతడుండలేడు’.
బోధన అనేది ఇంత సహనశీల ప్రక్రియగా జరిగినప్పుడు అది శిక్షణగా కాక, మేల్కొలుపుగా పరిణమిస్తుంది. అటువంటి పాఠశాల నుండి కేవలం నిపుణులు మాత్రమే కాక కళాకారులు, క్రీడాకారులు, కవులు, రచయితలు, వేదాంతులూ కూడా ఉద్భవిస్తారు. అక్కడ విద్యార్ధులకి అందే నైపుణ్యాలు కేవలం యాంత్రిక నైపుణ్యాలే కాక సృజనాత్మక నైపుణ్యాలుగా కూడా ఉంటాయి. వాటినే ఆరిస్టాటిల్, మననశీల నైపుణ్యాలు, గణనశీలనైపుణ్యాలు, అని విడగొట్టాడు.
కేవల యాంత్రిక నైపుణ్యాలు విద్యార్ధి వ్యక్తిగా కూడా నేర్చుకోగలిగినవి. కాని సృజనాత్మక నైపుణ్యాలకు బృందాలు కావాలి. సాంఘిక జీవితం కావాలి. తనలోకీ, తన బయటికీ కూడా చూపుసారించగలిగే శక్తి కావాలి.
కె.ఎం.సుగుణగారు మా ప్రిన్సిపాలుగా వచ్చినతరువాత మా పాఠశాల కరికులంలో యాంత్రిక అభ్యసన నైపుణ్యాలతో పాటు సృజనాత్మక నైపుణ్యాలకు కూడా అవిరళమైన చోటు దొరకడం ప్రారంభమైంది. దానికామె అంతదాకా వస్తున్న కరికులంని గానీ, పాఠశాల దైనందిన షెడ్యూలుని గాని పెద్దగా మార్చింది లేదు. ఆ ఎప్పటి కార్యకలాపంలోనే పిల్లల సృజనశీల శక్తులు మేల్కొనడానికి వీలుగా కొన్ని స్థలాల్ని కొత్తగా ఏర్పాటు చేసారామె. చట్రం మరీ బిగువుగా ఉన్నచోట కొద్దిగా వదులు చేసారు. మరీ వదులుగా ఉన్నదన్న చోట కొద్దిగా బిగించారు.
క్వాలిటీ అంటే వాల్యూ అడిషన్ అనే దానికి ఆమె పాలన సవివర ఉదాహరణ. అంటే నాణ్యత లేదా గుణాత్మకత ఆకాశం నుంచి ఊడిపడేది కాదనీ, అది నువ్వు రోజూ చేసే పనుల్నే నిన్న చేసినదానికన్నా ఈ రోజు మరికొంత మెరుగ్గా చేయగలమేమో చూద్దామని ప్రయత్నించడమనీ (దాన్నే వాల్యూ అడిషన్ అనేది) ఆమె ఎన్నో చిన్న చిన్న ఉదాహరణల ద్వారా రుజువు చేసారు.
ఉదాహరణకి, పాఠశాల పరిసరాల్ని శుభ్రంగా ఉంచడమనేది ఒక నాణ్యతా సూచిక. ప్రతి ఒక్కరికీ తమ పాఠశాల పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలని తెలుసు. అది కొత్తగా ఎవరికీ చెప్పవలసిన పనిలేదు. కాని ఆ జ్ఞానం ఒక ప్రవర్తనగా మారడం లేదు. అలా మారకుండా దాన్ని అడ్డగిస్తున్నదేది?
వినడానికి చిత్రంగా ఉండవచ్చు గానీ దానికి ఆమె కనుగొన్న సమాధానం చెత్తబుట్టలు అందుబాటులో లేకపోవడమేనని. ఆమె అనేదేమంటే ఎవరన్నా పాఠశాల ఆవరణలో చెత్తకాగితాన్ని చూసారనుకోండి. అదక్కడ ఉండకూడదు. దాన్ని అక్కణ్ణుంచి తీసెయ్యాలని అందరికీ ఉంటుంది గానీ, తీరా దాన్ని తీసాక ఎక్కడ వెయ్యాలన్నదొక ప్రశ్నగా ఎదురవుతుంది. ఎందుకంటే దగ్గరలో ఏ చెత్తబుట్టా ఉండదు. ఆ చెత్త కాగితాన్ని తీసుకుని, ఆ చెత్తబుట్ట ఎక్కడుందో వెతికి అందులో పడవేసే ఓపిక ఎవరికీ ఉండదు. అలా ఉండాలని ఆశించడం కూడా న్యాయం కాదు. అదే మనం వీలయినచోటల్లా పాఠశాల ఆవరణలో చెత్తబుట్టలు ఏర్పాటు చేసామనుకోండి. తమకి కనబడ్డ చెత్తకాగితాన్ని ఏరి ఆ బుట్టలో పడెయ్యడం అప్పుడెవరికన్నా సులువయి పోతుంది.
అంతదాకా బాగానే ఉంది. మరి ఆ చెత్తబుట్టల్ని నిలకడగా ఉంచడం ఎలా? దానికామె మార్గం కనిపెట్టింది. కిచెన్‌లో పాతనూనెడబ్బాలు ఖాళీ అయి పోయినవాటికి పైన రేకుకత్తిరించి ఆ డబ్బాలకు తెల్లరంగు వేసి వాటి మీద నీలం రంగులో ‘ప్లీజ్, యూజ్‌మీ’ అని రాయించి, పాఠశాల ఆవరణలో అక్కడక్కడా చెట్లకు ఇనుపతీగెల్తో వాటిని కట్టిపెట్టింది. రోజుకొకసారో రెండురోజులకొకసారో వాటిని స్వీపర్లు ఖాళీ చేసేవారు.
గుణాత్మక విలువను పెంపొందించడమనేది ఇంత ఆచరణాత్మకంగా జరగ వలసినపని. అది నీ వ్యవస్ధని పైకి ఏ మాత్రం కదిలిస్తున్నట్టు కనబడకుండానే సమూలంగా ప్రక్షాళనం చేసేసే నిశ్శబ్ద విప్లవం.
5
Three Stages
I believe there are three levels to evaluating a well-functioning school. The first stage is identifying it as an effective school—what is known as “School Effectiveness”. The second stage is seeing whether it can be recognized as a “Good School”. The final and highest stage is determining if it has matured into an “Ideal School”. During my six years at Tadikonda, I believe the school traveled through all three of these stages.
On what basis do we identify a school as an effective school? We can assess its effectiveness based on the extent to which it succeeds in achieving its goals and ideals.
Much research has been done on this subject; in their 1987 work, Towards the Effective School: The Problems and the Solutions, educators Ken Reid, David Hopkins, and Peter Holly identified eleven factors for determining effectiveness: school leadership, management, values, discipline, teachers and their teaching, curriculum, student learning, reading, student care, school buildings and facilities, and school size. If I were to summarize all these into a single phrase, the success of a school depends on how effectively the teaching-learning time is utilized.
When viewed this way, the Gurukulam schools achieved a powerful model for utilizing this time. It can be seen across three levels: the annual calendar, the breakdown of that year into units, and most importantly, the use of working days, holidays, working hours, and actual instruction time.
The primary difference between regular local body schools, government schools, and residential schools (Gurukul schools) used to begin with the annual calendar. Through this annual calendar, it would clearly define its curriculum goals. (Nowadays, residential schools are preparing such annual calendars merely as a token formality).
In that calendar there was a clear distinction between teaching, co-curricular, and extra-curricular activities. Once this calendar was set, deviating from it was unthinkable, as every single day, including holidays, had specific objectives.
According to the annual calendar, teachers used to design their monthly and unit-wise plans. Every teacher knew clearly which lesson had to be taught on which day. At the same time, the school management took care to ensure that lesson delivery remained even across different teachers.
When it comes to teaching individual lessons, the management of each period could be described as a textbook example of teacher training. Every forty-five minute period displayed certain common characteristics, largely irrespective of the individual differences in capabilities among the teachers handling the subject. These can be explained as follows.
First, no teacher would look at the textbook while teaching a lesson in the classroom. The need to refer to the reader arose only during language teaching, and even then, it was kept to an absolute minimum. After the teacher taught the lesson in the classroom, the textbook served merely as homework for the child.
Almost in every class, every subject, and every lesson, my frequent experience was that upon opening the textbook at night, the lesson inside appeared briefer and more superficial than what the teacher had taught. It used to leave me feeling dissatisfied.
Contrast this experience with the current situation in our schools, where the content in the textbook is deemed overwhelming and is further condensed into guides. Children respect a teacher only as long as the teacher appears far superior and more knowledgeable than the textbook they teach. They look forward to his interpretation of the lessons.
Second: Before starting a lesson, every teacher would elicit from the students where he had left off the previous day. Using those initial questions as his motivation, he would slowly transition into the new lesson, skillfully carrying his students along with him.
Every teacher had their own method for this. For instance, our Social Studies teacher, Mr. Venkatratnam, had a unique style—I have never seen such artistic skill in teaching elsewhere.
He introduced us to the concept of “Zero Hour” as early as the fifth grade. Just as a legislative assembly starts with a question hour, he dedicated the first five minutes of every period to questions. Any student could ask him anything, even if it wasn’t related to social studies. He would skillfully answer while weaving it back into the day’s lesson, and by the time the bell rang, we wouldn’t even realize how the time had passed.
Third, every teacher reserved another five minutes at the end for student questions. This was a moment where every student was expected to raise a doubt.
Even in that process, to ensure that the opportunity wasn’t always taken by the same children who frequently volunteered, the teacher would sometimes call out a specific child by name and ask them a question. This was a task that wouldn’t have been possible unless the teacher had a clear understanding of the individual differences in learning capabilities among his students.
Fourth, every teacher was always ready to repeat difficult concepts. Our mathematics teacher, Mr. G. Krishnamurthy (GK), was legendary for this; I remember him writing and erasing geometry theorems on the blackboard at least ten times. Many Tadikonda students who are now top-tier engineers in the US remain lifelong indebted to him for this.
Fifth and most importantly, every teacher tried to take their lessons beyond the four walls of the classroom whenever possible. There were many experiments, such as an English teacher making radio lessons part of the timetable or a Social Studies teacher taking us into the local surroundings.
I vividly remember Mr. C. Satyanarayana (CSN) taking us to the local post office for the first time. I will never forget the moment he stood in a telephone booth and had us pick up another receiver to speak with him.
I eventually worked in the telecommunications department for five years, but I never felt the same electric surge as I did that morning in the sixth grade when I first held a receiver and said “Hello” to my teacher.
It is no surprise that the primary reason for the success of the Tadikonda school as an academic institution was its consistent implementation of Continuous Comprehensive Evaluation (CCE). Every teacher who has earned a teacher training certificate has undoubtedly heard this term, ‘Continuous Comprehensive Evaluation’, countless times. However, teachers who can actually turn it into a reality are very rare.
This is because such an evaluation is not possible through the efforts of a single teacher alone. It requires a collective institutional effort and a high degree of professional maturity. It demands careful attention to numerous subtle nuances, cooperation among all teaching staff, and proper leadership and guidance. Because these elements are generally lacking, Continuous Comprehensive Evaluation fails to become a reality in most schools.
In Tadikonda, evaluation generally happened in this manner. As I mentioned earlier, a five-minute period was allocated for questions at the end of every lesson and at the close of every period.
At the end of every week, there was a slip test on the lessons taught during that week. It was an objective test of about ten marks. As soon as it was completed, the children would immediately grade each other’s papers and announce the marks. Those marks provided an indication of the extent of the child’s participation in the lessons conducted throughout that week.
There were also monthly tests—six per year, compared to the four usually held in other schools. The objective sections often repeated questions from the slip tests, while the subjective sections tested how well a student was trained for examinations.
Within two or three days of the exam, teachers would return the papers and explain everyone’s mistakes in front of the class. Students were then assigned to write out the correct answers. Afterward, the class teacher created a rank list, writing the top ten names in red ink and hanging the list on the wall.
That list remained on the wall like a painted danger signal until the next monthly exams, serving as a constant warning to the students who were lagging behind. The process did not stop with just identifying students who were struggling in various subjects; special training was conducted for them throughout the month. Critical chapters and key questions were selected, and rigorous drilling was organized for them.
This meant that a single question from the first chapter would be encountered by a student six times: first in a slip test, then a monthly test, followed by quarterly, half-yearly, pre-final, and finally the final exam. By the time they reached the final, answering it was as easy as a cart rolling on a smooth road.
This whole process was based on two principles. One is the “Reinforcement” principle from educational psychology, which states that a student’s skills can be enhanced through repeated, focused learning.
The second is the principle of “Tough Internals”—the idea that a school should never be lenient in its internal evaluations. It was like practicing for a hurdle race; because students had cleared difficult internal hurdles all year, the external final exam felt like a relief.
However, there is certainly room for criticism regarding how justifiable it is to hang rank lists in the classroom, to mechanically divide children by labeling some as intelligent and others as lagging, and to pressure a child with expectations beyond their capacity in the name of tough internals.
Therefore, just because a school is effective does not necessarily mean it is an excellent school. The principles that shape a school into an excellent one are entirely different. If Mrs. K.M. Suguna had not come to the Tadikonda school as Principal, it might have remained merely an effective school, but it would never have grown into an excellent one.
6
Silent Revolution
The distinction between an effective school and an excellent school is very subtle. In our daily lives, we often mistake the two.
The true difference lies in their learning outcomes. Both focus on building skills, but the first type produces mechanical skills—which include not just basic abilities but even the most advanced ones.
These skills come from a highly trained learning process. The research of Thorndike, Watson, and Skinner—the pioneers of modern educational psychology—focused on this type of learning. According to them, a child doesn’t necessarily need a background of values to learn; we can influence their learning outcomes regardless.
All that is required is clarity on what specific skills we intend to impart to him. Based on a real situation or an example, that skill will manifest as a similar response in a different context as well.
This means that not only does one recognize an apple upon seeing the actual fruit, but one also identifies it as an apple when seeing the five-letter word ‘A-P-P-L-E’. Through further structured training, we can transform such simple, foundational skills into complex, high-level capabilities. The learner is then able to step slightly beyond the boundaries of his personal, everyday experience to explore entirely new concepts and dimensions
In Skinner’s terminology, this capability must be referred to as ‘progressive approximations’. Extending this concept further brings us right up to modern Artificial Intelligence. In other words, the skills here are essentially those acquired through systematic training. After reaching a certain point, these foundational skills pave the way for even higher-level capabilities. Most of today’s professional education and technical knowledge are acquired in this very manner. This is precisely why the vast majority of parents desire nothing more than for schools to be ‘effective’ schools—adequate enough to prepare their children for such courses
Excellent schools are different. While they also encourage skills, these are not mechanical; they are creative skills. They do not treat children like animals to be trained. Instead, they want children to ask their own questions and find their own answers.
Once in ancient Greece, and later in Europe at the dawn of the Age of Enlightenment, it was this very kind of education that was sought after. In particular, it was this form of education that Rousseau proposed in his treatise, Emile. According to him, a teacher must wait with the utmost patience until the child’s natural, dormant abilities awaken on their own. The development that unfolds within the child at that moment is what constitutes true education. As an example, look at how Rousseau describes in Emile (Book III) the exact way to introduce a child to the magnificent sight of a sunrise:
On some beautiful evening, choose a place that feels right to you, take your child along, and set out for a short evening walk. The scene of the sunset will be visible on that evening horizon. Gazing with rapt attention, look at the exact spot where the sun’s disc is sinking into the horizon. Observe every element there with keen attention.
The next morning, return to that very spot shortly before sunrise. It will appear as though shafts of light are being gathered and aimed at that moment. Gradually, that illumination shifts its hues. The eastern sky becomes resplendent in crimson splendor. In that context of rising light, you will be able to recognize the unfolding day. Every passing moment will make you aware of the true form of the day ahead.
The moment you have been waiting for finally arrives. The brilliant, magnificent, and blazing disc suddenly dawns before you like a flash of lightning. Instantly, its cluster of light rays spreads across the boundless expanse of the sky.
The veil of shadows that had gathered until then slips away and disappears. The place you are looking at, and the world you live in, reveal themselves to you with greater clarity and appear far more beautiful. Right there, every tree and plant seems to have infused itself with more life-energy over the past night, standing before you more enchantingly, drenched in all-enveloping dewdrops that reflect the sunlight in a variegated tapestry of newborn dawn.
At an hour when every bird lends its note as a symphony in the court of the Father of Life, when the melodious voice of no bird wishes to remain silent, and when nature is still intoxicated by their song in the tranquil dawn—no other hour of the day feels quite as sweet. It feels as though it all gently touches some spiritual realm deep within our souls with enchantment and absolute freshness. No one can remain blind to that profoundly beautiful and auspicious hour. No one can remain indifferent to such a magnificent experience of beauty.”
Overwhelmed by such an aesthetic experience, the teacher, in his eagerness to awaken his child to that same beauty, hurries him so that he too might share the same sensation. What foolishness!
After all, the human soul is the theater for the beautiful play of nature. To perceive it, one requires the eye of inner feeling. A child can certainly see external objects, but he does not arrive so quickly at a stage where he can grasp the relationship between them. He has not yet reached a state where he can perceive a harmony among various external existences.
Therefore, do not speak to the child about things he cannot understand. Do not pour out your explanations, your eloquence, your verbose language, or your poetry before him. Aroma and finer taste are still distant matters to a child. Try, therefore, to speak to him as clearly, as dispassionately, and as serenely as possible.
In accordance with these principles, he trains his soul, turns his gaze inward for his own resources, and seeks the help of others only when he genuinely feels helpless. In that process, he grows accustomed to observing for longer spells every new object he comes across, without uttering a word. Recognize that he is then engaged in thought.
‘Just as the ability to question is not yet within his reach, be content for the time being with providing him with various objects at the right time and in an appropriate manner. Once you notice that curiosity has sprouted within him and is manifesting outwardly, even then, pause a while after casually asking some small question. Leave the opportunity open for him to discover an answer for himself.’
‘In this context of the sunrise, after watching it with him from beginning to end, and once you realize that he has noticed that rising mountain range and the various surrounding objects on his own, let him speak whatever comes to his mind. You, however, should remain silent for a moment as if deep in thought, and ask: “This sun set over there yesterday. Today, it seems to have risen over here. How do you suppose that happened?” That is all. Do not say a single thing beyond that.’
Suppose he asks you something. Do not attempt to answer. Speak of some other matter. Leave him to himself. I tell you with absolute certainty: he will not be able to resist contemplating on his own what you have asked.’
When teaching is a patient process like this, it is not training; it is an awakening. Such schools produce not just experts, but artists, athletes, poets, and philosophers. Their skills are both mechanical and creative— what Aristotle distinguished as calculative (logistikon) and contemplative (epistemonikon) skills.
While mechanical skills can be learned alone, creative skills require a group, a social life, and the ability to look both inward and outward.
When K.M. Suguna became our Principal, our school began to make ample room for these creative skills. She didn’t drastically change the curriculum or the daily schedule. Instead, she created spaces within the existing routine for the children’s creative powers to wake up. She loosened the frame where it was too tight and tightened it where it was too loose.
Her leadership was a perfect example of Quality as Value Addition. She proved through small examples that quality does not emerge out of thin air; it is simply the effort to do today’s daily tasks slightly better than yesterday.
For example, she viewed keeping the school clean as a sign of quality. Everyone knows they should keep their surroundings clean, but that knowledge rarely becomes a habit. Why?
Her answer was surprisingly practical: the lack of trash cans within easy reach. What she meant was this: suppose someone sees a piece of scrap paper in the school courtyard. Everyone naturally feels that it shouldn’t be there and wants to remove it, but once they pick it up, the question of where to throw it arises. This is because there is no trash can nearby. No one has the patience to take that piece of paper, search for a trash can, and throw it in. Expecting them to do so is also not fair. On the other hand, if we set up trash cans everywhere possible across the school premises, it becomes effortless for anyone to pick up the litter they see and drop it into the bin.
That was all well and good, but how to maintain those trash cans sustainably? She found a way for that too. She took empty old oil tins from the kitchen, cut open their tin tops, painted the cans white, and had ‘Please, Use Me’ written on them in blue. She then tied them securely to trees here and there across the school premises using iron wire. Sweepers would empty them once a day or every two days.
Enhancing qualitative value is a task that must be carried out with this exact kind of practicality. It is a silent revolution that thoroughly cleanses your system from its very roots, without ever appearing to disrupt or shake things up superficially.
9-7-2026


రోజూ చేసే చిన్న చిన్న పనులను నిన్నటికంటే కాస్త మెరుగ్గా చేయడమే నాణ్యత, దాన్నే Value Addition అంటారని చెత్తబుట్టల ఉదాహరణతో మీ ప్రిన్సిపాల్ గారు ఎంతో practical చూపించిన తీరు చాలా inspiring, sir. It was a demo of problem solving too
“ప్రతి ఉపాధ్యాయుడూ పాఠాన్ని ఎత్తుకునే ముందు తను ముందు రోజు ఎక్కడ వదలిపెట్టాడో దాన్ని విద్యార్ధుల ద్వారా రాబట్టేవాడు. ఆ మొదటి ప్రశ్నల్నే తన మోటివేషన్‌గా వాడుకుని నెమ్మదిగా కొత్త పాఠంలోకి ప్రవేశిస్తూ నేర్పుగా తన విద్యార్ధుల్ని కూడా వెంటబెట్టుకుపోయేవాడు”
అని చదవగానే ఈ విధంగా నిన్న చెప్పిన పాఠంలోనుండో లేక దైనందిన జీవితంలోనుండో మెల్లగా ప్రశ్నలు అడుగుతూ లేదా conversation తో మొదలు పెట్టి మెల్లగా పాఠం లోకి విద్యార్థులను తీసుకువెళ్ళడానికి effective గా Teaching Plans రాయడానికి రాసినా దాన్పి classroom లో సక్రమంగా execute చెయ్యడానికి పడిన కష్టాలు గుర్తొచ్చాయి. 😄
Effective Schools గురించి చెప్పిన analysis, అలాగే గురుకుల పాఠశాల ఒక Effective School నుంచి ఉత్తమ, ఆదర్శ పాఠశాలగా ఆరేళ్లలో transform అయిన తీరు చదవడం చాలా interesting, సర్. మీరు చెప్పిన standards ప్రకారం నేను చదివిన school ని వెతుక్కున్నాను. చాలానే కనిపించింది.
ఈ భాగం చదువుతుంటే మళ్లీ స్కూల్ రోజులే కాదు, Education క్లాసుల్లో నేర్చుకున్న Teaching Methods and lessons కూడా గుర్తొచ్చాయి. 🙏🏽
చాలా చాలా సంతోషం. ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుని ఈ పుస్తకం చదివిన ప్రతిసారి నాకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి.
చాలా బాగుంది ఈ భాగం భద్రుడు గారు. ఎల్కేజీ మొదలుకుని కనీసం డిగ్రీ వరకు ఉపాధ్యాయులుగా పదవి చేపట్టే ప్రతివారు ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలి. కొద్ది పాటి లోక జ్ఞానం రాగానే విద్యార్థులు కూడా. కేవలం ఇప్పటివరకూ మీరు పంచుకున్న భాగాలు చదివినందుకే టీచర్ వృత్తి పట్ల అపారమైన గౌరవం పెరగడంతో పాటు చిన్నప్పుడు ఈ పుస్తకంలో మీరు తెలిపిన సంగతులు ఎవరైనా చెప్పి ఉంటే పెద్దయ్యాక ఏ డాక్టరో , ఇంజనీర్నో కాకుండా టీచర్ అయ్యే దిశగా జీవితాన్ని నడిపే వాణ్ణేమో.
రూసో సూర్యోదయ దృశ్యం పిల్లలకి ఎలా పరిచయం చెయ్యాలో చెప్పిన ఉదంతం అద్భుతః
మీరు చెప్పిన యాపిల్ ఎగ్జామ్పుల్ లో నేను మూడో విధంగా అంటే ప్రకృతిలో సహజం గా కనబడే వివిధ రకాల షేపులు, లేకపోతే రకరకాల వస్తువులతో చేసే అరేంజ్మెంట్లు, పెయింటింగ్ లలో బొమ్మలు చూసి అవి యాపిల్ లా ఉన్నాయని పోల్చడం గురించి కూడా ఎక్కడో చదివినట్టు గుర్తు.
ఇంక ఈ భాగంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ — “బోధన అనేది సహనశీల ప్రక్రియగా జరిగినప్పుడు అది శిక్షణగా కాక, మేల్కొలుపుగా పరిణమిస్తుంది. అటువంటి పాఠశాల నుండి కేవలం నిపుణులు మాత్రమే కాక కళాకారులు, క్రీడాకారులు, కవులు, రచయితలు, వేదాంతులూ కూడా ఉద్భవిస్తారు.” — దీనికి సాక్ష్యం మాకు ప్రత్యక్షంగా కనబడుతోంది. ఆ పాఠశాల, ఆ ఉపాధ్యాయులు, వారి బోధన అన్నీ ధన్యత చెందినట్టే..
Tears in my eyes.