
ఆరవరోజు: రెండవ సంభాషణ
ఆ ఉప్పు బొమ్మ సముద్రంగా మారిపోతుంది
గురూజీ రామ చరిత మానస్ మరలా తెరిచారు. మొదటిపుటల్లోంచే ఒక చౌపాయీ వినిపించడం మొదలుపెట్టారు.
బిప్రచరణ బరు రఖ మతి ధీరా,
తుమ్హహి కరిహి మనోభవ పీరా॥
సును ముని హోఇ మోహ మన తాకే ,
గ్యాన బిరాగ హృదయ నహిఁ జాకే॥
అని మొదలుపెట్టి కొంత భాగం పైకి చదివి, తాత్పర్యం చెప్పడం మొదలుపెట్టారు. ‘చూడండి, విష్ణు భగవానుడు నారదుడితో అంటున్నాడు, ‘ఓ మునీశ్వరా! ఎవరి మనస్సులో అయితే మోహము కలుగుతుందో, వారి హృదయంలో జ్ఞానవైరాగ్యాలు లేవని అర్థం. ఒకవేళ జ్ఞానవైరాగ్యాలుంటే, అక్కడ మోహం కలగడానికి వీల్లేదు. అసలు ఇదంతా ఏమిటి, ఎందుకు జరుగుతోంది అనేది అతనికి ముందే తెలుస్తుంది. జ్ఞాన-వైరాగ్యాలు లేని హృదయంలోనే మోహం ప్రవేశిస్తుంది.’
‘నారదుడు అహంకారంతో కూడిన మనసుతో ‘భగవంతుడా! అంతా నీ కృప వల్లనే జరిగింది’ అన్నాడు. కరుణానిధి విష్ణువు అది విని నారదుడి హృదయంలో అహంకారమనే పెద్ద వృక్షం మొలకెత్తడం చూశాడు. ‘నా సేవకుడికి హితం చేకూర్చడం నా బాధ్యత, కాబట్టి ఈ అహంకారాన్ని వెంటనే వేళ్లతో సహా పెకలించి వేస్తాను. మునికి మేలు జరిగేలా ఒక లీల సృష్టిస్తాను, దానికోసం ఒక ఉపాయం ఆలోచిస్తాను’ అనుకున్నాడు.’
‘అప్పుడు నారదుడు హరి పాదాలకు శిరస్సు నమస్కరించి, మనస్సుని మరింత అహంకారం ఆవరిస్తుండగా అక్కణ్ణుంచి బయలుదేరాడు. అప్పుడు లక్ష్మీపతి తన కఠినమైన మాయని ప్రేరేపించాడు, ఆ మాయ లీలలు వినండి. ఆయన దారిలోనే వంద యోజనాల వెడల్పు గల ఒక అందమైన నగరాన్ని సృష్టించాడు. ఆ నగరం నిర్మాణాలు సాక్షాత్తూ వైకుంఠపురంకన్నా ఎంతో వైభవంగా ఉన్నాయి. ఆ నగరంలో నివసించే ప్రతి ఒక్క స్త్రీ, పురుషుడూ ఎంతో అందంగా, సాక్షాత్తూ రతీమన్మథులు రూపాలు దాల్చారా అన్నట్లు ఉన్నారు. ఆ నగరాన్ని శీలనిధి అనే రాజు పాలిస్తున్నాడు. అతని దగ్గర లెక్కలేనన్ని గుర్రాలు, ఏనుగులు, సైన్యాలు ఉన్నాయి. వంద మంది ఇంద్రుల వైభవ విలాసాలు, రూపం, తేజస్సు, బలం, నీతి అన్నీ కలిపి ఒకేచోట ఉన్నట్లు ఆ రాజు విరాజిల్లుతున్నాడు. ఆ రాజుకు విశ్వమోహిని అనే కుమార్తె ఉంది. ఆమె రూపాన్ని చూస్తే సాక్షాత్తూ లక్ష్మీదేవి మోహించిపోతుందా అన్నట్లు ఉంది. సకల గుణాల గని అయిన ఆ కన్య, హరి మాయాస్వరూపమే, ఆమె శోభను వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఆ రాజకుమారి స్వయంవరం జరుగుతుండటంతో, అక్కడికి లెక్కలేనంత మంది రాజులు, భూపాలకులు వచ్చారు.’
‘నారద ముని ఆ నగరంలోకి ప్రవేశించగా, నగర ప్రజలందరూ ఆయనను ఎంతో భక్తితో పలకరించారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజు, మునీశ్వరుడిని తన రాజభవనానికి ఆహ్వానించి, పూజించి, ఆసనం మీద గౌరవంగా కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తన కుమార్తెని నారదుడికి చూపించి, ‘ఓ నాథా! ఈమెకున్న సకల గుణదోషాలు పరిశీలించి నాకు చెప్పండి’ అని ప్రార్థించాడు.’
‘ఆమె రూపాన్ని చూడగానే నారద ముని తన వైరాగ్యాన్నే మరచిపోయాడు, చాలా సేపటి వరకు ఆమెనే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆమెకున్న శుభ లక్షణాలు చూసి తనను తాను మరచిపోయి, మనసులోనే ఎంతో ఆనందించాడు కానీ ఆ ఆనందం పైకి కనబడనివ్వలేదు. ‘ఈమెను పెళ్లాడేవాడు అమరుడవుతాడు, యుద్ధభూమిలో అతణ్ణి ఎవరూ గెలవలేరు. శీలనిధి కుమార్తెను వరించే వాడికి సకల చరాచర సృష్టి దాసోహమంటుంది’ అని మనసులో అనుకున్నాడు.
‘కానీ తన మనసులో కలుగుతున్న భావాలు తన మనసులోనే దాచుకుని పైకి మాత్రం రాజుతో ‘ఓ రాజా ,నీ కుమార్తె ఎంతో ఉత్తమలక్షణవతి అనిచెప్పాడు. ఆ తర్వాత ఆమె గురించిన ఆలోచనల్తో మనసులో వ్యాకులపడుతూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. ‘ఎలాగైనా ఈ కన్య నన్నే వరించేలా నేనేదైనా ఉపాయం ఆలోచించాలి. ఇప్పుడు జపతపాలకి సమయం లేదు. ఓ విధాతా! ఈమె నాకు ఎలా దక్కుతుంది?’ అని అనుకున్నాడు. ఒకటే దారి, ఇప్పుడు నాకు సాటిలేని అందం, చక్కని రూపం కావాలి. ఆ రూపం చూసి రాజకుమారి మోహిస్తే ఆమె నా గళంలోనే జయమాల వేస్తుంది అనుకున్నాడు. హరిని అడిగి ఆ సుందరరూపం పొందుతాను. కానీ సమయం ఆట్టే లేదు. నాకు సహాయం చెయ్యడానికి హరిని మించినవాళ్ళెవరూ లేరు. ఇప్పుడు ఈ అవసరంలో ఆయనే ఆదుకోవాలి ‘ అని అనుకున్నాడు. అప్పుడు ఎన్నోవిధాలుగా హరిని ప్రార్థించాడు. లీలావినోదీ, కృపాళువూ అయిన భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని చూడగానే నారదుడి మనసు చల్లబడింది. తన పని నెరవేరుతుందనుకున్నాడు. ఎంతో ఆర్తితో తన సమస్య మొత్తం చెప్పి ‘ ఓ హరీ, నామీద కృపచూపించు, నాకు సాయం చెయ్యి, నాకు నీ అందమైన రూపాన్నివ్వు. లేకపోతే ఆమె నాకు దక్కే మార్గం లేదు. కాబట్టి నాకు మేలు కలగాలంటే ఈ నీ దాసుడికి నీ రూపం అనుగ్రహించు’ అని వేడుకున్నాడు. తన మాయ పనిచేస్తుండటం చూసి దీనదయాళుడైన హరి మనసులోనే నవ్వుకుని, ‘నారదా, నీకు ఏది మంచో అదే చేస్తాను, నా మాట నమ్ము’ అని అన్నాడు.’
‘ఈ కథ చూడండి. నారదుడికి జ్ఞానం లేకపోవడమేమిటి? ‘నారదా, ఎవరి హృదయంలో జ్ఞానవైరాగ్యాలు ఉండవో వాడు మోహంలో పడిపోతాడు ‘ అంటున్నాడు భగవంతుడు. మనదగ్గర వైరాగ్యాన్ని అన్నిటికన్నా గొప్ప విషయంగా చెప్పారు. అసలు మనిషికి వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే వాడు లోపాలు చూసుకోగలుగుతాడో అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. లోపాలు కనబడనంతవరకు వైరాగ్యం పుట్టదు. మనిషి ఏ పనిలో మునిగితేలుతుంటాడో, దేనిలో గొప్ప మస్తీగా జీవిస్తుంటాడో అందులో లోపాలు కనిపించినప్పుడు వాడికి వైరాగ్యం పుడుతుంది. అంటే లోపాలు కనబడటమే వైరాగ్యానికి మూలం.’
‘అవును. మీరు అడగవచ్చు. ఒకసారి వైరాగ్యం పుట్టాక మళ్ళీ మోహం ఎందుకు కలుగుతుంది అని. కలగదు. ఎందుకంటే వాడు దాన్నుంచి దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కానీ జ్ఞానవైరాగ్యాలు రెండూ ఉండాలి. ఈ రెండూ ఒకేసారి ఉండటం చాలా ముఖ్యం. కేవలం వైరాగ్యం సరిపోదు. జ్ఞానం కూడా ఉండాలి. వైరాగ్యం పుట్టిన తరువాత మనిషి ఏమీ చేయకుండా కూర్చుంటే అది వ్యర్థం. ఆ తర్వాత తపస్సు మొదలవ్వాలి.
తప బల సృష్టి రచేఇ బిధాతా,
తప బల విష్ణు సచల జగ త్రాతా॥
తప బల సంభు కరహిం సంఘారా,
తప బల శేష ధరే మహి భారా॥
వైరాగ్యం తర్వాత తపస్సు ఉండాలి, తపస్సు తాలూకు శక్తి చాలా గొప్పది. తపోశక్తితోనే బ్రహ్మ సృష్టిని చేస్తాడు, తపోశక్తితోనే విష్ణువు జగత్తును పోషిస్తాడు. తఫొ శక్తితోనే శివుడు సంహరిస్తాడు, తపోబలంతోనే శేషనాగు భూమి భారాన్ని మోస్తాడు. కాబట్టి దేనికైనా తపస్య అవసరం. తపస్సంటే కేవలం కళ్లు మూసుకుని కూర్చోవడం కాదు, నిరంతరం అంతరంగంలో ఏదో ఒక సాధన సాగుతూనే ఉండాలి, దాన్నే తపస్సు అంటారు. తపస్సు లేకుండా ఏదీ సాధ్యం కాదు, సాధన లేకుండా ఏదీ లభించదు.’
‘కానీ ఇక్కడ నారదుడికి తన తపస్సు పట్ల కూడా ఒక రకమైన అహంకారం వచ్చేసింది. అహంకారం వేరు, ‘అహమ్’ వేరు. మనిషికి అహమ్ అవసరం, అహంకారం కాదు. ఉదాహరణకి, ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు ఎంత ఉందో కొలవడానికి వెళ్ళింది. అది సముద్రంలోకి వెళ్ళగానే ఏమైంది? అది కూడా సముద్రంగా మారిపోయింది, అందులోనే కలిసిపోయింది. మనిషి తన ఉనికిని పూర్తిగా కోల్పోయి అందులో లీనమైనప్పుడు, అతనికి ఒక విశాలమైన గుర్తింపు వస్తుంది; ఆ ఉప్పు బొమ్మ పేరు సముద్రంగా మారిపోతుంది. అలా సముద్రంలో లీనమైపోవడాన్నే ‘అహమ్’ అంటారు.
బ్రహ్మదేవుడు మొదట సృష్టి చేసినప్పుడు, చాలా సత్వభావంతో చేశాడు. అందులో భాగంగా సనక, సనందన, సనత్కుమారుల్ని సత్వభావంతో పుట్టించాడు. సృష్టిని విస్తరింపచెయ్యమని వాళ్ళనడిగాడు. కానీ వాళ్ళు మాత్రం సృష్టి జోలికి పోకుండా కేవలం జ్ఞానం, వైరాగ్యం, మోక్షం అంటూ మాట్లాడుతుంటే బ్రహ్మకు చాలా కోపం వచ్చింది. ‘సృష్టిని పెంచమంటే, మీరు నాకే జ్ఞానబోధ చేస్తున్నారా! పొండి, మీరెప్పటికీ చిన్న పిల్లలుగానే ఉండిపొండి’ అని శపించాడు. అందుకనే వాళ్ళెప్పుడూ చిన్నపిల్లలుగానే ఉంటారు.’
‘ఆ తర్వాత చాలాసేపటిదాకా బ్రహ్మకి కోపం తగ్గలేదు. ఆ కోపంతో ఆయన భృకుటి ముడిచినప్పుడు అక్కణ్ణుంచి ఒక పిల్లవాడు కిందపడ్డాడు. వాడు విపరీతంగా ఏడుస్తూ ‘నా పేరేమిటి? నా పేరేమిటి?’ అని అడగడం మొదలుపెట్టాడు. బ్రహ్మకి మరింత కోపమొచ్చి ‘ఛీ, ఇంతగా ఏడుస్తున్నావు కాబట్టి నీ పేరు రుద్రుడు’ అని అన్నాడు. రుద్రుడంటే ఏడ్చేవాడు. అప్పుడు సృష్టి బాధ్యత వాణ్ణి తీసుకొమ్మన్నాడు. ఏడ్చేవాడు సృష్టి చేస్తే అదెలా ఉంటుంది? వినాశకరమైన సృష్టి! ఆ రుద్రసృష్టి ఎంత భయంకరంగా ఉందంటే అందులో ఎక్కడ చూసినా ఏడుపులే ఉన్నాయి. దాంతో బ్రహ్మకి మరింత కోపం వచ్చి ఆ రుద్రసృష్టిని అక్కడితో ముగించేసాడు.’
‘ఆ తర్వాత పదిమంది ప్రజాపతుల్ని పుట్టించాడు. వాళ్ళల్లో కశ్యపుడు కూడా ఒకడు. సృష్టిని కొనసాగించమని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళన్నారు కదా ‘సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం, కానీ అందులో మూడు గుణాలు ప్రధానంగా ఉంటాయి, సత్త్వ, రజో, తమో గుణాలు. మేం రజోగుణం నుంచి పుట్టాం. కానీ ఈ సృష్టిలో తక్కిన రెండు గుణాలూ కూడా ఉంటాయి’ అని. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ సుందర సృష్టి వారు సృష్టించిందే. ఇది కేవలం పూర్తి సత్త్వభావంతోగాని లేదా పూర్తి తమోభావంతోగాని జరిగింది కాదు, ఒకవేళ అటువంటి సృష్టిజరిగినా అది అంత అందంగా ఉండదు.’
‘లోకంలో చాలామంది ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎంతో సత్త్వభావంతో, నిష్కల్మషంగా మొదలుపెట్టడం మనం చూస్తాం. కొంతకాలంపాటు చాలా సాత్త్విక మనస్సుతో అందులో నిమగ్నమవుతారు. కానీ ఆ తర్వాత మెల్లగా రుద్రసృష్టిలోకి వచ్చేస్తారు. అంటే ‘మనకి తోడుగా ఎవరున్నారు? ఇంత కష్టపడి పనిచేసినా మనల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? మనకి ఏం లభించింది? సమాజంలో మనకి దొరికిన గుర్తింపు ఏమిటి? మనకేం పేరొచ్చింది?’ -ఇలా ఆలోచించడం మొదలుపెడతారు.’
‘ఆ తర్వాత వాళ్ళ ఏడుపంతా కేవలం పేరుప్రతిష్ఠలకోసమే మొదలవుతుంది. అదే రుద్రసృష్టి. ఒకవేళ మనిషి ఆ గుర్తింపు అనే చట్రంలోనే ఇరుక్కుపోతే అక్కడే నాశనమైపోతాడు. అందుకని అతడు ఆ గుర్తింపు తాపత్రయాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. అప్పుడతను ఏది సృష్టించినా అది చాలా అద్భుతంగా ఉంటుంది.’
‘కానీ మన చుట్టూ ఉన్న మనుషులు ఆ రుద్రసృష్టి దగ్గరే ఆగిపోతారు. తమ గుర్తింపుకోసం, పేరు కోసం, తాము సంపాదించే వస్తువులకోసమే పాకులాడుతూ అక్కడే ఆగిపోతారు గానీ ముందుకు వెళ్ళరు. ఎందుకంటే ఈ రోజుల్లో లోకానికి గుర్తింపు అంత ముఖ్యమైపోయింది.’
‘కాబట్టి మన ఆధ్యాత్మిక సాధనలన్నింటిలోనూ పరమార్థం ఇదే. మనలోపల ఉండే ఆ గుర్తింపుని, అంటే ఆ అహంకారాన్ని కూడా వదిలించుకోవడం. కానీ అది అందరి వల్ల సాధ్యం కాదు. ఏ రోజైతే మనిషి గుర్తింపు తాపత్రయం వదిలేస్తాడో ఆ క్షణమే ఋషిగా మారిపోతాడు. ఒక అనంతత్త్వంలో, ఆ పరమాత్మలో కలిసిపోతాడు. కానీ అలా గుర్తింపుని వదులుకునేవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు.’
తత్త్వశాస్త్రంలో అరిస్టాటిల్ గురువు ప్లేటో ఉన్నాడు కదా. ఆయన శిష్యులు ఆయన్ని ఒకసారి ఒక ప్రశ్న అడిగారు. ‘గురుదేవా, ఈ ప్రపంచంలో మీ పరిపాలన వస్తే మీరు మొదటగా ఏం చేస్తారు?’ అనడిగారు. దానికి ఆయన ‘ఈ ప్రపంచంలో ఎంతమంది సాహిత్యకారులు, ఎంతమంది గొప్ప వక్తలు, ఎంతమంది కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ దేశం నుంచి బహిష్కరిస్తాను’ అని అన్నాడు. శిష్యులు ఆశ్చర్యపోయి ‘అదేమిటి గురుదేవా? వాళ్ళనెందుకు బహిష్కరిస్తారు?’ అనడిగారు. అప్పుడు ప్లేటో ఏమన్నాడో తెలుసునా? ‘వాళ్ళంతా నమ్మకద్రోహులు. సమాజానికి ఏది అవసరమో వాళ్ళకి బాగా తెలుసు. కానీ వాళ్ళు సమాజానికి ఏది నచ్చుతుందో అదే చెప్తారు. కేవలం చప్పట్లు కొట్టించుకోవడం కోసం, ప్రజలకి ఏది ఇష్టమో, అదే వాళ్ళ ముందు పెడుతుంటారు. ఇది బేయీమానీ కాకపోతే మరేమిటి?’
‘ఇప్పటి సాహిత్యం కూడా అంతే. ప్రజలకు ఏది ఇష్టమో దాన్నే మేము సమాజానికి అందిస్తాం అంటారు. కానీ సమాజం దేన్నిష్టపడాలో నేర్పించవలసిన బాధ్యత మీది కదా. అది మీకు తెలుసు కదా. అయినా కేవలం చప్పట్లకోసం ప్రజల బలహీనతలు వాడుకుంటారు. అందుకే మీరంతా బేయీమాన్లు. మీలో ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టను అంటాడు ప్లేటో.’
‘ఒక కథ చెప్పనా? ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉండేవాడు. అతనికి ఒక యమదూతతో స్నేహం కలిసింది. ఒకరోజు ఆ యమదూత అతడికి దగ్గరికొచ్చి ‘మిత్రమా, నీ ఆయుష్షు ఇంకో ఆరునెలలు మాత్రమే ఉంది. నిన్ను తీసుకువెళ్ళే డ్యూటీ నాకే పడింది. కాబట్టి ఈ ఆరునెలల్లో ఏం చేసుకుంటావో చేసుకో’ అని చెప్పాడు.’
‘ఆ కళాకారుడు చాలా తెలివిగా, శరవేగంగా తనలాగే ఉండే మట్టిబొమ్మల్ని వందలసంఖ్యలో తయారుచేసాడు. ఆరునెలల తరువాత యమదూత వచ్చేసమయానికి ఆ మట్టిబొమ్మలన్నింటినీ వరసగా నిలబెట్టి వాటి మధ్యలో తను కూడా ఒక బొమ్మలాగా నిలబడిపోయాడు.’
‘యమదూత వచ్చి చూసాడు. అందరూ ఒకేలా ఉన్నారు. అందులో అసలైన మనిషి ఎవరో గుర్తుపట్టలేక, తికమకపడి, యమరాజు దగ్గరికి వెళ్ళి, ‘మహారాజా, అక్కడ పెద్ద గందరగోళంగా ఉంది. అక్కడ ఒక్కడు లేడు. అందరూ ఒకేలాగా ఉన్నారు. నేను ఎవరిని తీసుకురావాలి?’ అనడిగాడు. అప్పుడు యమరాజు దున్నపోతుమీద తనే స్వయంగా వచ్చాడు. ఆయన కూడా చూసి ఆశ్చర్యపోయాడు: ఇందులో అసలైనవాడెవడు? కాసేపు ఆలోచించి, యమరాజు ఒక ఉపాయం తోచి, బిగ్గరగా ‘ఓహో! ఇంత అద్భుతమైన సృష్టి చేసిన కళాకారుడు ఎవడోగానీ నా ముందుకొస్తే నేనతణ్ణి ఘనంగా సన్మానిస్తాను’ అని ప్రకటించాడు.
‘అంతే! ఆ మాట వినగానే ఆ కళాకారుడు గర్వంతో ఊగిపోతూ, బొమ్మల మధ్యలోంచి బయటకొచ్చి ‘నేనే ఆ కళాకారుణ్ణి’ అన్నాడు. యమరాజు నవ్వి ‘రా, ఇటు రా, నీ సన్మానం ఏమిటో యమలోకంలో చూపిస్తాను’ అని పట్టుకుపోయాడు. అంటే కళాకారులు తమ సన్మానంకోసం, కీర్తికోసం చావుకైనా సిద్ధపడతారన్నమాట.’
‘సమాజంలో కళాకారుడి పాత్ర ఏమిటనేదానిమీద ఈ కథలో చాలా లోతైన విశ్లేషణ ఉంది. మన దేశంలో పూర్వకాలపు కళాకారులకీ, ఆధునిక కళాకారులకీ మధ్య ఒక పెద్ద తేడా ఉంది. నేటి కాలపు కళాకారుడు తన కాన్వాసు ముక్కని మాత్రమే తన ప్రపంచంగా భావిస్తాడు. అతడు పేదరికాన్ని, మురికివాడల్ని పెయింటింగులు వేస్తాడుగానీ, ఆ మురికివాడ గోడని కూడా ఒక కాన్వాసుగా మార్చి దాని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచన అతనికి రాదు. కాని పూర్వకాలపు కళాకారులు అలా కాదు. వాళ్ళు మన మొత్తం భూభాగాన్ని, మన ప్రకృతిని, మన ప్రపంచాన్ని తమ కాన్వాసుగా భావించారు. అందుకే భారతదేశంలో ఎక్కడ చూసినా శిల్పాలు, కట్టడాలు అంత అద్భుతంగా సృష్టించారు. వాతావరణానికి ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో దాన్నక్కడ అలా సృష్టించుకుంటూపోయారు. గాలులు వీచని కార్తికమాసంలో ఆ వాతావరణాన్నంతా అందంగా మార్చడానికి ఎక్కడ చూసినా దీపాలు పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.’
మనం మళ్ళీ నారదుడి కథలోకి వద్దాం. నారదుడు భ్రమకి లోనయ్యాడని చెప్పానుకదా.
మాయా బిబస భయే ముని మూఢా
సముఝి న హరి గిరా నిగూఢా
ఆయన పూర్తిగా మాయలో చిక్కుకున్నాడు కాబట్టి విష్ణువు మాట్లాడుతున్న మాటల్లోని గూఢత్వాన్ని గుర్తుపట్టలేకపోయాడు.
గవనే తురత తహా రిషిరాఈ,
జహా స్వయంవర భూమి బనాఈ
ఆయన నేరుగా ఆ స్వయంవరం ఏర్పాటు చేసిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ రాజులంతా తమ సైన్యాలతో, పరివారంతో వచ్చి తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు. నారదుడు కూడా వాళ్ళ మధ్యనే కూర్చుని తన రూపం చాలా సుందరంగా ఉందని మనసులోనే గర్వపడుతూ ‘ నన్ను చూసిందంటే రాజకుమారి మరెవర్నీ పట్టించుకోకుండా ఆ వరమాల నా మెళ్ళోనే వేస్తుంది’ అనుకుంటూ ఉన్నాడు. కానీ విష్ణువు ఆ మునికి మాటిచ్చాడు కదా, అతనికి ఏది మంచినో అదే చేస్తానని, అందుకని అతనికి వర్ణించలేనంత కురూపాన్ని ప్రసాదించాడు. ఆ సభలో ఉన్న రాజులెవరూ కూడా ఆ దైవలీల గమనించలేదు. వారు కేవలం నారదముని తలవంచుకుని కూచోడం మాత్రమే చూసారు. ఆ సభలో శివగణానికి చెందిన ఇద్దరు ప్రమథులు కూడా బ్రాహ్మణవేషం ధరించి అక్కడ జరుగుతున్న వింతలు చూస్తూ సంతోషిస్తూ ఉన్నారు. వారు నారదుడి వెనకచేరి పరిహాసం చెయ్యడం మొదలుపెట్టారు. ‘భగవంతుడు విష్ణువులాంటి రూపం ప్రసాదించాడు నీకు! ఆ రాజకుమారి నిన్ను చూసిందంటే మోహించి నువ్వే హరివనుకుని నీ గళంలోనే జయమాల వేసేస్తుంది’ అని అంటున్నారు. నారదుడు పూర్తిగా అహంకారంతో, మోహంలో మునిగిపోయినందువల్ల ఆ దుర్మార్గులు తనని పరిహసిస్తున్నారని గ్రహించలేకపోయాడు. ఎంతో గర్వంగా కూర్చున్నాడు.’
‘ఇంతలో రాకుమారి చేతిలో బంగారు జయమాల పట్టుకుని హంసలాగా నడుస్తూ ఎంతో విలాసంగా స్వయంవర మందిరంలో అడుగుపెట్టింది. ఆమె అక్కణ్ణుంచి రాజులందరినీ దాటి తన వరుడికోసం వెతుకుతోంది. నారదుడు కూర్చున్నచోటుకి రాగానే ఆమెకి ఆయన భయంకర రూపం కనిపించింది. ఆయన వదనంలో ఒక కోతిముఖం కనిపించింది. ఆ రూపం చూడగానే ఆమెకి మనసులో అసహ్యం, కోపం రెండూ కలిగాయి. ఆమె నారదుడి పట్ల తృణీకారం చూపిస్తూ తన చెలికత్తెలతో ముందుకు వెళ్ళిపోయింది. నారదుడు ఆశగా ఆసనాలు మారుతూ ఆమె దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతణ్ణి పట్టించుకోలేదు. చివరకి ఒక రాజు వేషంలో సభలో ప్రవేశించిన విష్ణువుని చూసి ఆయన మెడలోనే వరమాల వేసింది. విష్ణుభగవానుడు రాకుమారిని తీసుకువెళ్ళిపోతుంటే సభలో ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారు.’
‘నారదుడి వెనక కూర్చున్న ప్రమథులిద్దరూ నారదుడి దుస్థితిచూసి ‘ ఓ మునీశ్వరా, నువ్వు అందరినీ మించిన వరుణ్ణి అనుకుంటున్నావు కదా, పోయి ఒక సారి నీ ముఖంలో నీళ్ళల్లో చూసుకోగూడదా?’ అన్నారు. ఆ మాటలకి నొచ్చుకున్న నారదుడు దగ్గరలోనే ఉన్న ఒక కొలనుదగ్గరికి వెళ్ళి తన ప్రతిబింబం చూసుకున్నాడు. అక్కడ భయంకరమైన కోతిముఖం కనిపించడంతో ఆయన దిగ్భ్రాంతి చెందాడు. భగవంతుడే తనని మోసం చేసి నలుగురి ముందు నవ్వులపాలు చేసాడని పట్టలేనంత కోపం వచ్చింది. లక్ష్మీదేవితో కలిసి వెళ్తున్న భగవంతుణ్ణి దారిలోనే అడ్డుకుని ‘నువ్వు ఇతరుల సుఖాన్ని,ఎదుగుదలని చూసి ఏ మాత్రం ఓర్వలేవు. నీ మనసులో ఎప్పుడూ అసూయ, కపటం నిండి ఉంటాయి. క్షీరసాగరసమయంలో కూడా నువ్విలానే శివుణ్ణి మోసపుచ్చి ఆయనతో విషం తాగించావు. అమృతం నీకోసం అట్టేపెట్టుకున్నావు. నిన్ను శాసించే యజమాని అంటూ ఎవరూ లేకపోవడం వల్ల నువ్వు నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నావు. మంచిని చెడుగా, చెడును మంచిగా మారుస్తున్నావు. ఎదుటివాళ్ళ కష్టాలు చూస్తే నీకేమీ బాధ కలగడం లేదు. నువ్వు నన్ను ప్రపంచం ముందు నవ్వులపాలు చేసావు, అందుకే నేనునిన్ను శపిస్తున్నాను, చూసుకో. నువ్వు మనిషిగా పుడతావు. నాకు ఏ కోతిముఖాన్నిచ్చావో, ఆ కోతుల్నే సాయం అడుక్కుం టావు. నేను కోరుకున్న కన్యని నువ్వు నానుంచి లాక్కున్నావు. రేపు నువ్వు కూడా నీ ప్రాణేశ్వరికి దూరమై తీవ్రమైన వేదన అనుభవిస్తావు ‘ అని శపించాడు.
విష్ణుభగవానుడు నారదుడి శాపాన్ని చిరునవ్వుతో తన మాయ చేస్తున్న లీలగా భావించి శిరసావహించాడు. ఆ తర్వాత తన మాయని ఉపసరించుకోగానే నారదుడికి తన పూర్వరూపం లభించింది.
శ్రాప శీష ధరి హరషి కపి,
ప్రభు బహు బినతీ కీన్హ
నిజ మాయ కై ప్రబలతా,
కరషి కృపానిధి లీన్హ
భగవంతుడు ఆ శాపాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించాడు, మాయనుంచి బయటపడ్డాక నారదుడు తన తప్పు తెలిసింది. దేవుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. ఆ విధంగా శివుడు పార్వతికి రాముడి అవతారం గురించి వివరిస్తూ, ‘హే పార్వతీ! రాముడి అవతారం వివిధ కల్పాలలో వివిధ కారణాల వల్ల జరిగింది. ఒకసారి ద్వారపాలకులైన జయవిజయుల శాపం వల్ల, ఒకసారి కశ్యపుడు-అదితిల వరాల వల్ల, మరొకసారి నారదుడికి కలిగిన మోహం వల్ల, దాని ఫలితంగా ఇచ్చిన శాపం వల్ల కలిగాయి’ అన్నాడు.
అదేవిధంగా, కాకభుశుండి పక్షిరాజు గరుడుడితో ఇలా అంటున్నాడు, ‘హే గరుడా! రామావతారం జరిగినప్పుడల్లా నేను ఆయన బాలలీలలను చూడటానికి అయోధ్యకు వెళ్తాను. రాముడికి ఐదేళ్లు వచ్చే వరకు నేను అయోధ్యలోనే ఉంటాను. భగవంతుడి అవతారాలు అనంతం, ఆయన మహిమలు చాటే కథలు కూడా అంతే అనంతం.’
బోల్ సియావర్ రామచంద్ర కీ జై! ఉమా పతి మహాదేవ్ కీ జై! పవన్ సుత్ హనుమాన్ కీ జై!
కథా సమాప్త హోత హై
సునహు వీర్ హనుమాన
రామ్ లఖన జానకీ
సదా కరహు కల్యాన!
‘నా ఆలోచన ఏంటంటే, ఈ చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటిలో ఒకసారి అఖండ రామాయణ పాఠం చేయాలి. కొంతమంది జనాలు ఉంటే, ఆ ఒక్క పాఠంలోనే గ్రామాల వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవచ్చు, ఆ తర్వాత మళ్ళా రెండోసారి చేయవచ్చు. అదెలా చెయ్యొచ్చో ఆ పూర్తి విధానం నేను మరెప్పుడైనా చెప్తాను. కానీ అది జరగలేదు, ఎందుకంటే చాలామంది జనాలు ‘మేము చేయిస్తాం గురూజీ, మేము చేయిస్తాం!’ అంటూ తమ నాయకత్వాన్ని ప్రదర్శించుకోవడానికే ముందుకు వచ్చారు తప్ప నిజమైన సాధన కోసం కాదు. మనం మన పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.’
అని గురూజీ రామచరిత మానస్ పుస్తకం పుటలు మూసి గాయత్రీ మంత్రం పఠించారు. ఆ తర్వాత ఉపనిషన్మంత్రాలు వినిపించారు.
ఓం సహనావవతు
సహ నౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీత మస్తు
మా విద్విషావహై
ఓం అసతోమా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే
ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతిః
పృథివీ శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వేదేవాః శాంతిః
బ్రహ్మన్ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సా మా శాంతిరేధి
ఓం శాంతిః శాంతిః శాంతిః
(సంభాషణలు సమాప్తం)
Featured image photography by Sardar Harpal Singh, Adilabad
3-7-2026


ఈ సిరీస్ నడిచినంతకాలం రోజూ ఉదయాన్నే ఈ సంభాషణ చదివాకే నా రోజు ప్రారంభించడం ఒక గొప్ప అనుభవం. మీకు వేవేల ధన్యవాదాలు
చాలా సంతోషం సుబ్రహ్మణ్యం గారూ! మీరు ఈ సిరీస్ చదివారంటే నాకెంతో తృప్తిగా ఉంది.
ధన్యవాదములు సార్
“ఏ రోజైతే మనిషి గుర్తింపు తాపత్రయం వదిలేస్తాడో ఆ క్షణమే ఋషిగా మారిపోతాడు. ఒక అనంతత్త్వంలో, ఆ పరమాత్మలో కలిసిపోతాడు. కానీ అలా గుర్తింపుని వదులుకునేవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు.” మీ బ్లాగు హైలైట్ స్టేట్మెంట్ గురూజీ ఈ సంభాషణల్లో ఏం చెప్పబోతున్నారో చదవగానే ఇన్నాళ్లుగా ఈ జీవనశిల్పి భాగాలు చదువు మాకు బాగా దగ్గరయిన గురూజీ రవీంద్ర కుమార్ శర్మ గారిలో ఆ ఋషి రూపమే దర్శనమిచ్చింది భద్రుడు గారు.
గురూజీ రామ చరిత మానస్ చౌపాయీ సారాంశాన్ని “ఎవరి మనస్సులో అయితే మోహము కలుగుతుందో, వారి హృదయంలో జ్ఞానవైరాగ్యాలు లేవని అర్థం. ఒకవేళ జ్ఞానవైరాగ్యాలుంటే, అక్కడ మోహం కలగడానికి వీల్లేదు” అంటూ ఎంతో సింపుల్ గా విష్ణు మూర్తి నారదుడి అహంకారానికి పరీక్ష కథ తో మొదలుపెట్టి మధ్యలో శాఖాచంక్రమణం చేస్తూ జ్ఞాన, వైరాగ్యాలు, తపస్సు, ధ్యానాలు, తాత్విక చింతనలు విశ్లేషించి వివరించడానికి ఎన్ని అద్భుతమైన కథలు, ఉదాహరణలు చెప్పారో.
అహం – అహంకారం ఈ రెంటికీ గాక వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పిన కథ, ఉప్పు బొమ్మ సముద్రం లో కలిసిపోయి తన అస్థిత్వాన్ని కోల్పోయి జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే పరమ సత్యాన్ని ఎంత సరళంగా ఆవిష్కరించిందో! మనిషి తన పరిమిత గుర్తింపును కోల్పోయి ఆ అనంతత్వంలో లీనమైనప్పుడే అహమ్ లభిస్తుందనే గురూజీ వివరణ చదివినప్పుడు అహం బ్రహ్మాస్మి లో అహం అనే పదానికి ఇన్నాళ్లు నాకు తెలిసిన అర్థం కాదని అర్థమయింది.
కళాకారులు తమ సన్మానంకోసం, కీర్తికోసం చావుకైనా సిద్ధపడతారనే కళాకారుడు – యముడు కథ ఇంతకు మునుపు నేనెప్పుడు విననే లేదు. ఈ కథ చెప్పాక “నేటి కాలపు కళాకారుడు తన కాన్వాసు ముక్కని మాత్రమే తన ప్రపంచంగా భావిస్తాడు. అతడు పేదరికాన్ని, మురికివాడల్ని పెయింటింగులు వేస్తాడుగానీ, ఆ మురికివాడ గోడని కూడా ఒక కాన్వాసుగా మార్చి దాని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచన అతనికి రాదు.” అంటూ ఆధునిక కాలపు కళాకారులు చాలా మందికి ఉన్న హిపోక్రసీ గురించి గురువు గారు చేసిన విశ్లేషణ అద్భుతం.
ప్లేటో – అరిస్టాటిల్ ఉదంతాన్ని ఉటంకిస్తూ
‘ప్రజలకు ఏది ఇష్టమో దాన్నే మేము సమాజానికి అందిస్తాం అంటారు. కానీ సమాజం దేన్నిష్టపడాలో నేర్పించవలసిన బాధ్యత మీది కదా. అది మీకు తెలుసు కదా. అయినా కేవలం చప్పట్లకోసం ప్రజల బలహీనతలు వాడుకుంటారు. అందుకే మీరంతా బేయీమాన్లు..” అన్న ప్లేటో మాటలు ప్రజలు ఇష్ట పడుతున్నారనే ఇలాంటి సినిమాలు తీస్తున్నాం అనే వాళ్ళ ఇళ్లలో గోడ మీద ఫ్రేమ్ చేసి పెట్టాలి.
బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ముందుగా సనక, సనందన, సనత్కుమారుల్ని సృష్టించి వారు ఐహిక బంధాలకు జడిసినందుకు వాళ్ళకి శాపం ఇచ్చి ప్రజాపతులను సృష్టించాడాన్న కథ విన్నాను గానీ, కోపంతో ఆయన భృకుటి ముడిచినప్పుడు అక్కణ్ణుంచి ఒక పిల్లవాడు బయటపడి రుద్ర సృష్టి జరిగిందన్న కథ వినడం ఇదే మొదటిసారి. BTW, గురూజీ సనత్సుజాతీయుడు పేరు చెప్పడం మర్చిపోయినట్టున్నారు.
ఇంక నారదుడి అహంకారం అణచివేత కథ లో తనకు జరిగిన పరాభవానికి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపం ఫలితమే మరొక కల్పం లో రామావతారం అన్న సంగతి రామ చరిత మానస్ లో “రాముడి అవతారం వివిధ కల్పాలలో వివిధ కారణాల వల్ల జరిగింది. ఒకసారి ద్వారపాలకులైన జయవిజయుల శాపం వల్ల, ఒకసారి కశ్యపుడు-అదితిల వరాల వల్ల, మరొకసారి నారదుడికి కలిగిన మోహం వల్ల, దాని ఫలితంగా ఇచ్చిన శాపం వల్ల కలిగాయి” అని ఉందని చదివిన తరువాతే తెలిసింది. నిజం చెప్పొద్దు కాకభుశుండి పక్షిరాజు పేరు వినడం కూడా ఇదే మొదటి సారి.
చివర్లో గురూజీ పుస్తకం మూసి పఠించిన ఉపనిషన్మంత్రాలు, శాంతిమంత్రాలు—”పూర్ణమదః పూర్ణమిదం…” తన సంభాషణలకు మాత్రమే కాక మీ జీవనశిల్పి సిరీస్ ముగింపు కి కూడా ఒక పరిపూర్ణత చేకూర్చింది
ప్రతి రోజూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ, క్రమం తప్పకుండా చదువుతూ మమేకమై పోతున్న నా లాంటి పాఠకులకు ఇక పై ఈ అమూల్యమైన సంభాషణలను మిస్ అవుతామనే భావన ఏదో మాటల్లో చెప్పలేని వెలితిని మిగులుస్తోంది. 2010లో జరిగిన ఆ నాటి ప్రసంగాల రికార్డింగులను ఇలా మీరు అక్షరబద్ధం చేసి ఇంతటి అద్భుతమైన సాహిత్య, తాత్విక నిధిగా మలిచి మాకు అందించినందుకు మీకు సదా కృతజ్ఞులం భద్రుడు గారు
ఇన్ని మంచి విషయాలు పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండీ🙏
టూర్ లో ఉండటం వల్ల కొన్ని మిస్ అయ్యాను. చదివినా స్పందించడం కదరలేదు. మరొక సారి ధన్యవాదాలు🙏