ప్రియమైన శాఫో-17

ప్రియమైన శాఫో

పొద్దున్నే కోకిల ఎక్కణ్ణుంచో నగరద్వారాలు తెరుస్తోంది. 140 లక్షల మంది ప్రజలున్న ఈ నగరంలో నాకు కోకిల కూత తప్ప మరేదీ పట్టదు. ఒక మాయతివాసీలాగా కోకిల కూత నన్ను వేరే లోకానికి తీసుకుపోతుంది. అక్కడ అపారమైన నీలాకాశమూ, తొలిసూర్యకాంతీ తప్ప మరేమీ ఉండవు. ఇన్నేళ్ళ నా జీవితంలో నాకు కోరుకోవలసినవీ, పొందవలసినవీ ఏవీ లేవు. నన్ను అడ్డగించే సంకెళ్ళు కూడా ఏవీ లేవు. మనుషులు వేటిని తెంచుకోడానికి రకరకాల యుద్ధాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రలోభాలనుంచి నేనెప్పుడో బయటపడ్డాను. నీ వంటి పూర్వకవుల్తో సంభాషించడానికి కావలసిన యోగ్యత బహుశా ఇప్పటికి నాకు పూర్తిగా చేకూరిందనుకుంటాను.

నిన్న రాత్రి ఎడిత్ సోడెర్  గ్రాన్ కవిత్వం చదువుతున్నాను. స్వీడిష్ కవిత్వాన్ని ఆధునిక యుగంలోకి తీసుకొచ్చిన ఫిన్నిష్ కవయిత్రి. ముప్ఫై ఒక్కేళ్ళకే క్షయవ్యాధి ఆమెని ఈ లోకానికి దూరం చేసింది. తన తండ్రిని కబళించినట్టే ఆ వ్యాధి తనని కూడా కబళిస్తుందని ఆమెకి తెలుసు. ఆ మృత్యుఛాయలోనే ఆమె జీవితపు వెలుగుని పూర్తిగా స్వీకరించడానికి ప్రయత్నించింది. నీకులానే ఆమె కూడా ప్రవాసి. ఆమెది స్వీడనా, ఫిన్లాండునా లేక సెంట్ పీటర్స్ బర్గ్ నా? జీవితమంతా ఒక శానటోరియం నుంచి మరొక శానటోరియంకి తిరుగుతుండటంలోనే గడిచిపోయిందామెకి. కాబట్టే I long for the land that does not exist అని రాసుకుంది. మామూలుగా మనుషులు ఏ అందాలు శాశ్వతమనుకుంటారో అవి నిలబడేవికావనీ, వాటన్నిటికీ ఆవల, వాటన్నిటిపైనా గొప్ప విషాదమొకటి బలంగా రెక్కలు చాచి ఉంటుందనీ గుర్తుపట్టిందామె. అందుకని ఆమె రాసుకున్న తొలికవితల్లోనే ఒకచోట ఇలా అంటున్నది:

జీవితాన్ని అంత ఎత్తులోంచి చూసింది కాబట్టే, ఆమె దేవుడి గురించి ఒక కవిత రాస్తూ, ఆయన్ని the ecstasy of the roses అని అనగలిగింది. గులాబీల పారవశ్యమట! భూగోళానికి మరో పక్క ఇస్సా కూడా ఆ మాటే అన్నాడు:

–అని.

ఇప్పుడు నీ కవిత, Fragment 94 చదువుతుంటే ఈ కవులు గుర్తు రావడంలో ఆశ్చర్యమేముంది? ఈ కవిత:

ఈ కవితలో ఏదో అందముందని తెలుస్తోంది. అది ఈ కవితలో ఇంకా మిగిలి ఉన్న పదాల వల్లనా లేక కాలం కబళించగా మిగిలిన ఖాళీల వల్లనా? ఎడిత్ సోడెర్ గ్రాన్ రాసిన ఒక కవితను అనువదిస్తూ ఒక విమర్శకుడు ఆసక్తికరమైన ఒక మాట చెప్పాడు. నిజమైన సాహిత్యవిమర్శకుడి పని ఒక కవిత చుట్టూ ఉన్న noise ని పక్కకు నెట్టడమనీ, దాని అంతర్భాగంలో ఉన్న ఒక enigmatic element ని భద్రంగా కాపాడుకుంటూ, దాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవడమనీ.

నీ యీ కవిత చుట్టూ కాలం చాలా చప్పుడు వదిలిపెట్టింది. ముఖ్యంగా ఆ కవితలో వచ్చి చేరిన ఖాళీలు చేసే గోల అంతా ఇంతా కాదు. ఉదాహరణకి ఈ కవితలో మొదటి పంక్తి మొదటి పంక్తి కాదు. ఆ పంక్తి కాలం చేజారిపోయింది. కాబట్టి ‘నిజంగా చెప్తున్నాను, నాకు చనిపోయినట్టుంది’ అనే మాటలు ఎవరు పలికిందో మాకు తెలియడం లేదు. అవి నీ మాటలా లేక మరొకరి మాటలా లేక నీ నుంచి సెలవుతీసుకుంటున్న మిత్రురాలి మాటలా? ‘నాకు చనిపోయినట్టుంది’ అంటే అందులో ఉన్నది వాచ్యార్థమా లేక నుడికారమా? కవితలో అధికభాగం వీడ్కోలు తీసుకునేటప్పటి అనుభూతీ, దానికి సంబంధించినమాటలే ఉన్నాయి. కాని ‘మృదుతూలికా తల్పం’, ‘నీ మనసుతీరేట్టు’, ‘ఆ నవయువతి’- ఈ మూడు విడివిడిమాటలూ చేస్తున్న చప్పుడు ఇంతా అంతా కాదు, అది వినబడనట్టు ముందుకుపోలేం. అలాగని అక్కడ ఆగలేం.

ఇది ఇద్దరు స్త్రీల మధ్య వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన సంభాషణనా లేక వాళ్ళు తమ  సంభాషణ మధ్యలో గుర్తుతెచ్చుకున్న ఒక వివాహగీతమా? నీకూ, ఆ స్త్రీలకూ (అంటే ఇక్కడ ఇద్దరున్నారు, ఒకరు నీతో మాట్లాడుతున్నవారు, మరొకరు నువ్వు ప్రస్తావిస్తున్న ఆ నవయువతి) ఉన్న అనుబంధం ఎటువంటిది? కొందరు నువ్వొక సంగీత పాఠశాల లాంటిది నడిపేదానివని ఊహించారు. కొందరేమో నీ అధ్వర్యంలో ఒక మఠంలాంటిది నడిచేదన్నారు. మరికొందరు, కులీన యువతుల్ని వైవాహిక జీవితానికి సిద్ధం చేసే ఒక శిక్షణాలయం నడిపేదానివన్నారు.  ఏదీ ఇతమిత్థంగా తెలీదు. కొంతమంది నీ కవితల్ని బట్టే నువ్వు కొందరు స్త్రీలని చాలా ఇష్టపడ్డావని ఊహించారు. అనక్టోరియా గురించి నువ్వే ఒక కవితలో చెప్పావు. అలానే అతిస్, టెలెసెపా, మెగరా లంటే నీకు చాలా ఇష్టమనీ, ఆండ్రోమెడా, గోర్గో లంటే ఇష్టం లేదనీ, వాళ్ళెప్పుడూ నీతో పోటీపడుతుండేవారనీ కూడా- ఏదేదో ఊహించారు. ఈ ఊహలన్నీ నీ కవితల్నిబట్టి వాళ్ళు కల్పించుకున్న కల్పనలే. ఆ కవితల్లోని ఖాళీజాగాల్ని ఏదో ఒక విధంగా తమకై తాము పూరించుకుంటూ చేసిన ఊహాగానాలే.

నీ కవితల్లో అధికభాగం వివాహవేడుకల్లో పాడే బృందగానాలు. Epithalamia. నిజానికి అవి శుభగీతాలూ, మంగళగీతాలే అయినప్పటికీ, వాటిలో వధువు తన కన్నవారింటినుంచి వీడ్కోలు తీసుకోక తప్పని దిగులు కూడా తప్పనిసరి. కొత్త జీవితం ఎలా ఉంటుందోనన్న ఆందోళన లేకుండా ఏ వధువూ తన పుట్టింటినుంచి అత్తవారింటికి అడుగుపెట్టదు. కాబట్టి ఆ ఎండా, వానా నీ గీతాల్లో పక్కపక్కనే కనిపిస్తుంటాయి. కొంతమంది వీటిని బృందగానాలన్నారు. కొందరు వీటిలో మళ్ళీ కొన్ని ఏకాంతగీతాలన్నారు. ఏకాంత గీతాలైనంత మాత్రాన అవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యగీతాలు కానక్కరలేదనీ, అవి కూడా నలుగురి మధ్యా, వివాహవేడుకల్లో పాడుకునే పాటలే కావొచ్చనీ, కాకపోతే మొత్తం బృందానికి బదులు, ఒక్క గాయిక పాడే గీతాలు కావొచ్చుననీ వాదించినవారూ ఉన్నారు.

కాబట్టి నేను ముందే చెప్పినట్టుగా, అసలే noisy గా ఉన్న ఇటువంటి గీతాల చుట్టూ వ్యాఖ్యాతల, పరిశోధకుల ఊహాగానాల వల్ల మరింత రణగొణధ్వని పేరుకుంటూ ఉంది. ఈ చప్పుణ్ణి పక్కకునెట్టి, కాలానికి ఎదురీదుతూ, ఈ గీతంలో ఇప్పటికీ భద్రంగా వినిపిస్తున్న, ఆ enigmatic element ని నాకై నేను కనుగొనాలి, దాన్ని నాలాగా నీ కవిత్వాన్ని ఇష్టపడేవాళ్ళతో పంచుకోవాలి.

ఈ కవిత నాకు పాత నిబంధనలోని పరమోన్నత గీతాన్ని గుర్తుకు తెస్తోంది. అది కూడా ఒక epithalamium నే. దాని చుట్టూ కూడా వ్యాఖ్యాతల, పరిశోధకుల ఊహాగానాల రణగొణధ్వని. ఎన్నో ఏళ్ళ పాటు ఆ గీతాన్ని చదువుతూ, కొంత అర్థమయ్యీ, కొంత అర్థంకాకా, చివరికి ఆ మొత్తం గీతాన్ని నాకై నేను నా సొంతమాటల్లోకి అనువదించుకుంటే తప్ప, ఆ enigmatic element ని పట్టుకోలేననుకున్నాను. అందుకని దాన్ని ‘దివ్యప్రేమ గీతం’ పేరిట తెలుగులోకి మార్చుకున్నాను. అప్పుడు నాకు ఏమి అర్థమయిందంటే, ఆ గీతం దేవుడూ, సైతానూ లేని ఒక నందనవనం గురించిన తలపోత అని. శాపస్పర్శలేని స్త్రీపురుషుల విహారభూమి అని.  అది నగరం నుంచి పల్లెకీ, పల్లెనుంచి పచ్చికబయలుకీ పయనించే ప్రకృతిగీతమని. ఆ గీతంలో మొత్తం ఇరవైనాలుగు రకాల మొక్కలూ, చెట్లూ, సుగంధమూలికలూ ఉన్నాయి. సస్యక్షేత్రాలు, ద్రాక్షతోటలు, ఉద్యానవనాల్తో కూడుకున్న ఆ సుసంపన్న ప్రాకృతిక సీమని పక్కనపెట్టి ఆ గీతాన్ని ఒక ఆధ్యాత్మిక గీతంగా చదివితే మనం ఆ గీతహృదయానికి ఎప్పటికీ చేరువకాలేమని అర్థమయింది.

అలానే నీ కవిత్వం ఒక పరిమళభరిత ప్రపంచం. పూలప్రపంచం. ఈ కవితలోనే చూడు- గులాబీలు, నీలి పుష్పాలు, సువాసనా తైలాలు, తోట, దేవళం, సంగీతం- ఇవి లేకపోతే మీ సంబాషణలో కవిత్వం లేనే లేదు. అలానే  నువ్వు ఆఫ్రొడైటు గురించి రాసిన కవితలో  యాపిల్ తరువుల్ని చుట్టి ప్రవహించే సెలయేటి మర్మరధ్వని, సాంబ్రాణి, గుగ్గిలం, తేనెలూరే పూలతావులు, పచ్చికబయళ్ళ గురించి ప్రస్తావించావు. ఇంకొక కవితలో లిడియాదేశపు సమస్త అలంకరణ సామగ్రీ కూడా ఒక పూలమాలకి సాటిరాదని చెప్తావు. స్త్రీలూ, పూలూ, పరిమళాలూ- వీటి చుట్టూ వినిపించే సంగీతం- నీ మొత్తం కావ్యప్రపంచమంతా ఇంతే శాఫో. తక్కిందంతా ఊహాగానం. ఎక్కడ పూలు తావులు  విరజిమ్ముతుంటే, నీ దృష్టిలో, అదే ఆఫ్రొడైటు అర్చావేదిక. నువ్వు నీ దేశంలో ఉన్నా, ప్రవాసివైనా, తిరిగి వచ్చినా, నీ చుట్టూ ఎటువంటి రాజకీయ కల్లోలాలు సంభవించినా, నీకు నచ్చినవాళ్ళు నీ దగ్గరున్నా, దూరమైనా, అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా, నీ జీవితపు సకలావస్థల్నీ గుర్తుపట్టడానికీ, గుర్తుపెట్టుకోడానికీ నువ్వు ఎంచుకున్న ఒకే ఒక్క సామగ్రి పూలు, పూలు, పూలు.

సోడెర్ గ్రాన్ దేవుడి గురించి చెప్పినమాటలే నేను నీగురించి చెప్పుకుంటున్నాను. నువ్వు Ecstasy of the roses వి శాఫో. అంతే కాదు,  గులాబీల పారవశ్యాన్ని పాటగా మార్చాలనుకునే కోకిలవి. రోజూ పొద్దున్నే నా హృదయాన్ని ‘తిక్తమధురవేదనతో’ మీటి పోయే పురాతన గాయికవి.

13-5-2026

6 Replies to “ప్రియమైన శాఫో-17”

  1. “మనుషులు వేటిని తెంచుకోడానికి రకరకాల యుద్ధాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రలోభాలనుంచి నేనెప్పుడో బయటపడ్డాను. నీ వంటి పూర్వకవుల్తో సంభాషించడానికి కావలసిన యోగ్యత బహుశా ఇప్పటికి నాకు పూర్తిగా చేకూరిందనుకుంటాను.“

    ఒక మనిషి కి ఇంతకు మించిన ‘యోగ్యత’ యేముంటుంది?

    కవికి అనేకానేక సాహితీ సామ్రాజ్యాలు జయించిన అనంతరం ఇటువంటి సాధికారిత లభించి వుండవచ్చు.
    తన అంతరంగాన్ని జయించగలిగిన వారు కవిత్వ సంపదను పదిలపరచుకుని, పదుగురికి పంచి ఇవ్వొచ్చు!

    ఎవరీ “సోఫియా”? యెక్కడిదీమె అనుభవిక కవిత్వం? సహజ సుందరంగా ఆమె పలవరించిన పల్లవులేనా? వాటిన హృదయరంజకంగా పలికిన “చినవీరభద్రుని” అనురక్తి గుళికలా?
    యేమో?
    నా చిన్న జీవనయానంలో కవి “చినవీరభద్రుని “ లాంటి “యోగ్యత” యెటూ సాధించలేని. అందుకు తగిన సాధన సంపత్తి నాఅందుబాటులో లేవు.
    ప్రశాంత సరో’వరం’లా నా మనసు నిశ్చలంగా నిలిచి నపుడు ఈ లేఖల దొంతరలతో మనసు ను నింపుకుంటాను.
    జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటాను!

  2. మీకు తెలియదు. మీలా ప్రతి చిన్న విషయానికి చిగురాకులా స్పందిస్తూ ఆ సున్నితమైన ప్రతి సంగతిని మాతో పంచుకోవడం నా వంటి వారిని ఒక సుందరతరమైన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చూపిస్తున్నారని. కొంగ్రొత్త జీవితం చూపిస్తున్నారని. మీకు తెలియదు. ఆ గాలి ని ఆస్వాదిస్తున్న నాకు ఆ హాయి ని అనుభవించడం మురిపం అని. నమోనమః

  3. ఇక్కడ ఒక కవికేమో
    “కోకిల కూత తప్ప మరేదీ పట్టదు.”
    “ఒక మాయతివాసీలాగా కోకిల కూత నన్ను వేరే లోకానికి తీసుకుపోతుంది. అక్కడ అపారమైన నీలాకాశమూ, తొలిసూర్యకాంతీ తప్ప మరేమీ ఉండవు.”

    మరెక్కడో ఒక కవయిత్రి
    “విషాదవిహంగం ఎగిరే ఎత్తుల్లో వేదనాదేవతలు మృత్యుశయ్యపక్కన నిలబడి కాపలా కాస్తుంటారు” అంటూనే,
    ఆ విషాదపక్షి వాలే చోట కూడా
    “అపారమైన పచ్చికా, సూర్యకాంతీనూ” ఉన్నాయని చెప్తుంది.

    ఇంకెక్కడో ఇంకో కవి
    “పూలని చూస్తూ మటుకే నరకాన్ని దాటుతున్నాం” అంటాడు.

    అప్పుడెప్పుడో శాఫో
    “మనం సంతోషంగా గడిపిన కాలాలు
    గులాబీల్తో, నీలికాడల పూలతో అల్లిన దండలు…”,
    “ఏదీ లేదు పండగ, అర్చావేదిక, దేవళం మనం అడుగుపెట్టనిది; తోట… నాట్యం… సంగీతం…” అని గుర్తుచేసుకుంటుంది.

    ఎంత చిత్రంగా ప్రతి కవీ, ప్రతి కాలంలోనూ, తన “జీవితపు సకలావస్థల్నీ గుర్తుపట్టడానికీ, గుర్తుపెట్టుకోడానికీ” ఎంచుకునే సామగ్రి దాదాపు ఒక్కటే కదా

    “గులాబీలు, నీలి పుష్పాలు, సువాసనా తైలాలు, తోట, దేవళం, సంగీతం”
    “సెలయేటి మర్మరధ్వని, సాంబ్రాణి, గుగ్గిలం, తేనెలూరే పూలతావులు, పచ్చికబయళ్ళు.”

    అందుకేనేమో Bible లోని దివ్యగీతం కూడా
    “దేవుడూ, సైతానూ లేని ఒక నందనవనం గురించిన తలపోత”గానూ
    “ఇరవైనాలుగు రకాల మొక్కలూ, చెట్లూ, సుగంధమూలికలూ” నిండిన ఒక ప్రాకృతిక సీమగా కనిపించిందన్నారు.

    మీ paintings లో కూడా ఆ పూలే అందంగా పూస్తున్నాయి.❤️

    “నిజమైన సాహిత్యవిమర్శకుడి పని ఒక కవిత చుట్టూ ఉన్న noise ని పక్కకు నెట్టడం; దాని అంతర్భాగంలో ఉన్న ఒక enigmatic element ని భద్రంగా కాపాడుకుంటూ, దాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవడం” అన్న మాటకి ఈ ఉత్తరం మొత్తం చదివాక అర్థం తెలిసింది.

    “ఆ enigmatic element ని నాకై నేను కనుగొనాలి; దాన్ని నాలాగా ఆ కవిత్వాన్ని ఇష్టపడేవాళ్లతో పంచుకోవాలి” అంటూ కవిత్వాన్ని ఎలా ప్రేమించాలో చెప్పారు.

    Thank you for this beautiful letter, Sir.
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading