నన్ను వెన్నాడే కథలు-19

నా చిన్నప్పుడు మా ఇంట్లోనూ, ఊళ్ళోనూ కూడా నా దాహాన్ని తీర్చే పుస్తకాలు చాలా తక్కువగా దొరికేవి. ఉన్న ఆ నాలుగు పుస్తకాలే ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండేవాణ్ణి. కాని ఎప్పుడేనా ఏదన్నా పుస్తకం, అదెలాంటిది కానీ, నా చేతుల్లోకి వస్తే పండగలాగా ఉండేది. అలాంటి రోజుల్లో ఒక చిన్న పత్రికలాంటిది, క్రౌను సైజు పుస్తకం, అట్టలు చిరిగిపోయింది నా చేతుల్లోకి వచ్చింది. అందులో ఏం చదివానో గుర్తులేదుగానీ, ఒక కథ మాత్రం నా మనసులో మిగిలిపోయింది.

అదొక యుద్ధకాలం నాటి కథ. కొందరు ఒక పట్టణం నుంచి ఒక బండి మాట్లాడుకుని దేశసరిహద్దులు దాటడానికి రాత్రికి రాత్రి పారిపోతుంటారు. వాళ్ళని సరిహద్దుల్లో సైనికులు అటకాయిస్తారు. ఆ ప్రయాణీకుల్లో ఒక స్త్రీ ఆ రాత్రికి వారిని కలిసి వారిని తృప్తిపరచి తనూ, తన తోటిప్రయాణీకులు క్షేమంగా సరిహద్దులు దాటిపోయేలా ఏర్పాటు చేస్తుంది. ఆమె ఆ సైనికశిబిరం నుంచి తిరిగి మళ్ళా తన సహప్రయాణీకుల్ని కలుసుకున్నాక, వాళ్ళల్లో ఆమె పట్ల చాలా మార్పు వస్తుంది. వాళ్ళు ఆమె పట్ల కృతజ్ఞులుగా ఉండకపోగా, ఆమెని కించపరిచేట్టు ప్రవర్తిస్తారు. ఇది నాకు గుర్తుండిపోయిన స్థూల చిత్రం. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకుగానీ, ఆ కథ Boule de Suif అనీ, ఆ కథ రాసినాయన మపాసా అని తెలిసింది కాదు.

మపాసా అనగానే The Necklace (1884) కథనే గుర్తొస్తుంది అందరికీ. నూటయాభై ఏళ్ళుగా ఎన్నో సంకలనాలకు ఎక్కుతూ వస్తున్న కథ అది. దాన్ని దాటి మపాసా అంటే ఏమిటో తెలుసుకుందామనే కోరికతో, 87లో The Complete Shortstories of Gue De Maupassant కొనుక్కున్నాను. అప్పట్లో నేను పార్వతీపురం అడవుల్లో కొత్త ఉద్యోగంలో శిక్షణలో ఉన్నాను. ఆ కాలంలో ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు ఆ పుస్తకంలో చదివిన చాలా కథల్లో ఒక కథ మాత్రం నాకు జ్ఞాపకముండిపోయింది. అది Bed No.29.

ఆధునిక కథకి జవసత్త్వాలు సమకూర్చిన ముగ్గురు మహాశిల్పుల్లోనూ గై డి మపాసా (1850-1893) ఒకడని నేను కొత్తగా చెప్పవలసిన పనిలేదు. చెహోవ్‌, ఓ హెన్రీ, మపాసాలు ఆధునిక కథానికకు రూపురేఖలివ్వడంతో పాటు దానికొక ప్రయోజనాన్ని కూడా నిర్దేశించారని చెప్పవచ్చు.

ఈరోజు సాహిత్యచరిత్రకారులు మపాసాను నాచురలిస్టుగానూ, చెకోవ్‌ ను ఇంప్రెషనిస్టుగానూ, ఓ హెన్రీని రియలిస్టుగానూ పరిగణిస్తూండవచ్చు. కాని ఆ ముగ్గురూ కూడా ఆధునిక మానవసమాజంలోని డొల్లతనాన్నీ, ఆత్మవంచననీ, విలువల్లోని ద్వంద్వప్రమాణాల్నీ, మానవసంబంధాల్ని కాపట్యాన్నీ, కృత్రిమత్వాన్నీ, ముఖ్యంగా సామాజిక వర్గాల్లోని అంతర్గత వైరుధ్యాల్నీ ఎత్తిచూపినవారుగా నిలబడిపోయారు. అయితే తెలుగులో చలం, శ్రీ శ్రీ వంటి ప్రభావశీల రచయితలకు వారు స్పూర్తి ప్రదాతలుగా నిలబడ్డప్పటికీ, ఆ ముగ్గురు రచయితల గురించిన నిశిత పరిశీలన ఇప్పటిదాకా తెలుగులో రానేలేదు. మానవ ప్రవృత్తిలోని బలమైన వ్యామోహపార్శ్వాల్ని చిత్రించినవాడిగానే మపాసాని అభిమానించారుగానీ, ఆయన అంతకన్నా లోతులకి పోయి, జీవితాన్ని అత్యంత నిశితపరీక్షకు గురి చేసిన రచయిత అని మనవాళ్ళు గుర్తుపట్టలేదు.

ఉదాహరణకి, 1870-71 మధ్య కాలంలో జర్మనీకి, ఫ్రాన్సుకీ మధ్య జరిగిన ఫ్రాంకో-ప్రష్యన్‌ యుద్ధం చుట్టూ మపాసా కనీసం ముప్ఫై నలభై కథలు రాసాడు. అతడి కథల్లో ప్రసిద్ధి చెందిన Boule de Suif, Bed No.29 ఆ నేపథ్యంలో వచ్చిన కథలే.

ఆ యుద్ధం మొదలయ్యేప్పటికి మపాసా ఇరవయ్యేళ్ళ యువకుడు. ఆ యుద్ధంలో ఫ్రెంచి సైన్యంలో ఒక ప్రైవేటు సైనికుడిగా పాల్గొన్నాడు. ఆ అనుభవం అతడికి యుద్ధాన్నీ, ప్రభుత్వాల్నీ, మనుషుల ప్రవర్తననీ చాలా దగ్గరగా, చాలా నగ్నంగా చూసే అవకాశాన్నిచ్చింది. యుద్ధం ముగిసిన పదేళ్ళకి, అంటే 1880 లో అతడు తన మొదటికథ Boule de Suif రాసాడు. ఆ తర్వాత పదేళ్ళ కాలంలో, అంటే 1890 లోపు అతడు దాదాపు మూడువందల కథలు, ఆరునవలలు, మూడు యాత్రాకథనాలు వెలువరించాడు. ఆ తర్వాత మూడేళ్ళకే, అంటే, నలభై మూడేళ్ళ వయసుకే ఆయన మరణించాడు.

నిజానికి నన్ను వెన్నాడే కథల్లో Boule de Suif నే ఇక్కడ మీతో పంచుకోవాలి. కానీ ఆ కథ నిడివి పెద్దది కావడం వల్ల, దానికి సమానమైంది అని చెప్పదగ్గ Bed No.29 (1884) ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ఈ కథని తెలుగులోకి నేనే అనువదించక తప్పలేదు.

ఈ కథ ఒక్కటి చాలు, మపాసా ఏమి చూసాడో, దాన్ని బట్టి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఎటువంటి అంచనాకి వచ్చాడో మనకు తెలియడానికి. చలంగారి కథలాగా కనిపించే ఈ కథలో రచయిత ఎంతో కళాత్మకమైన వ్యంగ్యంతో తన కాలం నాటి ఫ్రెంచి సామాజిక విలువల్ని తూర్పారబట్టాడని మనం గమనిస్తాం. కథ మొదట్లో తన కాళ్ళనీ, కాళ్ళల్లోని పటుత్వాన్నీ చూసుకుని గర్విస్తూ ఉండే ఆశ్వికదళాధికారి కథ చివరకు వచ్చేటప్పటికి అవే కాళ్ళని ఈడ్చుకుంటూ ఆస్పత్రినుంచి పారిపోయేదాకా-మొత్తం కథ ఫ్రెంచి సమాజపు డొల్లతనాన్ని అత్యంత సమగ్రంగా చిత్రించిందని మనం గుర్తుపడతాం.

ఏళ్ళ తరువాత, చెకోవ్‌ Ward No.6 (1892) రాయడానికి ఈ కథనే ప్రేరణ అని మనం చెప్పవచ్చు. పైకి చూస్తే ఈ రెండు కథలమధ్యా ఉన్న పోలిక చాలా పరిమితమని అనిపించవచ్చు. రెండూ ఆసుపత్రి నేపథ్యంగా చిత్రించిన కథలని మాత్రమే అనుకుంటాం. కాని చెకోవ్‌ కళాశిల్పి కాబట్టి తనకి స్ఫూర్తినిచ్చిన కథనుంచి తాను ఏది గ్రహించాలో అది మాత్రమే స్వీకరించాడు. రెండు కథల్నీ లోతుగా చదివితే ఆ ప్రభావమేమిటో మనకు తెలుస్తుంది. ఇద్దరూ కూడా తమ కాలం నాటి సామాజిక విలువల్లోని ద్వంద్వప్రమాణాల్ని ఎత్తిచూపారని అర్ధమవుతుంది. ఈ కథలో మపాసా ఒక సైనికాధికారి తాను యుద్ధంలో పాల్గొన్నందుకు శౌర్యపతాకాన్ని సంపాదించుకోగా, అదే కాలంలో, ఒక స్త్రీ తనకు చాతనయిన పద్ధతిలో దేశప్రేమ చూపించినప్పటికీ, ఆమెకు అవమానం, రోగం, మృత్యువు మాత్రమే బహుమానాలుగా దక్కుతాయి. ఎవరిని ఫ్రెంచి సమాజం అత్యంత శౌర్యవంతుడని సత్కరించిందో అతణ్ణి చివరికి ఒక పిరికిపందగా తేల్చివెయ్యడం ఎంతో చేయితిరిగిన కథాశిల్పికి మాత్రమే సాధ్యం కాగల కౌశల్యం. అలానే బెడ్‌ నంబరు 6 లో తక్కిన సమాజం ఎవరిని పిచ్చివాడని ముద్రవేసిందో, అతడొక్కడే అత్యంత ఆరోగ్యప్రదమైన మానవుడిగానూ, చుట్టూ ఉన్న సమాజమే ఉన్మాదశీలంగానూ కనిపించేట్టుగా కథ చెప్పడం చెకోవ్‌ కి మాత్రమే సాధ్యమైంది.

తెలుగులో గొప్ప కథలు చాలానే వచ్చాయి. కాని ఇటువంటి కథలు రాయగల కథకుడు మాత్రం ఇంకా పుట్టలేదు.


బెడ్  నెం. 29

మూలం: మపాసా

కెప్టెన్ ఎపివెంట్ వీథిలో నడిచేటప్పుడు స్త్రీలందరూ అతడి వైపు చూపులు తిప్పకుండా ఉండలేకపోయేవారు . స్ఫురద్రూపి అయిన ఒక ఆశ్వికుడు  ఎలా ఉంటాడో అతడొక నమూనా. అతడు ఎల్లప్పుడూ కవాతులో ఉండేవాడు, దేనిగురించో వ్యగ్రంగా ఉన్నట్టుగానూ, తన శారీరిక దారుఢ్యాన్నీ, తన పాదాల్లోని శక్తినీ, తన మీసాల్నీ చూసుకుని కొంచెం దర్పంతోనూ కనబడేవాడు.  అతడి శరీరం, అతడి కాళ్ళు, ఆ మీసాలు అద్భుతమైనవే, సందేహం లేదు.  అతడి మీసాలైతే రాగి రంగులో, ఒత్తుగా, అతని పెదవి మీంచి, పండిన గోధుమ రంగులో, అందమైన వంపుతిరిగి, ఒక సైనిక రాజసంతో , బాగా మెలిపెట్టిన కొసల్తో, అతని నోటికి రెండు వైపులా కుదురుగా కత్తిరించి ఉన్నాయి. అతని నడుమైతే బిగుతైన రవిక ధరించినట్టుగా సన్నగా ఉంది. ముందుకు పొడుచుకొచ్చి, అతడి నడుం మీద అర్ధచంద్రాకారంగా, వంపు తిరిగిన ఆ ఛాతీ మాత్రం పూర్తిగా పురుషుడి వక్షం.  నిరంతరం వ్యాయామం వల్ల వన్నెతేలిన అతని పాదసౌష్టవం ఆరాధనీయం. ఒక నర్తకి చరణంలాగా, మాంసపుష్ఠిగల ఆ పాదం తనని ఆచ్ఛాదించిన ఎర్రని వస్త్రంలోంచి తన ప్రతికదలికనీ ప్రతిఫలిస్తూ ఉంటుంది.

బిగుతైన కండరాలు కనబడేట్టుగానూ, చేతులూ, పాదాలూ వెడల్పుగా చాచినట్టుగానూ, ఒక ఆశ్వికుడి సమతూకభంగిమలో అతడు నడుస్తుంటాడు. తాను నడిచినప్పుడు తన దేహాంగాల్ని ఎలా ఉపయోగించుకోవాలో, తన దేహభంగిమను ఎలా ప్రదర్శించుకోవాలో తెలిసినవాడిలా నడుస్తుంటాడు. సైనిక దుస్తుల్లో ఉన్నప్పుడు ఒక విజేతలాగా కనిపిస్తాడు. కాని మామూలు దుస్తుల్లో మాత్రం చాలా మామూలు మనిషిలాగా కనిపిస్తాడు.

తక్కిన చాలా మంది అధికారులానే కెప్టెన్ ఎపివెంట్ కి కూడా మామూలు దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలో తెలీదు. అవి ఏమీ బాగుండేవి కావు.  దుకాణాల్లో పనిచేసే గుమాస్తాలు ధరించేలాంటి బూడిదరంగువో  లేదా నల్ల రంగు వస్త్రాలో ధరించినప్పుడు అతడి రూపంలో కళాకాంతీ కనిపించదు. కానీ తనకు తగిన దుస్తులు ధరించినప్పుడు మాత్రం అతడికి తిరుగు లేదు. పైగా అతడిది చాలా సొగసైన ముఖం. సన్నని కొనదేలిన ముక్కు, నీలి కళ్ళు, గొప్ప నుదురు.  అతడిది బట్టతల. తన జుత్తు ఎందుకు రాలిపోతున్నదో అతడికి ఎప్పటికీ తెలిసినట్టే లేదు.  నెత్తిమీద జుత్తు కొద్దిగానే మిగిలినా తన ఒత్తైన మీసాలు ఆ లోటుని భర్తీచేస్తున్నాయని తనకి తాను సర్దిచెప్పుకునేవాడు.

సాధారణంగా అతడు ప్రతి ఒక్కరిపట్లా ఒక తృణీకారభావం ప్రదర్శించేవాడు. అయితే మనుషుల పట్ల చూపించే ఆ తూష్ణీంభావంలో హెచ్చుతగ్గులుండేవి.

అన్నిటికన్నా ముందు,, అతడి దృష్టిలో, మధ్యతరగతి అనేది లేనేలేదు. వాళ్ళని జంతువుల్ని చూసినట్టు చూసేవాడు. పిచుకలనో లేదా కోడిపిల్లల్నో చూసేటప్పుడు వాటిమీద ఎంత ధ్యాసపెడతాడో వాళ్ళని చూసినప్పుడూ అంతే. అధికారవర్గాన్ని మాత్రమే తన ప్రపంచంగా అంగీకరించేవాడు. అలాగని అధికారులందరినీ సమానంగా చూసేవాడు కాడు. వాళ్ళల్లో ఎవరు అందగాళ్ళో వాళ్ళనే గౌరవించేవాడు. చూడగానే ఆకట్టుకునే స్ఫురద్రూపుల్నీ, నిజమైన శౌర్యవైభవంతో కనిపించేవారినీ మాత్రమే గౌరవించేవాడు. అతడి దృష్టిలో సైనికుడంటే ఒక ఉల్లాసకరసహచరుడు. దెయ్యంలాంటి సాహసికుడు. మోహంకోసమూ, మోహరం కోసమూ మాత్రమే పుట్టినవాడు. దారుఢ్యమూ, కండరాలూ, జుత్తూ ఉండే మనిషి, అంతే, అంతకుమించి మరేమీ కాదు. వారి వారి దేహసౌష్టవాన్ని బట్టీ, వాళ్ళ పటుత్వాన్ని బట్టీ, వారి ముఖాల్లో కనవచ్చే తీక్ష్ణదృక్కుల్ని బట్టీ అతడు ఫ్రెంచి సైనికాధికారుల్ని వర్గీకరించుకున్నాడు. ఆ విధంగా చూస్తే ఆధునిక కాలాల్లో బోర్బాకి అందరికన్నా గొప్ప సైనికాధికారిగా అతడికి కనిపించాడు.

పొట్టిగా లావుగా ఉండే పదాతిదళ అధికారులు కవాతు చేసేటప్పుడు ఆయాసపడ్డట్టు కనబడితే వాళ్ళని చూసి పరిహాసంగా నవ్వేవాడు.

పాలిటెక్నిక్ స్కూళ్ళనుంచి రిక్రూటైన బీద సైనికులంటే, బక్కగా, కళ్ళద్దాలతో ఎబ్బెట్టుగానూ, ఎలాంటి నైపుణ్యంలేనట్టుగానూ కనిపించే బీద సైనికులంటే అతడికి మరీ చిన్నచూపుగా ఉండేది. తోడేళ్ళతో సంకీర్తన చేయించినట్టు వాళ్ళు ఆ సైనికదుస్తులకి ఎంతమాత్రం తగరని పదేపదే అంటూండేవాడు. వాళ్ళని కూడా సైన్యంలో ఒకరిగా అంగీకరించవలసి వచ్చినందుకు అసహనంగా ఉండేవాడు. వాళ్ళ పీలదేహాలూ, పీతల్లాగా నడిచే వాళ్ళ నడకా, ఆ మానవాకార వైఫల్యాలు తాగేవారుకారనీ, తిండి కూడా ఏమంత తినేవారు కారనీ, అందమైన ఆడపిల్లలకన్నా లెక్కలపుస్తకాలంటే వాళ్ళకి ఎక్కువ మక్కువనీ వాళ్ళమీద ఎప్పుడూ చిరాకు పడుతుండేవాడు.

స్త్రీల విషయానికొస్తే కెప్టెన్ ఎపివెంట్ ది నిరంతర విజయాల చరిత్రనే.

ఆ రాత్రి ఒకే శయ్యమీద కలిసి గడపడం నిశ్చయమని ఏ స్త్రీని చూస్తే అనిపిస్తుందో, ఆమెతో కలిసే, అతడు తన రాత్రిభోజనం కానిచ్చేవాడు. ఒకవేళ ఏమైనా మరీ అనివార్యకారణాలవల్ల ఆ రాత్రి గడపలేకపోతే ఆ మర్నాటి రాత్రి మాత్రం తప్పనిసరిగా ఆమెతో గడిపి తీరవలసిందే. అతడి సహోద్యోగులు తమ కుటుంబాలతో అతణ్ణి కలవడానికి ఇష్టపడేవారు కారు. తమ దుకాణాల్లో గల్లాపెట్టెలదగ్గర తమ భార్యల్ని కూచోబెట్టే వర్తకులు అతణ్ణి చూసి భయపడేవారు, తీవ్రంగా ద్వేషించేవారు కూడా. అతడు ఆ దారమ్మట వెళ్తున్నప్పుడు ఆ వర్తకుల భార్యలు దుకాణాల ముందుకిటికీల అద్దాల గుండా అతడివైపు ఒక్కమారేనా ఒక్కసారేనా చూడకుండా ఉండలేకపోయేవారు. ఆ ఒక్కచూపే ఎన్నో సరస సంభాషణలకు పెట్టుగా ఉండేది. ఆ చూపులో ఒక వినతి, ఒక ప్రతిస్పందన, ఒక ఆకాంక్ష, ఒక  ఆమోదం కలగలసి ఉండేవి. వాళ్ళ భర్తలు, అతడు ఆ దారిన పోతున్నప్పుడు సహజవైముఖ్యంతో పక్కకు తప్పుకున్నవాళ్ళు, చటుక్కున ముందుకొచ్చి, దూరంగా వెళ్ళిపోతున్న ఆ సైనికదేహాకృతిని కటుదృక్కుల్తో పరికించేవారు.  చిరునవ్వులు చిందిస్తూ, తాను ఆ మనుషులమీద కనబరుస్తున్న ప్రభావానికి తనే లోపల్లోపల ముగ్ధుడవుతూ, ఆ సైనికాధికారి ఆ దారమ్మట వెళ్ళిపోయాక, ఆ వర్తకులు తడబడుతున్న చేతుల్తో తమముందు పరిచిపెట్టిన వస్తువుల్ని సర్దుతూ ఇలా అనుకునేవారు:

‘వీడో పెద్ద పోకిరీ. తమ సామాను ఈడ్చుకుంటూ ఇలా వీథుల్లోంచి పోయే ఈ పనికిమాలిన సజ్జుని మేపడం ఎప్పటికి మానేయగలుగుతాం? నా వరకూ నాకు ఒక సైనికుడిగా బతకడంకన్నా ఒక కసాయివాడిగా బతకడం మెరుగనిపిస్తుంది. అప్పుడు నా బల్లమీద నెత్తుటిమరకలుంటే అవి జంతువుల మాసంతాలూకు నెత్తుటిమరకలే అయి ఉంటాయి. నిజానికి ఆ కసాయివల్ల చాలా ఉపయోగముంటుంది. అతడి చేతుల్లో ఉండే కత్తి మనుషుల్ని చంపే కత్తి కాదు కదా. కాని ఇలాంటి హంతకులు, మారణాయుధాలతో, ఇలా నడిరోడ్డుమీద నడుచుకుంటూపోతుంటే చూస్తూ ఎలా సహించగలుగుతున్నామో నాకు అర్ధం కాదు. ఆ ఆయుధాలు అవసరమే, కాదనను, కాని వాటిని దాచుకునికదా తిరగాలి. ఇలా బహిరంగంగా ప్రదర్శించుకుంటూ పోవడానికి కాదు కదా. పైగా ఆ ఎర్రని పంట్లాములూ, ఆ నీలం రంగు కోట్లూను. అదే  ఒక తలారి ఉన్నాడనుకోండి, అతడిలా వేషం వేసుకుని తిరగడు కదా. అవునా కాదా?’

ఆ దుకాణాదారు అలా గొణుక్కుంటున్నప్పుడు, అతడి స్త్రీ, అతడికేమీ జవాబు చెప్పకుండా భుజాలు ఎగరేసి ఊరుకునేది. ఆ దృశ్యం చూడకపోయినా, ఆమె అలా చేసి ఉండగలదని ఊహిస్తూ, ఆ వర్తకుడు ‘ఇలాంటి వాళ్ళు ఇలా పైకీ కిందకీ పచార్లు చేస్తుంటే చూస్తుండేవాళ్ళకి బుద్ధిలేదని చెప్పాలి’ అని అరిచేవాడు.

ఏమైనప్పటికీ కెప్టెన్ ఎపివెంట్ తాలూకు ఇటువంటి సాహసకృత్యాల గురించిన ఘనత మొత్తం ఫ్రెంచి సైన్యంలో రూఢి అయిపోయింది.

ఇప్పుడు 1868 లో అతడి దళం, నూటరెండవ హుస్సార్ల దళం, రోవెన్ పట్టణంలోని శిబిరానికి వచ్చిచేరుకుంది.

తొందర్లోనే అతడి గురించి మొత్తం పట్టణానికి తెలీసిపోయింది. ప్రతి రోజూ సాయంకాలం అయిదు గంటలకి అతడు బోయెల్డ్యూ మాల్ దగ్గర కనిపించేవాడు. అక్కడ పరిమళాలు కక్కే కాఫీ సేవించేక, ఆ భవనసముదాయంలోకి ప్రవేశించేముందు,  తన దేహాకృతినీ, తన దారుఢ్యాన్నీ, తన మీసాల్నీ నలుగురుచూసేలాగా, ఆ దారమ్మట ఒక మలుపు చుట్టివచ్చేవాడు.

ఆ కూడలిలో జమగూడి, తమ చేతులు వెనక్కి చుట్టుకుని నడుస్తూ బిగ్గరగానో,  నెమ్మదిగానో, తమ వ్యాపారవిశేషాలు ముచ్చటించుకోడంలో మునిగి ఉండే రోవెన్ వ్యాపారస్థులు మధ్యలో అతడి వైపు ఒక చూపు సారించి తమలో తాము మెల్లగా గొణుక్కునేవారు:

‘దేవుడా? ఎంత అందంగా ఉన్నాడు!’

కానీ అతడెవరో తెలిసాక మళ్ళా ఇలా అనుకునేవారు:

‘చూడు. వాడు  ఆ దుష్టుడు కెప్టెన్ ఎపివెంట్’

అతణ్ణి కలుసుకున్నప్పుడు స్త్రీలు తమ తల కొద్దిగా పంకించేవారు. అది వినయంతో కూడిన చిన్నపాటి గగుర్పాటు లాంటిది. అతణ్ణి చూడగానే తామేదో వివస్త్రలైపోయినట్టో లేదా ఏదో నిస్సత్తువ తమని ఆవహించినట్టో వాళ్ళల్లో కలిగే ప్రకంపన అది.  తాము ఆకర్షణీయంగా కనిపించాలన్నట్టూ, అతడు తమవైపు ఒకసారి చూపులు ప్రసరించాలన్నట్టూ వాళ్ళు తమ శిరసులు ఓరగా వాల్చి, పెదాలపైన, చిరుహాసం తెచ్చుకునేవారు. అప్పుడు అతడెవరేనా సహచరుడితో కలిసి నడుస్తున్నట్లయితే, ఆ సహచరుడు, ఆ మొత్తం ప్రక్రియ చూస్తూ, అసూయతో రగిలిపోతూ,  ‘ఈ దుర్మార్గుడు ఎపివెంట్ కి ఎన్ని అవకాశాలు’ అని తనలో తాను గొణుక్కోకుండా ఉండలేకపోయేవాడు.

నగరంలోని వేశ్యలవిషయానికొస్తే అదంతా వారిలో వారికొక పెద్ద సంఘర్షణ గానూ,  అతణ్ణి ఎవరు చేజిక్కించుకుంటారన్న పరుగుపందెంగానూ ఉండేది. వాళ్ళంతా అయిదుగంటలకల్లా బోయెల్డ్యూ మాల్ కి చేరుకునేవారు. సైనికాధికారులు కూడా అక్కడికి చేరుకునే వేళ అది.  తళతళలాడే తమ కృపాణాలు నడుముకు వేలాడుతుండగా ఆ లెఫ్తినెంట్లు, ఆ కెప్టెన్లు, ఆ కమాండర్లు జతలు జతలుగా ఆ నాట్యశాలలోకి ప్రవేశిస్తుండగా, ఆ వేశ్యలు కూడా, తమ వస్త్రాల అంచులు నేలని జీరాడుతుండగా, జతలు జాతలుగా ఆ దారమ్మట పచార్లు చేస్తూ ఉండేవారు.

ఒక సాయంకాలం ఎం.టెంప్లియరు పాపోన్ అనే సంపన్న కర్మాగారాధిపతి ఉంపుడుగత్తె, అందమైన ఇర్మా, ఆ నాట్యశాలముందు తన బండి ఆపి, కిందకు దిగి, ఎం.పాలార్డ్ అనే నగిషీకళాకారుడి దుకాణం దగ్గర ఏదో కాగితమో లేదా విజిటింగు కార్డులో కొనే నెపమ్మీద కెప్టెన్ ఎపివెంట్ ని క్రీగంట చూసింది. ‘నీకు ఎప్పుడు వీలవుతుంది’ అన్నట్టు ఉంది ఆ చూపు. ఆ భావం ఎంత స్పష్టంగా ఉందంటే, ఆ సమయంలో తన లెఫ్టినెంటు కల్నల్ తో కలిసి మద్యం సేవిస్తున్న కల్నల్ ప్రూన్ ఆ దృశ్యం చూసి తన మిత్రుడితో ‘వాణ్ణి పాతెయ్య! మళ్ళా మరో అవకాశం దక్కించుకుంటున్నాడు ఆ దుష్టుడు’ అని గొణుక్కోకుండా ఉండలేకపోయాడు.

కల్నల్ మాటలు మరోసారి వినబడటంతో కెప్టెన్ తన పై అధికారి నుంచి లభించిన అంగీకారంగా దాన్ని భావిస్తూ ఆ మర్నాడూ, ఆ తర్వాత మరికొన్ని సార్లూ, ఆ సుందరిని ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఆమె హర్మ్యగవాక్షాల కింద మాటువేస్తూ గడిపాడు.

చివరకు ఒకరోజు ఆమె అతణ్ణి చూసింది. తాను కూడా చిరునవ్వు నవ్వింది.

ఆ సాయంకాలానికల్లా అతడు ఆమె ప్రేమికుడిగా మారిపోయేడు.

ఆ మీదట వారు నలుగురి దృష్టిలోనూ పడ్డారు. తమ అనుబంధాన్ని నలుగురూ చూసేలా ప్రదర్శించుకున్నారు. ఒకరికొకరు వివశులయ్యారు. తమ ప్రేమప్రతాపాన్ని చూసుకుని తామెంతో గర్వించారు.

ఆ సైనికాధికారీ, ఆ అందగత్తె ఇర్మా తప్ప ఆ పట్టణానికి మరో ఊసు లేదు. ఎం. టెంప్లియర్-పాపోన్ ఒక్కడికే ఈ సంగతులేవీ తెలియవు.

కెప్టెన్ ఎపివెంట్ తనకి కొత్తగా పట్టిన ఈ వైభవంతో మెరిసిపోడం మొదలుపెట్టాడు.  ప్రతి క్షణం ‘ఇర్మా నాతో ఇలా అంది- ఇర్మా  ఈ రాత్రి నాతో ఇలా అంది- లేదా, నిన్న రాత్రి భోంచేసేటప్పుడు ఇర్మా ఇలా అంది-‘ అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడు.

శత్రుహస్తాల్లోంచి చేజిక్కుంచుకున్న పతాకలాంటి  తమ ప్రేమని ప్రదర్శిస్తూ,  అలా ఒక ఏడాది పాటు వాళ్ళిద్దరూ,  రోవెన్ పట్టణమంతా  తిరిగేరు. ఈ కొత్త విజయం వల్ల తనకు మరింత ఘనతచేకూరినట్టుగా, భవిష్యత్తు మరింత నిశ్చయమవుతున్నట్టూ , తాను కోరుకుంటున్న సత్కారం మరింత ధ్రువపడుతున్నట్టూ , తక్కినవారందరి దృష్టీ తమమీదనే పడుతున్నట్టూ , తానేదో విస్మృతికి గురికాకపోగా మరింత ఆకర్షకకేంద్రంగా మారుతున్నట్టూ  అతడు అనుభూతి చెందాడు.

కాని ఇంతలో యుద్ధం మొదలయ్యింది. అన్నిటికన్నా ముందు కెప్టెన్ దళాన్నే యుద్ధంలో ముందు మోహరించారు. ఆ వియోగం విలాపాగ్నిగా మారింది. ఒక రాత్రంతా వాళ్ళు విలపిస్తూనే ఉన్నారు.

ఎర్రటి సైనికదుస్తులు, టోపీ, ఉరస్త్రాణం, కృపాణం మొత్తమన్నీ అప్పటిదాకా పక్కనపెట్టినవన్నీ పైకి తీసారు. దుస్తులు, పావడాలు, పట్టుమేజోళ్ళు, తదితరసామగ్రి మొత్తం నేలపైన తివాసీమీద కలగలిసిపోయాయి. ఆ గదిచూస్తే అక్కడేదో యుద్ధం జరిగినట్టుగా ఉంది. ఇర్మా శోకం పట్టలేనిదిగా ఉంది. ఆమె జుత్తు విరబోసుకు ఉంది. తన బాహువులు రెండింటితోనూ ఆ సైనికాధికారి మెడని చుట్టి అతణ్ణి పదేపదే హత్తుకుంటూ ఉన్నది. ఇంతలో అతణ్ణి వదిలిపెట్టి నేలమీద పడి పొర్లాడుతూ అక్కడున్న వస్తుసామగ్రిని అటూ ఇటూ విసిరేస్తూ, ఆ కుర్చీల అంచులు పట్టుకుని వేల్లాడుతూ, వాటి కోళ్ళు పట్టుకుని  కొరుకుతూ ఉండగా, కెప్టెన్ మరింత చలించిపోయాడు. కాని ఆమెను ఎలా ఓదార్చాలో అతడికి చాతకాక, ‘ఇర్మా, నా బుజ్జి ఇర్మా, నా మాట వినవూ, ఏడవకు, మరీ అంతలా ఏడవకు, నేను వెళ్ళక తప్పదు కదా, వెళ్ళడం చాలా అవసరం కదా’ అంటూ ఉన్నాడు.

అప్పుడప్పుడు తన చేతిచిటికెనవేలితో తన కంటికొసనుంచి ఒక అశ్రుబిందువుని తుడుచుకుంటూ ఉన్నాడు. తెల్లవారేటప్పటికి వారు ఒకరినుంచి ఒకరు విడిపోయారు. ఆమె వెళ్ళగలిగినంతదాకా తన ప్రేమికుడితో కలిసి బండిలో ప్రయాణించింది. ఇంక సెలవుతీసుకోక తప్పని చోటుకి చేరుకోగానే, ఆ వియోగ క్షణాన, ఆ మొత్తం ఆశ్వికదళం చూస్తూండగా, ఆమె అతణ్ణి ముద్దుపెట్టుకుంది. చూసే వాళ్ళకి అదంతా  ఎంతో సభ్యతతోనూ, సంస్కారంతోనూ, ప్రేమతోనూ కూడుకున్నదిగానే అనిపించింది. అతడి సహచర ఉద్యోగులు అతడి చేయిపట్టి నొక్కి ‘దుర్మార్గుడా, నిన్ను నిలువునా చీరిపాతెయ్యాలి! ఆమె చూడు ఎంత తల్లడిల్లిపోతోందో. ఎలాంటి హృదయం ఆమెది! పసికూనలాంటి హృదయం’ అని అన్నారు.

అసలు ఆ మొత్తం సన్నివేశంలోనే వారికి దేశభక్తిసమానమైందేదో కనిపించింది.

ఆ యుద్ధంలో ఆ ఆశ్వికదళం తీవ్రపరీక్ష తట్టుకుని నిలబడింది. కెప్టెన్ అపారమైన సాహసప్రతాపాలు చూపించి కడకు శౌర్యపతకాన్ని అందుకున్నాడు కూడా. యుద్ధం ముగిసింది. అతడు రోవెన్ కి మరలివచ్చి తన పటాలాన్ని చేరుకున్నాడు.

తిరిగి వచ్చిన వెంటనే అతడు ఇర్మా గురించి వాకబు చేసాడు. కాని ఆమె గురించి అతడికి ఎవరూ ఏ సంగతీ నిశ్చయంగా చెప్పలేకపోయారు. ఆమె ఒక ప్రష్యన్ మేజరుని పెళ్ళిచేసుకుందని కొందరు చెప్పారు. మరికొందరేమో ఆమె యివుటోలో ఉన్న తన తల్లిదండ్రులదగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పారు.

పట్టణంలో సంభవించే మరణాల్ని నమోదుచేసే కార్యాలయానికి అతడు తన దగ్గరుండే పరిచారకుణ్ణి పంపించాడు కూడా. కాని అతడి ప్రియురాలు పేరు అక్కడి జాబితాల్లో కనిపించలేదు.

అతడికి పట్టలేని ఉక్రోషం  కలిగింది. ఆ రోషాన్ని అతడు దాచుకోలేదు. దాన్ని ఎక్కడిపడితే అక్కడ వెళ్ళగక్కుతూనే వున్నాడు. తనకు కలిగిన  అసంతోషానికి చివరికి తన శత్రువుల్ని కూడా వదిలిపెట్టలేదు. ఆమె కనిపించకుండాపోడానికి రోవెన్ పట్టణాన్ని ఆక్రమించుకున్న ప్రష్యన్లే కారణమని భావిస్తూ ‘వచ్చే యుద్ధంలో వాళ్ళు తప్పకుండా మట్టికరుస్తారు, ఆ అడుక్కుతినేవాళ్ళు’ అని శాపనార్థాలు పెడుతుండేవాడు.

ఇలా ఉండగా, ఒక రోజు పొద్దున్నే, అతడు అల్పాహారసమయంలో భోజనాల మందిరంలో అడుగుపెట్టినప్పుడు ఒక ముసలి పనివాడు అతడిదగ్గరికొచ్చి ఒక ఉత్తరం అందించాడు. అతడు దాన్ని వెంటనే చదివాడు. అందులో ఇలా ఉంది.

‘నా ప్రియాతిప్రియమైన మిత్రుడా: నేను హాస్పటల్లో ఉన్నాను. చాలా చాలా జబ్బుపడి ఉన్నాను. ఒకసారి వచ్చి నన్ను చూడవూ. నువ్వొస్తే నాకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు.

ఇర్మా.’

అది చదవగానే కెప్టెన్ ముఖం పాలిపోయింది. పట్టలేని జాలితో కరిగిపోయాడు. ‘అయ్యో! దారుణం! పాపం పసిది! ఇదుగో ఈ అల్పాహారం ముగించుకుని క్షణంలో అక్కడికొస్తాను’ అని అన్నాడు.

ఆ  అల్పాహారం ఆరగిస్తున్నంతసేపూ అతడు తన తోటి అధికారులతో, ఇర్మా ఆసుపత్రిలో ఉనందనీ, ఆమెని తాను ఆ ఉదయం పోయి కలుసుకోబోతున్నాననీ చెప్తూనే ఉన్నాడు. అదంతా దుర్మార్గులయిన ఆ ప్రష్యన్ల పని అయి ఉంటుంది. ఆమె చేతిలో చిల్లిగవ్వ లేకుండా చెప్పలేనంత దైన్యంలో ఒక్కర్తీ పడి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రష్యన్లు ఆమె సామగ్రి మొత్తం కాజేసి ఉంటారు.

‘ఓహ్! ఆ చెత్త వెధవలు!’

అతడి మాటల్ని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వింటున్నారు. అల్పాహారం ముగించి తన చేతులు ఇలా తుడుచుకున్నాడో లేదో వెంటనే తన కృపాణం చేతుల్లోకి తీసుకుని, తన ఛాతీ ఉబ్బెత్తుగా బిగుసుకుంటూ ఉండగా, తన నడుము బెల్టు బిగించుకుని హుటాహుటిన పట్టణాసుపత్రికి బయల్దేరాడు.

కాని అత్యవసరంగా అడుగుపెట్టవలసిన ఆ ఆసుపత్రిదగ్గర అతణ్ణి లోపలకి అడుగుపెట్టనివ్వకుండా ఆపేసారు. అతడు తన కల్నలుని వెతికిపట్టుకుని అతడికి తన సంగతి మొత్తం వివరించి ఆ ఆసుపత్రి సంచాలకుడికి తనగురించి ఒక మాట చెప్పవలసిందిగా కోరుకున్నాడు.

ఆ పెద్దమనిషి ఆ సుందరసైనికాధికారిని కొంతసేపు తన కార్యాలయంలో వేచి ఉండేట్టు చేసాక, అప్పుడు చాలా ఉదాసీనభావంతో కూడిన పలకరింపుతో, ఎట్టకేలకు, ఆసుపత్రిలోకి ప్రవేశించడానికి అవసరమైన అనుమతి పత్రం మంజూరు చేసాడు.

ఒకసారి ఆసుపత్రిలోకి అడుగుపెట్టాక ఆ చికిత్సాలయంలో కనవస్తున్న దైన్యం, వేదన, మృత్యుసన్నిధి అతడికి ఊపిరాడకుండా చేసాయి. ఒక కుర్రవాడు అతడికి దారి చూపిస్తూ ఉన్నాడు. తన నడక ఎక్కడ చప్పుడు చేస్తుందో అన్నట్టు బొటనవేళ్ళమీద నడుస్తున్నట్టుగా, అతడు నెమ్మదిగా ఆ కారిడార్ల గుండా, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. అక్కడంతా అనారోగ్యం తాలూకు, మందుల తాలూకు తేమగాలితో కూడిన కంపు. ఎవరివో లోగొంతుకలో నడుస్తున్న మాటలు తప్ప ఆ ఆసుపత్రి మొత్తం నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంది.

మధ్యమధ్యలో ఏదన్నా తెరిచి ఉన్న తలుపు గుండా కెప్టెన్ కి ఏదో ఒక డార్మిటరీ కనిపించేది. అందులో వరస మంచాల మీద  పడుకున్న రోగులదేహాలవల్ల ఆ పడకలమీద వస్త్రాలు ఎత్తుగా పరిచినట్టు కనిపిస్తున్నాయి.

కొందరు రోగులు తమ పడకల దగ్గర కుర్చీల్లో కూచుని ఏదో ఒకటి కుట్టుకుంటూ కనిపిస్తున్నారు. వారంతా ఒకేలాంటి బూడిదరంగు దుస్తుల్లో నెత్తిన తెల్లని టోపీలతో కనిపిస్తున్నారు.

అతడికి దారిచూపిస్తున్న కుర్రవాడు రోగులతో కిక్కిరిసిన ఒక నడవా దగ్గర  హటాత్తుగా ఆగాడు. అక్కడ తలుపు మీద ‘సిఫిలిస్’ అని రాసి ఉన్న అక్షరాలు  కెప్టెన్ చూశాడు.

అతడు ఉలిక్కిపడ్డాడు. అతడి ముఖం ఎర్రబడింది. అక్కడ తలుపు పక్క చిన్న చెక్కబల్ల దగ్గర ఒక సహాయకురాలు మందు కలుపుతూ ఉన్నది.

ఆమె అతడితో ‘రండి, ఆమెది బెడ్ నంబరు 29 ‘ అని అన్నది.

ఆమె ఆ సైనికాధికారికన్నా ముందు నడుస్తూ ‘అదిగో, అదే’ అని అక్కడొక పడక వైపు చూపించింది.

ఆ పడకమీద దుప్పట్లమూట తప్ప మరేమీ ఉన్నట్టు కనిపించలేదు. చివరికి ఆమె తలకూడా ఆ దుప్పటిలో ముడుచుకుపోయినట్టుంది. ఎటుచూసినా ఎన్నో రోగశయ్యలమీద ఎన్నో  ముఖాలు, పాలిపోయిన ముఖాలు, తమ మధ్యకి ఒక సైనికాధికారి రావడం చూసి నిర్ఘాంతపోతున్న స్త్రీల ముఖాలు, యువతుల, వృద్ధురాళ్ళ ముఖాలు, కాని అన్ని ముఖాలూ అక్కడి వాతావరణానికి తగ్గట్టుగానే ఎంతోసాదాసీదాగా కనిపిస్తున్నాయి.

ఆపాదమస్తకం చలించిపోతూ, ఒకచేత్తో కరవాలం సర్దుకుంటూ, మరొకచేతిలో తన టోపీతో, కెప్టెన్ నెమ్మదిగా గొణుకున్నాడు:

‘ఇర్మా’

ఆ పడకమీద అకస్మాత్తుగా ఒక కదలిక కనిపించింది. నెమ్మదిగా అతడి ప్రియురాలి వదనం దర్శనమిచ్చింది. కానీ ఆ ముఖం ఎంతగా మారిపోయి ఉందంటే, ఎంతగా వడిలిపోయి ఉందంటే, ఎంతగా కుంగిపోయిఉందంటే, అతడు ఆ ముఖాన్ని దాదాపుగా పోల్చుకోలేకపోయాడు.

పట్టలేని భావోద్వేగంతో ఆమె ఊపిరి ఎగబీలుస్తూ ‘ఆల్బర్ట్!-ఆల్బర్ట్! నువ్వేనా! ఓహ్! నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను! చాలా సంతోషంగా ఉంది’ అని అంది. కన్నీళ్ళు ఆమె చెంపలమీంచి ప్రవహించాయి.

ఆసుపత్రి సహాయకురాలు ఒక కుర్చీ తీసుకొచ్చి వేసి ‘కూర్చోండి సార్’ అని అన్నది.

అతడు కూర్చుని తన ఎదట ఉన్న కళాకాంతిలేని ఆ దీనవదనాన్ని పరికించి చూసాడు. తాను ఆమెని వదిలిపెట్టి వెళ్ళినప్పటి ఆ తరుణయవ్వనికీ ఈమెకీ పోలికనే లేదు. చివరికి అతడు గొంతు పెగుల్చుకుని ‘ఏమైంది నీకు?’ అని అడిగాడు.

ఆమె ఏడుస్తూ ‘నీకు మొత్తం తెలుసు. నాకేమైందో అదిగో, ఆ తలుపు మీద రాసి ఉంది కదా’ అని ఆ మంచం మీద పరిచిన దుప్పటి అంచుతో తన నేత్రాల్ని కప్పుకుంది.

నిస్పృహతోనూ, కించపాటుతోనూ అతడు ‘ నా చిన్నారీ, ఇది నీకెలా తగులుకుంది?’ అనడిగాడు.

‘అదుగో, ఆ ప్రష్యను మృగాలవల్ల. వాళ్ళు నన్ను నిర్బంధంగా ఎత్తుకుపోయి మరీ నా శరీరాన్ని విషపూరితం చేసేసారు’ అందామె.

ఇంక ఆ మాటల్నెలా కొనసాగించాలో అతడికి తెలియళేదు. అతడు ఆమె కేసి చూస్తూ తన చేతుల్లో టోపీని అటూ ఇటూ మెలితిప్పుతూ ఉన్నాడు.

తక్కిన రోగులు అతణ్ణి చూస్తూ ఉన్నారు. రోగంతో చివికిపోతూ, కుళ్ళిపోతున్న దేహాలదుర్గంధం అతడికి తెలుస్తూ ఉంది.  అత్యంత హేయప్రదమైన, దారుణమైన రోగానికి చిక్కి విలవిల్లాడుతున్న యువతులతో ఆ నడవా మొత్తం నిండిపోయి ఉంది.

‘నేను మళ్ళీ బాగవుతానన్న ఆశ లేదు నాకు. పరిస్థితి మరీ విషమించిందనే వైద్యులు చెప్తున్నారు’ అని గొణుక్కుంది ఆమె.

అప్పుడామె ఆ సైనికాధికారి దుస్తులమీద శౌర్యపతకం చూసి ‘ఓహ్! నీకు సన్మానం లభించిందన్నమాట! ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. నాకెంత తృప్తిగా ఉందో చెప్పలేను! ఇప్పుడు నేను నిన్నో సారి కావిలించుకోగలిగితే ఎంతబాగుణ్ణు’ అని అన్నది.

ఆ మాటలు వినగానే ఆమె తనని నిజంగానే కావిలించుకుని ముద్దుపెట్టుకోబోతుందేమో అన్న ఊహకి ఆ కెప్టెన్ దేహమంతటా భయంతోనూ, అసహ్యంతోనూ కూడిన ఒక ప్రకంపన చెలరేగింది. ఒక్కసారిగా అక్కణ్ణుంచి ఆరుబయటకి పారిపోయి గుండెనిండా గాలి పీల్చాలనీ, మరి ఇక జన్మలో ఆమెని చూడకూడదనీ అనిపించింది. కాని ఎలా వీడుకోలు తీసుకోవాలో తెలియక, అతడక్కడే,  కొంతసేపు నిలబడి చివరికి ‘నీ సంగతి నువ్వు సరిగ్గా చూసుకోలేదన్నమాట’ అని నెమ్మదిగా గొణుక్కున్నాడు.

ఇర్మా కళ్ళల్లో ఒక జ్వాల భగ్గుమంది. ‘లేదు. నేను వాళ్ళనుంచి బయటపడవలసిన సమయం వచ్చినప్పుడు నాలో ఒక ప్రతీకారేచ్ఛ రగులుకుంది. నేను వాళ్ళని కూడా విషపూరితం చేసేసాను. ఎంతమందిని వీలైతే, అంతమందిని. రోవెన్ పట్టణంలో వాళ్ళెంతమంది ఉంటే అంతమందినీ విషపూరితం చేసేశాను. అప్పుడు నాకు నా గురించిన ఆలోచన ఏ కోశానా లేదు.’

ఆ మాటలు వింటూనే ‘అయితే, చెప్పుకోదగ్గ పనే చేసావన్నమాట!’అని అన్నాడు. ఆ స్వరంలో  ఒకింత ధీరతా,  రాజసం తొణుకాడాయి.

ఆ మాటలకు ఆమె నిలువెల్లా కదిలిపోతూ, కపోలాలు ఎర్రబడుతుండగా ‘అవును, నా వల్ల ఒక్కడు కాదు, చాలామందే చచ్చిపోయారు. నా ప్రతీకారం తీర్చుకోగలిగానని ఖాయంగా చెప్పగలను’ అని అన్నది.

‘మరీ మంచిది ‘ అని అన్నాడతడు. అప్పుడు లేచి ‘సరే, నేను ఇప్పటికైతే సెలవుతీసుకోక తప్పదు. ఇప్పుడు మా కల్నల్ని కలుసుకోవలసిన పని ఉంది-‘  అని అన్నాడు.

ఆమె వివశురాలై,  ‘అప్పుడేనా! అప్పుడే వెళ్ళిపోతావా ! నువ్వు వచ్చిందిప్పుడే కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావా’ అని ఏడవడం మొదలుపెట్టింది.

కాని అతడు ఎలాగైనా వెళ్ళిపోడానికే సిద్ధపడి,  ‘చూడు, నువ్వు పిలవగానే వచ్చానా లేదా, కల్నలు చెప్పిన సమయానికి ఆయన్ని కలుసుకోక తప్పదు కదా’ అని అన్నాడు.

‘ఇంకా ఆ కల్నలేనా? కల్నల్ ప్రూన్?’  అని అడిగిందామె.

‘అవును కల్నల్ ప్రూన్. యుద్ధంలో రెండుసార్లు గాయపడ్డాడు ఆయన.’

‘మరి నీతోటి సైనికాధికారుల మాటేమిటి? వాళ్ళల్లో ఎవరేనా  యుద్ధంలో మరణించారా?’

అవును. అవును. సేంట్-టిమోన్, సవగ్నాట్, పోలీ, సాప్రివాల్, రాబర్ట్, డి కర్సన్, పసఫిల్, సంతల్, కారవాన్, పోయివ్రిన్ – వాళ్ళంతా యుద్ధంలో మరణించారు. సాహెల్ ఒక చేయి పోగొట్టుకున్నాడు. కోర్వోయిసన్ కి ఒక కాలు తీసేసారు. పాకెట్ కి కుడికన్ను పోయింది.’

ఆమె ఆసక్తిగా ఆ మాటలు వింది. అప్పుడు ఉన్నట్టుండి-

‘నన్నొక్కసారి ముద్దుపెట్టుకోవూ! వెళ్ళిపోయేముందు ఒక్కసారి ముద్దిచ్చిపోవూ! మేడం లాంగ్లోయిస్ ఇప్పుడిక్కడ లేదు’ అని తడబడుతూ అడిగింది.

అపారమైన ఏహ్యత తనని ముంచెత్తుతున్నప్పటికీ, అతడు తన అధరాల్ని వడిలిపోతున్న ఆమె నుదుటికి ఆనించాడు. ఆమె తన బాహువుల్తో అతణ్ణి చుట్టి అతడి నీలం రంగు కోటుమీద ఎడాపెడా ముద్దులు వర్షించింది.

అప్పుడు ‘నువ్వు మళ్ళీ వస్తావు కదూ. మళ్ళీ వస్తానని చెప్పు. తప్పకుండా వస్తానని మాటివ్వు’ అని అన్నది.

‘తప్పకుండా. మాటిస్తున్నాను.’

‘ఎప్పుడు? ఇప్పుడే చెప్పు. గురువారం వస్తావా?’

‘తప్పకుండా. గురువారం-‘

‘గురువారం రెండింటికి?’

‘తప్పకుండా. గురువారం రెండింటికి.’

‘ఒట్టు?’

‘ఒట్టు.’

‘సరే, ప్రియా, సెలవు.’

‘సెలవు.’

ఆ డార్మిటరీలో తనని చుట్టుముడుతున్న  చూపులకి తత్తరపాటు చెందుతూ, తన స్ఫురద్రూపం మరింత ముడుచుకుని  కనిపించేటందుకా అన్నట్టుగా ముందుకు వంగి నడుచుకుంటూ అతడు బయటకి వెళ్ళిపోయాడు. వీథిలో అడుగుపెట్టగానే  గుండెనిండా  గట్టిగా గాలి పీల్చుకున్నాడు.

ఆ సాయంకాలం అతని సహోద్యోగులు అతణ్ణి ‘ఇర్మా ఎలా ఉంది?’ అని అడిగారు.

అతడు అదిమిపెట్టుకున్న ఉద్వేగంతో జవాబిచ్చాడు: ‘ఆమె ఊపిరితిత్తుల్లో సమస్యగా ఉంది. బాగా జబ్బు చేసింది.’

కాని ఒక చిన్న సైనికాధికారి, అతడు మాట్లాడుతున్న పద్ధతిని బట్టి ఏదో గమనించినవాడిలాగా, కేంద్రకార్యాలయానికి వెళ్ళాడు. ఆ మర్నాడు కెప్టెన్ భోజననమందిరంలోకి వెళ్ళేటప్పటికి నవ్వులూ, పరిహాసోక్తులూ అతణ్ణి ఉప్పెనలాగా ముంచెత్తాయి. ఎలాగైతేనేం, చివరికి, వాళ్ళకి అతడి మీద ప్రతీకారం తీర్చుకోడానికి అవకాశం దొరికింది.

ఆ తర్వాత నెమ్మదిగా తెలిసిందేమంటే, ఎవరిమీదనో కక్ష తీర్చుకోడానికా అన్నట్టు ఇర్మా ఒక ప్రష్యను అధికారిని పెండ్లి కూడా చేసుకుందనీ, ఆమె నీలి హుస్సార్ల దళానికి చెందిన ఒక అధికారితో గుర్రం మీద గ్రామసీమల్లో తిరుగుతూ కనిపించిందనీ,  అలాగే చాలామందితో తిరిగిందనీ, రోవెన్ లో చివరికి ఆమెని ‘ప్రష్యన్ల భార్య’ గా తప్ప మరోలా పిలిచేవారు కాదనీ.

దాదాపు ఎనిమిదిరోజులపాటు కెప్టెన్ తన దళం చేతుల్లో బాధితుడిగా గడిపాడు. భూతభవిష్యత్తుల గురించి చెప్పగలరనే వాళ్ళ నుంచి పోస్టుద్వారానో  దూతలద్వారానో  అతడికి ఏవేవో సలహాలు అందుతూనే ఉన్నాయి. వాటితో పాటు మందులు కూడా. ఆ మందులు దేనికి వాడాలో కూడా  వాటి పెట్టెలమీద స్పష్టంగా రాసి ఉండేది.

అప్పుడు వీస్తున్న గాలి ఏమిటో గుర్తుపట్టి కల్నల్ కూడా ‘మంచిది, కెప్టెన్ కి చెప్పుకోదగ్గ స్నేహమే దొరికింది. అతడికి నా శుభాకాంక్షలు’ అని కటువాక్యాలు పలక్కుండా ఉండలేకపోయాడు.

పన్నెండు రోజులు పూర్తయ్యేటప్పటికి కెప్టెన్ కి ఇర్మానుంచి మరొక విన్నపం చేరవచ్చింది. కానీ అతడు దాన్ని కోపంతో చింపేసి జవాబివ్వకుండా ఉండిపోయాడు.

మరొక వారం గడిచాక మళ్ళా ఆమె అతడికి ఉత్తరం రాసింది. తన  ఆరోగ్యం మరింత క్షీణించిందనీ, తనని వచ్చి చూసి కడపడి వీడ్కోలు తీసుకొమ్మనీ.

అతడు జవాబివ్వలేదు.

కొన్ని రోజుల తర్వాత అతడికి ఆసుపత్రి పురోహితుడినుంచి ఒక వర్తమానం అందింది.

‘ఇర్మా పావోలిన్ అనే యువతి మృత్యుశయ్యమీద ఉంది. మిమ్మల్ని వచ్చి చూడమని ఆమె వేడుకుంటోంది’ అని.

మతాధికారినుంచి వచ్చిన ఆ వర్తమానాన్ని కెప్టెన్ తృణీకరించలేకపోయాడు. కాని అతడి హృదయంలో ఒక పాపిష్ఠి కోపం సుళ్ళుతిరుగూనే ఉంది. గాయపడ్డ స్వాతిశయంతోనూ, అవమానభారంతోనూ అతడు ఆ ఆసుపత్రిలో అడుగుపెట్టాడు.

కాని ఆమె ఇంతకు ముందు చూసినప్పటిలానే ఉంది. పెద్దగా  మార్పేమీ కనిపించలేదు. ఆమె తనని మోసపుచ్చిందని అనుకుంటూ ‘ఏం కావాలి నీకు?’ అనడిగాడు.

‘నువ్వు నాకు కడపటి వీడ్కోలు చెప్పాలని కోరుకుంటున్నాను. నా అంత్యక్షణాలు దగ్గరగా పడ్డట్టుగా తోస్తున్నది’ అని అందామె.

కాని అతడు ఆ మాటలు నమ్మలేదు.

‘చూడు. నువ్వు నన్ను నా సైనిక దళం ముందు నవ్వులపాలుచేసావు. ఈ వ్యవహారం నేనింక  పొడిగించదలుచుకోలేదు’ అని అన్నాడు.

‘నేనేం చేసాను?’ అనడిగిందామె.

ఆమెకేమి జవాబివ్వాలో తెలీక అతడికి చికాగ్గా  అనిపించింది. కాని ‘నేనిక్కడికి తిరిగి వచ్చింది నీ వల్ల నలుగురిలోనూ నవ్వులపాలవడానికేనా?’ అనడిగాడు.

ఆమె అతడికేసి చూసింది. ఆ కళ్ళల్లో అలసట కనబడింది. పలచని కోపం తన నేత్రాల్లో మెరుస్తుండగా ఆమె ‘నేనేం చేసాను? బహుశా నేను నీతో మరింత పెద్దమనిషి తరహాలో ప్రవర్తించి ఉండవలసిందేమో! అంటే నీనుంచి కొన్నిసార్లు ఏదో ఒకటి ఆశించడమేనా నేను చేసిన తప్పు? నీ కోసమే కాకపోతే, నేను ఎం.టెంప్లియర్-పాపోన్ దగ్గరే ఉండిపోయేదాన్ని, ఇప్పుడీ పరిస్థితికి వచ్చి ఉండేదాన్ని కాను. కాని చూడు, నన్నీ పరిస్థితికి ఎవరేనా తప్పు పట్టొచ్చేమో గాని నువ్వు మాత్రం కాదు’ అని అన్నది.

‘నేను నిన్ను తప్పుపట్టడం లేదు. అలాగని నిన్ను చూడటానికి ఇక్కడకి వస్తూండటం కూడా నాకు సాధ్యం కాదు. ఎందుకంటే ప్రషన్లతో నువ్వు తిరిగిన తీరు మొత్తం పట్టణానికే తలవంపులు తెచ్చింది’ అని అన్నాడతడు. అతడి కంఠస్వరం స్పష్టంగా ఉంది.

ఆమె నెమ్మదిగా లేచి మంచం మీద కూచుంది. ఒకింత వణుకుతూనే ఇలా జవాబిచ్చింది:

‘ప్రష్యన్లతో నేను తిరిగిన తీరా? వాళ్ళు నన్ను తీసుకుపోయారని నీకెప్పుడు చెప్పాను? నీకు వాళ్ళ గురించి  చెప్పానంటే, అది నేను వాళ్ళని విషపూరితం చేసానని చెప్పడానికీ, అలా చేసే క్రమంలో నన్ను నేను ఇసుమంత కూడా పట్టించుకోలేదని చెప్పడానికీను. చికిత్స చేయించుకుని బాగవ్వాలనుకుంటే అదెంత పని నాకు ? కాని వాళ్ళని చంపెయ్యాలనుకున్నాను. అనుకున్నట్టే చంపేసాను. తెలుస్తోందా! వాళ్ళని చంపేసాను!’

కానీ అతడలా నిలబడే  ‘ఏమైనా కానీ, అదంతా చాలా సిగ్గుచేటుగా ఉంది’ అని  అన్నాడు.

ఆమెకి ఊపిరాడనట్టయింది. నెమ్మదిగా తేరుకుని ఇలా అంది:

‘వాళ్ళు చావడానికి కారణమవడంలోనూ, వాళ్ళని నిర్మూలించడంలోనూ నేను చేసినదానిలో అంత సిగ్గుచేటు పని ఏముంది చెప్పు? జియన్ని-డి-ఆర్ వీథిలో నువ్వు మా ఇంటికొస్తున్నప్పుడు ఇలా మాట్లాడేవాడివి కావు. ఆహ్! ఎంత సిగ్గుచేటు! అత్యున్నత సైనిక పురస్కారం పొందిన నువ్వు కూడా నాకులాగా ప్రతీకారం తీర్చుకుని ఉండలేదని చెప్పగలను. నిజానికి నీకు లభించిన దానికన్నా గొప్ప గౌరవం దొరకాలి నాకు. అర్ధమవుతోందా? నీకన్నా మించిన సత్కారం. ఎందుకంటే, నీకన్నా ఎక్కువమంది ప్రష్యన్లని చంపాన్నేను!’

అతడు పట్టలేని ఉక్రోషంతో ఆమెముందు కొయ్యబారిపోయి నిల్చుండిపోయాడు. ‘అయినా, కాని- నువ్వు- కాని- కాని అదుగో అలాంటి సంగతుల వల్ల-  సమ్మతం కాదు-ఎవరేనా ఈ ప్రసక్తి తేడానికి-‘ అంటూ  గొణుక్కున్నాడు.

కాని ఆమె అతడి మాటలు వినడం లేదు. ఆమె చెప్తూనే ఉంది. ‘నువ్వు ప్రష్యన్లని ఏమి  చెయ్యగలిగావు? వాళ్ళని రోవెన్ పట్టణానికి రాకుండా నువ్వు నిరోధించి ఉండిఉంటే ఇదంతా జరిగి ఉండేదా? చెప్పు! ఇంక మాట్లాడకు. నీకన్నా ఎక్కువగా ప్రష్యన్లని నేను తుదముట్టించాను. నీకన్నా మిన్నగా వాళ్ళని నిర్మూలించగలిగాను. అలా చేసినందుకు ఇక్కడ నేను మరణించబోతుంటే, నువ్వు మాత్రం పాటలు పాడుకుంటూ, ఆడవాళ్ళని మోసగించడానికి తగుదునమ్మా అని మళ్ళా సిద్ధపడుతున్నావు-‘

అక్కడ ప్రతి ఒక్క పడకమీదనుంచీ ఏదో  ఒక తల పైకెత్తి వాళ్ళనే చూస్తూ ఉంది. అక్కడి కళ్ళన్నీ, సైనికదుస్తుల్లో ఉన్న, అతణ్ణేచూస్తున్నాయి. అతడు మళ్ళా తడబడుతున్న మాటలతో :

‘కాని నువ్వు- మౌనంగా- చూడు- నువ్వు-‘  అని అంటున్నాడు.

కాని ఆమె మౌనం వహించలేదు. గొంతెత్తి అరిచింది:

‘ఆహ్! అవును, నువ్వొక మొనగాడివి! నీ గురించి నాకు బాగా తెలుసు. మళ్ళా చెప్తున్నాను విను. ప్రష్యన్లమీద నీకన్నా కూడా నేనెక్కువ ప్రతీకారం తీర్చుకోగలిగాను. వాళ్ళకి నేనెక్కువ హాని కలిగించాను. నీ మొత్తం ఆశ్వికదళమంతా కలిసి కూడా మట్టుపెట్టలేనంతమందిని నేనొక్కర్తినే మట్టికరిపించాను. తెలుస్తోందా? పిరికిపందా!’

అతడు అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. అంతకన్నా కూడా పారిపోయాడని చెప్పడం సముచితంగా ఉంటుంది. తమ సంభాషణ వింటూ సంచలిస్తున్న ఆ రోగగ్రస్తుల రెండేసి వరసల ఆ పడకలమధ్యనుంచి అతడు తన పొడవాటి కాళ్ళు ఈడుస్తూ అక్కణ్ణుంచి పారిపోయాడు. అతడి వెనకనే,  ఊపిరి ఎగబీలుస్తూ, ఊపిరాడకుండా పోతున్న గొంతుతో ఇర్మా అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి:

‘నీకన్నా కూడా-నిన్ను మించి-అవును నేనే ఎక్కువమందిని చంపాను-‘

నాలుగేసి మెట్లచొప్పున గెంతుకుంటూ అతడు  వడివడిగా ఆ గదినుంచి బయటపడి తన ఇంటికి పరుగుపరుగున చేరుకుని తన గదిలో అడుగుపెట్టి తలుపులు బిగించేసుకున్నాడు.

ఆ మర్నాడే ఆమె మరణించిందని అతడికి వార్త చేరింది.


Featured image: Illustration of Boule de Suif, 1884, by Paul-Émile Boutigny.

14-1-2026

8 Replies to “నన్ను వెన్నాడే కథలు-19”

  1. దైన్యం,వేదన,మృత్యు సన్నిధి —ఎటువంటి పదాలు! వీటిని చూస్తే తెలుగులో అందమయిన,భావగర్భిత పదాలకు కొరత లేదని పిస్తుంది. మంచి కథను చాలా అద్భుతంగా పరచయం చేశారు. ధన్యవాదాలు సర్ .

  2. అద్భుతమైన కథని పరిచయం చేశారు. Guy De Maupassant కథలు భలే ఇష్టం నాకు. గై డి మపాసా లైఫ్ కూడా భలే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా కవి స్విన్బర్న్ ( శ్రీశ్రీ ఈయన గురించి కవిత రాశాడు ) ను ఏదో సముద్రం లో మునిగిపోకుండా కాపాడిన ఉదంతం చాలా fascinating గా అనిపిస్తుంది. ఇతని నెక్లెస్ కథ నాకు మరీ మరీ ఇష్టం..

  3. కథ మొత్తం మూర్తీభవించిన పురుషాహంకారం,
    ఇప్పటికీ మారని అగ్రరాజ్య/బలమైన సైనిక దళం కల రాజ్యం దురాశ,దురాక్రమణ,దురహంకారం..
    సరైన మందు,మాకు లేని అలనాటి అనారోగ్యం…
    గుండెలు అవిసిపోయేలా వ్రాసారు.మహా రచయితకు వందనం. పంచినందుకు మీకు ధన్యవాదాలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%