
భాద్రపదం చివరి దినాల్లో రెల్లు పూసినట్టు
మలి హేమంతంలో గాలిపటాలు పూస్తున్నాయి.
ఆకాశమంతా విరబూసిన పూలతోటల్లోంచి
రాలిపడ్డ రేకల్తో ప్రతిచెట్టూ ఒక పూలమొక్క.
వీథుల్లో పిల్లలు దారం కొసలుపట్టుకుని
పడవలు నడుపుకుంటూ పోతున్నారు పైపైకి.
ప్రపంచం మీద యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నవి
కానీ పిల్లల గగనతలమ్మీద సంతోషానిదే రాజ్యం.
వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారనుకుందామా
ఆకాశం తలుపులు ఒకటొకటీ తెరుస్తున్నారు.
స్వర్గానికి నిచ్చెనలు కట్టుకుంటున్న పిల్లలవెనక
ఇప్పుడు నగరం కూడా నింగిబాట పట్టింది.
16-1-2026
Beautiful! ❤️
ధన్యవాదాలు మానసా!
“పిల్లల గగనతలమ్మీద సంతోషానిదే రాజ్యం!”
చాలా బాగుందండీ.. మీ శైశవగీతం!
ధన్యవాదాలు మేడం!
మధురం.. గాలి పటాలతో పిల్లల ఉత్సాహ పరవళ్ళను .. ఇలా.. మీలా చూసిన వారెవ్వరూ నాకు కనిపించలేదు. దండాలు మీకు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
కాదేదీ కవి వీక్షణానికి అతీతం! అది పతంగమైనా, విహంగమైనా!
“పిల్లల గగనతలమ్నీద సంతోషానిదే రాజ్యం”
ఎంత గొప్ప గా ఉందో!
హృదయపూర్వక ధన్యవాదాలు జీవన్!
ఎంత అందంగా ఆశావహంగా రాసారో కవితను
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
నగరం నింగి బాట పట్టడం బాగుంది సర్
ధన్యవాదాలు మేడం!