
నలభయ్యేళ్ళ కిందట చదివిన కథల్లో నన్ను అంటిపెట్టుకున్నవేమిటని ఆలోచిస్తూ ఉంటే, రెండు రకాల కథలు కనిపిస్తున్నాయి. ఒకటి: గొప్ప భావుకులూ, కవులూ, స్వాప్నికులూ, టాగోరూ, విభూతిభూషన్ లాంటి వాళ్ళు రాసినవి. మరొక తరహా కథలు, సామాజిక న్యాయంకోసం తపించిన ప్రేమ్ చంద్, గోర్కీ, లూ-సన్, ఓ హెన్రీ లాంటి వాళ్ళు రాసిన కథలు.
ఆధునిక చీనా సాహిత్య వైతాళికుడు లూ-సన్ (1881-1936) రాసిన కథలు అప్పటికే తెలుగులోకి రాకపోలేదు. నిర్మలానంద వంటి అభ్యుదయవాది చేసిన అనువాదం కూడా నేను చదవకపోలేదు. కాని లూ-సన్ కథల సంపుటాలు Wild Grass (1975), Dawn Blossoms Plucked at Dusk (1976) ఆ రోజుల్లోనే నా చేతుల్లోకి ఎలానో వచ్చాయి. బహుశా అప్పట్లో హైదరాబాదు పేవ్ మెంట్లమీద సెకండ్ హాండు పుస్తకాల్లో దొరికి ఉంటాయి. వాటిల్లో ఒక కథ, మనుష్యకుమారుడి గురించీ, దైవకుమారుడి గురించీ లూ-సన్ రాసింది కదివాను. ఆ కథ నా రక్తంలోకీ ఇంకిపోయింది.
ఆ తర్వాత రోజుల్లో, పదిపదిహేనేళ్ళ కిందట, లూ-సన్ కథలు దాదాపుగా మొత్తం చదివేను. ముఖ్యంగా, చీనా ఫారిను లాంగ్వేజెస్ ప్రెస్సు ప్రచురించిన Selected Stories of Lu Hsun (1960) , పెంగ్విన్ సంస్థ ప్రచురించిన The Real Story of Ah-Q and Other Tales of China: The Complete Fiction of Lu Xun (2009) నా చేతుల్లోకి వచ్చాక ఆ కథలు సాకల్యంగా చదివేక లూ-సన్ ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలిగేను. ఆ కథల్లో Village Opera (1922) కథని తెలుగు చేసి గతంలో ఇక్కడ మీకు వినిపించేను కూడా.
(ఆసక్తి ఉన్నవాళ్లు ఆ కథ ఇక్కడ వినొచ్చు)
కానీ ఈ రోజు లూ-సన్ అనగానే నాకు గుర్తొస్తున్నది, నలభయ్యేళ్ళ కిందట, రాజమండ్రిలో చదివిన, ఆ దైవకుమారుడి కథనే. Wild Grass లోని Revenge II (1924). ఆ కథని నేను చదివిందే ఇంగ్లిషులో కాబట్టి, ఇప్పుడు మీకోసం నేనే తెలుగు చేయకతప్పింది కాదు.
నిజానికి ఇది కథకీ, వచనకవితకీ మధ్యస్థంగా ఉన్న రూపం. ఇందులో కథకుడు చెప్తున్నదేమిటనేదానిమీద ఇప్పటికీ చీనాపండితులు చర్చిస్తూనే ఉన్నారు. కాని ఇప్పుడు గాజాలో జరుగుతున్న నరమేధం నేపథ్యంలో ఈ కథ మరోసారి కొత్తగా కనిపిస్తూ నన్ను మరింత ఆశ్చర్యపరుస్తున్నది.
లూ-సన్
వైరశుద్ధి-II
ఇస్రాయేలీల రాజు తనని తాను దైవకుమారుడిగా భావిస్తున్నాడు కాబట్టి ఆయన్ని శిలువ వెయ్యక తప్పదు.
సైనికులు ఆయనతో ఒక ఊదరంగు అంగీ తొడిగించారు. నెత్తిన ముళ్ళకిరీటం పెట్టి ఆయన్ని చిరునవ్వమన్నారు. అప్పుడు వాళ్ళు ఆయణ్ణి పేముబెత్తంతో బాది, మీద కసిదీరా ఊసి, ఆయన ముందు తాము మోకరిల్లారు. ఆయన్నట్లా హేళనచేసినంత సేపు చేసాక ఆ ఊదారంగు అంగీ చించేసి అప్పుడు మళ్ళా ఆయన్ని తన మొదటి గుడ్డలే తొడుక్కోమన్నారు.
చూడండి వాళ్ళాయన్ని ఎట్లా చితకబాదారో, ఆయన ముఖం మీద ఎట్లా ఊసారో ఆయన ముందెట్లా మోకరిల్లారో . ..
కాని ఆయన సుగంధభరిత పానీయం స్వీకరించబోవడం లేదు. ఇస్రాయేలీలు తమ దైవకుమారుడిపట్ల చూపిస్తున్న ప్రవర్తన పట్ల కించిత్తు కూడా చలించకుండా ఉండాలనుకున్నాడు. వాళ్ళ భవిష్యత్తును చూసి జాలీ, వారి ప్రస్తుతాన్ని చూసి ఏవగింపూ కలిగేయి ఆయనకి.
చుట్టూ ఎటు చూసినా ద్వేషం, దయనీయం, అభిశప్తం.
ఇంతలో సుత్తుల చప్పుళ్ళు వినవచ్చాయి. ఆయన అరచేతుల్లోకి మేకులు దిగుతున్నాయి. కాని ఈ దురదృష్టకరమానవులు తమ దైవకుమారుణ్ణి శిలువ వేస్తున్నారన్న వాస్తవం ఆయన బాధను ఉపశమింపచేస్తూ ఉంది. సుత్తుల చప్పుళ్ళు వినవస్తున్నాయి, మేకులు ఆయన అరికాళ్ళని చీల్చుకుపోతున్నప్పుడు ఎముకలు విరుగుతున్న నొప్పి ఆయన హృదయంలో, ఎముకల మజ్జలోకీ చొచ్చుకుపోయింది. కాని ఈ శాప్రగ్రస్తమానవులు తమ దైవకుమారుణ్ణి శిలువ వేస్తున్నారన్న వాస్తవం ఆయన బాధను అణచివేస్తూ ఉన్నది.
ఇప్పుడు శిలువ నిటారుగా పైకెత్తారు. ఆయన గాల్లో వేలాడుతున్నాడు.
పరిమళభరిత పానీయాలేమీ ఆయన ఆస్వాదించలేదు. ఇస్రాయేలీలు తమ దైవకుమారుడితో ఏ విధంగా మసలుకుంటున్నారో చూస్తూ కూడా నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నించాడు. వాళ్ళ భవిష్యత్తుని తలుచుకుని జాలీ, వాళ్ళ వర్తమానాన్ని చూసి అసహ్యమూ కలిగేయి ఆయనకి.
దారినపోయేవాళ్ళందరూ ఆయన్ని తూలనాడేరు, శపించేరు, ప్రధానపురోహితుడూ, లేఖకులూ ఆయన్ని అవహేళన చేసారు, ఆయన పక్కనే శిలువకెక్కిన ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని పరిహసించారు.
ఆయనతో పాటు శిలువకుగురైనవాళ్ళు కూడా . ..
చుట్టూ ఎటు చూసినా ద్వేషం, దయనీయం, అభిశప్తం.
తన అరచేతుల్లో, అరికాళ్ళల్లో పొడుచుకొస్తున్న బాధలో ఆయన, దైవకుమారుడు మరణించ బోతున్నాడని తెలిసి కూడా దైవకుమారుణ్ణి శిలువ వేస్తున్న ఆ అభిశప్తుల సంతోషాన్ని చూసి, తన విషాదాన్ని దిగమింగుకుంటున్నాడు. విరిగిన ఎముకల్లోంచి హటాత్తుగా భరించలేని నొప్పి ఆయన హృదయంలోంచీ, ఎముకల మూలుగలోంచీ పొంగుకొచ్చి ఆయన్ని తన్మయత్వంలోనూ, పరితాపంలోనూ ముంచెత్తివేసింది.
అపారమైన అనుతాపంతోనూ, పట్టలేని ఏహ్యతతోనూ ఆయన పొట్ట ఉబ్బిపోతూ, నొక్కుకుపోతూ ఉంది.
భూమ్మీద ఎటు చూసినా అంధకారం.
‘ఎలోయి, ఎలోయి, లామా సబ్బాచేతాని ?’ (నా దేవా, నా దేవా, నా చేతిని ఎందుకు విడిచావు?)
భగవంతుడు ఆయన చేతిని విడిచిపెట్టాడు. చివరికి అతడు మనుష్యకుమారుడిగానే మిగిలాడు. కానీ ఇస్రాయేలీలు చివరికి మనుష్యకుమారుణ్ణి కూడా శిలువ వేస్తున్నారు.
నెత్తుటితోటీ మురికితోటీ కంపుకొట్టేవాళ్ళెవరంటే, దైవకుమారుణ్ణి శిలువవేసే వాళ్ళు కాదు, చివరికి మనుష్యకుమారుణ్ణి కూడా శిలువవేసే వాళ్ళే.
Featured image courtesy: churchofjesuschrist.org
20-12-1924
ఎంత దారుణామైన చర్యలు. మనిషి మరో మనిషిని హింసించడమే నాకు విరక్తి తెస్తాయి. నీ కంట్లో వేలు పెట్టి పొడిస్తే ఎలా ఉంటుందో… ఎదుటి వారికి అంతే బాధ కదా? మనుషుల్లో ఈ రాక్షసత్వం ఎలా ఉంటుంది?ఎందుకు ఉంటుంది?
నిజమే… ఇది వెన్నాడే కథ. వెన్నాడడం అనేది మాములు విషయమా? ఎన్నో తెలిసిన …చదివిన తమరే… నన్ను వెన్నాడుతున్న కథలు అన్నారు. నేనూ దురదృష్టవశాత్తు ఎన్నో ( ఊళ్ల లోనే) చూసాను. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయి. నిన్న అర్థరాత్రి ఎందుకో గాజా పరిస్థితులు చూసి మనసంతా కకా వికలమయిమయింది. ఈ రోజు మీ పోస్ట్ చూసి మనుషుల్ని… మనఃస్తత్వాల్ని తలుచుకుని అసలు ఈ జీవితం ఏమిటి? ఎందుకిలా ఉన్నారు మనుషులు… అనే సమాధానం దొరకని ప్రశ్నలతో ఏమీ చేయలేని ఆశక్తత తో చూస్తూ ఉన్నాను.
మనిషి ప్రయాణం లో ఎన్ని వెన్నాడే కథలో కదా?
తమ మాటల తో ప్రయాణం చేస్తున్నాను.
నమస్సులు
నమస్సులు.