
పదిహేనేళ్ళ కిందటి మాట. సదాశివరావుగారు నన్నొక సంగీతకచేరీకి తీసుకువెళ్ళారు. అది మోహన్ హెమ్మాడిగారి ఇంట్లోనే జరిగింది. ఆ రోజు పండిత్ జస్రాజ్ హవేలీ సంగీతం వినిపించారు. ఒక ప్రసిద్ధ గాయకుడి సంగీతాన్ని అలా ఒక ఇంటివాతావరణంలో చాలా దగ్గరగా వినడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడే సదాశివరావుగారు మోహన్ గారిని పరిచయం చేసారు. కాని ఆ తర్వాత మళ్ళా ఎప్పుడూ మోహన్ గారిని చూడలేదు.
కిందటేడాది ఆయన స్వర్గస్థులు కాకపోయుంటే, ఇప్పటికి తొంభయ్యవ యేట అడుగుపెట్టి ఉండేవారట. అందుకని వారి కుమారుడు సిద్ధార్థ హెమ్మాడి తన తండ్రి జ్ఞాపకార్థం నిన్నా, ఇవాళా రెండు సాయంకాలాలు రవీంద్రభారతిలో సంగీతోత్సవం నిర్వహించారు.
సుర్ మండల్ సంస్థవారు మరికొన్ని సంస్థలతో కలిసి ఏర్పాటు చేసిన స్వర-మిలన్. మోహన్ గారికి పండిత్ శివకుమార్ శర్మ, పండిత్ హరిప్రసాద్ చౌరాషియా మంచి మిత్రులట. అందుకని ఇప్పుడు వారిని కూడా తలుచుకుంటూ నిన్న రాహుల్ శర్మ సంతూర్ కచేరీ, ఈ రోజు రాకేష్ చౌరాషియా వేణుగానం ఏర్పాటు చేసారు. మహావర్షాలు వెనకబట్టేక, సంగీతచంద్రికలో తడిసిన ఈ సాయంకాలాల్ని చూసాకనే నిజంగా శరదృతువులో ఉన్నానన్న భావన కలిగింది.
రాహుల్ శర్మ పండిత్ శివకుమార్ శర్మ పుత్రుడట. ఆయనకి తండ్రి వారసత్వం పూర్తిగా లభించినట్టే అనిపించింది. మనిషి కూడా గంభీరంగా ఉన్నాడు. అతడి దృష్టి తాను వినిపించాలనుకున్న సంగీతం మీదనే ఉంది తప్ప, ఆడిటోరియమ్మీదా, కరతాళ ధ్వనులమీదా లేదు.
సంతూర్ అంటే శతతంత్రి వీణ. మధ్యాసియాకి చెందిన సంగీతవాద్యం. దాన్ని కొద్దిమార్పుల్తో కాశ్మీరుప్రజలు స్వంతం చేసుకున్నారు. కానీ ఆ వాద్యాన్నీ, ఆ సంగీతాన్నీ తక్కిన భారతదేశానికి పరిచయం చేసిన ఖ్యాతి శివకుమార శర్మదే. ఒక ప్రాంతానికి చెందిన సంగీతవాద్యాన్నీ, దానిమీద వినిపించే సంగీతాన్నీ తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా ఆస్వాదించాలంటే అటువంటి ఒక సంగీతకారుడు జీవితకాలం కృషి చేయవలసి ఉంటుంది. శివకుమార శర్మ అటువంటి కృషి చేసాడు కాబట్టే నిన్న రాహుల్ సంగీతాన్ని శ్రోతలు స్వీకరించడానికి అవరోధం లేకపోయింది.
నిన్న సాయంకాలాన్ని రాహుల్ హంసధ్వని రాగానికి అంకితం చేసాడు. సాధారణంగా హిందుస్తానీ కచేరీల్లో మొదట ఆలాపనదే పెద్దపీట. దానివల్ల శ్రోతలు ఒక మనఃస్థితిలోకి చేరుకోగలుగుతారు. గాలంతా ఆ స్వరాలు అల్లుకుని ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ గాయకుడు లేదా ఆ వాద్యకారుడి మనోధర్మంతో, అతడి సంగీత సంస్కారంతో శ్రోతలకి పరిచయం ఏర్పడి, ఆలాపన పూర్తయ్యేటప్పటికి స్థిరపడుతుంది. ఆ తరువాత, అతడు పక్కవాద్యకారుడితో కలిసి రెండు మూడు కృతులు వినిపించడంతో సాధారణంగా కచేరీ పూర్తవుతుంది.
రాగతాళ జ్ఞానం లేని శ్రోతనే అయినప్పటికీ నా భావనా ప్రపంచం ఎంత సుకుమారమో ఇటువంటి సంగీతసన్నిధిలో నాకు మరింత తెలియవస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక సాయంకాలవేళ మనమొక అడవిదారిలో నడుస్తున్నామనుకోండి, ఆ అడవి ఎటువంటిదో, ఆ చెట్లేమిటో, ఆ మూలికలేమిటో మనకి తెలియకపోయినా, ఆ వృక్షశాఖలమీంచి వీచే గాలిని మనల్ని వశపర్చుకోడం మానదు కదా! సంగీతం వినేప్పుడు నా అనుభూతి కూడా అటువంటిదే. అంతేకాదు, గొప్ప చిత్రలేఖనాలు చూస్తున్నప్పటిలాగా, గొప్ప కావ్యాలు చదువుతున్నప్పటిలాగా, ఆ సంగీతం నాలోని ఏవో పురాస్మృతుల్ని కెరలిస్తుంది. నెమ్మదిగా నేనొక మధుర విస్మృతిలోకి జారుకుంటాను.
నిన్న ఆయన హంసధ్వని ఆలాపన మొదలుపెట్టగానే నాకెందుకో ఒక్కసారిగా నగరవీథులంతా బాతుల్తో నిండిపోయినట్టూ, వాటి వెనకనే కొండవాగులు వీథుల్లోకి ప్రవహిస్తున్నట్టూ అనిపించింది. నెమ్మదిగా ఆ కాలువ ఒక నదిగా ఒక చిరుతరగలు నదీతరంగ నిస్వనంలాగా వినిపించడం మొదలుపెట్టింది. కాని ఆ ఆలాపన నన్నొక వేళకి కట్టిపడేయలేదు. మధ్యలో కొంతసేపు అడవిదారుల్లో చెట్లమధ్యనుంచి ఎండపొడా, నీడ పొరా మీద రాలుతుంటే ఆ మిలమిలల మధ్య నడుచుకుంటూ పోతున్నట్టుగా ఉండింది. కాని ఆలాపన ముగిసి, వాద్యకారుడు కృతులు వినిపించడం మొదలుపెట్టాక మాత్రం అదొక జలపాతం. అదొక సాగరఘోష. అదొక కింకిణీనిస్వనపు జడివాన. కొంతసేపటికి ఆ సంగీతం నన్ను ముంచెత్తుతుండటం నాకు తెలుస్తూ ఉంది. మనమొక నదిలో పడవప్రయాణంలో ఉన్నామనుకోండి. కొంతసేపటికి తీరందాటి, నగరం దాటి, మనుష్యసంచారానికి దూరంగా జరిగినతరువాత, అటూ ఇటూ నదీజలాలు తప్ప మరేమీ కనిపించకుండా ఒక గంటనో లేదా రెండు గంటలో పయనించామనుకోండి. అప్పటి మన అనుభూతి ఎలా ఉంటుంది. అదొక నిరపేక్ష స్థితి. మనకేమీ తెలియని, దేనితోనూ పోల్చుకోలేని, ఒక నిరామయస్థితిలోకి చేరుకుంటాం. నదీప్రయాణమంటే అదే. ఆ పతాకస్థితికి చేరుకున్నాక, అప్పుడు తిరిగి మనం మళ్ళా ఒడ్డుకి చేరుకున్నాక, వెంట తెచ్చుకునేది, ఆ నిరామయనిశ్శబ్దాన్నే. నిన్నటి అనుభవం కూడా అటువంటిదే.
రాహుల్ శర్మ హంసధ్వనిలో తాను వినిపించాలనుకున్నదంతా వినిపించాక, అప్పుడు సిద్ధార్థ్ కోరిక మీద పహాడీ రాగం కూడా వినిపించారు. శివకుమార్ శర్మ ఎప్పుడు కచేరీ చేసినా మోహన్ గారి కోసం ఆ రాగం వినిపించేవారట. పహాడీ హిమాలయాల సుగంధాన్ని మోసుకొచ్చే రాగం. కొండజాతుల జీవనసంగీతం అది. నిన్న రాహుల్ పహాడీ వినిపించినప్పుడు, ఆ నిర్మల జీవితానందాన్ని ఆయన హిమాలయాలమీంచి తీసుకొచ్చి ఇక్కడ దక్కన్ నేల మీద ప్రవహింపచేసాడా అనిపించింది.
ఈ రోజు వేణుగాన కచేరీ చేసిన రాకేష్ చౌరాషియా పండిత్ హరిప్రసాద్ చౌరాషియాకి బంధువు. నిన్నటి సంతూరు సంగీతం కన్నా వేణుగానం మరింత సన్నిహితంగా వినిపిస్తుంది కాబట్టి ఈ రోజు శ్రోతల్లో మరికొంత ఉత్సాహం కనబడింది. కాని రాకేష్ మూర్తీభవించిన ఉత్సాహం ముందు మొత్తం ఆడిటోరియం ఉత్సాహమంతా దిగదుడుపే అనిపించింది. ఆ యువకుడు రాత్రంతా వేణుగానం చేసినా కూడా అలసిపోనట్టే ఉన్నాడు. అతడిలో ఒకింత చిలిపితనం కూడా ఉంది. కచేరీ మొదలుపెడుతూ తాను ఈ రోజు రూపకతాళబద్ధంగా భీం పలాస్ వినిపించబోతున్నాడని చెప్తూ ‘మీరు ఆ తాళాల లెక్కలు చూసుకోకండి, హాయిగా సంగీతం వినండి, మెడిటేషన్ అనుకుంటే మెడిటేషన్ లోకి జారిపొండి, లేదా నిద్రొస్తే నిద్రపొండి, మీకు నిద్రొస్తోందంటే, సంగీతం పనిచేస్తున్నట్టే లెక్క’ అని అన్నాడు. కాని ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు అతడు వినిపించిన సంగీతం ఒక్క క్షణం కూడా ఎవ్వరినీ ఏమరిఉండనివ్వలేదు.
సాధారణంగా వేణుగానం శ్రావ్యతకీ, సౌకుమార్యానికీ, లాలిత్యానికీ గుర్తు. కానీ ఈ రోజు అతణ్ణి వింటున్నంతసేపూ నేను పదే పదే energy, energy అని అనుకుంటూనే ఉన్నాను. అతడు భీం పలాస్ లో ఆలాపన, కృతులు వినిపించిన తరువాత, సిద్ధార్థ కోరిక మీద రాగ్ దుర్గా ఎత్తుకోగానే, నా ఊహ నిజమే అని నాకు అర్థమయింది. ఈ రోజు అతణ్ణి సంగీతం ఒక శక్తిగా ఆవహించింది. అది ఊరేగింపునా? నాట్యమా? వేలచరణాల విచలితనర్తనమా? చెప్పలేను. చాలా అరుదుగా మాత్రమే అటువంటి శక్తిపాతాన్ని చూడగలుగుతాం. సాధారణంగా గొప్ప వక్తల ప్రసంగాల్లో కనిపించే ఆ శక్తివిజృంభణ ఈ రోజు ఒక్క మాటతో కూడా పనిలేని వేణుగానంలో వినడం నాకు చాలా చకితానుభవంగా ఉండింది.
దాదాపు గంటన్నర పాటు భీం పలాస్ విన్యాసం వినిపించిన తరువాత శ్రోతలు కచేరీ పూర్తయిపోయిందనుకుని లేవబోయారు. కాని అతడు స్తిమితంగా, ‘ఏమి మీకు అప్పుడే ఆకలవుతోందా, నా కచేరీ ఇంకా పూర్తవలేదు’ అని అన్నాడు. శ్రోతలు బిత్తరపోయి కూచున్నారు. అప్పుడు అతడు, స్వర్గంలో ఉన్న మోహన్ హెమ్మాడికి ఇష్టమని ‘వైష్ణవ్ జనతో తేనే కహియే’ కీర్తనని ఆ పిల్లంగోవిమీద ఆలపించాడు. అది పూర్తి చేసాక కూడా అతనిలో అలసట లేదు. ‘కచేరీ ముగించబోతున్నాను, మీరు ఏమి వినాలనుకుంటున్నారో చెప్పండి’ అని శ్రోతల్ని అడిగాడు. శ్రోతలు తమకి తెలిసిన రాగాల పేర్లన్నీ చెప్పారు. ఎవరో ‘మాల్కోస్’ అని కూడా అరిచారు. మాల్కోసు సాయంకాల రాగమని వాళ్ళకి తెలిసినట్టు లేదు. ‘మాల్కోసా! అంటే మనం మళ్ళా సాయంకాలానికి వెళ్ళిపోదామా!’ అని అన్నాడు రాకేష్. చూడబోతే అతడు మళ్ళా మరొక మూడు గంటల వేణుగానానికి సిద్ధమన్నట్లే ఉన్నాడు. కాని చిరునవ్వుతో, సాధారణ హిందూస్తానీ కచేరీ మర్యాద ప్రకారం, భైరవిలో ఒక కీర్తన ఆలపించి కచేరీ ముగించాడు.
రాహుల్, రాకేష్- వీరిద్దరూ వయసు రీత్యా యాభైల్లో ఉన్నప్పటికీ సంగీత ప్రపంచంలో యువతరం కిందనే లెక్క. వారిద్దరిలోనూ కూడా తమ కళపట్ల గొప్ప passion తో పాటు సాధికారికత కనిపించింది. శ్రోతల మానసిక అవసరాలకు తగ్గట్టుగా తమ కళని పంచాలనన్న ఆలోచన కూడా కనిపించింది. ప్రపంచమంతా తిరిగి కచేరీలు ఇస్తున్నవారు కాబట్టి యుగధర్మాన్ని వారు బాగా అర్థం చేసుకున్నారనే అనుకోవాలి.
ఎందుకంటే, నలభయ్యేళ్ళ కిందట, రాజమండ్రిలో మిత్రులు డి.ఆర్.ఇంద్ర నాకు Call of the Valley (1967) కాసెట్టు కానుక చేస్తూ మొదటిసారిగా సంతూర్ గురించి పరిచయం చేసారు. ఆ కాసెట్టు ఎన్ని సార్లు విన్నానో చెప్పలేను. కాని ఆ సంతూరూ, ఆ వేణువూ, నిన్న విన్న సంతూరూ, ఈ రోజు విన్న వేణువూ ఒకటేగాని, ఒకటి కావు. ఆ సంగీతానికీ, ఈ సంగీతానికీ మధ్య అర్ధశతాబ్ది కాలవ్యవధి ఉంది. సాహిత్యంకన్నా కూడా మనుషుల అంతరంగాన్ని పట్టుకోవడంలో సంగీతం ముందుంటుందని నాకు ఇప్పుడు మరీ బాగా అర్ధమయింది.
12-10-2025
అనుభూతి వర్ణన అద్భుతం…
మాకు కార్యక్రమంలో ఉన్నట్టే ఉంది…సర్.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
నేను చదవడం పూర్తి చేసే సరికి ఒకటే ధారాపాతంగా కన్నీళ్ళు. కారణం. మీరు రాసిన ఒక్కో మాట ఎంత విలువైనదో మాటల్లో చెప్పగల శక్తి నాకు లేదు.
అతడి దృష్టి తాను వినిపించాలనుకున్న సంగీతం మీదనే ఉంది తప్ప, ఆడిటోరియమ్మీదా, కరతాళ ధ్వనులమీదా లేదు.
రాగతాళ జ్ఞానం లేని శ్రోతనే అయినప్పటికీ నా భావనా ప్రపంచం ఎంత సుకుమారమో ఇటువంటి సంగీతసన్నిధిలో నాకు మరింత తెలియవస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక సాయంకాలవేళ మనమొక అడవిదారిలో నడుస్తున్నామనుకోండి, ఆ అడవి ఎటువంటిదో, ఆ చెట్లేమిటో, ఆ మూలికలేమిటో మనకి తెలియకపోయినా, ఆ వృక్షశాఖలమీంచి వీచే గాలిని మనల్ని వశపర్చుకోడం మానదు కదా! సంగీతం వినేప్పుడు నా అనుభూతి కూడా అటువంటిదే. అంతేకాదు, గొప్ప చిత్రలేఖనాలు చూస్తున్నప్పటిలాగా, గొప్ప కావ్యాలు చదువుతున్నప్పటిలాగా, ఆ సంగీతం నాలోని ఏవో పురాస్మృతుల్ని కెరలిస్తుంది. నెమ్మదిగా నేనొక మధుర విస్మృతిలోకి జారుకుంటాను
సరిగ్గా ఇలాగే నేను అనుకుంటాను.ఇలాగే అచ్చంగా. నేను భద్రాచలం లో 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఇలాగే నాన్నగారితో అడవుల్లో ( sarvy కోసం) తిరిగేదాన్ని. అందుకే ఇవే భావనలు. ఈ మీరు చెప్పిన సంగీతదారుల వెంట తిరిగి ఏమి మాట్లాడలేని స్థితికి వచ్చి చేతులు మనసారా జోడిస్తున్నాను.నిన్నమళ్ళీ మళ్ళీవిన్నాను popan పాడిన ఒక పాట. Moh moh ke దాగే…ఇదే కదా భువిలో దొరికే అనంత మాధుర్యం.
నమోనమః
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!