ముందు మనం పాఠకులుగా మారాలి

ఒకప్పుడు శ్రీ శ్రీ ప్రపంచకవిత్వం గురించి చెప్తూ ప్రాచీన కాలంలో సంస్కృతంలో, మధ్యయుగాల్లో పారశీకంలో, ఆధునిక యుగంలో స్పానిషులో గొప్ప కవిత్వం వచ్చిందని రాసాడు. కానీ ఆయన కాలంకన్నా ప్రపంచం నేడు మరింత విస్తారమైంది. ఇప్పుడు మనకి దేశదేశాల కవిత్వమూ లభ్యమవుతున్నది. దాదాపుగా అన్నియుగాల కవిత్వమూ ఏదో ఒక రూపంలో, ఆయా కాలాల్లో గొప్ప కవుల కవిత్వంగాగానీ, లేదా సంకలనాలుగా కానీ లభ్యమవుతూ ఉంది. అటువంటి ప్రపంచ కవిత్వాల్ని వీలైనంత విస్తారంగా చదవడమే నా ప్రాథమిక సాహిత్య వ్యాపకం. అలా ఒక కొత్త కవినో, లేదా కొత్త సంకలనాన్నో చదివినప్పుడు, ఆ కవుల గురించీ, ఆ కవిత్వాల గురించీ మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఒక పదేళ్ళ పాటు అలా పంచుకున్న వ్యాసాల్ని ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై ‘ (2022) పేరిట ఒక బృహత్సంపుటంగా వెలువరించాను కూడా.

ఒక్కసారి సాకల్యంగా చూసినప్పుడు నన్ను ముగ్ధుణ్ణి చేసే ప్రాచీన కవిత్వాల్లో సంస్కృతం, ప్రాకృతం, తమిళం, చైనీసు, గ్రీకు, లాటిను ఉంటాయి. మధ్యయుగాల సాహిత్యాల్లో పారశీక, సూఫీ కవులూ, జపనీయ తంకా కవులూ, భారతీయ భక్తి కవులూ ఉన్నారు. ఆధునిక యుగంలో ఇంగ్లిషు, ఫ్రెంచి, ఇటాలియను, జర్మను, స్పానిషు, రష్యను లాంటి యూరపియను భాషా సాహిత్యాలు తక్కిన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసాయో నన్నూ అలానే ప్రభావితం చేసాయి. అమెరికను, లాటిను అమెరికను, ఆఫ్రికను, ఆస్ట్రేలియను కవిత్వాల్లో నేనింకా తలమునకలుగా కాలం గడపవలసే ఉంది. సోదరభారతీయ భాషల్లో కవుల కవిత్వాలు కూడా ఇప్పుడిప్పుడే ఇంగ్లిషు అనువాదాల్లో మనకి లభ్యమవుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటిమధ్యా నన్ను ఎప్పటికప్పుడు విభ్రాంత పరిచేవాటిల్లో ఐర్లాండు, స్వీడను, నార్వే, ఫిన్లాండు లతో పాటు పోలాండు, జపానుల కవిత్వాలు ముందువరసలో ఉంటాయి. వాటన్నిటిలోనూ పోలిషు, స్వీడిషు కవిత్వాలైతే మరీను.

నా మనసు స్వీడిషు కవిత్వంలోని చెప్పలేని మాధుర్యపు రుచిని మరిగినందువల్ల, ఇంగ్లిషులో లభ్యంగా ఉన్న స్వీడిషు కవిత్వ సంపుటాలు ఒకటీ ఒకటీ గుర్తుపెట్టుకుని, జాబితా రాసుకుని మరీ చదువుతూనే ఉంటాను. తోమాస్ ట్రాన్స్ ట్రోమర్, హేరీ మార్టిన్సన్, గున్నారు ఎకెలాఫ్, ఎడిటు సోడెన్గ్రాన్ లాంటి కవుల కవిత్వాలు మరీ మరీ చదువుతుంటాను. ట్రాన్స్ ట్రోమర్ కవిత్వం నావరకూ నాకొక పాఠ్యగ్రంథం లాంటిది. సంక్లిష్టమైన ఒక జీవితానుభవాన్నో లేదా జీవితానుభూతినో కవితగా మార్చడమెలా అనుకున్నప్పుడల్లా నేను సంప్రదించే కవుల్లో రిల్క, చెష్లా మీవోష్, యెహుదా అమిహాయి లతో పాటు ట్రాన్స్ ట్రోమరు కూడా ఉంటాడు.

అలా స్వీడిషు, లేదా స్కాండినేవియను కవిత్వం గురించి వెతుక్కుంటూ ఉండగా, కొన్నాళ్ళ కిందట, నా చేతుల్లోకి అద్భుతమైన పుస్తకం ఒకటి వచ్చింది. Lars Gustafsson అనే ఆయన రాసిన Forays into Swedish Poetry (1978, 2012).

లార్స్ గుస్తఫ్ సన్ స్వయంగా కవి, నవలాకారుడూ, విమర్శకుడూ కూడా. ఆయన ఆధునిక స్వీడిషు సాహిత్యంలోంచి పదిహేను మంది కవుల్ని తీసుకుని, వారివి ఒక్కొక్కరివీ ఒక్కొక్క కవిత చొప్పుకుని ఎంపికచేసుకుని, ఆ కవితను తాను ఎందుకు ఎంచుకున్నాడో వివరంగా ఒక వ్యాఖ్య కూడా పొందుపరిచాడు. అలా, పదిహేడో శతాబ్దానికి చెందిన Skogekar Bergbo అనే కవయిత్రి మొదలుకుని, Erik Blomberg (1894-1965) దాకా కవుల్ని ఎంపిక చేసుకున్నాడు.

ఇలా ఒక భాషాసాహిత్యానికి చెందిన కవిత్వసంకలనం ఒకటి తేవొచ్చన్న ఊహనే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే, సాధారణంగా, కవిత్వ సంకలనాలు తెచ్చినప్పుడు సంకలనకర్తలు సుదీర్ఘంగానూ, సవివరంగానూ ఉపోద్ఘాతాలు రాస్తారు. అందులో ఆ కవిత్వ చరిత్రనీ, ఆ కవిత్వం దేనిగురించి అన్వేషించిందో ఆ సౌందర్యశాస్త్రాన్నీ పరిచయం చేస్తారు. కాని అటువంటి సుదీర్ఘ పరిచయాల కన్నా ఇలా ఎంతో కొంతమంది కవుల్ని తీసుకుని వారి కవితల్ని, ప్రతి ఒక్క కవితనీ, లోతుగా పరిచయం చెయ్యడం ద్వారా మనకి ఆ భాషాకవిత్వం గురించి మరింత బాగా పరిచయం చేయవచ్చునని నాకు ఈ పుస్తకం చూసాకే అర్థమయింది.

ఈ పరిచయాలన్నీ చదివినప్పుడు, స్వీడిషు కవిత్వ ప్రయాణంతో పాటు, ఆ జాతి poetics, aesthetics పరిచయం కావడంతో పాటు, ఒక భావుకుడు తన జాతి కవిత్వాన్ని ఎలా స్వీకరిస్తున్నాడో ఆ అభిరుచి కూడా బోధపడింది. నిజానికి ప్రతి సంకలనమూ ఆ సంకలనకర్త వ్యక్తిగత అభిరుచికి దర్పణమే అయినప్పటికీ, అది చాలా సార్లు, విస్పష్టంగా ఉండదు. కొన్నిసార్లు అటువంటి సంకలనమేదీ మరొకటి చెప్పుకోదగ్గది రాకపోతే, ఆ సంకలనకర్త అభిరుచినే ఆ సాహిత్య యుగపు అభిరుచిగా స్థిరపడిపోతుంది కూడా. ఉదాహరణకి ‘వైతాళికులు’ సంకలనమే చూడండి. అది ముద్దుకృష్ణ పేరిట వెలువడ్డ సంకలనమే అయినప్పటికీ, ఆ ఎంపిక దాదాపుగా కృష్ణ శాస్త్రి ఎంపిక. ఆయన భావకవిత్వాన్ని ఒక ఉద్యమంగా ప్రచారం చేసినరోజుల్లో బరంపురం నుంచి బళ్ళారిదాకా ఆ పద్యాల్నే సభల్లో వినిపిస్తూ ఉండేవారట. తోటికవుల పద్యాలు చదివి వినిపించేక, అప్పుడు ఇంకా సమయం మిగిలితేనో లేదా సభికులు కోరుకుంటేనో తన పద్యాలు వినిపించేవారట. వైతాళికులు నిస్సందేహంగా గొప్ప సంకలనమేగాని, అందులో 1908-1925 దాకా వచ్చిన జాతీయోద్యమ గీతాలకు స్థానం లేకపోయింది. జాషువాని విస్మరించిన అపరాధానికి వైతాళికులు ఎప్పటికీ తలవంచుకునే ఉండవలసి ఉంటుంది. అలాకాక, ఆ సంకలనకర్త, తాను ఎందుకు ఆ కవుల్ని ఎంపికచేసాడో, కవుల వారీగా, లేదా కవితల వారీగా వివరంగా రాసి ఉంటే, అతడి అభిరుచి గురించి మనకి మరింత విశదంగా బోధపడి ఉండేది. అప్పుడు ఆ సంకలనాన్నే మనం ఆ కాలానికి ప్రతినిధి సంకలనంగా నమ్ముతుండే పరిస్థితి ఉండేది కాదు.

నాకు ఈ పుస్తకం చూసాక, ఏ సంకలనకర్త అయినా, కవిత్వంగాని, కథలు గాని ఎంపికచేసినప్పుడు, తాను ఎంచుకున్న కవితల గురించో, కథల గురించో ఇలా రాసిపెడితే, ఆ సంకలనాలు ఆయా భాషాసాహిత్యాల గురించి మరింత విస్పష్టంగా మాట్లాడగలవనిపించింది.

ఈ పుస్తకం ఒకసారి చదివాను. రెండోసారి చదివాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. ముఖ్యంగా స్వీడిషు కవిత్వాన్ని, నేనెందుకు ఇష్టపడుతున్నానో, తెలుసుకోడం కోసం చదివాను. అందుకని కొన్ని వ్యాఖ్యలు నాకు మరీ మరీ మధురమనిపించాయి.

ఉదాహరణకి Bertil Milamberg అనే కవి రాసిన ఈ రెండు వాక్యాల కవిత చూడండి:

ఇటువంటి కవితని మనం ఏదైనా సంకలనంలో చదివితే, ఒక్క క్షణం పాటు ఆగి, ఆ దృశ్యాన్ని సంభావించుకుని, ముందుకు వెళ్ళిపోతాం. కాని గుస్టాఫ్ సన్ రాసిన వ్యాఖ్య, చూడటానికి మరీ సరళంగా కనిపించే ఈ కవితలోని గాఢతనెట్లా పట్టుకోవాలో వివరిస్తున్నది. ఆయనిలా రాస్తున్నాడు:

ఈ వ్యాఖ్యని ఇంత సుదీర్ఘంగా మీతో పంచుకోడానికి కారణం, ఒక రెండు వాక్యాలకవితలో, చూడగలిగే వాడుండాలేగానీ, ఒక యుగం మొత్తం కనిపిస్తుందని చెప్పడానికే.

ఇలా ప్రతి ఒక్క కవిత గురించీ అతడు రాసిన వ్యాఖ్యల్ని మీతో పంచుకోవాలని ఉంది. నిజానికి ఇలా అనువదించి పంచుకోవడం కాదు, ముందు ఈ కవితలు చదివి, అప్పుడు అతడి వ్యాఖ్యలు చదివి, ఆమీదట వాటి గురించి మనం పరస్పరం మాట్లాడుకోవాలి.

ఉదాహరణకి, ఆగస్టు స్ట్రిండ్ బెర్గ్ రాసిన ఈ కవిత చూడండి:

‘మిస్ జూలీ ‘లాంటి సుప్రసిద్ధ నాచురలిస్టు నాటకం రాసిన సిద్ధహస్తుడైన నాటకరచయితగానే నాకు తెలిసిన స్ట్రిండ్ బెర్గ్ ఈ కవితతో నన్ను నిశ్చేష్టితుణ్ణి చేసాడు. ఈ కవితని మన ఆలంకారికులు ఆనందవర్ధనుడో, అభినవగుప్తుడో చదివి ఉంటే, ధ్వని కవిత్వానికి మేలిమి ఉదాహరణగా పైకెత్తి ఉండేవారు. ఈ కవితకి ఈ వ్యాఖ్యాత రాసిన ఎంతో సునిశితమైన వ్యాఖ్య చదివినతరువాత కూడా నాకు ఈ కవితను ఏదో ఒక అర్ధానికి కట్టిపడేయలేమనిపించింది. యూరపియను చైతన్యంలో ఫ్రాయిడు (1910) కన్నా ముందే వికసించిన కవితగా (1902) దీన్ని సంకలనకర్త ప్రస్తుతించాడు. ఇందులో డైనమో అంతశ్చేతనకు ప్రతీక అని అతడు చెప్తున్నాడు. లేదా అసలు కవిత్వానికే ప్రతీకగా మనం భావించవచ్చు. అలా అనుకున్నా కూడా, అలా అనుకున్న తరువాత కూడా , పై కవితలోని ప్రతి ఒక్క వాక్యమూ ఆ ప్రతీకని నిలబెట్టేదిగానే మనకి కనిపించినా కూడా, ఈ కవిత మనలో రేకెత్తించగల విస్మయం exhaust కాదు. ఒక allegory కీ , ధ్వనికీ మధ్య తేడా ఇక్కడే ఉంది. ఒకసారి మనకి ఆ అంతరార్ధం స్ఫురించాక,అలిగరి మనల్ని ఆకర్షించడం మానేస్తుంది. కాని ధ్వని అలా కాదు. ఎన్ని సార్లు చదివినా, ఎప్పటికప్పుడు ఏవో నూతనస్పందనలు స్ఫురిస్తూనే ఉంటాయి. చాలా సార్లు వాటిని మనం పోల్చుకోలేం కూడా.

ఇందులో ప్రతి ఒక్క పదం సార్ధకమే. ఉదాహరణకి, ‘రుబ్బుతూ’ అని నేను అనువదించింది ఇంగ్లిషులో to grind అనే క్రియాపదం. దీని గురించి కూడా వ్యాఖ్యాత ఇలా రాస్తున్నాడు:

ఇదంతా చదివిన తరువాత మీకేమనిపిస్తున్నది? మనం కవిత్వాన్ని చదవవలసినట్టుగా చదవడం లేదనే కదా. కవిత్వం చదవడానికి మనకి కావలసింది అన్నిటికన్నా ముఖ్యం కాలం. ప్రతి ఒక్క పదప్రయోగం దగ్గరా ఆగిపోగలిగే, జీవితాన్ని అంకితం చేయగలిగే మనఃస్థితి. ఇప్పుడు మనకి కావలసింది, మరింత మంది కవులు కాదు, మహాకవులు అసలే కాదు, మనకి కావలసింది పాఠకులు. ముందు మనం పాఠకులుగా మారాలి.  కవిత్వం చదువుకోవడంలో తమ జీవితాన్ని నిస్సంకోచంగా ఆహుతి చెయ్యగల సాహసులం కావాలి. ‘మాఘే మేఘే గతం వయః’ అని చెప్పుకోగల రసజ్ఞులం కాగలగాలి.


Featured image: Poplars by Paul Cezanne, 1879-80

13-10-2025

4 Replies to “ముందు మనం పాఠకులుగా మారాలి”

  1. మీ పోస్టులు కూడా మాకెప్పుడూ కొత్త పాఠ్యాంశాలే. వీథి దృశ్యాలు చదువుతున్నప్పుడు కింద నాళిక నిండా మరింత చీకటి దగ్గర నేను ఒక్కసారి న్యూజెర్సీలోని ఎడిసన్ లో అమ్మాయి వాళ్లున్న ఇల్లు కనులముందు కనబడింది . మనకు ఈ నేలమాళిగ గృహాలను చూచే అనుభవం ఉండే అవకాశం తక్కువ . నేను మొదటిసారి ఇది చూసినప్పుడు కేవలందిగడానికి మెట్లు తప్ప కిటికీలు దర్వాజలు లేని భూగృహంలో ఉండే అనుభూతి విచిత్రంగా అనిపించింది . అందులోనే ఒకవైపు మీరు చెప్పిన డైనమో లాంటి గృహావసర నీటి, విద్యుత్ సదుపాయాల కంట్రోల్ రూము కూడా ఉంటుంది . అది ఇంటిలో భాగమే అయినా ఒక్కరు దిగాలంటే చిన్న జడుపు కలగటం సహజం. ఒంటరిగా అర్ధరాత్రి కొండమీద గడపటం లాంటిదే .

  2. కవితలో కనవచ్చే అణకువ.
    కాని, మనం ఇందులో చూసే ఉల్లాసం లాంటిది బహుశా ఒక భ్రమ కావచ్చు. తుపాను రాబోతున్న ముందటి పరిస్థితినే మనమీ కవితలో చూస్తూండవచ్చు.
    మాల్మ్ బెర్గ్ ఎంతో ప్రజ్ఞతో నిర్మిచిన ఈ చిన్ని కవితలో పడి కొట్టుకుపోవడమంటే, ఒక స్తబ్ధతలోకి జారుకోవడమే. కావాలంటే, దాన్ని, పసితనపు నిష్క్రియ అనవచ్చు

    కవిత తగిలించుకున్న జర్మను ఎక్ ప్రెషనిస్టు ముసుగు (పోప్లార్లు, బిర్చి వృక్షాలు కాదు) వెనక పన్నెండేళ్ళ పసివాడి అంతులేని మనోవ్యథని స్ఫురింపచేస్తున్నదేదో ఉంది. ఇందులో జీవసంబంధమైన ఒక యథాతథవాదం లాంటిది,

    మనం ఏ విధంగానూ మార్చలేని ప్రపంచాన్ని, నిజానికి, మనం చేరనుకూడా చేరలేని ప్రపంచాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.

    కవితదగ్గర కొంతసేపు గడపడం నా దృష్టిలో మూర్ఖత్వమూ కాదు, అవివేకమూ కాదు. ఈ మనఃస్థితులు మనందరిలోనూ ఉన్నవే. ఇటువంటి సన్నివేశాల్లో మనమిలానే స్పందిస్తాం. తీవ్రమైన అలసటలాగా, మనోవ్యాకులతలాగా

    “ఈ మాటలు నన్ను పసిపాపని మరిపించి నిద్ర పుచ్చి మరో కలతలు లేని లోకం లోకి తీసుకెళ్లినట్టు …
    ఒక allegory కీ , ధ్వనికీ మధ్య తేడా తెలిపినట్టు….

    కవిత్వం చదవడానికి అన్నిటికన్నా ముఖ్యం కాలం అనీ….
    ప్రతి ఒక్క పదప్రయోగం దగ్గరా ఆగిపోగలిగే, జీవితాన్ని అంకితం చేయగలిగే మనఃస్థితి.

    ఇదంతా ఒక ఊరట.
    నాలో నేను లేనని … తలుపు గట్టిగా తట్టి మెలుకువ తెచ్చే నక్షత్రాల గని ఈ మీ మాటలు.
    కానీ వెళ్ళిపోతున్నాను. ఉండీ … లేనట్టు.
    ఒక మాటకి… మరో మాటకి సంబంధం కుదరక . అతికించలేక. గాలి లో ధూళినై.
    నమోనమః.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%