ఆయన ఒక కాలాంతర కవి

ఈ రోజు ‘సృజన క్రాంతి’ పత్రికలో శైలజమిత్ర రాసిన వ్యాసం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆమె నా రచనలను ఇంత దగ్గరగా లోతుగా పరిశీలిస్తున్నారని నేను ఊహించలేకపోయాను. ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని మీతో పంచుకోనివ్వండి.


వాడ్రేవు చినవీరభద్రుడు కవితా తత్త్వం ఒక తపస్సు


వాడ్రేవు చినవీరభద్రుడి పేరులోనే ఒక సాహిత్య రాగం నిత్యం నిద్రిస్తుంది. అది మెలకువయితే మనం వింటాం. ఆ రాగం తెలుగు నుంచి కాలాన్ని తడిపిన ఒక అంతఃస్వరంగా మిగిలిపోతుంది. వీటిని ఒక పదంతో పిలవడం సాధ్యం కాదు. అక్షరాలు వీరి దేహ భాష. శబ్దాలే వీరి శ్వాస. వాడ్రేవు చినవీరభద్రుడు అనే నామం తెలుగులో ఒక అంతర్భూత నాదం. అది ఒక తత్త్వాన్ని తలపించే ధ్వని. వీరు ఒక కవి మాత్రమే కాదు కథకుడు, విమర్శకుడు, నవలా రచయిత, అనువాదకుడు, శిల్పి, బ్లాగర్‌, ఆధ్యాత్మిక యాత్రికుడు, సమకాలీనత తత్త్వాన్ని శ్వాసించిన పరిమళ ద్రవ్యాలు రచయిత. ఆయన పదాలను చదివినవాడు గుండె నుండి కవిత్వంగా ఊపిరి తీసుకుంటారు. ఈ విశిష్టత వీరి జీవితాన్ని గ్రంథాలయంగా మలిచింది.

శరభవరం అనే చిన్న పల్లె, తూర్పుగోదావరి జిల్లా గర్భంలో 1962లో జన్మించిన ఆయనకు, తల్లిదండ్రులైన విశ్వేశ్వర వెంకటచలపతి, సత్యవతి దేవులు జీవితానికి మూలస్వరాలు. తత్వశాస్త్రంలో ఎం.ఏ చేసి, టెలికాం శాఖలో పనిచేసిన అనంతరం, 1987లో గిరిజన సంక్షేమ శాఖలో అడుగుపెట్టి, ప్రభుత్వ సేవలో తానొక బలమైన నీడగా నిలిచారు. 2013లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు పత్రం అందుకొని, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా, తర్వాత గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిగా సేవలందించి 2022లో పదవీ విరమణ చేశారు. అయితే పదవీ విరమణ వీరి అక్షర ప్రవాహాన్ని ఆపలేదు. హైదరాబాదు లో నివసిస్తూ, తన బ్లాగ్‌ ద్వారా రచనలు, ఉపన్యాసాలు, చిత్రాలు, వచనాలు అన్ని ఒక ఆధునిక ఋషిగా మన ముందుంచుతున్నారు. భాష అంతరాయం లేకుండా వివిధ భాషల్లో కవుల ఆంతర్యాన్ని ఇప్పటికీ అంతర్జాలంలో వివరిస్తూనే వున్నారు. ఆయా గ్రంధాల, రచనల ప్రాతినిధ్యాన్ని వెలికితీస్తూనే ఉన్నారు.

వీరు తొలి కవితా సంపుటి ‘నిర్వికల్ప సంగీతం’ 1986లో వెలువడినది. ఆ కవిత్వం తెలుగు సాహిత్యంలో వచన రచనకు ఒక నిశ్శబ్ద గమకం తీసుకు వచ్చింది. తర్వాత వచ్చిన ఒంటరి చేల మధ్య ఒకరే అయిన అమ్మ కవిత్వం, మట్టిలోని మాతృత్వాన్ని శాశ్వతంగా ఆవిష్కరించింది. ‘పునర్యానం’, ‘కోకిల ప్రవేశించే కాలం’, ‘నీటిరంగుల చిత్రం’, ‘కొండ మీద అతిది’¸, ‘కొండ కింద పల్లె’ వంటి సంపుటాలూ, ఋతువుల మాదిరిగా మార్చుకుంటూ, ప్రకృతిని, మానవతను, తత్త్వాన్ని కలిపే నెమలికాళ్లు లాంటి ప్రయాణాల్లా సాగాయి. 2024 సంవత్సరంలో, ‘కోమల నిషాదం’ అనే పుస్తకంలో 42 కొత్త కవితల్ని సంక్రాంతి కానుకగా ప్రచురించి, దానిని మిత్రుడికి అంకితం చేశారు. అది కవిత్వమే కాదు, అంతరంగ సంభాషణల సంకలనం. అనంతరం వీరి కథలు ఒక భిన్న సంభాషణను తెలియజేస్తాయి. ‘ప్రశ్నభూమి’ అనే కథాసంపుటిలో, ప్రశ్నల్ని పూలలాగా పేర్చి మన ఎదుట ఉంచారు.

అక్కడితో వీరి కలం ఆగిందా? లేదు. చినవీరభద్రుని మరో ప్రక్రియ నవల అరణ్యం. ఇది అరణ్యం కాదు. ఒక అద్భుతం. ఇది కేవలం అడవిలో అల్లుకున్న కథ కాదు. ఇది మనిషి తన మూలాలతో ఎలా విడిపోయారు అన్న ఆత్మ పరిశీలన. ప్రకృతి మనిషి మధ్య శ్వాస పలుకుల మాలిక. అతని యాత్రా కథనం నేను తిరిగిన దారులు దేశ వాల్పులు చూపించక, మనసు యొక్క మార్గాన్ని సజీవం చేయడం మనం గమనిస్తాం. ఈయన రాసిన ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’, పిల్లల కోసం రచించిన మూడు గ్రంథాలు. ‘మీరు ఇంటి నుంచి, బడి నుంచి, సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?’ ఇవన్నీ పాఠ్యగ్రంథాల్లా కాక, విలక్షణ జిజ్ఞాసా మాలికలుగా నిలుస్తాయి.

ఆధ్యాత్మికతకు వచ్చేసరికి వీరు ‘పరమయోగి శ్రీ వై. హనుమంతరావు’ అనే గ్రంథాన్ని అంకితంగా రాశారు. అది మానవ ధ్యానానికి అక్షర తపోవనం. ఇది యోగానుభూతులనే కాదు. ఒక సమకాలీన మౌన ఋషి గురించి రాసిన ఆధ్యాత్మిక మానవీయత కథ. తత్త్వబోధ లో విలీనమైన ఆయన శబ్దం, ఋషుల ధ్వని ప్రక్కనే నిలబడగలదా ఆ పుస్తకం తెలియజేస్తుంది. ఆ భావాలకు అనుగుణంగా మరియు అక్షరాలుగా ప్రతిఫలించింది.

అనేక భాషల పుస్తకాలు తెలుగు మాధ్యమంలో మలచిన గొప్ప సాహితీవేత్త, ముఖ్యంగా సుప్రసిద్ధ కవి వరేణ్యులు చినవీరభద్రుడు గారి అనువాదాన్ని కేవలం పదాల మార్పు కాక, భావాల పరివర్తనగా చూశారు. అనువాదాల్లో వీరు చూపిన శ్రద్ధ విశేషత్వం ఒక తత్త్వవేత్త మనస్తత్వంతో కూడి వుంది. అబ్దుల్‌ కలాం రచనలైన ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’, ‘ఇగ్నైటెడ్‌ మైండ్స్‌’, ‘యు ఆర్‌ బార్న్‌ టు బ్లోసం’, ‘ఇండామిటబుల్‌ స్పిరిట్‌’, ‘ద ఫామిలీ అండ్‌ ద నేషన్‌’ ఇవన్నీ తెలుగులోకి వచ్చినప్పుడు వాటి శబ్దాలు మారలేదు. కలం మరియు గొంతు అక్కడే నిలిచింది, తెలుగు శబ్దంలోనూ స్ఫూర్తి కోల్పోలేదు. ‘ఇగ్నైటెడ్‌ మైండ్స్‌’కి చేసిన అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడెమీ ఉత్తమ అనువాద పురస్కారం రావడం వీరి అనువాద నైపుణ్యానికి నిదర్శనం.

చినవీరభద్రుడు గారు సమకాలీన సాహిత్యానికి చేసిన కృషిని గురించి తెలపడానికి కొన్నిపదాలు, కొన్ని వాక్యాలు, కొన్ని పేజీలు సరిపోవు, ముఖ్యంగా ‘వందేళ్ళ తెలుగుకథ’, ‘మనసున మనసై’ వంటి సంకలనాలు అది ఒక తరం గళానికి సాహిత్య రూపంగా నిలిచే ప్రయత్నం. మొత్తం 65 పుస్తకాలు. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ధ్వని. ఒక్కొక్క అంకితభావం ఒక్కొక్క గురుతత్వం. ఒక్కొక్క రచన ఒక్కొక్క తత్త్వ ప్రతిధ్వని. ఇన్ని రచనలు కలిపితే ప్రతి పుస్తకానికి ప్రామాణికత ఉంది, ప్రతి పుస్తకమూ ఒక మిత్రునికి, ఒక గురువుని, ఒక సాధకునికి అంకితంగా మలచబడిరది ఓ మౌనధ్వనితో.

ఒక ప్రత్యేకమైన తత్త్వధ్వని వీరి కవిత్వంలోనూ ప్రతిధ్వనిస్తుంది. ‘‘ఆ ఉత్తరంలో రెండుపేజీలు చదివానో లేదో/ మధ్యలో ఖాళీకాగితం లాగా గ్రీష్మ ఋతువు.’’ అన్వేషణలో ఖాళీదైన క్షణాల్ని, తపనను, మనస్సు ఒంటరితనాన్ని సుతారంగా గీతలుగా అల్లగలిగిన తత్త్వభావనా శక్తి ఇది.

‘‘గాలి చేతుల్లో ఒదిగి కనులరమోడ్చిన మొగ్గలు’’ అనేది, కవిత్వంలో కలిగే ఆదరణ ఆభరణమే..

‘‘మా అమ్మ ఒకామెతో మాకు మంత్రం వేయించేది/ కావి రంగు చీర కొంగు,నుదుటన తిరుచూర్ణం’’ ఇది కవిత్వంగా కాదు, జీవితంగా చదవాల్సిన సంభాషణ. ఈ పదాలు కవిత్వాన్ని మించిన అనుభూతి.

‘‘పూలమొగ్గలకు స్వస్థత. పూలమొక్కలకు స్వస్థత./ఆ క్షణాల్లో అక్కడున్నందుకు నాక్కూడా స్వస్థత.’’

ఈ వాక్యాలు తక్కువ అనిపిస్తే మన శ్వాస ఇంకా మాటల్లోకి రాలేదన్న అర్థం. ‘‘వాడ్రేవు చినవీరభద్రుడు కవిత్వం అంటే ఓ మధుమాసపు మౌనం.,ఓ వసంతపు వేదన.,ఓ బాల్యం పిలిచే గాలి., ఓ గుడిసె లోంచి వినిపించే శబ్దరాగం…ఓ కవితగా తీర్చి చెప్పలేని జీవితమనుభూతి. ఇది కవిత్వం కాదు. అంతఃశాంతి. ఇది ఒక ఉపనిషత్తు. ఇది జీవనబోధ.

వాడ్రేవు చినవీరభద్రుడి కవిత్వం అంటే ‘‘మనుషుల మధ్య కోల్పోయిన సంభాషణను పూల మధ్య తిరిగి వెతకడం. ఋతువుల మధ్య ఓ తాళం చూడడం. తల్లిపాలన లేని బాల్యంలో ఓ లాలనలో తడవడం. వెళ్లిపోయిన వసంతం పట్ల వేదన కలిగిన గ్రీష్మాన్ని శుభ్రంగా వర్ణించడం. రాలిపోతున్న పూల రేకల మధ్య మళ్లీ మొగ్గ తొడిగే ఆశను కనిపెట్టడం లాంటి వీరి కలం ఒక ప్రత్యేకమైన శైలీ దుస్తులు వేసుకుంటాయి.

నిజానికి నేను ఎన్నో కవిత్వాలు చదివాననే అనుకున్నాను. అద్భుతమైన కవిత్వాన్ని చదవలేదని వీరి కవిత్వం చదివాక అర్థమైంది. వీరి కవిత్వం చదవగానే స్వజీవితంలో బొమ్మలా మారిపోయి సరికొత్త రోజుల్ని పలకరించినట్లయింది. ఏ వస్తువైనా హృదయంలో బహు సుందరంగా ఇముడ్చుకోవడం ఎంతో కష్టం. కానీ నేను దాచుకున్న వీరి కవితా వస్తువులు నేను రాసే కవిత్వానికి ఒక శక్తిగా పనికొస్తుందనిపించేలా ఉండటాన్ని అనుభవిస్తున్నాను. ఒకప్పుడు రాళ్ళబండి కవితాప్రసాద్‌ అనే గొప్ప కవి వీరిని పిలిచే పిలుపు కవిరాజూ! .. ఇలా ఎందుకు పిలిచారో అర్థమవుతుంది. ఈ కవిరాజును చూడగానే కవితాప్రసాద్‌ గారు గుర్తుకు వస్తారు. ఇద్దరూ జంటకవుల్లా నాకు అనిపించేవారు.

వీరి రచనలు గ్రంథాలయాల్లో దాయబడే విషయాలు కావు. అవి మన మనసు లోతుల్లోకి పాకే ఉష్ణతరం. వాడ్రేవు చినవీరభద్రుడు అనే నామం తెలుగుకు శ్వాస. ఈ శ్వాసలో మేఘాల పాటలు, కొండల మౌనం, పల్లెల పరిమళం, గంధర్వల వచనం. ఆయన్ని మనం స్మరించుకోవాలంటే వీరి పుస్తకాల్ని కాక, ఆయన పదములతో ఆగకుండా వీరి కవిత్వంలో మనం జీవించడానికి ప్రయత్నించే నెపంలో ఊపిరిలా మారిపోవాలి తప్పదు.

ఇలాంటి వచనాన్వేషణలు కవితా అన్వేషణలు కావడమే వాడ్రేవు గారి వైశిష్ట్యం. ఆయనలో పదాలను పలికించే ఒక పరమోన్మాదం ఉంది. ఆ పదాల వెనక అనుభవాల తడి, మౌనాల గాఢత, తత్త్వచింతనల శ్వాస ఉంది. ఆయన ఏ పత్రం తిప్పినా దానిపై ఒక శ్రద్ధా భక్తి కనిపిస్తుంది.

అదే శబ్దం ‘ఒంటరి చేలమధ్య ఒకరు మన అమ్మ’ అనే పద్యంలో అమ్మ అనే తల్లిమూర్తిని మట్టితో మేళవించి మన హృదయాల్లోని మూల బంధాలను కదిలిస్తుంది. ‘పునర్యానం’ ఒక వ్యక్తిగత ఆత్మపునః సంఘటన, ‘కోకిల ప్రవేశించే కాలం’ ఋతువుల స్వరాల నేపథ్యం, ‘నీటిరంగుల చిత్రం’లో స్పష్టత కన్నా స్పర్శే ప్రధానమైనదిగా నిలుస్తుంది. ‘కొండ మీద అతిథి’ ఒక క్షణిక పర్వతానుభవం, ‘కొండ కింద పల్లె’ ఒక తాత్త్విక పల్లెజీవితమంతా. ఇవి అన్నీ ఒకే కవి నుండి పుట్టినా, ఒకే పదజాలం నుండి వచ్చినా ఒక్కొక్కటి ఒక్కొక్క వైఖరిని, అనుభూతిని పలుకుతుంది. చినవీరభద్రుడికి పద్యాలే కాదు, పుస్తక శీర్షికలు కూడా తత్త్వాత్మక నిశ్శబ్దాలే.

‘‘కావ్యం లోకాన్ని మరామత్తు చేయడానికే’’ అని చెప్పారు పూర్వకాల కవులు. కానీ ఈ కాలంలో ఆ మాట అనకుండానే తాము రాసే కవిత్వంతో ఆ పని చేసి చూపుతున్నారు కొందరు సాహిత్యవేత్తలు. అలాంటి అరుదైన ప్రయత్నాల్లో ఒకటి వీరభద్రుడు రాసిన ‘ప్రశ్నభూమి’. ఈ రచనలో ప్రధానమైన లక్షణం రచయిత తనను తాను బాహ్యాంతరం చేసుకోవడం. ఇది శిల్పపరంగా టి.ఎస్‌. ఎలియట్‌ తెలిపిన అంతరంగమధనం కాదు. అది శిల్పానికి సంబంధించిన విషయం అయితే, వీరభద్రుడి ప్రగాఢ వ్యక్తీకరణలో వస్తువు, జీవనసత్యం, అంతర్గత పరిశోధన ప్రధానంగా ఉన్నాయి.

వీరి కవిత్వంలో సమత్వ సాధనకు చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘మీరు కోరుకోవలసింది స్వర్గంకాదు / భూమి కాదు, ఆ రెంటినీ సమంగా నిభాయించడం.’’ ఇక్కడ సమత్వం అంటే విశేష తలమాణిక్యమని కాక, విరుద్ధతల నడుమ సమతుల్యతను సాధించడం. ప్రతి అనుభవం ద్వంద్వ రూపంగా వస్తుంది. ప్రేమలో పువ్వూ ఉంటుంది, అందులో పండు క్రిమి కూడా ఉంటుంది. ఏ ఫలమూ మనిషి జీవితానికి నిష్కలంకంగా రాదు. జీవితంలో స్వర్గనరకాలు ఒక్కే నాణేలో రెండు పార్శ్వాలుగా ఉంటాయి.

వీరభద్రుని కవిత్వం ద్వంద్వాల మధ్య నడిచే ఒక నాజూకైన వంతెన. ‘‘నువ్వు పట్టుకున్నప్పుడల్లా ఒక సీతాకోకచిలుక నీ వేళ్ళ మధ్య గిలగిల కొట్టుకొంటూనే ఉంది’’ అని వీరి వాక్యాలు చదువుతున్నప్పుడు నా కళ్ళు వర్షించడం ఆగలేదు. కారణం తెలియదు. ఎంత నాజూకైన పదప్రయోగం? హృదయం ఎక్కడో లోపల వుంటుంది దాన్ని ఎవరూ గమనించరు అనుకుంటాం కానీ.. ఆ శక్తి గొప్పకవికి వుంటుందనేది ఇక్కడ అర్థమైంది. అది కేవలం సున్నితమైన దృశ్యం కాదు, అది మనిషి సంబంధాల బరువును, స్వేచ్ఛను పూనే చిత్తశుద్ధిని సూచిస్తుంది.

విమర్శలో వీరి చూపు మామూలుగా ఉండదు. ‘సహృదయునికి ప్రేమలేఖ’ ఒక విమర్శకుడు రచయితపట్ల ప్రేమతో రాసిన భావ పూరిత సంభాషణ. ఆయన ‘సాహిత్యమంటే ఏమిటి?’ అని ప్రశ్నించి, అది ఒక తాత్విక అన్వేషణ గా తీర్చారు. ‘సాహిత్యసంస్కారం’, ‘దశార్ణదేశపు హంసలు’ వంటి గ్రంథాలు, పఠనం అనేది మనల్ని లోతుగా తవ్వుకునే ప్రక్రియగా మలచడంలో ఆయన విశిష్టత చాటాయి. బాలసాహిత్యంలో పిల్లల్ని సానుకూల ఆలోచనల వైపు మలిచే ‘‘మీరు ఇంటి నుంచి’’, ‘‘బడి నుంచి’’, ‘‘సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?’’ అన్న తాపత్రయం ఒక విలక్షణ ఆచరణాత్మక బాల విద్యా తత్త్వమే.

వీరు రచించిన గాంధీ రచనలు ‘గాంధీ వెళ్ళిపోయాడు మనకు దిక్కెవరు?’, ‘సత్యమొక్కటే దర్శనాలు వేరు’, ‘హరిలాల్‌ గాంధీ జీవితచరిత్ర’ ఇవన్నీ చినవీరభద్రుడి తత్త్వ మేధస్సును, గాంధీయ మూలాలను తెలుగు పాఠకుడికి అందించేందుకు దోహదపడినవి. అలాగే కబీర్‌ పదాలను ‘నాది దుఃఖం లేని దేశం’గా తెలుగీకరించడం అది కబీర్‌ మౌనాన్ని తనదైన శైలిలో మాటలుగా మలచిన విద్య. వీరి హైకూ యాత్రలో మత్సువో బషో ప్రకృతి, మౌనం, తాత్వికతల మధ్య నడిచిన దారులను మన ముందుంచారు. వేదార్థ మీమాంసలో వేదాలను దార్శనిక భావనల్లో చూపించగలిగిన తత్త్వధీశక్తి కనిపిస్తుంది. వీరు ఒక కాలాంతర కవి. ఆయన రాసిన ప్రతి వాక్యం మనల్ని పలకరించే శబ్దపు అంచు. వదలలేని సంభాషణ. అమరమైన ఆత్మగీతం.

వాడ్రేవు చినవీరభద్రుడు అనే నామం కేవలం ఒక రచయిత కాదు, అది ఒక రచనా దృష్టి. ఆయన్ని మనం చదివే అక్షరాల్లోనే కాక, మన అంతరంగానికి ఆవశ్యమైన మౌనాలలో కూడా వినవచ్చు. ఆయన రచనలు భవిష్యత్తు తెలుగుకు ఆలోచనల ఖనిజంగా నిలవబోతున్నాయి. అలాంటి రచయిత మన కంటి ముందే మనతో పాటు అతి సాధారణంగా అడుగులు వేస్తుండటం అది ఒక అదృష్టం కాదు, ఒక వరం.

శైలజామిత్ర
9290900879

11 Replies to “ఆయన ఒక కాలాంతర కవి”

  1. మీ రచనలపై చాలా హృద్యంగా రాసారు. వారికి కృతజ్ఞతలు. మీ వివిధ రచనా ప్రక్రియలను చదవడం మా అదృష్టం.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  2. ఎందరి మనసుల్లోనో గూడుకట్టుకున్న భావాలన్నీ ఒక్క గొంతులో ఆలాపించారు శైలజా మిత్ర గారు. వారకి మనఃపూర్వక అభినందనలు

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

      1. శైలజ గారు చెప్పింది అక్షరాల నిజం, ఎందరో గొంతుకులను అమలంగా వినిపించారు. ఒక తాత్వికుని రసాస్వాదన ఎలాగుంటుందో సోదాహరణంగా వివరించారు. ధన్యవాదాలు మేడం.

      2. హృదయపూర్వక ధన్యవాదాలు

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  3. sailajamitra – Hyderabad – I am a poet, writer and journalist residing at hyderabad. I was born in chinnagottigallu, chittoor dist on jan 15th. My qualifications are MA..PGDCJ ( In journalism).In all my 18 years of penchant writing, I launched 5 poetry books, one shortstory book and five english translated books on my own.
    Sailaja Mithra says:

    కొందరు కవులు మన గురించి రాస్తే మన జీవితం సార్థకమవుతుంది. కొందరి గురించి మనం రాస్తే జీవితం ధన్యమవుతుంది. అతిశయోక్తి కాదు కానీ.. చినవీరభద్రుడు గారి సాహితీ ప్రయాణం అంటే నాకెప్పుడూ ఆసక్తికరం. సరైన గురుత్వం లేక మాలాంటివారు సరైన చోటికే అయినా సరిగ్గా ప్రయాణం చేయలేయలేకపోతారు. నా విషయంలో మాత్రం అదే జరిగింది. ఇప్పటికీ నేను చేసే సాహిత్యం ఎంతవరకు సరైనదో నాకు తెలియకుండానే వుంది. ఎందుకంటే నా సాహిత్యం పట్ల సరైన విమర్శ కానీ, సరైన ప్రోత్సాహం గానీ కనిపించలేదు. నా 30 ఏళ్ళ సాహితీ జీవితం నాకెప్పుడూ ప్రశ్నార్థకంగానే వుంటుంది. బహుశా ఈ ప్రశ్ననే మోసుకుంటూ వెళ్ళిపోతానేమో! అనిపిస్తుంటుంది..ఏది ఎలా ఉన్నా ఈ విశ్లేషణ ప్రపంచ కవి అయిన మీకు నచ్చి, మీ కుటీరంలో వుంచడం నేను ఎంతో సాధించినంత ఆనందంగా వుంది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%