నిజంగా భాగ్యం

ఈ నెల రెండో తేదీన రావిశాస్త్రి పురస్కారవేదిక సభలో నా ‘కథలసముద్రం’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా కొర్రపాటి ఆదిత్య ఆ పుస్తకాన్ని పరిచయం చేసారు. ఆ ప్రసంగం రికార్డు చేసుకుని ఉంటే బాగుండేది కదా అని అనుకున్నాను. కాని శేషు కొర్లపాటి ఇంత చక్కగా దాన్ని యూట్యూబుకి ఎక్కించారని అనుకోలేదు. ఈ ప్రసంగం వినండి. ఒక తరానికి చెందిన రచయితకి తన తర్వాతి తరం నుంచి ఇటువంటి మూల్యాంకనం దొరకడం నిజంగా భాగ్యం. ఆ ప్రసంగపాఠాన్ని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.



ఆయన Quietly Disruptive


సభకు నమస్కారం.

ఈ పుస్తకం వీరభద్రుడుగారు దాదాపు ఏడు ఎనిమిది ఏళ్లుగా…అంటే, దీంట్లో ఫస్ట్ పీస్ 2016లోది. ఇంకా ముందు రాసినవి కూడా ఉండొచ్చు. అంటే దాదాపు 9-10 ఏళ్ల గా రాస్తున్నవి. కథల మీద, నవలల మీద [రాసిన వ్యాసాలు]…ఆయా కథకుల [గురించిన]  మెమోయర్స్ అంటే జ్ఞాపకాలు కావచ్చు, వాళ్ళతో ఆయనకు ఉన్న అనుబంధం చర్చించే రెండు మూడు వ్యాసాలు [కూడా] ఉన్నాయి. వాటితో పాటు కథల మీద, నవలల మీద వచ్చిన ఒక సిద్ధాంత గ్రంథం – సిద్ధాంత గ్రంథం  అని చెప్పలేము – ఒక పూర్తి పరిశోధనా గ్రంథం. అంటే ఒక నిర్దిష్టమైన టాపిక్ తీసుకుని అంటే తొలినాళ్ళ స్త్రీల నవలల గురించి కాత్యాయని విద్మహే గారు రాసినది… అలాగే రామచంద్ద్రారెడ్డిగారు వంశీ కథల మీద…అది కూడా పరిశోధన గ్రంధం, పిహెచ్డి తీసిస్. సో, ఇలాగ నవలల మీద కథల మీద వచ్చిన విశ్లేషణల మీద ఆయన రాసిన విశ్లేషణలు కూడా ఉన్నాయి.

ఇలాగ ఇంత సర్వతోముఖంగా… ఎందుకు కొంచెం బ్రాడ్ గా అయినా ఈ [పుస్తకంలో] కంటెంట్స్ గురించి చెప్పానంటే, ఇలాగ రాస్తున్న వాళ్ళు… కథల గురించి రాయటం వేరు, కథల అనుశీలన మీద, కథల మీద విశ్లేషణల మీద అబ్జర్వేషన్లు రాయాలంటే ఒక సూక్ష్మదృష్టి ఉండాలి. ఎందుకంటే అప్పటికే అవి విశ్లేషణలు, వాటి విశిష్టత ఏమిటి, అవి ఎందుకు ఒక కొత్త దారినో, లేకపోతే కొత్త అంశాన్నో, కొత్త చేర్పునో ఇస్తున్నాయి అని తెలుసుకోవటం, చెప్పగలగటం, అది గమనించి చెప్పగలగటం మామూలు విషయం కాదు.

దాంతో పాటు దీంట్లో ఈ పుస్తకానికి క్రౌన్ జువెల్ అని చెప్పదగ్గ వ్యాసాలు – అంటే చెకోవ్ మీద రాసిన రెండు వ్యాసాలూ ఒకటే పీస్ అనుకుంటే గనుక – ఏ రకంగా చూసుకున్నా దీనికి [ఈ పుస్తకానికి] మకుటాయమానమనదగ్గవి. సమకాలీన కథకులు అవి ఎందుకు చదువుకోవాలి అంటే, చెకోవ్ ఏ అన్వేషణ చేయటంలో నలిగాడో అర్థం చేసుకోవడం అంత సరళం కాదు, అంత ఈజీగా అర్థం కాదు మనకి. ఎందుకంటే దానికి విస్తారంగా చదవాలి. ఆయన 500-600 కథలు, అంటే దాంట్లో చిన్నవీ, పెద్దవీ ఉంటాయి. ఆయన జీవితకాలంలో రాసిన కథలన్నీ చదివితే కానీ, ఎంతో కొంత, కనీసం రిప్రజెంటేటివ్ అని చెప్పదగ్గ కథలు చదివితేనే ఎంతో కొంత అర్థంవుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ చెకోవ్ ను తయారు చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు వాళ్ళ చెకోవ్ నెరేటివ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆ సెలెక్షన్ ద్వారా నెరేటివ్ బిల్డు అవుతుంది.

అదే ఆయన కూడా రాశారు. వీరభద్రుడుగారు కూడా ఏం రాశారు అంటే ఒకే కథని, అది ఆయన ఇవాన్ బునిన్ కి చెప్పేటప్పుడు —- ‘విద్యార్థి’ అనుకుంటా ఆ కథ పేరు, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్— ఆ కథ  ఫస్ట్ రీడింగ్‍లో అదేదో ఆధ్యాత్మికమైన ఒక అర్థం ఇస్తూ ఉంది అన్నట్టుగా చెప్తూ తర్వాత దానికి పూర్తిగా తద్విరుద్ధమైన అర్థం కూడా ఇచ్చేలాగా ఉంది, ఒకసారి మళ్ళీ చదువు అని ఆయన చెహోవే బునిన్‍కి చెప్తాడు అన్నమాట. ఆ విషయం చెప్తూ ఆయన… అదే బేసిగ్గా ఏంటంటే, చెహోవు లాంటి సమున్నతుడైన కథకుడు రాసినప్పుడు అది బహుళార్థస్ఫోరకంగానూ, ఎవరు ఎట్లా ఏ టైములో ఎలా చదివితే అది ఆ డైరెక్షనులో ఆ రీడింగు పాసిబుల్ అయ్యే పద్ధతిలో ఉంటుంది.

ఒక డైరెక్షన్ ఇవ్వటానికి అంటే…భద్రుడుగారి ప్రతిపాదనలో, లేకపోతే భద్రుడుగారి విశ్లేషణలో, మనం అంతా ఒప్పుకోవాలనో లేకపోతే,  తలమానికంగా తీసుకోవాలనో, శిరోధార్యం కావాలనో నేను అనట్లేదు. అది సాధ్యం కాదు కూడా. కానీ అసలు ఆ డైరెక్షన్‍లో ఆలోచించడం నేర్పడం అన్నమాట.

ఈ పుస్తకమే కాదు, ఆయన ‘వందేళ్ళ తెలుగు కథ’ గాని, ‘సాహిత్యం అంటే ఏమిటి’లో కథల గురించి, నవలల గురించి ఉన్న వ్యాసాలు గాని, ‘సహృదయునికి ప్రేమలేఖ’ – ఇవన్నీ చెప్పుకోవాలి. నిజానికి తెలుగు విమర్శలో, ఇవన్నీ మైల్‌స్టోన్స్ అని చెప్పడానికి నాకేం సంకోచం లేదు. కానీ, అన్ఫార్చునేట్లీ, మన canon, [విమర్శలో] మన ఉత్తమ శ్రేష్ఠకృతులు అనేవి వేరేగా డెవలప్ అయినాయి. కానీ నిజం చెప్పాలంటే తెలుగు విమర్శలో ల్యాండ్ మార్క్స్,  తెలుగులో గొప్ప విమర్శ గ్రంథాలు ఏమిటి అని చెప్పేటప్పుడు మనకు వేరే పేర్లు గుర్తొస్తాయి. కానీ నా ఉద్దేశంలో నిజంగా – ట్రూ సెన్స్ లో – ఒరిజినల్ క్రిటిసిజం తెలుగులో ఏది వచ్చింది అని అడిగితే వాటిల్లో ముందు ఉండే పుస్తకాలు ఇవన్నమాట.

‘సహృదయునికి ప్రేమలేఖ’, ‘సాహిత్యం అంటే ఏమిటి’, ‘సాహిత్య సంస్కారం’: ఈ పుస్తకాల్లో ఆయన కథల మీద రాసినవి, అంటే కథలమీద, నవలల మీద రాసినవి ప్రత్యేకంగా తీసుకొని చదవాలి. దాంతో పాటు ఈ ‘కథల సముద్రం’ అనే పుస్తకం. వీటన్నిటినీ ఒక క్రమంలో పెట్టి చదివితే గనుక, మూడు డైమెన్షన్సు [తెలుస్తాయి]. ఒకటి, తెలుగుకథ గురించి కంప్లీట్లీ డిఫరెంట్ కథనం మీకు దొరుకుతుంది. మనకి మెయిన్‍స్ట్రీమ్‍లో అందరూ మామూలుగా మాట్లాడుకునే ఒక కథనానికి భిన్నమైన కథనం మీకు దొరుకుతుంది. అది ఒకటి.

రెండోది, అసలు కథ ప్రయాణం, ప్రపంచం మొత్తంలో కూడా కథ ఎలా ప్రయాణం అయింది, కథ లేదా, జనరల్లీ స్పీకింగ్, “నెరేటివ్” అని అనుకుంటే గనుక, కథనం ఎలా ప్రయాణం అయింది అనేది తెలుసుకోవడానికి నేను చెప్పిన ఆయన వ్యాససంపుటాల్లో కథలు, నవలల గురించి, అంటే  కాల్పనిక వచన సాహిత్యం అనదగ్గ దానిమీద రాసినవన్నీ చదివితే మనకి ఒక సెన్స్ ఆఫ్ ఎవల్యూషనే కాదు, ఎవరూ చెప్పనివి, ఇంగ్లీషులో రాస్తున్న వాళ్ళు కూడా చెప్పనివి చాలా అమూల్యమైన అంశాలు… అదే, ప్రాబ్లం ఏంటంటే, మనకి చాలా ధారాళంగా, చాలా మామూలుగా, చాలా సామాన్యంగా [అలాంటి అమూల్యమైనవి] దొరికినప్పుడు మనకి వాటి విలువ తెలియదు. కానీ నిజానికి అది ఎంత గొప్ప విశ్లేషణ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం బయట వస్తున్న విశ్లేషణలు చదివితే. ఇంగ్లిషులో వస్తున్న విశ్లేషణలు చదివి, వాటితో పోల్చి చూసుకుంటే ఈయన ఎంత సమున్నతంగా, వాళ్ళకంటే ఎంతో ముందుకు వెళ్ళి చెప్తున్నారు అనేది (తెలుస్తుంది).

ఇదేదో ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది, ఇది సభ – కాబట్టి  ఒక ఉద్విగ్న మనఃస్థితిలో ఏదో చెప్తున్నాను అనుకోవద్దు. నేను ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో రోజులుగా అనుకుంటున్న మాటలివి. ఈ విలక్షణమైన స్వరం, ఈ మాటలు చెప్పే వాళ్ళు ఒకళ్ళు లేకపోతే, ఈ మాటలు… ఎటువంటి మాటలు అంటే, అవి నిన్ను డిసీవ్ చేసే మాటలు కావు, మోసపుచ్చే మాటలు కావివి. నీ డైరెక్షన్‌ని నువ్వే వెతుక్కునేలాగా చేసే మాటలు. అంటే ఇవి నీనుంచి విశ్వాసాన్నో, లేకపోతే ఒక రకమైన నిబద్ధతతనో, లేకపోతే ఒక ఆరాధననో కోరుకునేవి కావు. అవి నీకై నువ్వు ఆలోచించుకునేటట్టు చేసే మాటలు అన్నమాట. అంటే అవి సాష్టాంగదండప్రణామాలు చేపించే మాటలు కాదు. నీ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళేలాగా చేసే మాటలు.

ఇది ఒక దగ్గరే కాదు. ఈ పుస్తకం ఒక అన్వేషణ తాలూకు పొడిగింపు. ఈ పుస్తకాలని ఒక అన్వేషణ తాలూకు అనేక భాగాలుగా చూడాలి.

ఇంకో ఒక మాట చెప్పేసి ముగిస్తాను. సాధారణంగా విమర్శకుడు లేదా విశ్లేషకుడు లేదా సాహిత్యప్రశంస చేసేవాడు – లిటరేచర్‌ని అప్రిషియేట్ చేసేవాడు – చేయాల్సింది ఏంటంటే – ఇది అందరికీ తెలిసిందే అనుకోండి – మామూలుగా చూడనివి లేదా మనం చూడగానే ఒక ఫస్ట్ ఇంప్రెషన్, ఫేస్ వాల్యూ అంటాం, క్రియేట్ అవుతుంది. ఆ ఇంప్రెషను నుంచి ఎవరైతే మనల్ని బయట పడేస్తారో, ఇంత మాత్రమే లేదు, దీంట్లో, ‘మోర్ దాన్ దట్ మీట్స్ ద ఐ’ అంటారు, మనం చూడగానే కనిపించే దానికంటే ఇంకా ఎక్కువ ఉంది దీంట్లో అని ఎవరైతే చెప్పగలరో- వాళ్ళు మనకి చాలా విలువైన వాళ్ళు. మనకి దారి చూపించేవాళ్ళు. దారి అంటే ఇలా[నే] వెళ్ళమని కాదు. దారి ఉంది అని గుర్తుచేసేవాళ్ళు. అలాగ దారి చూపించే మనిషి ఆయన.

ఉదాహరణకి, అంటే చాలా మామూలు ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి, ఇది చెప్తున్నాను. ‘సహృదయునికి ప్రేమలేఖ’లో ఒక వ్యాసం ఉంటుంది. భమిడిపాటి రామగోపాలంగారి ‘ఇట్లు, మీ విధేయుడు’ కథల మీద వ్యాసం. ఆ వ్యాసం చదివితే మీకు రామగోపాలంగారు ఒక హాస్య రచయిత అనీ, లేకపోతే ఏదో సరదా కథలు రాసాడు అనీ, అసలు ఆ ఫీలింగే పోతుంది. అసలు తెలుగు సాహిత్యానికి అంత ఇంపార్టెంట్, అంత కీలకమైన కథారచయిత లేడనిపిస్తుంది మనకి. అదేదో ఒకళ్ళని, ఒక విగ్రహాన్ని, తీసుకెళ్ళి పెడస్టల్ మీద పెట్టే నైపుణ్యం కాదది. ఇతఃపూర్వం నీకు కనిపించంది, చూడంది, నీకు చూపించడం. ఆయన [అంటే భమిడిపాటి రామగోపాలం] చాలా సీరియస్ రైటర్, సీరియస్ అని ఆయనకే తెలీదు, ఆయన అంత సీరియస్ రైటరు అని అన్నట్టుగా చెప్తారు [భద్రుడు గారు]. అలాగే వంశీగారి ‘మా పసలపూడి కథల’ మీద రాసిన పీస్ తీసుకుంటే మనకు ఆ ఇంప్రెషనే పోతుంది, అది పాపులర్ [శైలిలో చెసిన] రచన అని. హాస్యం, పాపులర్ ఇట్లాంటి గీతలన్నీ చెరిగిపోతాయి.

కథల్ని విశ్లేషణ చేసేవాడు ఇది చేస్తే, పూర్తిగా మన పర్స్పెక్టివ్‌ని rehaul చేయాలేమో, మనం ఇప్పటిదాకా సరిగ్గా చూడట్లేదేమో అనేలాగా చెప్పగలుగుతాడు. పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి మీద ఒక పీస్ ఉంది. ఈ పుస్తకంలో లేదు, వేరే పుస్తకంలో ఉంది. ఆయన motifs ని అంత పద్ధతిగా, అంటే, ఆయన ఏఏ ఇమేజెస్ వాడతాడు, ఏఏ మోటిఫ్స్ వాడతాడు, తీసుకొని [చెప్పటం] అనేది అసాధారణమైన ప్రజ్ఞ. ఎందుకంటే నువ్వు ‘అక్రాస్ ద ఎంటైర్ బాడీ ఆఫ్ వర్క్’ చదవాలి. మొత్తం వాళ్ళ కథలన్నీ ఎంతోకొంత చాలా నిశితంగా చదివితే కానీ ఆ కథకుడి అన్వేషణ ఏంటి అనేది మనకు తెలియదు. అలాగే గోపిని కరుణాకర్ మీద [వ్యాసం].

భద్రుడుగారు ఒక కథకుడి మీద సాకల్యంగా, సమగ్రంగా రాసినప్పుడు, ఎగ్జాస్టివ్ అని చెప్పను కానీ దాదాపు “exhaustive”  దగ్గరికి [అంటే, ఆ స్థితికి] వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ గురించి దాదాపు ఆల్మోస్ట్ last word [అవుతుంది అది]. ఈ “లాస్ట్ వర్డ్” అనే మాట మీద, లేకపోతే “ఎగ్జాస్ట్” అనే మాట మీద మనకు అపనమ్మకం ఉన్న మాట నిజమే కానీ,  ఇన్ మెనీ వేస్, అవి [అంటే, ఆయన విశ్లేషణలు] లాస్ట్ వర్డ్ అని చెప్పదగ్గవే. పైగా అవి సాధారణంగా అప్పటిదాకా విమర్శకులు చెప్తున్న మాటలకి వ్యతిరేకదిశలో ఉంటాయి.

ఈ మధ్య ఒక మాట [విన]వస్తోంది- disruption అని. Disruptive అని అంటారు. యూట్యూబర్స్ గానీ, యూట్యూబర్స్ కాదు, ఏదన్నా ఒక కొత్త ప్రాడ‍‍క్ట్ ని తీసుకొచ్చి, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చే వాళ్ళని disruptors అంటారు. ఈ డిస్రప్షన్, అదొక నెగిటివ్ యాక్టివిటీ కాదు. అది చాలా గుణాత్మకమైన, ధనాత్మకమైన విషయం అని ఒక భావన ఉంది. డిస్రప్ట్ చేస్తేనే గాని కొత్తది రాదని. అలా చూసుకున్నప్పుడు, భద్రుడుగారు చాలా quietly disruptive. అంటే, ఆయన చాలా iconoclasm ని పర్ఫామ్ చేస్తారు. అంటే చాలా విగ్రహవిధ్వంసం జరుగుతుంది, కానీ అక్కడ జరిగినట్టు మీకు కనిపించదు. అక్కడ ఏమీ debris ఉండదు. కానీ విగ్రహాలు ధ్వంసం అయిపోతాయి.

ఇంకొక మాట చెప్తాను. ఒక్కటే. నిజంగానే చివరి మాట. కంటిన్యుటి- ట్రెడిషను అనే ఒక మాట ఉంటుంది కదా. అంటే, ఒక కథ ఏ కథ తాలూకు పొడిగింపు లేదా ఏ కథ ఎక్కడ ఎండ్ అయి [మరో కథ] ఎక్కడ మొదలవుతుంది. సో, [కొ.కు. రాసిన] ‘కొత్త జీవితం’ ఎక్కడ ఎండ్ అయి ఓల్గాగారి ఇంకేదో [“రాజకీయ కథ” అనే కథ] కథ ఎక్కడ మొదలవుతుంది – ఇలాంటి విశ్లేషణలు భద్రుడుగారు చేసినట్టు ఇంకెవరు చెయ్యలేరు. అంటే ఒక కథ తాలూకు కంటిన్యువేషన్‍గా, లేదా – అదే పాత్ర గనుక ఇంకొక సందర్భంలో, ఇంకొక సామాజిక సందర్భంలో గనుక ఉంటే, ఆ పాత్రే ఈ పాత్రగా మారింది – ఇలా చెప్పడం ఉంటుంది కదా.  లేదా, [ఒక పూర్వ కథకి] వారసత్వంగా ఈ కథ వచ్చింది అని చెప్పే ఒక విశ్లేషణా విధానం ఉంది. ఇది భద్రుడుగారి USP అన్నమాట. ఇది ‘వందేళ్ల తెలుగుకథ’లో మీకు కనిపిస్తుంది. ఈ పుస్తకంలో కూడా – ఝాన్సీ గారికి, రమేష్ కి, నాగేంద్రకాశీగారికి పురస్కారం వచ్చినప్పుడు చేసిన ప్రసంగంలో – అలానే చెప్తారు. అంటే ఈ కంటిన్యూటీ — ఝాన్సీ గారి కథకి కేశవరెడ్డిగారు, ఆర్.వసుంధరాదేవిగారు, ఒక రకంగా pre-cursors అని చెప్పే పద్ధతి.

అలా చెప్పగలిగే దృష్టి, ఆ సూక్ష్మదృష్టి ఉన్నవాళ్ళు చాలా తక్కువమంది. కవిత్వంలో వేగుంట మోహన్ ప్రసాద్ గారు మాత్రమే ఇది చేసేవారు. ఈ పద్ధతి అది చాలాచాలా విలక్షణమైనది. దాదాపుగా ఇంకెవరు చేయంది. కాబట్టి (ఇది) అవశ్యం చదవాల్సిన పుస్తకం.

కథలు రాసే వాళ్ళు ఇది చదవగానే (వారికి) కథలు మ్యాజికల్‌గా రాయటం వచ్చేస్తుందని కాదు, నిజానికి ఒక డీప్ అండర్‌స్టాండింగ్  కోసం ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఇదేదో ‘మాన్యువల్ ఫర్ రైటర్స్’ లాంటి పుస్తకం కాదు. నిజానికి మాన్యువల్ ఫర్ రైటర్స్ లాంటి పుస్తకాలో,  స్క్రీన్‌ప్లే [రైటింగ్] పుస్తకాలో చదివితే కథలు రాయగలరు అనుకోవడం అనేది మిథ్య. భ్రమ.

ఇలాంటి పుస్తకాలు చదివితే ఒక డెప్త్ వస్తుంది. మన [అంటే, కథకుల] వాయిస్‌కి ఒక డెప్త్ వస్తుంది. ఆ డెప్త్ ద్వారా మనం మంచి కథలు రాయగలుగుతామే కానీ మాన్యువల్స్ చదివి [కథలు రాయడం], సిడ్ ఫీల్డ్ చదివి స్క్రీన్‌ప్లేలు రాయడం కాదు. ఇది అర్థం చేసుకోవడం కోసం ఇలాంటి పుస్తకాలు చదవాలి.

14-8-2025

2 Replies to “నిజంగా భాగ్యం”

  1. విస్తారంగా చదివిన వారి మాటలు!!
    🙏🏽

    Take aways:
    “ఆలోచించడం నేర్పించడం”
    “నీ direction ని నువ్వు వెతుక్కునే మాటలు”
    “దారి వుందని గుర్తు చేసేవారు”
    “ Quietly Disruptive”

    Thank you for sharing this, sir!!🙏🏽

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ! మీరు విన్నారంటే సంతోషం.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%