
సికింద్రాబాదు రైల్వేస్టేషన్. కాకినాడ వెళ్ళడానికి ఆ రాత్రి నేనూ, విజయభాస్కర్ గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఎక్కవలసి ఉంది. రైలు రెండున్నరగంటలు లేటు. కిక్కిరిసిపోయిన ఆ స్టేషన్లో, ఊపిరాడనివ్వని ఆ రొదలో, విజయభాస్కర్ ‘నేనొకటి చదువుతాను, వింటారా’ అనడిగాడు.
గత రెండుమూడేళ్ళుగా తాను ఉపనిషత్తుల్ని అధ్యయనం చేస్తూ వచ్చాననీ, వాటిని తెలుగులో తనదైన మాటల్లో తిరిగి రాసుకున్నాననీ చెప్పాడు. అలాగని అనువాదం కాదు, వ్యాఖ్యానమూ కాదు. తిరిగి చెప్పడం. తిరిగి చెప్పుకోవటం. తనకి తాను చెప్పుకునే క్రమంలో మనకి చెప్పుకోవడమని చెప్పాడు.
‘సరే చదవండి, వింటాను’ అని అన్నానేగాని, ఆ రైల్వేస్టేషన్ వాతావరణానికీ, ఉపనిషత్తులకీ ఎక్కడ పొసగుతుందన్న అనుమానం నాకుండనే ఉంది.
ఆయన వినిపించడం మొదలుపెట్టాడు.
‘కాఠకఋషి ప్రోక్తమైనదీ శ్రేష్ఠతర ఉపనిషత్తు
ఆత్మవిద్యను అస్పష్టత లేకుండ తెల్లపర్చినది.’
అర్థమయింది. కఠోపనిషత్తు. బాగానే ఉందనుకున్నాను. నరకలోకంలో వినబడ్డ జ్యోతిర్విద్యని ఆ రైల్వేస్టేషన్లో అలా వినడంలో ఏదో దగ్గరి పోలిక ఉందనిపించింది. ఆ అనౌన్సుమెంట్ల మధ్య, వచ్చీపోయే రైళ్ళ చప్పుళ్ళమధ్య, నా ఒళ్ళంతా చెవులుగా మార్చుకుని వినడం మొదలుపెట్టాను.
కానీ కొంతసేపటిలోనే ఆ చప్పుళ్ళన్నీ అణగిపోయేయి. విశాలమైన ఆశ్రమాల్లో, హోమాగ్ని ముందు, గురుశిష్యులు, తమ తేజస్సుని ఒకరికొకరు పంచుకుంటూ, పరమోత్కృష్టమైన ఒక జీవనవిద్యను కలిసి కూచుని ఆభ్యసిస్తున్న కాలానికి వెళ్ళిపోయాను. అక్కడ నా ముందు ఒక ఋషి తెలుగులో ఇలా చెప్తున్నాడు:
శరీరమందుండిన నశరీరమది, నశ్వర వస్తుసముదాయ సాంగత్యప్రభావం
సోకని చిరస్థావరమది, ఆదిమధ్యాంతరహిత కిరణమది, సృష్టి సహజాత
మది, అజాతమది, పూర్వాపూర్వమెరుగని ప్రబలపదార్థ పలుప్రభలప్రకాశమది
అనంత ఆకాశపు సరిహద్దుల్లో ఆవరించిన నిరూపణలేని అవ్యక్తసత్యస్వరూపమది.
ఇంకా ఇలా చెప్తున్నాడు:
అనుభవించినవాడు నిత్యం కాడు, అనుభూతి సత్యం కాదు, ఈ విలాస
క్రియను చూచు సాక్షి ఎవ్వడో వాడు నిత్యసత్యములు, నిర్గుణుడు, నిరాపేక్షుడు
నిరవధిక అస్తిత్వముతో అలరారువాడు. అట్టివాని ఉనికి తెలియవలయునన్న
మనిషి లోయాత్ర చేయవలెను, ఇంద్రియములకు లోచూపు నేర్పవలెను.
అప్పటిదాకా నా మనసుమీద పేరుకున్న దైనందిన జీవితపు దుమ్ము చెదిరిపోయింది. నా చుట్టూ రొద అణగిపోయింది. నా ముందు ఒక అజరామర వాక్కు నా మాతృభాషలో ఇలా ఘోషిస్తున్నది:
నువ్వు జీవుడవు, జీవి మాత్రమే కాదు. నీ కొరకే దేవుడున్నది, నీ కొరకే దేవుడన్నది.
నీది విశ్వవ్యాపకత్వం, నీది పరిశుద్ధ ఆకాశతత్త్వం, అదృశ్యరూపము దాల్చి
సమస్తక్రియలకు ఏది ఆధారమౌతున్నదో అది నువ్వే. వికలంగా కనిపించే
సకలం నువ్వు. ప్రాణులుగా విడివడిన ఏకత నువ్వు, నింగిన చైతన్యకేతనం నువ్వు.
ఇది మంత్రమా! కవిత్వమా! గంభీరమైన ప్రసంగమా! నువ్వు పడిపోకుండా చేతులడ్డుపెట్టి నిలకడగా నీకు అందిస్తున్న ఉపదేశమా! బహుశా, నేను జీవించినంతకాలం, ఆ రాత్రి ఆ రైల్వేస్టేషన్లో, ఆ ప్లాట్ ఫారం మీద నేను విన్న ఆ కఠోపనిషత్తు పాఠం నా స్మృతిలోంచి చెదరదు.
2
వేదవాజ్ఞ్మయం మూడు భాగాలనీ, మొదటిది సంహిత, రెండవది బ్రాహ్మణాలు, మూడవది ఆరణ్యకాలు అనీ, అందులో ఆరణ్యకాల్లో ఉపనిషత్తులు ఒక భాగమనీ మనకు తెలుసు. అలాగే బ్రాహ్మణాలు క్రతుప్రధానాలనీ, కాబట్టి వాటిని కర్మకాండ అనీ, ఉపనిషత్తులు జ్ఞాన వివేచన చేసాయి కాబట్టి వాటిని జ్ఞానకాండ అని వ్యవహరిస్తున్నారనీ కూడా మనం విన్నాం. తరువాత రోజుల్లో మీమాంసకులు కర్మప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తే, ఉత్తర మీమాంసకులు జ్ఞానం ప్రధానమని వాదించారనీ, దాన్నే వేదాంతమని వ్యవహరించారనీ కూడా మనకు తెలుసు.
కానీ అనూచానంగా మనదాకా వచ్చిన ఈ కథనంలో కొన్ని గమనించవలసిన విషయాలున్నాయి. మొదటిది, వేదసంహితల్ని కూర్చేనాటికే, ఆ వేదమంత్రాలు ఎంతో కాలంగా ప్రచలితంగా ఉన్నాయి. వాటిని ఒకచోట కూర్చడమంటేనే వాటి మంత్రపాఠాన్ని స్థిరీకరించడం. ఆ అర్థాల్ని కూడా దాదాపుగా ఒక నిర్దిష్టస్ఫురణకు చేర్చడం. అంటే ఆ మంత్రాల్ని ఋషులు దర్శించిన ఎన్నో వందల ఏళ్ళ తరువాత వాటిని సంహితలుగా కూర్చారనుకుంటే, ఆ తరువాత మరికొంతకాలంపాటు బ్రాహ్మణాల రచన జరిగి ఉండాలి. ప్రతి ఒక్క వేదసంహితకీ బ్రాహ్మణాలు ఉన్నప్పటికీ, యజుర్వేద బ్రాహ్మణమైన శతపథబ్రాహ్మణమే వైదికయజ్ఞస్వభావాన్ని నిర్దేశించిదని చెప్పవచ్చు. అంటే అక్కడే బ్రాహ్మణాలు ఋగ్వేదప్రధానంగా కాక, యజుర్వేదప్రధానంగా ఆలోచన చేసాయని చెప్పవచ్చు. అలాగని యజుర్వేదం నిర్వహించిన పాత్రని తక్కువచేయలేం. ఒక ఉత్తేజం, ఒక ఉద్యమస్ఫూర్తి కలకాలం నిలబడాలంటే దాన్నొక కార్యాచరణప్రణాళిక గా మార్చాలనుకోవడం సహజం. ఋగ్వేదం ఒక ఉజ్వలస్ఫూర్తి అనుకుంటే యజుర్వేదం ఒక కార్యనిర్వహణప్రణాళిక.
కాబట్టి యజుర్వేద, సామవేదాలకు కూడా ఋగ్వేదమే స్ఫూర్తి. ఋగ్వేదం ఒక సమష్టి ప్రార్థన కాగా, యజుర్వేదం ఒక సమష్టి కర్మ, సామవేదం ఒక సమష్టిగానం. కాని, ఋగ్వేదసూక్తాల్ని చదువుతున్నప్పుడు మనకి ఎంతో ఆరోగ్యవంతమైన ఒక ప్రాచీన మానవసమాజం కనిపిస్తుంది. వాళ్ళు తమకి లభించిన ఈ జీవితాన్ని, తమ అనుభవంలోకి వస్తున్న సంతోషాన్ని, తమకి ‘కనిపిస్తున్న’ లోకాన్ని, తాము ‘దర్శిస్తున్న’ ఒక వెలుగుతో అనుసంధాన పరుచుకుంటూ తమ జీవితాన్నొక నిత్యక్రతువుగా జీవించారు. వాళ్ళకి జీవితమంటే ఒక ప్రార్థన, ఒక యజ్ఞం, ఒక సత్యం, ఒక ఋతం. వాళ్ళ ఊహలూ, మాటలూ, చేతలూ అన్నీ సమష్టి. అక్కడ వ్యష్టికి తావులేదు.
అది ఎప్పుడో ఏ ప్రాగైతికహాసకాలంలోనో సంభవించిన ఒక గణజీవితోత్సవం. అయితే ఆ స్ఫూర్తివంతమైన, సమ్యక్ స్ఫురణతో కూడిన ఒక సమష్టికర్మగా జీవితాన్ని గడిపిన ఆ ఉత్తేజాన్ని అంతే నిరంతరాయంగా కొనసాగించడమెలాగు అన్నదే ఋగ్వేదానంతర వైదికమానవుడి తపన. దాన్నే మన చరిత్రకారులు మలివేద కాలం అన్నారు. తొలివేదకాలంలో దేవతలు, యజ్ఞాలు, దానాలు ఉన్నప్పటికీ, వాటన్నిటినీ అనుసంధానం పరుచుకున్న ఒక అఖండ జీవనోత్తేజముంది. ఆ ఉత్తేజాన్ని తిరిగి తమ మధ్య ప్రతిష్టించుకోవడమెలాగు?
ఆ ఋగ్వేద ఋషులు ఏ యజ్ఞాన్ని ప్రస్తుతించారో ఆ యజ్ఞాల్ని నిర్దుష్టంగా నిర్వహిస్తే ఆ అగ్ని చల్లారకుండా చూసుకోవచ్చని యజుర్వేదమూ, బ్రాహ్మణాలూ భావించాయి. కాని బ్రాహ్మణాల కాలం నాటికి వైదికసమాజంలో అంతరాలేర్పడ్డాయి. వర్ణాలు విస్పష్ట మయ్యాయి. ఋగ్వేదంలోని స్ఫూర్తి స్థానంలో రాజీలేని క్రతునిర్వహణ వచ్చిచేరింది. ఒక సమతలసమాజం సోపానసమాజంగా మారింది.
ఉదాహరణకి ఒక జాతి ఉందనుకుందాం. అది ఒక రాజకీయ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిందనుకుందాం. అలా పోరాటం చేస్తున్న రోజుల్లో ఆ జాతి తనలో ఎటువంటి అంతరాల్నీ పట్టించుకోక, తను మొత్తం ఒకే దేహంగా, ఒకే మనస్సుగా పోరాటం చేస్తుంది. అప్పుడు దాన్ని నడిపించేది ఒకే ఒక్క ఉత్తేజం. ఆ జాతి స్వాతంత్య్రం పొందాక, తమని తాము పరిపాలించుకోడం కోసం ఒక సంవిధానాన్ని రాసుకున్నారనుకుందాం. కాలం గడిచేకొద్దీ, ఆ స్వాతంత్య్రపోరాటం నాటి స్ఫూర్తి కనుమరుగవుతూ, ఆ సంవిధానాన్ని రాజీ పడకుండా అమలు చేయడమే ముఖ్యమనే ధోరణి బలపడుతూ ఉంటుంది. జాతి తన రాజకీయస్వాతంత్య్రం కోసం పోరాడినప్పుడు కనిపించని తరతమభేదాలు రాజ్యాంగ నిర్వహణ మొదలవగానే తలెత్తడమేకాక, నానాటికీ బలపడుతుంటాయి కూడా.
వైదిక ప్రాపంచిక దృక్పథంలో ఈ మార్పు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణాలు ఋగ్వేద సూక్తాల్లోని స్ఫూర్తిని నిర్దుష్టంగా యజ్ఞాలు జరపడం ద్వారా మాత్రమే కొనసాగించగలమని భావించాయి. ఇది ఎంతవరకూ పోయిందంటే, తర్వాతి రోజుల్లో మీమాంసకులు మంత్ర, బ్రాహ్మణాలూ రెండూ కలిస్తేనే వేదమని నిర్వచించేదాకా.
వేదాన్ని బ్రాహ్మణాలు యజ్ఞప్రధానంగా నిర్వచించడం మొదలుపెట్టాక, మరెన్నో ఏళ్ళకి, అసలు వేదార్థం ఏమిటి? ఋగ్వేద ఋషులు దర్శించిందేమిటి? మానవజీవిత పరమార్థమేమిటి? అనే ప్రశ్నలు తలెత్తడం సహజమే కదా. ఆ ఆలోచనలు ఎప్పుడో రెండుమూడు వేల ఏళ్ళ కిందట మొదలై ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆ ప్రశ్నల్ని అందరికన్నా ముందు లేవనెత్తి, ఆ క్రమంలో, మానవజీవిత ప్రయోజనం గురించి ఒక సరికొత్త వివేచనకు అంకురార్పణ చేసినవిగా ఉపనిషత్తులు భారతీయ చరిత్రలో నిలబడిపోతాయి.
నిజానికి ఋగ్వేదకాలం నాటికే, వైదిక, అవైదిక దృక్పథాల మధ్య ఒక సంఘర్షణ, ఆ సంఘర్షణలోంచి ఒక సమన్వయం సాధించుకోవడం కనిపిస్తుంది. కాని బ్రాహ్మణాలు తమ దృక్పథానికి భిన్నమైన ఎటువంటి ఆలోచననీ స్వీకరించడానికి ఇష్టపడలేదు. అవి యాగప్రధానంగానే ఉండటానికి ఇష్టపడ్డాయి. కాని మరొకవైపు ప్రాచీన భారతదేశంలోని ఎన్నో శ్రమణదర్శనాలు యోగప్రధానాలుగా ఉన్నాయి. యాగం సమష్టికర్మ కాగా, యోగం వ్యక్తిని సంస్కరించే ఒక శారీరిక-మానసిక క్రమశిక్షణ. బ్రాహ్మణాలు మాట్లాడుతున్న యాగంలో అగ్ని ఉంది. కాని అది ritual fire గానే మిగిలిపోయింది. మరొకవైపు యోగం మాట్లాడుతున్న అగ్ని నిత్యాగ్ని. మననశీలమానవుడిలో సదా రగులుతుండే వివేచనాగ్ని. ఉపనిషత్తులు చేసిందేమంటే, బ్రాహ్మణాలు మాట్లాడుతున్న యాగాగ్నిని యోగాగ్నితో విశ్లేషించడం. అలా తమ చింతనతో ఆ అగ్నిని ప్రజ్వరిల్లచేసుకోవడం ద్వారా అవి ఋగ్వేదకాలం నాటి స్ఫూర్తిని తిరిగి పునఃప్రతిష్టించుకోగలమని భావించాయి. ఈ ప్రయత్నాలకు సమాంతరంగా బుద్ధుడు బ్రాహ్మణ కేంద్రకమైన, యజ్ఞప్రధానమైన, క్రతుదర్శనం స్థానంలో ఒక శ్రమణసంఘాన్నీ, ధర్మాన్నీ, అష్టాంగయోగాన్నీ తీసుకొచ్చాడు. ఆ ప్రయాణంలో ఉపనిషత్తుల నుంచి బుద్ధుడూ, బుద్ధుడి నుంచి ఉపనిషత్తులూ కూడా ఇచ్చిపుచ్చుకున్నది ఎంతో ఉంది.
కాని సోక్రటీసు, కన్ ఫ్యూసియస్, లావోత్సే, బుద్ధుడు, మహావీరుడు మొదలైనవారి దర్శనాలకీ ఉపనిషత్తులకీ మధ్య ఒక ప్రధానమైన తేడా ఉంది. తక్కినదర్శనాలన్నీ ఒక ప్రవక్త కనుగొన్న సత్యం మీదా, అతడు ప్రతిపాదిస్తున్న దర్శనం మీదా ఆధారపడినవికాగా, ఉపనిషత్తులు ఒకరు రాసినవి కావు. ఒక కాలంలో ప్రభవించినవి కూడా కావు. ఏదో ఒక వేదశాఖకి చెందినవి కూడా కావు. అలాగే ఒక ప్రాంతానికి చెందినవి కూడా కావు. ఒక పరిశోధకుడు చెప్పినట్టుగా, తొలి ఉపనిషత్తుల్లోనే ఒక ఉపనిషత్తుకీ, మరొక ఉపనిషత్తుకీ మధ్య, గాంధారజనపదానికీ, విదేహజనపదానికీ మధ్య ఉన్నంత దూరముంది. అంతే కనీసం రెండువేల మైళ్ళ దూరం ఉంది.
కాబట్టి అవి బహుళదర్శనాలు. ఆ బహుళత కూడా ‘సత్యమొక్కటే, విద్వాంసులు వేరువేరుగా దర్శిస్తారు’ అనే ఋగ్వేద స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నదే. కాబట్టి ఉపనిషత్తులన్నీ ఒకే సత్యం గురించి అన్వేషించాయని చెప్పవచ్చుగాని, అన్నీ ఒకే సత్యాన్ని ప్రతిష్టించాయని చెప్పలేం. నిజానికి వాటి దృష్టి ఏదో ఒక సత్యాన్ని నిలబెట్టడంలేదు. అసలు సత్యమేమిటని అన్వేషించడం వాటికి ప్రధానం. బ్రాహ్మణాలు మాట్లాడుతున్న యజ్ఞాలు ఆ సత్యానికి మనల్ని చేరువగా తీసుకుపోగలవా? మరోలా చెప్పాలంటే, బ్రాహ్మణాలు మాట్లాడుతున్న యజ్ఞఫలం ఋగ్వేద ఋషులు ఆశించిందీ ఒకటేనా? అయి ఉంటే ఏ మేరకు? అసలు యజ్ఞమంటే ఏమిటి? అదెక్కడ నడుస్తుంది? హోమవేదిక ముందునా లేక మనిషి దేహంలోనా? మనిషి దేహానికీ, యజ్ఞ వేదికకకీ, ఋగ్వేద ఋషులు దర్శించిన త్రిలోకాలకీ ఏదైనా సారూప్యం ఉందా? సంబంధం ఉందా?
ఈ ప్రశ్నలకి ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విధంగా జవాబులు వెతుక్కుంది. అన్నిటికన్నా ప్రాచీనమైన బృహదారణ్యకం మనిషి శ్వాసక్రియనే నిజమైన అశ్వమేధయాగంగా భావిస్తే, తొలి ఉపనిషత్తుల్లో చివరిదని చెప్పదగ్గ ముండకోపనిషత్తు అసలు యజ్ఞయాగాదుల్నే పక్కనపెట్టేసింది. తర్వాత రోజుల్లో బౌద్ధం ప్రభావం వల్ల ఉపనిషత్తుల్ని పూర్తి జ్ఞానకాండగా భావించిన వేదాంతం తొలి ఉపనిషత్తుల స్ఫూర్తికి మరింత దూరంగా జరిగిపోతూ వచ్చింది.
కానీ ఉపనిషత్తుల్లో కనవచ్చే వివేచన, విచారణ ఎంత జ్ఞానప్రధానాలో అంత కర్మప్రధానాలు కూడా. అసలు కర్మని ఉపనిషత్తులు ఒక యాంత్రిక యాజ్ఞికకర్మగా కాక, మనిషి తనని తాను ఆహూతిగా సమర్పించుకునే సమష్టి త్యాగకర్మగా దర్శించాయి. కాబట్టి అవి ఇహలోక జీవితాన్ని నిరాకరించకపోగా, ‘అదమ్’ ఎంత పూర్ణమో ‘ఇదమ్’ కూడా అంతే సంపూర్ణమని ఘోషించాయి.
ఉపనిషత్తుల ప్రధాన ఇతివృత్తం మానవుడు. అతడి దేహం, అతడి ఇంద్రియాలు, అతడి శ్వాస, అతడి మనస్సు, అతడిలో రగిలే అగ్ని. అతడిలోనే మూడులోకాలూ ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బయట ఉన్నదే అతడిలో ఉన్నది. అది, అంటే ఆ బ్రహ్మన్, ఆ పరమసత్యం, అది నువ్వే. తత్ త్వమ్ అసి.
అవి పరలోకాన్ని కోరుకోలేదు. ఇహలోక జీవితాన్నే భయరహితంగా, ఆనందమయంగా జీవించడమెలా అన్నది వాటి తపన. ఉపనిషత్తుల అన్వేషణ మొత్తాన్ని మూడు మాటలకి కుదించమంటే అభయం, అమృతం, ఆనందం అని చెప్తాన్నేను.
ఇటీవలి కాలపు ఒక పరిశోధకుడు,Patrick Olivelli అనే ఆయన ఇలా రాస్తున్నాడు The Early Upanishads,1998,పే .22).
యజ్ఞమూ, బ్రహ్మన్ గురించిన ఆలోచనలూ ఉపనిషత్తులంతటా ఉన్నప్పటికీ, వాటి వివేచన ప్రధానంగా మానవుడి గురించే. అతడి దేహనిర్మాణం, అతడి ప్రాణశక్తులూ, ఇంద్రియధర్మాలూ, అతడి ప్రజ్ఞాన ప్రక్రియ, అసలు ఒకడు మానవుడిగా ఉండటంలోని అసలైన అంతస్సారం. మానవుడి ఆలోచనకి మానవుడే ముఖ్యవిషయం కావడంలో ఆశ్చర్యం లేదు..
3
ఉపనిషత్తుల్లో ఉన్న విశేషమేటంటే అవి ఎన్నో యుగాల తర్వాత కూడా, ఇప్పుడు ఒక పాఠకుడు వాటిని తన చేతుల్లోకి తీసుకున్నా కూడా అవి అతడితో నేరుగా సంభాషించగలవు. అతడిలో అగ్నిని పునఃప్రజ్వరిల్ల చేయగలవు. ఉపనిషత్తులు తనతో నేరుగా మాట్లాడుతున్న దేమిటో అర్థం చేసుకోవడానికి అతడికి మరే ఉపకరణాలూ ముఖ్యం కాదని కూడా చెప్పవచ్చు. భాషాపరిజ్ఞానం, వ్యాకరణం, వ్యాఖ్యానాలు- ఇవేవీ ముఖ్యం కాదు. తనకి వినబడుతున్న ఉపనిషత్సందేశాన్ని స్పష్టపరుచుకోడానికి ఉపనిషత్తుల దృష్టిలో అవసరమైన ఉపకరణాలు రెండే: ఒకటి తపస్సు, రెండవది స్వాధ్యాయం.
తపస్సు అంటే నిరంతర ప్రజ్వలన. ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయో తెలుసుకోవాలనే తపన అందులో చిన్న భాగం. కాని అసలైన తపన` నేనెవర్ని, ఈ ప్రపంచంలో నా స్థానం ఏమిటి? నేను చేయవలసిన పని ఏమిటి? ఏమి చెయ్యడం ద్వారా లేదా ఏమి చెయ్యకపోవడం ద్వారా నేను ఈ జగత్తు ఈశావాస్యమనే సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకో గలుగుతాను? నా మెలకువనీ, కలల్నీ, నిద్రనీ దాటిన ఒక అపరిమిత, అసీమిత సత్యంలో నేను సదా స్థిరంగా ఉండకుండా నాకు అడ్డుపడుతున్నమేమిటి? ఏది, ఆ ఒక్కటీ, దేన్ని తెలుసుకుంటే, సమస్తమూ తెలుసుకున్నట్టు అవుతుందో ఆ విద్య ఏమిటి? ఏమి చెయ్యడం ద్వారా నాలోపలి ప్రజ్ఞని నేను నా చుట్టూ ఉన్న ప్రజ్ఞతో అనుసంధానించుకోగలుగుతాను?- ఈ చింతన, ఎప్పటికీ ఆగని, ఎన్నటికీ ఆరని ఈ చింతననే ఉపనిషత్తులు తపస్సు అన్నాయి.
ఒకసారి ఆ చింతన మొదలయ్యాక, తన ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి తాను పఠించే మంత్రాలు, చదివే పుస్తకాలూ, కలుసుకునే మిత్రులూ, దారి చూపే గురువులూ స్వాధ్యాయంలో భాగమవుతారు. ఆ దారి ఎవరికి వారు వెతుక్కోవలసిందే. ఆ దారిలో ఎవరికి వారు తమ ప్రయాణం తామే కొనసాగించవలసిందే. నీ బదులు ఆ ప్రశ్నలు మరొకరు వేసుకోలేరు. బాహ్యయజ్ఞమైతే నీ తరఫున ఒక ఋత్విజుడు నిర్వహించ గలడు. కానీ ఈ అంతర్యాగంలో ఎవరికి వారే ఋత్విజులు. అలా తాను స్వాధ్యాయం చేపట్టిన తరువాత తన అనుభవాన్ని, ఎప్పటికప్పుడు తనకి అవగతమవుతున్న సత్యాన్ని అతడు తన తోటిమనుషుల్తో పంచుకోవాలి. ఉపనిషత్తు దాన్ని ప్రవచనం అంది.
కాని తపస్సు, స్వాధ్యాయమూ, ప్రవచనమూ మనిషి ఏకాకిగా చేసే పనులు కావు. తైత్తిరీయ ఉపనిషత్తు (9.1.1) స్వాధ్యాయ ప్రవచనాలు ఋతంతో, సత్యంతో, తపస్సుతో, దమంతో, శమంతో, అగ్నితో, అగ్నిహోత్రంతో, అతిథుల్తో, మానుషత్వంతో, ప్రజలతో, ప్రజోత్పత్తితో, ప్రజాతితో కలిసి చేపట్టవలసిన కర్తవ్యాలుగా పేర్కొంది.
అప్పుడు మాత్రమే వేదసూక్తాలు మాట్లాడిన యజ్ఞం సమ్యక్‌కర్మ అవుతుంది. అంతే తప్ప బ్రాహ్మణాలు నిర్దేశించినట్టుగా మూడు అగ్నుల్తో, నలుగురు ఋత్విజుల్తో నిర్వహించే క్రతువు కాదు. అలాగని ఉపనిషత్తులు బ్రాహ్మణాల్నీ, యజ్ఞాల్నీ నిరాకరించేయని కాదు. క్రతువు కూడా సమ్యక్‌కర్మ కాగలదు. ఎప్పుడు? అక్కడ తపస్సు అగ్ని అయినప్పుడు, స్వాధ్యాయం ఆహూతి అయినప్పుడు, ప్రవచనం మంత్రపాఠమైనప్పుడు.
ఋగ్వేదస్ఫూర్తిని తిరిగి సమాజంలో ప్రతిష్టించుకోవడమెలా అన్నదే బ్రాహ్మణాల అన్వేషణా, ఉపనిషత్తుల అన్వేషణా కూడా. కాని ఆ ప్రయత్నంలో బ్రాహ్మణాలు మార్చడానికి వీల్లేని manuals గా మారిపోగా, మననశీలమైన living exercises గా ఉపనిషత్తులు తమని తాము తీర్చిదిద్దుకున్నాయి. మనిషిని తోటిమనిషితో, చరాచరాలతో, త్రిలోకాలతో కలపడానికి అన్నిటికన్నా ముందు అతడిలోని జ్ఞానాగ్ని నిత్యం ప్రజ్వరిల్లుతూ ఉండాలన్నది ఉపనిషత్తులు కనుగొన్న సత్యం. ఆ అర్థంలో వాటిని మనం ఒక సోక్రటిక్ విచారణతో, కన్‌ఫ్యూసియస్ ఆచరణతో, లావోత్సే మెలకువతో, బుద్ధుడు కోరుకున్న శీల-సమాధి ప్రజ్ఞలతో పోల్చవచ్చు. కానీ సోక్రటీస్ విచారణ అకడెమిక్ ఫిలాసఫీగా, బుద్ధుడి బోధనలు బౌద్ధంగా, కన్‌ఫ్యూసియస్ ఆచరణ కన్‌ఫ్యూసియనిజంగా మారిపోయాయిగాని, ఉపనిషత్తులు ఉపనిషన్మతంగా ఘనీభవించలేదు. అవి ఎప్పటికీ తెరిచిపెట్టిన పుస్తకాలే. వేదాంతులు వాటిని ఎంతగా ఒకే ఒక్క సత్యానికి కుదించాలని ప్రయత్నించినప్పటికీ, అవి అన్ని రకాల పరిమితుల్నీ దాటి ఎప్పటికప్పుడు తమని చేరవచ్చినవారికి గొప్ప జ్యోతిర్మయలోకాన్ని చూపిస్తూనే ఉన్నాయి, ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి, ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి.
ప్లేటో సంభాషణల మీంచి వికసించిన యూరపియన్ తత్త్వశాస్త్రం నెమ్మదిగా ఒక academic course గా మారిపోయింది. సోక్రటీస్ మాట్లాడిన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఆ సంభాషణలకు ఒక series of footnotes గా ప్రభవించిన తదనంతర తత్త్వవేత్తల్ని చదవకతప్పదనే ఒక భయం కలిగించడంలో పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు సఫలమవుతూ వచ్చాయి. కాని ప్లేటో రచనల్ని ఒక సాహిత్యంలాగా నేరుగా చదివినా కూడా ఆయన మనకు ఎంతో కొంత బోధపడతాడని వైట్‌హెడ్ చెప్పినమాటలు నేను నమ్ముతాను. ఆ మాటల్నే మనం ఉపనిషత్తుల విషయంలో కూడా చెప్పుకోవచ్చును. కావలసిందల్లా శ్రద్ధ. ఆపైన తపస్సు, నిరంతరం కొనసాగే స్వాధ్యాయం. అప్పుడు ఆ సత్యస్ఫురణ తన సంతోషాన్ని నలుగురితో పంచుకోకుండా ఉండలేని ప్రవచనంగా ఎలాగూ మారుతుంది.
అలా ఉన్నాయి అనటానికి, ఇదుగో, ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ పుస్తకమే సరికొత్త ఉదాహరణ.
4
ఎవరైనా ఒక జిజ్ఞాసి అత్యంతశ్రద్ధతో ఉపనిషత్తుల్ని సమీపిస్తే అతడు ఎటువంటి జ్యోతిర్మయలోకాన్ని సందర్శించగలడో ఈ పుస్తకంలో ప్రతి పుట మనకి నిరూపణగా నిలబడుతున్నది. ఉపనిషన్మంత్రాల్ని ఈ సాధకుడు యాంత్రికంగా అనువదించలేదనడానికి, వాటిని అనుభవించి, ఆ సంతోషాన్ని పలవరించాడనడానికీ వాక్యాలకు వాక్యాలు ఉదాహరణలుగా ఎత్తిచూపాలని ఉంది. లేదా మొత్తం పుస్తకం బిగ్గరగా మీకు వినిపించాలని ఉంది. అయినా నా ఉత్సాహం ఆపుకోలేక కొన్ని వాక్యాలు ఎత్తి చూపకుండా ఉండలేకపోతున్నాను. ఈ మాటల్లో కొన్ని ఉపనిషత్తుల మాటలు. మరికొన్ని ఆ మాటల్ని ఆ మననం చేసినందువల్ల తనలో వెలిగిన మాటలు. చూడండి:
‘నిండునీరమున్న సరసుల భ్రాంతిగొలిపిన
యెండమావుల నెండగట్టిన నిండు జ్ఞానమిది.’
‘వేదమాగిన చోట విశ్వవివేచన పుట్టె
పరమసత్యశోధన పరమార్థమయ్యే.’
‘భీరులు కావద్దు, ధీరులు కావాలని ప్రబోధించే
తాత్త్వికదృఢత్వమే ఉపనిషత్తుల సందేశసారం.’
‘ఈ ప్రకృతిపై అనుభవ అవకాశం తప్ప హక్కులు
యే ఒక్కడికి లేవని మనిషి చేసే నిర్ద్వంద్వ ప్రకటన.’
‘యజ్ఞయాగాల స్థానంలో అనుభవ త్యాగాలు వచ్చినవి.’
‘కర్మ ముగియ ఆ జన్మ ముగియు. జన్మ కర్మల లంకె.’
‘ఉపనిషత్తు దేవతా పరిషత్తు వేదిక కాదు.’
‘వాయువుగా ప్రవేశించి జీవినందు ఆయువుగా
వసించు విధానము కన్న విశిష్ట విద్య ఏది?’
‘విడివడి కనబడు మానవులు అనేకమనుకొనుట అవివేకపు మాట.’
‘లోకములోని వారందరు ఒకరికొకరు బాగా తెలిసినవారే. అదృష్టహీనము వలన ఎవరెవరో గుర్తుకు రాక ఒకరికొకరు పరాయి వారిగా ప్రవర్తించు చున్నారు.’
‘దేహమొక యజ్ఞశాల.’
‘మనుజుడు ఋత్విజుడై నిర్విఘ్న జీవనయాగం నిర్వహించుటే యజ్ఞం.’
‘ప్రపంచమంత ఈశ్వరమహిమ అని ఎరిగినవాడు దుఃఖరహితుడగును.’
‘అతడు లోకమందు వెలుగు శోకదీపం కాడు.’
‘మాటే కదా మనిషిని మృగజాతినుండి వేరు చేయు. ఆ మాట
కొందరినోట ఆర్పలేని మంట, మరికొందరి నోట అదే మాట
విరిసిన పూదోట.’
‘బాహ్యవేషము చూసి భయపడనివాడు నిర్భయుడు.’
‘పదార్థప్రయోజనము తప్ప పరమార్థప్రభావము తెలియనివాడు భయకంపితుడగును.’
‘తర్కమాగిన చోట తాత్త్వికత పుట్టు. తాత్త్వికతకు ధ్యానం ఆయువుపట్టు.’
‘చెరువునందు ఈత నేర్చువాడు చేతులతో తన చుట్టు ఉన్న నీటిని తొలగించు కొని ముందుకు పోవునట్లు ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధకుడు నేతి, నేతి, ఇదికాదు, ఇది కాదని చుట్టూ కమ్మిన మాయావరణాన్ని తొలగించుకుని తురీయస్థితిని పొందుతాడు. అది నిస్సంగ నిరాసక్త నిర్భయ స్థితి.’
‘ఋగ్వేదయజ్ఞం అమృతం నిండిన ఒక పరమసుందరమైన పుష్పం.’
‘మాటను మంత్రముగా వాడు విధమును చూసి తెలియనగును మహిన మహితాత్ములున్న చోటు.’
‘వాక్కునే కదా వ్యక్తి సంస్కారం తెలుపునట్టు ప్రథమ ప్రమాణసూచి.’
‘ఆత్మ ఒక వంతెన. ఇహ పరముల మధ్య ఒక వంతెన.’
‘మనుషులెంతమంది ఉన్నా మానవత్వానికి పూరించలేని లోటు అన్నం లేక మరణం సంభవించిన చోటు.’
‘ఇతరులకు అన్నం పెట్టడం గృహస్థుధర్మం. అన్నం సంపాదించుకునే అవకాశం కల్పించడం రాజధర్మం.’
‘ఆకలి కడుపుకు అన్నం అమృతం.’
ఈ చివరి వాక్యాలు చదవగానే ‘నేను ఆకలితో ఉండకూడదు, నా ఇంటికి వచ్చినవాడు ఆకలితో ఉండకూడదు’ అని కబీరు అన్న మాటలు, ‘ఒక అన్నార్తుడి ముందుకు దేవుడు రొట్టె రూపంలో మాత్రమే కనిపించడానికి సాహసిస్తాడు’ అని గాంధీ అన్న మాటలు గుర్తుకు రాకుండా ఉండవు.
అంతే కాదు, ఈ అనువాదంలో మరో విశేషముంది. తొలి ఉపనిషత్తుల్లో ఒకటిగా లెక్కవేయకపోయినప్పటికీ, వజ్రసూచికోపనిషత్తుని కూడా తొలి ఉపనిషత్తులతో కలిపి అనువదించడం. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్టుగా, నలుగురికీ స్ఫూర్తిదాయకమై సమష్టికర్మ కావలసిన ఒక సమ్యక్‌కర్మని ఒక పురోహితవర్గానికి మాత్రమే పరిమితం చెయ్యడాన్నే ఉపనిషత్తులు ప్రశ్నించాయి. ఆ ప్రశ్ననే ఎంతో బిగ్గరగా, ఎంతో బలంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో లేవనెత్తిన ఉపనిషత్తు వజ్రసూచిక. దాన్ని తొలి ఉపనిషత్తులతో కలిపి అనువదించడం ద్వారా ఉపనిషత్సందేశానికి స్పష్టమైన సామాజికపార్శ్వం సమకూడిరదని చెప్పవచ్చు.
ఉపనిషత్తుల్లో చాలాచోట్ల ఎన్నో రహస్యాల్ని క్షత్రియులు కనుగొని బ్రాహ్మణులకి ఉపదేశించారని చెప్పిన ఉదాహరణులున్నాయి. కాని వాటిని ఇండాలజిస్టులు బ్రాహ్మణ-క్షత్రియ ప్రాధమ్యానికి సంబంధించిన విషయంగానే చూసారు. కాని నేనేమనుకుంటానంటే, ఒక ఆశ్రమవాసి, లేదా యజ్ఞవేత్త అయిన బ్రాహ్మణుడికన్నా కూడా ఒక క్షత్రియుడు ప్రజాసామాన్యానికి ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. ఉండవలసిన అవసరం అతడికి ఉంది. ప్రజలతో కలిసి మెలిసి జీవించడం వల్ల ఒక కర్మని సమ్యక్ కర్మగా మార్చడమెలానో అతడు అనుభవం ద్వారా గ్రహించి ఉంటాడు. అలాగని ప్రజాప్రేమికుడైనంతమాత్రాన, సంక్షేమపాలకుడైనంతమాత్రాన కర్మని సమ్యక్ కర్మగా మార్చుకునే విద్య ఒక క్షత్రియుడికి కూడా పూర్తిగా పట్టుబడుతుందని అనుకోవద్దని కూడా ఉపనిషత్తు హెచ్చరిస్తుంది. కాబట్టే, జానశ్రుతి వంటి రాజు కూడా ఒక రైక్వుడి దగ్గరికి, ఆ రైక్వుడు ఎంతగా సమాజపు అంచుల్లో జీవిస్తున్నప్పటికీ, పోక తప్పదని ఉపనిషత్తు చెప్తున్నది.
కాబట్టి జ్ఞానం ఏ ఒక్కరిదో కాదు. అది సమస్త ప్రజానీకానిదీను. ఎవరు తనలో ఎల్లలోకాల్నీ, ఎల్లలోకంలో తననీ చూడగలరో, అతడే జ్ఞాని. అతడికి కులం లేదు, వర్ణం లేదు, లింగం లేదు, వయోపరిమితుల్లేవు.
వజ్రసూచి ఈ అంశాన్నే ఇలా నిర్ద్వంద్వంగా చెప్తున్నది:
. .. మరి ఎవడు బ్రాహ్మణుడు? బ్రాహ్మణుడెవ్వడనిన ఎవడు తన అర
చేతిలో పరమాత్మను కరతలామలకం వలె చూడగలడో వాడు నిజమైన
స్వచ్ఛబ్రాహ్మణుడు. ఆ పరమాత్మ అద్వితీయుడు. జాతిగుణక్రియారహితుడు
జరా, మరణ, మోహ, క్షుత్, పిపాసలనే షడూర్ములు లేని వాడు.
. .. అటువంటి మహానుభావుడు మహామనీషి మానవమూర్తి ఏ వర్ణమందు ఐనను జనించవచ్చు, ఏ తావునందయినను తల ఎత్తవచ్చు. ఏ వృత్తిలోనైనను ఆకృతి దాల్చవచ్చు.
. .. జన్మ వలన జాతకం వలన జపతపాదుల వలన బంధము వలన బాహ్యరూపము వలన రాని బ్రాహ్మణత్వం బ్రహ్మమెరుగుట వలన వచ్చు. సాక్షాత్తు బ్రహ్మపదార్థము నేను అను ఎరుక వలన వచ్చును.
5
దీర్ఘాసి విజయభాస్కర్ కవిగా, రచయితగా, నాటకకర్తగా, సమర్థుడైన అధికారిగా ఇప్పటికే తెలుగుప్రపంచానికి పరిచయం. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటి ఆయన ఈ స్థితికి చేరుకోవడమే ఒక జయగాథ, అతడు పుట్టిపెరిగిన ప్రాంతానికీ, ఆ కుటుంబాలకీ మాత్రమే కాదు, మనందరికీ కూడా. కానీ అతడు ఇంతదాకా అధిరోహించిన ఎత్తులు ఒక ఎత్తు. ఈ పుస్తకం ద్వారా చేపట్టిన ఆరోహణ మరొక ఎత్తు. ఈ రచన ద్వారా ఆయన దేవగంగని ఒక మరుభూమిమీద ప్రవహింపచేసిన భగీరథుడిగా మారాడు. మరొకసారి గంగ భువికి అవతరిచింది. అతడికి జయం. అతడికి తపస్సుకు జయం. అతడి తపోఫలితానికి జయం, జయం.
Featured image: Wikimedia Commons
డా.దీర్ఘాసి విజయభాస్కర్, సృష్టిగర్భ: ఉపనిషత్కాంతి, వాక్కులమ్మ ప్రచురణ, వెల.250/- పుస్తకం అన్ని ముఖ్యపుస్తక కేంద్రాల్లోనూ దొరుకుతుంది.
25-11-2024
ఒక భగవద్గీత లాగా, ఒక రామాయణం లాగా…. ప్రతి ఇంట్లో ఉండవలసిన అద్భుతమైన పుస్తకం ఇది.
మీరు పరిచయం చేసిన తీరు, చేసిన వ్యాఖ్యలు అత్యద్భుతం
‘భీరులు కావద్దు, ధీరులు కావాలని ప్రబోధించే
తాత్త్వికదృఢత్వమే ఉపనిషత్తుల సందేశసారం.’
ఖచ్చితంగా కొనాలి 🙏🙏❤️❤️
ధన్యవాదాలు సార్!
సృష్టి గర్భ ఉపనిషత్కాంతి గ్రంధంపై మీరు రాసినవ్యాసం ఒక జ్ఞాన గవాక్షంలా ఆ కాంతిని చూపెట్టింది. మహా శున్యంలాంటి ఒక తాత్వికకావ్య రచన చేసిన దీర్ఘాసి విజయ భాస్కర్ గారి రచన అయిన ఈ గ్రంధం నిజంగా అభయం, అమృతం.ఆనందం . వారికీ అభినందనలు.మీకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్!
ఉపనిషత్తులను తేలికగా అర్థం చేసుకునే పుస్తకాల కోసం అన్వేషణలో ఉన్నాను. మీరు సూచించిన ఈ పుస్తకాన్ని తప్పక కొంటాను.
తప్పకుండా
Thank you, sir.
Thank you
నమస్తే సర్.. మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. మీలాగా చెప్పేవాళ్ళు ఉంటే ఎంతటి జటిలమైన విషయమైన హృదయానికి తాకుతుంది. గొప్ప విశ్లేషణ. మహనీయ కృషి చేసిన శ్రీ విజయ భాస్కర్ గారికి అభినందనలు. అపురూపంగా ఆవిష్కరించిన మీకు ధన్యవాదాలు సర్.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
an excellent review. congratulations to Vijaykumar garu for this great effort. Surely get the book and will read it. Thanks for the review .
Thank you Sir
Most enlightenment article. I bow down my head to both of you.
ధన్యవాదాలు సార్!
ఈ వ్యాసం “ఆ రైల్వే స్టేషనులో ఒక ఉపనిషత్తు” చదువుతున్నంతసేపూ నా లోపలెక్కడో ఓ మౌనం అలలాడినట్లుంది. జనబాహుళ్యంలోనూ, రైల్వే స్టేషన్ గోలలోనూ, వేదాంతపు శూన్యాన్ని, ఉపనిషత్తుల ప్రశాంతతను గుర్తించగల రచయిత గమ్యం ఆశ్చర్యం కలిగించింది. మానవ జీవితం అంటే ఓ ప్రయాణమే అని మనకు చెప్తూ, ఆ ప్రయాణపు ప్రతి అంచునా ఒక జ్ఞానం ఉందన్న అవగాహనను చక్కగా పంచుకున్నారు. ఆధ్యాత్మికతను ప్రబోధించేంతగా కాక, అనుభవంలోంచి తళుక్కుమన్న ఓ సందేశంలా తీసుకువచ్చారు. “సత్యం ఎక్కడ దొరుకుతుంది?” అన్న ప్రశ్నకు ఒక రైలు దిగే, ఎక్కే మాలిన్యపు స్టేషనులో సమాధానం కనపడేలా చేయడం విశేషం. ఇది ఓ వ్యాసం కాదు, నిజానికి ఓ మౌన ఉపనిషత్తే—మనల్ని మనలోనికి తిరిగి పిలిచే శబ్దరహిత శబ్దం.
మీ స్పందన ఎంతో విలువైన స్పందన. ఇది నిజంగా హృదయంలో నుంచి వచ్చిన స్పందన. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వాక్యాలు చదివి.
వ
సర్, బావున్నారా! నేను రాజుని. మీ ఉపనిషత్కాంతి పుస్తక పరిచయం చూశాను. అద్భుతంగా ఉంది. నేను జయమోహన్ గారి భారతీయ తత్త్వశాస్త్ర తరగుతులకి వెళుతున్నాను. గత రెండేళ్లుగా ఈ తరగతులని… వివిధ బ్యాచులుగా ఆయన నిర్వహిస్తున్నారు. తమిళనాడు ఈరోడ్డు దగ్గర వెళ్లిమలై అనే గిరిజన గ్రామంలో ఆయన ఏర్పాటుచేసిన ‘నిత్యవనం’ గురించి ఇదివరకే మీతో ప్రస్తావించినట్టు గుర్తు. అక్కడే ఈ తరగతులూ జరుగుతున్నాయి.
ప్రతి సెషన్ శుక్ర, శని, ఆదివారాలని మూడు రోజులు ఉంటోంది. జయమోహన్ తన గురువు నిత్యచైతన్య యతి… నటరాజగురు దగ్గర భారతీయ తత్త్వశాస్త్రం నేర్చుకున్నవారు. వేదాంత దర్శనానికి చెందినవారు. వాటినే ప్రపంచ తత్త్వశాస్త్ర చరిత్ర భూమికగా పాఠాలుగా చెబుతున్నారు. ఓ తత్త్వవేత్తలానూ లేదా తత్త్వశాస్త్ర విద్యార్థిగానూ కాకుండా ఓ సృజనకారుడైన రచయిత చెబుతున్నట్టే సాగుతున్నాయీ తరగతులు… ఎంతో కవితాత్మకంగానూ ఉద్వేగపూరితంగానూ! నేనూ, నా లాంటి వాళ్లం 70 మంది రెండో బ్యాచ్‌కి చెందినవాళ్లం. మొదటి సెషన్ భారతీయ తత్త్వశాస్త్రఆనికి సంబంధించి. వేదాల నుంచీ ప్రస్థానత్రయం, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, ద్వైతాద్వైతాల మీదుగా గాంధీ(!) దాకా ఓ పరిచయాన్ని అందించారు జయమోహన్.
గత జనవరిలో జరిగిన రెండో సెషన్‌లో పూర్తిగా వేదాల గురించి చర్చించారు. భారతదేశంలో పుట్టిన వేదాలని ప్రపంచ చరిత్రలో నిలిపి చూపారు. దీనికన్న ముందటి ఈజిప్టు ,మెసపటోమియా సంస్కృతుల *వేదాలని* పరిచయం చేశారు.
రెండో సెషన్ – మార్చి నెల- ఉపనిషత్తులపైనే జరిగింది.
ప్రతి సెషన్‌లోనూ.. రెండోరోజు వేకువన సూర్యోదయానికి ముందు ఆరుబయట ఓ ప్రత్యేక తరగతి ఉంటుంది. ప్రతి ఒక్కళ్లకీ మా జీవితంలో మరచిపోలేని అనుభవంగా ఉంటోంది. మొదటిసారి సృష్టిగీతం గురించీ, రెండో సెషన్-లో గాయత్రీ గురించీ, మూడో సెషన్‌లో కఠోపనిషత్తు గురించీ ఈ ప్రత్యేక తరగతిలో. ఇలాగే ఈశోవాస్య ఉపనిషత్తులోని ఓ గీతాన్ని రాత్రి లైట్లన్నీ ఆర్పేసి తనదైన అనువాదంతో వినిపించారు జయమోహన్. ఓ అధ్యాత్మిక అనుభవంలాంటిది అది.
ఇవన్నీ మీతో చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రాంగ్వేద కాలం నుంచీ బ్రాహ్మణాలూ ఆరణ్యకాల పరిణామం దాకా చర్చించిన ఈ రోజు మీ ముందు మాటని చదివాక… వాటిపైన జయమోహన్ గారి దృక్పథాన్నే మళ్లీ చదువుతున్నట్టు అనిపించింది! ఇద్దరి భావనలూ ఒకేలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఇదెలా సాధ్యం అనకుంటున్నాను. ‘గ్రేట్ మెన్ థింక్ అలైక్’ అంటారు… ఇందుకే కావొచ్చు.
రెండో కారణం- వేదవచనాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కొన్ని కవితాత్మక వాక్యాలను Je. తమిళంలో అనువదించి చెప్పేవారు. అద్భుతమైన కవితల్లో తోచాయి నాకవి. *అసలు ఇలా అనువాదం చేయొచ్చా* అన్న అనుమానమూ వచ్చింది నాకు.
‘నిజానికి అనువాదం చేసే చదవాలి. ఎందుకంటే ఉపనిషత్తు వాక్యం నీ అంతరాత్మకి దగ్గరగా ఉండాలి. అప్పడే నీలో బాగా ఇంకుతుంది. మంత్రంగా మారుతుంది’ అంటారు జయమోహన్. కాకపోతే- ఎంతగా నాకు తమిళం తెలిసినా నా మనస్సు భాష తెలుగే. కాబట్టి జయమోహన్ చెప్పిన ఉపనిషత్తు వాక్యాలని నేనే తెలుగులోకి అనువదించుకోవాలని భావించాను. కానీ, ఈ రోజు మీరు పరిచయం చేసిన ఉపనిషత్కాంతి-తో ఆ అవసరం ఉండదనే భావిస్తున్నాను. ఈ పుస్తకాన్నే నా అధ్యయనానికి వాడుకుంటాను.
మీ ముందుమాటని తమిళంలో అనువదించి జయమోహన్ గారికి అనువదించి పంపాలని ఉంది. దానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. అందుకే- గూగుల్ ద్వారా అనువదించాలని భావిస్తున్నాను. మీ అభిప్రాయాలు తనకెంత దగ్గరగా ఉన్నాయో… చూసి ఆయనా ఆశ్చర్యపోనివ్వండి!
నమస్సులతో,
రాజు
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!