
పుస్తక పరిచయం ప్రసంగాల పరంపరలో భాగంగా గతవారం నుంచి టాగోర్ సాహిత్యం గురించి ప్రసంగిస్తున్నాను. నిన్న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా టాగోర్ కవిత్వం గురించి, ముఖ్యంగా, ఆయన కవిత్వసాధనలో మొదటిదశ కవిత్వం (1881-1900) గురించి ప్రసంగించాను. ఆ ఇరవయ్యేళ్ళ కాలంలో ఆయన్ని ఆయన కుటుంబవాతావరణం, చుట్టూ ఉండే పరిసరాలు, ముఖ్యంగా చందర్ నాగోర్, శిలైదాహాల్లో గంగానది ఒడ్డున, పద్మా నది ఒడ్డున ఆయన గడిపిన జీవితం ఆయన్నెట్లా కవిగా మార్చాయో వివరించాను.
ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
ఇందులో ప్రస్తావించిన విదేశినీ కవిత పూర్తిపాఠం:
ఎరుగుదు, నిన్నెరుగుదు, విదేశినీ
ఓహో సింధుతీర వాసినీ!
కనుగొంటిని శారదప్రాతర్వేళల
కనుగొంటిని మాధవపులకిత రాత్రుల
కనుగొంటిని నా హృది నిను సరికొత్తగ
ఓహో విదేశినీ!
మింటికి నా చెవులప్పగించి నే
వింటిని, వింటిని, నీ గానమ్మును
మంటిన పరిచితి నా ప్రాణమ్ముల
ఓహో విదేశినీ!
తిరిగితి భువనము నిశ్శేషముగను
చేరితి తుదకీ నూతనదేశము
వరలితి నీ ముంగిటనొక అతిథిగ
ఓహో విదేశినీ!
Letters from a Young Poet 1887-1895 (2014) నుంచి అనువదించిన రెండు ఉత్తరాలు:
1
శిలైదాహా
14 జనవరి 1892
ఈ రెండురోజులుగా ఇక్కడ ప్రకృతి శిశిరవసంతాల మధ్య ఊగిసలాడుతోంది. పొద్దుటిపూట నేలనీ, నీళ్ళనీ కూడా వణికించేలాగా చలిగాలులు వీస్తుంటాయి. సాయంకాలంకాగానే ప్రకాశవంతమైన వెన్నెలవెలుగులో దక్షిణపవనం ప్రతి ఒక్కదాన్నీ అల్లరిపెట్టేస్తుంటుంది. వసంతం రాబోతున్నదనీ, చాలా దగ్గరలోనే ఉన్నదనీ స్పష్టంగా తెలుస్తూన్నది. చాల కాలం తర్వాత ఆవలి ఒడ్డు తోటల్లోంచి ఒక కోకిల పిలవడం మొదలుపెట్టింది. మనుషుల హృదయాలు కూడా ఒకింత అస్థిమితమవుతున్నట్టే ఉంది. ఈ రోజుల్లో సాయంకాలాల్లో ఆవలి ఒడ్డునున్న గ్రామాల్లోంచి సాయంకాలం పూటా ఏదో ఒక పాటనో సంగీతమో వినవస్తూంటుంది. ప్రజలింకా తమ ఇళ్ళల్లో తలుపులూ, కిటికీలూ మూసుకుని దుప్పటికింద ముణగదీసుకోడంలేదని అర్థమవుతోంది. ఈ రాత్రి నిండుపున్నమి. సరిగ్గా నా ఎడమపక్కనే ఒక మహాచంద్రబింబం ఉదయిస్తూ తెరిచి ఉన్న కిటికీలోంచి నా వదనాన్నే చూస్తున్నాడు. నేనుగాని ఈ ఉత్తరంలో అతణ్ణి విమర్శించబోతున్నానా అని చూస్తున్నట్టే ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు తమ పోసుకోలు మాటల్లో అతడి కాంతి గురించి మాట్లాడుకోడం మానేసి ఆ ముఖం మీది మచ్చల గురించే ఎక్కువ మాట్లాడుకుంటారని అతడు భావిస్తున్నట్టుంది. నిశ్శబ్దంగా పరుచుకున్న ఇసుకతిన్నెల మీంచి ఒక ఒంటరి తీతువుపిట్ట ఎలుగెత్తి పిలుస్తూ ఉన్నది. నది నిశ్చలంగా ఉన్నది, ఎక్కడా పడవల్లేవు. అవతలి ఒడ్డునున్న చెట్ల నీడలు నీటిమీద పరుచుకుని కదలకుండా ఉన్నాయి. నిద్రలోంచి అప్పుడే మేల్కొన్న కళ్ళకి మల్లే పూర్ణచంద్రమాస రాత్రి దృశ్యం ఒకింత మసకమసగ్గా కనిపిస్తూ ఉన్నది. రేపు మళ్ళా సాయంకాలం నెమ్మదిగా చీకటి పడబోతుంది. రేపు సాయంకాలం నా కచేరీపని పూర్తికాగానే ఈ చిన్ని నదిని దాటబోయేటప్పుడు ఈ పరాయిప్రాంతంలో నా ప్రియురాలు నానుంచి ఒకింత దూరంగా జరిగిపోతుందేమో చూస్తాను. నిన్ననే ఆమె తన అగాధ, అపార హృదయసీమను నాకు వెల్లడి చేసింది. బహుశా ఒక్కసారే తనని తాను మరీ అంతగా బయటపెట్టుకోకూడదేమో అనుకున్నట్టుంది, ఇప్పుడు మళ్లా నెమ్మదిగా తన హృదయాన్ని ముకుళితమొనరుస్తూ ఉంది. ఇలాంటి పరాయి ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్నవాళ్ళకి ప్రకృతిమరీ చేరువగా వస్తుందనుకుంటాను. గత కొన్ని రోజులుగా ఇదే అనుకుంటూ ఉన్నాను. ఒక నిండుపున్నమి రాత్రి తర్వాత మళ్ళా అంత వెన్నెల కనిపించదు. ఇక రేపణ్ణుంచి నా జీవితం ఒక పరాయిప్రాంతం నుంచి మరొక పరాయిదేశానికి పోయినట్టే. నా రోజువారీ పనులు పూర్తయ్యాక, నది ఒడ్డున, ప్రతి సాయంకాలం నాకు ప్రత్యక్షమయ్యే ఆ ప్రశాంత, సుపరిచిత సౌందర్యం ఇంకెంతమాత్రం కనిపించదు. నేనింక చీకట్లోనే నా నావను చేరుకోవలసి ఉంటుంది. .. కాని ఈ రోజైతే నిండుపున్నమి రాత్రి. ఈ వసంతఋతువుకి ఇదే మొదటి పూర్ణిమ. ఇప్పుడిక్కడ కూచుని ఇలా రాయడమైతే రాస్తున్నానుగాని, బహుశా చాలా ఏళ్ళ తరువాత నేను తిరిగి మళ్ళీ ఈ నిశ్శబ్ద రాత్రిని తలుచుకోకుండా ఉండలేను. అవతలి గట్టుకు చేర్చిపెట్టిన పడవలమీద మండుతున్న వెన్నెల వెలుగునీ , ఈ చకోరగానాన్నీ , ప్రభాకలితమైన ఈ సన్నని నదీధారనీ , చిక్కగా అల్లుకున్న చిట్టడవినీ, – ఈ వివిక్త, ఉదాసీన, వివర్ణ ఆకాశాన్నీ..
2
శిలైదాహా
15 డిసెంబరు 1895
రోజులిలా గడుస్తున్నాయి. సాయాంకాలం కాగానే నేను అవతలి ఒడ్డున ఇసుకతిన్నెలకు చేరుకుని అక్కడ కాసేపు అటూ ఇటూ నడిచి, తిరిగి వచ్చేటప్పటికి రాత్రయిపోతూ ఉంటుంది. ఈ నిశ్చల నీరవ నదీ ప్రవాహం మీదా, అవతలి ఒడ్డునుండే చెట్లమీదా సాయంసంధ్యాసౌందర్యం ఎలా ఉంటుందో వర్ణించాలనుకుంటానుగాని, అది నా శక్తికి మించిన పని. ఇక్కణ్ణుంచి ఎంతో దూరంలో ఉన్న నీకు ఆ సౌందర్యం ఎలాంటిదో ఊహకి కూడా అందదు. కలకత్తాకి తిరిగి వచ్చేసాక నేను కూడా ఈ అందాన్ని ఇంతే విస్పష్టంగా గుర్తుతెచ్చుకోలేనేమో. నిన్న సాయంకాలం నా మనసునీ, హృదయాన్నీ, నా సంకల్పాల్నీ కూడా సాయంకాల సౌందర్యంతో పూర్తిగా నింపేసాక, ఆ బంగారు సంధ్యాధూళిలో, చిన్న పడవ మీద నెమ్మదిగా వెనక్కి వస్తూండగా, ఎక్కడో దూరం నుంచి ఎవరో ఒక నావ మీంచి తమ వయొలిన్ మీద మొదట పూర్వీ రాగాన్నీ, ఆ తర్వాత ఇమాన్ కల్యాణ్ రాగాలాపననీ వాయిస్తుండటం వినిపించింది. వెంటనే సమస్తనదీదేశమూ, నిశ్శబ్దాకాశమూ మానవహృదయసమానమైపోయాయి. నేనప్పటిదాకా ఈ మానవప్రపంచంలో సాయంసంధ్యాదృశ్యానికి సాటిరాగలది ఏదీ లేదని అనుకునేవాణ్ణి. కానీ పూర్వీ రాగం వినిపించడం మొదలుపెట్టగానే అది కూడా విస్మయం కలిగించేటంతటి నిగూఢంగానూ, ఎల్లల్లేనంత అందంగానూ తోచడమేకాక, అది కూడా చెప్పుకోదగ్గ సృష్టినే అనిపించింది. ఆ రాగరాగిణి ఆ సాయంకాల ఇంద్రజాలంతో ఎక్కడా ఏ తెంపూ లేకుండా, ఎంత సన్నిహితంగా సమ్మిళితమైపోయింది? నా హృదయం నిండిపోయింది. నేను నావ దగ్గరకి చేరుకోగానే మళ్ళా చాలా కాలం తర్వాత హార్మోనియం చేతుల్లోకి తీసుకున్నాను. నేను కొత్తగా కట్టిన పాటల్ని ఒక్కొక్కటే మంద్రశ్రుతిలో పాడుకుంటో ఉండిపోయేను. మళ్ళా కొత్త పాటలు కట్టాలని ఎంతగా అనిపించిందో-
చంద్రనాగూరు దగ్గర గంగానది ఒడ్డున గడిపిన రోజుల గురించి టాగోర్ తన జీవనస్మృతిలో రాసుకున్న వాక్యాలు:
ఓ మళ్ళా గంగానది!మళ్ళా ఆ అనిర్వచనీయాలైన ఆ రాత్రులు, ఆ సంతోషపు బడలిక, ఆ తృష్ణామయ వ్యాకులత, అటూ ఇటూ పచ్చని చెట్లు పరిచిన చల్లని నీడల తీరాల మధ్య ఒరుసుకుంటూ ప్రవహించే నది వినిపించే లో గొంతు కేరింత. ఆకలిగొన్నవాళ్ళకి దప్పిగొన్నవాళ్ళకి అన్నపానీయాల్లాగా బెంగాల్లోని ఈ ప్రాంతమంతా ఆకాశం నిండా పరుచుకునే ఈ ధారాళమైన వెలుతురు, ఈ దక్షిణమారుతం, ఈ నదీప్రవాహం, ఈ సోమరిసంతోషం, దిగంతం నుంచి దిగంతం దాకా , ఆకుపచ్చని నేలమీంచి నీలాల నింగిదాకా అల్లుకున్న విస్తారమైన తీరిక నాకు కనిపించాయి. ఇదే నా ఇల్లనిపించింది. ఇక్కడే నాకు మా అమ్మ లాలింపు అనుభవంలోకి వచ్చింది.
పవిత్రభాగీరథిలో తేలియాడుతూ పోయే తామరపూలచెండుల్లాగా ఆ నది ఒడ్డున నా రోజులు అత్యంత ప్రేమాస్పదాలుగా గడిచిపోయేయి. కొన్ని వానాకాలపు అపరాహ్ణాల్లో ప్రాచీన వైష్ణవ గీతాలు పాడుకుంటో నిజంగానే ఒక ఉన్మత్తతలో గడిపేవాణ్ణి. నా హార్మోనియం మీద ఆ గీతాలకు నా అంతట నేనే రాగాలు కూర్చుకునేవాణ్ణి. మరికొన్ని మధ్యాహ్నాలు నది మీద నావలో కూచుని నేను పాటలు పాడుకుంటూ ఉంటే పక్కన మా అన్నయ్య జ్యోతిరింద్ర తన వయొలిన్ మీద సంగీతం సమకూరుస్తుండేవాడు. ఇక ఆ దినాంతవేళ దాకా మేము పూర్వీ రాగం తో మొదలుపెట్టి రాగం వెనక రాగం పాడుకుంటూ పొయ్యేవాళ్ళం. ఇక బేహాగ్ రాగానికి వచ్చేటప్పటికి ఆకాశం తన బంగారు బొమ్మల కార్ఖానా తలుపులు మూసేస్తుండేది. చెట్లవరసల జాలీమీంచి చంద్రుడు తూర్పుదిక్కున ఉదయిస్తోండేవాడు.
అప్పుడు మేం పడవ వెనక్కి నడుపుకుంటూ మా విల్లా మెట్లదగ్గరికి చేరుకునేవాళ్ళం. మా ఇంటిమీడ మేడమీద నదీదృశ్యం కనిపించేట్లు ఒక పరుపు పరుచుకుని కూచునేవాళ్ళం. అప్పటికి నేలమీదా, నీళ్ళమీదా కూడా ఒక వెండిరంగు ప్రశాంతి పరుచుకుని ఉండేది. పడవలు తిరగడం ఆగిపోయేది. నది ఒడ్డున చెట్ల అల్లిక చిక్కని నీడగా మిగిలిపోయేది. మెత్తగా ప్రవహించే నదిమీద వెన్నెల తళుకులీనుతుండేది.
కలకత్తాలో సుద్దర్ వీథిలో తనకి కలిగిన దర్శనం గురించి చెప్పుకున్న మాటలు:
అలా నది ఒడ్డున కొంతకాలం గడిపేక మా అన్నయ్య జ్యోతిరింద్ర కలకత్తాలో సుద్దర్ వీథిలో ఒక ఇల్లు తీసుకున్నాడు. నేను కూడా అతడిదగ్గరే ఉండిపోయాను. అక్కడ నా సంధ్యాసంగీత్ గీతాలూ, నవల రాసుకుంటూ ఉండగా, నా జీవితంలో ఒక మహత్వపూర్ణ విప్లవం లాంటిది సంభవించింది.
ఒక రోజు, అపరాహ్ణానికీ, దినాంతానికీ మధ్య సమయంలో, నేను జొరసొంకొ ఇంటి మేడమీద పచార్లు చేస్తూ ఉన్నాను. అప్పుడు పలచని సంధ్యకాంతితో కలిసి అస్తమిత సూర్యకాంతి ఆ సాయంసంధ్యను ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా నా కళ్ళముందు సాక్షాత్కరింపచేసింది. చివరికి ఆ వెలుగులో పక్కింటిగోడలు కూడా అత్యంత సుందరంగా కనిపించడం మొదలుపెట్టాయి. రోజువారీ జీవితాన్ని తన అత్యంత అప్రధానమైన స్థితిలోంచి పైకి లేపి నా ముందు రూపుకట్టిస్తున్న ఈ ఇంద్రజాలం కేవలం సంధ్యకాంతిదేనా? కానేకాదు!
అది నిజానికి నాలోపల ఆవిష్కారమైన సాయంసంధ్య కాంతి ప్రభావమని నేను చప్పున గుర్తుపట్టగలిగాను. ఆ కాంతి తన నీడలో నాలోని నేనుని కప్పేసింది. నా లోని నేను ఆ దినమంతా దీప్తిమంతంగా వెలుగూ ఉందనీ, అప్పటిదాకా నేనేది చూసినా అదంతా ఆ వెలుగులో కలిసిపోతూ, మరుగునపడుతూ వచ్చింది. కాని ఇప్పుడు ఆ నాలోని నేను పక్కకి తప్పుకోగానే నేను ప్రపంచాన్ని దాని యథార్థస్వరూపంలో చూడగలిగేను. ఆ దృశ్యంలో అల్పమైందంటూ ఏమీ మిగల్లేదు. అక్కడ అపారమైన సౌందర్యం, సంతోషం పొంగిపొర్లుతూ ఉన్నాయి.
అలా అనుభవమైనప్పణ్ణుంచీ నేను ఉద్దేశ్యపూర్వకంగా నాలోని నన్ను అణచిపెట్టి, ప్రపంచాన్ని కేవలం ఒక సాక్షిగా దర్శించడం సాధనచేసాను. దాంతో నాకొక ప్రత్యేకమైన సంతోషం దక్కడం మొదలయ్యింది. ..అప్పుడు నాకు మరొక అంతర్దృష్టి సంభవించింది. ఆ దర్శనం నా జీవితం పొడుగునా నాలో నిలిచే ఉంది.
సుద్దర్ వీథిలో మా ఇంట్లోంచి చూస్తే ఆ వీథి చివరా, అక్కడ ఎదురుగా ఉండే ఫ్రీ స్కూల్ గ్రౌండ్సులో ఉండే చెట్లూ కనిపిస్తుండేవి. ఒకరోజు పొద్దున్నే నను వరండాలో నుంచొని అటువైపు చూస్తూ ఉన్నాను. ఆ చెట్ల కొమ్మల మీంచి సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. నేనట్లా చూస్తూ ఉండగా, హటాత్తుగా, నా కళ్ళమీద అంతదాకా కమ్ముకున్న మసక ఒకటి జారిపోయినట్టనిపించింది. ప్రపంచమంతా ఒక అద్భుతమైన ప్రకాశంలో స్నాన మాడుతున్నట్టుగా, అన్ని దిక్కులనుంచీ సంతోష తరంగాలూ, సౌందర్య తరంగాలూ ఎగిసిపడుతున్నట్టుగా అనిపించింది. అంతదాకా ఎంతో కాలంగా నా హృదయమ్మీద అట్టకట్టుకుపోయిన శోక విషణ్ణతల్ని చీల్చుకుని ఆ సర్వవ్యాప్త కాంతిధార పొంగిపొర్లినట్టుగా అనిపించింది.
ఆ రోజే The Awakening of the Waterfall కవిత ఒక జలపాతంలాగా దూసుకొచ్చింది. ఆ కవిత పలకడమైతే పూర్తయిందిగాని, చుట్టూ ఉన్న ప్రపంచంలో నాకు గోచరిస్తున్న ఆనందతరంగంపైన యవనిక పడలేదు. ఆ క్షణాన నాకు ఈ ప్రపంచంలోని ఏ ఒక్క మనిషిగాని, ఏ ఒక్క సంగతిగాని అల్పమని అనిపించలేదు.
Featured image: River padma, pc: Wikimedia commons
21-3-2025