రసవితరణ

పగలంతా ఒక ప్రపంచం. ఎండ, దుమ్ము
హారన్లు, పెట్రోలు, పొగ, పరుగులుపెట్టే రోడ్లు-
రాత్రయ్యాక, నెమ్మదిగా లోకం సద్దుమణిగాక
తీపిగాలుల రెక్కల మీద పాటలు దిగివస్తాయి.

ఆ గానంలో నాకూ గొంతుకలపాలని ఉంటుంది
కాని మాటలు పెగలవు, ఏం చేస్తే నేనొక సునాద
సుగంధాన్ని కాగలనో తెలీదు. అయినా ప్రతి రాత్రీ
నాకు తెలిసిన ప్రతి పూర్వకవినీ ప్రార్థిస్తోనే ఉన్నాను.

ఇది నా అవస్థ. కాని రెండు ప్రపంచాల మధ్య
నిలబెట్టిన అత్తరుకలశంలాగా నిండుకానుగచెట్టు.
నీళ్ళు నింపిన కొత్తకుండ నిలువెల్లా ఊటలూరినట్టు
ప్రతికొమ్మలోంచీ పరిమళం పొంగిపొర్లుతుంది.

వెలుగులు పువ్వులుగా, నీడలు పత్రాలుగా రెండు
ప్రపంచాల్ని ఒక్క ప్రపంచంగా మార్చుకునే తావు-
రాత్రింబవళ్ళు నడిచే రసవితరణ- ఇక్కడ నువ్వొక
చీమవి కాగలిగినా ఒక చక్కెర బిడారు చిక్కుతుంది.

22-3-2025

16 Replies to “రసవితరణ”

  1. నీళ్ళు నింపిన కొత్తకుండ నిలువెల్లా ఊటలూరినట్టు🙏

  2. అయ్యా మీ రస వితరణ సునాద సుగంధం లాగ వున్నది ఈ ఆదివారం ఉదయాన్ని పరిమళం గా మార్చినారు ధన్యవాదాలు

  3. చక్కెర బిడారు రోజూ దొరుకుతూనే ఉంది. అనుభూతుల వితరణకు ఆప్యాయ అభినందన 💚🌳

  4. మీ ఆ నీటి రంగుల చిత్రం చూస్తూనే ఆ కానుగ చెట్టు చేసుకున్న అలంకరణ కన్నుల ముందు సాక్షాత్కరించింది.
    కవిత చదువుతుంటే మనసెంతో ఆహ్లాదపడింది. ధన్యవాదాలు.

  5. కవిత కోసం వచ్చి బొమ్మలు రెండూ చూసి…వాటిలో నుండి చిప్పిలుతున్న కాంతి చూసి…కొంత బలం కొసరుకుని వెళ్తున్నాను.

    Thank you for maintaining this blog so well. ❤️

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%