ఈశ్వర స్తుతిగీతాలు-2

ఈశ్వర స్తుతిగీతాలుగా నేను అనువదించిన ఈ స్తోత్రాలకు, విన్నపాలకు ప్రత్యేకంగా ఎటువంటి వ్యాఖ్యానం అవసరంలేదనుకున్నాను. అందుకని ఆ గీతాల్ని సరళవచనంలో నేరుగా అనువదించాను. అయితే, ఈ గీతాల నేపథ్యం గురించి మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటే మీరు వీటిని ఎక్కువ ఆస్వాదించగలరు అనిపించింది.

Psalms బైబిల్లో పాతనిబంధనలో ఒక అధ్యాయం. ఆ పదానికి అర్థం స్తోత్రములు అని. జయగీతాలు అని కూడా అనవచ్చు. మొత్తం 150 గీతాలు అవి. వాటిలో స్తుతులున్నాయి, నతులున్నాయి, ఆత్మ విశ్వాస గీతాలున్నాయి, ధన్యవాద సమర్పణలున్నాయి, నిరసనలున్నాయి, విలాపాలున్నాయి. ప్రపంచమంతా భగవద్భక్తులు ఎన్ని మానసిక అవస్థలకు లోనవుతూ కవిత్వం చెప్పారో ఆ అవస్థలన్నీ ఆ గీతాల్లో కనవస్తాయి. ఆ గీతాల్ని చదువుతున్నప్పుడు మనకి టాగోర్‌ గీతాంజలి గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి టాగోర్‌ తన బెంగాలీ గీతాల్ని ఇంగ్లిషు వచనంలోకి అనుసృజించి వెలువరించి నప్పుడు పాశ్చాత్యపాఠకులకి అవి మరో రూపంలో Psalms లాగే అనిపించాయి.

యుగయుగాలుగా Psalms మానవాళిని ఏ విధంగా ప్రభావితం చేస్తూ వచ్చాయో Rowland E. Prothero అనే పండితుడు The Psalms in Human Life (1903) అనే ఒక అద్భుతమైన గ్రంథం రాసాడు. అందులో ఆయన రాసిన మొదటి అధ్యాయం మొత్తాన్ని యథాతథంగా అనువదించి మీతో పంచుకోవాలన్న కోరికని ఎలానో అణచుకుంటూ ఇప్పటికి ఈ వాక్యాలు మీముందుంచుతున్నాను. ఆయన తన రచనమొదలుపెడుతూనే ఇలా అంటున్నాడు:

రబ్బీయ సంప్రదాయంలో చెప్పుకునేదాని ప్రకారం దావీదు శయ్యపైన ఒక తంత్రీవాద్యం వేలాడుతూ ఉండేదట. అర్థరాత్రి పూట ఒక మందపవనం వీచినప్పుడల్లా ఆ తంత్రుల పైన సంగీతపు తరగలు రేగేవట. ఆ కవిరాజు తన నిద్రపక్కనపెట్టి శయ్యమీంచి లేచి ప్రాచీదిశన ప్రత్యూషకాంతులు పరుచుకునేదాకా ఆ తంత్రీస్వనాలకు పదాలు కూర్చుకుంటూ గడిపేవాడట. ఆ సంప్రదాయంలో వికసించిన కవిత్వం మొత్తాన్ని ఒకే ఒక్క వాక్యానికి కుదించి ఏం చెప్తారంటే, పాతనిబంధనలోని కీర్తనల్లో, మానవుడి హృదయం మీద మన సృష్టికర్త స్వరపరిచిన సమస్త సంగీతమూ వినిపిస్తుందని. మానవుడి కోమల గీతికాగానం, అతడి అనుతాప విలాపం, అతడి విషాదసంగీతం, అతడి విజయదుందుభిస్వనం, అతడి పరాజయ నిర్వేదం, అచంచలమైన అతడి ఆత్మవిశ్వాసపు నిబ్బరం, తనకొక ఆసరాదొరికిందన్న నిశ్చింతలోని పారవశ్యం ఆ గీతాల్లో పోగుపడ్డాయి. అందులో మానవాత్మ తాలూకు సమస్త దేహాంగ విభజనా మనకి గోచరిస్తుంది. హైన్రిక్ హైనీ అన్నట్లుగా ఆ గీతాల్లో ‘సూర్యోదయం, సూర్యాస్తమయం, జన్మ, మృత్యువు, వాగ్దానం, సాఫల్యం- మొత్తం మానవాళి జీవనరూపకమంతా’ ఒక్కచోటకు చేరుకున్నాయి.

ఆయన ఇంకా ఇలా రాస్తున్నాడు:

ఎన్నటికీ వెలిసిపోని రంగుల్లో మానవుడి నైతిక సంగ్రామం ఎల్లకాలానికీ కూడా కీర్తనల్లో చిత్రితమైంది. ఆ యుద్ధంలో మానవుడు బెంబేలు పడుతూ ఉండవచ్చుగానీ, పూర్తిగా పరాజితుడు కావడంలేదు, అతడు తన స్వభావంలోని అత్యున్నత, శ్రేష్ట శిఖరాలకు చేరుకోడానికి సదా నలుగులాట పడుతూనే ఉన్నాడు, ప్రతిసారీ కించిత్ దూరంలో తన ప్రయత్నం తప్పిపోతుండగా, తన ఆశయానికీ, తన లక్ష్యప్రాప్తికీ మధ్య ఎంత అగాధమున్నదో గ్రహిస్తూనే ఉన్నాడు. మనకి ఆ కీర్తనల్లో వినిపించేది ఏదోను ఉద్యానంలో మనిషికీ, దైవానికీ మధ్య నడిచిన అమాయికమైన సంభాషణ కాదు. ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయి ఉంటే మన పతితస్వభావాలకు ఆ కీర్తనలు విలువైనవిగా తోచి ఉండేవేకావు. దానికి బదులు తన అపరాధస్వభావం పట్ల లోతైన ఎరుక కలిగిన ఆత్మ సిగ్గుతో, అనుతాపంతో, ఆశతో తడబడుతూ, తొట్రుపడుతూ, భగవంతుడితో తన వ్యక్తిగత సంభాషణను కొనసాగించడానికి తాపత్రయపడటం కనిపిస్తుంది. కీర్తనలు దేవుడితో ముఖాముఖి, భావంతో భావం, హృదయంతో హృదయం నిరంతరం చేసే సంవాదాలు. ఇక్కడ కూడగట్టినవి ఒక మతం తాలూకు ప్రాథమిక నిబంధనలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవననియమాలు మాత్రమే కాదు, ఇవి నిత్యసాధన సూత్రాలు, భక్తిసారాంశవచనాలు, ప్రార్థన, ఈశ్వరస్తుతులతో కూడుకున్న నిర్దేశసూత్రాలు. మీదుమిక్కిలి ఈ ఆరాటమంతా సుసంపన్నమైన కావ్యభాషలో, కావ్యసత్యంతో శోభిస్తూ ఉండటం మనం గమనించాలి.

ఆయన రాసిన ఈ వాక్యాలు కూడా మీతో పంచుకోనివ్వండి. ఇలా అంటున్నాడు ఆయన.

ప్రతి మనిషీ తన ఆత్మసంచలనాన్ని పరికించుకోడానికి కీర్తనలు అద్దం పడతాయి. చింతనశీలమైన ప్రతి ఒక్క మానవహృదయమూ తనకు రక్షకుడిగా, సంరక్షకుడిగా, స్నేహితుడిగా ఉండే ఒక అత్యున్నత భగవత్ స్నేహంకోసం, ప్రేమకోసం, శాశ్వత సన్నిధికోసం తపించే అనుబంధాన్ని ఈ కీర్తనలు ఒక దివ్యపరిభాషలో ప్రకటిస్తున్నాయి. అవి పలుకుతున్నవి సాధారణ  అనుభవాల్నే, మనకి సుపరిచితమైన ఆలోచనల్నే. కానీ ఈ సాధారణ సామగ్రికే అవి ఒక అసాధారణమైన విస్తృతిని, ఒక సాంద్రతని, ఒక లోతుని, ఒక ఉన్నతిని సమకూర్చుకుంటున్నాయి. అత్యంతప్రతిభావంతులు కూడా అందుకోలేని ఎత్తులకు అవి చేరుకోగలుగుతున్నాయి. మహోదారమైన గొప్ప ప్రజ్ఞాళువు ఆత్మవిచారాన్ని అవి మాటల్లోకి అనువదిస్తున్నాయి. సత్యం నుంచీ, సారళ్యం నుంచీ పుట్టిన సౌందర్యాన్నీ, అనుభూతికీ, అభివ్యక్తికీ మధ్య కుదిరిన చక్కని సమతూకాన్నీ, నిరక్షరాస్యులైన రైతుల మూగ ఆవేదననీ, వినయసౌశీల్యాన్నీ అవి ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టే ప్రతి ఒక్క దేశంలోనూ ఆయాజాతుల దైనందిన జీవితంలో కీర్తనలు ఒక అంతర్భాగమైపోయాయి. వాళ్ల సామెతల్లోకి అవి చొచ్చుకుపోయాయి, వాళ్ళ సంభాషణల్లో కలగలిసిపోయాయి, వారి అస్తిత్వపు ప్రతి కీలక సందర్భంలోనూ అవి వినియోగానికి వస్తూనే ఉన్నాయి.

ఇంకా ఇలా రాస్తున్నాడు:

కీర్తనల సమక్షంలోనే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, కీర్తనల సమక్షంలోనే అంత్యక్రియలు జరుగుతున్నాయి. కీర్తనల ఆసరాతోనే మనం మన పార్థివ అసిత్వం తాలూకు పరమార్థాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నాం. మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ, ఈ గ్రంథంలోని చిరపరిచిత పదజాలం ప్రతి సారీ ఎంత నిత్యనూతన శక్తితో మనకి కొత్త అర్థాలు స్ఫురింపచేస్తూ ఉన్నదని!

ఇటువంటి ప్రభావం యుగయుగాలుగా క్రైస్తవ సాధువుల పైనా, సాధకుల పైనా, చర్చిపైనా, రచయితల పైనా ఏ విధంగా ఉంటున్నదో ఈ పండితుడు చాలా విపులంగా తన పుస్తకంలో చర్చించాడు. అగస్టయిన్ సాధువు Confessions లో, థామస్.ఎ.కెంపిస్ Imitation of Christ లో, జాన్ బన్యన్  Grace Abounding లో, బిషప్ ఆండ్రూస్ Devotions లో, బ్లెయిజి పాస్కల్  Pensées లో కీర్తనల స్ఫూర్తి ఎలా ప్రవహిస్తూ ఉన్నదో ఆయన ఎంతో విశదంగా నిరూపించాడు. ఈ పేర్లు మనకి బాగా తెలిసినవి. మనకి అంతగా తెలియని మరెన్నో అసంఖ్యాకమైన ఉదాహరణల్ని ప్రస్తావిస్తూ ఆయనిలా అంటున్నాడు:

ఆ విధంగా కీర్తనల అధ్యాయంలో అమరవీరుల నెత్తుటిమరకలతో చివికిపోయిన పుటలున్నాయి. సాధువుల కన్నీళ్ళతో తడిసిపోయిన పుటలున్నాయి. భయం మీదా, ప్రలోభం మీదా దుర్బల మానవాళి సాధించిన విజయాల వెలుగులున్నాయి. ఒక వీరోచిత ప్రకాశంతో, మానవాతీత సాహసంతో మెరిసిపోయే పుటలు కూడా ఉన్నాయి. చిరపరిచితమైన ఆ పంక్తులపైన హృదయాన్నుప్పొంగించే ఆధ్యాత్మిక సాహసగాథల్నీ, హృదయవిదారకమైన విషాదగాథల్నీ కూడా  తిరిగితిరిగి రాసిన ఆనవాళ్ళున్నాయి.

Psalms గా ఇంగ్లిషు బైబిలు పేర్కొన్న ఈ కవితల్ని తెలుగు బైబిలు ‘కీర్తనలు’ అని అనువదించింది. వీటి హీబ్రూ మూలపదం mizmor అంటే గీతం లేదా గేయమని అర్థం. దాని మరో పదం ehilim అంటే అర్థం స్తోత్రం అని. స్తోత్రంగానూ, గీతంగానూ కూడా వీటికి సంగీత సహకారం ఉండితీరాలన్న సూచనలేదు. కాని ఇవి మతపరమైన క్రతువుల్లో హవిస్సులు అర్పిస్తూ పలికే సూక్తాలకన్నా భిన్నమైనవి అని మాత్రం అర్థం చేసుకోవలసి ఉంటుంది.

నూట యాభై సామగీతాల్నీ అయిదు విభాగాలుగా పరిగణించడం పరిపాటి. 1 నుంచి 41 దాకా మొదటి భాగం, 42 నుంచి 72 దాకా రెండవ భాగం, 73 నుంచి 89 దాకా మొదటిభాగం, 90 నుంచి 106 నాలుగవ భాగం, 107 నుంచి 150 దాకా అయిదవభాగం.

పాతనిబంధనలోని మొదటి గ్రంథాలు-జెనిసిస్‌, ఎకోసడస్‌, లెవిక్టస్‌, నంబర్స్‌, డ్యుటిరానమీ -అయిదింటినీ కలిపి పెంటచూక్‌ అని వ్యవహరిస్తారు. వీటిని ‘తోరా’ అని కూడా పిలుస్తారు. తోరా అంటే దైవశాసనం అని అర్థం. ఈ అయిదు గ్రంథాల్నీ మోషే తాలూకు అయిదు పుస్తకాలుగా కూడా పిలుస్తారు. ఇవి యూదులకు నిత్యపారాయణ గ్రంథాలు. Psalms లోని అయిదు భాగాలూ ఈ అయిదు గ్రంథాల సారాంశాన్నీ ప్రతిబింబిస్తాయని నమ్మకం. అందువల్ల సామగీతాల్ని తోరా సంగ్రహంగా పరిగణిస్తుంటారు కూడా.

అయితే కీర్తనల్ని ఇలా అయిదుభాగాలుగా విభజించి వాటిని పాతనిబంధనలోని మోషే గ్రంథాలు అయిదింటికీ సంగ్రహంగా పేర్కొనే విభజనని ఇప్పుడు చాలామంది పండితులు అంగీకరించడంలేదు. అవన్నీ ఏకకాలంలో ఏక కర్తృత్వంతో వెలువడ్డవి అని కూడా పండితులు భావించడంలేదు.

ఈ అంశం మీద ఇంతదాకా వచ్చిన పరిశోధనల్నీ, పరిశీలనల్నీ సమగ్రంగా సమీక్షిస్తూ J.Day అనే పండితుడు Psalms (1990) అనే  పుస్తకం రాసాడు. అందులో ఆయన చెప్పినదాన్నిబట్టి కీర్తనల్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. వాటిలో స్థూలంగా 42-83 దాకా కీర్తనల్ని అత్యంత పురాతనమైన ప్రార్థనలుగా చెప్పవచ్చంటాడు. వాటిని Elohistic Psalter అంటాడు. హీబ్రూలో Elohim అంటే దేవుడు అని అర్థం. కాగా తక్కిన కీర్తనల్లో అంటే 1-41, 84-150 కీర్తనల్లో Elohim అనే పదానికి బదులు Yahweh అనే పదం ప్రధానంగా కనిపిస్తుంది. యెహోవా అంటే ప్రభువు అని అర్థం. భగవంతుడు ప్రభువుగా, రాజుగా, రాజాధిరాజుగా, రక్షకుడిగా, సంరక్షుడిగా మారిన పరిణామం 1-41, 84-150 కీర్తనల్లో కనిపిస్తుంది. అలాగని ఈ మూడు విభాగాలూ కూడా విడివిడి విభాగాలుగా ఉండేవనీ, కాలక్రమంలో అవి ఒక గ్రంథంగా సంకలనమయ్యాయనీ కూడా అనుకోలేమని చెప్తాడు. ఒక పరిశీలన ప్రకారం మొదటి రెండు భాగాలూ అంటే 1-41, 42-72 ఒక పుస్తకంగానూ, తక్కిన మూడు భాగాలూ ఒక పుస్తకంగానూ ఉండేవనీ, అవన్నీ కలిపి ఒక గ్రంథంగా రూపొందాయనీ కూడా అంటాడు.

కీర్తనల్లో వినిపించే ఆవేదన, ఆరాటం, ఆశాభావాల్ని బట్టి వాటిని యూదుల ప్రవాసకాలానికి ముందూ, ప్రవాస కాలం తర్వాతా ప్రభవించినవిగా చూస్తున్నారు. క్రీ.పూ. 586 లో బేబిలోనియన్ చక్రవర్తి నెబుకడ్ నజర్ యూదాపైన దండెత్తి సొలొమోను నిర్మించిన పవిత్రదేవాలయాన్ని నేలమట్టం చేసాడు. ఆ రోజుల్లో ఆ మహాసామ్రాజ్యాలు తాము జయించిన ప్రాంతాల పట్లా, జాతుల పట్లా ఒక అత్యంత అమానుషమైన పద్ధతిని అమలు చేసేవారు. దాని ప్రకారం తాము జయించిన జాతుల్లో ముఖ్యులైన నాయకుల్ని ఒక సమూహంగా నిర్బంధించి వారిని తమ రాజ్య పరిథిలోకి ప్రవాసులుగా తీసుకొచ్చేసేవారు. అలాగే వారి స్థానంలో ఆ ప్రాంతానికి చెందని పరాయి ప్రాంత ప్రజల్ని ప్రవాసానికి పంపేవారు. దానివల్ల ఆ జాతుల సంస్కృతి, సంప్రదాయం, ఆత్మస్థైర్యం మొత్తం నాశనమైపోయేవి. నెబుకడ్ నజర్ కూడా యూదానుంచి ఎందరో యూదుల్ని ఆ విధంగా బేబిలోన్ కి ప్రవాసితులుగా తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత క్రీ.పూ. 538 లో బేబిలోన్ ని జయించిన పర్షియన్ చక్రవర్తి డరయిస్  ఆ యూదులు తిరిగి తమ స్వదేశానికి వెళ్ళడానికి అనుమతించాడు. అలా ప్రవాసానికి వెళ్ళిన యూదులు మరొక అర్థ శతాబ్దం తర్వాత గానీ తమ ప్రాంతానికి తిరిగి చేరుకోలేకపోయారు. కీర్తనల్లో ఈ రెండు దశలూ మనకి వినిపిస్తాయి. ఉదాహరణకి,  ఈ చరిత్ర ఏమీ తెలియకపోయినా కూడా, సుప్రసిద్ధమైన కీర్తన 137 యుదూల ప్రవాసదుఃఖాన్ని వినిపిస్తున్నదే అని మనం పోల్చుకోగలుగుతాం.

మధ్యప్రాచ్యానికి చెందిన ప్రాచీన సాహిత్యం గురించీ, చరిత్ర గురించీ మరిన్ని పరిశోధనలు వెలువడుతున్నకొద్దీ, కీర్తనల గురించిన అవగాహన కూడా విస్తృతమవుతూ వస్తున్నది. ఉదాహరణకి కీర్తనల్లోని అత్యంత ప్రాచీన మైన కీర్తనలకి ఈజిప్షియన్ స్తోత్రాలు నమూనాగా ఉన్నాయనేది అటువంటి ఒక పరిశీలన. ముఖ్యంగా 104 వ కీర్తన అఖ్నేతాన్ ఫారో రాసిన ఒక స్తోత్రాన్ని దాదాపుగా తిరిగి రాసిన కీర్తన కావడం. క్రీ.పూ. పధ్నాలుగవ శతాబ్దంలో అఖ్నేతాన్ ఏకేశ్వరోపాసనతో ఈజిప్టులో ఒక విధమైన విప్లవాన్ని తీసుకొచ్చాడు. కాని అది అతడితోటే అంతమైపోయింది. తన ఏకేశ్వరూపాసనలో అతడు సూర్య మండలాన్ని స్తుతిస్తూ రాసిన స్తోత్రాన్ని నమూనగా తీసుకున్న 104 వ కీర్తన చదువుతుంటే మనకి ఋగ్వేదంలోని విష్ణుసూక్తం గుర్తురావడంలో ఆశ్చర్యం లేదు.


ఆశీర్వదించు ప్రభూ

ఆశీర్వదించు ప్రభూ నా ఆత్మని! ఓ ప్రభూ, నా ప్రభూ, నువ్వు మహోన్నతుడివి, యశస్సునీ, వైభవాన్నీ వస్త్రాలుగా ధరించినవాడివి.

కాంతిప్రకాశాన్ని ఒక పీతాంబరంగా ధరించావు, నువ్వు స్వర్గసీమని ఒక తెరగా పరిచిపెట్టావు.

ఆయన తన సౌధోపరిభాగపు దూలాల్ని నీళ్ళమీద నిలబెట్టాడు, మేఘమండలాన్ని సృష్టించాడు, ఆయన రథం గాలిరెక్కలతో పయనిస్తుంది.

ఆయన తేజస్సుతో దేవదూతల్ని రూపొందిస్తాడు, అగ్నికీలల్తో అనుచరగణాలకి ప్రాణంపోస్తాడు.

భూమికి నువ్వెలాంటి పునాదులు వేసావంటే అదెప్పటికీ ఇక చెక్కుచెదరక నిశ్చలంగా నిలబడుతుంది.

నువ్వు దాని అధోభాగాన్ని ఒక వస్త్రంతో కప్పి వుంచావు, పర్వతశిఖరాల పైన జలాల్ని ప్రవహింపచేసావు.

నువ్వు మందలించగానే అవి పరుగులుతీసాయి, ఉరుములాంటి నీ కంఠధ్వని వినబడగానే అవి దూరంగా తప్పుకుపోయేయి.

అవి పర్వతాలమీదకి ప్రసరించేయి, లోయల్లోకి ప్రవహించేయి, నువ్వు వాటిని ప్రతిష్టించిన స్థానంలో అవి కుదురుకున్నాయి.

అవి మరింత పొంగిపొర్లకుండా, తిరిగి అవి భూమిని ఆక్రమించకుండా నువ్వు వాటికొక హద్దు నిర్ణయించావు.

ఆయన జలపాతాల్ని లోయల్లోకి ప్రసరింపచేసాడు.  అవి కొండలమధ్య ప్రవహించేట్టు చేసాడు.

పొలాల్లో ప్రతి ఒక్క పశువుకీ అవి దప్పి తీరుస్తాయి, వన్యమృగాలు అక్కడ తమ దప్పిక తీర్చుకుంటాయి.

వాటివల్ల పక్షులు స్వర్గలోకాన్ని తమ నివాసంగా మార్చుకున్నాయి, ఆ కొమ్మలమీద అవి గానం చేస్తాయి.

ఆయన తన సౌధోపరితలం మీంచి పర్వతాలకు నీళ్ళు పోస్తాడు, నీ మహిమలవల్ల భూమి తృప్తి చెందుతుంది.

గోవులకోసం పచ్చిక మొలిపిస్తాడాయన, పుడమి నుంచి మనిషి అన్నం పుట్టించడం కోసం ఆయన సస్యాల్ని వికసింపచేస్తాడు.

మనిషి మనసును ఉల్లాసపరిచే మధువుని, మనిషి వదనానికి నిగారింపును చేకూర్చే తైలాల్ని, మనిషి హృదయాన్ని బలోపేతం చేసే అనుదిన ఆహారాన్ని అందిస్తాడు.

దేవుడు సృష్టించిన సమస్త వృక్షాల్లో పోషకరసం పొంగిపొర్లుతుంది. లెబనాన్ దేశపు దేవదారు వృక్షాలు ఆయన నాటినవే.

ఆ చెట్లమీదనే పక్షులు గూడుకట్టుకునేది, ఆ పాలచెట్లనే సారసపక్షులు ఆశ్రయించేది.

ఆ ఎత్తైన కొండలు అడవిమేకల ఆటపట్లు, ఆ కొండకొమ్ములు వన్యమృగాలకు ఆశ్రయాలు.

ఋతువులకోసమే ఆయన చంద్రుణ్ణి నియమించాడు, సూర్యుడికి తాను అస్తమిస్తానన్న జ్ఞానం కలిగించాడు.

నువ్వు అంధకారాన్ని సృష్టించావు, రాత్రికాగానే అడవిజంతువులన్నీ బయటకి అడుగుపెడతాయి.

యువసింహాలు తాము వేటాడబోయే జంతువుల్ని చూసి గర్జిస్తాయి, తమ ఆహారాన్ని అవి భగవంతుడినుంచే స్వీకరిస్తాయి.

సూర్యోదయం కాగానే అవి మళ్ళా ఒకచోట చేరి గుహల్లో విశ్రమిస్తాయి.

మనిషి తన పనుల్లోకి పోయి సాయంకాలందాకా శ్రమిస్తాడు.

ప్రభూ, నీ మహిమలు పరిపరివిధాలు! నీ చేతలన్నీ నీ వివేకసముత్పన్నాలు. పృథ్వి సమస్తం నీ భాండాగారం-

ఈ మహోదధి ఉందే, దీనిలో అసంఖ్యాకంగా పుష్కళంగా పొంగిపొర్లుతున్నవెన్నో. చిన్నవీ, పెద్దవీ ప్రాణులెన్నో.

అదిగో అక్కడే నౌకలు తెరచాపలెత్తి పయనిస్తున్నవి, నువ్వు సృస్టించిన మహామత్య్సం అక్కడే క్రీడిస్తున్నది

ఇవన్నీ నీకోసం ఎదురుచూస్తున్నవి, వాటి వాటి కాలాల్లో వాటికి ఆహారాన్నందించేది నువ్వే అని వాటికి తెలుసు.

నువ్వేది ప్రసాదిస్తే వాటిని అవి పోగుచేసుకుంటాయి, నువ్వు నీ వరదహస్తం చాచగానే వాటికి శుభాలు సంప్రాప్తిస్తాయి.

నువ్వు వాటినుంచి నిన్ను మరుగుపరుచుకుంటావు, అవి అల్లల్లాడిపోతాయి, నువ్వు వాటి ఊపిరి వెనక్కి లాక్కుంటావు, అవి మరణిస్తాయి, దుమ్ములో కలిసిపోతాయి.

నువ్వు గట్టిగా ఊపిరి పీలుస్తావు, అవి ప్రాణంపోసుకుంటాయి, నువ్వు మళ్ళా పుడమి రూపురేఖలు మార్చేస్తావు.

ప్రభు వైభవాతిశయం కలకాలం వర్ధిల్లుగాక! ప్రభువు తన సృజనసంతోషంలో మైమరచుగాక!

ఆయన పృథ్వి పై చూపుసారించగానే పుడమి వణికిపోతుంది. ఆయన పర్వతాల్ని స్పృశించగానే అవి పొగలు కక్కుతాయి.

నేను జీవించినంతకాలం ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాను. నా అసిత్వమున్నంతకాలం ప్రభువుని నుతిస్తూనే ఉంటాను.

ఆయన గురించిన నా తలపులు ఆయనకు మధురంగా తోచుగాక! ప్రభువులో నేను పరవశిస్తాను.

పాపులు ఈ పుడమినుంచి తుడిచిపెట్టుకునిపోదురుగాక! దుర్మార్గులకి ఈ భూమిపైన చోటులేకుండుగాక! కీర్తించు ప్రభువుని, ఓ నా మనసా, సంతోషంగా స్తుతించు ప్రభువుని.

6-10-2024

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%