యత్ర విశ్వం భవతి ఏక నీడమ్

A painting by Sanjiva Dev

తెనాలి వెళ్ళినప్పుడే తుమ్మపూడి కూడా వెళ్ళాను. పదేళ్ళ కిందట సంజీవ దేవ్ గారి శతజయంతి సభలో పాల్గోటానికి వెళ్ళినప్పుడు ఆ సమావేశం సంజీవ్ దేవ్ గారి ఇంటిదగ్గరలో ఉన్న తోటలో ఏర్పాటు చేసారు. ఆ హడావిడిలో ఆ ఇల్లు సరిగ్గా చూడటం కుదరలేదు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న పెయింటింగ్స్. సంజీవదేవ్ కొన్ని వందల చిత్రలేఖనాలు చిత్రించి ఉంటారుకాని అవేవీ సరిగ్గా భద్రపరచలేదు. నెట్ లో చూడండి, ఆయన పేరుమీద నాలుగైదు పెయింటింగ్స్ కన్నా ఎక్కువ కనిపించవు. ఆయన పుస్తకాలకి ముఖచిత్రాలుగా కనిపించేవి కూడా ఆ నాలుగైదు పెయింటింగ్సే. కాని ఆయన గీసిన చాలా బొమ్మలు, నేనప్పటిదాకా చూడనివెన్నో, ఆ రోజు తోటలో డిస్ ప్లే చేసారు. వాటిని తీరిగ్గా చూడటం పడలేదవాళ.

అందుకని మొన్న యడ్లపల్లి వెంకటేశ్వరరావుగారిని అడిగితే ఆయన సంజీవదేవ్ గారి అబ్బాయి జోగేంద్రకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నారు. తుమ్మపూడిలో ఆ కుటుంబానికి తెలిసినవాళ్ళ దగ్గర తాళాలున్నాయి. వాళ్ళు మేం వెళ్ళేటప్పటికి తలుపులు తెరిచి ఉంచారు.

భాద్రపద మాసపు చివరిదినాల వెలుతురు. తెనాలి నుంచి బకింగ్ హామ్ కాలవ పక్కగా దుగ్గిరాల దాటి తుమ్మపూడి వెళ్తుంటే ఆ దారి నాకు బాగా తెలిసి ఉన్నట్టు అనిపించడమే కాదు, అక్కడ దారిపొడుగునా నాక్కూడా ఎన్నో జ్ఞాపకాలున్నాయనిపించింది. తుమ్మపూడి నుంచి మట్టిబాట వెంబడి రాహుల్ సాంకృత్యాయన్ తో కలిసి సంజీవ దేవ్ బకింగ్ హాం కెనాల్ కి వచ్చి ఆ నీళ్ళల్లో ఈత కొడుతున్నప్పుడు నేను కూడా అక్కడున్నాననిపించింది. సంజీవ దేవ్ గారి ఆత్మకథనాత్మక రచనలు మూడూ- ‘తెగిన జ్ఞాపకాలు’, ‘గతంలోకి’,  ‘స్మృతిబింబాలు’ మొదటిసారి చదివినప్పుడు నా మనసు బహుశా చాలా తాజాగానూ, నిర్మలంగానూ ఉండిఉంటుంది. అందులో ఆయన రాసిన ప్రతి ఒక్క వాక్యమూ నా మనసుమీద అచ్చుపడిపోయింది.

రావెల సాంబశివరావు రాసిన ‘సంజీవదేవ్ జీవనరాగం’ (2012) పుస్తకానికి ముందుమాట రాస్తూ ఈ మాటే రాసాను. ‘కవులు పెద్దయ్యాక పరిచయమైన బాల్యమిత్రులు అన్నాడొక కవి గానీ, సంజీవదేవ్ నాకు బాల్యంలోనే పరిచయమైన పెద్దమిత్రుడు’ అని. ఎందుకనో తుమ్మపూడికి దగ్గరదగ్గరగానే తిరుగుతూ కూడా అయన బతికుండగా ఒక్కసారి కూడా ఆ ఇంట్లో అడుగుపెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు కూడా ఆ యింట్లో అడుగుపెట్టినప్పుడు ఆయన అక్కడలేడని అనిపించలేదు నాకు. ఒకటి, మొదణ్ణించీ ఆయన అపార్థివ సన్నిధితోటే నాకు స్నేహం ఉన్నందువల్లనా, రెండోది, మేము అక్కడికి వెళ్ళి, తిరిగి తెనాలి వచ్చేదాకా కూడా యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు సంజీవ దేవ్ గారి గురించిన తలపోతలతో నన్ను ముంచెత్తినందువల్లనా.

సంజీవ దేవ్ గారు ‘తెగిన జ్ఞాపకాలు’ రాసారు గాని, వెంకటేశ్వర రావుగారు సంజీవ్ దేవ్ గారి గురించి ‘తెగని జ్ఞాపకాలు’ అని ఒక పుస్తకం రాసారు. ఆయనకి సంజీవదేవ్ గారితో చాలా దగ్గరి పరిచయం ఉంది. అంతేవాసిత్వం అనవచ్చు. ఎన్నో విషయాలు మామూలుగా బయటికి వాళ్ళకి తెలియనివీ, సంజీవ దేవ్ గారు తన గురించి తాను రాసుకోడానికి సంకోచించేవీ కూడా వెంకటేశ్వర రావు గారి వల్ల నాలాంటివాళ్ళకు తెలిసాయి. ఆ ముచ్చట్లు ఎన్ని విన్నా తనివి తీరదు, ఇంకా ఇంకా అని అడుగుతూనే ఉండాలనిపిస్తుంది.

ఉదాహరణకి ఆయన రాసిన ఒక సంఘటన చెప్తాను. ఒకసారి సంజీవదేవ్ గారు, సులోచనగారూ ఎక్కడో బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళి తిరిగి రైల్లో తెనాలి వచ్చారు. అక్కణ్ణుంచి తుమ్మపూడి వచ్చారు. ఒక దొంగ వాళ్ళని రైల్లో చూసాడు. పెళ్ళికి వెళ్ళివస్తున్నందువల్ల సులోచనగారి వంటిమీద నగలుండటం చూసాడు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళనే వెంబడించాడు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక అతడు ఆ ఇంట్లో జొరబడి ఆ నగలు పట్టుకుని పారిపోయాడు. తెల్లవారేక నగలు పోయేయని తెలిసాక, దొంగ ఎంత లాఘవంగా తమని అనుసరించి తమ కన్నుగప్పేడు అని సంజీవదేవ్ గారు, చారుదత్తుడిలాగా, ఆశ్చర్యపోయేరు. ‘ఇదీ ఒకందుకు మంచిదే, ఇంక నగలు పోతాయన్న భయం ఉండదు’ అన్నారట సులోచనగారితో. కథ అక్కడితో అయిపోలేదు. సహజంగానే పోలీసు కేసు పెట్టారు. కొన్ని నెలల తరువాత పోలీసులు ఆ బంగారం మాజిస్ట్రేటు ముందు హాజరుపరుస్తున్నామనీ, సంజీవ దేవ్ గారు వచ్చి అది తమదే అని సాక్ష్యం చెప్పాలనీ అడిగారట. సంజీవ దేవ్ గారికి అర్థం కాలేదు. నగలు అంత తొందరగా ఎలా దొరికాయో ఆయనకు అర్థం కాలేదు. కాని ఆయన మిత్రులూ, బంధువులూ ఏమని చెప్పేరంటే నగలు నగల రూపంలో ఎప్పటికీ దొరకవు, దొంగిలించినవాళ్ళు వాటిని కరిగించి బంగారంగా మార్చేస్తారు, పోలీసులు తీసుకురాగలిగేది ఆ బంగారాన్నే కాబట్టి కోర్టులో ఆ బంగారం మాదే అని చెప్పాలి అని. అంతేకాదు, నగనట్రా దొంగతనం జరిగినప్పుడు పోలీసులు రికవరీ చేసే పద్ధతులు ఇలానే ఉంటాయని కూడా హితవు చెప్పారట. సంజీవదేవ్ గారికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కాని బంధుమిత్రుల సలహామీద కోర్టుకి వెళ్ళారు. అక్కడ మాజిస్ట్రేటు ఎదురుగా బల్లమీద బంగారం ఉంది. ‘దాన్ని గుర్తుపట్టగలరా?’ అనడిగాడట మాజిస్ట్రేటు. సంజీవదేవ్ గారు నెమ్మదిగా గొంతు పెగుల్చుకుని ‘రూపం మారింది గాని సారం అదే’ అని అన్నారట.

ఈ కథ అక్కడితో కూడా పూర్తవలేదంటారు వెంకటేశ్వరరావుగారు. ఆ విచారణ తర్వాత ఆ మాజిస్ట్రేటు సంజీవదేవ్ గారికి జీవితకాల అభిమానిగా మారిపోయాడట. ఆయన రాసిన పుస్తకాలన్నీ తెప్పించుకుని మరీ చదివాడట.

సంజీవ దేవ్ గారి ఆధ్యాత్మికత బాహ్యాచారాలకీ, బాహ్యలక్షణాలకీ అతీతమైంది అని చెప్పటానికి వెంకటేశ్వరరావు గారు చాలా ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఒకసారి ఆయన్ని ఒక లైబ్రరీ ప్రారంభోత్సవానికి పిలిచారట. రిబ్బను కత్తిరించాక ఆయన లోపలకి అడుగుపెడుతుంటే పక్కన ఎవరో ‘సంజీవ దేవ్ గారూ మీరు చూసుకోలేదు, ఎడమకాలుతో అడుగుపెట్టారు’ అని అరిచారట. సంజీవదేవ్ గారు ఆయనకేసి చూసి చిరునవ్వుతో ‘ఆ ఎడమకాలు తనతో పాటు వెంటనే కుడికాలును కూడా లోపలకి తీసుకొచ్చేసింది, మీరు చూడలేదు’ అని అన్నారట.

ఇలాంటి సంఘటనే ఒక స్కూల్లో కూడా జరిగిందని నెమరేసుకున్నారు. ఆ రోజు ఆ స్కూల్ సిబ్బంది స్కూలంతా సంజీవ దేవ్ గారికి తిప్పి చూపిస్తూ ఆయన్ని లైబ్రరీకి కూడా తీసుకువెళ్ళారట. ఆయన లైబ్రరీలో అడుగుపెడుతుండగా లైబ్రేరియన్ నెమ్మదిగా ‘సార్, చెప్పులు’ అని అన్నాడట. ‘ఏమైంది?’ అని అడిగారట. ‘లోపల సరస్వతి ఉంటుంది సార్, చెప్పులు బయటే వదిలిపెట్టేస్తారని’ అని గొణిగాడట. ‘అదేమిటి? సరస్వతి స్కూల్లో లేదా?’ అనడిగారట సంజీవ దేవ్ అమాయికంగా.

‘నేను పూర్వజన్మలో మంగోలియన్ అని అయి ఉంటాను’ అని చమత్కరించారట ఒకసారి. ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళిపోయి, అక్కడే చాలాకాలం గడిపి, అక్కడే ఉండిపోవాలనుకున్నారని మనకు తెలుసు. అక్కడ ఆయనకు ఏదో ఒక మంత్రదీక్ష దొరికి ఉంటుందని తనకు గట్టినమ్మకం అంటారు వెంకటేశ్వరావుగారు. ఆయన మేడమీద గంటలకొద్దీ ఒంటరిగా కూచున్నప్పుడు ఏదైనా జపం చేస్తూ ఉంటారా అని తెలుసుకోడానికి తాను చాలా ప్రయత్నించాననీ కాని సంజీవ దేవ్ గారు దొరకలేదనీ అంటారు వెంకటేశ్వరరావు. ‘కానీ ఆయనకు అతీంద్రియ జ్ఞానం ఉందని మాత్రం చెప్పగలను. చాలా ఉదాహరణలు నా స్వానుభవం మీంచే చెప్పగలను’ అని కూడా అంటారు. స్వభావరీత్యా సంజీవదేవ్ ఏదీ దాచుకోని మనిషి. కానీ ఇటువంటి విషయాలు నలుగురితోనూ పంచుకోవలసినవి కావని ఆయన అనుకుని ఉండవచ్చును.

అయితే సంజీవదేవ్ ఒక పరిణత యోగి అని ఆయన రచనలు చదివినవారికెవరికైనా ఇట్టే తెలుస్తుంది. చలంగారు చిన్నారావుగారికి రాసిన ఉత్తరాలు ‘మహాస్థాన్’ పేరిట పుస్తకరూపంగా వచ్చేయి. సంజీవ దేవ్ గారు ఆ పుస్తకానికి గొప్ప ముందుమాట రాసారు. అందులో ఆయన మామూలు మానవుడికన్నా కళాకారుడి చేతన పై మెట్టులో ఉంటుందనీ, కాబట్టే మామూలు మనుషులకి కళాకారుల ఆరాటాలూ, వారి ప్రవర్తనా అంత సులభంగా బోధపడవనీ అంటారు. అలాగే కళాకారుడికన్నా యోగి మరింత పైమెట్టులో ఉంటాడనీ, కాబట్టే యోగుల జీవనసరళి కళాకారులకి అంత సులభంగా అర్థం కాదని రాస్తారు. చలంగారు సాహిత్యకళాకారుడిగా సాధన మొదలుపెట్టి యోగిగా మారేరనీ కాబట్టే సాహిత్యలోకం ఆయన్ని అర్థం చేసుకోలేకపోయిందనీ సంజీవదేవ్ భావన. సంజీవదేవ్ కి కూడా ఈ మాటలు వర్తిస్తాయని అనుకుంటాను. ఆయన రాసిన రాతలూ ఆయనలోని కళాకారుడి వ్యక్తీకరణలైతే, ఆయన చేసిన స్నేహాలూ, రాసిన ఉత్తరాలూ, చూపిన ఆదరణా, పంచిన ప్రేమా యోగి స్థాయికి చెందినవి. చాలా అరుదైన యోగి ఆయన. ఒక విధంగా చెప్పాలంటే జెన్ బౌద్ధుడిలాంటి యోగి ఆయన. ఆయన జీవించి ఉన్నంతకాలం చుట్టూ ఉన్న సమాజం ఆయనలోని ఈ పార్శ్వాల్ని ఒక బహుముఖ ప్రజ్ఞగా భావించిందే తప్ప ఒక యోగి జీవనగమనమని గుర్తుపట్టలేకపోయింది.

‘ఒక రాత్రి బాగా వాన పడింది. పొద్దున్నే ఆయన్ని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళాను. వెంకటేశ్వర రావు, రాత్రంతా వాన ఎంత అందంగా పడుతూ ఉంది! ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఆ పడుతున్న వాననే చూస్తుండిపోయాను’  అని అన్నారట ఆయన. అలాంటి జీవితక్షణాలకు నోచుకున్నవాడు యోగి కాక మరెవరు? ‘రోజూ పొద్దున్నా, సాయంకాలం మేడమీద కూచుని సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తూ ఉండేవారు. అదే ఆయన ప్రార్థన, జపం, తపం అన్నీను’ అన్నారు వెంకటేశ్వరరావుగారు.

ఆయనలోని ఈ యోగిమనఃస్థితిని ఆయన చిత్రలేఖనాలు ప్రతిబింబించినంతగా మరేవీ పట్టివ్వలేవు అనవచ్చు. పోయినవి పోగా, పంచిపెట్టినవి పంచెయ్యగా, ఇంకా ఆ యింట్లో ఇరవై దాకా పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిని ఆయనే స్వయంగా ఫ్రేములు కట్టించుకుని గోడలకు పెట్టుకున్నారు. ఆ బొమ్మల్లో ఇదుగో ఈ బొమ్మ చూడండి. ఇది స్పష్టంగా ఒక యోగి మాత్రమే దర్శించగల ఆకృతి, వెయ్యగల రంగులూను.

ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లోనే చూద్దాం. మనం మామూలు మనుషులం మన జీవితం తాలూకు రుటీన్ కి అలవాటు పడిపోయి ఉంటాం. కళాకారుడు ఈ ordinary course of things ని ఛేదిస్తాడు. అందుకనే కళాకారుల్ని చూస్తే లోకానికి అంత ఆకర్షణ. మనం రోజూ చూస్తుండే ఈ నిస్సారమైన లోకంలోనే వాళ్ళు గొప్ప రంగుల్ని చూస్తారు, రాగాల్ని వింటారు. ఎందుకని? వాళ్ళు మన సాధారణ జీవిత నియతిని భగ్నం చేయగలుగుతారు గనుక. కానీ అటువంటి నియతి రాహిత్యం అందరు కళాకారులకీ సాధ్యం కాదు. ‘కళలో నియతి రాహిత్యం’ అనే వ్యాసంలో సంజీవదేవ్ ఇలా రాస్తున్నారు:

మానవుడు సామాజిక జీవిగా వుండంది అసలు మానవుడే కాదట. ఇక సామాజిక జీవితానికంటే మించకపోతే మానవుడు మృగానికంటే ఉన్నతుడేమీ కాదట. ప్రథమంలో కళానియమాలను పాలించందే కళాకారుడే కాజాలడు. కాని ఆ నియమాలను ఉల్లంఘించి ముందుకు సాగిపోనిదే ఉత్తమకళాకారుడు కానేరడు.

ఇంకా ఇలా రాస్తున్నారు:

రూపకళలలో వాస్తవవాదం నియతి అవుతుంది. ఆదర్శవాదం నియతిభంగం అవుతుంది. కల్పనావాదం సంపూర్ణ నియతి రాహిత్యం అవుతుంది. నియతి, జీవితంలోని ప్రతి విషయానికీ పునాది వంటిది. నియతి ఎందుకున్నదీ అంటే ఉల్లంఘించడానికే వున్నది…పదార్థం కళారూపాన్ని తాల్చాలంటే లయ అనే సజీవ సత్తా అందులో ప్రవేశించాలి. పదార్థంలో లయ ప్రవేశించడమూ అంటే పదార్థధర్మానికి భంగం వాటిల్లడమే, నియతికి దెబ్బ తగలడమే. పదార్థం అదివరలో గడుపుతున్న బండజీవితానికి లయ అందులో ప్రవేశించగానే విముక్తి లభిస్తుంది. స్థితి గతిగా మారుతుంది. జడం చేతనగా ప్రవహిస్తుంది. రూపం రసాత్మకమవుతుంది.

కళాకారుడు ఉత్తమ కళాకారుడిగా మారడం అంటే, నియతిని సంపూర్ణంగా భంగం చేసి తన కాల్పనిక లోకాన్ని మనకు అందివ్వడమంటే,  అతడు కళాకారుడి స్థితిని కూడా దాటి ఒక yogic consciousness లోకి అడుగుపెట్టడమే. అప్పుడే అతడు సృష్టికర్త అవుతాడు. ‘ప్రాచ్యరేఖ-పాశ్చాత్య వర్ణం’ అనే వ్యాసంలో ఆయనిలా రాస్తున్నారు:

ప్రతి శిల్పం యొక్క లక్ష్యం ఉత్కృష్ట ఆదర్శం సృష్టించడం కానీ, అనుకరించడం కాదు. శిల్పం యొక్క ప్రారంభదశ వాస్తవవాదంలో, కాని, శిల్పం యొక్క పరిణతి మాత్రం ఆదర్శవాదంలోనే.

ఈ విషయాన్నే మరింత విపులంగా చర్చిస్తూ ఆయన ఒక శిల్పకళాసూత్రంలాంటి ఈ వాక్యం రాస్తారు:

చిత్రంలో వస్తువు బొమ్మలాగా గోచరించాలి, అంతేకాని వస్తువులాగా గోచరించరాదు.

ఆ ఇంట్లో గోడకి తగిలించిన ఈ బొమ్మ చూడండి. ఇందులో రూపాలు మనకు తెలిసిన ఆకృతుల్లాగా కనిపిస్తున్నాయిగాని, ఇటువంటి పొదలూ, ఈ నేలా, ఈ ఆకాశం మనం మామూలుగా చూసేవి కావు.

దీన్ని ఆయన కాల్పనిక వాదం అని అన్నారు. యూరోపులో ప్రభవించిన expressionism కి సమానార్థకంగా ఆయన ఆ పదం వాడారు. ఎక్స్ ప్రెషనిస్టిక్ చిత్రకారుడుగానీ, రచయితగానీ బాహ్యవాస్తవాన్ని మళ్ళా ఒక పత్రికావిలేకరిలాగా మనకు నివేదించడు. అతడు తన ఆంతరంగిక లోకంతాలూకు శాంత్యుద్వేగాలను మనతో పంచుకోడానికే సదా అభిలషిస్తూ ఉంటాడు.

ఆ ఇంట్లో ఆ బొమ్మలు చూస్తూ ఉంటే ఒక గాలరీలో తిరుగాడుతున్నట్టే ఉంది. నిజానికి ఆ ఇంటినే ఒక గాలరీగా మార్చి ప్రజలకి అందుబాటులోకి తేవచ్చునేమో. సంజీవదేవ్ గారు చాలామందికి ఉత్తరాలు రాసినప్పుడు ఆ ఉత్తరాల్తో పాటు చిన్నచిన్న బొమ్మలు కూడా పంపిచేవారు. వాటిని తనదగ్గరే భద్రపరుచుకోవాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు. అది ఆయన ఔదార్యం. కానీ అటువంటి చిత్రలేఖనాలు ఎక్కడున్నా, ఎవరిదగ్గరున్నా వాటిని మళ్ళా సేకరించి ఆ ఇంట్లో ప్రదర్శనకు పెడితే బావుంటుంది కదా అనుకున్నాను.

ఆ ఇంట్లోనూ, ఆ పెరట్లోనూ, ఆ ఇంటివెనక తోటలోనూ, పక్కనున్న పొలాల్లోనూ పోగుపడ్డ సంజీవదేవ్ గారి జ్ఞాపకాల్ని వెంకటేశ్వరరావు గారు ఒక్కొక్కటీ ఏరి కోరి చూపిస్తూ ఉన్నారు. కొంతసేపు ఆ తోటలో కూచున్నాం. ఆ ఇల్లూ, ఆ తోటా, ఆ పొలాలూ, వాటిమీద పడుతున్న వర్షాకాలపు సంధ్యకాంతీ నా మనసుని అస్పష్టమైన దిగులుతో నింపేసాయి.

టాగోర్ శాంతినికేతనం స్థాపించినప్పుడు ఆ భవనం మీద ‘యత్ర విశ్వం భవతి ఏక నీడమ్’ అని రాసిపెట్టుకున్నాడు. అంటే ఎక్కడ సమస్త విశ్వమూ ఒక గూడుగా మారుతుందో అటువంటి చోటు కావాలి తన పాఠశాల అని అనుకున్నాడాయన. తుమ్మపూడిలో సంజీవ దేవ్ గారింట్లో నాకు ఆ వాక్యమే పదే పదే గుర్తొస్తూ ఉంది. అక్కడ సమస్త విశ్వమూ ఒక కులాయంగా మారింది. తన ఇంట్లో కూచునే ఆయన ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాలూ, దర్శనాలూ, చిత్రలేఖనాలూ అధ్యయనం చేసాడు. ప్రపంచమంతటినుంచీ అక్కడకు ఉత్తరాలొచ్చేవి. దేశదేశాల్లో ఉన్న స్నేహితుల్ని ఆయన అక్కణ్ణుంచే ప్రతిరోజూ పలకరించేవాడు. కవులు, రచయితలు, తాత్త్వికులు, ఆచార్యులు ఆ ఇంటికి వచ్చేవారు. ఆ కుగ్రామంలో తన ఇంటిని ఆయన విశ్వానికి ఇరుసుగా మార్చేసుకున్నాడు. కాని మరొక విషయం కూడా గమనించాలి. ఆయన ఆ గ్రామంలో ఉన్నాడు గాని, ఆ గ్రామానికే పరిమితం కాలేదు. ఆ గ్రామరాజకీయాల్లో కూరుకుపోలేదు. తన గ్రామానికి లోకపటం మీద చోటుచూపించాడే తప్ప, తనను ఆ గ్రామమధ్యంలో ప్రతిష్ఠించుకోడానికి ప్రలోభపడలేదు.

వచ్చేస్తూండగా అక్కడ బీరువాలో సంజీవదేవ్ గారి పుస్తకాలు కొన్ని కనిపించాయి. నేను చదవని పుస్తకాలేమైనా ఉన్నాయా అని చూస్తుంటే Her Life అనే పుస్తకం కనిపించింది. అది సంజీవదేవ్ గారు రాసిన ఒకే ఒక్క నవల. ఇంగ్లిషులో రాసారు దాన్ని.

ఆ పుస్తకం తెచ్చుకుని మర్నాడే చదివేసాను. నవలా నియమాల ప్రకారం అది నవల కాదు. కాని ఒక మానసి అనే యువతి జీవితాన్ని చిత్రిస్తున్న నెపం మీద సంజీవదేవ్ గారు తన గురించే రాసుకున్న కథనం అది. కథనం అనడం సరికాదు, అది అక్షరాల్లో చిత్రించిన ఒక సాఫ్ట్ పేస్టల్ వర్ణచిత్రం.

4-10-2024

9 Replies to “యత్ర విశ్వం భవతి ఏక నీడమ్”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన్న వాక్యం గుర్తుకు వచ్చింది.

  2. ఎనిమిది తొమ్మిది తరగతులప్పుడు మా నాన్నగారు స్కూలు లైబ్రరీ నుంచి సంజీవదేవ్ పుస్తకాలు తెచ్చి ఇస్తే ఏక బిగిన చదివేసా. ఆ ప్రభావం, ఆ సరళత అలాగే అంటి పెట్టుకుని ఉండి పోయాయి. ఆయన ని చదూతుంటే ఆ పెరడులోని నిమ్మ చెట్టో దబ్బ చెట్టో వెనకాల నుంచి మన గతాన్ని మానవ జాతి గతాన్ని చరిచినట్టు అనిపిస్తుంది.

  3. సంజీవదేవ్ గారి గురించి తెలియని ఎన్నో విషయాలు వ్రాసేరు. ధన్యవాదాలు. మా ఊరు అక్కడికి దగ్గరే. కాలువకు అవతలి ఒడ్డునుండి తూర్పుగా 8 కి.మీ. దూరంలో ‘గొడవర్రు’. కృష్ణా తీర గ్రామం. అయినా అప్పటికి సాహిత్యంలో ప్రవేశం లేనందువల్లా, తీరిక లేని బ్యాంక్ ఉద్యోగం లో ఊళ్ళు తిరుగుతూ ఉండటం చేత, ఆయనతో పరిచయం చేసుకోలేకపోతాను. ఒక రత్నాల గని పక్కనే ఉంటూ, గుర్తుపట్టలేని స్థితి.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%