చెప్పకుండా వెళ్ళిపోయాడు

సుమనశ్రీ పోయారని నిన్న నాయుడు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మొదట అతనేం చెప్తున్నాడో అర్థం కాలేదు. అది కూడా కిందటి నెల పన్నెండో తారీకున పోయారని చెప్పినప్పుడు ఒక క్షణం నాకు చాలా బ్లాంక్ గా అనిపించింది. ఆయన పోవడం అలా ఉంచి, ఆ వార్త తెలియడానికి కూడా ఇంతకాలం పట్టిందంటే మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఒకవేళ వెంటనే తెలిసి ఉంటే విశాఖపట్టణం వెళ్ళి ఉండేవాణ్ణా? వెంటనే వెళ్ళగలిగే పరిస్థితుల్లో లేను. అయినా కూడా ఒక మనిషి, నీకు ఆత్మీయుడు, మీ హృదయాల మధ్య ఎన్నడో ఒక సాహిత్యానుబంధం పెనవేసుకుంది, అది కాలం గడిచేకొద్దీ గట్టిపడిందే తప్ప పలచనకాలేదని నమ్మారు మీరిద్దరూ, అలాంటిది, అతడు వెళ్ళిపోతే నీకు తెలియడానికే ఇంతకాలం పట్టిందా!

రియల్ టైమ్ లో మనుషుల మధ్య సమాచార ప్రసారం జరిగే కాలంలోకి వచ్చేక మనుషుల మధ్య దూరం మరింత బాగా పెరిగిందని కొన్నాళ్ళుగా నాకు అనిపిస్తూ ఉన్నది, ఈ రోజు మరింత ధ్రువపడింది. మన ఫేస్ బుక్ లో, మన వాట్సప్ లో మనకెంతమాత్రం ముఖ్యంకాని, ఏ విధంగానూ దగ్గరకాని, ఎంత మాత్రం సంబంధం లేని వ్యక్తుల గురించీ, వారి ఇష్టాయిష్టాల గురించీ చదువుతున్నాం, చూస్తున్నాం కానీ, నిజంగా ఎవరు మనకి దగ్గరనో, ఎవరి మాటలు వింటే మనలో ఒక చైతన్యం మేల్కొంటుందో, లేదా ఒకప్పుడు మనం ఎవరితో కలిసి నడిచామో వారెవరినీ దగ్గరగా తీసుకురాగల సమాచార ప్రసార సాధనాలు కావివి. అదీ కాక, మన అభిప్రాయాలో, స్పందనలో, ఇష్టాయిష్టాలో ఇలా వాట్సప్ ల్లోనో, మెసెంజరుల్లోనో పంపుకునేవీ కావు, పంచుకునేవీ కావు.

ఈ మధ్య కల్లూరి భాస్కరం గారు పూనే వెళ్ళి వచ్చినప్పుడు తన అనుభవాలు రాస్తూ భారతదేశంలో వివిధ ప్రాంతాలు వివిధ టైమ్ జోనుల్లో ఉన్నాయని రాసారు. అంటే కొన్ని ప్రాంతాలు ఇంకా మధ్యయుగాల్లో ఉన్నాయి, కొన్ని ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్సు రోజుల్లో ఉన్నాయి అని ఆయన ఉద్దేశ్యం. ఈ మాట మనుషులకీ, కుటుంబాలకీ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పక్కపక్క ఫ్లాట్లల్లోనే ఉంటున్న ఏ రెండు కుటుంబాలూ కూడా ఒకే టైమ్ జోన్ లో ఉన్నాయని చెప్పలేం. అలాగే ఏ ఇద్దరూ వ్యక్తులూ కూడా ఒకే ఎమోషనల్ జోన్ లో ఉన్నారని కూడా చెప్పుకోలేం.

ఎందుకంటే సుమనశ్రీగారికీ నాకూ మధ్య కమ్యూనికేషన్స్ పూర్తిగా లేకుండా పోలేదు. కాని ఆయన తనొక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాననీ, హైదరాబాదులో ఉండటం కన్నా విశాఖపట్టణంలో తన సోదరుడికి దగ్గరలో ఉంటే ఎక్కువ ఆసరాగా ఉంటుందని తాను విశాఖపట్టణం షిఫ్ట్ అయిపోయాయనీ చెప్పినప్పుడు నేను విని ఊరుకున్నానేగాని, ఆయనకి కొంతైనా ఆసరా ఇచ్చే మాటలేవీ మాట్లాడలేకపోయాను. అదీకాక, మనుషులకి ఒంటరితనం అనుభవంలోకి రావడం మొదలయ్యాక ఆ నిస్సహాయత్వాన్ని నాలుగైదు ఫోన్ కాల్స్ తో పూడ్చలేం. బహుశా మనుషులు ఇప్పుడు లోనవుతున్నంత ఒంటరితనం గతంలో ఇంతలాగా లోనయ్యేవారు కాదేమో అని కూడా అనిపిస్తోంది నాకు.

సముద్రమ్మీద పయనిస్తున్నప్పుడు దప్పికకొన్నవాడికి చుట్టూ నీళ్ళు కనిపిస్తూ ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా దొరకని పరిస్థితి లాంటిదే ఇప్పుడు మనందరి పరిస్థితి కూడా. మన ఫ్రెండ్స్ లిస్టు చూడండి, అయిదువేలమందికి తక్కువ ఎవరికీ లేరు. కానీ ఒక్కరేనా ఉన్నారా? నీకు కష్టమొచ్చిందని తెలియగానే తక్కినవన్నీ పక్కనపెట్టి హుటాహుటి నీ దగ్గరకి వచ్చివాలిపోగల వాళ్ళు? నువ్వో, నీ భార్యనో, నీ కొడుకో, కూతురో హాస్పటల్లోనో, ఐసియు లోనో వున్నారని నువ్వు చెప్పావనుకో, వెంటనే మరునిమిషంలో అక్కడ ప్రత్యక్షమయ్యే స్నేహితుడో, స్నేహితురాలో ఒక్కరంటే ఒక్కరేనా ఉన్నారా? వేరే వాళ్ళ సంగతి సరే, కనీసం నువ్వైనా అలా ఏ ఒక్కరికైనా స్నేహితుడిగానో స్నేహితురాలుగానో ఉండగలుగుతున్నావా?

సుమనశ్రీ వెళ్ళిపోయాడంటే సాహిత్యం గురించో, కవిత్వం గురించో రాయకుండా ఇదంతా ఎందుకు రాస్తున్నానని అనిపిస్తోంది కదూ! ఎందుకు సాహిత్యం? కవిత్వం? ఎందుకు అన్నేళ్ళ పాటు అన్నేసి గంటల పాటు కవిత్వం గురించి మాట్లాడుకుంటూ గడపడం? ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు పక్కన లేకపోయాక నీ స్నేహాలకీ, నీ సాహిత్యానికీ ప్రయోజనమేముంది?

2

ఎనభైల చివర్లో, తొంభైల మొదట్లో సుమనశ్రీ పేరు విన్నాను. ఆయన కవితలూ, వ్యాసాలూ చదివేను. సుమనశ్రీ, సౌభాగ్య ఇద్దరి రచనల్లోనూ ప్రపంచ సాహిత్యం గురించిన ప్రస్తావనలుండేవి. ప్రపంచ సాహిత్యం గురించి సెకండరీ సోర్సెస్ ద్వారా విని రాయడం కాకుండా నేరుగా ఆ కవుల కవిత్వాలు చదివి వారు మాట్లాడుతున్నారనిపించేది. అప్పణ్ణుంచీ సుమనశ్రీని చూడాలన్న కోరిక సి.వి.కృష్ణారావుగారి ‘అవిశ్రాంతం’ ఆవిష్కరణ నాటికి తీరింది. అది 1993-94 నాటి మాట. ఆ సాయంకాలం సుమనశ్రీని చూడగానే, మత్సరగ్రస్తుడు కాని ఒక మనిషి, ఒక సహృదయుడు కనిపించాడు. ఆయన నా పట్ల అపారమైన గౌరవం చూపించాడు. అదంతా నా ‘నిర్వికల్ప సంగీతం’ వల్ల మాత్రమే కాదనుకుంటాను, బహుశా కృష్ణారావు గారు నా గురించి చెప్తూ ఉండటం చాలావరకూ కూడా కారణం అనుకుంటాను.

95-97 మధ్యకాలంలో నేను హైదరాబాదులో ఉన్నప్పుడు సుమనశ్రీతో చాలా దగ్గరి స్నేహం ఏర్పడింది. అప్పటికి నాకు యూరపియన్ కవిత్వం గురించి ఎక్కువతెలీదు. అంటే ఎవరో హోమర్, గొథే, షేక్స్పియర్ లాంటి వాళ్ళు తప్ప, పందొమ్మిది ఇరవయ్యవ శతాబ్ది ఆధునిక కవులతో ఎక్కువ పరిచయం లేదు. ఆధునిక అమెరికన్ కవుల గురించి కూడా నాకు ఎక్కువ తెలియదు. కాని సుమనశ్రీ అప్పటికే ఎంతో విస్తారంగా చదివాడు. మన సమకాలిక తెలుగు కవులు, చివరికి త్రిపుర, మో కూడా చదివి ఉండనంతమంది కవుల్ని ఆయన చదివాడు. వాళ్ళని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నాడు. ఆయన దగ్గర యూరోప్, రెండు అమెరికా ఖండాల కవిత్వం చాలా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడో ఆధునిక కవుల కవిత్వం కోసం హైదరాబాదులో సెకండ్ హాండ్ పుస్తకాల షాపుల్లో వెతుక్కుంటూ ఉంటే, ఎవరేనా కవి కనబడితే, ఆ పుస్తకాల మీద సుమనశ్రీ సంతకం ఉండేది!

అంత విస్తారంగా చదివినవాణ్ణి తెలుగు కవులు భరించడం కష్టం. ఉదాహరణకి శేషేంద్ర తన ‘నాదేశం నా ప్రజలు’ ఒక ఆధునిక ఇతిహాసం అని చెప్పుకుంటూ ఉండగా, అది సెంట్ జాన్ పెర్స్ రాసిన ‘అనబేసిస్’ కావ్యానికి అనుకరణ అని సుమనశ్రీ బాహాటంగా చెప్పకుండా ఉండలేకపోయాడు. అందుకు శేషేంద్ర ఆయన్ని జీవితకాలంపాటు క్షమించలేదు!

తెలుగు కవులు ఏ యూరపియన్ కవులనుంచీ, నెరూడానుంచీ, ఆఫ్రికన్ కవులనుంచీ, హైకూ కవులనుంచీ ఎక్కడెక్కణ్ణుంచి దొంగిలించారో ఆయనకు తెలుసు. అలానే ఒక కొత్త కవి కొత్తగా కవిత చెప్తున్నప్పుడు అతడి వాక్కులో అతడికి తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా ఏ మహాకవులు ప్రతిధ్వనిస్తున్నారో సుమనశ్రీ పోల్చుకోగలిగేవాడు. సిద్ధార్థ కవిత్వం వినగానే గిన్స్ బర్గ్ ని విన్నట్టు ఉంటుందన్నాడు ఒకసారి నాతో. అంటే సిద్ధార్థ గిన్స్ బర్గ్ ని చదివాడని కాదు. కానీ ‘దీపశిల’లోనూ, ‘హౌల్’ లోనూ మానవ ఆక్రోశం ఒకాలానే ఎలా వినిపిస్తున్నదో పోల్చుకోగలిగేవాడన్నమాట. ఒకసారి ఒక యువ కవి కవిత వినగానే జాన్ బెర్రీమాన్ ని విన్నట్టుగా ఉందన్నాడు. ఆయన మాటల్లో ఉన్న నిజాన్ని అర్థం చేసుకోడానికి నాకు ఆ తర్వాత ఇరవయ్యేళ్ళు పట్టింది.

అప్పుడు సి.వి.కృష్ణారావు గారు నడిపే ‘నెలనెలా వెన్నెల’ మా అందరికీ వేదిక. అదొక డెమోక్రాటిక్ స్పేస్. ఎంత డెమోక్రాటిక్ అంటే, ఎవరి కులమేమిటో, గోత్రమేమిటో, ఎవరి ప్రాంతమేమిటో ఎంత మాత్రం తెలియని కాలం. తెలుసుకోడానికి ఆసక్తి లేని కాలం కూడా. లేకపోతే సుమనశ్రీ కి సంఘ్ నేపథ్యం ఉందని, ఇదుగో, ఇప్పుడు మిత్రులు ఆయన గురించి రాస్తున్నదాకా నాకు తెలియనే తెలియదు. నేను రాజమండ్రిలో ఉన్నప్పటిలానే, సి.వి.కృష్ణారావుగారి సన్నిధిలో కూడా ఎంతసేపూ నువ్వే కొత్త పుస్తకం చదివావు, ఏ పాతకవితను పునస్మరించుకుంటున్నావు అన్నవే కుశలప్రశ్నలుగా ఉండేవి.

95-97 మధ్యకాలం నాటికే ప్రపంచమంతా ఏదో కొత్త మార్పు సంభవిస్తోందనీ, అప్పటికి బలంగా ఉన్న అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలు కొత్త కుదుపుకు లోనవుతున్నాయనీ ఒక సూచన మాకందరికీ దొరుకుతూ ఉండేది. అటువంటి కొత్త మార్పుని పసిగట్టి కవిత్వం చెప్పేవాళ్ళని ఫోర్త్ డైమెన్షన్ కవులనో ఫోర్త్ ఛానెల్ కవులనో ఏదో అనేవారు. కాని కాలం మారుతోందనీ, కొత్త శతాబ్దంలో ప్రపంచం మాట్లాడుకునేమాటల్ని కవులు ముందే చిన్నపిల్లలు మాటలు నేర్చుకుంటున్నట్లుగా పలకడం మొదలుపెట్టారనీ గుర్తుపట్టినవాళ్ళల్లో నాకు తెలిసి సుమనశ్రీ కూడా ఉన్నాడు.

ఆయన్ని అంత సమీపంగా చూసినందువల్లనే ఆయన ‘విమర్శ ఒక అన్వేషణ’ కు ముందుమాట రాసే సాహసం చేసాను. పాతికేళ్ళ కింద రాసిన ఆ వ్యాసాన్ని మళ్ళా ఇప్పుడు చదువుకుంటే, ఒక్క అక్షరం కూడా అతిశయోక్తి లేదనిపించింది. కవులుగానీ, రచయితలుగానీ ముందు అధ్యయనవేత్తలు కావాలని కోరుకోవడం నా బలహీనత. అధ్యయనం అంటే పుస్తకాలు చదవడం ఒక్కటే కాదు, జీవితాన్ని, జీవితానుభవాల్ని అధ్యయనం చెయ్యడం కూడా. నువ్వు ఎంత అధ్యయనం చేస్తే fanaticism కి అంత దూరంగా జరుగుతావు. లోకం నీకు ఎరుకపడేకొద్దీ నీ వాక్కుకి వినయసౌశీల్యమబ్బుతుంది. సుమనశ్రీ అటువంటి అధ్యయన శీలి.

తిరిగి నేను 2000 లో హైదరాబాదు వచ్చాక సి.వి.కృష్ణారావుగారి నెలనెలా వెన్నెల నడిచినంతకాలం సుమనశ్రీ తో సాన్నిహిత్యం కొనసాగింది.కాని కృష్ణారావుగారు మాసాబ్ టాంక్ ఇల్లు వదిలిపెట్టి మొదట్లో మలక్ పేట, ఆ తర్వాత చైతన్యపురి వెళ్ళిపోయేక, నెలనెలా వెన్నెల సమావేశాలకు సుమనశ్రీ రావడం తగ్గింది. నేను కూడా ఎప్పుడో ఒకటీ అరా వెళ్ళేవాణ్ణి కాని, మునుపటిలాగా నెలనెలా కలుసుకునేవాళ్ళం కాదు. కాని ఫోన్ సంభాషణలు నడిచేవి. 21 వ శతాబ్దం మొదలవగానే పోస్ట్ మాడర్నిజం, గ్లోబలైజేషన్ లాంటి పరిణామాల్ని దగ్గరగా చూడటం మొదలయ్యాక వాటిమీద సుమనశ్రీ ఏం చెప్తారా అని కుతూహలంగా వినేవాణ్ణి. అలాంటి ఎన్నో సంభాషణల్లో ఆయన చెప్పిన ఒక మాట సూత్రవాక్యం లాగా నా మనసులో ఇంకిపోయింది. ‘నీ ఆదర్శాలు నాకు అనవసరం, నీ ఆచరణ ఏమిటో చూపించమంటుంది ఉత్తరాధునికత’ అని అన్నాడాయన ఒకసారి. పోస్ట్ మాడర్నిజం ఒక పెనుగాలిలాగా నా ఆలోచనల్ని చుట్టబెడుతున్నప్పుడు ఈ ఒక్క వాక్యం ఆసరాగా నన్ను నేను నిలదొక్కుకోగలిగాను అంటే అతిశయోక్తి కాదు.

సుమనశ్రీ నేనూ కలిసి వడలి మందేశ్వరరావుగారిని ఇంటర్వ్యూ చేయడం మరిచిపోలేని ఒక జ్ఞాపకం. మందేశ్వరరావుగారి సాహిత్య అధ్యయనానికి మేమిద్దరం సమానంగా అభిమానులం. మందేశ్వరరావుగారు ‘గణిత్ శాస్త్రంలోని రిగర్ సాహిత్య విమర్శలోకి తేవాలన్నదే నా ఆశయం’ అని చెప్పినప్పుడు మేము లాంగినస్ లాంటి లాక్షణికుణ్ణి హైదరాబాదులో కనుగొన్నట్టుగా మురిసిపోయాం.

మన కాలపు కవుల గురించీ, రచయితల గురించీ మాట్లాడేటప్పుడు సుమనశ్రీ ఒక్కొక్కసారి కవుల జాతకాలకీ, వాళ్ళ కవిత్వాలకీ మధ్య తాను చూస్తున్న సంబంధాన్ని చాలా ఆసక్తికరంగా వివరించేవాడు. ఉదాహరణకి మునిపల్లె రాజు, అజంతా, రావూరి భరద్వాజ, సి.వి.కృష్ణారావు గార్ల జాతకాల్లో శని చాలా ప్రామినెంట్ అనీ, అది వాళ్ళ కవిత్వాన్నీ, జీవితాన్నీ ఎలా ఇంపాక్ట్ చేస్తున్నదో చెప్పేవాడు. ‘మీ జాతకంలో శుక్రుడు శని ఇంట్లో ఉన్నాడు. అందుకే మీరెంత ప్రయత్నించినా మీ కవిత్వం ఫిలసాఫికల్ గా ఉండకుండా తప్పించుకోలేరు’ అనేవాడు. ఈ విషయాల్నే వివరిస్తూ ఒక పుస్తకం రాయకూడదా, అదోక కొత్త పార్శ్వానికి తలుపులు తెరిచినట్టవుతుంది అని చాలాసార్లు అన్నానుగాని ఆయన ఆ దిశగా ఏమీ చేసినట్టులేదు.

పదేళ్ళ కిందట రమణాసుమనశ్రీ పేరిట ఒక అవార్డు ఏర్పాటు చేసి దాన్ని మొదటిసారిగా శివారెడ్డిగారికీ, నాకూ అందచేయడం మరో ఆశ్చర్యకరమైన అనుభవం. శివారెడ్డిగారికి ఇవ్వడంలో ఆశ్చర్యంలేదుగానీ, తనకన్నా వయసులోనూ, సాహిత్యకృషిలోనూ కూడా ఎంతో చిన్నవాణ్ణయిన నాక్కూడా ఆ అవార్డు ఇవ్వటం ఆయనకి నామీద ఉన్న ప్రేమ తప్ప మరేమీ కాదు.

3

తాను ఈ లోకం విడిచివెళ్ళిపోతానని ముందే తెలిసి ఉంటే సుమనశ్రీ గారు బహుశా నాకు తప్పకుండా ఫోన్ చేసి ఉండేవాడు. జీవితం అశాశ్వతం, మానవ సంబంధాలు అశాశ్వతం, కానీ గొప్ప కవిత్వాలు చదువుకున్నప్పుడు కళ్ళముందు కనిపించే వెలుగూ, గొప్ప కవుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరో మనకి బాగా సొంతమనుషులైనవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నట్టు గుండెల్లో కదలాడే దిగులూ మాత్రం అశాశ్వతాలు కావు. మనం వెళ్ళిపోయినా మనం వదిలిపెట్టిపోయిన మాటలుంటాయి. అప్పుడు మరొకకాలంలో మరొకరెవరో మనం రాసిపెట్టుకున్నమాటలు చదివి మనతో మాట్లాడినట్టే ఫీలవుతారు. ఆ నమ్మకమొక్కటే ఇటువంటి సమయాల్లో నాకు ఓదార్పు.

3-10-2024

16 Replies to “చెప్పకుండా వెళ్ళిపోయాడు”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    హార్దిక నివాళి

  2. మీ మాటలు చదువుతూ ,చదువుతూ ఉండిపోయాను. మళ్ళీ మళ్ళీ చదివాను. మీరు రాసినవి కేవలం అక్షరాలు కావు. మీరు ఇచ్చింది కడపటి వీడ్కోలూ కాదు. బాధ ని వ్యక్తీకరించడమూ కాదు. కఠిన సత్యాన్ని నిశ్శబ్దంగా, చీకటి వేళల్లో ఎవ్వరూ వినలేని ఒకానొక అడవిలో పారే సెలయేరు చప్పుడు.
    సమస్త ప్రపంచం ఎదుర్కోలేని ఒక జోలపాట.
    లోలోపల రొదల నిశ్శబ్ద సంగీతం.
    ఏ రాగమో మనకొక్కరికే తెలిసే విషాఢవిహారం. కన్నీరు ఒలకని చూపు.
    నమోనమః

  3. ఒక కవి చనిపోయిన 18 రోజుల వరకు బయట ప్రపంచానికి తెలియక పోవడం దారుణం. వ్యక్తిగతంగానే కాకుండా రచనలపరంగా కూడా నాకు సుమనశ్రీ తెలీదు. ఆయన ఎంతటి అధ్యయనశీలో మీ రాత వల్ల తెలిసింది. నివాళి

  4. ఆశ్చర్యం, అంత గొప్ప కవి, రచయిత, చదువరి క్రిందటి నెలలో వెళ్ళిపోతే మొన్న పేపర్లో చూసేదాకా నాకూ తెలియలేదంటే, భాస్కరం గారు అన్నట్టు మనం సుదూర టైం జోన్ లో ఉన్నామనేది నిజమనిపిస్తున్నది. ఆయనకు మీరు సమర్పించిన నివాళి ఆయన గొప్పదనాన్ని నిరూపిస్తున్నది. 🙏🏼

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%