వజ్రంలాంటి కథకుడు

వానపడితే పత్తికొండ తాలూకాలో వజ్రాలు దొరుకుతాయంటారు. కాని వానలకి నోచుకోని రాయలసీమకు దొరికిన నిలువెత్తు వజ్రం వేంపల్లి గంగాధర్‌. అతడు కవి, రచయిత, పాత్రికేయుడు, చరిత్ర పరిశోధకుడు, అన్నిటికన్నా ముఖ్యం ఆదర్శ ఉపాధ్యాయుడు. అతనిలో ఉత్సాహం, చైతన్యం, నలుగురికోసం ఆలోచించే తపన, నలుగురికోసం బతకాలన్న వేదన అతణ్ణి ఈ కాలం నాటి యువకుల కన్నా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

2

2010 ప్రాంతంలో అనుకుంటాను. అప్పటికింకా గంగాధర్‌ ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించలేదు. పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. అప్పటికి అతణ్ణి నేను చూడలేదు. నేను గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయం, హైదరాబాదులో పనిచేస్తూండేవాణ్ణి. ఒకరోజు నా ఆఫీసు అడ్రసుకి నాకో పుస్తకం వచ్చింది. ‘పూణేకి ప్రయాణం.’ గంగాధర్‌ రాసిన పుస్తకం. వెంటనే చదివాను. నా కడుపులో దేవేసినట్టు అయిపోయింది. అది రాయలసీమ ప్రాతం నుంచి స్త్రీలని తీసుకుపోయి పూణే, షోలాపూర్‌, ముంబై లాంటి ప్రాంతాల్లో సెక్స్‌ వర్కర్లు గా మారుస్తున్న ఒక దుర్మార్గం గురించిన నివేదిక. అలా బలవంతంగా సెక్స్‌ వర్కర్లుగా మారిన కొందరు స్త్రీలు చెప్పిన కథనాలు. అందులో ఎక్కువమంది అనంతపురం, కడప జిల్లాలకు చెందిన గిరిజనస్త్రీలు కావడంతో గంగాధర్‌ నాకు ఆ పుస్తకం పంపాడు.

అప్పట్లో షెడ్యూల్డు ప్రాంతాల్లోని జిల్లాల్లో మాత్రమే ఐ.టి.డి.ఏలు ఉండేవి. భారతప్రభుత్వం తాలూకు మార్గదర్శక సూత్రాల ప్రకారం ఒక ఐ.టి.డి.ఏ ఏర్పాటు చెయ్యాలంటే, ఒక నిర్దిష్ట ప్రదేశంలో యాభై శాతంకన్నా ఎక్కువ గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ యాభై శాతంకన్నా ఎక్కువమంది గిరిజనులు ఉండాలి. అలాకాక మాడా ప్రాజెక్టు ఏర్పాటు చెయ్యాలంటే కూడా కనీసం పదివేలమంది జనాభా ఉన్న ప్రాంతంలో యాభై శాతంకన్నా ఎక్కువమంది గిరిజనులు ఉండాలి. క్లస్టర్‌ అన్నిటికన్నా చిన్న డెవలప్‌ మెంటు యూనిట్‌. దాన్ని గుర్తించడానికి కనీసం అయిదువేలమంది జనాభాలో సగం కన్నా ఎక్కువమంది గిరిజనులుండాలి. కాని మైదాన ప్రాంత గిరిజనులు చెదురుమదురుగా వ్యాపించి ఉంటారు. సంఖ్యరీత్యా ఎక్కువమందే ఉన్నప్పటికీ ఒకేచోట స్థిరపడి ఉండరు కాబట్టి వాళ్ళని అప్పటికి అందుబాటులో ఉన్న ఏ పథకం కిందకీ తేలేని పరిస్థితి ఉండేది. వాళ్ళకి ఏదైనా చెయ్యాలంటే, డిస్పర్సడ్‌ ట్రైబల్‌ గ్రూప్ప్స్‌ (డిటిజి) అనే పథకం కింద చిన్నపాటి ఆర్థిక సహాయ కార్యక్రమాలు మాత్రమే అందిచడానికి అవకాశం ఉండేది. కాని అవి ఆ నిరుపేద, అన్నార్త గిరిజనుల్ని దారిద్య్రపు కోరలనుంచి బయటపడవెయ్యగలిగే శక్తికలిగినవి కావు.

రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక, మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కోసం కూడా ఒక ఐ.టి.డి.ఏ పెట్టాలన్న ఆలోచన ముందుకొచ్చింది. పూర్వపు వరంగల్‌ జిల్లాలోని డోర్నకల్‌ నియోజకవర్గానికి చెందిన డి.ఎస్‌.రెడ్యానాయక్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన కూడా అప్పటి వరంగల్‌ జిల్లాలో మైదానప్రాంతానికి చెందిన గిరిజనుడు కావడంతో ఆయనకి మైదాన ప్రాంతాల గిరిజనుల సమస్యల గురించి అవగాహన ఉంది. అదీకాక, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించేవారు. అటువంటి పర్యటనల్లో రాయచోటి, కదిరి మొదలైన ప్రాంతాల్లోని గిరిజనుల్ని కలుసుకుని రాగానే భారతప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రప్రభుత్వ నిధులతోనే ఆయన మైదానప్రాంత గిరిజనులకోసం ఐ.టి.డి.ఏ ఏర్పాటు చేద్దామనీ, దానికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందించే బాధ్యత నాకు అప్పగించారు. అంతే కాదు, మైదానప్రాంతాల్లో ఉన్న గిరిజనుల స్థితిగతులమీద ఒక సమగ్రమైన సర్వే కూడా చేపట్టాలని రాజశేఖర రెడ్డిగారు చెప్పడమే కాకుండా దానికి టైమ్ లైన్‌ కూడా నిర్దేశించారు.

వారిద్దరి చొరవవల్లా అప్పట్లో పదిహేను జిల్లాల్లోని మైదానప్రాంత గిరిజనుల కోసం ఒక ప్రత్యేకమైన ఐ.టి.డి.ఏ ని హైదరాబాదు కేంద్రంగా ఏర్పాటు చెయ్యడమే కాకుండా, ఆ సంస్థకి ఒక ఐ.ఏ.ఎస్‌ అధికారిని ప్రాజెక్టు అధికారిగా నియమించారు. నాకు తెలిసి మొత్తం భారతదేశంలోనే అటువంటి ఐ.టి.డి.ఏ మరొకటి లేదు. ఇది 2009-09 నాటి సంగతి.

గంగాధర్‌ నాకు ‘పూణే ప్రయాణం’ పుస్తకం పంపగానే మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, వారికి ఒక ఐ.టి.డి.ఏ ఏర్పాటు చేసి ఎంత మంచిపనిచేసామో నాకు మరోసారి అర్థమయింది. నేను ఆ పుస్తకం మా కమిషనరు, ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిగారికి ఇచ్చాను. అప్పట్లో డా.పద్మగారు మైదాన ప్రాంత ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారిగా ఉండేవారు.

శాంతికుమారిగారు ఆ పుస్తకం చదివి చాలా చలించిపోయారు. ఆమె వెంటనే ఆ ప్రాంతాల్ని గుర్తించి స్పెషల్‌ ప్రాజెక్టులు తయారు చెయ్యమని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత రాష్ట్రవిభజన పర్వం మొదలయ్యింది. తిరిగి మళ్ళా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టిపెట్టడానికి 2015 దాకా అవకాశం చిక్కలేదు. అనుకోకుండా తిరిగి డా.పద్మగారు గిరిజన సంక్షేమశాఖ కమిషనరుగా వచ్చారు. ఆమె వచ్చిన వెంటనే కదిరి, రాయచోటి ప్రాంతాల్లోని గిరిజనులకోసం తాను రూపొందించిన పథకాల ఫైళ్ళు బయటికి తీయించారు. ఐ.టి.డి.ఏ శ్రీశైలంలో పి.మురళీధర్‌ అని ఒక సహాయ ప్రాజెక్టు అధికారి ఉన్నారు. ఆయన అద్భుతమైన వ్యక్తి. జీవితం మొత్తం గిరిజనుల సంక్షేమానికే అంకింతం చేసినవాడు. ఆయన్ని ఈ ప్రాజెక్టులు చూడటానికి ప్రత్యేక అధికారిగా నియమించాం. కదిరిప్రాంతం నుంచి ఇలా బలవంతంగా సెక్స్‌ వర్కర్లుగా మార్చబడ్డ కొందరు గిరిజన స్త్రీలని, 2016 లో అనుకుంటాను, ఒక ఎ.జి.ఓ సహాయంతో పోలీసులు విడిపించగలిగారు. వారు వెనక్కి వచ్చారనీ, ఆ కుటుంబాలకీ ఏదైనా సహాయం వెంటనే అందిస్తే బావుంటుందనీ మురళిధర్‌ మాకు నివేదిక పంపాడు.

డా.పద్మగారు వెంటనే స్పందించారు. ఆమె తనకున్న విచక్షణాధికారాల్తో ఒక్కో కుటుంబానికీ వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆ సందర్భంగా నేను మురళీధర్‌ తో కలిసి కదిరివెళ్ళాను. ఆ స్త్రీలు ఏ గ్రామాలనుంచి వచ్చారో, ఆ గ్రామాలు కూడా ఒకటి రెండు స్వయంగా పోయి చూసాను. అక్కడివాళ్ళతో మాట్లాడేను. ఆ వ్యథలేవీ అప్పటిదాకా ఏ ప్రభుత్వాధికారులూ మాకు చెప్పినవి కావు. ఏ పత్రికలూ రాసినవి కావు, ఏ రచయితలకీ తెలిసినవి కావు. ఆ రోజు ఆ గిరిజనుల్తో మాట్లాడినప్పటి నా హృదయసంచలనం లోంచి ‘అవినిమయం’ అనే ఒక కథ రాయకుండా ఉండలేకపోయాను.

ఇదంతా ఎందుకు రాసానంటే, ఒక గంగాధర్‌ అనే యువకుడు, అతడెవరో అప్పటికి మాకు తెలియకపోయినా, రాసిన ఒక పుస్తకం ఒక మొత్తం ప్రభుత్వశాఖలో ఎంత కదలిక తెచ్చిందో చెప్పడానికి. గంగాధర్‌ హృదయంలో కలిగిన వేదన మరెన్ని హృదయాల్ని తట్టిలేపిందో చెప్పటానికి.

3

ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నఈ కథాసంపుటమే చూడండి. ఇందులో ఉన్న పధ్నాలుగు కథలూ పధ్నాలుగు ప్రపంచాలు. ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించని కథలు. వీటిని గంగాధర్‌ లాంటి రచయిత మాత్రమే చూడగలిగినవి. అతడు మాత్రమే చెప్పగలిగినవి. ఎక్కడో తమిళనాడులో పుట్టి బతుకు తెరువుకోసం ఎర్రచందనం అడవుల్లో అడుగుపెట్టి నేరస్థుడిగా మారిన తమిళకూలీ, నాలుగు రూకలు కళ్ళ చూడటంకోసం బెంగుళూరు ముఠాకి గంజాయి పండిరచడానికి సిద్ధపడే నిరుపేద సీమరైతులు, ఉడతల్నీ, ముంగిసల్నీ చంపి వాటిలో దూదికుక్కి బొమ్మలుగా మార్చి అమ్ముకుంటూ, రైల్వే పోలీసుల చేతుల్లో పడే నిరుపేద గిరిజనులు, బొగ్గులు అమ్ముకునేవాళ్ళూ, సొంత కుటుంబాలే తమని అమ్మేస్తే పూనే, భివాండి ఫ్లెష్‌ మార్కెట్లకి పయనమయ్యే నిర్భాగ్యస్త్రీలు, తాగుడుకోసం ట్రాన్స్‌ ఫార్మర్లని పగలకొట్టి అందులో రాగితీగా, ఆయిలూ దొంగతనాలు చేసే నిరుపేదలు, వాళ్ళ దొంగతనాల వల్ల మరింత ఋణభారంలో కుంగిపోయే కౌలు రైతులూ, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లో వజ్రాలు దొరికినా జీవితాలు మారని దురదృష్టవంతులూ- ఈ జీవితకథనాలు మనకి వార్తల్లో కనిపించవు, సోషల్‌ మీడియాలో కనిపించవు. కనీసం రాజకీయనాయకుల వాగ్దానాల్లో కూడా వీటి ప్రస్తావనలుండవు.

ఇలాంటి జీవితాల గురించి కథలు మరికొందరు రచయితలు కూడా రాస్తూ ఉండవచ్చు. కానీ గంగాధర్‌ ప్రత్యేకత ఎక్కడుందంటే, ఆయన ప్రతి కథనీ దుఃఖంలో ముంచి చెప్తాడుగానీ, ఏ కథనీ విషాదాంతం చెయ్యడు. ఎంత కష్టంలోనైనా, ఎంత దుఃఖంలో నైనా మనుషులకి వ్యవస్థనో, అనుబంధాలో, తాము జీవిస్తున్న జీవితం కన్నా మెరుగైన జీవితం దొరకాలన్నా ఆశనో, దొరుకుతుందన్న ఊహనో ఏదో ఒకటి బాసటగా నిలబడటం అతడు గుర్తుపట్టాడు. ఆ వెండి అంచు మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఆ రచయితనీ, అతడి సాహిత్యాన్నీ మనకు ప్రేమించదగ్గదిగా చేస్తుంది. రచయితలు గొప్ప రచయితలుగా మారే తావు అది. రావిశాస్త్రి ‘మామిడి చెట్టు’, ‘వర్షం’, ‘కార్నర్‌ సీటు’ లాంటి కథలు చూడండి. ధూసరవర్ణం అలుముకున్న జీవితవాస్తవం అంచుల్లో ఒక ఆకుపచ్చని పార్శ్వాన్ని ఆయన చూసాడు, ఆ కథల్లో మనకి చూపించాడు. అలాగే ఈ కథలు చదువుతున్నంతసేపూ గంగాధర్‌ కూడా తనకథల్లో ఆ వెండి అంచుని ఎక్కడ చిత్రించేడో అన్న కుతూహలంతో చదివేను. ‘గజ్జెల పిల్లోడు’ కథ చూడండి. ఇటీవలి కాలంలో నాకు ఇంత ధైర్యాన్నీ, నమ్మకాన్నీ ఇచ్చిన కథ మరొకటి చూడలేదు.

ఈ కథల్లో రాయలసీమ గ్రామాలూ, సంతలూ, రోడ్లూ, రైల్వేస్టేషన్లూ, పొలాలూ, అడవులూ కనిపిస్తాయిగానీ, ఈ కథలు అక్కడికే పరిమితం కాలేదు. ఎంతో నిర్దిష్టంగా ఉన్న ఈ స్థానికతలోంచి పుట్టిన ఈ కథలు మానవులందరి కలలకీ, కన్నీళ్ళకి ప్రతినిధి కథలుగా నిలబడగలిగే సార్వత్రికతను సముపార్జించుకున్నాయి.

నేను పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న కాలంలో గంగాధర్‌ ని చూసాను, దగ్గరగా చూసాను, స్నేహం కూడా చేసాను. అతడిలో ఒక ఆదర్శమానవుడు సజీవంగా ఉన్నాడని గుర్తుపట్టాను. స్వయంగా ఉపాధ్యాయుడైనందువల్ల అతడిలో ఆదర్శాలు ఇంకా సజీవంగా ఉన్నాయా లేక అతడిలోని అమాయికమైన ఆదర్శాల వల్లనే అతడు చక్కటి ఉపాధ్యాయుడిగానూ, కథకుడిగానూ వికసిస్తున్నాడా చెప్పడం కష్టం. కానీ ఈ కథల్లో దాదాపు నాలుగైదు కథలు బడిచుట్టూ, చదువు చుట్టూ నడిచే కథలు కూడా. ఇలాంటి చదువు కథలు రాసినందుకు గంగాధర్‌ ని మరింతగా అభినందిస్తున్నాను.

కథకుడికి కావలసింది జీవితాన్నీ, వాస్తవాల్నీ చూడటమే కాదు, తాను ఆ దృశ్యాల్ని కళ్ళారా చూసాడని తన పాఠకుల్ని నమ్మించగలగాలి. అందుకనే కథారచనలో డిటెయిలింగ్‌ నిర్వహించే పాత్ర అంతా ఇంతా కాదు. వాస్తవాల మధ్య జీవించే రచయితలు మాత్రమే తమ కథల్లో వివరాల్ని విశ్వసనీయంగా పొందుపరచగలుగుతారు. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:

‘వాడిదగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న పాత పసుపురంగు సంచి. దానికి సుబ్రహ్మణ్య స్వామి చిత్రం ముద్రించి ఉంది. అందులో ఒక సిల్వర్‌ టిఫిన్‌ క్యారీ, నాలుగు గుట్కా పాకెట్లు వున్నాయి.’

ఈ మూడు వాక్యాల్ని బట్టి చెప్పొచ్చు, అదొక తమిళకూలీ కథ అని. ఇంకా అందులో కీలకమైన డిటెయిల్‌ ఆ సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ అని వేరే చెప్పాలా?

గజ్జెల పిల్లోడు కథలో వాళ్ళు బాండుమేళం వాయించడానికి ఏ ఫంక్షనుకైనా వెళ్ళినట్టు చెప్పొచ్చు. కాని అది మార్కెట్‌ యార్డ్‌ రామిరెడ్డి అన్న ఛైర్మన్‌ ప్రమాణస్వీకారం తాలూకు ఈవెంట్‌ అని చెప్పడంతో ఆ కథకి ఊహించలేనంత నిర్దిష్టతని తీసుకొచ్చింది.

గరుడ పచ్చకథలో గరుడపచ్చని కదిరప్ప ఎక్కడ దాచి ఉంటాడు? అటువంటి కుటుంబాల్నీ, జీవితాల్నీ చూసి ఉంటే తప్ప, ఆ పచ్చ ఎక్కడ దాచాడో చెప్పలేం.

ఒక అనుభవాన్ని కథగా మార్చడానికి కావలసింది మూడు సామర్థ్యాలు: ఒకటి, వాస్తవాన్నో అనుభాన్నో ప్రత్యక్షంగా చూసి ఉండటం లేదా అనుభవించి ఉండటం, చూసినదాన్నో, అనుభవించినదాన్నో నమ్మదగ్గట్టుగా చెప్పడం, ఇక మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైంది, ఆ వాస్తవమో, అనుభవమో తన హృదయంలో కలిగించిన స్పందనని పాఠకుడి హృదయంలోకి పంపగలగడం.

కథకుడిగా గంగాధర్‌కి ఈ మూడు సామర్థ్యాలూ ఉన్నాయని ఈ కథలు ఋజువు చేస్తున్నాయి. కాబట్టి ఇతడు మరిన్ని కథలూ, నవలలూ రాయాలని కోరుకోకుండా ఎలా ఉండగలను?

8-11-2023

23 Replies to “వజ్రంలాంటి కథకుడు”

  1. “కలలకు, కన్నీళ్లకు ప్రతినిధి!”

    Nothing else can clear up our minds like the spirit of such a touching expression.

    Sir… మీ భావ వ్యక్తీకరణకు సాష్టాంగ ప్రణామం.

  2. ఇప్పటివరకు తెలియని ప్రపంచాన్ని మా కళ్ళముందు నిలబెట్టారు. ఒక మానవీయ కథకుడిని పరిచయం చేశారు. కృతజ్ఞతలు సర్.

    1. ఐవును. ఆయన పరిశోధనాత్మక రచయిత.

  3. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    అసలు పరిచయాలు ఎలా చెయ్యాలో , ఎవరిని చెయ్యాలో మీ అంత బాగా ఎవరికి తెలియదు.
    సదాశివగారు తమ యాదిలో ఏరి ఏరి మానవతా సుమాలను పరచినట్లు మీ దృష్టి అసలు సిసలు వ్యక్తుల పరిగణన పైన ఉండటం స్ఫూర్తిదాయకం .

    1. మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  4. చదివి హృదయం చలించని వారు ఉండరు. ప్రభుత్వం పనిచేస్తే ఎంత మందికి నిజమైన సంక్షేమం అందుతుందో కదా. పైగా గంగాధర్ వంటి వారిని పరిచయం చేసి మానవత్వానికి ఊపిరి నింపిన మీకు వందనాలు 

  5. ఒక వ్యక్తిలోని ఇన్ని గొప్ప కోణాలను అద్భుతంగా ఆవిష్కరించడం మీకే సాధ్యం. గంగాధర్ గారికి, అభాగ్య గిరిజన మహిళల కోసం పని చేసిన ప్రతి అధికారికి, మీకు హృదపూర్వక నమస్సులు 🤍🌳🙏

    1. చాలా సంతోషం. 1990-92 మధ్య కాలంలో నేను మీ ఊరు చాలా సార్లు వచ్చాను.

  6. కథ చేయగల అద్భుతం సమాజం లో మార్పు.ఇంత కదలిక ఏర్పడింది అని మీలాంటి అధికారి చెప్పకపోతే మాకు తెలీను కూడా తెలీదు.కథ లోతుల్లో తన పని చేసుకుంటూ వెళుతుంది.మీకు ఇద్దరికీ అభినందనలు 💐💐

  7. సార్ నమస్కారం, డా. వేంపల్లి గంగాధర్ నాకు మంచి మిత్రుడు ఆయన రాసిన పుస్తకాలు అన్ని చదివాను, కథ చదువుతూ ఉంటే ఆపకుండా చదవాలనిపిస్తుంది, మనల్ని ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది గంగాధర్ కథ. పూణే ప్రయాణం పుస్తకం నేను చదివాను, ఇప్పటికీ నా దగ్గర ఉంది. పూణే ప్రయాణం పుస్తకం ఇంత మంది బురోక్రాట్స్ లో కదలిక తెచ్చిందని, ఇంత మంచి పని చేయించిందని ఇప్పుడు మీరు చెబితే తెలిసింది. అతని లో ఉండే కథకున్ని ఎంత బాగా పరిచయం చేశారు సార్, నిజంగానే మీరు అన్నట్టు కరువు ప్రాంతంలో దొరికిన వజ్రం డా. వేంపల్లి గంగాధర్.
    డా. సిద్దమూర్తి రాజగోపాల్ రెడ్డి

  8. నమస్తే సర్, తప్పక చదువుతాను. కథల ద్వారా సమాజాన్ని మార్చుకోవచ్చని నిరూపించారు వారూ,మీరూ..

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%