
రంగుల్లో ఎరుపు, నీలం, పసుపు ప్రాథమిక వర్ణాలని మనకు తెలుసు. ఊదా, నారింజ, ఆకుపచ్చ ద్వితీయ వర్ణాలు. ప్రాథమిక, ద్వితీయ వర్ణాల్ని కలిపితే తృతీయ వర్ణాలు వస్తాయి. అవి పూర్తిగా కాంతివిహీనంగా ఉంటాయి. వాటిని muted colors అంటారు. బూడిదరంగులో, ముదురు ఇటుకరంగులో, ధూసరవర్ణంలో ఉండే ఆ రంగులు మనం చూసే దృశ్యాల్లో వాస్తవికతని చిత్రించే ఛాయలు. మన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రధానంగా muted colors లోనే ఉంటుంది. అందుకని ప్రతిభావంతులైన చిత్రకారులు తాము చిత్రించే దృశ్యాల్లో అత్యధిక భాగం muted colors నీ, greys నీ వాడి అక్కడక్కడా ప్రాథమిక వర్ణాల్ని చిలకరిస్తారు. అప్పుడు ఆ muted background లో ఆ ఎరుపు గాని, పసుపుగాని, ఆ నీలంగాని గొప్ప కాంతితో మిలమిలా మెరిసిపోతుంటాయి. ఆ చిత్రాల్ని చూసినప్పుడు వీక్షకులకి ఆ రంగులు నృత్యంచేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
నేను చెప్తున్నదేమిటో గ్రహించడానికి, ప్రసిద్ధ యూరపియన్ చిత్రకారుడు షెజానె గీసిన ఈ వర్ణచిత్రం చూడండి. ఆ muted background మీద ఆ పసుపు, నారింజరంగు ఎరుపు, ఆ పసుపువన్నె ఆకుపచ్చ ఎలా ముందుకు పొంగుకొస్తున్నాయో గమనించండి.:
రావిశాస్త్రిగారి కథల్లోనూ, నవలల్లోనూ దుమ్ముతో కూడుకున్న జీవితమే ప్రధానంగా కనబడుతుంది. కాని ఆ ధూసరమయ వాస్తవాన్ని చిత్రించడానికి ముందో, లేదా, ఆ చిత్రణమధ్యనో ఆయన ఒక కాంతిమయ దృశ్యశకలాన్ని ఇమిడ్చిపెడతాడు. ఆ మొత్తం కథకి ఆ ప్రకాశవంతమైన పదచిత్రమే ప్రాణంలాంటిదని చెప్పవచ్చు. స్వయంగా కవి, నిరుపమానమైన చిత్రకారుడు మాత్రమే అటువంటి ఇంద్రజాలాన్ని మనమీద ప్రయోగించగలడు.
ఈ మంత్ర విద్య రావిశాస్త్రి తొలికథల్లో, అంటే 1950-60 మధ్యకాలంలో రాసిన కథల్లో చాలా తేటగా, సూటిగా కనబడుతుంది. అప్పుడు ఆయన కుంచె రేఖలు చాలా సున్నితంగానూ, తూలికాతుల్యంగానూ ఉండేవి. తర్వాత రోజుల్లో అంటే, డెబ్భైల్లోనూ, ఎనభైల్లోనూ ఆ కుంచె రేఖలు మరీ blunt గా, మోటుగా, ఒక్కొక్కచోట మొరటుగా కూడా మారిపోవడంతో, చాలాసార్లు ఆ ప్రాథమిక వర్ణాలు ఆ తృతీయవర్ణాల్లో కలిసిపోయి ఆ కాంతి మందగించిపోవడం మనం గమనించగలం.
కాని ఆయన రాసిన మొదటికథల్లో ఆయనలోని కవి మనకి స్పష్టంగా కనిపిస్తాడు. ఆయన తర్వాత రోజుల్లో రాసిన కథల్ని బట్టీ, అందులో చిత్రించిన విస్తృత మానవజీవితపు చీకటి పార్శ్వాల్ని బట్టీ, ఆ dark, critical realism ని బట్టీ రావిశాస్త్రిని తెలుగు పాఠకలోకం అత్యుత్తమ కథకుడిగా గుర్తుపెట్టుకుందిగానీ ఆ తర్వాత రచనలేవీ ఆయన రాయకుండా ఆ మొదటి కథలు మాత్రమే రాసి ఆగిపోయి ఉంటే తెలుగు పాఠకులు ఆయన్ని గుర్తుపెట్టుకుని ఉండేవారా అనిపిస్తుంది. కాని నామటుకు నాకు ఆ మొదటికథల రావిశాస్త్రి గొప్ప కవిగా మాత్రమేకాక, ఉజ్జ్వలమైన చిత్రకారుడిగా కూడా గుర్తుండిపోతాడు.
అందుకనే ఈ మధ్య ఒక మిత్రుడు రావిశాస్త్రి కథల్లో అనువదించదగ్గ కథల పేర్లు కొన్ని చెప్తారా అనడిగితే ‘జరీ అంచు తెల్లచీర’, ‘మగవాడు ఆడమనిషి’, ‘మెరుపు మెరిసింది’,’ వర్షం’, ‘పువ్వులు’, ‘కార్నర్ సీటు’, ‘మామిడిచెట్టు’, ‘విలువలు’, ‘ఇద్దరు పిల్లలు’,’వెలుగు’, ‘ఆఖరిదశ’, ‘సైగల్’, ‘ఎండ’, ‘నీడలు’ కథల్ని సూచించాను. వాటితో పాటు ‘మాయ’, ‘పిపీలికం’ కూడా చేర్చుకుంటే రావిశాస్త్రి మొత్తం కథలకి అవి ప్రతినిధికథలు కాగలవని కూడా చెప్పాను.
తాను చూస్తున్న బాధామయ, బీభత్స జీవితాన్ని మనకి చూపించడానికి ఆయన వాడకతప్పని muted colors మధ్య, greys మధ్య ఆయన ఒక సున్నితమైన ఆకుపచ్చని పార్శ్వాన్ని ఎలా ఇమిడ్చిపెట్టాడో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
ఉదాహరణకి, గొప్ప ఖండకావ్యంలాంటి, ‘కార్నర్ సీటు’ (1953) కథలో చివరికి వచ్చేటప్పటికి, ఆత్మహత్య చేసుకున్న పచ్చకోటు వాడి గురించి చెప్తూ కథకుడు ఇలా అనుకుంటాడు:
ఆకాశం చెప్పలేనంత నీలంగా ఉంది. కొచెం దూరంలో, మామిడి తోటలకీ తాటితోపులకీ వెనక కనబడీ కనబడక దాగుంది ఏదో వూరు సన్నగా ఆ వైపునుంచి లేచిన పొగ అక్కడే నిల్చిపోతోంది. మామిడిచెట్లకి ముందున్న చెరువుగట్టున స్నానం చేసిన వృద్ధుడెవరో గావంచాతో తుడుచుకుంటున్నాడు. స్టేషన్ వైపు చూస్తూ. దూరానికి ఆకుపచ్చగా కనిపిస్తూ తెల్లటిచుక్కల్లాంటి బాతులు ఈదే చెరువునీటిలో దూరంగా అచలంగా నిల్చున్న నీటికొంగలూ ఎండలో మంచుతెరల్లా కనిపించే తెల్లమబ్బులూ కదిలిపోతున్నాయి. చెవులకి పక్కగా ఉన్న తాటాకు ఇంటిముందు విరగపూసిన గన్నేరుచెట్టు బరువుగా కొమ్మలు వంచుకుంది. బాగా ఎదిగిన అమ్మాయెవరో నీలంగా ఉన్న చీరచెంగులోకి కెంపుల్లాంటి పువ్వుల్ని తెంపి పడేసుకొంటోంది. కోతకి సిద్ధంగావున్న వరిచేల మధ్యనుంచి పల్లెపడుచెవరో పోతోంది వయ్యారంగా నడుచుకొంటూ.
అవన్నీ, అదంతా చూస్తోన్న రాజు మనసెందుకోగాని విచారభరితమయింది. పచ్చకోటు వాణ్ణి పరమశత్రువుగా భావించిన సంగతి మర్చేపోయాడు. ఆ సమయంలో అలా కూర్చుని చూస్తోంటే, అకారణంగా అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అతనికి మిక్కిలి దిగులు కలిగింది.
ఈ నీలపు కొండలూ, ఈ నీలి ఆకాశం, ఈ శీతాకాలపు కొండా, ఆ బాతులు ఈదే చెరువూ, స్నానం చేసిన వృద్ధుడూ, ఎక్కడికో పోతోన్న పల్లెపడుచూ, పువ్వులు కోసే జవ్వనీ, ఏదీ ఎదీ ఎవర్నీ కూడా చూడలేదే పచ్చకోటువాడు.
ఇవి ఏ విధంగానూ ఆ కథాగమనానికి తోడ్పడే వాక్యాలు కావు. కాని ఈ వాక్యాలే లేకపోతే ఆ కథకి ప్రాణమూ లేదు, ప్రయోజనమూ లేదు.
అలాగే, ‘నీడలు’ (1953) కథలో దట్టంగా అల్లుకుపోయిన చీకటినీడల మధ్య ఈ వాక్యాలు చూడండి:
నిర్మానుష్యంగా వున్నట్లనిపించే పాతకాలపు భవనాల్లో వరసగా పొడవుగా గదివెనక గదులుంటాయి. గదులన్నీ చీకటిగా వుంటాయి. గది గదికీ ఎదురెదురుగా వున్న తెరుచుకున్న ద్వారంలోంచి దూరంలో ఒక చిన్న పెరడు కనిపిస్తుంది. అక్కడ తెల్లటి తులసికోటలో గుబురుగా పెరిగిన తులసిమొక్క వుంటుంది. ఒక పక్కకి పచ్చటి బంతిపూల మొక్కా, దాని వెనుకనే ఒక సన్నజాజి తీగా కనిపిస్తాయి. అక్కడ సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. అక్కడ ఎండ పచ్చిగా వుంటుంది. తులసికోటకి కొంచెం ముందుకి తళతళ మెరిసే ఇత్తడి బిందె ఒకటి బోర్లించి వుంటుంది. బిందమీద కూర్చుని ఒక అందాల ఆడపిల్ల ఏదో ఆలోచిస్తూ వుంటుంది.
ఇంటి పొడవుకీ వుండే ద్వారాల్లోంచి, గదులచీకటిలోంచి చూస్తోంటే, ఆ పెరడు ఎంతో మనోహరంగా, నిజంగా అక్కడ లేనట్టుగా, మూగ సినిమాలాగా, తెరమీద రంగుల బొమ్మలా, నిద్రలో వచ్చిన సుఖమైన కలలాగా వుంటుంది.
ఎన్నేళ్ళుగానో మూసేసిన గదిలో, చీకటి బూజు తప్ప గాలీ వెలుతురూ చొరలేని గది తలుపు రవ్వంత మాత్రమే తెరిచినప్పుడు, ఒక సన్నని వెలుగురేఖ ఆ గదిలోకి ప్రసరిస్తే ఎలా ఉంటుందో పై వాక్యాలు ఆ కథలో అలా కనిపిస్తాయి. ఈ వాక్యాలతో ఆ కథ మన మనసులో కలిగించే కలవరం చెప్పలేనిది.
‘పువ్వులు’ (1954) చాలా గొప్ప కథ. పిల్లలకి పాఠ్యపుస్తకాల్లో చేర్చవలసిన కథ. ఆ కథలో ఈ వాక్యాలు చూడండి:
తల్లికి తెలుస్తుంది. తండ్రికి తెలుస్తుంది. భగవంతుడికి తెలిసే వుంటుంది. ప్రాణాన్ని, జీవితాన్ని పెంచి పోషించే వారందరికీ తెలిసి తీరాలి. ఆ ఉదయం తలలెత్తి నిల్చున్న చిన్న యెత్తు బంతిమొక్కలు ఓ పదమూడేళ్ళ ఆడపిల్లకి కలిగించిన సంతోష, సంభ్రమ, ఆశ్చర్య, ఆనంద ఉద్వేగాలు ఎటువంటివో ఏమిటో.
అలానే వర్షం (1959) కథలో ఈ కాంతిమయ కోణం చూడండి:
పక్కనే వాకిట్లో తులసికోట పక్క దండెం మీద తెల్లచీర ఒకటి ఆరవేసి ఉంది. వాకిట్లో తోమిన ఇత్తడిగిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటివెనక మామిడిచెట్టొకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దాని పక్కనే కొబ్బరి చెట్టొకటి నిటారుగా ఎత్తుగా గంభీరంగా మామిడిచెట్టుకోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా నిల్చొంది. అస్తమించడానికి తటపటాయిస్తూ దూరాన్న సూర్యుడు ఆకాశంలో అవతల గుమ్మం దగ్గర నిల్చున్నాడు. ఇంతలో గది తలుపులన్నీ గప్పున తెరచి ఆకాశమంతటా కుంకాన్నెవరో కుమ్మరించారు. అంతట చెట్టున మామిడి చిగుళ్ళు, చెట్టున కొబ్బరి కొమ్మలు సంతోషంతో మూగనవ్వు నవ్వేయి. ఆరవేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పున వెదజల్లింది. మెరిసే ఇత్తడిగిన్నెలు రాగిరంగు కలుపుకుని బంగారంలా మెరిశాయి. తులసికోటలో తులసిమొక్క నర్తకిలా నిల్చొంది.
ఎండ (1963) కూడా ఇలాంటి కథనే. ఈ కథలో ఈ వాక్యాలు చూడండి:
ఆవేళ పొద్దున్నే కొండమీంచి నెమ్మదిగా కిందికి జారిన ఎండనీలపు పొగమంచుతో కలిసిపోయి నెమ్మదిగా పురివిప్పగా మెరిసే నెమిలిపింఛంలా మెరిసింది. మరికొంతసేపటికి ఆ యెండే ముద్దుగా విడుతున్న గులాబి పువ్వులతోటలో ఎర్రగా విరిసింది. పదిగంటలకి ఎండ వెచ్చవెచ్చగా వుంటూ కమ్మగా వండిన వంటవాసనల్లో కలిసిపోయి అన్నం తినిపించే అమ్మచూపులా హాయిగా వుంది. పన్నెండుగంటలకి చెట్ల ఆకుల్లోంచి పల్చపల్చగా కిందికి జారిన ఎండ పౌర్ణమినాటి అర్థరాత్రి పండువెన్నెలా సుఖంగా వుంది. చెట్లకింద కొత్త తాటాకు చాప మీద వెల్లకిలా పడుకున్న సుందరానికి పైనున్న లేతాకులన్నీ ఆకుపచ్చ గాజుతో నాజూగ్గా చెక్కిన గాజూకుల్లా వింతగా కనిపించాయి. ఒంటిగంటకి బాగా తళుకెక్కిన ఎండ కొత్త వెండిగిన్నెలా తళతళా మెరిసింది.
తర్వాత రోజుల్లో ఈ నీడల్నీ, ఈ ఎండనీ, ఈ వెలుగునీ పట్టుకునే పెద్దిభొట్ల సుబ్బరామయ్య లాంటి కథకుడు పుట్టుకొచ్చాడని చెప్తే అతిశయోక్తి కాదు.
అయితే, తనలోని కవినీ, కథకుణ్ణీ కూడా అద్భుతంగా సమన్వయించుకున్న కథ ‘మామిడిచెట్టు’ (1961). నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో అగ్రశ్రేణి కథల్ని పదింటిని లెక్కపెట్టమంటే అందులో ఈ కథని కూడా తప్పకుండా లెక్కపెట్టుకుంటాను. మనిషిని లోని కవి మంచివైపు నిలబడ్డప్పుడే ఆ కవిత్వానికి సార్ధకత లభిస్తుందని అప్పటికి రావిశాస్త్రి పూర్తిగా గుర్తుపట్టాడు. కథ మొదలుపెడుతూనే ఆయన తన మనసులో పచ్చగా ఉన్న ఒక ఆకుపచ్చని జ్ఞాపకాన్నిట్లా స్మరిస్తాడు:
పదేళ్ల క్రితం అంటే నాకు పదిహేనేళ్ళ వయసులో మావూళ్ళో ఒకనాటి మధ్యాహ్నం ఊరవతల ఉత్తరాన చేలకీ అవల పొలాల అంచున ఆకాశంలో నల్లటి మబ్బులు కంటికి చల్లగా లేస్తూండగా ఇటు ఎండమాత్రం పాదరసంలా తళతళా మెరిసిపోతూ గాలితోపాటు పండిన పొలాల మీద పరిగెడుతూండగా ఊరి చివర నూతిపక్క నేనొక పూచిన మావిడిమొక్కని చూసేను. దాని సొంపు నేను సరిగా వర్ణించలేను. అత్తవారింటికి వెళ్ళడానికి సిద్ధంగా వున్న ముగ్ధలా ఉందది. ఎండలో లేతగా బరువుగా కొంచెం జాలిగా కనిపిస్తోంది. ఆ సమయంలో ఆ గాలిలో బేలగా అసహాయంగా కనిపించింది.
ఆ మధ్యాహ్నపు వేళ ఆ నూతిలోంచి నీళ్ళు తోడుకొని ఒక చేత్తో రేకు చేద పట్టుకుని తలమీద నీళ్ళ కుండతో ఆ ఎండలో అతి ఒంటరిగా ఒక అమ్మాయి, అత్తవారింటికే కాబోలు, నెమ్మదిగా వెళ్తోంది. ఆభరణాల్లేకపోయినా ఆమె వంటినిండా-ఆమె లేత శరీరం పట్టజాలనంతగా-అందం ఉంది. కుండలో నీళ్ళు కిందకి జారి, ఆమె జుట్టులోంచి నెమ్మదిగా ఆమె చెంపల్ని జాలిగా తాకుతున్నాయి. ఆనాటి ఎండలో అసహాయగా అతి అందంగా నిల్చున్న ఆ మామిడిమొక్కా, నీళ్ళతో నెమ్మదిగా వంటరిగా నడుచుకుపోయే ఆ పల్లెపిల్లా జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా బ్రతుకులోని శ్రమా సౌందర్యం, కష్టం, కమ్మదనం, బరువూ, బాధా అన్నీ నాకు అతి తీవ్రంగా గుర్తొస్తాయి.
ఆ రోజున ఆ పిల్ల, ఎండలో మబ్బులా, చూడ్డానికి ఎంతో చల్లగా ఉంది. ఆమెకీ, ఆ పూచిన లేమామిడికీ ఎందుకోగాని మెలిపడిపోయింది. ఏ మధ్యాహ్నం వేళ మబ్బుని చూసినా నాకు తటాల్న ఆ ఆ పూచిన మామిడిమొక్కా, నీళ్ళు తెచ్చే ఆ చల్లని పిల్ల రూపూ గుర్తుకొస్తాయి. మధురంగా ఏ పాట నా చెవిని పడినా ఆనాటి దృశ్యం- ఊరంతా బలబల ఒలికే ఎండా, చేలవతల చల్లటి మబ్బూ, ఆ నుయ్యీ, ఆ మొక్కా, ఒంటరిగా ఆ పిల్లా- ఆ దృశ్యమంతా నా కళ్ళముందు కదలాడి, నాకు గొప్ప సుఖంగానూ, అమితబాధగానూ ఉంటుంది. గాలిలో రేగే పైరు కెరటాలూ, మామిడితోటల్లో ఏటిగాలి పాటలూ, పల్లెపడుచులూ, నల్లమబ్బులూ, నా మనసులో వింతగా మెలిపడి అందంగా అల్లుకుపోడం జరిగింది.
ఆ తర్వాత అసలు కథ చెప్పుకొస్తాడు. తన పొరుగింటాయన ఇంట్లో పెరిగిన మామిడిచెట్టు ప్రహరీగోడ బయటికీ కొమ్మలు విస్తరించడం, దాని నీడ రోడ్డుమీదకీ పర్చుకోవడం, ఆ నీడలో ఒక ముసిలామె మొక్కజొన్న పొత్తుల మంగలం పెట్టుకోవడం, ఆమె ఆ నీడలో అలా దుకాణం నడుపుకోవడం నచ్చని ఆ యజమాని, తన మామిడిచెట్టు నీడ కూడా తన ఆధీనంలోనే ఉండాలనుకుని ఆ నీడనెలా అదుపులోకి తెచ్చుకోవాలో తెలీక ఆ మామిడిచెట్టు కొమ్మల్ని నరికేయించడం మొదలైనవన్నీ చెప్పాక, కథ చివరికి వచ్చాక, ఇలా అంటున్నాడు:
ఈ విషయమంతా ఇంత వివరంగా ఎందుకు చెప్పేనంటే-
ఆ ఇంటివెధవనీ, ఆ ఇంటి పక్కింటి వెధవల్నీ, వాళ్ళ వాళ్ల తగువుల్నీ వాళ్ళు ఎక్కే కోర్టుల్నీ, అక్కడ జడ్జీలనీ, పార్టీలనీ, పోలీసుల్నీ, ఈ జెయిళ్ళనీ, సంకెళ్ళనీ ఎరగని వాళ్ల చుట్టూ అంతా కలిసి చుట్టే పాశాల్నీ- అంతా చూస్తుంటే నాకు ‘మరి లాభం లేదు. ఈ మనిషి వెధవలు మరింక బాగుపడరు. ఈ లోకం, ఇదంతా ఘోరమైన నరకం’ అనిపించి బతకడం దుర్భరంగా తోస్తుంది.
కాని అంతలోనే-
తళతళలాడే తెల్లని ఎండా, తల్లిలాంటి చల్లని మబ్బూ, పూచిన లేమామిడి మొక్కా, ఎండలో పల్లెపిల్ల బరువు నడకా గుర్తుకొస్తాయి. పొలాలమీద గాలి జ్ఞాపకం వస్తుంది. వర్షంలో అక్కడి మనుషులు గుర్తుకొస్తారు. పకపకలాడి పని చేసే ప్రజాసమూహమంతా ఎదరకొస్తుంది. నీడకోసం పోరాడిన ముసలమ్మ నా దృష్టిపథంలో ఎప్పుడూ నిల్చి వుంటుంది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చి, ఫరవాలేదు, ఆ నరకాన్ని తోసి పారెయ్యొచ్చు, కష్టపడైనా ఆనందాన్ని నిల్పుకోవచ్చు అనిపించి నాలోని ఆశ కొంతగానైనా నిలుస్తుంది.
జీవితవాస్తవాల్నీ, సున్నితమైన అనుభూతినీ ఇలా తేటగా చెప్పిన కథకుడు ‘పిపీలికం’ (1969) కథ తర్వాత తన కథనధోరణి పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆయన ఆ తర్వాత రాసిన రచనల్లో కూడా కవిత్వం ఎండలాగా కాస్తోనే ఉంటుంది, వర్షంలాగా ధారాళంగా కురుస్తోనే ఉంటుంది గాని, ఆ శైలి వేరు, ఆ రచనల ప్రయోజనం వేరు.
3-8-2024
Excellent sir. ఇటీవలే కార్నర్ సీటు కథ .. అందులోని ఈ చివరి దృశ్యం.. ఆ వర్ణన.. ఓ సాహిత్యాభిలాషి అయిన ఓ బిజీ డాక్టరు గారికి చెప్పాను. అలాంటివి.. రావిశాస్త్రి అనే పువ్వుల చెట్టునుండి రాలి పడిన మరిన్ని అపురూప పువ్వుల్ని ఏరి ఇక్కడ గుమ్మరించేరు.. మీకు దండాలు బావో.. దండాలు.
పరమాద్భుతం మాస్టారూ…ఇవన్నీ చదూకుంటూ బతికేయచ్చు.
ధన్యవాదాలు మేడం!
వారి pictorial sentences మీ అక్షరాల్లో పొదివి చూపారు. నా వరకు, రెండు పాఠ్య అంశాల్ని.. చిత్రలేఖనం, సాహిత్యం ఒకే ఉపాద్యాయుని చెంత నేర్చుకుంటున్నట్లుగా వుంది
ధన్యవాదాలు సార్!
రావిశాస్త్రిగారి కథాగమనం తీరుతెన్నులు హృద్యంగా విశదీకరించారు చినవీరభద్దుడుగారూ. ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్