భగవంతుడి భిక్షువు

రెండుమూడు వారాలకిందట ఏనుగు నరసింహారెడ్డి గారు ఫోన్ చేసారు. ‘తెలుగు సాహితీ వనం’ అని ఒక గ్రూపు ఉందనీ, విశ్వసాహిత్యం సిరీస్ కింద వారు ప్రతి నెలా ప్రపంచ సాహిత్యంలోని ఒక నవల గురించో, కావ్యం గురించో చర్చించుకుంటూ ఉంటారనీ చెప్పారు. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని ఏదేనా ఒక నవల గురించి మాట్లాడగలనా అని అడిగారు. Nikos Kazantzakis రాసిన  God’s Pauper (1954) నవల నేనీ మధ్యనే చదవడం పూర్తిచేసాను. అందుకని ఆ పుస్తకం గురించి మాట్లాడతానని చెప్పాను. అన్నట్టే మొన్న సాయంకాలం సాహితీవనం వారి జూమ్ సమావేశంలో ఆ పుస్తకం గురించి ఒక పరిచయ ప్రసంగం చేసాను. ఆ గోష్ఠికి అధ్యక్షత వహించిన శాంతికృష్ణగారూ, ఆ కార్యక్రమానికి వారిని ప్రోత్సహించిన ఏనుగు నరసింహారెడ్డిగారితో సహా మరికొంత మంది మిత్రులు నా ప్రసంగం మీద తమ స్పందన పంచుకున్నారు. ముఖ్యంగా, నా ప్రసంగానికి ముందు శ్రోతలకి నా గురించి పరిచయం చేసిన సుమనజయంతిగారు ఆ పుస్తకం తెప్పించుకుని ఈ వారం రోజుల్లో చదివానని చెప్పడం నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కూడా కలిగించింది. అలానే ఆమె నా కవిత్వంలోంచి ఏరి కోరి కొన్ని వాక్యాలు వినిపించడం కూడా నన్ను సంభ్రమంలో ముంచెత్తింది.


నికోస్ కజంట్జకిస్ రాసిన Zorba the Greek (1946) నవల గురించి ఇంతకుముందే మీతో పంచుకున్నాను. తనలో సంఘర్షిస్తున్న రెండు విరుద్ధ ధోరణుల్ని సమన్వయపరుచుకోడం కోసం నికోస్ ఆ నవల రాసాడు. కాని God’s Pauper అలా కాదు. ఇది స్పష్టంగా తనని వేధిస్తున్న ప్రశ్నలనుంచి బయటపడటానికి తన ఆత్మాన్వేషణను ఏకోన్ముఖం చేసుకోడానికి రాసిన నవల అని చెప్పవచ్చు. నవల మొదట్లోనే కథకుడు బ్రదర్ లియో సెయింట్ ఫ్రాన్సిస్ తనతో ఇలా అనేవాడని చెప్తాడు:

సోదరా, ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితిలో, ఎవరేనా శీలవంతుడు కాదలచుకుంటే, అతడు పూర్తి సాధుసాజ్జనుడిగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ స్థాయికి చేరవలసి ఉంటుంది. ఎవరేనా పాపి కాదలచుకుంటే పూర్తి మృగంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే తక్కువగా కూడా బతకవలసి ఉంటుంది. నేడున్న పరిస్థితుల్లో మధ్యేమార్గమంటూ ఏదీ లేదు.’

నిజమే, అసిసీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ కి మధ్యేమార్గం తెలీదు. రాజీపడటం తెలీదు. పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో నికోస్ మరోమాట కూడా రాసాడు:

తన విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చడమే ముఖ్యమైన మానవుడెలా ఉంటాడో అందుకు సెయింట్ ఫ్రాన్సిస్ నాకో నమూనా. ఏదో ఒక నీతికి కట్టుబడిఉండటమో లేదా ఏదో ఒక సత్యాన్నో, సౌందర్యాన్నో పైకెత్తి చూపడమో కాదు. భగవంతుడు మనకి అనుగ్రహించిన ఈ దేహమృత్తికని ఆత్మగా మార్చుకోవడమే ఆ పరమోన్నత ధర్మం.

నికోస్ కజంట్జకిస్ ఇరవయ్యవ శతాబ్దపు గ్రీకు రచయితల్లో అగ్రేసరుడు. ఆయనలో ప్లేటో, అరిస్టాటిల్ ల తాత్త్విక విచారం, క్రైస్తవుల ఈశ్వరాన్వేషణ, మార్క్సిస్టుల తార్కిక చింతన, బౌద్ధుల శూన్య సంపాదనాలతో పాటు నీషే లోని అస్తిత్వవేదన కూడా సమానంగా కనవస్తాయి. 

ఆలోచనాపరుడైన ఏ రచయితమీదనైనా విభిన్న దర్శనాల, అనుష్ఠానాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. చాలా సార్లు పరస్పర విరుద్ధాలుగా ఉండే ఆ ఆలోచనల్ని తమకై తాము సమన్వయించుకోలేక మనుషులు ఏదో ఒక ధోరణికి వీరాభిమానులుగా మారిపోవడంలోని సౌకర్యాన్ని ఎక్కువ కోరుకుంటారు. కాని ఏ ఒక్క ధోరణికో కట్టుబడిపోకుండా, ప్రతి ఒక్క భావధారలోని మంచినీ స్వీకరిస్తూ, తనకై తాను ఒక స్వతంత్ర సత్యాన్వేషిగా కొనసాగడం అందరికీ చాతనయిన విద్య కాదు. అందుకు చాలా ఆత్మశక్తి, మనోబలం, బుద్ధికుశలత, అన్నిటికన్నా మిన్నగా సృజనశీలత ఉండాలి. కజంట్జకిస్ అటువంటి అరుదైన రచయిత.

యూరోప్ లో మొదటినుంచీ రెండు పరస్పర విరుద్ధ ప్రవృత్తులు కనిపిస్తాయి. ఒకటి పాగాన్ల బహుదేవతారాధన. ఇహలోక జీవితాన్ని కామించే, కాంక్షించే, ప్రేమించే జవసత్త్వాలతో కూడిన మానవత్వం. మరొకటి యూదుల, క్రైస్తవుల ఏకేశ్వరోపాసన. పరలోక రాజ్యం కోసం ఇహలోక సంతోషాల్నీ, సౌభాగ్యాల్నీ నిరాకరించుకోగల నిష్ఠుర నైతికత. ఏ ప్రాచీన కాలంలోనో ఒలింపస్ పర్వతం మీద దేవతల రాగద్వేషాల్లో పుట్టి పరిఢవిల్లిన పాగాన్ యూరోపు సా.శ నాలుగవ శతాబ్దం నుంచి క్రైస్తవ యూరోపు గా మారిపోయింది. ఆ తర్వాత తిరిగి 14-15 శతాబ్దాల్లో ప్రాచీన గ్రీకును కనుక్కోవడం ద్వారా రినైజాన్సు మొదలయ్యాక మళ్ళా హూమనిస్టు యూరోప్ గా తలెత్తడం మొదలుపెట్టాక, క్రైస్తవ, పాగాన్ యూరోపుల మధ్య సంఘర్షణ నానాటికీ తీవ్రమవుతూనే ఉంది.

అయితే మతంతో, ముఖ్యంగా క్రైస్తవంతో విభేదించడం మొదలుపెట్టాక యూరోప్ మళ్ళా రెండుగా చీలిపోయింది. ఒకటి హేతువునీ, తర్కాన్నీ, సైన్సునీ నమ్ముకున్న యూరోపు. ఈ ధోరణినే సెక్యులరిజం అని వ్యవహరిస్తున్నారు. కానీ,  మనిషి మనసులోని అవ్యక్త ఆకాంక్షల్నీ, భయాల్నీ, అస్తిత్వ సందేహాల్నీ పూర్తిగా సమాధానపరచగల శక్తి సెక్యులరిజంకీ, హేతువుకీ, ఎన్లైటెన్ మెంట్ ఆదర్శాలకీ లేదని కూడా యూరోప్ కి తెలుసు. కాబట్టి ఆ సుప్తతృష్ణల్ని ఏ కవులు, ఏ సంగీతకారులు, ఏ చిత్రకారులు గుర్తుపట్టగలిగినా, తృప్తిపరచగలిగినా, యూరోప్ వాళ్ళకి పాదాక్రాంతమవుతూ ఉంటుంది. ఎన్ లైటెన్ మెంట్ యుగం తర్వాత అంటే పద్ధెనిమిదో శతాబ్దం తర్వాత యూరోప్ లో వచ్చిన గొప్ప కళా ఉద్యమాలు-రొమాంటిసిజం, సింబలిజం, ఇంప్రెషనిజం, మాడర్నిజం, ఎక్స్ ప్రెషనిజం, ఎగ్జిస్టెన్షియలిజం, అబ్సర్డిజం వంటివి తలెత్తిన ప్రతిసారీ యూరోప్ పెద్ద కుదుపుకి లోనవుతూనే ఉంది.

కజంట్జకిస్ లో కూడా ఈ రెండు విరుద్ధ ధోరణులు కనిపిస్తాయి. ఆయన Zorba the Greek లో కథకుడు ఒక తాత్త్విక క్రమంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. కాని జోర్బా ఆచరణవాది. అతడిలో క్రైస్తవానికి పూర్వపు యూరోప్ మానవుడు సజీవంగా కనిపిస్తాడు. అపారమైన జీవశక్తికి అతడు ప్రతినిధి. హోమర్, హెసియోద్ ల కావ్యాల్లో చిత్రించిన దేవతల్లాగా అతణ్ణి మనం మన అల్ప నీతిసూత్రాలకు కట్టిపడేయలేం. జోర్బా పాత్ర ప్రపంచవ్యాప్తంగా భావుకుల్ని స్పందింపచేయడానికి కారణం మతానికీ, నీతికీ, సాధారణ జీవితాదర్శాలకీ అతీతమైన మానవత్వాన్ని ఆ పాత్ర కనపరచడమే.

కాగా God’s Pauper ఆ నవలకు పూర్తిగా ఆవలి పార్శ్వానికి చెందిన రచన. ఇందులో క్రీస్తు అనుయాయి కావడానికి తపన పడ్డ ఒక ఐరోపీయ మానవుడు కనిపిస్తాడు. ఆ తపన మామూలు తపన కాదు. నికోస్ చెప్పినట్లుగా, an effort to trans-substantiate matter into spirit. బహుశా క్రీస్తు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకీ తన జీవితం మొత్తం అంత విధేయంగా నడుపుకున్న మరొక సాధుసత్పురుషుడు మనకు మొత్తం కేథలిక్ చరిత్రలోనే కనబడడు. కానీ చిత్రమేమిటంటే, సెయింట్ ఫ్రాన్సిస్ ప్రతి ఒక్క అస్తిత్వంలోనూ, పువ్వులో, పిట్టలో, తోడేలులో, గొర్రెలో, మనిషిలో, మట్టిలో- ప్రతి ఒక్కచోటా, చరాచరాలన్నిటిలోనూ క్రీస్తును దర్శించడానికి తపించాడు. అలా చూసినప్పుడు అంతకన్న పాగాన్ ని మరొకర్ని మనం చూడలేమనిపిస్తుంది. అంటే ఆయన క్రైస్తవుడు కావడం ద్వారా పూర్తి పాగాన్ కాగలిగాడనీ లేదా పూర్తి పాగాన్ గా మారడం ద్వారానే నిజమైన క్రైస్తవుడు కాగలిగాడనీ మనకి తెలుస్తూంటుంది. సరిగ్గా ఈ అపురూపమైన భావావేశ సమన్వయం వల్లనే God’s Pauper గ్రీకులో రాసిన ఒక భాగవత కథ అనిపిస్తుంది.

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ 1181 లేదా 82 లో ఇటలీలోని అసిసీలో జన్మించాడు. 1226 లో శివైక్యం చెందాడు. దాదాపు నలభై నాలుగేళ్ళ జీవితంలో అతడు పూర్ణజీవితం, సఫల జీవితం జీవించాడు. ఫ్రాన్సిస్ పుట్టిన కాలానికి యూరోప్ రెండుగా విడిపోయి ఉంది. ఒకటి పశ్చిమ యూరోప్. రోమ్ ఆధీనంలో ఉన్న పడమటి చర్చి. మరొకటి తూర్పు యూరోప్. కాన్ స్టాంటినోపిల్ ఆధీనంలో ఉన్న తూర్పు చర్చి. ఈ రెండు శాఖలూ పరస్పరం కలహించుకుంటూ ఉండేవి. వట్టి కలహమే కాదు, ఫ్రాన్సిస్ పుట్టేటప్పటికే తూర్పు చర్చి పడమటి చర్చికి చెందిన వాళ్ళని ఎందరినో, స్త్రీబాల వృద్ధులతో సహా, ఊచకోత కోసేసింది. ఫ్రాన్సిస్ కాలం నాటి ఇటలీ కూడా రెండుగా విడిపోయి ఉంది. నిజానికి అప్పటికీ ఇటలీ అనే ఒక దేశం లేదు. అనేక దుర్గాలూ, నగరరాజ్యాల, పట్టణప్రభుత్వాల సమాహారం అది. అందులో కొందరు పోపు ఆధిక్యానికి తలవొగ్గి ఉండేవారు. మరికొందరు పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి విధేయులుగా ఉండేవారు. ఫ్రాన్సిస్ కాలానికి అసిసీ కూడా రెండుగా విడిపోయింది. ఒక వర్గం గ్రామీణ భూస్వామి వర్గం. మరొకరు పట్టణ వర్తక, వాణిజ్య శ్రేణి.

ఫ్రాన్సిస్ అసిసీ పట్టణానికి చెందిన ఒక వస్త్రవ్యాపారి ఇంట్లో జన్మించాడు. ఆ కుటుంబానికి ఐశ్వర్యానికి లోటులేదు. ఫ్రాన్సిస్ విద్యాభ్యాసం అయినతర్వాత, యుక్తవయస్సు వచ్చాక, అప్పటి యువకుల్లానే, తను కూడా కొన్ని చిన్న చిన్న యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఒక యుద్ధంలో అతణ్ణి రాజవంశానికి చెందినవాడిగా పొరబడి బందీగా పట్టుకుపోయి ఏడాది పాటు చెరసాలలో కూడా పెట్టారు. చెరసాలనుంచి బయటపడ్డాక కూడా ఫ్రాన్సిస్ మళ్ళా ఒకటి రెండు యుద్ధాల్లో పాల్గొన్నాడుగానీ, అతడికి ఆ సైనిక జీవితం మీద ఆసక్తి పోయింది. ఒకరోజు తన కత్తినీ, గుర్రాన్నీ మరొకడికి దానం చేసేసి నడుచుకుంటూ ఇంటిబాట పడ్డాడు. తన ఊరు ఇంకా కనుచూపు మేరలో ఉందనగా, దారిలో సాన్ డామియానో అనే చోట అతడికి ఒక పాడుపడ్డ చర్చి కనిపించింది. ఆ రాత్రి ఆ చర్చిలో  అతడికి ఒక దివ్యదర్శనం లభించింది. లోక రక్షకుడు అతడికి కలలో కనబడి పాడుపడ్డ తన చర్చిని పునరుద్ధరించమని అడిగినట్టుగా తోచింది. ఆ మర్నాడు అతడు అసిసీకి వెళ్ళాడన్నమాటేగాని, అతడి మనసు మనసులో లేదు. ఆ రోజునుంచీ అతడు ప్రాపంచిక జీవితానికి దూరంగా, అంతర్ముఖుడిగా జీవించడం మొదలుపెట్టాడు. ప్రార్థన, దానధర్మాలతో పాటు ఉపవాసక్లేశంతో శరీరాన్ని శుష్కించేసుకోవడం కూడా మొదలుపెట్టాడు.

ఫ్రాన్సిస్ లో వచ్చిన ఈ మారు అతడి తండ్రిని తీవ్రంగా కలత పెట్టింది. మొదటిది, ఒక చక్కటి రాజకీయ భవిష్యత్తుని వదులుకుని తన కొడుకు రికామీగా తిరుగుతున్నాడన్న చింత. అంతకన్నా కూడా తన ఆస్తిపాస్తులు, వారసత్వం అటువంటి కొడుక్కి ఎలా అందచేయగలనన్న బాధ. వాళ్ళిద్దరి మధ్యా గొడవ చివరికి స్థానిక మాజిస్ట్రేట్ ముందుకు చేరింది. నువ్విట్లా తిరిగేటట్టయితే నీ తండ్రి ఆస్తికి నువ్వు వారసుడివి కాలేవు అన్నాడు మాజిస్ట్రేటు. ఆస్తి దాకా ఎందుకు, ఇదుగో, నా వంటి మీద ఉన్న గుడ్డలు, మా నాన్న కుట్టించినవే, అవి కూడా నాకవసరం లేదని ఫ్రాన్సిస్ అక్కడిక్కడే నలుగురూ చూస్తుండగా తన కట్టుగుడ్డలు విప్పి పారేసాడు. ఆ దృశ్యం చూసిన స్థానిక మఠాధిపతి ఫ్రాన్సిస్ లో ఒక దైవావేశం అభివ్యక్తమవుతున్నదని మొట్టమొదటగా గుర్తుపట్టాడు.

ఆ తర్వాత కొన్నాళ్ళపాటు ఫ్రాన్సిస్ అనాథగా, పిచ్చివాడిగా, దిమ్మరిగా  సంచరించాడు. కాని అతనిలో కనిపిస్తున్న  దివ్యావేశాన్ని చూసి నెమ్మదిగా ఇద్దరు యువకులు అతడికి శిష్యులయ్యారు. ఆ శిష్యుల్ని ఏం చేసుకోవాలో ఫ్రాన్సిస్ కి తెలియలేదు. అంతకన్నా ముందు అసలు తానేమి చెయ్యాలో కూడా అతడికి తెలియలేదు. కాబట్టి ముగ్గురూ ఒక మతాచార్యుడి దగ్గరికి వెళ్ళి తామేం చెయ్యాలో చెప్పమని అడిగారు. వాళ్ళ విషయంలో భగవంతుడి నిర్ణయమేమిటో తెలుసుకోడానికి, ఆ మతాచార్యుడు, సువార్తల్లోంచి మూడు పేజీలు అక్కడక్కడా తెరిచి కొన్ని వాక్యాలు చదివి వినిపించాడు.

మొదటిది, మార్కు సువార్త (10:21) నుంచి:

యేసు అతణ్ణి చూసి నీలో ఒకటే కొరత. నువ్వు  వెళ్లి నీకున్నదంతా అమ్మేసి బీదసాదలకి పంచిపెట్టు. నువ్వు పరలోకంలో ఐశ్వర్యవంతుడివి అవుతావు. నువ్వు వచ్చి నన్నసురించు అని ప్రేమగా చెప్పాడు

ఇది మత్తయి సువార్తలో (19:21-24) కూడా కనిపించే వాక్యమే.

రెండవది లూకా సువార్త (9:3) నుంచి: 

మీరు మీ ప్రయాణం కోసం చేతికర్రగాని, జోలెగాని, రొట్టెగాని, సొమ్ముగాని ఏదీ తీసుకుపోకండి. చివరికి మీ వంటిమీద ఉన్న అంగీ తప్ప మరొక అంగీకూడా వెంటతీసుకుపోకండి

మూడవది కూడా లూకా సువార్త (9:23) నుంచే:

మీలో ఎవరైనా నన్ను అనుసరించదలచుకుంటే తనను తాను నిరాకరించుకుని నా నా సిలువ తన బుజానికెత్తుకుని నా వెంటనడవలసి ఉంటుంది.

1207 లోనో లేదా 08 లోనో సంభవించిన ఈ సంఘటన తర్వాత, 1226 లో తన నిర్యాణం దాకా దాదాపు రెండు దశాబ్దాలపాటు ఫ్రాన్సిస్ ఈ మూడు వాక్యాల్నీ పూర్తిగా ఆచరణలోకి తెచ్చుకోడానికే జీవించాడు. ఆ మూడు వాక్యాల సారాంశాన్నీ ఆయన మూడు సూత్రాలుగా మలచుకున్నాడు. మొదటిది, పరిపూర్ణమైన దారిద్య్రం. రెండవది, పరిపూర్ణ బ్రహ్మచర్యం. మూడవది దైవవాక్యం పట్ల పరిపూర్ణ విధేయత.

దారిద్య్రాన్ని ఐచ్ఛికంగా స్వీకరించినవాళ్ళు ఫ్రాన్సిస్ కి ముందూ, తరవాతా కూడా లేకపోలేదు. నిరాడంబర జీవితం దాదాపుగా ప్రతి ఒక్క యోగీ మనః పూర్వకంగా స్వీకరించేదే. స్టోయిక్కులూ, సూఫీలూ, దిగంబర జైనులూ, జెన్ సాధువులూ పరిపూర్ణమైన దారిద్య్రాన్ని వరించినవాళ్ళే. కాని ఫ్రాన్సిస్ దారిద్ర్యస్వీకరణలో, చెస్టర్ టన్ చెప్పినట్లుగా ఒక passion ఉంది. ఆకలిగొన్నవాడు విందుబల్లని సమీపించినంత ఉద్రేకంతో, గాఢచిత్తంతో, ఫ్రాన్సిస్ ఉపవాసాల్ని ఆస్వాదించేవాడు. తర్వాత రోజుల్లో ఫ్రాన్సిస్కన్లుగా పిలవబడే ఫ్రాన్సిస్ మతావలంబులు ఈ ఒక్క అంశం మీదనే ఎన్నో శాఖలుగా చీలిపోయారు. అంటే ఒక మనిషి ఎంత మేరకు నిరుపేదగా ఉండవచ్చుననే అంశం మీద. నియమావళి అంటూ పెట్టుకున్నతరువాత, ఏదో ఒక మేరకు రాజీపడాలనే ప్రవృత్తి కూడా మానవస్వభావమే. బుద్ధుడి బోధల్లోని నియమాల్ని యథాతథంగా ఆచరించాలనుకున్నవాళ్ళు థేరవాదులుగా మిగిలిపోగా, వాటిని జనసామాన్యానికి తగ్గట్టుగా సవరించాలని వాదించినవాళ్ళు మహాయానులు కావడం మనకు తెలిసిందే. కాని ఫ్రాన్సిస్ పూర్తిగా భగవత్ భిక్షువుగా జీవించాడు. లేమి అతడి మతం. దానిలో అతడికి ఎటువంటి రాజీనీ కోరుకోలేదు.

ఇక రెండవ నియమం, పరిపూర్ణ బ్రహ్మచర్యం. దాన్ని పరీక్షించడానికా అన్నట్టు క్లేర్ అనే ఒక యువతి ఆయన జీవితంలోకి ప్రవేశించింది. ఒక నవయవ్వని తన జీవితంలో అడుగుపెట్టినప్పుడు, ఒక భావుకుడు ఎంత సంక్షోభానికి లోనుకాగలడో అదంతా నికోస్ చాలా అద్భుతంగా చిత్రించేడు. కాని ఫ్రాన్సిస్ భగవంతుడి పాదాలు వదల్లేదు. ఆ యువతిని సోదరీ అని పిలిచాడు. స్త్రీలకోసం ఒక సన్న్యాసినుల మఠాన్ని ఆమెతో ప్రారంభింపచేసాడు.

మూడవ నియమం, భగవంతుడి పట్ల పరిపూర్ణ విధేయత. ఫ్రాన్సిస్ దృష్టిలో విధేయత అంటే, క్రీస్తు తన దేహంతో అనుభవించిన, శారీరిక హింస మొత్తాన్ని తాను కూడా అనుభవించడం. ఎలా అయ్యిందో తెలియదుగానీ, సిలువ పైన క్రీస్తు దేహం లాగా, ఫ్రాన్సిస్ శరీరం కూడా ఒక పచ్చిపుండుగా మారిపోయింది. క్రీస్తు పట్ల ప్రేమతో తన మొత్తం దేహాన్నే ఒక మానని గాయంగా మార్చుకోగలగడం మానవచరిత్రలో ఫ్రాన్సిస్ ఒక్కడికే చాతనయిందని చెప్పవచ్చు. అటువంటి గాయాలు, ఆ stigmata వల్ల, ఫ్రాన్సిస్ చివరి సంవత్సరాల్లో నిలబడటం, నడవడం, చూడటం కూడా కష్టమైపోయింది. నికోస్ నవల్లో దాదాపు అరవై డెబ్భై పేజీలపాటు చివరిపుటల్లో ఫ్రాన్సిస్ జీవితంలోని చరమ క్షణాల తెంపులేని చిత్రణ. ఆయన ఆ జీవితాన్ని ఎలా జీవించాడోగాని, దాన్ని చదవడమే మనకి కష్టంగా ఉంటుంది. కానీ, ఫ్రాన్సిస్ దృష్టిలో తాను అనుభవిస్తున్నది వేదనకాదు, విజయమే. నికోస్ ఇలా రాస్తున్నాడు:

‘సోదరా ఫ్రాన్సిస్, నీకు మరీ నొప్పిగా ఉందా?’ అనడిగాను.

అతడు ఒక క్షణం పాటు తన నేత్రాలు తెరిచిచూసాడు. ‘సోదరా, లియో, నాకు ఈ క్షణాన నిశ్చయంగా ఉన్నది ఒక్కటే, అదేమంటే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. పట్టలేనంత సంతోషంగా ఉన్నాను. జయం! జయం! సోదరా లియో! మనం గెలిచాం. నేను పుట్టినప్పటినుంచీ నాలో భగవంతుణ్ణి ద్వేషించేవాడెవడో ఒకడు నాలో మసలుతున్నట్టే అనిపించేది. ఇప్పుడు వాడు పూర్తిగా అదృశ్యమైపోయాడు. ఇటువంటప్పుడు సంతోషించకుండా ఉండటమెలా?’

‘తండ్రీ, ఎవరతను?

‘నా దేహంలోని దేహేచ్ఛ’ అని అన్నాడతడు. అప్పటికే అలసిపోయిన ఆయన నేత్రాలు మళ్ళా నిమీలితాలయ్యాయి.

మరొకచోట ఇలా రాస్తున్నాడు:

‘తండ్రీ ఫ్రాన్సిస్, నీ ముఖంలో గొప్ప వెలుగు కనిపిస్తోంది. ఏదైనా మంచి కలగన్నావా?’

‘సోదరా లియో, నా నుంచి రక్తం ఇలా కారిపోతుండగా కలలుగంటో చిరునవ్వులు చిందించగలనని ఎలా అనుకుంటున్నావు? ఇప్పటిదాకా నేను రోదించాను, నా గుండెలు బాదుకున్నాను. నా పాపాల చిట్టా విప్పి భగవంతుడి ముందు మొరపెట్టుకున్నాను. కాని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. దేవుడి చేతుల్లో ఒక స్పాంజి ఉంది.  దేవుణ్ణి ఆయన సమస్త దయాపరత్వంతోనూ ప్రత్యక్షమయ్యే దృశ్యాన్ని చిత్రించమని నన్నెవరైనా అడిగితే,  చేతిలో ఒక స్పాంజితో దేవుడు మనముందు నిలబడ్డట్టు చిత్రిస్తాను. ..అన్ని పాపాలూ తుడిచిపెట్టుకుపోతాయి, తమ్ముడూ లియో, పాపులందరికీ క్షమాభిక్ష లభిస్తుంది- చివరికి సాతానుకి కూడా. సోదరా, నరకమంటే ఏమిటనుకున్నావు, అది స్వర్గాన్ని అనుకుని ఉండే మరో గది, అంతే.’

‘కాని- ‘ అంటో నేనేదో చెప్పబోయాను.

‘హుష్!’ అన్నాడాయన. ‘భగవద్వైభవాన్ని తక్కువ చెయ్యకు.’

విధేయత అంటే ఫ్రాన్సిస్ దృష్టిలో భగవంతుడి వాక్యాన్ని శిరసావహించడమే కాదు, దైవకుమారుడి జీవితానుభవాన్ని తాను తిరిగి అనుక్షణం జీవించడమే, తన దేహంతో, తన ప్రాణంతో, తన ఆత్మతో. అప్పుడు మాత్రమే తాను భగవంతుడితో ఏకం కాగలడని ఆయన నమ్మాడు.

మరొక సన్నివేశంలో ఇలా రాస్తున్నాడు:

మర్నాడు నేనాయన్ని చూసినప్పుడు వణికిపోయాను. నా కళ్ళకి కనబడుతున్నది పూర్వంలాగా ఒక శరీరం కాదు. చినిగిపేలికలైన గుడ్డలో చుట్టిపెట్టిన ఎముకలపోగులాగా ఉన్నాడాయన. ఆ పెదాలు చలికి పాలిపోయి ఉన్నాయి.

నేనాయన చెయ్యి ముద్దుపెట్టుకుంటూ ‘నా తండ్రీ, ఫ్రాన్సిస్, కొద్దిగా కట్టెలు పోగేసి నీకోసం ఒక నెగడి వెలిగించనివ్వు’ అని అన్నాను.

‘తమ్ముడూ, లియో, వెళ్ళు, ప్రపంచమంతా తిరిగి చూడు.  ప్రతి ఒక్క గుడిసెలో, ప్రతి ఒక్క నిర్భాగ్యుడి ఇంట్లో నెగడి మండుతున్నట్లయితే, అప్పుడొచ్చి నాకోసం కూడా ఒక నెగడి రగిలించు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కచోటైనా ఏ ఒక్క మనిషి చలికి వణుకుతున్నా నేను కూడా అతడితో పాటు వణుకుతూ ఉండక తప్పదు’ అని అన్నాడు ఫ్రాన్సిస్.

చివరి పుటలకి వచ్చేటప్పటికి ఈ దర్శనం మరింత స్పష్టత సంతరించుకోడం మనం గమనిస్తాం. ఇలా రాస్తున్నాడు నికోస్:

‘సోదరులారా, ప్రేమంటే ఏమిటి? అనడిగాడు ఆయన తన చేతులు ముందుకు చాపుతూ, మాలో ప్రతి ఒక్కరినీ ఆలింగనం చేసుకోవాలన్నట్టుగా. అప్పుడు తనే ఇలా జవాబిచ్చాడు: ‘ప్రేమంటే ఏమిటి? అది కేవలం దయకాదు, కేవలం సహానుభూతి కాదు. నువ్వు సహానుభూతి చెందుతున్నావంటే అక్కడింకా ఇద్దరున్నట్టు: దుఃఖపడేవాడూ, అతణ్ణి ఓదార్చేవాడూ. నువ్వు ఎవరిపట్లనైనా దయ చూపిస్తున్నావంటే అక్కడ కూడా ఇద్దరున్నట్టు: ఇచ్చేవాడూ, తీసుకునేవాడూ. కాని ప్రేమలో ఒక్కరుమాత్రమే ఉంటారు. అక్కడ ఇద్దరుండారు. ఆ ఇద్దరూ విడదీయలేనంతగా ఒక్కరైపోతారు. ఇంక అప్పుడు నువ్వూ, నేనూ అన్నవి అదృశ్యమైపోతాయి. ప్రేమ అంటే ప్రియతముడిలో తనని తాను పూర్తిగా లయం చేసేసుకోవడం.’

ఇటువంటి వాక్యాల దగ్గరకి వచ్చేటప్పటికి ఈ నవల ఒక ఈశోపనిషత్తు వ్యాఖ్యానం చదువుతున్నట్టూ లేదా ఒక రూమీని చదువుతున్నట్టూ లేదా రమణమహర్షి సంభాషణలు చదువుతున్నట్టు అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

సెయింట్ ఫ్రాన్సిస్ తన ప్రేమని రోమన్ కాథలిక్కులకి మాత్రమే పరిమితం చెయ్యలేదు. ఆ దయాప్రసారం ఒక్క మనుషుల్తోటే ఆగిపోలేదు. పశుపక్ష్యాదులన్నిటినీ తన సోదరులుగా నమ్మిన జీవితం ఆయనది. ఈ అంశంలో ఆయన పూర్తి పాగాన్.

God’s Pauper చదువుతున్నంతసేపూ రచయిత చెప్పుకున్నట్లుగా ఒక odour of sainthood మనల్ని తాకుతూనే ఉంటుంది. మనకి ఎందరో భారతీయ భక్తికవులు, యోగులు, తపస్వులు, మహర్షులు ఎందరో పదే పదే గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా, సెయింట్ ఫ్రాన్సిస్ కీ గాంధీకి మధ్య పోలిక కనబడకపోతే ఆశ్చర్యపడాలి. గాంధీ మరణించి నాలుగేళ్ళు తిరక్కుండా ఇటలీలోని పెరుగియా వద్ద గాంధీ-సెయింట్ ఫ్రాన్సిస్ ల జీవితాల పైన ఒక తులనాత్మక సదస్సు జరిగిందని విన్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. సెయింట్ ఫ్రాన్సిస్ భగవంతుడి భిక్షువు. ఆ పదబంధాన్ని తిప్పి చదివితే దరిద్రనారాయణుడే కదా అవుతుంది. గాంధీగారు గుర్తుపట్టి ఉండకపోవచ్చుగానీ, దక్షిణాఫ్రికా జీవితంలో ఆయన్ని ప్రభావితం చేసిన క్రైస్తవుల ద్వారా, టాల్ స్టాయి రచనల ద్వారా సెయింట్ ఫ్రాన్సిస్ ఆయన్ని ప్రభావితం చేసాడని మనం పోల్చుకోవచ్చు.

గాంధీ గారి కాలం కన్నా కూడా సెయింట్ ఫ్రాన్సిస్ గురించి తెలుసుకోవడం ఇప్పుడు బహుశా మరింత అవసరం. మరీ ముఖ్యంగా మన వస్తువ్యామోహం, ఏ విధంగా ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా శమింపచెయ్యాలని చూసినా శమించని ఇంద్రియ తాపం, ఎవరి మాటలూ, చివరికి అంతర్వాణి మాటల్ని కూడా లెక్కపెట్టని విచ్చలివిడితనం పేట్రేగిపోతున్న ఈ కాలంలో,  ఒకప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్, టాల్ స్టాయి, గాంధీ వంటి వారు కూడా ఈ ప్రపంచంలో జీవించారనీ, మనలాగే వారు కూడా దేహానికీ, దైవానికీ మధ్య నలిగిపోయారనీ, కాని చివరికి వాళ్ళు  తమ చీకటిని జయించారనీ తెలుసుకోవడంలో, పదే పదే గుర్తుచేసుకోవడంలో గొప్ప ఓదార్పు, ధైర్యం, సంతోషం ఉన్నాయని ఎన్నిసార్లేనా చెప్పాలనిపిస్తుంది.

Featured image courtesy: https://www.umbriaconme.com/

25-6-2024

10 Replies to “భగవంతుడి భిక్షువు”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    సెయింట్ ఫ్రాన్సిస్ ఆవిష్కరణ అద్వితీయం. త్రికరణ శుద్ధిగా అన్నీ త్యజించటం, జీవాత్మ పరమాత్మగావటమే అన్న విషయం జాతిమతప్రాంతాతీత సత్యమనే విషయం ఈ వ్యాసం దృఢపరుస్తుంది. మీ రచనా నైశిత్యం
    మీ సత్యదర్శనోల్లాసం వల్ల దీపిస్తున్నది. ఇదీ విశ్వమానవ తత్త్వం . నమస్సులు.

  2. సర్…
    శుభోదయం.
    ఎన్ని సార్లైనా మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిస్తోంది.
    అభినందనలు.
    ప్రేమతో,
    మీ
    రాం భాస్కర్ రాజు

    1. ధన్యవాదాలు రామ్ భాస్కర్!

  3. నమస్కారం,  మీరు సెయింట్ ఫ్రాన్సిస్ అనగానే, చదవాలన్న కోరికతో వ్యాస్యం చదివాను. ప్రాణిక్ హీలింగ్ లో వీరి ప్రార్ధనను అనునిత్యం చేస్తారు. ఆ ప్రార్ధన ఎంతో అద్భుతమైంది. ఆయన పరమ సాధువు. ఒక్క రమణులు, ఒక రామకృష్ణులు లా సదా పరమాత్మ సత్యంలో జీవించినవారు. వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవటం ఎంతో తృప్తి నిచ్చింది. పంచిన మీకు కృతజ్ఞతలు. 
    Sandhya

  4. చదువుతున్నంత సేపు ఒక్కొక్క వాక్యం మనసును తాకుతూనే ఉంది

    దేహానికీ, దైవానికీ మధ్య నలిగిపోయారనీ, కాని చివరికి వాళ్ళు తమ చీకటిని జయించారనీ తెలుసుకోవడంలో, పదే పదే గుర్తుచేసుకోవడంలో గొప్ప ఓదార్పు, ధైర్యం, సంతోషం

    ధన్యవదాలండీ.

    1. చాలా సంతోషం. మీరు ఆరోజు మాట్లాడిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%