
బహుశా 2000 లో అయి ఉంటుంది. రమణజీవి నలుగురు పాండవులు కవితాసంపుటి వెలువరించినప్పుడు, దాని మీద మాట్లాడమని పిలిచాడు. ఆ ఆవిష్కరణ సమావేశం ఒక ఆదివారం పబ్లిక్ గార్డెన్స్ లో పచ్చిక తిన్నె మీద జరిగింది. ఆ పుస్తక పరిచయానికి నన్ను పిలవమని పతంజలి గారు తనతో చెప్పారని రమణజీవి చెప్పాడు. అదొక ఆశ్చర్యం నాకు. పతంజలిగారూ నేనూ ఎప్పుడూ మాట్లాడుకున్నదే లేదని చెప్పాలి. అయినా పతంజలిగారు నన్నెందుకో చాలా అభిమానించారని ఆ రోజు మరీ అర్థమయింది. ఆ మీటింగు అయ్యాక, ఈ సమీక్ష నిహార్ ఆన్ లైన్.కామ్ వారికోసం రాసిచ్చాను. వసంతలక్ష్మిగారు చూసేవారు ఆ పత్రికని. ఈ రివ్యూ నాతో ఖదీర్ బాబు రాయించి తీసుకువెళ్ళాడు. ఇన్నాళ్ళూ ఎక్కడ పోయిందో ఈ కాగితం నిన్న పాతకాగితాల్లోంచి బయటపడింది. ఇప్పటిదాకా నా పుస్తకాల్లో వేటిలోకీ చేరలేదు కాబట్టి, ఈ సమీక్షని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
రమణజీవి కవిత్వం నలుగురు పాండవులు చదివి అర్థం చేసుకోవడానికి అతని మొదటి పుస్తకం ‘వొత్తు థ-రమణజీవి కథలు’ (1999) ని మరొక్కమాటు చూడాలి. మనిషిలో కోల్పోయిన జంతువుకోసం అన్వేషించే క్రమంలో ఈ కథల్ని రాసినట్టు ఆయన పేర్కొన్నాడు. ఏ మనిషికైనా జంతువుగా వుండటమే ఆనందం, అయితే తప్పనిసరిగా మనిషిగా కూడా బతకాల్సి వస్తుంది. ఈ సంఘర్షణ నుంచి ఎవరికీ మినహాయింపు లేదు అని కూడా అన్నాడు.
ఇంతకీ మనిషికీ, జంతువుకీ తేడా ఏమిటి? జంతువుకి స్వీయజ్ఞానం లేదు. అందువల్ల తను వున్న పరిస్థితినుంచి మరొక పరిస్థితికి మార్పుని తీసుకురాగలిగే శక్తి దానికి తక్కువ. అటువంటి మార్పు ఏదన్నా ప్రాకృతిక పరిణామంలో కొన్ని వేల ఏళ్ళ మీదట రావలసిందే తప్ప తనంతతానుగా త్వరితం చేసుకునే శక్తి దానికి లేదు. కానీ మనిషికి ఇటువంటి శక్తి వుంది. అయినా మనిషి జంతువుగా వుండటాన్నే ఇష్టపడతాడని రమణజీవి అంటున్నాడు. ఎందుకంటే, మనిషికి స్వయం నిర్ణయాధికారంతో బాటు జవాబుదారీతనం కూడా వుంటుంది కాబట్టి. ఈ బాధ్యతని అంగీకరించడంలో వేదన వుంటుంది. ఈ బాధ్యత, ఈ వేదన మనిషిని పశువు కాకుండా పశుపతిగా మార్చేవేనని రమణజీవికి తెలుసు. ఈ ప్రయాణం ఒక సరళసూత్రీకరణ కాదని కూడా ఆయన గుర్తించాడు. అంతేకాక అటువంటి సారళ్యాన్ని ఎవరు ప్రతిపాదించినా, అది పైకి ఎంత సహేతుకంగా, సంబద్ధతతో కూడుకున్నట్టు కనిపించినా అవిశ్వనీయమని కవి భావిస్తున్నాడు. మనకి చెప్పకుండా ఉండలేకపోతున్నాడు.
నలుగురు పాండవులు లోని డెబ్భయి పై చిలుకు కవితలన్నీ ఇటువంటి అసంబద్ధత గురించిన వ్యక్తీకరణలే. ఇటువంటి వ్యక్తీకరణకి ఈయన ముందు పఠాభి, త్రిపుర, మో వున్నారు. ముఖ్యంగా త్రిపుర కాఫ్కా కవితలు. జీవితంలోని అసంబద్ధతను కాజువల్ గా చెప్పినట్లు చెప్పడం కాఫ్కా ధోరణి. త్రిపుర ఈ ధోరణిలోనే కాఫ్కా కవితలు అల్లాడు. రమణజీవి ఇప్పుడు ఈ ధోరణి మరింత కొనసాగిస్తున్నాడు.
ఈ ప్రయత్నానికి సాఫల్యం వుందా? ‘ఒత్తు థ కథ’ల్లో పేజి 77 లో ఒక చోట ఇలా వుంది:
‘ఆ బొమ్మ వెయ్యడానికి అతడు వెతుక్కున గీతలూ, స్వరూపం..గీతలూ, స్వరూపం కాదు, అసలైంది ఆ వెతుక్కోవడం. .. ఆ వెతుక్కోవడం ఉందే, దానికి నేను సాగిలపడి నమస్కారం చేస్తున్నాను. కళకు పుట్టుకగా దాన్ని భావిస్తాను..’
ఈ వెదుక్కోవడం రమణజీవి కవితాశిల్పానికి ప్రాతిపదిక. ప్రతి నిర్మాణం ఒక సంబంద్ధ రూపమే కాబట్టి అసంబద్ధతని ప్రకటించే కవి నిర్మాణ కౌశల్యం పైన దృష్టి పెడతాడనుకోను. అయినప్పటికీ నిర్మాణపరమయిన స్పష్టత సాధించిన కవితలు ఇందులో లేకపోలేదు. ‘రెండు పిలుపులు’, ‘నిశ్శబ్దం’, ‘గొడ్లకాపరి’ వంటి కవితల్ని ఇందుకు ఉదహరించవచ్చు.
పూర్వనిర్మాణాల్ని విచ్ఛిన్నం చెయ్యడంలో కూడా ఒక విప్లవాత్మకత, అదెంత ప్రాథమికమయినదయినా సరే, ఉంది. ఈ విచ్ఛిత్తిలో ఒక క్రియాశీలత్వం కూడా వుంది. విగ్రహాల్ని ధ్వంసం చెయ్యడం లాంటి విచ్ఛిన్నం కాదిది. గుడ్డుని విచ్ఛిన్నం చేసుకుని ప్రాణి బయటపడటం లాంటి విచ్ఛిన్నత. ఇది ఏకకాలంలో విధ్వంసకం, సృజనాత్మకం కూడా. అందుకనే కవిని ఏకకాలంలో ‘డెస్ట్రాయర్’ అనీ ‘క్రియేటర్’ అనీ పిలిచాడు అజంతా. సిద్ధార్థ, ఎం.ఎస్.నాయుడు, సైదాచారి ఇటువంటి కొత్త కవిత్వభాషను తీసుకువస్తున్న వేకువపక్షులు. ఇప్పుడు రమణజీవి కూడా తన ఈ కవితాసంపుటంతో ఈ కోవలో చేరుతున్నాడు.
Featured image: Joan Miro, Sans Titre (1947)
26-6-2024
రమణజీవి గారు మంచి ముఖపత్ర చిత్రకారులుగా తెలుసు. మీ ద్వారా కవిగా పరిచయం కావడం సంతోషకరం. నా కొన్ని నవ్వులు ఏరుకుందామని వచన కవితా సంపుటికి వీరు రూపొందించిన ముఖచిత్రం కవితాత్మకంగా ఉంది. ఎఫ్బీలో లఘు కవితలు కూడా చూస్తుంటాను.ముఖచిత్రం గీయడానికి కవిత్వం అంతా చదివి ఏ బొమ్మ గీయాలా అని వెదకులాట మనసులో మెదలుతుంది. అది నాకు కూడా స్వానుభవం కనుక ‘ అసలైంది వెదుక్కోవడం’ అన్న వాక్యం
ఆలోచనీయం.
పైన మీనా గారి బొమ్మ తరచి చూచినా అందులోని మర్మం అందలేదు. ఏదో సాంకేతిక విషయ సంకేతం , మ్యూజిక్ , చాటింగ్ లాంటిదేమోనని
చూసాను. కానీ ఇదమిత్థమని తేల్చుకోలేక పోయాను.
ఆ చిత్రకారుడి గురించి మరొకసారి వివరంగా రాస్తాను.
మీ విశ్లేషణ చాలా బాగుంది సర్
ధన్యవాదాలు
మనిషికి ఇటువంటి శక్తి వుంది. అయినా మనిషి జంతువుగా వుండటాన్నే ఇష్టపడతాడని రమణజీవి అంటున్నాడు. ఎందుకంటే, మనిషికి స్వయం నిర్ణయాధికారంతో బాటు జవాబుదారీతనం కూడా వుంటుంది కాబట్టి. ఈ బాధ్యతని అంగీకరించడంలో వేదన వుంటుంది. ఈ బాధ్యత, ఈ వేదన మనిషిని పశువు కాకుండా పశుపతిగా మార్చేవేనని రమణజీవికి తెలుసు. ఈ ప్రయాణం ఒక సరళసూత్రీకరణ కాదని కూడా ఆయన గుర్తించాడు. అంతేకాక అటువంటి సారళ్యాన్ని ఎవరు ప్రతిపాదించినా, అది పైకి ఎంత సహేతుకంగా, సంబద్ధతతో కూడుకున్నట్టు కనిపించినా అవిశ్వనీయమని కవి భావిస్తున్నాడు. మనకి చెప్పకుండా ఉండలేకపోతున్నాడు.
ఇది చదివిన వెంటనే ఒక్క ఉదుటున కన్నీళ్ళు రాలి పడ్డాయి.. కొన్ని సత్యాల్ని తట్టుకోవడం ఎంతో కష్టం.
అందుకే నేను నా నుంచి అనేకసార్లు పారిపోతూ ఉంటాను.
మీకు హృదయ పూర్వక వందనాలు సర్. ఎక్కడో మూల మూలల్లో ఉన్న హృద్యమైన మాటల్ని అతి జాగ్రత్తగా పట్టుకు వస్తారు.
వాస్తవం చూడకుండా కళ్ళు మూసుకునే నేను అరకన్ను తెరిచి ఇలా చూసి చేష్టలుడిగి నిల్చుని నమస్కరిస్తాను. . ఇంతకు మించి నేనేం చేయగలనో నాకు తెలియదు.
నమోనమః
ధన్యవాదాలు మేడం