‘గత వర్తమాన’ రచయిత

పదేళ్ళ కిందట ఒక మిత్రురాలు నాకొక పుస్తకం పంపించింది. The Adivasi Will Not Dance (2015) అనే కథల పుస్తకం అది.  ఆ కథలు రాసిన హన్స్ దా సౌవేంద్ర శేఖర్ అనే జార్ఖండ్ గిరిజన రచయిత సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్నాడని కూడా విన్నాను. ఆ పుస్తకంలో మొదటి కథ చదవగానే గిరిజనులకి సంబంధించిన కథలు భారతదేశంలో ఎక్కడేనా ఒక్కలానే ఉంటాయి కదా అనిపించింది. అటువంటి సంఘటనలు  శ్రీకాకుళం నుంచి అదిలాబాదుదాకా నేను కూడా చూసాను. కాని వాటిని కథలుగా నేనో, మరో గిరిజనేతర రచయితనో, మలచడం కాదు, ఎవరో ఒక గిరిజన యువకుడో, యువతినో తమ జీవితాల్ని తామే కథలుగా రాసుకుంటే మరింత శక్తిమంతంగా ఉంటుంది కదా అనిపించింది. అటువంటి రచయితలెవరున్నారా అ ని ఆలోచించాను. అప్పుడు గుర్తొచ్చింది, అప్పటికే మల్లిపురం జగదీశ్ తన ‘శిలకోల'(2011) కథల సంపుటి వెలువరించి ఉన్నాడని.

ఈ మధ్యకాలంలో ఆయన ‘గురి’ (2018) పేరిట మరొక సంపుటి కూడా వెలువరించాడు. రెండింటిలోనూ మొత్తం 28 కథలున్నాయి. ఈ కథలు ఇంగ్లిషులోకి అనువదిస్తే ఈ కథలు కూడా తక్కిన దేశమంతా చదువుతుంది కదా అని అనుకున్నాను. ఈ మధ్య ఒకటి రెండు కథల్ని వి.బి.సౌమ్య ఇంగ్లిషులోకి అనువదించినట్టు కూడా చూసాను. కాని ఈ రోజు అజొ-విభొ-కందాళం ఫౌండేషన్ వారు ‘సరిలేరునీకెవ్వరు-విశిష్ట గిరిజన కథాసాహిత్య పురస్కారం’ మల్లిపురం జగదీశ్ కి అందిస్తున్నారని తెలిసినప్పుడు నాకు ఎక్కువ  సంతోషమనిపించింది. గత ఇరవయ్యేళ్ళకి పైగా ఆ సంస్థ తెలుగు సాహిత్యంలో ఎందరో కవుల్నీ, రచయితల్నీ సత్కరిస్తూ ఉంది. లబ్ధ ప్రతిష్టులెందరో ఆ సంస్థ పురస్కారం తమకి లభించడం తమకి గౌరవంగా భావిస్తూ ఉన్నారు కూడా. అయితే మొదటిసారిగా ఈ సంస్థ ఒక గిరిజన రచయితకు ఈ పురస్కారం ప్రకటించి తన గౌరవాన్ని ఇనుమడించుకుందని భావిస్తున్నాను.

మల్లిపురం జగదీశ్ ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మిపురం మండలం పి.ఆమిటి గ్రామానికి చెందిన ఒక సవర గిరిజన యువకుడు. ఆయన పుట్టిన ఊరు, చాలా ఏళ్ళకిందట విశాఖపట్టణం జిల్లాలో, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో, కొన్నాళ్ళు విజయనగరం జిల్లాలో, ప్రస్తుతం మన్యం జిల్లాలో కొనసాగుతూ వస్తున్నది. ఆ ప్రాంతానికి దాదాపు రెండువందల ఏళ్ళ పోరాట చరిత్ర ఉంది. ఒకప్పుడు గంజాం జిల్లాలో భాగంగా ఉన్న గుంసూరు జమీందారీ మీద గిరిజనులు చేసిన తిరుగుబాటు కారణాల్ని అధ్య యనం చేసిన ఈస్టిండియా కంపెనీ, ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమూ కూడా గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పాలనావిధానం అవసరమని గుర్తించాయి. తర్వాత భారతరాజ్యాంగం కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తూ ఈ ప్రాంతాల్ని రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలు కిందకి తీసుకొచ్చింది.

కాని షెడ్యూలు ప్రాంతాల ప్రత్యేక చట్టాలూ, రెగ్యులేషన్లూ సరిగ్గా అమలు కాని కారణం వల్ల, గిరిజన ప్రాంతాల్లో దోపిడీ, పీడనా కొనసాగుతూనే ఉన్నందువల్ల 1969-71 ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో మరొకసారి పెద్ద అశాంతి చెలరేగింది. దాని ఫలితంగా 1975 లో గిరిజన ఉప ప్రణాళిక అనే ప్రత్యేక వ్యూహాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఆ తర్వాత గత యాభై ఏళ్ళుగా గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా విద్యాభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాక, 1986 నుంచి గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల్నే ఉపాధ్యాయులుగా నియమించే ఉత్తర్వులు కూడా ప్రభుత్వం ఇవ్వడంతో ఎందరో యువతీయువకులు గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయులు కాగలిగారు. జగదీశ్ కూడా వారిలో ఒకడు. అయితే ఈ మధ్యకాలంలో ఆ ఉత్తర్వుల్ని సుప్రీం కోర్టు రద్దుచేసింది. జగదీశ్ ఆ తీర్పు మీద ఒక కవిత కూడా రాసాడు.

కాని ఈ యాభై ఏళ్ళుగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు, వనరుల విధ్వంసం, రకరకాల మార్గాల్లో దోపిడీ, భూముల అన్యాక్రాంతం కూడా అంతే శరవేగంతో సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రభుత్వం గిరిజనుల భూముల్ని సేకరించడం, దానివల్ల వందలాది గిరిజన గ్రామాలు, వేలాది గిరిజన కుటుంబాలు నిర్వాసితులు కావడం మరొక కొత్త పరిణామం. ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు వ్యక్తులుగా ఆక్రమించిన భూమికన్నా, ప్రభుత్వాలు చట్టబద్ధంగా సేకరిస్తున్న భూమి విస్తీర్ణంలో చాలా ఎక్కువ. ఇంకా దురదృష్టమేమిటంటే, గిరిజనేతరుడు గిరిజనుడి భూమి ఆక్రమించినప్పుడు కూడా గిరిజనుడు తన కొండకీ, అడవికీ దూరం కాలేదు. కాని ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వల్ల గిరిజనుడు తన గాలికీ, వెలుగుకీ శాశ్వతంగా దూరమైపోతూ ఉన్నాడు.

ఆర్థికంగా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టు పైకి కనిపిస్తుందిగాని, అతడు నానాటికీ మరింత ఋణగ్రస్తుడవుతున్నాడని ఏ గూడేనికి పోయి చూసినా మనకి అర్థమవుతుంది. ఒకసారి ఒక గిరిజన గ్రామంలో చాలా మలేరియా మరణాలు సంభవించాయని విని ఆ గ్రామం చూడ్డానికి వెళ్ళాను. కాని ఆ గ్రామంలో గిరిజనులు మలేరియా మరణాలకన్నా వడ్డాది షావుకార్లంటేనే ఎక్కువ భయపడుతున్నారని తెలుసుకోవడం నా జీవితంలో నేను చూసిన ఒక ఆశ్చర్యకరవిషాదం.

గిరిజన ప్రాంతాల్లో ఈ యాభై ఏళ్ళల్లో సంభవించిన పరిణామాల్లో మరో ముఖ్యమైన విషయం గిరిజనులు కోరుకుంటున్న చదువుకీ , మనం అందిస్తున్న చదువుకీ  మధ్య ఉన్న అంతరం. మొదటిది, మన పాఠశాలలూ, మన కరికులం గిరిజనుల అవసరాల్ని తీర్చేవి కాకపోవడం. రెండోది, అలాగని, ఈ గ్లోబలైజేషన్ యుగంలో ఇంకా గిరిజనుల్ని మనం ఆధునిక విద్యకు దూరంగా ఉంచలేమని తెలుసుకోవడం. ఈ రెండూ కలిసి గిరిజన విద్యను ఒక సంక్లిష్ట విషయంగా మార్చేసాయి.

ఇది కాక, చదువుకోవడం వల్ల, ఉద్యోగ కల్పనవల్ల గిరిజన యువతీయువకులు చాలామంది తమ గ్రామాల్ని వదిలిపెట్టి పట్టణ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోవడం, తమ సంస్కృతికీ, ఆటకీ, పాటకీ దూరం కావడం మరొక పరిణామం. తమ పిల్లల్ని తమ సంస్కృతి నీడ పడకుండా పెంచిపెద్దచేసుకోవాలనే కోరిక కలగడం కూడా చాలామందిలో ఆశ్చర్యం కాదు.

మరొక పరిణామం, మత మార్పిడి. మతమార్పిడి గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం గుర్తుపెట్టుకో వలసిందేమిటంటే, గిరిజనులకు  వాళ్లకంటూ ఒక కాస్మోస్ ఉంది, ఒక దిగంతం ఉంది, ఒక పురాణం ఉంది, కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచారవ్యవహారాలు ఉన్నాయి. వాటినుంచి వాళ్లని దూరం చెయ్యడానికి ఎవరు ప్రయత్నించినా దాన్ని మనం ఒక సంస్కృతి మరొక సంస్కృతి మీద చేస్తున్న దాడిగానే పరిగణించవలసి ఉంటుంది. అలాగని మతమార్పిడిలో గిరిజనుల ఇష్టానికి తావులేదని కూడా అనలేం. వారి సాంప్రదాయిక క్రతువులు ఖర్చుతో కూడుకున్నందువల్లా, కొత్త మతాల్లో ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా వెసులుబాటు ఉన్నందువల్లా చాలామంది గిరిజనులు ఇష్టపూర్వకంగానే మతం మారుతున్నారు. ఈ సంగతి గుర్తించి సవర మంగై అనే ఆయన మడి బ్రహ్మ ఉద్యమాన్ని సవర ప్రాంతాల్లో చేపట్టారు. ఆ కథంతా యూరోప్ లో మతసంస్కరణోద్యమాన్ని, భారతదేశంలో పందొమ్మిదో శతాబ్దిలో జరిగిన సంస్కరణోద్యమాల్ని గుర్తుచేస్తుంది.  మతమార్పిడి నేపథ్యంగా జగదీశ్ రాసిన కథలు, ముఖ్యంగా, ‘శిథిల సమూహం’ కథ చదివినప్పుడు చినువా అచెబె రాసిన Arrow of God (1964) గుర్తురావడంలో ఆశ్చర్యం లేదు. ఆదివాసుల కథలు ఆఫ్రికానుంచి ఆమిటిదాకా ఒక్కలానే ఉంటాయి.

స్థూలంగా అయినా సరే ఈ విషయాల్ని ఎందుకు ప్రస్తావించానంటే, జగదీశ్ కథలకి ఈ జీవితమే, ఈ సమాజమే, ఈ పరిణామాలే నేపథ్యం. ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో దోపిడీ తప్ప అభివృద్ధి లేదనుకునే కాలంలో గిరిజనులు చేతికందిన ఆయుధాలు పట్టుకుని తిరగబడటం తప్ప మరో దారి దొరకని కాలాన్ని చూసి భూషణం గారు ‘కొండగాలి’ (1971) కథలు రాసారు. కాని యాభై ఏళ్ళ తరువాత, అభివృద్ధీ, రూపాలు మార్చుకున్న దోపిడీ కలిసి గిరిజన ప్రాంతాల ముఖచిత్రాన్ని మరింత గజిబిజిగా మారుస్తున్న కాలన్ని చూస్తూ జగదీశ్ ఈ కథలు రాసాడని చెప్పడం కోసమే నేనీ విషయాలన్నీ ప్రస్తావించవలసి వచ్చింది.

ఈ కథల మీద మరింత విస్తారంగా చర్చ జరగాలి. ఎందుకంటే ఈ కథలన్నీ ఒకే ఒక్క దృష్టికోణంలోంచో, లేదా ఏదో ఒక ప్రత్యేక వ్యక్తి లేదా తరగతి దృష్టికోణంలోంచో రాసినవి కావు. జగదీశ్ తన కథల్లో సమకాలిక గిరిజన జీవితానికి సంబంధించిన ఎన్నో పార్శ్వాలు తడిమాడు. కొన్ని కథల్లో ఇంకా 1970 కి పూర్వం గిరిజన జీవితం కనిపిస్తున్నది. కొన్నిట్లో ఎనభైలు, కొన్నిట్లో తొంభైలు, ‘గురి’  సంపుటిలోని చివరి కథలకు వచ్చేటప్పటికి అంటే 2016-2018 మధ్యకాలంలో రాసిన కథలదగ్గరకు వచ్చేటప్పటికి మన కళ్ళముందు గడుస్తున్న కాలం కనిపిస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో కాలాతీతమైన కథలు కూడా కొన్ని వున్నాయి. అంటే స్వాతంత్య్రం వచ్చి స్వర్ణోత్సవాలు జరుపుకున్నా కూడా ఇంకా వైద్యసదుపాయం అందక మరణాలు సంభవిస్తున్న కథలు. జగదీశ్ ఆ కథల్ని కూడా విడిచిపెట్టలేదు. జగదీశ్ కథల్లో ఒకదానికి ‘గతవర్తమానం ‘అని పేరుపెట్టాడు. గిరిజన ప్రాంతాల గురించి వర్ణించడానికి ఇంతకన్నా సరైన పదం మరొకటి దొరకదు. అక్కడ వర్తమానం అనుక్షణం గతాన్ని గుర్తుకు తెస్తూనే ఉంటుంది. పోగొట్టుకున్న గతాన్నీ, పోరాడిన గతాన్నీ కూడా. జగదీశ్ ని కూడా మనం ‘గత వర్తమాన’ రచయిత  అని అనొచ్చేమో!

గిరిజన ప్రాంతాల్ని అర్థం చేసుకోవడంలో నా గురువూ, గొప్ప కవీ సి.వి.కృష్ణారావుగారు ‘పులులు కూడా తమ కథలు చెప్పుకునే రోజులు రావాలయ్యా’ అనే వారు. జగదీశ్ రాసిన  కథలు చదివిఉంటే తన కోరిక కొంతైనా తీరిందని ఆయన సంతోషపడి ఉండేవారు.

3-12-2023

8 Replies to “‘గత వర్తమాన’ రచయిత”

  1. చాలా చాలా ధన్యవాదాలు. ఏది చెప్పినా. …ఎంత బాగా చెబుతారో అని మరో మారు అనిపించింది.Really excellent sir🙏

  2. సర్! నమస్కారం. ధన్యవాదాలు. ఒక కథ రాస్తున్నపుడు కంటే అది అచ్చయినపుడు, అచ్చయినపుడు కంటే అవార్డు వచ్చినప్పుడు ఆనందం పొందుతుంటాను. ఆ సందర్భాల అన్నిటి కన్నా… ఇలాంటి ఆశీర్వచనం పొందినపుడు అది రెట్టింపవుతుంది. అందుకు సాక్ష్యం… నా రెండు చేతులూ నాకు తెలీకుండానే మీ వైపు తిరిగి జోడీ కడుతున్నాయి.

    1. మీకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను. మీ గళం ఎంతోమంది మూగ జీవులకు బలం.

  3. మీరెవరిని పరిచయం చేసినా వివరణాత్మకంగా ఆలోచనీయంగా,అధ్యయనశీలంగా ఉంటాయి. అనేక కొత్తవిషయాలు తెలుస్తుంటాయి.
    మూకం కరోతి వాచాలం అని ఎప్పుడో మా నారాయణ గౌడు నా చెవిలో పోయాలని చూసేవారు. కానీ ఇప్పపడిది చదువుతుంటె
    తరువులతిరస ఫలభార గురుత గాంచు పద్యం గుర్తుకు వస్తున్నది.నమస్సులు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%