భారతీయ రచయిత

రాజారావు ఇండో ఆంగ్లికన్ రచయితల్లో ప్రసిద్ధుడు. రాజారావు సతీమణి సుసాన్  The Sacred Wordsmith Rajarao Memorial Foundation ప్రారంభించి ఆయన అముద్రిత రచనల్ని ప్రచురించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని సాహిత్య వ్యాసాల్ని ఎంపిక చేసి  The Sacred Wordsmith: Writing and the World (2022) పేరిట ఇటీవల వెలువరించారు. ఈ పుస్తకంలో కవులమీదా, శబ్దం మీద ఇరవై వ్యాసాలతో పాటు అయిదు అరుదైన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకానికి సుసాన్ ముందుమాట రాస్తూ రాజారావుని భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించినవాడుగానూ, టాగోర్ లాగా ప్రాచీన తపోవనాల్లో గురుకులాల్లో విద్యాబోధన చేసిన ఉపనిషదృషిగానూ అభివర్ణించారు. ఈ పుస్తకం మొత్తం చదివేక ఆమె మాటల్లో అతిశయోక్తి లేదనిపిస్తున్నది.

రాజారావు పందొమ్మిదేళ్ళ వయసులోనే భారతదేశం వదిలిపెట్టి ఫ్రాన్సు వెళ్లిపోయాడు. ఆ తర్వాత జీవితంలో అధికభాగం యూరోపులోనూ, అమెరికాలోనూ జీవించాడు. జీవితకాలం దాదాపుగా ఇండియాకి బయట జీవించినవాడు భారతదేశానికి తనను తాను ప్రతినిధిగా ఎలా చెప్పుకోగలడు? మాతృభాష కన్నడం అయ్యుండీ ఇంగ్లిషులోనే రచనలు చేస్తూ వచ్చినవాడు భారతీయ సంప్రదాయాన్ని కొనసాగించినవాడెలా కాగలడు? రాజారావు ఈ ప్రశ్నలు తన జీవితమంతా ఎదురుకుంటూనే ఉన్నాడు. ప్రతిసారీ ఆయన చెప్తూ వచ్చిందేమంటే, తాను ఇండియాని వదిలిపెట్టలేదనీ, తన దేశాన్ని తన మనసులో మోస్తూనే ఉన్నాడనీ, తానెక్కడకివెళ్ళినా, ఏ దేశాల్లో నివసించినా తన ఆత్మలో మాత్రం భారతదేశమే నిలబడి ఉందనీ. ఇవి నమ్మదగ్గ మాటలే. ఎందుకంటే డా.కేశవరెడ్డి తన జీవితంలో అధికభాగం డిచ్ పల్లి లో గడిపినా, మానసికంగా మాత్రం తాను పుట్టిన ఒంటిల్లులోనే గడిపేడని ఆయన నవలలు చదివినవాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది. అయితే రాజారావుకి భారతదేశం ఒక జ్ఞాపకంగా మాత్రమే కాదు, ఒక అధ్యయనవిషయంగా కూడా తోడుగా నిలబడింది. తనని తాను ఒక రచయితకన్నా కూడా ఒక సాధకుడిగా చెప్పుకోడానికి ఎక్కువ ఇష్టపడే రాజారావు తన సాధనకి భారతీయ వేదాంతమే ఆలంబనగా నిలబడిందని పదే పదే చెప్పుకుంటూ ఉన్నాడు.

అలాగని రాజారావు పూర్తిగా తన స్మృతుల్లో మాత్రమే జీవించలేదు. ఆయన అన్ని విధాలుగానూ ఒక ప్రపంచపథికుడుగా, ప్రపంచపాఠకుడిగా కొనసాగుతూనే వచ్చాడు. ఉత్తరార్థగోళంలోని మహానదులూ, మహాపర్వతాలూ ఆయన్ని ఒక్కలానే ప్రభావితం చేసాయి. ఆయన ఒక నది ఒడ్డున కూర్చుని మరొక నదీస్తుతి చేసాడు. ఋగ్వేదంలో విశ్వామిత్రుడు చేసిన నదీస్తుతిని ఆయన ఈ వ్యాసాల్లో కనీసం మూడు సార్లు ప్రస్తావించాడు. ఆయన డాంటే పారడైసో ని వారణాసిలో చదివాడట. డాంటే పుట్టిన ఫ్లోరెన్సు దగ్గర్లోని అర్నో నది ఒడ్డున తులసీదాస్ ని చదివాడట. టుస్కనీ ఆకాశంలో సూర్యుణ్ణి చూస్తుంటే ఒక్కొక్కప్పుడు అయోధ్యలో వెలుతురులాగా అనిపిస్తుందట. శంకరాచార్యుణ్ణి ఫ్రాన్సులో ప్రవహించే సీన్ నది అర్థం చేసుకున్నట్టుగా మొత్తం యూరోపు అర్థం చేసుకోలేదంటాడు.

తాను చాలాసార్లు సీన్ నది ఒడ్డున కూచుని కాళిదాసుని చదువుకున్నానని చెప్తాడు. ఫ్రెంచి రచయిత బోసువే ని చదువుతుంటే భర్తృహరి గుర్తొస్తాడంటాడు. ఇటాలియన్ మహాకవి లియోపార్డిని చదువుతుంటే వారణాసి లో గంగ ఒడ్డున కూచుని కబీరుని చదువుకుంటున్నట్టుగా ఉంటుంది అంటాడు. ప్రపంచ సాహిత్యాన్ని ఇలా చదువుకునే మనిషి రచయిత అయితే ఏమిటి కాకపోతే ఏమిటి? ఇండియాలో ఉంటే ఏమిటి? ఆస్టిన్ లో ఉంటే ఏమిటి? కన్నడ వచనకారుల్ని చదువుతుంటే బాదిలేర్ గుర్తొస్తాడని రాసాడే ఆ ఒక్కమాట చాలు, నేను రాజారావుని ఆరాధనాపూర్వకంగా చూడటానికి. అయితే బాదిలేర్ లో ఉన్న వ్యామోహం, వ్యసనం మాత్రం వచనకారుల్లో లేవని వెంటనే గుర్తుచేస్తాడు కూడా.

తనని ప్రభావితం చేసిన పుస్తకాలు అనే వ్యాసంలో రామాయణంతో పాటు భారతాన్ని కూడా ప్రస్తావిస్తూ, భీష్ముణ్ణి అర్థం చేసుకోలేనివాడికి భారతీయ అనుభవం ఎప్పటికీ అర్థం కాదంటాడు. ముఖ్యంగా భీష్ముడు తన కళ్ళతో చూసి వర్ణించిన ఈ శ్రీకృష్ణ సౌందర్యాన్ని అర్థం చేసుకోలేకపోతే మనం భారతదేశాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేమంటాడు.

ఏహ్యేహి ఫుల్లాంబుజపత్రనేత నమోత్సు తే మాధవ చక్రపాణే
ప్రసహ్య మాం పాతయ లోకనాథ రథోత్తమాత్సర్వ శరణ్య సంజ్ఞ్యే
త్వయా హృతస్యపి మమాధ్య కృష్ణ శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే
సంభావితోస్మ్యంధకవృష్ణినాథ లోకైస్త్రిభిర్వీరతవాభియానాత్

ఆయన్ని ప్రభావితం చేసిన రచయితల్లో షేక్ స్పియర్, డాస్టొవిస్కి, రోమే రోలా, పాల్ వేలరీ, ఆంద్రే గైడ్, రిల్క, యేట్స్, కాఫ్కా, గోర్కీలు ఉండటంలో ఆశ్చర్యం లేదుగాని, గాంధీజీ సత్యశోధన ఆయన్ని అన్నిటికన్నా గాఢంగా ప్రభావితం చేసిన పుస్తకం అని ‘కాంతాపుర’ నవల చదివినవారికి ఎవరికైనా ఇట్టే తెలిసే విషయమే.

మనం కూడా ప్రపంచ సాహిత్యం చదువుతాం. కాని రాజారావులాంటి వాళ్ల పఠనానుభవం కేవలం ఒక పాఠకుడి అనుభవం కాదు, అది ఒక తీర్థయాత్రీకుడి అనుభవం. ఒక ఆధ్యాత్మిక సాధకుడి అనుభవం. ఈ వాక్యాలు చూడండి:

But where’s the god, you ask, the temple? The tree is the temple, too old to be named; going round and round it, you feel holy. The leaves celebrate and shine in the Sun.

ఆ వృక్షం, ఆ పురాతన అశ్వత్థం సాహిత్యం. వాక్కు. వాజ్ఞ్మయమైన ప్రతి ఒక్కటీను. అందుకని ఆ వెంటనే ఇలా రాస్తున్నాడు:

The books I have read, like the ghats I have trod, are just the steps down to the river. Lord, what holiness there be on this earth!

సుసాన్ రాజారావు ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో రాసినట్టుగా రాజారావులో టాగోర్ ని గుర్తుతెచ్చేది చాలానే ఉంది. టాగోర్ ని ఒక రినైజాన్సు మానవుడిగా అభివర్ణిస్తూ, రాజారావు, ఆయనలో లియోనార్డ్ డావిన్సీలోని అంతర్దృష్టి, గొథేలోని విశ్వవ్యాప్త దృష్టి, విక్టర్ హ్యూగోలోని విప్లవశీలత్వాలతో పాటు టాల్ స్టోయిలోని సార్వత్రికత కూడా ఉన్నాయని అంటాడు. రాజారావు కూడా అటువంటి సమ్యక్ దృష్టి కోసమే ప్రయత్నిస్తూ వచ్చాడని మనం ఒప్పుకోవచ్చు.

జీవితంలో సింహభాగం భారతదేశానికి ఆవల జీవించినప్పటికీ, రాజారావు తనకి పరిచయమవుతున్న పాశ్చాత్యప్రపంచపు ప్రతి జీవతంతువునీ తనమనసులోని భారతదేశానికి ముడివేసుకుంటూ వచ్చాడనే మనం అనుకోవచ్చు.  India’s greatness lies in its capacity to absorb అని అన్నాడాయన ఒక ఇంటర్వ్యూలో. స్విజ్జర్లాండ్ లో జెనీవాలో కూచుని దూరంగా మౌంట్ బ్లాంక్ శిఖరం కేసి చూస్తున్నప్పుడు తనకి పార్వతీపరమేశ్వరులు కనిపించారని చెప్తే ఆ మాటలు నిజమనే అనిపిస్తుంది. ‘ప్రతి ఒక్క భారతీయుడూ తానెక్కడికి వెళ్ళినా తన హిమాలయాల్నీ, తన గంగానదినీ తనవెంట మోసుకుపోతూనే ఉంటాడు’ అని రాసాడాయన ఒక వ్యాసంలో.

గత శతాబ్ద ప్రారంభంలో టాగోర్, గాంధి, నెహ్రూ వంటివారు భారతదేశాన్ని తక్కిన ప్రపంచం నుంచి వేరుచేసి చూడటానికి ఇష్టపడలేదు. ప్రపంచం, భారతదేశం పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంలోంచే ఒక నవజీవనం వికసిస్తుందని వారు నమ్మారు. రాజారావు నమ్మకం కూడా అదే. ఆయనిలా అంటున్నాడు:

A united world was not created yesterday-it has always existed. Thought has always flown from country to country and back again to its country of origin.

అక్కడితో ఆగకుండా ఈ మాట కూడా అంటున్నాడు: People did not live in nations, they lived in the world.

ఇంతకన్నా అవసరమైన మాట ఈనాటి ప్రపంచానికి మరొకటి ఉంటుందనుకోను.

ఈ పుస్తకం రెండవభాగంలో పదకొండు వ్యాసాలు భాషగురించీ, వాక్కు గురించీ, శబ్దం గురించీ ఉన్నాయి. రాజారావు తనని తాను ఒక శబ్దబ్రహ్మ ఉపాసకుడిగా చెప్పుకున్నాడు. ఈ పుస్తకం తెరవగానే వాక్యపదీయం నుంచి భర్తృహరి శ్లోకం ఒకటి ఎత్తిరాసింది కనిపిస్తుంది. అక్కడ మూలం ఇవ్వలేదుగాని, వాక్యపదీయం 1.131 శ్లోకం ఇలా ఉంది:

తస్మాధ్యః శబ్దసంస్కారః సా సిద్ధిః పరమాత్మనః
తస్య ప్రవృత్తితత్త్వజ్ఞస్తద్బ్రహ్మామృతమశ్నుతే.

(కాబట్టి శబ్దసంస్కారమే పరమాత్మ సిద్ధించే మార్గం. ఆ దారి తెలిసినవాడికి అమృతసత్యం లభిస్తుందని చెప్పవచ్చు)

రెండు పదాలు: శబ్దసంస్కారం, అమృత సత్యం. ఎవరు శబ్దసంస్కారాన్ని సాధనచేస్తారో వాళ్ళ సాహిత్యసంస్కారం నిజంగా గొప్పది. అది గంగానదిలాగా తనని చేరవచ్చిన ప్రతి ఒక్కరినీ పునీతుల్ని చెయ్యగలుగుతుంది. ఈ పుస్తకం చదవకముందు నాకు రాజారావు గురించి ఎక్కువ తెలియదు. కాని ఆయన శబ్దబ్రహ్మాన్ని ఉపాసించాడని తెలిసిన తరువాత నాకిప్పుడు ఆయన ఎంతో విలువైన వ్యక్తిగానూ, రచయితగానూ కూడా కనిపిస్తున్నాడు.

రాజారావు తన సమకాలానికి చెందిన రచయిత కాడు. అలాగని అతడు ప్రాచీన కాలంలో పుట్టి ఉండవలసిన రచయిత కూడా కాదు. తాను నాలుగు-ఏడు శతాబ్దాల మధ్య కాలానికి చెందినవాణ్ణని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడుగాని, సరిగ్గా ఆ సమాధానం వల్లనే ఆయన సాహిత్యం కాలాతీతమైందని చెప్పవచ్చు.

పుస్తకంలోని చివరి అధ్యాయంలో అయిదు ఇంటర్వ్యూలు ఉన్నాయి. అవి రాజారావు మనోభూమికని స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. ఆ జవాబులు చాలాసార్లు నాకు ఆర్.ఎస్.సుదర్శనంగారిని గుర్తుకు తెస్తూ ఉన్నాయి. ఆశ్చర్యం లేదు. వేదాంతులు ఏ దేశంలో ఉన్నా, ఏ భాషలో మాట్లాడినా, వాళ్ళందరూ ఒక్కలానే మాట్లాడతారు. ఆ ఇంటర్వ్యూలు చదువుతుంటే రాజారావుని ప్రత్యక్షంగా చూసినట్టూ, ఆ గదుల్లో ఆయన జవాబులిస్తుంటే మనం కూడా పక్కన కూచుని వింటున్నట్టూ అనిపిస్తుంది. చాలా జవాబులు ఇక్కడ మళ్ళా ఎత్తి రాయాలని ఉందిగాని, ఒకే ఒక్క ప్రశ్న, దానికి ఆయనిచ్చిన జవాబులోంచి ఒక్క వాక్యం మాత్రం ఇక్కడ ఉదాహరిస్తాను.

Shiva Niranjan: Why do you write novels? What do you want to tell your readers through your novels?

Rajarao: I do not want to tell anything. I am a receiver, not a giver..

ఈ ఒక్క వాక్యంతో చెప్పవచ్చు, రాజారావు నిజంగానే భారతీయ ఆధ్యాత్మిక స్రోతస్వినికి వారసుడని. నిజమైన భారతీయ రచయిత అని.

6-2-2024

12 Replies to “భారతీయ రచయిత”

  1. నమస్తే🙏
    మీ కుటీరం- వ్యాసాలతో రోజూ తెల్లవారుతున్నది. ఒక్కో రోజు ఇటువంటి వ్యాసం చదివినపుడు మాత్రం ఓ మెలకువ – జీవించి ఉన్నామనే స్పృహ..కలుగుతుంది.
    వెనకటి రోజుల్లో రాజారావు, ఆర్ కె నారాయణ్ లను చదవడం ఎంత అవసరమో చెబుతూండేవారు పెద్ద వాళ్లు.
    రాజారావు గారి పుస్తకాలు కాంతాపుర, సర్పెంట్ అండ్ ది రోప్ చదివాను. కాని, అవి చదివిన జ్ఞాపకమే ఉందిపుడు. మీ వ్యాసం తో మళ్లీ ఆయన గురించి కొత్తగా తెలుసుకోవాలని ఉంది. ధన్యవాదాలు.

  2. రాజారావు పుస్తకాలు ఎప్పుడూ చదవలేదు. మీరు ఆయనను, ఆయన రచనల సౌందర్యాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చక్కగా చెప్పేరు. ధన్యవాదాలు. నా చిన్నతనంలో మా నాన్న లైబ్రరీలో రాజారావు పుస్తకం ఒకటి ఉండేది. నేను చదవలేదు కానీ, అట్ట మీద పాము బొమ్మ చెట్టుకు చుట్టుకున్నట్లుగా ఉండేదని జ్ఞాపకం. ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తుకొచ్చింది. ధన్యవాదాలు.

  3. మంచి పరిచయం . రాజారావు గారి పుస్తకాలు ఎప్పుడో చదివాను. ఇప్పుడు గుర్తులేదు. మళ్ళి చదవాలి 

  4. గత కొన్ని నెలలుగా విశ్వకవుల పరిచయాలతోకూడిన కవితల తెనుగు సేత పుస్తకం రూపొందించడానికి పలుమార్లు ప్రూఫ్ రీడింగ్ చేసి ఉండక పోతే, మా అబ్బాయి నన్ను రెండు సార్లు యూరోప్ పలు ప్రాంతాలు తిప్పి ఉండకపోతే ఇది ఇంత బాగా నేను ఆత్మీయానుభూతిని పొందే అవకాశం కొంచెం తక్కువ ఉండేదేమో.ఆ సీన్ నది, ఆ ఫ్లోరెన్స్ పరిసరాలు, రోము, ప్యారిస్ వంటి నగరాల చారిత్రక శోభ, ఆల్ప్స్ పర్వతాల అందాలు, కొండవాగుల గమకాలు మళ్లీ కనులారా కాంచిన ట్టయింది.
    ఏదేశం తిరిగి చూసినా
    నీ దేశం కనుల ముందరే
    ఏ కావ్యం చదివి చూసినా
    మన కవులే మనసు నిలుతురే
    మీకు నమస్సులు

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%