
శ్రీపతి గారి పేరు నేను మొదటిసారి భమిడిపాటి జగన్నాథరావుగారి ద్వారా విన్నాను. ఆయన కథల సంపుటి ఒకటి, ఎమెస్కో పాకెట్ బుక్ సిరీస్ లోది, చేతులకుర్చీనో మరేదో కూడా జగన్నాథరావుగారే మాకిచ్చి చదవమన్నట్టు గుర్తు. ఆయన శ్రీపతిగారి గురించి మాట్లాడేటప్పుడు గొప్ప భావోద్వేగం ఆ కంఠంలో వినబడేది. అరవైల చివర్లో శ్రీకాకుళం గిరిజన ప్రాంతాల్లో తిరుగుబాటు తలెత్తకముందే, అక్కడంతా చాలా అశాంతిగా ఉందనీ, ఎప్పుడేనా ఏదేనా జరగొచ్చనీ శ్రీపతిగారు తమతో చెప్తుండేవారని చెప్పేవారాయన. అరవైల తర్వాత తెలుగు సమాజంలోనూ, సాహిత్యంలోనూ సంభవించిన ఎన్నో ప్రకంపనలకి శ్రీపతిగారు చాలా దగ్గరి సాక్షి అని ఆయన చాలా ఉదాహరణలే చెప్పేవారు.
శ్రీపతిగారిని నేను మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నానో గుర్తులేదుగాని, 1992 లో ఆయన నా పెళ్లికి శ్రీశైలం రావడంతో మా మధ్య ఒక అనుబంధం బలపడింది. ఆ తర్వాత1994 లో నేను పాడేరులో పనిచేస్తున్నప్పుడు ఆయన నేరుగా నా దగ్గరకు రావడం గుర్తుంది. అప్పట్లో ఆయన ఆరోగ్యం అంతబాగా లేదు. అయినా విశాఖపట్టణం నుంచి ఆ ఘాట్ రోడ్డుమీద బస్సు ప్రయాణం చేసి నన్ను చూడ్డానికే రావడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆయన నా స్నేహంలో ఏ సంతోషాన్ని వెతుక్కుని అంతదూరం ప్రయాణించి వచ్చేరో నాకిప్పటికీ తెలియదు.
కాని ఆ కలయిక నావరకూ నాకు చాలా కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. ఆ రోజు పాడేరు అడవుల గురించి నేను ఆయనతో మాట్లాడిన మాటలు ఆయన మనసులో నాటుకుపోయినట్టున్నాయి, తాను తిరిగి హైదరాబాదు వెళ్లగానే ఇండియా టుడే వాళ్ళ ప్రత్యేక సంచికకి నాతో యాత్రాకథనాలు రాయించమని సిఫార్సు చేసారు. ఆయన పరిచయం చేసినందువల్లనే నేను ఆ తర్వాత తెలుగు ఇండియా టుడేకి మూడు యాత్రాకథనాలతో పాటు, మూడేళ్ళకు పైగా సాలోచన అనే ఒక కాలం కూడా రాయగలిగాను.
ఆ తర్వాత మళ్ళా శ్రీపతిగారిని కలిసింది 95-96 మధ్యకాలంలో. అప్పుడు ఒకసారి వాళ్లింటికి కూడా వెళ్ళాను. ఆ పరిచయంలో కొత్తగా తెలిసింది ఆయనలోని చిత్రకళాభిమానం. నా నిర్వికల్ప సంగీతం పుస్తకంలో కొన్ని రేఖాచిత్రాలు నేనే గీసుకున్నాను. వాటిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించడం నన్ను తల్లకిందులు చేసింది. ఆ రేఖాచిత్రాల్ని బట్టి నన్నెవరేనా చిత్రకారుడని అనుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ రోజుల్లో ఆ పుస్తకం తెచ్చినప్పటి నా మనఃస్థితిలో కవితలతో పాటు బొమ్మలు కూడా ఉంటే బాగుణ్ణనిపించి ఎవరిని అడగాలో తెలియక నా బొమ్మలు నేనే వేసుకున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో మనసు పడి కొన్నాళ్ళు అభ్యాసం చెయ్యాలనుకుని వదిలిపెట్టేసిన చిత్రలేఖనం పట్ల నేను మళ్లా మొగ్గు చూపానంటే, అందుకు శ్రీపతిగారు కూడా కారణమని చెప్పాలి.
చిత్రకళ పట్ల శ్రీపతిగారిలోని ఆసక్తి మామూలు తరహా ఆసక్తి కాదు. ఒకసారి సూర్యప్రకాశ్ లాండ్ స్కేప్స్ ఎగ్జిబిషన్ ఉంటే ఆయన తాను చూడటానికి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు. ఆ రోజు నాకు మొదటిసారి అనిపించిందేమంటే, శ్రీపతిగారు తన అభిరుచిలో ఒక అరిస్టొక్రేట్ అని. బీదప్రజల జీవితాలు బాగుపడే రోజులూ, ప్రభుత్వాలూ, సాహిత్యాలూ రావాలని ఆయన ఎంతగా కోరుకున్నాడో, మనుషులు తమ అభిరుచిలో సున్నితమైనవాటినీ, సుసంస్కృతమైనవాటినీ ప్రేమించేలా ఎదగాలని కూడా ఆయన అంతగానూ తపిస్తున్నాడని అవాళ నాకు అర్థమయింది. ఆయన పుస్తకాల ముఖచిత్రాలు చూసినవారికి ఆయన చిత్రకళ అభిరుచి ఏమిటో కొంతైనా తెలుస్తుంది.
కాని ఆయనలోని అసలైన మానవుడు మాత్రం పాట్రీషియనూ కాదు, ప్లెబియనూ కాదు. అతడు ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు. తన అంతరాత్మకు తనని సన్నిహితంగా తీసుకుపోగల సన్నిధికోసం, సజ్జనులకోసం, సాంగత్యాల కోసం ఆయన వెతుక్కుంటూనే ఉన్నాడని నాకు నెమ్మదిగా బోధపడింది. ఆయన ఎన్నేళ్ళుగానో వెతుక్కుంటూ ఉన్న గురువు ఎట్టకేలకు కనబడ్డాడని శ్రీపతిగారిని సన్నిహితంగా ఎరిగినవారందరికీ తెలిసిన విషయమే. 2000 తర్వాత శ్రీపతిగారిని ఎప్పుడు కలిసినా తన గురువు విశేషాలు తప్ప చెప్పడానికి మరొక విషయమేదీ లేదన్నట్టే కనిపించేవారు. తన గురువు ఆయన మాట్లాడే మాటలు, ఆయనతో తన అనుభవాలు చెప్తున్నప్పుడు ఎంతో వ్యక్తిగతమైన తన రహస్యాల్ని నాతో మాత్రమే పంచుకుంటున్నట్టుగా చెప్పుకునేవారు. నా చిన్నప్పుడు ఎంతో గొప్పగా విన్న ఒక రచయిత, తర్వాత రోజుల్లో నేను చాలా దగ్గరగా చూసిన సున్నితమనస్కుడు పక్కకు తప్పుకుని, ఆ స్థానంలో, అచంచలమైన విశ్వాసి ఒకరు కనిపించడం మొదలుపెట్టారు. ఒక మనిషి జీవితం ఎక్కడేనా మొదలుపెట్టి ఉండవచ్చుగాక, ఏ దారులమ్మటేనా తిరిగి ఉండవచ్చుగాక, కాని తన మనస్సు స్థిరపడటానికి ఒక నీడకి చేరుకోగలిగితే, ఆ జీవితానికి అంతకన్నా ధన్యత లేదు. అటువంటి వాళ్ళని చూసినా కూడా మన మనసు నెమ్మదిస్తుంది.
పదేళ్ళు దాటిందేమో నేనూ శ్రీపతిగారూ కలుసుకుని. కాని ఆయన్ని కలవాలనిగాని, కలుసుకోలేకపోతున్నానని గాని అనిపించేది కాదు. ఆయన ఎక్కడ ఉన్నా నిశ్చింతగానూ, నిబ్బరంగానూ ఉన్నాడనే అనిపిస్తుండేది. నిబ్బరం అన్న మాట చిన్నమాట కాదని నాకు తెలుసు. ఆయనకి జీవితంలో ఎదురైన ఆటుపోట్లనుంచి ఆయన్ని ఆ నిబ్బరమే కాపాడింది.
శ్రీపతిగారూ నేనూ ఎక్కువ సార్లు కలుసుకోకపోయినా, ఎక్కువమాట్లాడుకోకపోయినా, ఆయన మాట్లాడిన ప్రతి మాటా నా మీద ప్రభావం చూపిస్తూనే ఉండేది. ఒకసారి రవీంద్రభారతిలో ఒక కవితాసంపుటి ఆవిష్కరణసభలో నేను ప్రసంగించాను. ఆయన ఆ రోజు శ్రోతల్లో ఉన్నారు. మీటింగు అయిపోయాక, ‘తక్కినవాళ్ళ గురించి నేను ఆలోచించనుగానీ, మీలాగా తెలుగు వచ్చినవాళ్ళు కూడా ప్రసంగాల్లో అన్ని ఇంగ్లిషు పదాలు వాడుతుంటే వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది’ అన్నారు. ఆ మాట నా మీద చూపించిన ప్రభావానికి నేను కొన్నేళ్ళ పాటు నా ప్రసంగాల్లో ఒక్క ఇంగ్లిషు పదం కూడా దొర్లకుండా జాగ్రత్తపడుతూనే ఉన్నాను.
ఆయన ఒక అరుదైన మనిషి. సాహిత్యాన్ని చూసి మోకరిల్లడమే తప్ప, తన ప్రతిభను చూసుకుని గర్వించడం తెలియని సాహిత్యకారుడు. అటువంటి ఒక భావుకుడు, సాధకుడు నా జీవితంలో నాకు దగ్గరగా తెలుసని అనుకుంటూ ఉంటేనే నాకెంతో సంతృప్తిగా అనిపిస్తోంది.
9-2-2004
శ్రీపతి గారికి నివాళి
నమః
శ్రీపతి గారికి మీరు చేసిన నివాళి నాకు మీరు ఆయన గురించి చేసిన ఒక పరిచయం.. మీ నివాళి చదివితే ఆయన గురించి ఏ మాత్రం తెలియని, ఆయన సాహిత్యం కించిత్ కూడా చదవని నాకు వెంటనే ఆయన పుస్తకాలు తీసుకుని చదవాలని, ఆయన పెయింటింగ్స్ చూసి ఆనందించాలని అనిపించింది.. చాలా గొప్ప జ్ఞాపకాలు మీవి. మాతో పంచ్యుకున్ననందుకు ధన్యవాదాలు. ఇంతకీ ఆయన గురువుగారు ఎవరండీ?
ధన్యవాదాలు సార్.
🛐
నివాళి
మీరు మాత్రమే రాయగలిగిన గొప్ప నివాళి. నమస్కారం.
ధన్యవాదాలు సార్