చదవడం, రాయడం

మా అమృత ఎడింబరోలోనూ, ఇండియాలోనూ ఉన్న మరికొందరు మిత్రుల్తో కలిసి Reader’s Renaissance పేరిట ఒక బుక్ క్లబ్ ఏర్పాటుచేసుకున్నామనీ, మొదటి మీటింగ్ లో తమని ఉద్దేశించి మాట్లాడమనీ అడిగితే నిన్న జూమ్ లో కలుసుకున్నాం. వాళ్ళు డాటా సైన్స్, మేనేజ్ మెంట్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు. వాళ్ళకి సాహిత్యం, తత్త్వశాస్త్రం, చిత్రకళ లాంటి రంగాల్లో ఆసక్తి ఉంది. తమ జీవితాల్ని మరింత ప్రగాఢంగా తీర్చిదిద్దుకోడానికి పుస్తకాలు చదవడం ఎలా ఉపకరిస్తుందో చెప్పమని అడిగారు నన్ను. దాదాపు ఇంటర్వ్యూలాగా సాగిన ఆ సమావేశంలో వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలు, నా జవాబులు:


ప్ర: పుస్తకాలు చదవడం పట్ల మీకు ఇష్టం ఎప్పణ్ణుంచీ మొదలయ్యింది? అది మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దింది?

జ: నేను పుట్టింది ఒక మారుమూల గిరిజన గ్రామం. నాకు ఇరవయ్యేళ్ళ వయసొచ్చేదాకా ఆ గ్రామంలో కరెంటు లేదు. వార్తాపత్రిక, గ్రంథాలయం లాంటివి కూడా లేవు. ఈ రోజు మీకు నిత్యావసరాలుగా మారిపోయిన కంప్యూటర్, టివి, మొబైల్, ఇంటర్నెట్ లాంటివి ఊహల్లో కూడా లేని రోజులు. ఆ ఊరికీ, బయటిప్రపంచానికీ ఉన్న సంబంధం ఏదన్నా ఉంటే అది పుస్తకాలు మాత్రమే. మా ఇంట్లోనూ, మా పక్కింట్లోనూ ఉన్న పుస్తకాలతోనూ, రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీ నుంచి రోజు మా అన్నయ్య తెచ్చే పుస్తకాలతోనూ మా అక్క సెలవులకి వచ్చేటప్పుడు రాజమండ్రినుంచి తెచ్చుకునే సాహిత్యంతోనూ నేను విశాల ప్రపంచంలోకి మేల్కొన్నాను. పుస్తకాలు చదవడంలో, అవి ఏవైనాకానీ, నాకు తెలీకుండానే నా తృష్ణకి సంతృప్తి దొరుకుతున్నట్టుండేది. అదీకాక, మాది మరీ కలిగిన కుటుంబం కాకపోవడం కూడా నా పఠనాభిలాషకి దోహదం చేసింది. చదవడం, రాయడం అనేవి most inexpensive వ్యాపకాలు. ఒకవేళ నేను సంపన్న కుటుంబంలో పుట్టి ఉంటే బహుశా మరేవైనా ఖరీదైన వ్యాపకాలు దొరికి ఉండేవేమో. కాని డబ్బులేకపోవడం వల్ల  కాలాన్ని పుస్తకాలు చదవడం మీద కర్చుపెట్టడమే నేను చెయ్యగలిగిన దుబారా గా ఉండేది.

పుస్తకాలు చదవడం వల్ల అన్నిటికన్నా ముందు కలిగే మెలకువ, మనం చూస్తున్నది మాత్రమే జీవితం కాదనీ, మనకు తెలిసింది మాత్రమే ప్రపంచం కాదనీ, మనకి తటస్థిస్తున్న అనుభవాలు మనకి మాత్రమే మొదటిసారిగా కలుగుతున్నవి కావనీ. ఆ మెలకువ వల్ల మన ఆలోచనలకొక లోతూ, స్తిమితం చేకూరుతాయి. మనం మరింత నిదానంగా జీవితాన్ని సమీపించగలుగుతాం.

పుస్తకాల మీద నాకున్న ఇష్టం వల్ల నా జీవితచరిత్ర అంటే ప్రధానంగా నేను చదువుకున్న గ్రంథాలయాల చరిత్ర అని చెప్పగలను. ఒక్కరోజుకి మించి ఏ ఊళ్ళో ఉండవలసి వచ్చినా, నేను ముందు వెతుక్కునేది ఆ ఊళ్ళో ఉన్న గ్రంథాలయాల్నే. ఒక్కరోజే ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తే, అక్కడ ఒక సాయంకాలం ఒక గంట తీరిక దొరికితే నేను చేసేపని ఆ ఊళ్ళో ఉన్న పుస్తకాల దుకాణాలకి వెళ్ళడం. కాని నేనింకా పాతకాలం వాణ్ణి. పుస్తకాల పట్ల ప్రచండమైన ఆకలి ఉన్నరోజుల్లో రోజుకి రెండు పుస్తకాలు కూడా దొరికేవి కావు. మీరు చాలా అదృష్టవంతులు. ఒక్క క్లిక్ తో కొన్ని లక్షల పుస్తకాలు మీ మొబైల్లో తెరుచుకునే కాలంలో పుట్టిపెరుగుతున్నారు మీరు.

ప్ర: మీ జీవితాన్ని మార్చిందని చెప్పగల ఒకే ఒక్క పుస్తకమంటూ ఏదన్నా ఉందా?

జ: ఒకసారి ఒక మిత్రుడు తన పత్రికకోసం ఈ ప్రశ్న అడిగాడు నన్ను. ఒకటి కాదు, అయిదు పుస్తకాల పేర్లు చెప్పమన్నాడు. నేను వారం రోజుల పాటు మనసులోనే ఎన్నో జాబితాలు రాసుకుని, మనసులోనే చింపేసి, మళ్ళా రాసి, మళ్ళా కొట్టేసి, చివరికి పదిపుస్తకాల జాబితా తయారు చేసాను. కాని తనకి అయిదు పుస్తకాల పేర్లు మాత్రమేకావాలన్నాడు ఆ మిత్రుడు. ఇప్పుడు మీరు ఒకే ఒక్క పుస్తకం పేరు చెప్పమని అడుగుతున్నారు. చాలా పుస్తకాలున్నాయి. ఒకప్పుడు నాకు చాలా నచ్చిన పుస్తకం పేరుచెప్పమంటే పథెఏర్ పాంచాలి మీద రాసాను. కాని జీవితాన్ని మార్చిన పుస్తకం పేరుచెప్పమంటే జార్జి కాట్లిన్ రాసిన In the Path of Mahatma Gandhi (1948) అనే పుస్తకం పేరు చెప్తాను. ఆ పుస్తకం తెలుగు అనువాదం ‘గాంధీజీ అడుగు జాడల్లో’ కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్ ప్రచురణ చిన్నప్పుడు మా అక్కకి స్కూల్లో బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకం అప్పటికి చాలాకాలంగా మా ఇంట్లో ఉన్నా కూడా నేను బి ఏ లో చేరినప్పుడు మటుకే ఆ పుస్తకం తెరిచాను. ఆ రోజుల్లో నేను నా జీవితంలో ఒక చీలుబాట దగ్గర నిలబడి ఉన్నాను. నా భవిష్యత్తు, ముఖ్యంగా నా చదువు ఎటువైపు సాగాలి? కెరీర్ కోసమా? జ్ఞానం కోసమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఆ పుస్తకం నాకు దారి చూపించింది. తత్త్వశాస్త్ర అధ్యయనం వైపు నన్ను నడిపించింది. ఇదంతా నా ‘సత్యాన్వేషణ'(2003) పుస్తకానికి రాసిన ముందుమాటలో రాసాను. కాట్లిన్ పుస్తకం మరీ గొప్ప గ్రంథం అని చెప్పలేను. కాని ఒక ముఖ్యమైన మలుపులో ఆ పుస్తకం ఒక సైన్ బోర్డు లాగా నేను ముందుకు సాగవలసిన దారి చూపించింది.

ప్ర: మీ తక్కిన బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మీరు చదవడానికి సమయం ఎలా చేజిక్కించుకోగలుగుతున్నారు?

జ: ఇప్పుడు నేను విశ్రాంత ఉద్యోగిని. నాకు మరే బాధ్యతలూ లేవు. కాని ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు ఏ మాత్రం సమయం దొరికినా పుస్తకాల్లో తలదూర్చేవాణ్ణి. ‘జీవితపు సన్నని సందులకే ఆకర్షణ మాకు’ అన్నాడు శ్రీ శ్రీ. ప్రభుత్వోద్యోగం తీరికలేనట్టు కనిపించే మాట నిజమేగాని, ఆ తొందరలో, ఆ పరుగులో సన్నని సందులు, తీరికవేళలు చాలానే దొరికేవి. ప్రభుత్వసమావేశాల్లో, ఉన్నతాధికారులకోసం వేచి ఉండవలసి రావడంలో, మంత్రులకు బ్రీఫింగ్ ఇవ్వడంకోసం సెక్రటేరియట్ లోనో, అసెంబ్లీలోనో గంటల తరబడి వేచి ఉండటంలో నాకు చాలా తీరిక దొరికేది. చివరికి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ నడుస్తున్నప్పుడు కూడా, మా వంతు ప్రశ్న వచ్చేదాకా లౌంజ్ లో వేచి ఉండవలసి వచ్చినప్పుడు కూడా పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాణ్ణి. అలాంటి క్వశ్చన్ అవర్ల మధ్యనే కాళిదాసు కుమారసంభవం చదవడం పూర్తిచేసాను. అలాగే ప్రయాణాలు, లంచ్ అవర్లు- ఎప్పుడు సమయం చిక్కుతుందో తెలియదు కాబట్టి ఎప్పుడూ ఒక పుస్తకం చేత్తో పట్టుకునే ఉండేవాణ్ణి.

ప్ర: ఎటు చూసినా డిస్ట్రాక్షన్లు మాత్రమే కనిపిస్తున్నప్పుడు మీరు చదవడం మీద ఇంత తదేక దృష్టి ఎలా పెట్టగలిగారు?

జ: బహుశా చదవడం కూడా నాకొక డిస్ట్రాక్షన్ అయి ఉంటుంది. నిజంగానే చదవడం అన్నిటికన్నా ముందు నాకొక pleasure, ఒక సాంత్వన. ఎంత కష్టాన్నైనా, ఆందోళననైనా మరిపించగల ఔషధం. నా మీద మిన్ను విరిగి మీద పడబోతున్నదని తెలిసినప్పుడు కూడా నా చేతుల్లో ఒక పుస్తకం ఉంటే చాలు, మరేమీ అక్కర్లేదనిపిస్తుంది. చదవడం ఒక పవిత్రకర్తవ్యం అనో, తప్పనిసరిగా పాటించవలసిన బాధ్యత అనో, గంభీరమైన వ్యాపకం అనిగాని మీరు అనుకుంటే, మీ మనసు చదవడం వదిలిపెట్టి తక్కిన డిస్ట్రాక్షన్ల వైపు చూస్తుంది. అలాకాక చదవడం ఒక fun, ఒక joy అనుకుంటే, జీవితం పెట్టే హింసనుంచి తప్పించుకోడానికి చదువుకుంటూ ఉండటానికి మించిన డిస్ట్రాక్షన్ మరొకటి దొరకదు. పైగా అది నేను ముందే చెప్పినట్టు, most inexpensive కూడా.

ప్ర: మీరు ఇప్పుడు చదువుతున్న పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలో ఎలా ఎంచుకుంటారు?

జ: దీనికి జవాబు చెప్పడం కష్టం. కాని నాకు ముగ్గురు ఏంజెల్సు తెలుసు. ఒకరు లైబ్రరీ ఏంజెల్. మనం ఒక లైబ్రరీలో అడుగుపెట్టినప్పుడు ఆ కారిడార్ లో, ఆ బీరువా దగ్గరకే ఎందుకు వెళ్తామో, ఆ షెల్ఫులోంచి, ఆ పుస్తకాన్నే ఎందుకు తీస్తామో ఎప్పటికీ చెప్పలేం. నేననుకుంటాను లైబ్రరీ ఏంజెల్ మనల్ని అక్కడికి నడిపిస్తుందని. 1982 లో రాజమండ్రి లో సీతంపేట బ్రాంచి లైబ్రరీలో ‘అమృత సంతానం’ పుస్తకం లైబ్రరీ ఏంజిల్ చూపించకపోయి ఉంటే, అటువంటి ఒక పుస్తకం వచ్చిందనే నాకెప్పటికీ తెలిసి ఉండేది కాదు. అలానే రెండో ఏంజెల్ బుక్ షాప్ ఏంజెల్. మూడవ ఏంజెల్ మన బెడ్-సైడ్ ఏంజిల్. ఆ రోజు లేదా ఆ రాత్రి మనం ఏ పుస్తకం చదవాలో మన మంచం పక్కన తచ్చాడే దేవదూతనే డిసైడ్ చేస్తూ ఉంటుంది చాలాసార్లు.

ప్ర: మీరెప్పుడన్నా ఏదైనా బుక్ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారా? ఈ విషయంలో మీ అనుభవాలేమిటి?

జ: నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు గౌతమీ గ్రంథాలయంలో ఎన్నో అరుదైన పుస్తకాలు, విలువైన పుస్తకాలు కనిపించేవి. కాని ఆ లైబ్రరీకి చదువుకోడానికి వచ్చేవాళ్ళు న్యూస్ పేపర్లు మాత్రమే తిరగేసి వెళ్ళిపోయేవారు. వాళ్లకి ఆ గ్రంథాలయంలో ఉన్న విలువైన పుస్తకాల గురించి చెప్పడం కోసం ఒక రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నాం. నా మిత్రులు కవులూరి గోపీచంద్, వంక బాలసుబ్రహ్మణ్యంలతో కలిసి ఒక రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేసాం. ఒక వేసవిలో అధ్యయన తరగతులు కూడా నిర్వహించాం. కాని ఆ కృషి ఎక్కువరోజులు కొనసాగలేదు. మీరు ఇప్పుడు ఒక రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారంటే నాకు ఆ రోజులే గుర్తొచ్చాయి.

ప్ర: మన reading experience నుంచి వీలైనంత రాబట్టుకోడానికి మీరేమైనా సూత్రాలు చెప్తారా?

జ: రెండు సూత్రాలు. ఒకటి, ఏ పుస్తకం చదివినా మీకై మీరు ఒక సమీక్ష రాసుకోండి. నా వరకూ నాకు ఆ పుస్తకం మీద తో కొంత రాసుకున్నాకనే ఆ పుస్తకం పూర్తిగా వంటబట్టినట్టు అనిపిస్తుంది. ఒక జర్నల్ లేదా రివ్యూ ఏదో ఒకటి, అది ఆ పుస్తకం గురించిన మీ ఆలోచనల్ని, స్పందనల్ని crystallize చేస్తుంది. రెండోది, ఆ పుస్తకం గురించి like-minded people తో మాట్లాడుకోడం. దాన్ని విమర్శించేవాళ్ళతో కాదు. మీకులానే  ఆ పుస్తకాన్ని ఇష్టపడ్డవాళ్ళతో మాట్లాడుకోండి. అప్పుడు ఆ insights పరస్పరం enriching గా ఉంటాయి.

ప్ర: పుస్తకాలు చదవడంలో మనం దేనికి ప్రాధాన్యాన్నివాలి? భాష పెంపొందించుకోవడమా లేక పరిజ్ఞానమా లేక కేవలం సంతోషమా?

జ: చిన్నప్పుడు ఏది పడితే అది చదువుతాం. కాని పెద్దయ్యేకొద్దీ మన ప్రత్యేకమైన ఆసక్తులేమిటో మనకు తెలుస్తుంటాయి. మీరు శశి థరూర్, కబీర్ గురించి ప్రస్తావించారు. నా వరకూ నాకు ఈ వయసులో థరూర్ లో ఎటువంటి ఆకర్షణా కనిపించదు. అతడి భాషాపాండిత్యం బాగా సంపన్నుడి ఇంట్లో అమర్చుకున్న ఫర్నిచరులాగా కనిపిస్తుంది. అదే కబీర్ ని చదువుతుంటే మనసుకి గొప్ప ఊరటగానూ, చుట్టూ ఉన్న చీకటి పక్కకుపోయి వెలుతురు పరుచుకుంటున్నట్టుగానూ ఉంటుంది. వయసు గడిచేకొద్దీ సరళంగా, నిరాడంబరంగా, సూటిగా, నిజాయితీగా ఉండే రచనలు చదవడం మీద మక్కువ కలుగుతుంటుంది.

ప్ర: మీరు తత్త్వశాస్త్రం గురించి ప్రస్తావించారుకదా, పాశ్చాత్య, భారతీయ తత్త్వశాస్త్రాల్లో మేము చదవడానికి తగిన పుస్తకాలు చెప్పగలరా?

జ: తత్త్వశాస్త్రం లో కొన్ని గ్రంథాలు అత్యున్నతమైన పుస్తకాలేగాని, అవి ప్రారంభదశలో మరీ గహనంగా ఉంటాయి. ఉదాహరణకి ఇమ్మాన్యువల్ కాంట్ రాసిన  Critique of Pure Reason, హెగెల్ రాసిన  The Phenomenology of Spirit లాంటివి. కాబట్టి నేను వాటిని మీకు సజెస్ట్ చెయ్యను. అందుకు బదులు వ్యాఖ్యాతల అవసరంలేకుండా మీతో నేరుగా మాట్లాడే పుస్తకాలున్నాయి. ఉదాహరణకి ప్లేటో రాసిన The Symposium, అరిస్టాటిల్ Poetics, మార్కస్ అరీలియస్ Meditations, ఎపిక్టెటస్ Manuals, ఎమర్సన్ Nature లాంటివి. మొత్తం పాశ్చాత్య తత్త్వశాస్త్రం పైన స్థూలంగా ఒక అవగాహనకు రావాలంటే రస్సెల్ రాసిన  The History of Western Philosophy చక్కటి గ్రంథం. ఇక భారతీయ తత్త్వశాస్త్రంలో రాధాకృష్ణన్ రాసిన  The Idealist View of Life, టాగోర్ రాసిన Religion of Man, కృష్ణమూర్తి Notebook ల్తో మొదలుపెట్టండి.

ప్ర: మేము కూడా మీలా రాయాలంటే ఏం చెయ్యాలి?

జ: రాయడం దానికదే గొప్ప విషయం కాదు. చదవడం, రాయడం, లేదా ప్రసంగించడం- మీరు ఏ పనిచేసినా అది మీ అనుభవాన్ని ఒక finality కి తీసుకువచ్చేదిగా ఉండాలి. ఉదాహరణకి మీ మిత్రురాలు రితిక తాను వెనిస్ వెళ్ళినప్పుడు గీసిన ఒక చిత్రాన్ని మనకి ఇప్పుడు చూపించింది, చూసాం కదా. తన అనుభవాన్ని చిత్రలేఖనంగా మార్చడం ద్వారా ఆ విషయంలో ఆమె finality కి చేరుకున్నట్టు. ఆమె మళ్ళా ఆ అనుభవం గురించి వేరే ఒక వ్యాసం రాయాల్సిన పనిలేదు. నా వరకూ నాకు ఏది చదివినా, చూసినా, విన్నా దాని గురించి రాసుకుంటే తప్ప, ఆ అనుభవం finality కి చేరుకున్నట్టు అనిపించదు. కాబట్టి రాసుకుంటాను. మీకూ అటువంటి తపన ఉంటేనే రాయండి. అంతే తప్ప రాయడం ఏదో గొప్ప విషయం అనుకుని దాన్నొక బరువుగా మార్చుకోకండి.

ప్ర: మా బుక్ క్లబ్ బాగా నడవడానికి ఏవైనా సూచనలు చెప్తారా?

జ: మీ క్లబ్ లో కేవలం భారతీయులు మాత్రమే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా సభ్యులుగా చేరగలరేమో చూడండి. ప్రతి సమావేశంలోనూ కనీసం ఒక కొత్త పుస్తకం గురించేనా మాట్లాడుకోండి. మాట్లాడుకున్నదాన్ని చిన్నపాటి సమీక్షగా రాసి మీ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేసుకోండి.

4-2-2024

21 Replies to “చదవడం, రాయడం”

  1. మేంకూడా ఆ సమావేశంలో పాల్గొనట్టు,మీతో మాట్లాడి మాకు కావలసినది పొందినట్టు భావన.పుస్తకాలు చదవడం మొదలుపెట్టి యభై ఏళ్ళు కావొస్తున్నా!

  2. What an absolute delight to read your take on reading and writing.and sharing your thoughts with the current generation. It’s really a renarkable coincidence that Yesterday I heard a PodCast of an interview done by Harshaneeyam S with Aditya Annavajjhala of Book Collective regarding Book Reading. Your views and his views with more than 30 years of age difference between you both presents a great perspective. I am amazed at the questions posed by your daughters Book Club Readers Renaissance and was equally and pleasantly surprised at the clarity of thought on Reading Telugu Sahityam and Aditya’s journey in getting more and more like minded people and excellent initiatives he is undertaking to get contemporary literature and authors to the avid readers. Here is the link to the podcast. ( https://open.spotify.com/episode/1IrHalg2pqcd9sc8s3PjQf ) You will definitely like the service he is doing to promote reading among youngsters with the limited resources and team available to him. It is really heartwarming to know that the current generation to is embracing the Telugu Literature and trying to inculcate the habit of reading among the youth which I consider is the need of the hour. All the Very Best To Amrutha and her Friends to make big strides and take Readers Renaissance forward.

  3. ఒక ప్రశ్నండి. అంతా బాగానే ఉంది గానీ చదువుకున్న దాన్ని బుర్రలో దాచుకోవడం ఎలా? చదవడం చదువుతాం. నాలాంటి వాడికి చదివిన విషయం ఆట్టే కాలం ఉండదు. మీరు చెప్పేదేమైనా ఉంటే ప్రత్యేకంగా ఒక వ్యాసంలా వేరేగా వివరంగా చెప్పండి.

  4. విలువైన సూచనలు చేశారు. ధన్యవాదాలు.

  5. మీకై మీరు ఒక సమీక్ష రాసుకోండి.. ఇదో దారి దీపం

  6. well said with so much clarity. Fifty years back when we were staying at Bajarghat, Nampally I used to go to the library near my house every evening and that was my first guru, literally. I read many books including Viswanath Satyanarayana.
    In our community I started a library & call it Reading room. trying to get the young & old to the habit & pleasure of reading.

  7. పుస్తకాలు చదవడం మీద మంచి అవగాహన ఏర్పరచారు .

  8. ఒంగోలు లో కూడా ఒక రీడర్స్ క్లబ్ పెట్టాలని అనిపిస్తూంది,,, ప్రయత్నిస్తాను సర్ ,

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading