అదంతా ఒక అదృశ్యయుగం

ఆనంద్ శాస్త్రి గారిది ఏలూరు దగ్గర పెద్దవేలుపు గ్రామం. ఆయన ఇరవయ్యేళ్ళ కిందట ఉద్యోగ రీత్యా హైదరాబాదు వచ్చారు. స్టేట్ బాంకు మేనేజరుగా పనిచేసి రెండేళ్ళ కిందట పదవీవిరమణ చేసారు. ఒకప్పుడు ఆయన గొప్ప చిత్రకారుల్తో, ముఖ్యం సంజీవదేవ్ వంటివారితో కలిసి తిరిగారు. వాళ్ళనుంచి చిత్రకళలో మెలకువలు నేర్చుకున్నారు. ఫైన్ ఆర్ట్స్ లోనూ, విజువల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందారు. మొదటి ప్రదర్శన 1994 లో ఢిల్లీలో ఏర్పాటు చేసారు. ముఖ్యంగా 2005 నుంచీ గీస్తూ వచ్చిన చిత్రలేఖనాలతో ఈ రోజు స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ నాక్కూడా ఆహ్వానం పంపారు.

దారిపొడుగునా మామిడిపూత పలకరిస్తూ ఉండగా, కావూరి హిల్స్ దగ్గర చిత్రమయిలో అడుగుపెట్టేటప్పటికి, అక్కడ చిత్రలేఖనాల ప్రదర్శనతో పాటు చిన్నపాటి వర్క్ షాపు కూడా నడుస్తోంది. ఆ ప్రదర్శన చూడటానికి వచ్చిన వారందరినీ ఏదో ఒక బొమ్మనో, లేదా వర్ణచిత్రమో గియ్యమని అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఉత్సాహం అణచుకోలేక చిన్న బొమ్మ గీసాను. ఏక్రిలిక్ లో.

ప్రదర్శన చూసి ఇక సెలవు తీసుకుంటానని చెప్తే ఆనంద్ శాస్త్రిగారు ఆ చిత్రలేఖనాల గురించి నా స్పందన చెప్పమని అడిగారు. ఆ చిత్రలేఖనాలకి క్యురేటర్ గా వ్యవహరించిన అతియ అంజాద్, చిత్రకారులు ఉమ మాకల, హేమనళిని వంటివారు అక్కడ ఉండగా నా స్పందన కోసం మాటలు వెతుక్కోవాలేమో అనుకున్నానుగాని, ఆ చిత్రలేఖనాలు నాలో కలిగించిన భావోద్రేకం వల్ల నా మనసులో మెదుల్తున్న భావాలన్నీ నోరారా పంచుకున్నాను.

ఆనంద్ శాస్త్రిగారి చిత్రలేఖనాల ఇతివృత్తం Abodes of Admirations. అవి మన ఇళ్ళ బొమ్మలు. ఇప్పుడు మనం నివసిస్తున్న ఇళ్ళు కాదు, ఒకప్పటి ఇళ్ళు. మరీ ముఖ్యంగా మన గ్రామాల్లో ఒకప్పటి బంగాళా పెంకుటిళ్ళు. అది కూడా తెలంగాణా గ్రామాల్లో ఒకప్పుడు విస్తారంగా ఉండి, ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతున్న మండువా పెంకుటిళ్ళు. ఆ గోడల మీద ఆ చిత్రాల్ని చూస్తున్నప్పుడు మనం నలభై యాభై ఏళ్ళు వెనక్కిపోతాం. అది గతించిన కాలం. సమష్టికుటుంబాల కాలం. మనుషులూ, మనసులూ దగ్గరగా బతికిన కాలం. ఇంకా చెప్పాలంటే అదంతా ఒక అదృశ్యయుగం. ఆ చిత్రాలు ప్రదర్శించిన ఆ గోడ మొత్తం ఒక వేయిపడగలు లాంటి నవల అనవచ్చు.

ఆ ఇళ్ళబొమ్మల్ని గియ్యడంలో ఆయన దాదాపుగా ప్రతి పెంకుటిల్లునీ మళ్ళా తనొక్కడే పెంకుపెంకూ చేర్చి తిరిగి కట్టాడా అనిపించింది. సాధారణంగా ఇప్పటి చిత్రకారులెవరూ రేఖమీద ఇంత శ్రద్ధ పెట్టరు. ఇంత ఏక్రిలిక్ కాన్వాసుమీద ఒంపితే దానికదే ఒక పెయింటింగ్ గా మారిపోతుందని భావిస్తారు. నిజమే, ఒట్టి రంగులు కాన్వాసుమీద చల్లితే కూడా, ఆ అనాలోచితమైన అమరికలో కూడా ఒక అందం కనిపించకపోదు. పెర్ స్పెక్టివ్ గురించి, కంపొజిషన్ గురించి కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలిస్తే ఆ రంగుల అమరికని మరింత రమణీయంగా మార్చడం ఏమంత కష్టం కాదు. కాని ఆనంద్ శాస్త్రిగారి దృష్టి సందర్శకుణ్ణి రంజింపచేయడంలోలేదు. అతణ్ణి తన ప్రతి బొమ్మ దగ్గరా కొంత సేపు అట్లానే నిలబెట్టడం మీద ఉంది. ఆ బొమ్మని చూడగానే అతడు గతించిపోయిన ఒక కాలం, ఒక సంస్కృతి, ఒక సామూహిక సహజీవనం గురించి తలుచుకునేలాగా చెయ్యడంలో ఉంది. అందుకని ఆయన వేసిన ప్రతిబొమ్మలోనూ ఆ నిర్దిష్టతని, ఆ నిరుపమానమైన స్పష్టతని తీసుకురావడం మీద దృష్టిపెట్టారని చెప్పవచ్చు.

ఆ చిత్రలేఖనాల్లో నాకు నచ్చిన రెండవ అంశం, ఆయన వాడిన రంగులు. అవన్నీ దాదాపుగా mute colors, earth colors, ochers. ప్రధానంగా చార్ కోల్. ఆ ఇటుకరంగు, జేగురురంగు, ముదురురంగుల్తో, ఆ నలుపు తెలుపుల్తో ఆయన ఒక సెపియా వాతావరణాన్ని అక్కడకు తీసుకొచ్చారు. మన పాతకాలపు ఫొటోలు చూడండి. వాటిల్లో అన్నిటికన్నా ముందు కొట్టొచ్చినట్టే ఆ సెపియా రంగు మనలో రేకెత్తించే nostalgia ని మరే రకంగానూ మేల్కొల్పలేం.

రంగుల గురించి ఇంత అవగాహన ఉన్న చిత్రకారుడు, ప్రైమరీ రంగులు వాడి వసంతఋతువునో, హేమంతాన్నో చిత్రించి ఉంటే ఆ హాలు మొత్తం ఉజ్జ్వలంగా మెరిసిపోతూ ఉండేది, నిజమే. కాని ఆయన దృష్టి రంగులు జల్లి సందర్శకుల్ని రప్పించుకోడం మీద లేదు. గతించిపోయిన ఒక అపురూపమైన కాలానికి నివాళి ఘటించడంలో ఉంది. దాన్ని మన ముందు ఆవిష్కరించడం ద్వారా మన తండ్రితాతల్ని, మన పూర్వకాలపు పెద్దమనుషుల్ని గుర్తుకుతేడంలో ఉంది. అప్పట్లో ఏ ఇంట్లో చూసినా ఒక పూట భోజనం అంటే కనీసం నలభై యాభై మందికి తక్కువకాకుండా చేతులుకడుక్కోని రోజులు. ఆ ఇళ్ళని చూస్తుంటే మనమొక యుగాన్ని పోగొట్టుకున్నామనీ, అది ఇప్పుడొక metaphor గా మారి చిత్రలేఖనంగా మారిపోయిందనీ స్ఫురిస్తుంది. దిగులు కలుగుతుంది. కాని మనమధ్యనుంచి భౌతికంగా నిష్క్రమించిన మన పెద్దవాళ్లను తలుచుకున్నప్పుడు ముందు దిగులు కమ్మినా, ఆ తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు మనలో కలిగించే ఊరట, ప్రశాంతి అనుభవానికొచ్చినట్టే ఆ బొమ్మలన్నీ చూసేక ఏదో చెప్పలేని సాంత్వన కలుగుతుంది.

ఇది ఆ ప్రదర్శనలో నాకు నచ్చిన రెండవ అంశం. చిత్రకారుడిలోని నిజాయితీ. తాను దర్శిస్తున్న దాన్ని మనకు చూపించడంలో ఏ విధంగానూ రాజీపడని సాధన.

ఇక తన చిత్రలేఖనాల్లో తాను analytic, synthetic రెండు ధోరణుల్నీ సాధనచేసాడని ఆయన చెప్పుకున్నాడు. వాస్తవాన్ని వాస్తవికంగా చిత్రించడంలో analytical గా ఉన్నాడనీ, ఆ దృశ్యం తన మనసులో రేకెత్తించిన భావోద్వేగాల్ని చిత్రించడంలో synthetic గా ఉన్నాడనీ కూడా చెప్పుకున్నాడు ఆయన.

ఈ చిత్రకళా ప్రదర్శన ఆరో తేదీ దాకా ఉంటుంది. చిత్రకళాభిమానులంతా చూడవలసిన ప్రదర్శన అది. ముఖ్యంగా తెలంగాణా పల్లెల్ని ప్రేమించేవాళ్ళు (గంగారెడ్డీ, వింటున్నావా!) తప్పనిసరిగా చూడవలసిన బొమ్మలు. ఆ పెంకుటిళ్ళు చూస్తూ నేను జగ్గంపేట, యెర్రవరం, పేరూరు లాంటి గోదావరి జిల్లా గ్రామాలు గుర్తుచేసుకున్నానుగాని, తెలంగాణా సందర్శకులకి ఆ బొమ్మల్తో పాటు వాళ్ళ బాల్యకాలం మొత్తం గుర్తుకొస్తుందని చెప్పగలను.

4-2-2024

4 Replies to “అదంతా ఒక అదృశ్యయుగం”

  1. Thank you very much sir. Your review on that day made me emotional. Within minutes You grasped my entire 55years art journey .You revealed my content of consciousness to the viewers with your words. You mentioned Veyipadagalu here,it’s an OSCAR award to me. Your words touched my inner core. Once again thank you.

  2. ఆ చిత్రాలు అద్బుతం సర్..
    మీరు వారి గురించి తెలియచేయటం మా అదృష్టం.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading