
ఒక కథకుడు జీవితం మొత్తం మీద ఒక కథ మాత్రమే చెప్పగలడు. అతడు ఎన్ని కథలు రాసినా తిరిగి తిరిగి ఆ కథనే రకరకాలుగా చెప్తూ ఉంటాడు. చెహోవ్ కథలే చూడండి. అందులో కథకుడి తాత ఒకప్పుడు సెర్ఫ్ గా బతికాడనీ, బానిసత్వం నుంచి విముక్తి చెందాడనీ, తనది ఆ వారసత్వమనీ కథకుడు ఎప్పుడూ మర్చిపోడు. బానిసత్వం నుంచి స్వాతంత్య్రం పొందాక, ఆ జీవితం ఎంత విలువైనదో, ఎంత అపురూపంగా జీవించదగ్గదో, ఆ కథకుడు మాటిమాటికీ తనకి చెప్పుకుంటూ ఉంటాడు. ఎంతో విలువైన ఈ ఒక్క జీవితాన్నీ (మరొక జీవితం ఉందో లేదో అతడికీ తెలియదు, మనకీ తెలియదు, తెలిసినా, ఈ జన్మ లో నేర్చుకున్న పాఠాలూ, జ్ఞాపకాలు అప్పుడు ఏ మాత్రం ఉపయోగిస్తాయో అనుమానమే) మనుషులు ఆరోగ్యవంతులుగా జీవించడం లేదన్నదే చెహోవ్ ఆవేదన. తిరిగి తిరిగి ప్రతి కథలోనూ అక్కడికే వచ్చి ఆగుతాడు.
నాదీ అదే దారి. తర్వాత రోజుల్లో ఒక కవిత కూడా రాసాను, సవర పిల్లవాడికి కాగితమూ, పెన్నూ ఇచ్చి బొమ్మ గియ్యమంటే ఎన్నిసార్లు గీసినా ఆ చెట్టూ, ఆ ఇల్లూ, ఆ అడవీ, ఆ కొండలే గీస్తాడు. మరొక ప్రపంచం అతడికి పట్టదు. నా పరిస్థితి కూడా అంతే. రోజూ ఎన్నో అనుభవాల్లోంచి నడుస్తూ ఉంటానా, వానాకాలపు నీడలో ఎగిరే సీతాకోక చిలుకల్ని చూసినప్పుడు మాత్రం వెంటనే కవితరాయాలనిపిస్తుంది. 1984 లోనూ అదే పరిస్థితి. 2003 లోనూ అదే పరిస్థితి. ఇప్పుడు 2023 లో కూడా వానాకాలపు పసుపచ్చటి సంజ కాంతిలో ఎగిరే సీతాకోకచిలుకల్ని చూడగానే వెంటనే కవితరాయాలని అనిపించకుండా ఉండదు.
1984 లో ‘వానాకాలపు పల్చని నీడల్లో ఎగిరే తూనీగల స్వేచ్ఛా ప్రపంచంలోకి నాకూ ఆహ్వానం వచ్చింది’ అని రాసినప్పుడు నా రాజమండ్రి మిత్రులు నన్ను జాలిగా చూసారు. ఆధునిక ప్రపంచానికి కావలసిన కవితాసామగ్రి అది కాదని వాళ్ల భావన. సమాజంలోనూ, మనిషిలోనూ సంభవిస్తున్న విధ్వంసాన్ని, అమానవీకరణని కవితలుగా రాయాలి తప్ప తూనీగలమీదా, సీతాకోకచిలుకలమీదా కాదని వాళ్ళు నాతో వాదించేరు. నాకు ఏమి జవాబు చెప్పాలో తెలియలేదు. కాని నాకు మరొక, మరొక సందర్భంలో కవిత పలకడం లేదే, నేనేం చెయ్యను?
కాని ఏళ్ళు గడిచాక, గ్రహించాను. నీ మనసు ఎక్కడ నిలిస్తే దాన్నే కవితగా మార్చు. అది ఆధునికమా, ప్రాచీనమా, సంప్రదాయమా, నవ్యసంప్రదాయమా- ఆ సమస్య నీది కాదు. నిజానికి అది పాఠకుడి సమస్య కూడా కాదు. ఇరవయ్యవ శతాబ్దంలో ఒక ఆంటోనియో మచాడో లాంటివాడు కాంతిగురించీ, నీడల గురించీ, పెరట్లోంచి వీచే నిమ్మపూల గాలి గురించీ రాస్తే, యూరప్ మొత్తం ఆ కవిత్వానికి పాదాక్రాంతమయ్యింది. ఆ కవిత్వాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన విల్లిస్ బార్న్ స్టన్ ‘మచాడో స్పానిష్ కవుల్లో మరీ చీనాకవి’ అని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు కూడా.
పునర్యానం చివరి కవితలకు వచ్చేటప్పటికి నాకు ధైర్యం చిక్కింది. నా ఆనందాన్ని నాకు తెలిసిన భాషలో రాసుకోగల ఆత్మవిశ్వాసం చేతికందింది. ఇది అటువంటి కవిత.
వానాకాలపు ఎండనీడల తేమలో సీతాకోకచిలుకలు సభచేసాయి
తన సభల్లో తను కూరుకుపోయిన నగరానికి ఆ పిలుపు అందలేదు
కూరుకుపోయాను నేనూ, నాలో నేనుగా, పిలిచేదాకా ఆకాశం
నా ఇంటికిటికీ సందులోంచి, మామిడిచెట్టు నీడలోంచి.
ఆ సెప్టెంబర్ మధ్యాహ్నాన్నలా గడిపాను ఆత్మీయుల మధ్య
పసుపు నీడల మధ్య, మహోద్యమంలా ప్రసరిస్తూన్న పచ్చిక మధ్య
నా భాషని మర్చిపోయాను, అప్పుడే ఆ భాషలు బోధపడ్డాయి
వదిలిపెట్టానందరినీ, అప్పుడే వాళ్లంతా నా వాళ్లవుతారని.
పృథ్వి విశాలం, ఆకాశం విశాలం, సీతాకోక చిలుక చిన్నది
జీవితకాలమెగిరినా చేరదొక కొసనుంచి మరొక మూలకి
గ్రహించానా మధ్యాహ్నం ఏ ఒక్క సీతాకోకచిలుకని చూసినా
అది ఎగిరినంత మేరకదే పృథ్వి, అదే ఆకాశమని.
(పునర్యానం, 5.2.10)
On a rainy day, butterflies gathered in the shade
No way could the busy city have noticed it.
Also, I didn’t know about the conference
Until the sky welcomed me to my patio.
So that’s how we spent September noon.
As the grass waves in a shade of yellow
I forgot my tongue so I could speak theirs.
To be with them, I left everyone else.
The earth is big; the sky is big, but a moth is tiny
Even if it flies for eternity, it can’t reach the ends
When I saw a butterfly that afternoon, I realized
Anywhere it flies, that is the earth, that is the sky.
24-9-2023
నీ మనసు ఎక్కడ నిలిస్తే దాన్నే కవితగా మార్చు. అది ఆధునికమా, ప్రాచీనమా, సంప్రదాయమా, నవ్యసంప్రదాయమా- ఆ సమస్య నీది కాదు. 🙏ఈమాట పెద్ద ఊరట.
సీతాకోకచిలుకలో అద్వైతం ఎప్పటికప్పుడు పునర్నవమౌతుంది.
ధన్యవాదాలు సార్
beautiful as usual, sir.
Thank you