మొదటి కట్

ఈ రోజు సంస్కృతి రూరల్ ఆర్ట్ సెంటర్ లో లినోకట్ క్లాసుకి వెళ్ళాను. ప్రసిద్ధ చిత్రకారులు, ఆర్ట్ సెంటర్ మార్గదర్శకులు బొమ్మారెడ్డి అప్పిరెడ్డిగారి పర్యవేక్షణలో మొదటి కట్ పూర్తిచేసాను. ఆయన దగ్గరుండి మొదటి ప్రింట్ కూడా తీసారు. గ్రే కలర్ లో తీసిన మొదటి ప్రింట్ నా చేతుల్లో పెట్టారు. దానిలో నలుపు రంగు ఎక్కడ గియ్యవచ్చో ముందే ఆలోచించుకుని వస్తే వచ్చేవారం నలుపు రంగు ప్రింట్ కూడా తియ్యొచ్చనీ, అప్పుడు తెలుపు, గ్రే, బ్లాక్ మూడు రంగుల ప్రింట్ తీసినట్టు అవుతుందనీ అన్నారు.

ఈ రోజు ఆ ప్రింట్ చూసేక చాలా సంతోషంగా అనిపించింది. చిత్రకళ ప్రాక్టీసు మొదలుపెట్టిన తొలిరోజుల్లో, అంటే 2006-07 లో లినోకట్ కూడా మొదలుపెట్టాను. లినోలియం, కటింగ్ టూల్స్, పెయింట్ డబ్బాలు, రోలర్లు అన్నీ కొన్నానుగాని, ఎక్కడో ఆత్మవిశ్వాసం చాల్లేదు. మళ్ళా ఇన్నేళ్ళకు ఒక గురువు పర్యవేక్షణలో కొత్తగా మొదలుపెట్టడం సంతోషాన్నిచ్చింది.

సాధారణంగా చిత్రకళ అంటే చార్ కోల్, పెన్సిల్, ఇంకు, పేస్టల్సు వంటి వాటితో చేసే డ్రాయింగు, ఆయిల్, ఏక్రిలిక్, వాటర్ కలర్స్ తో చిత్రించే వర్ణచిత్రాలు అనే చాలామంది అనుకుంటారు. కాని చిత్రకారుడికి అతడి చిత్రలేఖనాలకొక మిస్టీరియస్ క్వాలిటీని, ఒక గాంభీర్యాన్ని, చెప్పలేని ఆకర్షణని సంతరించిపెట్టే వాటిలో లినోకట్, వుడ్ కట్, మెటల్ కట్, మోనో ప్రింట్, ఎంగ్రేవింగ్ లాంటివి ఉన్నాయి. వీటన్నిటిలోనూ వుడ్ కట్, ఎంగ్రేవింగ్ చాలా ప్రాచీనమైన కళాప్రక్రియలు. యూరోప్ లో మధ్యయుగాల్లో వుడ్ కట్ నుంచే గూటెన్ బర్గ్ ప్రింట్ మేకింగ్ కళని అభివృద్ధి పరచాడు. డిటిపి రాకముందు లెటర్ కంపోజింగ్ పద్ధతిలో పుస్తకాలు వేసేటప్పుడు ముఖచిత్రాలు వెయ్యడంకోసం వాడే బ్లాక్ మేకింగ్ దాదాపుగా వుడ్ కట్, ఎంగ్రేవింగ్ ల సమాహారమే. యూరోప్ లో కవులు, కళాకారులు, చిత్రకారులు చాలాసార్లు తమ అంతరంగాన్ని ప్రతిబింబించే సాధనాలుగా వుడ్ కట్ నీ, ఎంగ్రేవింగ్ నీ వాడుకునేవారు. ఉదాహరణకి అగ్రశ్రేణి ఇంగ్లిషు కవి విలియం బ్లేక్ చిత్రించిన ఈ ఎంగ్రేవింగ్ చూడండి.

Source: William Blake, Songs of Innocence and of Experience, copy C, plate 49 (Bentley 46, Erdman 46, Keynes 46), Image courtesy: William Blake Archive.

ఆయన దర్శనంలోని మిస్టిసిజాన్ని ఈ ఎంగ్రేవింగ్ పట్టుకోగలిగినంతగా సాధారణ చిత్రలేఖన మాధ్యమాలు పట్టుకోగలిగి ఉండేవి కావు.

చిత్రలేఖనాల్లో వుడ్ కట్ ఇవ్వగల ఫీల్ మరే మీడియం కీ సాధ్యం కాదు. రీడర్స్ డైజెస్ట్ బైబిలు కి చిత్రకారులు గీసిన వుడ్ కట్స్ చూడండి. వాటిని చూస్తూ ఉంటే కలిగే అలౌకికానుభూతిని మాటల్లో పెట్టలేను. మరో జన్మంటూ ఉంటే, ఈ వుడ్ కట్ ఒక్కదానికే నా జీవితమంతా అంకింతం చెయ్యాలనిపిస్తుంది. రీడర్స్ డైజెస్ట్ బైబిలు తిరగేసిన ప్రతిసారీ నా మరోజన్మ పట్ల నాకెంత ఆశకలుగుతుందో చెప్పలేను.

Wood engraving by Harry Brockway (British b. 1958) in The Reader’s Digest Bible (illustrated edition) 1990

వుడ్ కట్ చిత్రలేఖనాల్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళినవాళ్ళు జపనీయ చిత్రకారులు. వాళ్ళ వుడ్ కట్ ప్రింట్స్ యూరోప్ చిత్రకళా చరిత్రని మార్చేసాయి. పందొమ్మిదో శతాబ్ది మధ్యనుంచి ఇంప్రెషనిస్టులు, వాన్ గో లాంటి పోస్ట్ ఇంప్రెషనిస్టులు, మాడర్నిస్టులు ప్రతి ఒక్కరూ ఆ వుడ్ కట్ ప్రింట్ల సమ్మోహకత్వానికి పరవశులైనవాళ్ళే. తైలవర్ణచిత్రలేఖనంలో రినైజాన్సు రోజులనుంచి రాఫేల్, ఇంగ్రెస్ లదాకా చిత్రకళ సాధించిన పరిపూర్ణత ఆ జపనీస్ వుడ్ కట్ ప్రింట్స్ ముందు వాళ్ళకి తేలిపోయినట్టుగా అనిపించింది. కంటిముందు కనిపించే దృశ్యాన్ని ఒక ఇమేజిగా మార్చగలిగే రహస్యం జపాన్ చిత్రకారులకి తెలుసనీ, ఏమి చేస్తే తాము కూడా ఆ రహస్యాన్ని పట్టుకోగలమనీ వాళ్ళు ఒకటే తపించారు. ఈ కింద వాన్ గో గీసిన చిత్రలేఖనంలో బాక్ గ్రౌండ్ లో జపనీస్ వుడ్ కట్ ప్రింట్ చూడండి.


ఈ ప్రింట్ మేకింగ్ టెక్నిక్స్ అన్నింటిలోనూ లినోలియం మరీ ఇటీవలిది. అంటే 20 వ శతాబ్దం మొదటిరోజుల్లో లినోలియం కనిపెట్టగానే దాన్ని కూడా వుడ్ కట్ లాగా ప్రింట్ మేకింగ్ కి వాడవచ్చునని యూరపియన్ చిత్రకారులు భావించారు. అయితే పికాసో, మేటిస్సే వంటి మహాచిత్రకారులు లినోలియం ని ముట్టుకున్నాకనే, దానికి జనాదరణ లభించింది. ఈ కింద పికాసో, మేటిస్సే చిత్రించిన లినో కట్ లు చూడండి.

Pablo Picasso linocut 1962 edition, PC: ebay

Bowl of Begonias I, 1938Henri Matisse

మన దేశానికి సంబంధించినంతవరకూ లినోకట్ అనగానే చిత్తప్రసాద్ గుర్తురాక తప్పదు. లినోకట్ లోని సుసంపన్నతని ఆయన పూర్తిగా కొల్లగట్టగలిగాడు. పీడిత, శ్రామిక, కర్షక జీవిత వాస్తవాల్ని చిత్రించడానికి లినోకట్ ఆయన చేతుల్లో పూర్తిగా ఒదిగింది. అసలు ఆయన కోసమే ఆ మాధ్యమాన్ని కనిపెట్టారా అన్నంతగా ఆయన లినోకట్ ని ఉపయోగించుకున్నాడు. ఈ కింద చిత్తప్రసాద్ లినోకట్ చూడండి.

Women from Kashmir, Chittoprasad Bhattacharya

సోవియెట్ బాలసాహిత్యాన్ని అద్భుతమైన లినోకట్ చిత్రలేఖనాలతో అలంకరించేవారని మనకు తెలుసు. బాలసాహిత్య రచయితలకి, చిత్రకారులకి లినోకట్ ఒక వరం అని చెప్పాలి. తెలుగులో బాలసాహిత్యం రాయడానికి వర్క్ షాపులు పెట్టేటప్పుడు వాటితో పాటు లినోకట్ వర్క్ షాపులు కూడా కలిపి నిర్వహిస్తే, పూర్తిస్థాయి కథలపుస్తకాలు వెలువరించవచ్చు.

Linocut in Soviet children literature

నా ఈ మొదటి కట్ మొదటి క్రష్ లాగా ఉంది. ఈ మొదటి కట్ కే నాలో ఇన్ని తలపులు చెలరేగుతున్నాయి. కనీసం ఆరునెలల తర్వాతనైనా చిన్నపిల్లలకోసం ఒక కథల పుస్తకం రాసి, ఆ పుస్తకం బొమ్మలన్నీ లినోకట్ లో వెయ్యగలిగితే!

4-6-2023

6 Replies to “మొదటి కట్”

  1. వేయాలనే మా ఆకాంక్ష 💐పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏

  2. మీ ఉత్సాహం బాలలస్థాయిలోనూ, మీ శ్రద్ధ పరిశోధక విద్యార్థి స్థాయిలోనూ ఉంది! ఆట్టే సమయం పట్టదు మీ ఆకాంక్ష నెరవేరడానికి 💐💐💐

  3. లినో కట్ గురించి చెప్పినందుకు ధన్యవాదములు. ఈ వయసులో మీ ఉత్సహం అభినందనీయం. మీరు నిత్య విద్యార్థి.

Leave a Reply

%d bloggers like this: