ఆ వెన్నెల రాత్రులు-23

ఆ మర్నాడు పొద్దేక్కేదాకా మేమెవ్వరం నిద్రలేవలేదు. లేచాక కూడా చాలాసేపటిదాకా ఈ లోకంలోకి రాలేకపోయాను. ఆ సాయంకాలం ఎప్పట్లాగా నడిచే మా గోష్ఠి నడవలేదు. రాజు రాలేదు. బహుశా అతను కూడా మాకులానే నిద్రమత్తులో మునిగితేలుతుంటాడని అనుకున్నాను.

ఆ మర్నాడు పొద్దున్న పదింటికి మిశ్రా మా ఇంటికి వచ్చేసాడు. అప్పటికి నేను సర్వే డాటా టాబులేట్ చేసుకుంటూ ఉన్నాను. మిశ్రాని లోపలకి రమ్మని కుర్చీ వేసాను. బ్రేక్ ఫాస్ట్ అయ్యిందా అని అడిగాను.

మిశ్రా ‘ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. మన హౌస్ హోల్డ్ సర్వే, హాబిటేషన్ సర్వే రెండూ పూర్తయిపోయాయి కాబట్టి, ఇవాళ వెళ్ళిపోదామనుకున్నాను. కానీ మళ్లా అనిపించింది, నువ్వు నేను రాకముందు నాకోసం రెండు వారాలు ఇక్కడ వెయిట్ చేసావు. ఇప్పుడు మళ్ళా సేన్ గుప్త కోసం వెయిట్ చేస్తూ గడపాలి. నిన్నొక్కర్తినీ వదిలిపెట్టి వెళ్ళిపోడం కరెక్ట్ కాదనిపించింది. అదీకాక-‘ అని ఆగి

‘నిన్ననేం జరిగిందో తెలుసా?’ అనడిగాడు.

ఏమి జరిగింది సార్? అన్నట్టుగా కుతూహలంగా చూసాను.

‘నిన్న రాత్రి మీ ఊళ్ళో ఒక ప్రెగ్నంట్ లేడీ కి కానుపు కష్టమయింది. హౌస్ హోల్డ్ సర్వే లో రాజు వాళ్ళింటికి వెళ్ళడంతో వాళ్ళకి రాజు బాగా పరిచయమయ్యాడు. ఆ రాత్రి వాళ్ళు రాజు ఇంటికి పరుగెత్తారట. రాజు ఆ రాత్రికి రాత్రి మీ ఊళ్ళో ఎవరిదో లూనా తీసుకుని ముందు మిడ్ వైఫ్ ని పట్టుకొచ్చాట్ట. ఆ తర్వాత దగ్గరలో ఎవరూ గవర్న్ మెంట్ డాక్టర్ లేకపోడంతో తనకి తెలిసిన ఆర్ ఎం పిని ఎవరినో పట్టుకొచ్చాట్ట. ఆ ప్రసవం సేఫ్ డెలివరీ అయ్యేటప్పటికి తెల్లవారింది. నేను మార్నింగ్ వాక్ కి వెళ్తూ ఉంటే దారిలో కనబడ్డాడు. ఏమిటని అడిగితే ఈ సంగతంతా చెప్పాడు’ అని అన్నాడు.

మొన్న రాత్రి ఆ వెన్నెల దారిన ప్రయాణం ఏర్పాటు చేసినందుకే రాజుకి ఎలా కృతజ్ఞతలు చెప్పడమా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సంఘటనతో అతనిపట్ల నా గౌరవం రెట్టింపు అయింది.

‘చాలా చాలా మంచి పిల్లవాడు సార్’ అన్నాను డా. మిశ్రాతో.’

‘యా. యాన్ ఎక్స్ట్రా ఆర్డినరీ యంగ్ మాన్’ అని తలూపాడు మిశ్రా.

‘అటువంటి యంగ్ మాన్ తో ప్రేమలో పడకుండా ఉండటం అసాధ్యం అన్నారు సార్ ప్రొఫెసర్ సేన్ గుప్త’ అని అన్నాను మిశ్రాతో.

‘యా, యా, ట్రూ’ అని తలూపి, ‘కాబట్టి నాకేమనిపించిందంటే, అన్నిటికన్నా ముందు ఈ ఊళ్ళో ఒక మెడికల్ కాంప్ కండక్ట్ చెయ్యవలసిన అవసరం ఉంది. ఇటువంటి కేసులు ఇంకా ఎన్నున్నాయో మనకి తెలీదు. ఇవి కాక క్రానిక్ ఎయిల్ మెంట్స్ కూడా ఉండి ఉండొచ్చు. అందుకని, ప్రొఫెసర్ సేన్ గుప్తా వచ్చేలోపు మనం ఒక మెడికల్ కాంప్ ఆర్గనైజ్ చేద్దాం. ఆ మాట చెప్దామనే వచ్చాను’ అని అన్నాడు.

అప్పటికే మా మా పక్కకు వచ్చి నిలబడ్డ సుధీర్ అన్నయ్య ఆ చివరి మాటలు విని ‘ గ్రేట్ ఐడియా. ఐ విల్ ఆల్సో జాయిన్’ అన్నాడు.

మిశ్రా అతణ్ణి చూసి పలకరింపుగా చిరునవ్వాడు. ఈలోపు సూర్యనారాయణమూర్తి కూడా అక్కడకొచ్చి మిశ్రాని పలకరించారు. మిశ్రా ఆయన్ని చూడగానే లేచి నిల్చొని నమస్కారం చేసాడు.

‘డా.మిశ్రా ఈ ఊళ్ళో ఒక మెడికల్ కాంప్ నిర్వహిస్తే బాగుంటుంది అంటున్నారు’ అన్నాడు సుధీర్ ఆయనతో.

అప్పటిదాకా ఆ ఊళ్ళో మెడికల్ కాంప్ లాంటిది ఎవరూ ఆర్గనైజ్ చేయలేదని ఆ మాష్టారు అన్నారు. తనకి తెలిసి ప్రసూతిమరణాలు ఆ గ్రామాల్లో సాధారణం అని కూడా అన్నారు.  ఆ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు తెరిచి ఉన్నప్పటికీ, ఐ సి డి ఎస్ పథకం అమల్లో ఉన్నప్పటికీ, వాటి ఉనికి ఇప్పుడు నలుగురికీ తెలిసినంతగా అప్పటికింకా తెలియని రోజులు. ప్రసవాలు ఇళ్ళల్లోనే జరిగేవి. గిరిజనమహిళల్లోనే సాంప్రదాయికమైన మంత్రసానులు ఉండేవారు. ఒక హెల్త్ విజిటర్ గ్రామాలకు వచ్చి గర్భిణీ స్త్రీలను పరామర్శ చేసి వైద్య, ఆరోగ్య సలహాలు ఇస్తూండేదిగాని, ఆ సేవలు ఇప్పుడున్నంత ఇంటెన్సివ్ గా ఉండేవి కావు. మెడికల్ ఆఫీసరు గ్రామాలకి వెళ్ళి వైద్యం గురించీ, ఆరోగ్యం గురించీ ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలని ఉండేదిగాని, ఆ కార్యక్రమాలు జరిగినట్టుగా అక్కడ ఎవరికీ తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఊళ్ళోనే ఒక మెడికల్ కాంప్ నడపాలన్న ఆలోచనకి  ఊరంతటా స్పందించింది.

ఇన్నేళ్ళు గడిచాక, ఒక గ్రామంలో ఒక రోజు వైద్యశిబిరం నడపడం చాలా చిన్న పని అనీ, అదేమీ నలుగురికీ చాటిచెప్పుకోవలసినంత ఘనకార్యం  కాదనీ నాకే అనిపిస్తూ ఉంది. కానీ, ఆ రోజు ఆ గ్రామంలో ఉన్న పరిస్థితుల్లోంచి చూసినప్పుడు అది ఇప్పటికీ నాకు ఎంతో ఆశ్చర్యకరమైందిగానూ, ఆరాధించదగ్గ పని గానూ తోస్తున్నది. అదీకాక, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరికి వచ్చింది? నీ గ్రామంలో ఏదో స్టడీ కోసం వచ్చి ఉన్న ఒక వ్యక్తికి. అతను నీ గ్రామస్థుడు కాడు, నీ రాష్ట్రం వాడు కాడు, ప్రభుత్వ ఉద్యోగి కాడు, కాని ఒకామె కి ప్రసవం కష్టమయిందని వినగానే స్పందించి ఏదో ఒకటి చెయ్యాలని అనుకుని, అది చేసేదాకా మామూలుగా ఉండలేకపోయినవాడు.

బహుశా ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ రోజు అటువంటి శిబిరాలు నిర్వహించడం ఏమంత కష్టం కాకపోవచ్చుగానీ, అలా తపించే మనుషులు కనబడటమే దాదాపు అసాధ్యం అనిపిస్తూ ఉంది. బహుశా అందుకనే రాజు డా.మిశ్రా ని మాటిమాటికీ ‘ప్రాక్టికల్’ అని అంటూంటాడని అనుకున్నాను. కాని ఇప్పుడు ‘ప్రాక్టికల్’ మనుషులెవరికీ అటువంటి ఊహలు రావు. కొన్నేళ్ళ కిందట నా మిత్రురాలు ఒకామె ప్రభుత్వంలో ఉన్నతాధికారి, ఒక ఆదివారం మేము కలుసుకున్నప్పుడు, ఆ ముందు రోజు తానొక సెమినార్ కి వెళ్లానని చెప్తూ ఒక విషయం చెప్పింది. ఆ మీటింగ్ లో, డి ఎఫ్ ఐ డి కి చెందిన కన్సల్టెంట్ ఒకరు ప్రస్తుతం ఉన్న పి హెచ్ సి ల్ని రేషనలైజ్ చేసి తాలూకా కేంద్రాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటళ్ళు పెట్టాలని పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చాడట. ఈమె ఆ ప్రతిపాదనని అంగీకరించలేక, లంచ్ విరామంలో అతణ్ణి కలిసి ఆ మాటే చెప్పిందట. ‘పి హెచ్ సి లు కేవలం వైద్యకేంద్రాలు కావు, అవి ఆరోగ్యవిద్యాకేంద్రాలు కూడా. ప్రజల్లో ఆరోగ్యచైతన్యం కలిగించడం వాటి బాధ్యత. వాటిని ఎత్తేసి పాలీక్లినిక్ లు పెట్టడం ఎంతవరకూ సమంజసం?’ అని అడిగిందట. అప్పుడు ఆ కన్సల్టెంట్ ‘మేడం, ఇప్పుడు నలుగురు ప్రైవేట్ డాక్టర్లు కలిసి కార్పొరేట్ హాస్పటళ్ళుగా మారుతున్న కాలంలో ప్రభుత్వం కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలి కదా’ అని అన్నాడట.

డా.మిశ్రాకి ఒక ఆలోచన రావడమే తడవు దాన్నెట్లా అమలు చేస్తాడో బడి బిల్డింగు విషయంలో నేనే కాదు, ఊరంతా చూసింది. ఇప్పుడు కూడా అంతే శరవేగంగా దూసుకుపోయేడు. ఆ వచ్చే ఆదివారం మెడికల్ కాంప్ పెట్టాలని పంచాయతీతో తీర్మానం చేయించాడు. ఆ రోజు పక్క గ్రామంలో సంత కాబట్టి, సంతకి వచ్చినవాళ్ళు కూడా ఈ సేవల్ని వినియోగించుకోగలుతారని ఒక ఆలోచన. రామకోవెల్లోనే కేంపు. అంతకు ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల డ్రైవ్ జరిగే రోజుల్లో విలేజి చావిడిలో చేసేవారట. కాని ఆ బిల్డింగ్ కూలిపోడానికి సిద్ధంగా ఉందనీ, రామకోవెల ఊరి మధ్య ఉండటమే కాకుండా, రామనవమికోసం కొత్తగా రంగులు వేసి, లైట్లూ, ఫాన్లూ కూడా బిగించారు కాబట్టి ఇక్కడ నడపడమే అనువుగా ఉంటుందని మిశ్రా వాదించాడు. అదీకాక రామకోవెల పక్కనే కొత్తగా వేసిన బోరువెల్ కూడా ఉంది.

ఈలోపు ఆయన బ్లాకు ఆఫీసులోనూ, ఐటిడీఏలోనూ మాట్లాడి వాళ్ళని భాగస్వాముల్ని చేసాడు. ఒకరోజు కాకినాడ వెళ్ళి జిల్లా కలెక్టర్ని కలిసి ఆ శిబిరం ప్రారంభించడానికి రమ్మని పిలిచాడు. ఆ రోజు జీపు మీద తనతోపాటు గ్రామసర్పంచ్ ని కూడా తీసుకువెళ్ళాడు. వాళ్లతో పాటు రాజు కూడా. ఒక గిరిజన గ్రామ సర్పంచ్ వచ్చి అడిగితే కలెక్టరు కాదనలేడని మిశ్రా ఊహ.

ఆ కేంపుకి మూడు రోజుల ముందునుంచీ నేనూ, రాజూ, రోజా, సుధీర్, అంతకుముందు బడికి పాక వెయ్యడంలో చేతులు కలిపిన యువకులూ- అందరం ఇంటింటికీ వెళ్ళి కేంపు గురించి చెప్పాం. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వచ్చి వైద్య, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పాం.

ఆ రోజు ఆ శిబిరాన్ని జిలా కలెక్టరు తరఫున జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వచ్చి ప్రారంభించాడు. తన సర్వీసులో ఒక గిరిజన ప్రాంతాన్ని విజిట్ చెయ్యడం అదే మొదటిసారి అని మీటింగులోనే చెప్పాడు. ఆయనతో పాటు జిల్లా మలేరియా అధికారి, ఇంకా వైద్యారోగ్య శాఖకి చెందిన ఫీల్డ్ సిబ్బంది కూడా వచ్చారు. జిల్లావైద్యాధికారి కాకినాడలో ఒకటి రెండు స్వచ్ఛంద సంస్థలకి కూడా చెప్పినట్టున్నాడు. వారు కూడా వాలంటీర్లతో హాజరయ్యారు.

ఆ రోజు నాలుగైదు కౌంటర్లు తెరిచారు. స్త్రీలకీ, పురుషులకీ, వృద్ధులకీ, చిన్నపిల్లలకీ నాలుగు కౌంటర్లతో పాటు, గర్భిణీ స్త్రీలకీ, బాలెంతలకీ మరో కౌంటరు. వచ్చినవాళ్ళందరికీ ముందు విధిగా బరువు, ఎత్తు కొలతలు నమోదు చేసారు. గర్భిణీ స్త్రీలకోసం ప్రత్యేకంగా ఒక గైనకాలజిస్టు వచ్చింది. టిబి లాంటి కేసుల్ని కూడా అక్కడికక్కడే పరీక్షించడానికి ఒక మొబైల్ ఎక్స్ రే ప్లాంటు కూడా తీసుకువచ్చారు.

ఆ మెడికల్ అండ్ హెల్త్ బృందం, ఎన్ జి ఓ ప్రతినిధులు, ఇతర సిబ్బంది కలిసి మొత్తం ముప్ఫై మందిదాకా ఉన్నారు. వారందరికీ వకుళకుటిలో లంచ్ ఏర్పాటు చేసారు. ఆ ఖర్చంతా డా.మిశ్రా తనే పెట్టుకున్నాడు. కేంపుకి బయట ఊళ్ళనుంచి వచ్చిన గిరిజనులకి భోజనం ఊళ్ళో వాళ్లని ఏర్పాటు చెయ్యమని అడిగాడు. ‘ఇది కూడా రామనవమి సంతర్పణ లాంటిదే అనుకోండి’ అని చెప్పాడు.

కేంపు మొదలుపెట్టేముందు సభలాంటిది ఏమీ నిర్వహించలేదు. డి ఎం అండ్ హెచ్ ఓ రాగానే ఆయన్ని ఒక గిరిజన బాలిక స్వాగతించింది. అప్పుడు ఆయన ఆ బాలికని ‘హెడ్ టు టో’ రొటీన్ చెక్ అప్ చేసి, ఆమె లంగ్స్ ని స్టెత్ తో పరీక్షించాడు. వెంటనే కాంప్ మొదలయిందని డిక్లేర్ చేసాడు.

ఆ రోజంతా తాము పరిశీలించిన వాళ్ళల్లో దీర్ఘవ్యాధుల్తో బాధపడుతున్నవాళ్ళనీ, మరింత వైద్య సహాయం అవసరమైనవాళ్ళనీ, రిఫరల్ సర్వీసులు అవసరమైనవాళ్ళనీ ఆ బృందం గుర్తించింది. వాళ్ళ పేర్లు ఆ సాయంకాలం అందరికీ చదివి వినిపించారు. ఆ పేర్లు నేనూ, సుధీర్ అన్నయ్యా రెండు జాబితాలు రాసాం. ఒక జాబితా గ్రామ సర్పంచ్ కి ఇచ్చాం. మరొక జాబితా డా.మిశ్రా తీసుకున్నాడు. సాయంకాలం అయిదింటికి, కాంపు ముగించే ముందు ఆ బృందానికి ఊళ్ళో వాళ్ళతో ధన్యవాదాలు చెప్పించాడు.

తమకి ఆ ఊరు రావడం, ఆ కేంపు నడపడం ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్ అనీ, దీన్ని మళ్లా వదిలిపెట్టకుండా ఫాలో అప్ చేస్తామనీ, మరికొన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి శిబిరాలు నడుపుతామనీ డి ఎం అండ్ హెచ్ వో డా.మిశ్రాకి చెప్పాడు. ఆయన వెళ్ళే ముందు మా అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాడు. జీపు ఎక్కేదాకా కూడా ఆయన మిశ్రా చేయి వదల్లేదు.

ఆ రాత్రి మళ్లా మా ఇంటి అరుగుమీద అంతా ఆ కేంపు విశేషాలన్నీ ఏ ఒక్క సంగతీ వదిలిపెట్టకుండా మళ్లా తలుచుకున్నాం. నేను ఆ ఊళ్ళో అడుగుపెట్టిన తరువాత ఎన్నో సామూహిక కార్యక్రమాలు చూసానుగాని, ఆ వైద్యశిబిరం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. పదిమందికి అన్నసంతర్పణ చెయ్యడంలో కూడా తృప్తి ఉంటుంది. కాని ఒక మెడికల్ కాంప్ అంతకన్నా ఎక్కువ తృప్తినిచ్చింది. ఎందుకని? ఆ ప్రశ్నే అడిగాను, ఆ సాయంకాలం అందరినీ.

ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెప్పారుగాని, డా.మిశ్రా నేను జీవితాంతం గుర్తుపెట్టుకోగల జవాబు చెప్పాడు. ఆయన అన్నాడు కదా:

‘విమలా! అన్నదానంలో సేవ ఉంది, త్యాగం ఉంది, దానం ఉంది, ధర్మం ఉంది. కాని ఎక్స్పర్టైజ్ అక్కర్లేని పని అది. మెడికల్ కాంప్ అలా కాదు. దానికి నిపుణులు కావాలి. అది కూడా జనరల్ ఎక్స్ పర్ట్స్ కాదు, స్పెషలిస్టులు కావాలి, నిస్వార్ధంగా పనిచేసే ఒక కార్యకర్తా, ఎక్స్ పర్టూ- ఈ ఇద్దరూ కలిస్తేనే ఇటువంటి ప్రోగ్రాములు నడుస్తాయి, సక్సెస్ అవుతాయి. నిజానికి మన దేశానికీ, మన సమాజానికీ కావలసింది ఇటువంటి కలయిక. ఒక్క మెడికల్ అండ్ హెల్త్ లో మాత్రమే కాదు. అగ్రికల్చర్ లో కావాలి, హార్టికల్చర్ లో కావాలి, లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ లో కావాలి. అంతెందుకు? చివరికి ఒక స్కూలు నడపడంలో కూడా కావాలి. స్కూలు సంగతే తీసుకో. అక్కడ టీచర్ ఎక్స్ పర్ట్. తల్లిదండ్రులు కార్యకర్తలు కావాలి. ఆ గ్రామంలో చదువుకున్న యువత కార్యకర్తలు కావాలి. గాంధీగారు విలేజ్ రికన్స్ట్రక్షన్ గురించి మాట్లాడినప్పుడు చెప్పింది ఇదే’ అని అన్నాడు.

మేమంతా ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాం.

మళ్లా మిశ్రా చెప్పడం మొదలుపెట్టాడు.

‘ఎక్స్ పర్ట్ తో ప్రాబ్లెం ఏమిటంటే, అతని దగ్గర ఎక్స్ పర్టైజ్ ఉంటుందిగానీ, పబ్లిక్ పర్పజ్ ఉండకపోవచ్చు. ఒక ధ్యేయం ఉండకపోవచ్చు. ప్రజలకష్టసుఖాల్ని చూసి స్పందించే హృదయం ఉండకపోవచ్చు. అందుకే మన సమాజాల్లో ఎక్స్ పర్ట్స్ కొన్నాళ్ళకి స్టాగ్నంట్ అయిపోయి చివరికి కౌంటర్ ప్రొడక్టివ్ గా తయారవుతారు. అదే కార్యకర్తని తీసుకో. అతని దగ్గర ప్రజలకి మేలు చెయ్యాలనే తపన ఉంటుంది. ఈ రోజు ఈ కేంపు ఇలా నడిచిందంటే, కేవలం ఎక్స్ పర్ట్స్ వల్లనా? మన వలంటీర్లందరూ కూడా తలో చెయ్యి వేసినందువల్లనే కదా. నిస్వార్థ కార్యకర్త ఎప్పటికప్పుడు ఎక్స్ పర్ట్ ని ఎనర్జిటిక్ గా, డైనమిక్ గా మారుస్తాడు. అతణ్ణి అలర్ట్ గా ఉంచుతాడు. అప్పుడు ఎక్స్ పర్ట్ తాలూకు ఎక్స్ పర్టైజ్ నిలవనీరుగా మారిపోకుండా ఇన్నొవేటివ్ గా మారుతుంది’ అని కూడా అన్నాడు.

ఈలోపు రాజు పెద్ద గంపలో మామిడిపండ్లు తీసుకొచ్చాడు. ఎండుగడ్డిలో మగ్గబెట్టిన ఆ మామిడిపండ్ల సువాసనకి అందరం ఒక క్షణం మూర్ఛపోయాం. అతను ఆ గంప అక్కడ పెట్టి పెరట్లోంచి ఒక బకెటులో నీళ్ళు తెచ్చి ఆ పండ్లు అందులో వేసాడు.

రెండు మూడు నిమిషాలు ఆ ప్రక్రియ అంతా చూస్తో మౌనంగా ఉన్న డా.మిశ్రా మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు.

‘ఎక్స్ పర్ట్ అంటే ప్రభుత్వ ఉద్యోగి ఒక్కడే కాడు. ఈ గ్రామంలో కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది ఎక్స్ పర్టులు అయి ఉండవచ్చు. బయటినుంచి కూడా ఎక్స్ పర్టులు రావచ్చు. అలాగే నిస్వార్థ కార్యకర్తలు అంటే పంచాయతీ మెంబర్లూ, సర్పంచులూ కారు. అసలు ఒక మనిషిలో వలంటీరింగ్ స్పిరిట్ ఉంటేనే అతడు ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతాడు. నిజమే, కాని, చాలాసార్లు, పదవి అతనిలోని నిస్వార్థ కార్యకర్తను అదృశ్యం చేసేస్తుంది. వలంటీరింగ్ ఎప్పటికప్పుడు వికసించే ఒక స్పిరిట్. పదవుల్లో ఉన్నవాళ్ళూ, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళూ నిస్వార్థ కార్యకర్తలు కావడం కష్టం. ఎవరో గాంధీ లాంటి వాళ్లు తప్ప జీవితకాలంపాటు నిస్వార్థ కార్యకర్తలుగా ఉండగలిగే వాళ్ళు కూడా అరుదు. ఒక గ్రామం మారాలంటే, ఒక ఉద్యోగి, ఒక సర్పంచ్ వల్ల మాత్రమే ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక ఎక్స్ పర్టూ, ఒక వలంటీరూ కలిస్తేనే అది సాధ్యమవుతుంది’ అని అన్నాడు.

‘ఇవిగో, మా తోటలో మామిడిపళ్ళు. చెరకు రసాలు. వీటిని రుచి చూస్తూ మాట్లాడుకోండి’ అంటో రాజు ప్రతి ఒక్కరీ చేతుల్లోనూ మామిడిపండ్లు పెట్టాడు.

‘మరి తీవ్రవాదులు ఎక్స్ పర్టు లా? వాలంటీర్లా?’ అనడిగాడు సుధీర్.

డా.మిశ్రా చిరునవ్వాడు.

‘ఒక మనిషి అధికారంలోకి రాకముందు ఎంత త్యాగశీలత చూపించినా, ఒకసారి అధికారం అందుకున్నాక తోటి మనిషికి దూరమైపోవడం మనం చూస్తూనే ఉన్నాం, ఇక అధికారాన్ని కోరుకునేవాడు వాడి కన్నా డిఫరెంట్ గా ఎలా ఉంటాడు చెప్పండి?’ అని అన్నాడు.

అప్పుడు తన చేతుల్లో పెట్టిన మామిడిపండుని చుట్టూ తడిమి చూసాడు. దాని పరిమళాన్ని గాఢంగా ఆఘ్రాణించాడు. మళ్లా సుధీర్ తో చెప్పడం మొదలుపెట్టాడు.

‘బ్రిటిష్ కాలం నుంచీ మన సమాజంలో ఫ్రీడమ్ అన్నా, డెవలప్ మెంట్ అన్నా రెండే అర్థాలు: ఒకటి పదవి, రెండోది ఉద్యోగం. మోస్ట్ ఆఫ్ అవర్ నేషనలిస్ట్ మూమెంట్ దేని గురించి? చట్టసభల్లో మరిన్ని సీట్ల గురించి, సివిల్ సర్వీసులో మరిన్ని ఉద్యోగాల గురించి. గాంధీగారు దీనికి నూట ఎనభై డిగ్రీలు వ్యతిరేక దిశలో నడిచిన వ్యక్తి. ఆయన దృష్టిలో, పదవి అంటే స్వయంపాలన. ఉద్యోగం అంటే ప్రజలతో కలిసి జీవించడం. ఈ రెండూ కలిస్తేనే స్వరాజ్యం. ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, రాజ్యాధికారం కోసమో, లేదా మరిన్ని ఉద్యోగాలకోసమో పాకులాడేవాళ్ళు ఎప్పటికీ ప్రజలకి విముక్తినివ్వలేరు’ అని-

వెంటనే ‘లెట్ మీ కరెక్ట్ మైసెల్ఫ్. అసలు ప్రజలకు ఒకళ్ళు విముక్తినివ్వడమేమిటి? వాళ్ల విమోచన మరొకళ్ళు సాధించడమేమిటి?  అది ప్రజలు తమంతతాముగా చేసుకోగల పని. మనం చెయ్యవలసిందల్లా మనదగ్గర ఏ రంగంలో ఎక్స్ పర్టయిజ్ ఉంటే దాన్ని ఆ రంగంలో ప్రజలకి ఉచితంగా ధారపొయ్యడమే’ అని అన్నాడు.

‘ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రభుత్వాలు ఎంతకాలమైతే రిసోర్సెస్ ని కార్పొరేట్లకీ, కాంట్రాక్టర్లకి దోచిపెడుతూ ఉంటాయో, ఎంతకాలమైతే వాటిని ప్రశ్నిస్తున్న ప్రజల్ని అణచిపెట్టడానికి సైన్యాన్నీ, పోలీసుల్ని వాడుకుంటూ ఉంటాయో అంతకాలం ఏదో ఒక రూపంలో ఎక్స్ట్రీమిస్టులూ, టెర్రరిస్టులూ పుట్టుకొస్తూనే ఉంటారు. వాళ్లు సమాజానికి అవసరం అవుతూనే ఉంటారు. నేను చెప్తున్నదల్లా గ్రామ పునర్నిర్మాణం వాళ్లకు సాధ్యం కాదని మాత్రమే’ అని కూడా అన్నాడు.

అప్పుడు నాకేసి చూసాడు.

‘ఇదుగో, మన దగ్గరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్స్ పర్ట్ ఎవరంటే, మన విమల. ఆమెని చక్కగా గైడ్ చేసేవాళ్ళుండాలేగాని ఏ శాస్త్రమైనా ఇట్టే నేర్చుకోగలదు, నలుగురికీ చెప్పగలదు. ఇంక వలంటీరు అంటారా? రాజుని మించిన వలంటీరు నాకిప్పటిదాకా కనబడలేదు. మన సమాజానికి కావలసింది, ఇటువంటి ఎక్స్ పర్టూ, ఇటువంటి వలంటీరూ- వీళ్ళిద్దరూ కలిసి పనిచెయ్యడం. కాదంటారా?’ అనడిగాడు.

27-4-2023

4 Replies to “ఆ వెన్నెల రాత్రులు-23”

  1. ఇప్పుడు కలలనీ ,ప్రాక్టికాలిటీని కలిపారు .ఏ పనైనా సాకారం కావడానికి రెండూ అవసరమే .ఏ ఒక్కటే వుంటే సాధ్యం కాదు. మార్పుకి జనం కూడా సిద్ధంగా వుండాలి. హ్మ్.

  2. కథ ఇవ్వాల్సిన సందేశం మిశ్రాపాత్ర ద్వారా ఇప్పించారు.కథకు ఆయువు పట్టైన విమల రాజుల మధ్య బంధానికి బీజం నాటారు. కాని విమల చెప్పేదంతా గతమే గనక అదీ ప్రేమలో పడ్డారా అన్న ప్రశ్నకు జవాబుగా కథమొదలైది గనుక వారి మధ్య ఏంజరిగి ఉంటుందనే ఒక ఉత్సుకత కలుగుతుంది.ముందున్న కథకోసం ఎదురుచూపు
    తప్పదుకదా!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%