సత్యశోధన

38

రెండురోజులకిందట గాంధీజీ ఆత్మకథ గురించి నాలుగు వాక్యాలు రాయకుండా ఉండలేకపోయానేగాని, నిజానికి ఆ పుస్తకం గురించీ, గాంధీజీ జీవితం గురించీ నా మనసులో కదలాడుతున్న భావాలన్నిటికీ నేను అక్షరరూపం ఇవ్వలేకపోయాను. 1927-29 మధ్యకాలంలో ఆ మానవుడు రాసుకున్న అనుభవాలు 2014 లో నన్నెట్లా చలింపచేస్తున్నాయో, ఆ వాక్యాలు చదివి నేనెందుకు స్పందిస్తున్నానో మాటల్లో పెట్టలేకపోతున్నాను.

1869 నుంచి 1921 దాకా తన జీవితంలోని యాభై ఏళ్ళ అనుభవాలు మాత్రమే గాంధీజీ అందులో రాసుకొచ్చారు. ఆ తరువాత తన జీవితంలో సంభవించిందంతా దేశానికి తెలుసనీ అందువల్ల వాటిని ప్రత్యేకంగా రాయవలసిన పనిలేదనీ ఆయన భావించారు. ఆ యాభై ఏళ్ళ జీవితంలో కూడా ముఖ్యంగా ముఫ్ఫై ఏళ్ళ అనుభవాలు, అంటే తాను బారిష్టరు చదువుకోవడానికి ఇంగ్లాండు వెళ్ళినప్పటినుంచి సహాయనిరాకరణ తీర్మానం కాంగ్రెస్ తో ఆమోదింపచేసుకునేదాకా అనుభవాలు. ఆ అనుభవాలన్నిటిలోనూ రాజకీయాలకీ, సమాజానికీ, స్వాతంత్ర్యానికీ సంబంధించిన భావాలది కేవలం రెండో స్థానం మాత్రమే. ఆ జీవితమంతా ప్రధానంగా కనబడే పదాలు- ఉపవాసాలు, శాకాహారం, బ్రహ్మచర్యం, ప్రార్థన, రామనామం, రామకృప మాత్రమే.

నాక్కూడా యాభయ్యేళ్ళు పూర్తయ్యాయి. గాంధీజీ జీవితంలో 20 ఏళ్ళనుంచి యాభై ఏళ్ళదాకా ముప్ఫై ఏళ్ళ పాటు సత్యంతో ప్రయోగాలు జరుపుతూనే ఉన్నాడు. పుస్తకమంతా చదివిన తరువాత చాలా దీర్ఘంగా ఆలోచించాను. గాంధీజీని సత్యం వైపు నెట్టిందేమై ఉండవచ్చునని? ఆయన చెప్పుకున్నదాని ప్రకారమే ఆయన మీద అయిదు ప్రభావాలున్నాయి.

ఒకటి, తను చిన్నప్పుడు తప్పులు చేసి ఆ తప్పుల్ని ఒప్పుకుంటూ తండ్రికి ఉత్తరం రాసినప్పుడు, ఆ తండ్రి కళ్ళవెంట స్రవించిన అశ్రువులు. ఆ దృశ్యాన్నిట్లా రాసుకున్నారాయన:

‘ఆయన ఆ ఉత్తరాన్ని ఆసాంతం చదివారు. ఆయన చెంపలమీదుగా ముత్యాల్లాంటి అశ్రుబిందువులు టపటపా జారి కాగితాన్ని తడిపేసాయి.ఒక క్షణంపాటు ఆయన ఆలోచనలో పడి కళ్ళుమూసుకున్నారు, ఆ మీదట ఆ చీటీని చింపేసారు. ఆయన లేచి కూచుని ఆ ఉత్తరం చదవవలసి వచ్చింది. మళ్ళా పక్కమీద వాలారు. నేను కూడా ఏడ్చేసాను. నా తండ్రి హృదయంలో ఘూర్ణిల్లిన దుఃఖాన్ని నేను చూడగలిగాను. నేనే కనుక ఓ చిత్రకారుణ్ణై ఉంటే ఆ మొత్తం దృశ్యాన్నంతా ఈ రోజు చిత్రించగలిగి ఉండేవాణ్ణి. ఆ దృశ్యం ఇప్పటికీ నా మనసులో అంత స్పష్టంగానూ ఉంది. ఆ ప్రేమ మౌక్తికాలు నా హృదయాన్ని ప్రక్షాళనం చేసేసాయి. అటువంటి ప్రేమని అనుభవించినవాడు మాత్రమే అదేమిటో తెలుసుకోగలడు.ప్రేమబాణం హృదయాన్ని చీల్చినవాడికే దాని శక్తి ఏమిటో అనుభవానికొస్తుంది. నా వరకూ నాకు అది అహింసా పాఠమనే అనిపించింది. ఆ రోజు నేనందులో ఒక తండ్రి ప్రేమను మించి మరేమీ చూడలేకపోయానుగాని, ఈ రోజు అది పూర్తిగా అహింస తప్ప మరేమీ కాదని గ్రహిస్తున్నాను.’

రెండవ ప్రభావం, తమ ఇంట్లో పరిచారిక రంభ ద్వారా విన్న రామనామమహిమ. ఒక హంతకుడి తుపాకిగుండు ముందు కూడా ఆ రామనామాన్ని ఆయన వదల్లేదు. మూడవ ప్రభావం, తన రాజ్ కోట్ మిత్రుడు రాయచంద్ భాయి స్నేహం. అతణ్ణి తన ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకోలేకపోయినప్పటికీ అతణ్ణి తన మార్గదర్శకుడిగానూ, ఆప్తుడిగానూ చెప్పుకున్నారాయన. ఇక నాల్గవ ప్రభావం, గాంధీజీ చదివిన రెండు పుస్తకాలు: టాల్ స్టాయి రాసిన The Kingdom of God is Within You, రస్కిన్ రాసిన Unto This Last. రస్కిన్ పుస్తకమైతే ఆయన బాహ్యాంతర జీవితాల్ని రెండింటినీ కూడా మార్చేసింది.

కాని ఈ ప్రభావాలన్నీ ఒక ఎత్తూ, ఆయన ఇంగ్లాండు వెళ్ళబోయే ముందు తల్లి ముందు ఒక జైన సాధువు సమక్షంలో చేసిన మూడు ప్రమాణాలూ ఒక ఎత్తు. తండ్రి చెప్పిన మాట పాటించడం రాముడు జీవితాన్ని రామాయణంగా మార్చినట్టే, తల్లికిచ్చిన మాట మోహన్ దాస్ ని మహాత్ముడిగా మార్చిందని స్పష్టంగా అర్థమవుతూ ఉంది.

మద్యం, మాంసం, మగువ- అనే మూడింటినీ ముట్టనని చేసిన ప్రమాణమే ఆయన జీవితాన్ని ‘సత్యం నుంచి సత్యం’ వైపుకు నడిపిస్తూ పోయిందని గ్రహించాను. ఆ మూడింటిలోనూ మద్యం ఆయన్ని వ్యక్తిగతంగా ఎక్కువ పరీక్షించలేదు. (అది తరువాత రోజుల్లో ఆయన పెద్దకొడుకు హరిలాల్ రూపంలో ఒక జీవితకాలంపాటు ఆయన్న్ని వేధించింది). కాని తక్కిన రెండూ ఆయన్ని చాలా నిశిత పరీక్షకు గురిచేసాయి. తన ప్రాణం, తన భార్య ప్రాణం ,తన కోడుకు మణిలాల్ ప్రాణం పొయ్యే పరిస్థితి సంభవించినప్పుడు కూడా మాంసాహారాన్ని ముట్టననే ప్రమాణాన్ని ఆయన వదులుకోలేదు. ఆ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేవారు, ఆత్మకథ 3వ భాగంలో 22వ అధ్యాయం ఒకసారి చదివితే బాగుంటుంది.

కాని అన్నిటికన్నా ముఖ్యమైన పరీక్ష తన కామవాంఛ కోసం పరస్త్రీవైపు చూడకుండా ఉండటమనేది. బహుశా గాంధీజీ జీవితంలో అత్యంత కీలకమైన ప్రమాణమిదే అనుకుంటాను. ఇంద్రియనిగ్రహం, బ్రహ్మచర్యం వంటి పదాల్ని శుష్కపదాలు గానూ, అర్థరహితంగానూ భావించే కాలంలో నేను పెరిగి పెద్దవాణ్ణవడం నా జీవితంలో అత్యంత దురదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో కూడా ఏదో ఒక దశలో నన్ను బడికి పంపేటప్పుడో, ఇల్లు విడిచి దూరప్రాంతానికి వెళ్ళేటప్పుడో, ఉద్యోగంలో చేరేటప్పుడో- నా తల్లి, తండ్రి, గురువు ఎవరో ఒకరు నాతో కూడా అట్లాంటి ప్రమాణం చేయించుకుని ఉంటే ఎంతబాగుండేది! ఈ రోజు నాకు స్పష్టంగా తెలుస్తున్నదేమంటే, నువ్వెంతైనా చదివి వుండవచ్చు గాక, ఎంతైనా నేర్చి ఉండవచ్చుగాక, నీ ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవడమెలానో తెలుసుకోకపోతే ఆ చదువు వృథా.

ఇంద్రియ నిగ్రహమంటే, కేవలం జననేంద్రియ నిగ్రహం గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు. ముఖ్యంగా నీ నోరు, నీ మాట. ఇతరులపట్ల దయాన్వితంగా మసులుకోవడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు సంపాదించుకొవడమే బ్రహ్మచర్యమని నేనిప్పుడు గ్రహిస్తున్నాను.

స్త్రీని కాముకంగా చూడటంలో ఉన్న ప్రధానదోషమేమిటంటే, ఆ చూపువల్ల నువ్వొక మనిషిని, నిండువ్యక్తిత్వాన్ని కనీసం కొన్ని క్షణాలపాటైనా ఒక మనిషిగా కాక ఒక object గా చూస్తావు. ఈ objectification ఇదే అత్యంత అమానవీయమైన అంశం. పరస్త్రీవైపు చూడకూడదన్న ప్రమాణం గాంధికి నెమ్మదిగా కలిగించిన ఎరుక ఏమిటంటే ,తన భార్యని కూడ తానట్లా చూడకూడదని. Objectification ఎదుటి స్త్రీ పట్ల ఎంత తప్పో, తన భార్య పట్ల కూడా అంతే తప్పు. తాను తన కోరిక వల్ల తన భార్యని కూడా ఒక object గా చూస్తున్నాడన్న గ్రహింపు రాగానే ఆయనకు తను తన భార్య దేహాన్ని colonize చేస్తున్నాడనీ , తద్వారా ఆమెనొక inferior being గానూ, second rate citizen గానూ భావిస్తున్నాడనీ అర్థం చేసుకున్నాడు. అప్పుడాయనకి దక్షిణ ఆఫ్రికాలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులతో వ్యవహరిస్తున్న తీరుకీ, భారతదేశంలో సవర్ణహిందువులు దళితకులాలతో వ్యవహరిస్తున్న తీరుకీ మూలకారణమెక్కడుందో తెలిసిపోయింది. తోటి మనిషి దేహాన్ని object గా భావించడంలోంచే సమస్త ఆధిపత్యభావజాలమూ పుట్టిపెరుగుతోందని గుర్తించాడు. నీ పక్కవాడు ఆధిపత్య భావజాలాన్ని చూపిస్తున్నాడని నువ్వతణ్ణి ప్రశ్నించే ముందు నీలో నిగూఢంగా ఉన్న అధిపత్య భావజాలం నుంచి నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకొమ్మనే ఆయన చెప్తున్నాడు.

ముఫ్ఫై ఏళ్ళ కిందట గాంధీజీ ఆత్మకథని రాజమండ్రిలో నా మిత్రుడు గోపీచంద్ కి చదవమని ఇచ్చినప్పుడు అతడొక వాక్యాన్ని ఎత్తిచూపి గాంధీ రాసిన ఆ వాక్యం నిజమే అయితే కనుక ఆయన నిస్సందేహంగా మహాత్ముడు అన్నాడు. ఆ వాక్యమెక్కడుందా అని ఈ సారి చదివినప్పుడు శ్రద్ధగా వెతికాను. 2వ భాగం ఇరవయ్యవ అధ్యాయంలో ఆ చివరి వాక్యం ఇలా ఉంది:

It has always been a mystery to me how men can feel themselves honored by the humiliation of their fellow-beings.

29-8-2014

8 Replies to “సత్యశోధన”

  1. sailajamitra – Hyderabad – I am a poet, writer and journalist residing at hyderabad. I was born in chinnagottigallu, chittoor dist on jan 15th. My qualifications are MA..PGDCJ ( In journalism).In all my 18 years of penchant writing, I launched 5 poetry books, one shortstory book and five english translated books on my own.
    sailajamitra says:

    “ఈ రచన గాంధీ ఆత్మకథను ఒక చారిత్రక పాఠ్యంగా కాక, ఒక జ్ఞానయాత్రగా అనుభవించిన వ్యక్తి మనస్సు నుంచి పుట్టిన వాక్యజాలం. ఇది పఠితను స్పర్శించదు — ఆత్మలోనికి జారుతుంది. రచయిత గాంధీజీ జీవితంలోని యథార్థతను, అతని ఆత్మాన్వేషణను, బ్రహ్మచర్య సాహసాన్ని, అహింస పరమార్థాన్ని — బాహ్య పరిశీలనలుగా కాదు, వ్యక్తిగతంగా తాను అనుభవించవలసిన ‘ఆహ్వానాలుగా’ స్వీకరించారు.
    ఇక్కడ గాంధీ ఒక చరిత్రపురుషుడిగా కాదు — మనల్ని మనలాగే ప్రశ్నించే మనస్సులుగా, మనల్ని చూసే కంటిగా, మనల్ని నడిపించే పథంగా పరిచయమవుతాడు. ‘Objectification’ అనే భావన చుట్టూ రచయిత చేసిన వ్యాఖ్యానం గాంధీ దేహాన్వేషణ నుంచి జ్ఞానాన్వేషణ దాకా సాగిన మార్గాన్ని తేటతెల్లంగా చూపుతుంది. ఒక భార్యను ‘భర్తకు చెందినవాడిగా’ కాకుండా, ‘స్వతంత్ర వ్యక్తిత్వంగా’ చూడాలన్న మార్పు, గాంధీ బ్రిటిష్ శాసనాన్ని విమర్శించిన మార్గానికి మూలకార్యంగా మారుతుంది. ఇది శృంగారాన్ని అహింసగా మార్చిన, స్నేహాన్ని రాజకీయంగా విస్తరించిన, ప్రేమను సామాజిక న్యాయంగా రూపుదిద్దించిన ప్రక్రియ.
    ఇక్కడ ప్రతి పేరాను, ప్రతి ప్రమాణాన్ని, ప్రతి ప్రభావాన్ని రచయిత మౌనంగా కాదు, అంతరంగికంగా అనుభవించారు. ఈ అనుభవం మాటలుగా పలకకపోయినా, మనిషిని మౌనంగా మార్చే మహాశక్తిని కలిగి ఉంది. అది తత్వవేత్తల కంటే గొప్పదిగా కాకపోయినా, నిజమైన మార్పు కోసం పరితపించే హృదయానికి కావలసినదిగా ఉంది.

    1. ప్రతి ఒక్క వాక్యానికి ప్రణమిల్లుతున్నాను.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%