మెడిటేషన్స్-10

మెడిటేషన్స్ లో ఎనిమిదవ అధ్యాయం మొత్తం పుస్తకంలోనే పెద్దది. ప్రతి ఒక్క మెడిటేషన్ కూడా ఎంతో ఆలోచించదగ్గది, పదే పదే మననం చేసుకోదగ్గది. ఏ ఆలోచనని ఎత్తి రాద్దామా అంటే ప్రతి ఒక్కటీ మీతో పంచుకోదగ్గదిగానే కనిపిస్తున్నది.

అరీలియస్ ఆలోచనలు చాలాసార్లు నిరాశాపూరితంగా ఉంటాయని వ్యాఖ్యాతలూ, చరిత్రకారులూ భావిస్తూ వచ్చారు. అసలు స్టోయిసిజంలోనే ఒక నిస్పృహ ఉంది అని కూడా కొందరంటారు. కాని ఇదే మాట బైరాగి కవిత్వం గురించి కూడా విమర్శకులు చెప్తూ వచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు విన్నప్పుడు అసలు నిరాశ అని దేన్ని అంటున్నారు అని అనుకుంటాను. ప్రపంచంలో ప్రతిసారీ ఒక సుఖవాదం ప్రబలినప్పుడు మనుషులు దేన్ని సుఖంగా భావిస్తున్నారో అది సుఖం కాదనీ, దాన్ని మించిన ఆనందమంటూ ఒకటి ఉంటుందని చెప్పిన ప్రతి భావనా వినడానికి మొదట నిరాశావాదంగానే ఉంటుంది. అరీలియస్ కాలంలో ఎపిక్యూరియన్లు సుఖమే జీవితపరమావధి అని ప్రచారం చేసారు, సోక్రటీసు కాలంలో సోఫిస్టులు వాక్చాతుర్యాన్నే సత్యమని నమ్మించడానికి ప్రయత్నించినట్టు. కాని ప్రపంచంలో సుఖం ఎంతో అంతకన్నా అధికభాగం దుఃఖం ఉంది. సుఖమూ, దుఃఖమూ, pleasure, pain- ఈ రెండింటి పట్లా అరీలియస్ కి చాలా స్పష్టత ఉంది. బాధ, వేదన, శారీరికమైన వ్యాకులత, నొప్పి- ఇవన్నీ నీ ఆత్మకి, అంటే నీ అంతరంగానికి చెందనివి, బయటివి అని ఆయన అంటున్నప్పుడు, సుఖం కూడా నీకు బయటిదే అని చెప్పకుండా ఎలా ఉండగలడు?

గీత గురించిన ఒక వ్యాఖ్యానంలో ఒక వ్యాఖ్యాత చెప్పిన మాట నాకు బాగా గుర్తుండిపోయింది. ఆయన ఏమంటాడంటే, ‘గీత సుఖాన్ని కోరుకోవద్దు అని చెప్పలేదు, సుఖం వెనకనే దుఃఖం కూడా అనివార్యంగా ఉంటుందని గుర్తుపెట్టుకో అని మాత్రమే చెప్తుంది, ఎంచుకునే బాధ్యత నీదే అని’ అంటాడు . అందువల్ల అరీలియస్ సుఖాన్ని కోరుకో అని చెప్పడు. సుఖమూ, దుఃఖమూ రెండూ నాకు వెలుపలివే, అవి నా అంతరంగాన్ని, నా వివేచనని, నాలోని దైవత్వాన్ని ప్రభావితం చెయ్యగలవి కావు అంటాడు. ఈ మాటలు (8:43) చూడండి:

రకరకాల మనుషుల్ని రకరకాల విషయాలు సంతోషపెడతాయి. అయితే నా ఆనందం వేరే. అది ఏ మనిషినుంచీ తప్పుకుపోనవసరం లేకుండానే, మనుషులకు ప్రాప్తించే ఏ అనుభవాన్నీ నిరాకరించవలసిన అవసరం లేకుండానే నా ఎరుకని నిలబెట్టుకోవడంలో ఉంది. అన్నిటినీ స్వాగతనేత్రాలతో స్వీకరించడంలోనూ, ప్రతి ఒక్కదాన్నీ దానికి తగ్గట్టుగా గౌరవించడంలోనూ ఉంది.

ఇవి మామూలు వాక్యాలు కావు. కాని ప్రపంచమంతటా జ్ఞానులు అని చెప్పదగ్గవాళ్ళు తమ జీవితంలో అవలంబించిన వైఖరి ఇదే అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కొన్ని వందలపేజీల రమణ మహర్షి సంభాషణల్లో, తనను ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తున్న వాళ్ళందరికీ, విసుగులేకుండా మహర్షి చెప్తూ వచ్చిన సమాధానం ఇదేనని కూడా చెప్పవచ్చు. ఇక్కడ గమనించవలసిందేమంటే, మనుషులందరికీ సంప్రాప్తించే ప్రతి ఒక్క అనుభవాన్నీ నిరాకరించకుండా తన ఎరుకని కాపాడుకోవడం. దీన్నే కవిత్వ పరమావధిగా చెప్తూ నన్నయ ‘ఎరుక సమగ్రం ‘ కావడం అన్నాడు. ఆధునిక మనస్తత్వవేత్తలు, యూంగ్ లాంటి వాళ్ళు దీన్ని integration of personality అన్నారు. సుఖాన్ని స్వీకరించగలం మనం ఉత్సాహంగా, కాని దుఃఖం ప్రాప్తించినప్పుడే, మనం స్తిమితం తప్పుతాం. అప్పుడే తోటిమనిషినీ, దేవుణ్ణీ నిందించడం మొదలుపెడతాం. కాని సుఖదుఃఖాలు రెండింటినీ స్వాగతనేత్రాల్తో స్వీకరించి కూడా తన స్తిమితం కోల్పోకుండా ఉండటం, అదీ తన ఆనందం అని చెప్తున్నాడు అరీలియస్.

ఇది ఉపనిషద్వాణి కూడా. తైత్తిరీయం ఆనందంలో కూడా రెండు స్థాయిల్ని నిర్వచించింది. మానుషానందం, దివ్యానందం అని. ఆరోగ్యవంతుడైన ఒక యువకుడు తన జీవితానుభవాలద్వారా పొందేది మానుషానందం. కాని దివ్యానందం దానికి ఎన్నో రెట్లు పైన, ఎన్నో రెట్లు ఎక్కువ అంటుంది ఉపనిషత్తు.

ఆ స్థితికి చెందినవాడు తాను భయపడడు, మరొకర్ని భయపెట్టడు అని కూడా అంటుంది ఉపనిషత్తు. ఈ మాటలు (8:42)చూడండి:

నన్ను నేనెప్పుడూ బాధపెట్టుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసి నేనెప్పుడూ ఎవర్నీ బాధపెట్టలేదు.

ఇవి మామూలు మాటలు కావు. గాంధీగారి సత్యశోధన చదివి నా మిత్రుడు గోపీచంద్ ఒక వాక్యం దగ్గరే తాను ఆగిపోయాయని చెప్పాడు. అది  It has always been a mystery to me how men can feel themselves honored by the humiliation of their fellow-beings అనే వాక్యం. నా మిత్రుడన్నాడు కదా, ఆ మాటలు అబద్ధమైనా అయ్యుండాలి లేదా ఆ రాసినవాడు మహాత్ముడేనా అయి ఉండాలి అని.

చాలాచోట్ల మహాత్ముడికీ, అరీలియస్ కీ ఆలోచనల్లో పోలిక కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇద్దరూ ఒకటే ఆత్మశక్తిని నమ్మారు కాబట్టి. అరీలియస్ రాసుకున్న ఈ మాటలు ( 8:45) చూడండి:

నన్ను తీసుకుపోయి ఎక్కడేనా పడేయండి, అక్కడ కూడా నేను నాలోని దైవం తృప్తిగా, ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోగలను- నా స్వభావానికి అనుగుణంగా ఆలోచించి నడుచుకున్నంతకాలం నాకు ఇబ్బంది లేదు.

ఈ మాటలు చదివినప్పుడు నాకో సంఘటన గుర్తొచ్చింది. ఏళ్ళ కిందట నేనొక జిల్లాలో పనిచేస్తున్నప్పుడు జిల్లాకలెక్టరుని కలవడానికి వెళ్ళాను. ఆ రోజు ఏదో బంద్ నడుస్తోంది. నేను వెళ్ళేటప్పటికి ఆయన ఆఫీసులోనే ఉన్నాడు. కొంతమంది అప్పుడే కొన్ని నిముషాల ముందు తన ఛాంబరులోకి వచ్చి ఆఫీసు బంద్ చెయ్యమని అడిగారని చెప్పాడాయన. ‘మరి?’ అన్నాను. ‘అంటే, మరింకా ఎందుకు ఆఫీసు తెరిచే ఉన్నారు?’ అన్న అర్థంలో. ఆయన నవ్వాడు. ‘నేను మాజిస్ట్రేటుని. ఇంటికి వెళ్ళినా కూడా మాజిస్ట్రేటునే. నేను ఎక్కడ కూచుంటే అక్కడే నా ఆఫీసు. దాన్నెట్లా మూసెయ్యగలను? అని అడిగాను వాళ్ళని. వాళ్ళకి ఏమి జవాబు చెప్పాలో తోచలేదు. వెళ్ళిపోయారు’ అన్నాడు ఆయన గంభీరంగా.

పైకి మాజిస్టీరియల్ భాషగా వినిపించినప్పటికీ, ఆ మాటలు అరీలియస్ కి చాలా సన్నిహితంగా వస్తున్నాయని ఇప్పుడు గుర్తిస్తున్నాను. నీలో ఒక మాజిస్ట్రేటు బలంగా ఉన్నంతకాలం నిజంగానే ఏ సుఖదుఃఖాలూ నీ అంతరంగం మీద ఆంక్షలు విధించలేవు. అందుకనే అరీలియస్ ఇలా (8:48) రాసుకున్నాడు:

వ్యామోహాల బెడద లేని మనస్సు ఒక దుర్గం లాంటిది. ఇంతకన్నా ఆశ్రయం ఇవ్వగల దుర్భేద్య దుర్గం మరొకటి ఉండదు.ఇక్కడ శరణు జొచ్చినవాడు అజేయుడు. ఈ సంగతి తెలియనివాడు వివేకహీనుడు. తెలిసినా కూడా ఇక్కడ ఆశ్రయం తీసుకోనివాడు భాగ్యహీనుడు.

నిజానికి ఆయన దృష్టిలో మనిషి పొందే ఆనందమే దివ్యానందం. అంటే ఆ మనిషి వివేకవంతుడైన మనిషి అయి ఉంటే, ఎరుక కలిగినవాడు అయి ఉంటే అతడి ఆనందం దివ్యానందమే అనడానికి ఆయనకి సంకోచం లేదు. ఈ మాటలు (8:26) చూడండి:

మనిషి చెయ్యవలసిన పనులు చెయ్యడంలోనే మనిషికి నిజమైన ఆనందం ఉంటుంది. ఏమిటవి? తోటివాళ్ళ పట్ల దయగా ఉండటం, ఇంద్రియాల ప్రేరేపణకి లొంగిపోకపోవడం, మోహపెట్టే విషయాలపట్ల ఒక క్షణం ఆగి చూసుకోవడం, ప్రపంచ స్వభావాన్ని, అందులో సంభవిస్తున్న సంఘటనల్ని జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవడం.

మనిషి మనిషిగా బతకడంలో ఉన్న ఆనందం ఇది. కాని ఇటువంటి మాటలు వినగానే మనం సహజంగానే విముఖులమైపోతాం. చిన్నప్పణ్ణుంచీ మనం ఇటువంటి మాటలు వింటూనే పెరిగాం కానీ, వీటిని సాధ్యం చేసుకుని జీవించినవాళ్ళు మనకి ఎప్పుడూ కనిపించి ఉండరు కాబట్టి ఇవి ఆచరణసాధ్యాలని మనం నమ్మడానికి ఇష్టపడం. ఎక్కడో కొండకోనల్లో ఎవరో ఋషీశ్వరులో, మునులో మాత్రమే ఇటువంటి మనఃస్థితితో జీవిస్తారనీ, మన చుట్టూ ఉండే ప్రాపంచిక జీవితం ఇందుకు అవకాశం ఇవ్వదని మనమెప్పుడో తీర్మానించేసుకుని ఉంటాం.

కాని అరీలియస్ కూడా ఇటువంటి దివ్యస్థితిలోనే జీవితమంతా గడిపినట్టు ఎక్కడా కనిపించదు. పైగా మెడిటేషన్స్ లోనే ఎన్నో సార్లు ఎంతో ఊగిసలాట కనిపిస్తుంది. ఆ మాటకొస్తే తాను తను అనుకుంటున్నట్లుగా ఉండలేకపోతున్నాడనే కదా ఆయన తనని అన్నిసార్లు అంతలా మందలించుకుంటూ వస్తున్నది! అసలు ఎనిమిదవ అధ్యాయం మొదలుకావడమే సుదీర్ఘమైన మందలింపుతో (8:1)మొదలవుతుంది. చూడండి:

శుష్కమైన కీర్తికోసం పాకులాట వదిలిపెట్టమనే ఈ మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను.. నీ జీవితమంతా, కనీసం నువ్వు పెద్దవాడివయ్యాక జీవించిన జీవితమైనా సరే, జ్ఞానప్రేమిగా గడపలేకపోయావు. నీ జీవితం ఇంకా శీలవిద్యకు దూరంగానే ఉంది. ఈ విషయం తక్కినవాళ్ళకే కాదు, నీక్కూడా ఈ పాటికి స్పష్టమయ్యే ఉండాలి. నువ్వు ఎంత భ్రష్టుడివయ్యావంటే, నిన్నింక మీదట ఎవరూ కూడా తత్త్వవేత్త అని పిలిచే అవకాశమే లేదు. పైగా నీ జీవితవిధానం కూడా దానికి వ్యతిరేకంగానే నడుస్తోంది. నేనేం చెప్తున్నానో నీకు అర్థమయితే ముందు చెయ్యవలసిన పని, అదిగో, నలుగురూ నిన్ను తాత్త్వికుడు అని అంటారా లేదా అన్న ఆలోచన తీసి పక్కన పారెయ్యి. కనీసం మిగిలిన జీవితమైనా నీ స్వభావానికి అనుగుణంగా జీవించడంతో తృప్తిపడు. నీ అంతఃప్రకృతి ఏమి కోరుకుంటున్నదో గమనించు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు వేటినిపట్టుకు పాకులాడేవో అవేవీ నీకు తృప్తి నివ్వలేదు. తర్కశాస్త్రం, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, భోగభాగ్యాలు- ఎక్కడా నీకు సంతోషం చిక్కలేదు. మరి నీ ఆనందం ఎక్కడుందని? అది నీ అంతరంగానికి అనుగుణంగా నడుచుకోవడంలో ఉంది. అలా నడుచుకోవాలంటే ఏమి చెయ్యాలి? నీ మాటల్నీ, చేతల్నీ నిర్దేశించే సూత్రాల్ని అనుసరించడం వల్ల. ఏమిటా సూత్రాలు? మంచికీ, చెడ్డకీ సంబంధించిన సూత్రాలు. మనిషిని న్యాయబద్ధుడిగా, సాహసిగా, స్వతంత్రుడిగా, తనమీద తాను అదుపు కలిగినవాడిగా చెయ్యడానికి సహకరించనిదేదీ మంచిది కాదనే మెలకువ. అందుకు విరుద్ధంగా నడుచుకోనిదేదీ చెడ్డది కాదనే జ్ఞానమూనూ.

ఈ మాటలు రాసుకున్న మనిషి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆయన యుద్ధాల్లో తలమునకలుగా ఉంటూ, తానొక వైపు యుద్ధం చేస్తూ, మరొకవైపు తలెత్తిన తిరుగుబాటుని అణచడానికి తన సేనాధిపతిని పంపించాడు. ఆ సేనాధిపతి అక్కడ విజయం సాధించి తనని తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. అతడికీ, అరీలియస్ భార్యకీ మధ్య అక్రమసంబంధం ఉందని పుకార్లు కూడా ఉండేవి. ఆ కారణాలు చాలు అరీలియస్ అతణ్ణి వధించి ఉండటానికి. కాని అరీలియస్ కి తెలియకుండా అతడి సైనికులే ఆ సేనాధిపతిని చంపేసి అందుకు సాక్ష్యంగా అతడి తల తీసుకువచ్చి చక్రవర్తి ముందు చూపించారు. కాని చక్రవర్తి అందుకు సంతోషించలేదు. అతడి కుటుంబసభ్యులకి క్షమాభిక్ష ప్రసాదించాడు. అతడికీ, అతడి సన్నిహితులకీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్ని బయటపెడితే వాటిని తెరిచిచూడటానికి కూడా ఇష్టపడలేదు. ఆ ఉత్తరాల్ని తన ఎదటనే తగలబెట్టించేసాడు.

ఒక మనిషి తన అంతరంగానికి అనుగుణంగా జీవించడమంటే ఇది. ఇంతబరువైన సంఘటన ఏదీ మన జీవితంలో తటస్తించలేదని నిశ్చయంగా చెప్పగలను. మన జీవితాల్లో మనం లోనైన అపార్థాలూ, అనుమానాలూ, ద్రోహాలూ ఏవీ కూడా ఇంతపాటివి కావని చెప్పగలను. కనుకనే, ఈ రాతలు రాస్తున్న మనిషి నిజంగానే శీలవిద్యను అనుష్టించడానికి జీవితమంతా తపస్సు చేసాడని నమ్మగలుగుతున్నాను.

జీవితం నీదైనా, నాదైనా, అరీలియస్ ది అయినా అధికభాగం ఏముంటుంది? దుమ్మూ, ఉమ్మూ. ఆయనే ఇలా (8:24) అంటున్నాడు:

అచ్చం నువ్వు స్నానం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే-నూనె, చెమట, మురికి, మురుగునీరు-అబ్బా, అంతా పరమవికారంగా-జీవితం కూడా అంతే.

కాని ఇందులో ధ్వని ఏమిటంటే, అప్పుడు మనం స్నానం చేస్తున్నామని మర్చిపోకూడదు. మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటున్నమని గుర్తుపెట్టుకోవాలి. కాని మనమేం చేస్తుంటాం? మనల్ని ఎదుటివాడు ప్రశంసించాలని, మన జీవితవిధానాన్ని ఆమోదించాలని కోరుకుంటున్నాం. నువ్వు కనీసం స్నానం చేస్తున్నావు. వాడేం చేస్తున్నాడు? ఈ మాటలు (8:53) వినండి:

రోజుకి మూడుసార్లు తనని తాను శపించుకునేవాడినుంచా నువ్వు ప్రశంసలు కోరుకుంటున్నావు? తనని తాను సంతోషపెట్టుకోలేనివాడు నిన్ను సంతోషపెడతాడనా ఎదురుచూస్తున్నావు? వాడు ఏమి చేసినా వగస్తూనే ఉంటాడు, పశ్చాత్తాపపడుతూనే ఉంటాడు, వాడు నిజంగా ఎవరినేనా సంతోషపరచగలడంటావా?

నిజంగా ఆత్మని సంతోషపెట్టుకోవాలనుకున్నవాడు జీవించే పద్ధతి వేరు. అది బుద్ధుడు, ఉపనిషత్తులు, తిరువళ్ళువర్ లు చెప్పినట్టే ఉంటుంది. సరిగ్గా అరీలియస్ ది కూడా అదే దారి. ఈ మాటలు (8:51) చూడండి:

నీ పనుల్లో సోమరిగా ఉండకు, సంభాషణల్లో పద్ధతిలేకుండా మాటాడకు, ఆలోచనల్లో దారితప్పిపోకు. అంతరంగంలో కుంగిపోకు, పొంగిపోకు, తీరికలేనంతగా వ్యాపకాల్లో మునిగిపోకు.

మనుషులు ఒకవేళ నిన్ను చంపేసారే అనుకో, ముక్కలు ముక్కలుగా నరికేసారనుకో, నిన్ను కసితీరా శపించారనుకో. అంతమాత్రాన నువ్వు నిర్మలంగా, వివేకిగా, ధీరుడిగా, యోగ్యుడిగా ఉండటానికి అవి ఏ విధంగా అడ్డంకి అట? ఉదాహరణకి ఒకడు ఒక నిర్మలమైన నది ఒడ్డున నిల్చున్నాడు, ఆ తేట నీటిని నోరారా శపించాడు, అంతమాత్రాన ఆ నది నిర్మలజలాలతో ప్రవహించడం మానుకుంటుందా? వాడు అందులో మట్టీ మురికీ పడేసాడనుకో, ఆ నది మరుక్షణంలోనే వాటిని తనలో కలిపేసుకుని, వాటి ఆనవాళ్ళు కూడా మిగల్చకుండా చేసేస్తుంది, మళ్లా తన దారిన తాను నిష్కళంకంగా ప్రవహించుకుంటూ పోతుంది కదా. చూడు, అటువంటి ఒక నిత్యస్రోతస్సును నువ్వెలా సముపార్జించుకోగలుగుతావు? అందుకే ఒకటే దారి-నీ మనసుని ఎప్పటికప్పుడు స్వతంత్రంగా అట్టేపెట్టుకోవడం- సరళంగా, దయగా, పరిశుభ్రంగా మసులుకోవడం.

ఇది రేపెప్పుడో చెయ్యదగ్గ పని కాదు. ఇప్పుడే, ఈ క్షణం నుంచే మొదలుపెట్టగల విషయం. ఇంత రాసుకున్నప్పటికీ అరీలియస్ కే తన నైతిక ప్రగతి పట్ల సంతృప్తి కలగలేదు. తనని తాను ఎంత కఠినంగా మందలించుకున్నాడో (8:22) చూడండి:

ఇప్పుడు నీ ముందున్న సంగతి చూడు. అది ఒక అభిప్రాయం చెప్పడం కావచ్చు లేదా ఒక పని చేయడం కావచ్చు లేదా ఒక మాట మాట్లాడటం కావచ్చు. నువ్వు ఇది అనుభవిస్తున్నావంటే వట్టినే అనుభవించడం లేదు. ఎందుకంటే నువ్వు ఇవాళే మంచిగా ఉండవచ్చు, కాని ఆ పని వాయిదా వేసి రేపణ్ణుంచి మంచిగా ఉండాలనుకుంటున్నావు.

బహుశా జీవితంలో ఏదైనా వాయిదా వెయ్యవచ్చునేమోగాని, నువ్వు నువ్వుగా ఉండటాన్ని మాత్రం కాదు.

9-11-2022

4 Replies to “మెడిటేషన్స్-10”

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%