ఎమిలీ డికిన్ సన్ వారసురాలు

తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ కి 2011 లో నొబేల్ పురస్కారం లభించినతర్వాత ఇన్నాళ్ళకు మళ్ళా మరొక కవికి ఆ పురస్కారం లభించింది. లూయీస్ గ్లూక్ కి 2020 కి సాహిత్యంలో నోబెల్ పురస్కారం ప్రకటించడంతో మరొకసారి ఆ సాహిత్య పురస్కారం తన గౌరవాన్ని నిలబెట్టుకోగలిగింది. గ్లూక్ కి ట్రాన్స్ ట్రోమర్ పురస్కారం కూడా లభించింది. చాలా విషయాల్లో ఆమెకూడా ట్రాన్స్ ట్రోమర్ లాంటి కవి అనే చెప్పవచ్చు. ఆయనలానే ఆమె కూడా సూక్ష్మపరిశీలకురాలు, ధ్యాని, మానవప్రపంచం పట్ల, జీవితం పట్ల అపారమైన సహానుభూతి, దయ పొంగిపొర్లే సహృదయురాలు. గత పదేళ్ళలో ట్రాన్స్ ట్రోమర్, గ్లూక్ వంటి కవులకి ఈ అంతర్జాతీయ పురస్కారం లభించడంలో నా వంటి వాళ్ళు సంతోషించే ఒక అంశం ఉంది. అదేమంటే, కవిత్వాన్ని వాదాలతోనూ, వివాదాలతోనూ సంబంధంలేకుండా సాధనచేసే కవుల్ని తక్కిన ప్రపంచం ఏదో ఒకరీతిన అనుసరిస్తూనే ఉంటుందనీ, వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఏదో ఒక మేరకు ప్రభావితం చేస్తూనే ఉంటారనిన్నీ.

1968 లో First Born అనే కవితాసంపుటి వెలువరించటంతో మొదలైన గ్లూక్ కవితాయాత్ర 2014 లో వెలువరించిన Faithful and Virtuous Night దాకా కొనసాగుతూనే వస్తున్నది. ఇప్పటిదాకా ఆమె వెలువరించిన పన్నెండు కవితాసంపుటులతోనూ ఆమె పొందవలసిన ప్రసిద్ధ పురస్కారాలన్నీ పొందుతూనే వచ్చింది. పులిట్జర్ పురస్కారంతో పాటు ఆమెరికా ఆస్థాన కవయిత్రి కాగలిగే గౌరవానికి కూడా నోచుకుంది.

ఈ రెండు వారాలుగానూ ఆ పన్నెండు కవితాసంపుటుల్నీ చాలా శ్రద్ధగా చదువుతూ ఉన్నాను. వాటిని చదువుతున్నాను అనడం కూడా సరైన పదం కాదు. వాటిలోకి ప్రయాణిస్తూ ఉన్నాను. ఆ కవిత్వంతో నెమ్మదిగా ప్రగాఢ సాంగత్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాను. ఆ కవిత్వం మొత్తం ఒకసారి చదివినప్పటికే ఆమెని ఒక ఋషి అని ప్రస్తుతించకుండా ఉండలేకపోతున్నాను. బహుశా మరికొన్నేళ్ళపాటు ఆ పుస్తకాలు నా దైనందిన పారాయణ గ్రంథాలుగా ఉంటాయనుకుంటున్నాను.

ఏదో ఒక గాటన కట్టలేకపోవడమే గ్లూక్ కవిత్వ విశిష్టత. ఆమెని ethnic అని గానీ, feminist అని గానీ, ప్రకృతి కవి అని గానీ అనలేం. అందుకనే అటువంటి కవిని ఎంచుకుంటే తాము వివాదాలకు దూరంగా ఉండగలమని నోబెల్ కమిటీ భావించిందని కూడా ఒకరిద్దరన్నారు. కాని, ప్రస్తుత ప్రపంచంలో కవి ఎక్కడున్నాడు, ఏమి చేస్తుంటాడు అని ప్రశ్నించుకుంటే మనకి లభించగల అత్యుత్తమ ఉదాహరణలు ట్రాన్స్ ట్రోమర్, గ్లూక్ వంటి కవులు. ‘ఒక మనిషిని రచయితని చేసే అత్యంత మౌలికానుభవం అతడి నిస్సహాయత మాత్రమే’ అని అంటుంది గ్లూక్. ‘ అతడి జీవితానికి సార్థకత చేకూర్చేది ఒక వెతుకులాట తప్ప ఏదో ఒకటి సాధించానని చెప్పుకునే ప్రగల్భం కాదు. సాహిత్యం అన్నిటికన్నా ముందు ఒక సేవ, ఒక స్వీయక్రమశిక్షణ’ అని కూడా అందామె. గ్లూక్ ని నేను ఋషి అంటున్నానంటే ఈ అర్థంలోనే.

ఋషి కాని వాడు కవి కాలేడని మన పెద్దలు భావించారు. కాని మనకి రెండు రకాల ఋషి సంప్రదాయాలున్నాయి. ఒకటి వ్యాసుడి సంప్రదాయం. అక్కడ మనిషి తన స్వానుభవాన్ని పరిశీలించుకుంటూ మొత్తం సమాజగమనాన్ని, చరిత్రని పరిశీలిస్తుంటాడు. మరొకటి వాల్మీకి సంప్రదాయం. అక్కడ కవి తన తోటిప్రాణుల సుఖదుఃఖాలతో మమేకవుతూ వారి శోకాన్ని తన శ్లోకంగా మార్చుకుంటూ ఉంటాడు. అమెరికన్ సాహిత్యానికి కూడా ఇటువంటి ఇద్దరు ఋషులున్నారు. ఒకరు వాల్ట్ విట్మన్. ఆయనకి ఆకాశమే సరిహద్దు. ప్రపంచంలోని అన్ని ఖండాలూ, అన్ని జాతులూ, అన్ని నదులూ, పట్టణాలూ, నగరాలూ- ప్రతి ఒక్కదాన్నీ తనబాహువుల్లో పొదువుకుని స్వేచ్ఛాగానం చేసిన కవి ఆయన. ఎమిలీ డికిన్ సన్ అలా కాదు. ఆమె ప్రతి ఒక్క స్పందననీ, సంవేదననీ, ప్రతి ఒక్క కాంతికిరణాన్నీ, ప్రతి ఒక్క చీకటిపోగునీ పట్టుకుని దాని ఆధారంగా తన అంతరంగంలోకి ప్రయాణం చేసిన కవయిత్రి. ఆమెకి బాహ్యజీవితం, బాహ్యప్రపంచం వల్మీక తుల్యాలు. ఆ పుట్ట దగ్గర ఇంచుక చెవి ఒగ్గి ఆలిస్తే సప్తసముద్రాలూ ఘూర్ణిల్లుతున్న చప్పుడు మనం వినవచ్చు.

నోబెల్ పురస్కారం పొందిన మరొక మహనీయ రచయిత్రి టొనీ మారిసన్ ని మనం వాల్ట్ విట్మన్ దారిలో పయనించిన రచయిత్రిగా భావిస్తే, గ్లూక్ ని ఎమిలీ డికిన్ సన్ వారసురాలిగా గుర్తుపట్టగలం. ఈ పోలికని ఇప్పటికే ప్రపంచం అంగీకరించింది కూడా.

కానీ ఎమిలీ డికిన్ సన్ కీ గ్లూక్ కీ మధ్య ఒక తేడా ఉంది. గ్లూక్ కి కుటుంబం ఉంది. ఆఫ్రికానుంచి అమెరికానుంచి ప్రయాణించే దారిలో మరణించిన ప్రతి ఒక్క నల్లజాతి మనిషి హృదయస్పందనా మారిసన్ లో వినిపించినట్టే, ప్రతి ఒక్క కౌటుంబిక బంధం, ప్రతి ఒక్క రక్తసంబంధం గ్లూక్ లో సంచలిస్తూనే ఉంటుంది. తల్లి, తండ్రి, చెల్లి, అక్క, భర్త, కొడుకు, కూతురు, మేనత్త, మేనకోడలు- గ్లూక్ తనని అంటిపెట్టుకుని ఉన్న ప్రతి ఒక్క సమీప మానవసంబంధాన్నీ తరచి తరచి చూస్తుంది. కుటుంబం ఆమె వల్మీకం.

లేదూ, ప్రకృతిలోంచి ఏవైనా పోలికలు తెచ్చి గ్లూక్ ని అర్థం చేసుకోవాలనుకుంటే, ఆమెని ఒక చెట్టుతో పోల్చవచ్చు. చెట్టులాగా ఆమె ఎక్కడికీ కదలదు. కాని సమస్తప్రపంచాన్నీ తానున్నచోటనే నిలబడి అనుభవంలోకి తెచ్చుకోగలదు. చెట్టులో అనునిత్యం ఆకాశకాంతీ, భూగర్భజలాల తేమ సంవదిస్తూనే ఉంటాయి. ఏడాది పొడుగునా ప్రతి ఒక్క ఋతువునీ చెట్టు తనలో తాను, తనకై తాను అనుభవంలోకి తెచ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, చెట్టుని బట్టే చాలాసార్లు మనం ఋతువుల్ని గుర్తుపడతాం. సమస్త శీతోష్ణాల్నీ తనలోకి ఇంకించుకుని, తిరిగి ప్రకటించడంలో గ్లూక్ కవిత్వం అశ్వత్థ సమానం.

మరొక పోలిక కూడా చెప్పమంటే గ్లూక్ కవిత్వం మంచినీటి సరస్సులాంటిదని చెప్పవచ్చు. ఆ సరసు ఎండాకాలం చాలావరకూ అవిరైపోతుంది. వానాకాలం పొంగిపొర్లుతుంది. శీతాకాలం గడ్డకడుతుంది. కాని, ఎక్కడో మట్టిలోని క్షారాల్ని తనలోనే ఇంకించుకుని, తనలో కురిసిన ఒక్క ప్రతి ఒక్క నీటిచుక్కనీ మంచినీటి చుక్కగా మార్చుకునే ఒక సరసు లక్షణమేదో ఆ కవిత్వానికుంది.

మానవ భావావేశాల్ని పరిశోధించే శాస్త్రవేత్త అని కూడా ఆమెని అనుకోవచ్చు. జీవితకాలంపాటు కొన్ని జీవకణాల్ని పరిశోధించే శాస్త్రవేత్తలానో, లేదా కాంతికిరణస్వభావాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించే భౌతిక శాస్త్రవేత్తలానో ఆమె తన జీవితం పొడుగునా తల్లి, తండ్రి, చెల్లి, భర్త లాంటి అనుబంధాల్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. పొందడం, పోగొట్టుకోవడం, సంతోషం, సంతోషరాహిత్యం, సాన్నిహిత్యం, ఒంటరితనం లాంటి అత్యంత మౌలిక మానవానుభవాల్ని ఆమె తన మనసనే మైక్రోస్కోపులో పెట్టి పరీక్షిస్తూనే వచ్చింది. ఆమె కవిత్వం నుంచి మనకి లభించగల అతి గొప్ప ఉపాదానమిదే: ఆ కవితలు చదువుతున్నప్పుడు, మన తల్లులూ, మన తండ్రులూ మనకి కొత్తగా పరిచయమవుతారు. అన్నేళ్ళ పాటు వాళ్ళకి అంత దగ్గరగా జీవించి కూడా మనం వాళ్ళని నిజంగా పోల్చుకోగలిగేమా అనిపిస్తుంది. ‘అత్యంత వ్యక్తిగత అనుభవాన్ని అత్యంత సార్వజనీనంగా మార్చగలిగింది ‘ అని నోబెల్ కమిటీ ఆమెని ప్రస్తుతించడంలో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది.

గ్లూక్ ని చదువుతుంటే ప్రపంచాన్ని ఒక ప్రశాంత చిత్తంతో పరికించగల మనఃస్థితి అనుభవంలోకి వస్తుందని ఒక విమర్శకురాలు రాసింది. గ్లూక్ ని తెరిచి పది కవితలు చదివేటప్పటికే మన దైనందిన జీవితం, మన రోజువారీ అల్పవిషయాలూ కొత్త గంభీరతని సంతరించుకుని మనకి సాక్షాత్కరించడం మొదలుపెడతాయి. ‘ ఈ నా శరీరమందివతళించిన గాలి ఎంత పౌరాతన్యమేచికొనెనో ‘ అన్నట్టుగా ప్రతి ఒక్క కాంతిపోగు, ప్రతి ఒక్క గాలిరేక మనల్ని మనం పట్టించుకోని మనజీవితంలోకి మేల్కొల్పుతాయి.

గ్లూక్ కవిత్వ సారాంశం ఏమిటో ఒక్కమాటలో చెప్పు అంటే, ‘ప్రగాఢం’ అనే మాట చెప్తాను. మన దైనందిన జీవితాల్లో మనం పొందనిదిదే. మనం దేన్నీ ప్రగాఢంగా అనుభూతి చెందం. ఉపరితలంలోనే బతుకుతూ ఉంటాం. చివరికి మనం ప్రగాఢంగా భావించుకుంటున్నామనుకునే వాటిని కూడా, అంటే, మన కౌటుంబిక సంబంధాలు, సామాజిక సంబంధాలు, మన యుద్ధాలు, విప్లవాలూ ప్రతి ఒక్కటీ ఉపరితల సంవేదనలే. అట్టలాగా మనచుట్టూ పుట్టకట్టిన ఆ పెంకుని బద్దలు కొట్టడమే మహాకవుల కర్తవ్యం. గ్లూక్ కవిత్వం చదువుతున్నంతసేపూ మన పెంకు చిట్లుతున్నచప్పుడు మనకి వినిపిస్తూనే ఉంటుంది.

గత యాభయ్యేళ్ళకు పైగా ఒకే అంశాన్ని తిరిగి తిరిగి చెప్తూ వస్తోందనీ, ఆమె పదజాలం చాలా పరిమితమనీ ఎవరేనా అంటున్నప్పుడు నాకది విమర్శగా తోచడంలేదు. ఎందుకంటే,

We look at the world once, in childhood.

The rest is memory.

అన్న ఒక్క వాక్యం చాలు, ఆమె కవిత్వానికి నా హృదయంలో పట్టాభిషేకం చెయ్యడానికి.

22-10-2020

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading