నువ్వట్లా ఆ సముద్రం ఎదట నిలబడ్డప్పుడు, ఆ కెరటాలు సుదూరనీలం నుంచీ నీ దాకా ప్రవహించి నీ ఎదటనే ఎగిసిపడుతున్నప్పుడు, తక్కినవన్నీ మరిచి నువ్వా అఖండ నీలిమనే ఎట్లా సందర్శిస్తూ ఉంటావో, ఎట్లా సంభావిస్తో ఉంటావో, అట్లా నీ జీవితాన్ని పక్కన పెట్టి, నువ్వు విలువైనవీ, ముఖ్యమైనవీ అనుకుంటున్నవన్నీ పక్కన పెట్టి ఆ సముద్రానికి నిన్ను నువ్వు పూర్తిగా ఇచ్చేసుకోవాలి.
గిరాం మూర్తి
అసలు గిరాం మూర్తి అనే పదప్రయోగం చేయడంలోనే శ్రీ శ్రీ గొప్ప ప్రజ్ఞ చూపించాడు. అది గిడుగు రామ్మూర్తి అనే పదానికి సంక్షిప్తరూపం మాత్రమేకాక, గిరాం అంటే మాటలు, వాక్కు, భాష కూడా కాబట్టి, రూపెత్తిన భాష అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అంటే వాగ్దేవి స్వరూపమన్నమాట.
నీలిపడవ
లోకమంతా ఒక ఆకాశంగా మారినవేళ, నది ఒడ్డున మనుషులు కూడా వినిపించీ, వినిపించని గుసగుసగా మారిపోయినవేళ, ఒక పడవమీద కూచుని, తెరిచానీ పుస్తకం.