కబీరు-10

కబీరు కవిత్వం అనువాదం పూర్తయ్యింది. రెండేళ్ళుగా నా జీవితాన్ని వెలిగించిన వ్యాపకం. తీరికసమయాల్లోనే కాక, తీరికచేసుకుని కూడా నెరవేర్చిన బాధ్యత.

సముద్రమంత కబీరు సాహిత్యంలో ఏ కవితల్ని ఎంచాలన్నదానికే చాలాకాలం పట్టింది. ఇంగ్లీషు అనువాదాల ద్వారా కాకుండా నేరుగా హిందీనుంచి చెయ్యాలన్న ప్రయత్నం వల్లనే చాలా సమయం పట్టింది. ఎప్పుడో హైస్కూలు రోజుల్లో మా హీరాలాల్ మాష్టారు పరిచయం చేసిన కబీరు, ఆయన నేర్పిన హిందీ. ఒక రోజుకి ఇట్లా కబీరుని, నా అంతటనేనే, హిందీనుంచి అనువాదం చెయ్యగలనని ఊహించలేకపోయాను.

165 పదాలు, 9 రమైనీలు, 131 దోహాలు మొత్తం 305 కవితలు అనువాదం చెయ్యగలిగాను. కబీరు పేరు మీద వ్యాప్తిలో ఉన్న ప్రధాన సంకలనాలు- శ్యామ సుందర దాస్ సంకలనం చేసిన కబీర్ గ్రంథావలీ, పారశ్ నాథ్ తివారీ సంకలనం చేసిన కబీర్ గ్రంథావలీ, గురుగ్రంథసాహెబ్ లోని కబీరు కవిత్వం, బీజక్, కబీర్ సాహిబ్ కీ శబ్దావలీ, కబీర్ సాఖీ సంగ్రహ్ ల తో అయోధ్యా సింహ ఉపాధ్యాయ ‘హరి ఔధ్’ గుదిగుచ్చిన ‘కబీరు వచనావలీ’ లనుంచి సేకరించిన సాఖీలు, శబ్దాలు, రమైనీలనుంచి ఎంపిక చేసిన కవితలు.

హిందీనుంచి కబీరును అనువాదం చెయ్యడంలో ఎంత శ్రమ ఉందో పూనుకున్నాక కానీ తెలియలేదు. అయిదువందల ఏళ్ళకిందటి ఆ కవిత్వంలో ఆరబిక్, పర్షియన్, రాజస్థానీ, గుజరాతీ, పంజాబీ, సంస్కృతం, హిందీ, మరాఠీ పదజాలం విస్తృతంగా ఉంది. ఆ పదాలకి చెప్పుకోదగ్గ పదకోశాలు లేవు. ఎన్నో పదాలు కాలగతిలో అదృశ్యమైపోయాయి లేదా స్వరూపం మార్చేసుకున్నాయి. ‘సాధుక్కడి’ గా గుర్తించబడ్డ ఆ కావ్యభాష దానికదే ఒక భాష. ఆ పదాలు స్ఫురింపచేసే అర్థాలు మామూలు జీవితానికీ, మామూలూ చైతన్యానికీ సంబంధించిన అర్థాలు కావు. అందువల్ల కబీరుని ఇంగ్లీషులోకి అనువదించినవాళ్ళు, టాగోర్ తో సహా ప్రతి ఒక్కరూ ఎంతో స్వతంత్రం తీసుకున్నారు. ఆయన ఇంగ్లీషు అనువాదకుల్లో ఒక్క మహాత్మాగాంధి మాత్రమే మూలవిధేయంగా ఉంటూనే కావ్యస్ఫూర్తిని నిలబెట్టగలిగాడు.

కవిత్వమంటే అనువాదంలో నష్టపోయేది అని కొందరూ, అనువదించిన తర్వాత కూడా ఏది మిగులుతుందో అదే కవిత్వమని మరికొందరూ అంటున్నారు. కాని కబీరు లో అనువదించలేనిది ఆ అపురూపమైన rough rhetoric. బాగా పండి పక్వమైన గోధుమ గింజమొనలాగా సూదిగానూ, కుశాగ్రంలాగా కోసుకునేదిగానూ ఉండే ఆ పదప్రయోగంలోని తాజాదనాన్ని తెలుగులోకే కాదు, మరే భాషలోకీ కూడా అనువదించలేం.

ఇక ఆ కవిత్వమంతా ఒక అనాహతనాదం భృంగధ్వనిలాగా తరంగితమవుతూనే ఉంటుంది. అది భాషమీద ఆధారపడ్డదే అయినా భాషాతీతం కూడా. తన బెంగాలీ గీతాల్లోని సంగీతాన్ని టాగోర్ గీతాంజలి ఇంగ్లీషు అనువాదాల్లోకి తీసుకురాడానికి ప్రయత్నించినట్టు నేను కూడా ఆ సంగీతాన్ని తెలుగులోకి తేడానికి ప్రయత్నించాను. ఇందుకు టాగోరే నాకు దారి చూపించాడు. ఆయన కబీరుని ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు పాటించిన పద్ధతినే నేను కూడా పాటించాను. కాని టాగోర్ చాలాసార్లు మూలాన్ని టాగోరీయం చేసాడు. నేను గాంధీ అడుగుజాడల్లో వీలైనంత మూలవిధేయంగా ఉండటానికి ప్రయత్నించాను.

ఒక పురాతన ఉన్మాదం దేశాన్ని మళ్ళా కొత్తగా హిందువులుగానూ, ముస్లింలుగానూ విడగొడుతున్న ఈ కాలంలో, హిందూ-మహ్మదీయ సంఘర్షణకి అతీతంగా దుఃఖంలేని ఒక దేశాన్ని అన్వేషించినవాడిగా కబీర్ నన్ను ఆకట్టుకున్నాడు. నా మనసుకి సాంత్వన కలిగించాడు. ఆయన కవిత్వంతో గడిపిన ఈ కాలమంతా ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఒక శోభాసింధు సౌధంలో శంఖాలు, ఘంటలు, సన్నాయి వాద్యాలు మోగుతున్న’ సంగీత సమారోహం మధ్య గడిపాను. ఆయన చెప్పినట్టుగానే ‘కిటికీ తెరిచి ప్రేమగగనంలోకి దూకేసాను’. ఆ ప్రేమరసాయనం నాలోకి దిగడం నాకు తెలుస్తూ ఉంది, ఇక ఈ తర్వాత ఏమి జరగనుందో ఆ కవిత్వానికి మటుకే తెలుసనుకుంటాను.

ఎవరైనా నన్ను ప్రేమడోలికల్లో ఊపండర్రా

ఎవరైనా నన్ను ప్రేమడోలికల్లో ఊపండర్రా.

బాహువులు స్తంభాలుగా, ప్రేమ రజ్జువుమీద మనసును ప్రియతముడి ధ్యాసలో ఊయలూపండి.

నా కళ్ళల్లో మేఘధారలు వర్షించనీ, వక్షస్థలమ్మీద వాటి శ్యామఛాయలు కమ్ముకోనీ.

ఊయలూగుతూ, వస్తూపోతూన్నప్పుడు, అతడి చెవిదగ్గర నా ప్రేమపూర్వక వ్యథానివేదనం సాగించుకోనీ.

సాధువులారా, సోదరులారా, కబీరు చెప్తున్నాడు, వినండి, ప్రియచైతన్యంతో మీ ధ్యానం సమస్తం నిండిపోనీ.

(కబీర్ సాహెబ్ కీ శబ్దావలీ,విరహ్ ఔర్ ప్రేమ్, 27)

అనాహత నాదం మోగుతూనే వున్నది

అనాహత నాదం మోగుతూనే వున్నది. కాని నువ్వా సంగీతసందేశం మీద దృష్టి పెట్టనే లేదు.

రసమందిర మధ్యంలో మోగుతున్నది సంగీతం. బయటినుంచి ఎంత వింటే మాత్రం ఏమిటి ప్రయోజనం?

ఈ ప్రేమరసాన్ని ఆస్వాదించకుండా నువ్వేది అమలు పరిస్తే మాత్రం ఏమి విశేషం?

కాజీ పుస్తకాలన్నీ గాలిస్తాడు. మరొకడికి చదువు నేర్పడానికి. ఆ ప్రేమరసావస్థ ఎటువంటిదో తనకై తాను తెలుసుకోలేకపోయాక, తాను కాజీ అయితే మటుకు ఏమిటట?

యోగులు, దిగంబరులు, శ్వేతాంబరులు తమ వస్త్రాలు కాషాయంలో ముంచి తేలుస్తారు. ఆ ఎరుపులోని ఎర్రదనమేమిటో తెలుసుకోలేకపోయాక ఆ వస్త్రాలకు ఎన్ని రంగులద్దితే ఏమిటట?

మందిరంలో ఉన్నా, మేడ మీద ఉన్నా, మహల్లో ఉన్నా, గులాబులతోటలో ఉన్నా, స్నేహితులారా, కబీరు తీసే ప్రతి శ్వాసలోనూ సాహేబే సంతోషిస్తున్నాడు.

(కబీర్ సాహెబ్ కీ శబ్దావలీ, చితావనీ ఔర్ ఉపదేశ్, 71)

24-11-2017

Painting: Abanindranath Tagore

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%