సాంస్కృతిక రాయబారి

302

నా హైస్కూలు రోజుల్లో తాడికొండ ఇచ్చిన తర్ఫీదు వల్ల ఏ వక్తృత్వపు పోటీకి వెళ్ళినా మొదటి బహుమతి నాకే వస్తుండేది. అది నాలో కలిగించిన స్వాతిశయం పెద్దయ్యాక కూడా చాలా ఏళ్ళు నన్నంటిపెట్టుకునే ఉండేది, హైదరాబాదు వచ్చిందాకా.

హైదరాబాదు సాహిత్యసమావేశాల్లో మృణాళినిగారూ, నేనూ సహవక్తలుగా మాట్లాడటం మొదలుపెట్టాక, ప్రతి సమావేశంలోనూ మొదటిబహుమతి ఆమెకే. అందుకనే ఆమెని చూస్తే, మేమిద్దరం ఇంకా ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో పాల్గోడానికి వచ్చినట్టే ఉంటుంది.

ఇప్పుడు మృణాళిని గారు అరవయ్యవ ఏట అడుగుపెట్టినా కూడా.

సుస్పష్టమైన ఉచ్చారణ, ప్రహ్లాద వదనం, సంస్కారవంతమైన భాష, సాధికారికమైన అవగాహన-మృణాళిని వంటి వక్త హైదరాబాదులో మరొకరు లేరు.

ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాల పట్ల ఆమె అధికారం మనల్ని నివ్వెరపరుస్తుంది. ఆమె మనోవేగంతో సాహిత్యప్రశంస చెయ్యగలరు. ఏ సాహిత్య విశ్లేషణలోనైనా మనం చివరి మాట చెప్పాం అనుకున్నప్పుడు, ఆ తర్వాత మాట ఆమెదే అవుతుంది.

నాకు బాగా గుర్తు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారిని తలుచుకుంటూ తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక సంస్మరణ సభ పెట్టినప్పుడు నేను మాట్లాడుతూ, ‘మేమంతా పురాణం డిస్కవర్ చేస్తేనే నలుగురికీ తెలిసాం. ఆయన మాకొక స్పేస్ ఇచ్చాడు’ అన్నాను. ఆ తర్వాత వక్త మృణాళిని. ఆమె ‘పురాణం స్పేస్ ఇవ్వడమేకాదు, ఎవరికెంత స్పేస్ ఇవ్వాలో తెలిసిన సంపాదకుడు కూడా’ అన్నారు.

ఆమె తెలుగు నేలమీదనే కాదు, దేశంలోనూ, విదేశాల్లోనూ కూడా తెలుగు సాహిత్యానికి ప్రకాస్తి తెచ్చిన సాంస్కృతిక రాయబారి. ఏ సెమినార్ లో ఆమె పాల్గొన్నా, ఆమె ఎంచుకునే విషయం, చెప్పే పద్ధతి, విశ్లేషణ అక్కడి వక్తలందరూ ఆమెని చూసి అసూయపడేలాగా ఉంటాయి. ఒకసారి మధురై కామరాజు యూనివెర్సిటీలో ఒక జాతీయస్థాయి సాహిత్యగోష్టి జరిగింది. వక్తలంతా ఇంగ్లీషు సాహిత్యం మీద మాట్లాడేరు. కాని మృణాళిని, unreliable narrator గురించి ప్రసంగించారు. అటువంటి కథన రీతి ఉంటుందనే అక్కడపాల్గొన్నవాళ్ళకి చాలామందికి తెలియదు. కాని అది కాదు విశేషం, ఆ అవిశ్వసనీయ కథనరీతిని వివరించడానికి ఆమె రావిశాస్త్రి పెద్ద కథ ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’ ను ఎంచుకోవడం. తక్కిన భారతీయ సాహిత్యాల కన్నా తెలుగు సాహిత్యం ఎంతో ప్రత్యేకమని చెప్పడానికి ఆమె అట్లాంటి చమత్కారాలు చాలానే చేస్తుంటారు.

మృణాలిని రచయిత్రి కూడా. ఆమె రచనా శైలికి మనుషుల్ని addict చేసుకునే లక్షణముంది.

నేను సహవక్తనైనా కూడా ఆమె నాకెన్నో సాహిత్య అవకాశాలు ఎంతో ఉదారంగా ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. అట్లాంటి అవకాశాల్లో మొదట చెప్పవలసింది, వరల్డ్ స్పేస్ రేడియో లో నాతో చేయించిన ప్రసంగాలు. ‘మోహన రాగం’ పేరిట నేను చేసిన ఆ సాహిత్యప్రసంగాలు నాకెంతోమంది మిత్రుల్ని సంపాదించిపెట్టాయి.

రెండో అవకాశం, ఫేస్ బుక్. ఈ మాధ్యమాన్ని 2009 లో మొదటిసారి ఆమెనే నాకు పరిచయం చేసారు. ఈ వేదిక వల్ల మహనీయులూ, విద్వాంసులూ, రసజ్ఞులూ అయిన ఎందరో మిత్రులు నాకు లభించారు. వాళ్ళందర్నీ మృణాళిని గారే నాకు పరిచయం చేసారనుకుంటాను.

మృణాళినిగారూ, మీరు నూరు వసంతాలు జీవించాలి, నూరు పుస్తకాలు రచించాలి.

17-5-2017

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading