ఇరవయ్యవశతాబ్దం ప్రపంచానికి గొప్పకవుల్ని ప్రసాదించింది. వాళ్ళల్లో మనం చదివితీరవలసిన మహాకవుల్లో నజీం హిక్మత్ (1902-1963) కూడా ఒకడు.
టర్కిష్ భాషకు చెందిన హిక్మత్ గొప్ప సోషలిష్టు కవి. అతడి కవిత ‘టర్కీ’ కి శ్రీ శ్రీ చేసిన అసంపూర్తి అనువాదం తో హిక్మత్ తెలుగువాళ్ళకి కూడా పరిచయమయ్యాడు. రాండీ బ్లాసింగ్, ముత్లూ కోనుక్ అనేవాళ్ళు హిక్మత్ కవితల్లోంచి 100 కవితలు ఎంపికచేసి Poems of Nazim Hikmat ( 1994) అనే పేరిట వెలువరించిన అనువాదం హిక్మత్ కవిత్వాన్ని తొలిసారిగా ప్రపంచానికి సమగ్రంగా పరిచయం చేసింది.
హిక్మత్ వాల్ట్ విట్మన్, మయకోవస్కీ, పాబ్లో నెరూడా, ఆడెన్ తరహా వచనకవి. తెలుగులో శ్రీశ్రీ, తిలక్ ల కవిత్వంలో ఇటువంటి ధారాధుని కనిపిస్తుంది. అతడి కవిత్వం చదువుతున్నంతసేపూ సజీవుడూ, సాహసికుడూ అయిన మానవుడు మనతో మాట్లాడుతున్నట్టుంటుంది. గత కొన్నాళ్ళుగా ఆ కవిత్వం నాలో అద్భుతమైన జీవశక్తిని మేల్కొల్పుతూ ఉంది.
ఆ కవిత్వమెలా ఉంటుందో మీతో పంచుకోవడానికి నమూనాగా ఈ కవిత:
నేను వాటన్నింటినీ ప్రేమించానని నాకు తెలియదు
1962 మార్చి 28 న
ప్రేగ్ నుంచి బెర్లిన్ వెళ్తున్న రైల్లో.
సాయంకాలం.
పొగచూరిన మైదానమ్మీద అలసిపోయిన పక్షిలాగా వాలుతున్న
సాయంసంధ్యని ప్రేమించానని నాకు తెలియదు
అసలు సంధ్యాసమయాన్ని అలిసిన పిట్టతో పోల్చడం నాకు నచ్చలేదు.
నేను నేలని ప్రేమించినట్టు నాకు తెలియదు
ఒక్కసారికూడా పొలం దున్నకుండా నేలని ప్రేమించడం సాధ్యమేమో నాకు తెలియదు
నేనెన్నడూ పొలం దున్నలేదు
బహుశా నా జీవితంలో ఇదొక్కటే అమలినప్రేమ.
ఇక నేనెప్పటికీ నదుల్ని ప్రేమిస్తూనే ఉన్నాను.
పురాతన దుర్గాలు నెలకొన్న ఐరోపీయ పర్వతపాదాలదగ్గర
నిశ్చలంగా చుట్టచుట్టుకు పడుకున్న ఈ నదిని
లేదా కనుచూపుమేరంతా నేరుగా సాగిపోయే నదుల్ని.
ఒకే నదిలో నువ్వొక్కసారికూడా నిన్ను నువ్వు ప్రక్షాళనం చేసుకోలేవని నాకు తెలుసు
నువ్వెన్నడూ చూడని కాంతుల్ని నది నీ కోసం తెస్తుందని తెలుసు
మన ఆయుష్షు గుర్రాల కన్నా కొద్దిగా ఎక్కువా,
కాకులకన్నా కొద్దిగా తక్కువా,
మనుషులకీ విషయం ఇంతకుముందు కూడా తట్టిందని తెలుసు,
ఇక మీదట కూడా స్ఫురిస్తుందనీ తెలుసు
నా ముందూ నా తర్వాతా కూడా ఈ మాటే వెయ్యిసార్లు చెప్పారనీ, చెప్తారనీ కూడా తెలుసు.
నేను ఆకాశాన్ని ప్రేమించినట్టు నాకు తెలీదు.
సూర్యకాంతిమంతమో, మేఘావృతమో
బొరొడినో సమరక్షేత్రంలో వెల్లకిలాపడిపోయినప్పుడు
ఆంద్రే రాకుమారుడు తిలకించిన అంతరిక్షం.
జైల్లో ఉండగా వార్ అండ్ పీస్ రెండు సంపుటాలూ టర్కిష్ లోకి అనువదించాను.
అప్పట్లో నన్ను చేరవచ్చే శబ్దాలు
అంతరిక్షానివి కావు
జైలుప్రాంగణంలో తోటి ఖైదీనెవరినో గార్డులు చావగొడుతుండే చప్పుళ్ళు.
నేను చెట్లని ప్రేమించినట్టు నాకు తెలియదు
మాస్కో శివార్లలో పెరెడెల్కినో లో
నగ్నంగా, వినయంగా, మర్యాదగా నా ముందు నిలుచుండే బీచ్ వృక్షాలు
పోప్లార్లు ఎంత తురకచెట్లో బీచ్ లంత రష్యన్ వృక్షాలు
‘ఆకులు రాలుతుండే ఇజ్మీర్ పోప్లార్లు
అప్పట్లో నన్ను చాకులాగా ఉన్నాననేవారు..
నవసుందరవృక్షంలాంటి ప్రేమికుడు..
సమున్నత హర్మ్యాల్ని కూడా ఇట్టే కూల్చేయగలిగేవాణ్ణి..’
ఇల్గాజ్ అడవుల్లో 1920 లో నేనో పైన్ కొమ్మకి అల్లికతో అంచులు కట్టిన చేతిరుమాలు వేలాడదీసాను.
నేను రోడ్లని ప్రేమించినట్టు నాకు తెలియదు
మట్టిరోడ్లని కూడా.
నేనూ, వేరా ఒకరోజు మాస్కోనుంచి క్రిమియా మీదగా కోక్టెబెల్ కి ప్రయాణిస్తున్నాం
పెట్టెలాంటి బండి
ప్రపంచం మాకు రెండువేపులా దూరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది
అంతదాకా నేనెన్నడూ ఎవరికీ అంతదగ్గరగా కూర్చోలేదు
నాకు పద్ధెనిమిదేళ్ళప్పుడు
బొలూనుంచి గెరెడే వెళ్తున్నప్పుడు బందిపోట్లు మీదపడ్డారు
అప్పుడక్కడ దోచుకోవడానికి నా ప్రాణం తప్ప మరేమీ లేదు
పద్ధెనిమిదేళ్ళ వయసులో ప్రాణంకన్నా విలువలేని విషయంకూడా మరొకటుండదు
నేనీ సంగతి ఇంతకుముందు కూడా చెప్పాను
ఒక రంజాన్ మాసపు రాత్రి
తోలుబొమ్మలాట చూడ్డానికి బయల్దేరాను
నా ముందొక కాగితం లాంతరు
లేదా అటువంటి సంఘటన ఎప్పుడూ జరిగిఉండకపోవచ్చు
బహుశా ఇస్తాంబుల్లో ఒక రాత్రి తన తాతచెయ్యి పట్టుకుని
ఎనిమిదేళ్ళ పిల్లవాడొకడు తోలుబొమ్మలాట చూడటానికి బయలుదేరినట్టు
ఎక్కడో చదివిఉండవచ్చు
ఆ పిల్లవాడి తాత ఉన్నికోటు తోడుక్కున్నాడనీ
పనివాడు దీపం పట్టుకుని ముందునడుస్తున్నాడనీ కూడా
చదివిఉండవచ్చు
ఏమైతేనేం, అప్పుడు నా ఆనందానికి హద్దుల్లేవు.
ఎందుకోగాని పూలు గుర్తొస్తున్నాయి.
మందారాలు, గులాబులు, చామంతులు
ఇస్తాంబుల్లో ఒక చామంతి తోటలోనే నేను
మొదటిసారి మరికాని ముద్దుపెట్టుకున్నది
ఆమె శ్వాసలో తాజాబాదంకాయల వాసన.
అప్పుడు నాకు పదిహేడేళ్ళు.
నా హృదయం ఆకాశం అంచులదాకా ఉయ్యాలూగింది
నేను పూలని ప్రేమించినట్టు నాకు తెలియదు
1948 లో నేను జైల్లో ఉన్నప్పుడు
మిత్రులు నాకోసం
పూలగుత్తులు పంపించారు.
నాకిప్పుడే నక్షత్రాలు గుర్తొచ్చాయి
నేను వాటిని ప్రేమించినట్టు నాకు తెలియదు
కిందనుంచి చూస్తున్నానో
వాటిపక్కనే తేలుతున్నానో.
వ్యోమగాములకు ఒకటిరెండు ప్రశ్నలు
నల్లని ముఖమల్ లాంటి రోదసిలో
నక్షత్రాలు మరింతపెద్దవిగా కనిపిస్తాయా
వజ్రాల్లానో లేదా నారింజపండ్లలానో.
నక్క్షత్రాలకు చేరువగా పోతున్నప్పుడు
వాళ్ళకి గర్వంగా అనిపించిఉంటుందా
వాళ్ళ రంగుల ఫొటోలు నేను ‘ఒగోన్యోక్’ పత్రికలో చూసాను
మిత్రులారా కోపగించుకోకండి
ఆ ఫొటోల్ని మీరు రూపరహితాలో, నైరూప్యాలో అనుకోవచ్చేమోగాని
అవి పాతకాలపు తైలవర్ణచిత్రాల్లాగా
మరీకొట్టొచ్చినట్టు కనిపించేయి
వాటిని చూడగానే నా గుండె గొంతుకలో కొట్లాడింది.
అవి ఏ ఆనందాన్నో చేజిక్కించుకోవాలనే
మన ఆరాటాన్ని గుర్తుకుతెస్తున్నాయి.
నేనువాటిని చూసి ఆలోచనలో పడ్డాను
వాటిని చూస్తూనే కించిత్ దుఃఖం కూడా లేకుండా
మృత్యువు గురించి ఆలోచించగలిగాను.
నేనంతరిక్షాన్ని ప్రేమించినట్టు నాకు తెలియదు.
నా కళ్ళముందు హిమపాత దృశ్యం
నెమ్మదిగా తేలుతున్న మంచుతునకలు,
చెలరేగుతున్నమంచుతుపాన్లు
నేను మంచుని ప్రేమించినట్టు నాకు తెలియదు.
నేను సూర్యుణ్ణి ప్రేమించానని కూడా నాకు తెలియదు
పండ్లరసం చిప్పిలినట్టుగా అస్తమయవేళ
కాంతి చిందేటప్పుడు కూడా.
అప్పుడప్పుడు ఇస్తాంబుల్లో సూర్యుడు
అస్తమించే దృశ్యం
అచ్చం మనం గ్రీంటింగ్సు కార్డులమీద
చూసినట్టే ఉంటుంది.
కాని నువ్వు దాన్ని చిత్రించవలసిందట్లా కాదు.
నేను సముద్రాన్ని ప్రేమించినట్టు నాకు తెలియదు
అయితే ఐవజోవస్కీ చిత్రించిన సముద్రమంటావా, అది వేరే సంగతి
నేను మబ్బుల్ని ప్రేమిచినట్టు నాకు తెలియదు
వాటిని కిందనుంచి చూసినా, వాటిపైన తేలియాడినా
అవి ఐరావతాలో, దయాపారావతాలో.
చంద్రకాంతి నా తలపుకొస్తూంటూంది, అలసినక్షణాల్లో
భ్రమసిన క్షణాల్లో, సుఖలాలసోన్ముఖ క్షణాల్లో
తెలుస్తుంది నేను దాన్ని ప్రేమించానని.
నేను వానని ప్రేమించానని నాకు తెలియదు
ఒక వలలాగా అది నా మీద వాలినా,
కిటికీ లోంచి కుచ్చులాగా తాకినా
నా హృదయం నన్ను వదిలిపెట్టితేలిపోతుంది.
ఒక్క వానచినుకులో కూర్చుని నేను ప్రపంచపటంలో
గోచరించని ఏ దేశానికో ఇట్టే పయనమైపోతాను.
అయినా నేను వానని ప్రేమించినట్టు నాకు తెలియదు.
కాని ఇదేమిటి, ప్రేగ్-బెర్లిన్ రైల్లో కిటికీ పక్క కూచున్నప్పుడు
ఇన్ని ప్రేమలొక్కసారి నన్ను చుట్టబెట్టాయి
నేను నా ఆరోసిగరెట్టు వెలిగించినందువల్లనా?
ఒకటే సిగరెట్టంటే నాకు ఊపిరాడదు.
లేదా నీలికనురెప్పల, రాగిరంగుశిరోజాల
ఆ వనిత మాస్కోలోనే ఉండిపోయిందని గుర్తొచ్చినందుకా?
నల్లని కాటుకచీకటిలో రైలు పరుగెడుతున్నది
నేను కాటుకచీకటిని ప్రేమించినట్టు నాకు తెలియదు.
ఇంజనులోంచి విస్ఫులింగాలు విరజిమ్ముతున్నాయి
నేను నిప్పురవ్వల్ని ప్రేమించినట్టు నాకు తెలియదు.
ఇట్లా నేనింకెన్నింటినో ప్రేమించానని
నాకిప్పుడు అరవయ్యోఏటనే తెలిసింది.
ప్రేగ్ నుంచి బెర్లిన్ పయనించే రైల్లో కిటికీ పక్క
కూచుని నేనీ లోకాన్ని చూస్తుంటే
మళ్ళా వెనక్కిపోలేని ఏ ప్రపంచానికో పయనిస్తున్నట్టే ఉంది.
4-3-2014